April 23, 2024

సినీ ‘మాయా’లోకం 1 – సైరాట్

రచన: సరితా భూపతి

సైరాట్

అంటరానితనం, కులాంతర ప్రేమ వివాహాలు తరహాలో వచ్చిన సినిమాలు తక్కువే. అలాంటి సినిమాలు రావాలంటే ముందు ఇండస్ట్రీలో కులం పట్టింపులు పోవాలేమో!
డబ్బు, పదవి, కుల అహంకారాన్ని ఎదిరిస్తూ, పెద్ద హీరోలు, భారీ డైలాగులు, డాన్సులు, వెకిలి కామెడీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా విభిన్నంగా వచ్చిన మరాఠీ సినిమా “సైరాట్”. కుల ద్వేషాల వల్ల జరిగే భయంకర విధ్వంసాలు ఎలా ఉంటాయో చూపటానికి, ఇంత సహజంగా మరే సినిమా వచ్చి ఉండలేదు.

గ్రామంలో మంచి క్రికెట్ ఆటగాడు, స్కూల్లో బ్రైట్ స్టూడెంట్, ఒక చేపలు పట్టే వ్యక్తి కొడుకు అయిన పర్ష్యా ( ఆకాశ్ తోషర్), ఆ గ్రామ లోకల్ పొలిటీషియన్ అయిన ఒక అగ్ర కులస్తుని కూతుర్ని ప్రేమిస్తాడు. కౌమారంలోని అమాయకత్వం, అపరిపక్వత, తెగింపు, సహజత్వంతో ఉన్న ఆ టీనేజ్ హీరో నటన చూస్తే ముచ్చటేస్తుంది. అలాగే, పదో తరగతి చదువుతున్న రింకూ రాజ్ గురూ అనే అమ్మాయి, అర్చీ అనే పాత్రలో జీవించింది. పల్లెటూరి ఓణీలు, సిగ్గులు, అమాయకత్వాలు తరతరాలుగా కమర్షియల్ సినిమా హీరోయిన్ల జన్మహక్కుగా ఉండాల్సిన అజ్ఞానం, భయాలు ఈమెకి లేవు. చక్కగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద స్కూల్ కి వెళుతుంది. ట్రాక్టర్ నడుపుతుంది. చిన్న వయసునించే, అమ్మాయిలకు సొంత అస్తిత్వపు స్పూర్తినిచ్చే పాత్ర, అర్చీ. పదహారేళ్ళ వయసులో పువ్వు విచ్చుకున్నంత సహజంగా, అందంగా మెుదలైన వారి ప్రేమకు కులాంతరాలు అవాంతరాలవుతాయి. ఈ సినిమా కేవలం కుల ద్వేషాల్ని వ్యతిరేకించటం మాత్రమే కాదు. అపరిపక్వ వయసులో పుట్టిన ప్రేమలు ముందు ముందు ఎన్ని కష్టాల్ని తెచ్చిపెడతాయి అనే అవగాహనను యువతకు కల్పించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా దర్శకుడు, నాగరాజ్ మంజులే చేసినట్టు అనిపించింది. కంఫర్ట్ జోన్ నించి బయటపడి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నిలదొక్కుకునే ధైర్యాన్నిచ్చే సినిమా.

చంపటానికి వెంటపడుతున్న వాళ్ళను గన్ తో బెదిరించి, ప్రియునితో పారిపోగలిగిన అమ్మాయి కూడా అనుకోని విధంగా వచ్చిన కష్టాలకు స్లమ్ ఏరియాలో బతకాల్సిన వస్తే, తన ఇంట్లో దర్జాగా బతికిన రిచ్ లైఫ్ని, ఇంట్లో వాళ్ళనీ మిస్సవుతూ ఏడుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఇద్దరూ ఏవో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎదుగుతారు. కొన్నాళ్ళకు వారి మధ్యలోనే చిన్న అపార్థాలు వచ్చి, రోడ్డు మీదే గొడవపడి, ఆ అమ్మాయి అటునుంచటే ట్రైన్ ఎక్కి, వెళ్ళిపోబోతుంది. తను లేకుండా బతకలేననుకొని ఉరేసుకోబోయి, ఆ ప్రయత్నం ఆపేస్తాడు. అమాయక దశ నించి, మెచ్యూర్డ్ స్థితి వరకూ వాళ్ళు ఎదుగుతున్న తీరును సినిమాలో చూసినట్టుగా ఉండదు. సంభాషణలన్నీ మన కళ్ళ ముందే ఎవరో మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయి. ఇక ఆ అమ్మాయి అపటికపుడే మనసు మార్చుకొని తిరిగొచ్చేస్తుంది. ఆ పది నిమిషాల దూరం, విరహాన్ని వాళ్ళు మాత్రమే కాదు ప్రేక్షకులూ అనుభవిస్తారు. ఆ లేతత్వం నించి వాళ్ళు కాస్త ఎదిగాక, పెళ్ళి చేసుకుంటారు. ఒక బాబు పుడతాడు. ఇలా కథ సుఖాంతం అవుతుందనే అందరం అనుకుంటాము. ఊహించని రీతిలో, కులం పోరు వెంటాడి వాళ్ళు క్రూరంగా నరివేయబడతారు. ఆ ఆఖరి సీన్లో ఉన్నదంతా నిశ్శబ్ధమే అయినా, చంటి పిల్లోడి రోదన చూస్తే గుండె చెరువయిపోతుంది.

సమాజంలో కన్నబిడ్డల్ని చంపుకునేంత కులం పిచ్చిన చాచిపెట్టి కొట్టిన దెబ్బ “సైరాట్” నాలుగు కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా, వందకోట్లకు పైగా రికార్డ్ కొట్టి మరాఠీ ప్రేక్షకును మాత్రమే కాదు. తెలుగు, హిందీ, కన్నడ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కన్నడలో ” మనసు మల్లిగే” అనే పేరుతో రీమేక్ చేసారు. హిందీలో కూడా “ధడక్” పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇది శ్రీదేవి కూతురు జాన్వీ మెుదటి చిత్రం అనే విషయం తెలిసిందే. త్వరలో రిలీజ్ అవబోతుంది.

కులపిచ్చి లోకానికి అపుడపుడూ ఇలాంటి చురకలు పడటం అవసరమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *