April 16, 2024

తేనెలొలుకు తెలుగు-1

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

మాలిక పాఠకులకు నమస్సులు.

తేనె కడలి తెలుగు మాట
పూల పడవ తెలుగు పాట
వెన్నెలగని వెలుగు బాట
వెన్న పూస తెలుగు భాష

నన్నయాది కవులచేత వన్నెతీర్చబడిన భాష
అన్నమయ్య పదములతో అందగించబడిన భాష
కన్నడభూరమణునిచే సన్నుతించబడిన భాష
దేశభాషలందు తెలుగు లెస్స ఎన్నబడిన భాష

త్యాగరాజు కీర్తనలతొ రాగమయిన యోగభాష
రామదాసు భజనలలో రంగరింపబడిన భాష
పద్యమందు గద్యమందు హృద్యముగా నిముడు భాష
చోద్యమొప్ప గేయములో జయమునొందె జనులభాష

అని మన తేనెలొలుకు తెలుగు గురించి ఒక గేయం రాసానెప్పుడో. సుందరై తెలుంగు అన్నాడు మన పొరుగు అరవకవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాష ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, కీర్తనలు, భజనలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు, శతకాలు, సామెతలు, కథలు, నవలలు, నాటకాలు, జోలపాటలు, లాలిపాటలు, గొబ్బిపాటలు, బతుకమ్మ పాటలు, జానపద గేయాలు, ఉద్యమగీతాలు, సినిమాపాటలు -ఇలా విస్తృతమైన సాహిత్య సంపదగా విలసిల్లింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తెలిసిన వారు, తెలుగు మాట్లాడేవాళ్లు కోట్లది మంది ఉన్నారు. ప్రపంచభాషల్లో వినసొంపుగా ఉండే భాష ఇటలీ భాషనట. మన తెలుగు కూడా విన సొంపుగా ఉంటుందని ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అన్నారు.

ఇంత గొప్ప భాష అంతరించి పోతుందేమోనని ఇటీవల అందరికీ భయం పట్టుకుంది. ఆంగ్లేయుల పుణ్యమా అని మన దేశంలో మాతృభాష కంటే కూడా ఆంగ్ల భాష మీద మోజు పెరిగింది. దాంతో అన్నీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలైపోయాయి. తెలుగు భాష మీద చిన్న చూపు మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఊరుకుందామా -మన పిల్లలకు మన తెలుగు భాష గొప్పదనం గూర్చి తెలియజెప్పుకుందామా. నాకు తెలుసు మీ అందరికీ లోలోపల ఆ బాధ రగులుతున్నదని. మన పిల్లలు మన తెలుగులో స్వచ్ఛంగా, స్పష్టంగా మాట్లాడలేక పోవటం చూచి గుండె తరుక్కు పోతుందని. అందుకే మన పిల్లలకు మన తెలుగును పరిచయం చేసుకుందాం. మన పద్యాలు నేర్పిద్దాం. మన పాటలు పాడిద్దాం. మన కవులను పరిచయం చేద్దాం. మన కథలు చదివిద్దాం. అందుకు నెల నెలా మన పిల్లలు సులభంగా తెలుగు భాషను నేర్చుకునే విధంగా తెలుగు ముచ్చట్లు చెప్పుకుందాం.

మా బాపు అంటే మా నాన్న తెలుగు పండితులు. నా చిన్నతనంలో అంటే నా అయిదేళ్ల వయస్సులో నేను మా బాపుతో బడికి వెళ్లే వాడిని. ఆయన నన్ను మేజాబల్ల అంటే టేబుల్ మీద కూచోబెట్టి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. అప్పటికి నాకింకా భాషంటే ఏమిటో తెలియక పోయినా ఆయన చదివే పద్యాలు చెవులకింపుగా ఉండేవి. ఆయన పద్యాన్ని రాగయుక్తంగా ఒకసారి, పద విభజన చేసి మరొక సారి, అర్థం వివరించడం మూడో సారి చేయటంతో ఒకే పద్యం మూడుసార్లు వినడంతో పద్యం పరిచయమైనదిగా అనిపించేది. అసలు తెలుగు భాష సొగసంతా పద్యంలోనే ఉందంటాను నేను.

ఉదాహరణకు భాగవతంలో ఒక చిన్న పద్యం తీసుకుందాం. కృష్ణుడు రేపల్లెలో, నందుని ఇంట, యశోదమ్మ ఒడిలో పెరిగాడన్న సంగతి మనకు తెలిసిందే. చిలిపి కృష్ణుడు యశోదమ్మ కన్నుగప్పి గోపికల ఇండ్లకు వెళ్లి నానా ఆగడాలు చేసి ఏమీ ఎరుగని వాడిలా మళ్లీ యశోద దగ్గరకు చేరేవాడు.
ఆ కన్నయ్య ఆగడాలు భరించలేక గోపికలందరూ యశోదమ్మ దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకునే సందర్భంలో ఓ చిన్న కంద పద్యం రాశారు భాగవతం తెలుగులో రాసిన పోతన. ఆ పద్యం చూడండి.

కం. ఓయమ్మ నీ కుమారుడు
మా యిండ్లను పాలు పెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ

ఈ పద్యాన్ని మా బాపు ముందుగా చక్కగా గోపికలందరూ మొరపెడుతున్నట్లుగా రాగయుక్తంగా చదివేవారు. ఆ తరువాత పద విభజనచేయడం. అంటే
ఓయమ్మ-ఓయమ్మా, ఓ యశోదమ్మా
నీ కుమారుడు-ఇదిగో నీ కొడుకు ఈ చిన్నికృష్ణుడు
మా యిండ్లను-మా ఇళ్లల్లో, పాలు పెరుగు-పాలూ పెరుగూ,
మననీడమ్మా-ఉండనీయటంలేదమ్మా, దక్కనీయటం లేదమ్మా,
పోయెద మెక్కడికైనను-మేము ఎక్కడికైనా పోతాము,
మాయన్నల-మా అన్నగారల, సురభులాన
ఆవుల మీద ఒట్టు-మంజులవాణీ-మంజుల-మృదువుగా ,
వాణీ-మాటలాడే ఓ యశోదమ్మా

ఇక మూడోసారి పద్యం మళ్లీ చదివి భావం చెప్పేవారు.

ఓ యశోదమ్మతల్లీ, నీ కొడుకు మా ఇళ్లల్లో దూరి చాటుమాటుగా పాలూ పెరుగూ తాగి మాకు లేకుండా చేస్తున్నాడు. ఇక మేం ఇక్కడ ఉండలేము. ఎక్కడికైనా వెళ్లిపోతామమ్మా. మీ పిల్లవాడి అల్లరి మా వశం కావటం లేదు. మాఅన్నల ఆవులమీద ఒట్టు. మేం వెళ్లి పోతాం అని యశోదకు గోపికలు మొరపెట్టుకుంటారు. అని అదే పద్యం పిల్లల్లో ఒకరిని యశోదగా మరొకరిని చిన్ని కృష్ణుడుగా చూపిస్తూ హావ భావాలతో పద్యం వివరిస్తే ఇక ఆ పద్యం పిల్లల బుర్రల్లోకి దూరకుండా ఉంటుందా. వాళ్ల పెదవుల మీద ఆడకండా ఉంటుందా. ఒకసారి పద్యం ఆ వయస్సులో బుర్రకెక్కిందో ఇక జీవితాంతం మెదడును వదిలిపెట్టదు. అదీ పద్యం మహాత్మ్యం.

అయితే ఆయనలా పాఠాలు చెబుతుంటే విని ఓ రోజు ఇంట్లో ఆయనలాగే పద్యం చదివాను. ఆ పద్యమేమిటో తెలుసా.

అలవైకుంఠపురంబులో నగరులో ఆమూలసౌధంబు దా
పలమందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతో
త్పలపర్యంకరమావినోదియగునాపన్న ప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రముపాహిపాహి యన్ గుయ్యాలించి సంరంభియై.

అని అలవోకగా చదివేయటంతో ఇంటికి ఎవరు వచ్చినా నన్ను పద్యం చదివి వినిపించమనే వారు. నేను గడగడా అప్పజెప్పేవాణ్ని. అప్పటికి దాని అర్థం తెలియక పోయినా పెద్దగయిన తరువాత అర్థం చేసుకోవచ్చు. కాని నోటికి రావాలంటే మాత్రం చిన్నప్పటినుంచే అలవాటు చెయ్యాలి.

2 thoughts on “తేనెలొలుకు తెలుగు-1

  1. ముందుగా కృతజ్ఞతలు.తరువాత అభినందనలు.తులసివనం ముఖచిత్రం ఎన్నో విషయాలను చెప్పక చెబుతుంది.ఒక పవిత్రభావం,ఒక ఆధ్యాత్మిక స్ఫురణ,ఒక ఆరోగ్యహేతువు,ఒక పర్యావరణ పరిరక్షణ,ఒక ఆముక్తమాల్యద,ఒక రుక్మిణి భక్తి,ఒక తులసీదళమాలిక ఇంకా ఎన్నో…..జ్యోతి వలబోజుగారు మీ అభిరుచి ప్రశంసనీయం.ఇందులో నన్నూ చేర్చినందుకు మొదటివాక్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *