March 19, 2024

కంభంపాటి కథలు 1 – ఆశ

రచన: రవీంద్ర కంభంపాటి..

“అమ్మా తలుపేసుకో “ అంటూ వెళ్ళిపోతున్న సుభాష్ తో “జాగ్రత్త గా వెళ్ళిరా “ అని చెప్పేలోపే ఏదో ఫోను మాట్లాడుకుంటా వెళ్ళిపోయేడు . అయినా నా చాదస్తం కాకపోతే నా మాట వినేదెవరు ఈ ఇంట్లో ? మళ్ళీ సాయంత్రం నాలుగింటిదాకా ఒక్కదాన్నీ ఉండాలి. అసలే ఊరవతల ఎక్కడో విసిరేసినట్టుండే ఈ విల్లాల్లో “ఎలా ఉన్నారండీ “ అని పలకరించే దిక్కుండదు .
ఇంట్లో కొడుకూ , కోడలూ , మనవలూ అందరూ ఉన్నా కూడా లేనట్టే ఉంటుంది, ఎవరి ఫోను , టాబ్లెట్లలో వాళ్ళు బిజీ గా ఉంటారు . “మీరు కూడా ఫేస్బుక్, వాట్సాప్ చూడడం నేర్చుకోండత్తయ్యా .. అప్పుడు లైఫ్ ఈజీగా టైంపాస్ చెయ్యొచ్చు “ అంటుంది నా కోడలు భార్గవి , కానీ అవన్నీ నా మనసుకి సరిపడవు మరి . ఐదేళ్ల క్రితమే రిటైరయ్యేను , చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ ఏదో పని చేసుకోవడమే నాకలవాటు, కానీ ఇలా కాళ్ళూ , చేతులూ కట్టి పారేసినట్టు ఈ ఊరవతల ఉండలేకపోతున్నాను .
“రెండు కోట్లు పెట్టి కొన్నాము . ఇంత పెద్ద ఇంట్లో హాయిగా ఉండడానికేం “ అంటాడు నా కొడుకు , కానీ ఎవ్వరూ మాట్లాడ్డానికి లేనప్పుడు ఇల్లైతేనేం ..శ్మశానమైతేనేం . అన్నట్టు నాకీమధ్య ఈ ఒంటరితనం మూలాన్ననుకుంటా, జీవితం మీద ఆశ పోయి “పోనీ చచ్చిపోతేనో “ అనే ఆలోచనలూ వస్తున్నాయి !
నా ఆలోచనల్లో నేనుండగా , ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే వెళ్లి తలుపు తీసి చూసేను , ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాసిపోయిన బట్టలూ , వెర్రి చూపులూ చూస్తున్న ఆ పిల్లలు ఇంత ఖరీదైన మా కమ్యూనిటీ లోకి ఎలా వచ్చేరా అని ఆశ్చర్యపోతూ , “ఎవరు మీరు?” అని గట్టిగా అడిగేను .
కోపంగా ఉన్న నా మొహం చూసిన చిన్నవాడు, మూడేళ్లుంటాయేమో , ఏడుపు మొహం పెట్టేసేడు . వాడి కన్నా కాస్త పెద్దగా ఉన్న పిల్ల , వాడిని వెంటనే ఎత్తుకుని “నీళ్లు రావట్లేదండీ “ అంది
“నీళ్లు రాకపోవడమేమిటి ?. ఎక్కడ నుంచొచ్చేరు ?” అని అడిగితే, భయపడుతూ పక్క విల్లా వేపు చూపించింది . విషయం ఏమిటో కనుక్కుందామని మా ఇంటి తలుపేసి , చెప్పులేసుకుని ఆ పిల్లలతో పాటు పక్కింటి వేపు నడిచేను . నాకు తెలిసి ఆ ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది , మరి వీళ్ళెక్కడినుంచొచ్చేరు?
తలుపు దగ్గిరగా వేసుంది , “అమ్మా ఈవిడొచ్చేరే “ అంటూ ఆ పిల్ల తలుపు కొడితే మెల్లగా తలుపు తీసిందావిడ . నీరసంగా ఉందా అమ్మాయి , ఓ పాతికేళ్ళు ఉంటాయేమో , మొహం మటుకూ కళగా ఉంది . “నీళ్లు రావట్లేదు “ అంది తలొంచుకుని .
“మీరెవరు ? ఈ ఇంట్లోకి ఎలా వచ్చేరు ?” అనడిగేను
“సాయంత్రం ఆళ్ళొస్తారు ..చెబుతారండి “ అంది
“వాళ్లెవరు “ అడిగేను.
తలెత్తకుండా “ఆళ్ళు చెబుతారండీ “ అని “కొంచెం నీళ్లు ఎలా వస్తాయో చెప్పరా ? పిల్లలు దాహం అంటున్నారు “ అంది
ఇంట్లోకెళ్ళి చూసేను, ఎక్కడా ఏ టాపులోనూ నీళ్లు రావడం లేదు . ఇంటర్ కాం లో విల్లా మెయింటెనెన్సు కి ఫోన్ చేసి , విషయం చెబితే , వాళ్ళు ఆ విల్లా తాలూకా వాల్వు విప్పారు . ఓ పది నిమిషాలకి నీళ్లు రావడం మొదలెట్టేయి .
“నువ్వంటున్న “ఆళ్ళు ” రాగానే నన్ను కలవమని చెప్పు“ అనేసెళ్లిపోయేను
మధ్యాహ్నం ఒంటి గంటవుతూంటే , మళ్ళీ కాలింగు బెల్లు మోగింది . తలుపు తీసి చూసేసరికి, ఎవరో భార్యాభర్తలున్నారు . సఫారీ సూటేసుకుని ఆయన , ఒళ్ళంతా నగలతో ఆవిడా చాలా దర్పంగా ఉన్నారు .
“పక్కనున్న విల్లా గురించి మాటాడ్డానికి ఒచ్చేమండి.. మెయిన్ రోడ్లో ఉన్న సూర్య ఫైనాన్స్ కంపెనీ మనదేనండి “ అన్నాడాయన.
లోపలి రానిచ్చేను , సోఫాలో కూచుంటూ చెప్పేడాయన “అక్కడున్నోళ్లు మా వోళ్ళేనండీ “
“మా వోళ్ళే అంటే ?” అడిగేను
“మా లేడీస్ మాట్లాడతారండి మీతో “ అని బయటికెళ్ళేడు
అతను వెళ్ళగానే ఆవిడ మొహమాటంగా చెప్పింది “మాకు పిల్లలు పుట్టరంట .. డాక్టర్ గారు ఏదో సరోగసీ వైద్యం అన్నారు .. అందుకే ఈవిడ మా బిడ్డని మోస్తుంది .. ఊరికినే కాదులెండి ..బిడ్డని మోసినన్నాళ్ళు నెలకి పాతిక వేలు, ఉండడానికి ఇల్లు , ఆవిడకి , పిలల్లకి తిండి కూడా పెడుతున్నాం”
నేనేం మాట్లాడలేదు . కొంచెం అప్పుడప్పుడు ఆ ఇంటి మీద కన్నేసి ఉంచమనీ , తొమ్మిది నెలల అద్దె ముందే కట్టేసేమనీ చెప్పి వాళ్ళెళ్ళిపోయేరు .
ఆ అమ్మాయి పేరు రూప అట , పెద్దకూతురు రమ్య , కొడుకు పేరు కృష్ణ అట, వాళ్ళాయన కి రమ్యకృష్ణ పిచ్చట , అందుకే పిల్లల పేర్లు ఇలా పెట్టించేడు ! మధ్యతరగతి కుటుంబం పిల్ల , ప్రేమలో పడి లేచిపోయిచ్చిందట , మొగుడు ఎక్కడో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు . కుటుంబం గడవక ఈ బిడ్డ ని మోయడానికి ఒప్పుకుంది. ఏమైతేనేం .. కనీసం నాకు మాటాడుకోడానికో తోడు దొరికింది !
నాకు ఆ పిల్లలిద్దరూ బాగా మచ్చికైపోయేరు , ఏదో నాకు తోచిన చదువు చెప్పేదాన్ని . రూప ని సాయంత్రం పూట నాతో పాటు అలా వాకింగ్ కి తీసుకెళ్ళేదాన్ని. ఎక్కువగా మాటాడేది కాదు , ఏదో ఒక విధమైన నిస్పృహ కనిపించేది ఆ అమ్మాయి లో .
ప్రతి నెల మొదటి తారీకు రోజు మటుకు ఆ అమ్మాయి మొగుడు సఫారీ సూటాయన దగ్గిర పాతిక వేలు తీసుకోడానికొచ్చేవాడు, కాసేపు పిల్లల తో ఆడుకుని వెళ్లిపోయేవాడు .
మధ్యాన్నం పూట తలుపు శబ్దం విని తలుపు తీస్తే , ఆ చిన్న పిల్ల వచ్చి “మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూందండి “ అని చెప్పింది . ఏమిటా అని కనుక్కునేసరికి , ఆ ఎలక్ట్రీషన్ వెధవ దేంతోనో లేచిపోయేడట . ఆ అమ్మాయిని ఊరుకోబెట్టి , ధైర్యం చెప్పి , నాలుగు ముద్దలు బలవంతంగా తినిపించి వచ్చేసేను . మళ్ళీ ఒక్కతీ ఉంటే ఏం అఘాయిత్యం చేస్తుందోనని ఆ రోజుకి రూపనీ , పిల్లల్నీ మా ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చేను .
సాయంత్రం వచ్చిన మా కోడలు రూప వేపు ఓ చూపు పారేసి తన గదిలోకెళ్ళిపోయింది , రాత్రి నా కొడుకు అడిగేడు “ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి ఇల్లు కొనుక్కుంది , ఇలాంటి అలగా జనాన్ని రానివ్వడానికా చెప్పు “ అని . ఆ రాత్రి మాత్రం నిజంగా చావాలనిపించింది, వీణ్ణి చిన్నప్పటినుంచీ ఎంత కష్టపడి పెంచేనో, ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేమో నాకు తెలుసు , వాడికీ తెలుసు , కానీ ఏమీ తెలీనట్టు నటిస్తున్నాడంతే !
రోజులు గడుస్తున్నాయి , పిల్లలు , మనవలు ఆఫీసులకి , స్కూళ్ళకి వెళ్ళగానే పక్క విల్లా వేపు నా అడుగులు పడిపోతున్నాయి . రూప , తన పిల్లల తో గడుపుతూ, వాళ్లకి అవీ , ఇవీ చేసిపెడుతూంటే , ఏదో నా సొంత కూతురికి , మనవలకి చేసిపెడుతున్నట్టుంది . ఆ పిల్లలు కూడా అమ్మమ్మ గారండీ అంటూ పిలవడం మూలాన కావచ్చు !
తొమ్మిదో నెల నిండుతూంది రూపకి , వారం రోజులుగా రెండు పూటలా వచ్చే క్యారేజీ రావడం మానేసింది . నేనే తనకి , పిల్లలకి వంట చేసి పెడుతున్నాను , ఆ సఫారీ సూటాయన కోసం ఫోన్ చేస్తూంటే ఫోన్ స్విచ్చాఫ్ వస్తూంది . సిగ్గు విడిచి మా అబ్బాయిని “ఒరే కొంచెం ఊళ్లోకి వెళ్ళినప్పుడు ఆ సూర్య ఫైనాన్స్ కంపెనీ కి వెళ్లి ఈ అమ్మాయి విషయం చెప్పు , వాళ్ళు ఈ మధ్య ఇటువైపు రావడం మానేసేరు “ అంటూ అడిగితే , వాడు “ఫైనాన్స్ కంపెనీ అన్నా తర్వాత లక్ష పనులు , లక్షన్నర ఇబ్బందులూ ఉంటాయి , రోజూ రెండు పూటలా క్యారేజీ పంపుతూ కూర్చోడానికి వాళ్ళేమైనా దాన్లాగా , నీలాగా ఖాళీ గా ఉంటారనుకున్నావా ?” అన్నాడు , పక్కనే ఉన్న నా కోడలు “ఇప్పుడా ఫైనాన్స్ కంపెనీ ఆయన వైఫ్ కి సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో .. అందుకే వీళ్ళని పట్టించుకోవడం లేదు.. అయినా అత్తయ్యా మీరెక్కువగా వాళ్ళతో కమ్యూనిటీ లో తిరుగుతున్నారట కదా .. ధీరజ్ వాళ్ళావిడ ఇందాక ఫోన్ చేసి ఒకటే నవ్వు “ అంటూ నవ్వేసింది . “నువ్వు కూడా వాళ్ళతో తిరగడం మానెయ్యి, లేకేపోతే అనవసరంగా మన నెత్తికి చుట్టుకుంటుందంతా“ అనేసి లోపలికెళ్లిపోయేడు
మర్నాడు ఉదయం ఏడవుతూంటే తలుపు కొట్టేడు ఆ కృష్ణ గాడు . “ఏమైందిరా అని అడిగితే .. మా అమ్మ ఏడుస్తూందండి .. మిమ్మల్ని రమ్మంది “ అని వెక్కుతున్నాడు
గాభరాగా వాళ్ళింటికి పరిగెత్తితే అర్ధమైంది ., రూప కి నొప్పులు మొదలయ్యేయి , నీరు వదిలేసింది . వెంటనే విల్లా సెక్యూరిటీకి ఫోన్ చేసి అంబులెన్సు తెప్పించి , ఆసుపత్రికి తీసుకెళ్ళేను . అదృష్టం కొద్దీ ప్రసవం బాగానే జరిగింది , పిల్లాడు చూడ్డానికెంత బాగున్నాడో !
అప్పుడు గుర్తొచ్చింది .. ఆ సఫారీ సూటాయనకి ఫోన్ చేసి చెబుదామని గబ గబా నడుచుకుంటూ రిసెప్షన్ దగ్గిరికెళ్ళి , అక్కడి ఫోన్ తీసుకుని ఆయనకి ఫోన్ చేస్తూ , యధాలాపం గా ఆ టేబుల్ మీదున్న పేపర్ ని చూసేసరికి ఒక్కసారి గుండె జారిపోయింది ,”అప్పుల భారంతో సూర్య ఫైనాన్స్ ఓనరు , భార్య ఆత్మహత్య “ అనే హెడ్ లైన్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయి అక్కడే పడిపోయేను .
కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రి బెడ్ మీదున్నాను . ఒకటే ఆలోచనలు , ఏం చేస్తుంది రూప ఇప్పుడు? ఆ పిల్లాణ్ణి ఇక్కడే ఒదిలేసి తన పిల్లలతో వెళ్లిపోతుందేమో ? ఏమైనా సొంత పిల్లాడు కాదు కదా .. అసలు ఆసుపత్రి లో ఉందా అనుకుని అసహనం గా కదులుతూంటే , కృష్ణ గాడి అరుపు వినిపించింది “అమ్మా .. అమ్మమ్మ గారు కదులుతున్నారే “ అంటూ . కిందకి చూసేసరికి , మంచానికి కాస్త ఎడంగా తన ఇద్దరు పిల్లలతో కింద పడుకుని కనిపించింది ! ఆ మూడోవాడు చనుకట్టునతుక్కుని నిద్రపోతున్నాడు !
“తెలిసిందమ్మా .. పాపం ఆ అమ్మగారు , అయ్యగారు పోయారంట కదా “ అంది
“మరి .. వీడినేం చేస్తావు ?“ అడిగేను
“విత్తనం వాళ్లదే కానీ పెరిగింది నాలో కదమ్మా . ఈడూ నా బిడ్డే.. ఎంత కష్టపడైనా నేనే పెంచుతాను “ అందా రూప
“అమ్మా అన్నావు కదే . ఆళ్ళతో పాటు నన్నూ పెంచుకుంటావా ? “ అన్నాను , జీవితం మీద కొత్తగా పుట్టిన ఆశతో.
నాకేసే చూస్తున్న ఆ ముగ్గురి కళ్ళలోనూ ఏదో తెలియని మెరుపు కనిపించింది !

7 thoughts on “కంభంపాటి కథలు 1 – ఆశ

  1. Andulo peddavi da lanti de naa manasu kani alaa unte andaru aa manasuni champevare untaru chuttu yetu povali manushulni matrame preminche manasunna varu batakatam chala kastam

  2. కధ బాగుంది, నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా

  3. కథను నడిపించడంలో కంభంపాటి వారు గొప్ప నేర్పు కలిగిన వారు, చేయి తిరిగిన వారు. ఇక చివర్లో గతం లో మాదిరే ఒక మంచి మలుపు మాత్రం ఖాయం – పాఠకులలో ఆందోళన మటుమాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *