March 28, 2024

కలియుగ వామనుడు – 5

రచన: మంథా భానుమతి

హలీమ్ నలుగురికి శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి అసిస్టెంట్ల కింద అబ్బాస్ లాంటి వాళ్లు అరడజను మంది ఉంటారు. నజీర్ దగ్గర పని చేస్తూనే, హలీమ్ ఫామ్ కి వచ్చినప్పుడు ట్రయినీ ముధారీ లాగ కొంత డబ్బు సంపాదిస్తాడు అబ్బాస్. అందులో సగం నజీర్ నొక్కేసి, సగం అబ్బాస్ బాంక్ లో వేస్తాడు.
ఒంటె నడుస్తుంటే ఎగరకుండా, గట్టిగా మూపురాన్నీ, మెడకి కట్టిన తాడునీ పట్టుకోమని, ఎలా పట్టుకోవాలో మిగిలిన పిల్లలకి చూపిస్తున్నాడు నజీర్.
గుర్రం మీది సవారీకీ ఒంటె సవారీకీ చాలా తేడా ఉంది. గుర్రం వీపు, రౌతు కూర్చోడానికి సదుపాయంగా, మధ్యలో పల్లంగా ఉంటుంది.
ఒంటెకి నడి మధ్యలో మూపురం ఉంటుంది. అది కూడా తీరు లేకుండా పెరిగిన కొవ్వుతో. రౌతు, మూపురం వెనుక కూర్చోవాలి. అక్కడ ఒంటె శరీరం వెనక్కి వాలిపోయి ఉంటుంది. జారి పోకుండా, కాళ్లు మడిచి పెట్టి బల్లిలా అతుక్కుని కూర్చోవాలి.
అందులో పిల్లలకి మరీ కష్టం. చిన్న చిన్న కాళ్లు.. మడవడానికి రావు. అందుకే ఒకోసారి వెల్కో పెట్టి అతికించేస్తారు.
పడి పోకుండా కూర్చునే పద్ధతి నేర్పించాడు అబ్బాస్ చిన్నాకి. అబ్బాస్ దొరకడం కొంతలో కొంత అదృష్టం అనే చెప్పాలి. చూడగానే చిన్నా అంటే ఇష్టం కలిగింది అబ్బాస్కి.
అంతలోనే.. అక్కడికి హలీమ్ వచ్చాడు.
హలీమ్ ని చూడగానే, గొంతులోకి ఎక్కడలేని సౌమ్యతనీ తెచ్చుకున్న నజీర్.. ఒక్కొక్కళ్ల దగ్గరికీ వెళ్లి, శాంతంగా వివరించాడు..
అందరూ నెమ్మదిగా ట్రాక్ మీద స్వారీ చెయ్యడం మొదలు పెట్టారు. కొన్ని ఒంటె పిల్లలు తల ఒకటే విదిలించడం.. దాంతో తాడు వదిలేసి కెవ్వుమని కేక పెట్టాడు ఒక కుర్రాడు.
వాడి కేకకి బెదిరి పోయిన లొట్టిపిట్ట, వేగం పెంచింది. ఎలాగో ఆ తాడు దొరక పుచ్చుకుని, పట్టుకుని పక్కకి వేళ్లాడుతూ ఆ కుర్రాడు, ఇంకా గట్టిగా కేకలు వెయ్యడం మొదలు పెట్టాడు.
మిగిలిన పిల్లలు.. అదంతా అలవాటయినట్లు, పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు.. బాలన్స్ చేసుకుంటూ.
చిన్నా భయాందోళనలతో చూస్తూ ఉండి పోయాడు.. ఒంటె నడుస్తుండగానే. అది తనకే అయితే.. ఏం చెయ్యాలి?
కొంచెం సేపటికి, ఒంటె ఎగిరిన ఎగురుకి ఆ కుర్రాడు వీపు మీద పడ్డాడు. వేళ్లాడుతున్నవాడు నిల దొక్కుకుని నెమ్మదిగా సర్దుకున్నాడు.
చిన్నాకి కూడా అదృష్టవశాత్తూ ఒంటె నెమ్మదిగా నడుస్తోంది. పైగా పట్టు దొరికింది.
కానీ కొంచెం కూడా కదలకుండా బిగ దీసుకుని కూర్చున్నాడు. ఒంటె, తనే అటూ ఇటూ కదుపుకుంది శరీరాన్ని.
సుమారు గంట పైగా సాగింది స్వారీ.
అయిపోయిందని నజీర్ సిగ్నల్ ఇచ్చాక, అసిస్టెంట్లు వెళ్లి ఒంటెలని తాళ్లు పట్టుకుని ఆపారు.
పిల్లలందరినీ దింపి, ఒక దగ్గరికి చేర్చారు. హెల్మెట్లు తీసేసుకున్నారు.
“చిన్నా…” టింకూ ఏడుస్తూ వచ్చాడు.
“ఏమయిందిరా? నువ్వు ఒంటె ఎక్క లేదుగా?” చిన్నా వెనక్కి ఒళ్లు విరుచుకుంటూ అడిగాడు. వీపు నొప్పెట్టేస్తోంది.. అంత సేపు కదలకుండా నిటారుగా కూర్చోడం వల్ల.
“ఎక్కలేదు. కానీ.. చూడు..” రెండు చేతులూ చూపించాడు.. ఏడుస్తూనే.
అర చేతులు నల్లగా అయిపోయాయి. మధ్యలో ఒక దగ్గర గీరుకుపోయి, కొద్దిగా రక్తం వస్తోంది.
“అయ్యయ్యో..” చుట్టూ చూశాడు చిన్నా.. నీళ్ల కోసం. ఫౌంటెన్ దగ్గర తప్ప ఎక్కడా నీళ్లు లేవు.
తాగడానికి మాత్రం తలా ప్లాస్టిక్ గ్లాసులోనూ నీళ్లి చ్చారు. అందరూ గటగటా తాగేశారు.
చిన్నాకి కూడా దాహం వేస్తోంది.
“నీళ్లు తాగెయ్యి. లేకపోతే కళ్లు తిరుగుతాయి. వాడి చేతులు పౌంటెన్ దగ్గర కడగచ్చు. వాడిని కూడా నీళ్లు తాగ మను. లేకపోతే డీహైడ్రేషన్ వస్తుంది.” అబ్బాస్, పక్కకి వచ్చి చెప్పాడు.
టింకూ చేత నీళ్లు తాగించాడు చిన్నా.. వాడు చేతులు దూరంగా పెట్టి వెక్కుతూనే ఉన్నాడు.
అందరినీ ఫౌంటెన్ దగ్గరకి తీసుకెళ్లి, కాళ్లు చేతులు అక్కడున్న నల్లా దగ్గర కడుక్కోమన్నాడు అబ్బాస్. నజీర్, హలీమ్ ఆఫీసు లోకి వెళ్లాడు.
ఆ రోజుకి డబ్బు ఇచ్చి, పిల్లలందరికీ, మంచి ఫుడ్ పెట్టమని చెప్పాడు హలీమ్.
“ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. అప్పుడు వైట్ పెరక్కుండా, బలం పెరుగుతుంది. రేసులు వచ్చేసరికి, ఎవరూ వీక్ గా సోలి పోయి ఉండకూడదు.”
అలాగే అని బుద్ధిగా తలూపాడు నజీర్.
అయితే.. బరువు పెరక్కుండా సగం తిండే పెట్టడం అతని పద్ధతి. ప్రోటీన్ ఫుడ్ కోసం ఇచ్చిన డబ్బు స్వాహా చెయ్యడం చాలా ఇష్టం.
పిల్ల వెధవలు బలంగా ఉండి ఏం చెయ్యాలి.. పని జరగాలంతే.
“ఏం చేశాడు.. ఇలా అయిపోయాయి అర చేతులు?” చిన్నా అడిగాడు, టింకూ చేతులు పామి పామి కడుగుతూ.. అక్కడే నిల్చుని చూస్తున్న అబ్బాస్ ని.
టింకూని చూస్తుంటే కడుపు తరుక్కు పోయింది చిన్నాకి.
“ఒంటెల పేడ ఎత్తించారు. ఆ పాకలు తుడిపించారు.”
“పేడంతా చేత్తో ఎత్తించారు చిన్నా.. మండి పోతున్నాయి చేతులు.” ఏడుపు కంఠంతో అన్నాడు టింకూ.
“ఇంత చిన్న చేతులతో పేడ ఎత్తించారా?” ఆశ్చర్య పోయాడు చిన్నా.
అందరి కంటే చిన్నవాడవడంతో, వాడు పని చేసే అవసరం రాలేదు ఇంట్లో ఎప్పుడూ. ఉన్నదాంట్లో.. వాడి కడుపు నింపడానికే చూశారు, అందరూ. అందుకే వాడు ఆకలికి ఆగలేడు.
“ఇదెలా గీసుకు పోయింది?” రక్తం చారికలు చూపించాడు.
“పేడంతా నేల మీదుంటుంది కదా.. ఇసుకలో ఉండే సన్నని రాళ్లు గాజు ముక్కల్లా ఉంటాయి. పేడ తీస్తుంటే.. అలాగే గీసుకు పోతుంది.” అబ్బాస్ వివరించాడు.
కళ్ల నిండా నీళ్లతో చూశాడు చిన్నా.
“ఇదింకా బిగినింగే. ముందు ముందు చాలా ఉంటుంది టార్చర్.. అందుకే కన్నీళ్లు దాచుకోమని చెప్పాను. త్వరగా కానీ.. మనం ఇంటికెళ్లాలి. నజీర్ కి కోపం వస్తుంది లేటయితే.” అబ్బాస్ తొందర చేశాడు.
టింకూ చేతులు, కాళ్లు మొహం కడిగి, తను కూడా కడుక్కున్నాడు చిన్నా.
అందరూ అక్కడ పెట్టిన హవాయ్ చెప్పులు వేసుకున్నారు. టింకూ, చిన్నాలకి బట్టలతో పాటు చెప్పులు కూడా కొనిచ్చాడు గుడ్ అంకుల్.
పిల్లల్ని వాన్ ఎక్కించి, అక్కడున్న అసిస్టెంట్ ట్రయినర్లకి టాటా చెప్పి బయల్దేరాడు నజీర్.
అలసి పోయి, ఉండల్లా అయిపోయిన శరీరాలతో తమ కొత్త ‘ఇంటికి’ చేరారు చిన్నా, టింకూ.
కొత్త దేశం.. కొత్త పరిసరాల్లో ఒక పగలు భయంకరంగా గడిచింది.. భరించలేని భవిష్యత్తు చిన్నా కళ్ల ముందు కదలాడింది.
పిల్లలందరూ చెమటతో తడిసి ముద్దయిన తమ బట్టల్ని విప్పేసి తువ్వాళ్లు చుట్టబెట్టుకున్నారు.
వాళ్లతో ఫామ్ కి వచ్చిన మిగిలిన పిల్లలు కూడా అక్కడే ఉన్న షెడ్లలో ఉన్నారు.
అందరూ బాత్ రూమ్ దగ్గర కలిశారు. సాయంకాలం అయిందేమో కాస్త ఎండ తగ్గి చల్ల పడింది.
అబ్బాస్ వచ్చి, చిన్నా, టింకూలకి చెరొక సబ్బూ, దానికో పెట్టె ఇచ్చాడు.
“జాగ్రత్తగా దాచుకోండి. మళ్లీ పదిహేను రోజుల వరకూ ఇవ్వరు.”
చాలా చవకైన సబ్బు అది. ఫరవాలేదు.. ఇంటి దగ్గర కూడా ఇలాంటిదే కదా అనుకున్నాడు చిన్నా. మిగిలిన పిల్లలకి అది కూడా అపురూపమే కదా!
క్రమశిక్షణతో లైన్లో నిల్చుని, స్నానాలు చేశారు. టింకూకి రోజూ లాగానే చిన్నా చేయించాడు. మొత్తం అబ్బాస్ ఆధిపత్యంలో జరిగింది.
ఆకలి దంచేస్తోంది అందరికీ.. ఎప్పుడెప్పుడు తినేసి పడుక్కుందామా అని ఉంది. ఇంక ఏమీ చెయ్యడానికి లేదు.
ఎలాగైతేనేం.. భోజనాలు వచ్చాయి.
నజీర్ రాలేదు. ఇంటికెళ్లిపోయినట్లున్నాడు.
కిచెన్ నించి ఒక పని వాడు తెచ్చి ఇచ్చాడు, డిస్పోజబుల్ బాక్సుల్లో.. గడ్డం, టోపీ లతోఅందరూ ఒక లాగే ఉన్నారు చిన్నాకి. అయితే పొడవాటి గౌను వేసుకోలేదు. అతను పాకిస్థాన్ నుంచి వచ్చాడని చెప్పాడు అబ్బాస్, తరువాత.
“ఇక్కడ పని వాళ్లందరూ మన లాగ జనం ఎక్కువ, డబ్బు తక్కువ దేశాల్నుంచి వచ్చిన వాళ్లే.” కళ్లు పెద్దవి చేసుకుని విన్నాడు చిన్నా.
పీటా బ్రెడ్.. సాస్, కీరా దోసకాయ, కారట్ ముక్కలు.. దాంతో ఒక పచ్చడి లాంటి పదార్ధం.
“ఈ పచ్చడేంటీ?”
“దీన్ని ‘బాబా గనూష్’ అంటారు. ఇక్కడ చాలా కామన్. లావు వంకాయని.. ఎగ్ ప్లాంట్ అంటారిక్కడ, కాల్చి చేస్తారు. బావుంటుంది. బ్రెడ్లో, కారట్ ముక్కల్లో, దోసకాయ ముక్కల్లో.. ఎందులోకైనా నంచుకుని తినచ్చు. ఈ కీరా, కారట్ ముక్కలు ఇందులో ముంచుకుని తినండి. పీటా బ్రెడ్ కి సాస్ రాసి తినండి.” అబ్బాస్ బ్రెడ్ కి సాస్ రాసుకుంటూ ఎలా తినాలో వివరించాడు.
మిగిలిన ముగ్గురు పిల్లలూ ఆం ఫట్ అని తినేశారు. ఇంకో అంత పెడితే తినాలనే ఉంది అందరికీ. అడిగీ ప్రయోజనం లేదని తెలుసు వాళ్లకి.
చిన్నా టింకూలకి సరిగ్గా సరి పోయింది.
“మధ్యలో ఉన్న షెడ్ చూడు.. అది కామన్ హాల్. అక్కడ టివి ఉంటుంది. కావాలంటే వెళ్లి చూడచ్చు. కానీ, ఎవరికీ అక్కడికి వెళ్లాలనే విష్ ఉండదు సాధారణంగా.. పచ్చి పులుసై పోయిన బాడీతో.. ఎప్పుడూ పడుక్కునే ఉండాలని అనిపిస్తుంది.”
అబ్బాస్ ఇంకా కొన్ని వివరాలు చెప్పాడు ఆ ఫామ్ గురించి.. చిన్నాకి కొన్ని అర్ధమయ్యాయి.. కొన్ని కాలేదు.
అందరూ బొంతలు పరిచేసుకుని, దుప్పట్లు కప్పేసుకుని పడుక్కున్నారు.
చిన్నాకి, తిండి తిన్నాక నొప్పులు ఎక్కువయాయనిపించింది. రెండు తొడలూ సలిపేస్తున్నాయి. ఒంటె నడుం లావుగా ఉంది. అటూ ఇటూ కాళ్లు వేసి కూర్చుంటే.. నరాలు లాగేశాయి. పైగా ఒంటె ఎగురుతుంది కూడా! కింద పడిపోకుండా బాలన్స్ చేసుకోవడం..
అలవాటు లేదు కదా..
హాలు లేదు.. టివి లేదు.. టింకూకి కూడా బొంత పరచి, పడుకో పెట్టి, కళ్లు మూసుకున్నాడు చిన్నా.
………………….

ఎవరో వీపు మీద కొడుతున్నారు..
చటుక్కున మెలకువ వచ్చింది చిన్నాకి. ఎక్కడున్నాడో అర్ధం కాలేదు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపలే.. ఇంకొక కొత్త అనుభవం.
కళ్లు తెరిచి చూశాడు. చీకట్లో తెల్లగా పళ్లు మెరుస్తున్నాయి. కెవ్వుమని కేకేశాడు. అంతలో కళ్లు మిరిమిట్లు కొలిపేట్లు లైటు..
మొహంలోకి చూస్తూ ఎర్రని కళ్లు, నల్లని చింపిరి జుట్టు. కాళ్లతో చిన్నాని ఒక్క తాపు తన్ని, పక్క వాడి దగ్గరికి వెళ్లాడు ఒక నల్లని రాక్షసుడు.
అచ్చంగా.. ఎప్పుడూ తన కలలో వచ్చేవాడిలాగే ఉన్నాడు.
ఇక్కడికి వచ్చే ముందే చిన్నాకి తెలిసి పోయింది.. కొత్త చోట్లో చాలా పని చేయిస్తారని. లేకపోతే.. ఊరికే తిప్పటానికి విమానంలో తీసుకు రారు కదా!
జుట్టంకుల్ లాగా కూర్చోపెట్టి పెట్టరని కూడా అనుకున్నాడు కానీ, ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు.
మనుషులు ఇంత బాడ్ గా ఉంటారా?
చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడిని, రాక్షసులు హింస పెట్టారని విన్నాడు. సినిమాలో చూశాడు. కానీ.. నిజంగా, ఈ రోజుల్లో జరుగుతుందా? నమ్మలేక పోతున్నాడు. కానీ.. జరుగు తోంది కదా!
పని చేయించు కోవచ్చు కానీ కొట్టడం, తన్నడం ఎందుకో అర్ధం కాలేదు చిన్నాకి.
చిన్నా, టింకూలు కొత్త దేశానికి, కొత్త ఇంటికి వచ్చి పదిహేను రోజులు అయింది. గోడ గడియారం నాలుగు కొట్టింది.
“లే.. లే.. డ్రీమ్స్ తరువాత. కిచెన్ లోకి పద. ఫైవ్ మినిట్స్ లో..” నజీర్ చిన్నాని తన్నాడు.
టింకూని కూడా చిన్నా లేపాడు. వాడిని కొట్టే వీలు లేకుండా, గోడకీ తనకీ మధ్యలో పడుక్కో పెడుతున్నాడు చిన్నా. అయినా అప్పుడప్పుడు తప్పడం లేదు. వాడసలు స్తబ్దుగా అయిపోయాడు. ఇంత కళ్లేసుకుని చూట్టం తప్ప, ఎప్పుడో కానీ ఏం మాట్లాడట్లేదు. ఏడవడం కూడా తగ్గించేశాడు.
ఇద్దరూ లేచి, పక్క బట్టలు సర్దుకుని బాత్రూంకి వెళ్లారు. లక్కీనే.. కాళీగా ఉంది. మిగిలిన పిల్లలు ఇంకా తన్నులు తింటున్నట్లున్నారు.
గబగబా పళ్లు తోముకుని, కిచెన్ దగ్గరికి పరుగెత్తారు.
వంటతను ఫరవాలేదు. కాస్త కనికరం ఉన్న వాడే.
ఇద్దరికీ కప్పుల్లో ‘టీ’ ఇచ్చి, రెండు బిస్కట్లు కూడా ఇచ్చాడు. అతనికి చిన్నా నచ్చాడు. చెప్పిన పని చక్కగా చేస్తాడని. అప్పుడప్పుడు చిన్ని చేతులతో అల్లం, కారట్ వంటివి గీరడం కూడా నీట్ గా చేస్తాడని.
మిగిలిన వాళ్లకి అంత తీరు లేదు మరి. ఆ వయసులో అమ్మా నాన్నల దగ్గర గారాలు పోతూ ఉండాలి.. విధి రాతను బట్టి అక్కడొచ్చి పడ్డారు.
చిన్నా, టింకూలకి ఇచ్చిన టీ బానే ఉంటుంది. కాస్త పాలు పంచదార వేస్తాడు వంటాయన. మిగిలిన వాళ్లకి బరువు పెరక్కుండా నల్ల టీనే.. అదే తాగుతారు. బిస్కట్లు నంచుకుని.
లేవగానే ఏదో ఒకటి పడాలి కదా
చిన్నాని చూడగానే.. వాడి పని తీరు చూశాక, అందరికీ వాడంటే ఇష్టం కలక్క మానదు. వాడికి ఆరేళ్లని అనుకుని.. ఆ వయసుకి అంత పెద్దరికంగా ఎలా ఉంటాడా అని ఆశ్చర్య పోతుంటారు.
నజీర్ కాకుండా, ఆ ఔజుబాలో.. దాదాపు పది మంది పని చేస్తుంటారు.
కిచెన్ లోనే నలుగురుంటారు. ఆవరణ శుభ్రం చెయ్యడానికి, స్టోర్ నిర్వహణ, సెక్యూరిటీకి.. అన్ని చోట్లా.. ఎక్కువగా పాకీస్థానీలు, ఇండియన్స్ పని చేస్తుంటారు.
అంత మంది ఉన్నా, ఈ చిన్న పిల్లలు ఊరికే తిని పోతున్నారని దుగ్ధ చాలా మందికి. వాళ్ల కోసమే తమకి ఉద్యోగాలొచ్చాయన్న సంగతి మర్చి పోతారు.
ఆ పసివాళ్ల చేత ఏ పని ఎలా చేయించాలా అని పరిశోధన చేస్తున్నట్లుగా ఉంటారు.
చిన్నాని కిచెన్లో వాడుకోడానికి షెప్ నిర్ణయించేశాడు. అతనికి ఎదురు చెప్పలేరెవరూ. చెప్పారంటే.. ఫుడ్ కీ, కాఫీ టీలకీ ఇబ్బందే.
చిన్నా, తనతో టింకూని కూడా పిలవమని షెఫ్ అంకుల్ కి మంచి మూడ్ చూసి చెప్పాడు.
“వీడు పొడుగు పెరిగాడు కానీ, ఏజ్ త్రీ ఇయర్సే అంకుల్. అందుకే బేబీ లాగుంటాడు. నేను వాడి చేత బాగా పని చేయిస్తా. ఇక్కడికి పిలవండంకుల్.. ప్లీజ్..” షెఫ్ కాళ్లు వత్తుతూ అడిగాడు.. వచ్చిన మరు నాడే.
నిల్చుని పని చేసే షెఫ్ కి కాళ్లు వత్తుతుంటే హాయిగా ఉంది.
నాయనమ్మకి రోజూ వత్తడం అలవాటే చిన్నాకి. ఆ పని చేస్తే చాలా సంతోషిస్తారని కూడా తెలుసు.
అంతే.. అప్పటి నుంచీ, చిన్నాతోనే టింకూని కూడా కిచెన్ లో పెట్టుకున్నాడు. టింకూకి చెప్పిన పని కూడా చిన్నా చేస్తుంటాడు కొంత.
పైకి చెప్పలేక పోతున్నారు కానీ మిగిలిన పిల్లలకి చాలా కుళ్లుగా ఉంటోంది.
ఎండలో చిన్న చిన్న చీపుళ్లతో కాంపౌండ్ తుడవడం, అక్కడున్న ఒంటె షెడ్లు, గొర్రెల షెడ్లు శుభ్రం చెయ్యడం ఉన్న కాసిని మొక్కలకీ నీళ్లు పొయ్యడం.. ఇలాంటి పనులు చేస్తూ, చిన్నాని కోరగా చూస్తుంటారు.
ముఖ్యంగా ఆ గొర్రెలు, ఒంటెల షెడ్లు..
పాల కోసం ఒంటెల్నీ, గొర్రెలనీ పెంచుతారు అక్కడ.
పేడ ఎత్తడం, కిందంతా నీళ్లు పోసి కడగడం.. వికారమైన పని.
అంతే కాదు..
అప్పుడప్పుడు ఒంటెలు ఖాండ్రించి ఉమ్మేస్తుంటాయి. షావర్ లాగ పడుతుంది పిల్లల మీద. కంట్లో పడిందంటే.. ఒకటే మంట. నోట్లో కెళ్లిందంటే చేదుగా వికారంగా ఉంటుంది..
సాధారణంగా ఉమ్మవు కానీ, పిల్లలు తమ సహజ బాల్య చేష్టలతో వాటిని రెచ్చగొడితే ఉమ్ము తాయి. నోట్లో ఉండే లాలాజలం మాత్రమే కాదు.. పొట్టలో ఉండే ద్రవాన్నంతా బైటికి తీసుకొస్తాయి. ఆకుపచ్చ బంక లాటి పదార్ధం..
ఆ బంకంతా వదిలించుకోవాలంటే ఆ దేవుడు దిగి రావలసిందే.
అన్ని పనుల్లోకీ కిచెన్ పనే కాస్త హాయిగా ఉంటుంది.
అంత పనీ చేయించుకుని కూడా, కడుపు నిండా తిండి పెట్టడానికి మనసొప్పదు అక్కడి మానేజర్లకి. ఎక్కడికక్కడ మిగుల్చుకోవాలని చూడటమే.
“అంకుల్! ఇవేళ మెనూ ఏంటి” చిన్నా అడిగాడు మెయిన్ షెఫ్ ని. కిచెన్ లో రోజూ చేసే పని అయిపోయింది.
నేలంతా తడి బట్ట పెట్టి తుడవడం, గట్టు ఎక్కి స్టౌ దగ్గర శుభ్రం చెయ్యడం, వెజిటబుల్స్ విడగొట్టడం, డిష్ వాషర్ లోంచి సామాన్లు తీసి సర్దడం ముఖ్యంగా చేసే పనులు.
“మీరు ట్రయినింగ్ కి వెళ్తారని చెప్పాడు నజీర్. తొందరగా కావాలి లంచ్ అని. అందుకే ‘అల్ హరీస్’ చేసి రాత్రే ఆవెన్ లో పెట్టేశా. చాలా సేపు బేక్ అవాలి అది. ఈ పాటికి అయిపోయుంటుంది. చక్కని స్మెల్ వస్తోంది చూడూ.”
“హా.. అంకుల్. మంచి స్మెల్.. కొత్త కుకీస్ బేక్ అవుతున్నాయేమో అనుకున్నా. అదేం డిష్ అంకుల్?”
“వీట్ ఫ్లోర్, సాల్ట్, బటర్, మీట్ వేసి పేస్ట్ లా అయే వరకూ కుక్ చెయ్యాలి. ఆతరువాత సెవరల్ అవర్స్ బేక్ చెయ్యాలి. టైమ్ ఎక్కువ పడుతుంది కానీ చెయ్యడం సింపుల్.” షెఫ్ ఆనందంగా చెప్పాడు.
పిల్లలు, చెప్పిన పని ఏడుస్తూ చేసుకు పోయే వాళ్లే కానీ కుకింగ్ మీద ఎవరూ ఇంట్రెస్ట్ చూపించ లేదు ఇప్పటి వరకూ.
చిన్నాకి కూడా కొత్తగా ఉంది.
నాన్నమ్మ, అమ్మల దగ్గర ఎప్పుడూ బేకింగ్ అనే మాటే విన లేదు. బిస్కట్లు బజార్లో కొనుక్కోవడమే కానీ, అవి ఎలా చేస్తారో తెలియదు.
ఇక్కడేమో అన్నీ బేకింగే.. అదీ ఇదీ కలిపేసి, ఓవెన్ లోకి తోసెయ్యడమే.
అందుకే ఆసక్తిగా అడుగుతుంటాడు.
“మీరిద్దరూ, ఈ కారట్, బీట్రూట్, టమాటో కట్ చెయ్యండి. కాస్త సాల్ట్ పెప్పర్ చల్లేసి పెట్టేద్దాం. అంతే.. లంచ్ రెడీ.”
“ఆల్ హరీస్.. అలాగే తినేస్తారా? సాస్ వద్దా? నేను టమాటా చట్నీ చెయ్యనా?”
చిన్నాని ఒక సారి పైకి లేపి, మొహంలోకి చూసి.. నవ్వుతూ దింపేశాడు షెఫ్.
“నువ్వు ఛఠ్నీ.. చేస్తావా? ఎలా..”
“కొంచెం చేసి చూపిస్తా. వీట్ డిష్ లోకి బాగుంటుంది.”
“ఓ.కే.. ప్రొసీడ్..”
తనకి కావలసిన పదార్ధాలు గట్టుమీద పెట్టమని అక్కడున్న అసిస్టెంట్ ని బతిమాలాడు చిన్నా.
టింకూని తీసుకుని ప్లాట్ ఫామ్ ఎక్కాడు.ఒక్కొక్క టామాటో చొప్పున పది పెద్ద టమాటాలు, బ్లెండర్ లో పడేశాడు. పెద్ద బ్లెండర్ ఉందా కిచెన్ లో.
ఒక సారి నాన్నమ్మని గుర్తుకు తెచ్చుకుని.. అందులో రెండు చెంచాలు ఉప్పు, రెండు చెంచాలు చక్కెర, ఒక చెంచా కారం పొడి, అర చెంచా మిరియాల పొడి వేశాడు.
నాన్నమ్మ కొత్తిమీర వేస్తుందే.. ఇక్కడ అది చూడలేదు..
బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచించాడు. వాడు అలా చేస్తుంటే షెఫ్ నవ్వుతూ చూస్తున్నాడు.
హా.. దొరికింది. గట్టు మీంచి కిందికి దూకి ఫ్రిజ్ తీసి అందులోంచి పుదీనా కట్ట తీశాడు. మళ్ళీ ప్లాట్ ఫామ్ ఎక్కి.. టింకూ తనూ కలిసి, ఆకులు ఒలిచి, కడిగి బ్లెండర్ లో పడేసి, బ్లెండర్ తిప్పేశాడు.
పింగాణీ డిష్ లోకి చట్నీ తీసేశాడు.
పది నిముషాల్లో అయిపోయింది.
ఒక స్పూన్ తో తీసి, షెఫ్ అంకుల్ కిచ్చాడు.
“వావ్.. సూపర్. చాలా బాగుంది. ఇంత సింపుల్? ఆల్ హరీస్ ఎప్పుడు చేసినా.. ఇదే దానికి సాస్. గ్రేట్ సమీర్.” ప్లాట్ ఫామ్ మీది నుంచి ఎత్తుకుని, గట్టిగా హత్తుకున్నాడు.
“థాంక్యూ అంకుల్.”
“వెళ్లండి. వెళ్లి త్వరగా రెడీ అవండి. అప్పుడే తొమ్మిదయింది. వన్ మోర్ అవర్.. వాన్ వచ్చేస్తుంది.”
చిన్నా, టింకూని తీసుకుని పరుగెత్తాడు.
“పూర్ కిడ్స్..” అనుకుంటూ లేచి అసిస్టెంట్లని పిలిచాడు షెఫ్. లంచ్ సర్దించాలి బాక్సెస్ లో.
పిల్లలంతా తయారవుతున్నారు. అందరి మొహాల్లోనూ ఆందోళన.. భయం. ఎన్ని దెబ్బలు తినాలో.. ఒంటెలు ఫ్రెండ్లీగా ఉంటాయో లేదో!
ఒక్కో సారి, ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నా, ధబీమని పడేస్తుంటాయి. అంతెత్తునుంచి కింద పడితే.. ముందు భయానికే గట్టిగా కేకలు పెడుతుంటారు.
ప్రతీ జాయింట్ దగ్గరా కీళ్లన్నీ కిర్రు మంటుంటాయి.
చిన్న పిల్లలు కనుక ఎముకలు మెత్తగా, కండరాలు ఎటుపడితే అటు సాగేలా ఉంటాయి.. పైగా ఇసుకలో పడతారు. అయినా కూడా.. దెబ్బలు తగులుతుంటాయి అప్పుడప్పుడు.
ముందు వారం ట్రయినింగ్ కి వెళ్లినప్పుడు ఒక కుర్రాడి కాలు బెణికింది. గోల గోల పెడుతూ కుంటుతూ నడుస్తున్నాడు.
హలీమ్ ఫామ్ లో కానీ.. ఇంటికి తిరిగి వచ్చాక ఓజుబాలో కానీ ఎవరూ పట్టించుకోలేదు.
చిన్నాకి నాన్నమ్మ చిటకా వైద్యం గుర్తుకొచ్చింది.. కిచెన్ లోకి వెళ్లి, షెఫ్ అంకుల్ నడిగి, ఒక కోడి గుడ్డు తీసుకొచ్చి, పగల గొట్టి, వాపు దగ్గర రాశాడు. ఆరాక, కాలు పైకి ఎత్తి పెట్టి పడుక్కోమన్నాడు. కాలుకి తడి తగల నియ్యద్దని చెప్పాడు.
నాలుగు రోజుల్లో తగ్గిపోయింది.
అప్పటి నుంచీ, పిల్లలంతా చిన్నా మీద అసూయ పడ్డం మానేశారు.
అందరికీ ఒక పెద్ద దిక్కుగా తయారయ్యాడు.
అబ్బాస్.. అప్పుడప్పుడు నజీర్ పిలుస్తుంటే వెళ్లి పోతుంటాడు.. రెండు మూడు రోజుల వరకూ రాడు. అందుకే పిల్లలు ప్రతీ దానికీ చిన్నా మీద ఆధార పడుతున్నారు.
ఇవేళ్టి ట్రయినింగ్ పెద్ద రేస్ ట్రాక్ దగ్గరని చెప్పాడు అబ్బాస్.
“అంటే.. ఏంటన్నా? ఆ అంకుల్ ట్రాక్ బాగుంది కదా?” పదిహేను రోజుల్లో నాలుగుసార్లు హలీమ్ ఫామ్ కి వెళ్లారు ట్రయినింగ్ కి.
“అది ప్రైవేట్ ఫామ్ లో ప్రాక్టీస్ కోసం చేసిన ట్రాక్. ఇది రియల్ గా రేసులు జరిగేది. చాలా పెద్దగా ఉంటుంది. ఒంటెలు బాగా ట్రయినింగ్ అయినవి. అవి చాలా స్పీడుగా పరుగెడతాయి..”
“ఇప్పు డెందుకు అక్కడికి?” చిన్నా కుతూహలంగా అడిగాడు.
“తొందరలో రేసులు మొదలవుతాయి. అసలీపాటికే మొదలవ్వాలి. షేక్ లందరూ వేరే పనుల్లో బిజీగా ఉండి ఆలిస్య మయింది. అందుకే అక్కడ చేయిస్తారు. ఒంటెలకీ, జాకీలకీ కూడా అలవాటవుతుందని.”
“అబ్బాస్..” బయటి నుంచి పెద్ద కేక..
“హా.. నజీర్ సాబ్. వస్తున్నా. ఫైవ్ మినిట్స్ లో వచ్చెయ్యండి.” గబగబా పరుగెత్తాడు అబ్బాస్.
“ఐతే అక్కడ ఒంటెల పేడ ఎత్తక్కర లేదా చిన్నా? వాటి షెడ్ లుండవు కదా?” టింకూ అడిగాడు. వాడు తయారై పోయి రెడీగా ఉన్నాడు.
ఇప్పుడు పేడ తియ్యడానికి బాధ పడట్లేదు టింకూ. తియ్యనంటే తగిలే తన్నుల కంటే పేడ తియ్యడమే నయం. అబ్బాస్, పిల్లల చేతులకి గ్లోవ్స్ తెప్పించాడు, నజీర్ కి చెప్పి. టింకూ కాక ఇంకా ఇద్దరు చేస్తారా పని.
టింకూకి రైడింగ్ అలవాటు చెయ్య లేదు.
కిందటి సారి ట్రయినింగ్ కి వెళ్లినప్పుడు, హలీమ్ దగ్గరికి తీసుకుని చూశాడు. వాడి ఒళ్లు ఇంకా కొంచెం గట్టిపడాలని చెప్పాడు.
“వాడి బుగ్గలు చూడండి.. కదులుతుంటే ఎలా ఊగుతున్నాయో! ఇంకా బేబీ వీడు.” అనేశాడు.
పేడ తియ్యడానికి ఏడుస్తే పిర్ర మీద తన్నాడు నజీర్.. బోర్లా పడి పోయాడు టింకూ. అప్పటి నుంచీ పేచీ పెట్టటం లేదు.
“ఏమో టింకూ! పేడకి ఒంటెలుంటే చాలు కదా.. షెడ్ లుండక్కర్లేదుగా?” నవ్వుతూ అన్నాడు చిన్నా.
నవ్వులాటకే అన్నా.. చిన్నా నిజమే చెప్పాడు.
వాన్ చాలా దూరం వెళ్లింది. పెద్ద ఓపెన్ గ్రౌండ్. పది కిలోమీటర్లుంటుంది గుండ్రని ట్రాక్. ఆ ట్రాక్ ఇసుకతో నింపి ఉంటుంది. దాని చుట్టూ పక్కా రోడ్..
రేసులు జరిగేటప్పుడు ఆ రోడ్డు మీద, కామెంటేటర్లు, టివి వాళ్లు, జర్నలిస్టులు, రాయల్ ఫామిలీ వాళ్లు వెళ్తుంటారు.
ట్రాక్ లో ప్రతీ కదలిక టివీల్లో వచ్చేస్తుంది.
రేస్ కోర్స్ ఆవరణ లోనే పెద్ద పెద్ద టివీలు అన్ని కోణాల్లోనూ నిలబెట్టి అరేంజ్ చేస్తారు. వాటిలో అంతా చూపిస్తుంటారు. లేకపోతే, ఒక దగ్గర కూర్చున్న వారికి తమ దగ్గర్నుంచి ఒంటెలు వెళ్లి పోయాక ఏమీ కనిపించదు కదా! ఆ ఒంటెల తో పాటే, ఫెన్సింగ్ ఇవతల నుంచి వెళ్లచ్చు.. కానీ ఎంత దూరం వెళ్ల గలుగు తారు? పైగా ఎండ..
కారులో వెళ్లచ్చు కానీ.. అదీ బోరే. తలుపు తీస్తే దుమ్ము. తియ్యకపోతే దుమ్ము కొట్టుకు పోయి గాజు కిటికీ లోంచి ఏమీ కనిపించదు. ఆధునిక కాలంలో చాలా మంది ఇళ్లలో కూర్చుని, తమ టివిల్లో చూడ్డానికే ఇష్ట పడుతున్నారు.
రేస్ కోర్స్ కెళ్లినా కనిపించేదేం ఉండదు. గోల హడావుడి, ఎండ తప్ప.
పది కిలో మీటర్ల ట్రాక్ ని ఒక చోట కూర్చుని గమనించే దేముంటుంది? అక్కడి కెళ్లినా పెద్ద పెద్ద తెరల మీద కూర్చుని చూడ్డం తప్ప ఏవుండదు.
చిన్నా వాళ్ళ వాన్ ని, హలీమ్ ఒంటెలున్న గుంపు దగ్గరకి తీసుకెళ్లి ఆపాడు నజీర్.
హలీమ్ గుంపు రంగు నీలం, పసుపు.
పిల్లలందరికీ ఆ రంగుల్లో ఉన్న హెల్మెట్ లిచ్చారు.
రేసులు నడిచే టప్పుడు ఆ రంగులున్న టీ షర్టులు వేస్తారు. వాటి కింద నీలం రంగు పైజామాలు.
ఆవరణలో కొంచె దూరంలో చిన్న చిన్న గదుల్లాంటివి రేకులతో కట్టినవి ఉన్నాయి. అక్కడ బట్టలు మార్చుకోవడానికి కొన్ని గదులు, కాసేపు కూర్చోడానికి కొన్ని.. వరుసగా బాత్రూములూ, తాగడానికి మంచి నీళ్లూ వంటి సదుపాయాలున్నాయి.
దేనికీ పైన కప్పు లేదు. కూర్చోవడమైనా పడుక్కోవడ మైనా ఇసుక లోనే.
ప్రతీ జాకీకీ చిన్న మంచి నీళ్ల సీసా ఉన్న పోచ్ కూడా ఉంటుంది.. వాళ్ల టీ షర్ట్ కి అతికించి.
“చిన్నా!” టింకూ అరిచాడు. ఆ గోలలో ఏదైనా చెప్పాలంటే అరవ్వలసిందే.
“ఏం కావాలి టింకూ? నువ్వు ఇక్కడే ఒక మూల కూర్చో. వీలున్నంత వరకూ ఎవరి కంటా పడకు.”
“అది కాదు.. అటు చూడూ. కిషన్, సిరాజ్ వాళ్లు..”
చిన్నా టింకూ చూపించిన వేపు తల తిప్పాడు.
నిజమే! ఎరుపు పసుపు రంగుల గుంపు దగ్గర, కిషన్ కనిపించాడు. వాడి పక్కనే, నయీమ్, తబ్రీజ్, సిరాజ్.. ముగ్గురూ చాలా సన్నగా అయి పోయారు.
కిషన్ ఇంకా కొంచెం బొద్దుగా ఉన్నాడు కానీ.. వాడిలో ఉన్న హుషారంతా పోయింది. దిక్కు తోచని వాళ్లలా నిలుచున్నారు.
చిన్నా గుంపు పక్కనే ఉన్నారు వాళ్లు కూడా.
అప్పుడే కిషన్ కూడా వీళ్లని చూశాడు. మొహం విప్పారింది సంతోషంతో. కళ్లలోంచీ ఆగకుండా నీళ్లు.. తమ తమ కష్టాలు చెప్పేసుకోవాలన్న తపన.
ఏటిలో కొట్టుకు పోతుంటే సన్నదైనా, చిన్న కర్ర పుల్ల దొరికినప్పటి సంతోషం మొహాల్లో.
నలుగురూ కుడి చేతులు పైకి లేపారు.
ఒకరి కొకరు దగ్గరగా రాబోయి, తాన్యా మాటలు గుర్తు తెచ్చుకున్నారు అందరూ.
“ఎక్కడైనా కలిసినా పలకరించు కోకూడదు. తెలియనట్లే ఉండాలి.”
అంతే.. వెనక్కెళ్లి పోయారు.
హలీమ్ తన గుంపుని పిలిచాడు. అబ్బాస్, నజీర్లు ఒక్కోక్కళ్లనీ ఒంటెల మీదికెక్కించారు. ఒంటెల శిక్షకులు కూడా దగ్గరే ఉండి, ఒంటెలని మాలీష్ చేస్తూ.. పిల్లలని కట్టేసే వరకూ ఉన్నారు. ఒంటెలకి అలవాటే.. కదలకుండా నిలుచున్నాయి.
జీనుకున్న తాడుతో నడుం మీంచీ కట్టేశారు.
ఒక చేత్తో జీనుకున్న తాడు పట్టుకుని, ఇంకొక చేత్తో ‘సాత్ అల్ జమాల్’ (ఒంటెలని హుషారు పరచడానికి వాడే కమ్చీని) పట్టుకోమన్నారు.
ఒంటెలు పరుగెడుతుంటే, కమ్చీతో అదిలిస్తే స్పీడు పెంచుతాయి.. కమ్చీలని చేత్తో గుండ్రంగా తిప్పుతూ అదిలిస్తారు.
కానీ, అదే మొదటి రోజు కనుక, కమ్చీని చేత్తో ఊరికే పట్టుకుని కూర్చో మన్నారు.
పిల్లలందరిదీ తలొక భాష.. చెప్పే వాళ్లు ఎక్కువగా సైగలతో, తాము చేసి చూపించీ సూచనలు ఇస్తున్నారు. నజీర్ కి కాస్త అలవాటయింది. అతగాడి సైగలు బానే అర్ధ మవుతున్నాయి పిల్లలకి. అబ్బాస్ ఐతే.. అన్ని భాషలూ కలిపి లాగించేస్తాడు.
జాకీ లందరూ బెదురు బెదురుగా, భయంగా కూర్చున్నారు.
అంత మంది జనం.. హమీల్ ఫామ్ లో వాళ్లు, ఒంటెలు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇక్కడ ప్రాక్టీస్ కొచ్చిన గుంపులుందరూ ఉంటారు.
పైనించి కాల్చేసే ఎండ.
ఏడడుగుల కదిలే ఎత్తు మీద కూర్చుని, ఎప్పుడు పడిపోతామో అనే భయంతో.. అమ్మ చేతి ముద్దలు తినాల్సిన వయసు పిల్లలు, ఎప్పుడేం జరుగుతుందో అని అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
వారి గురించి ఆలోచించే వారు లేరక్కడ.
అయితే గియితే, ఎంత బాగా ఒంటె నడుపుతారా అని ఆలోచించే వారే, వారి యజమానులు.
చిన్నాకి కాస్త అలవాటయింది. కాళ్లు మడిచి పెట్టి, తాడు బలంగా లాగి పట్టుకోవడం.. బిర్ర బిగుసుకు పోయి కాకుండా కాస్త స్వేచ్ఛగా కూర్చోడం. కమ్చీతో అదిలించడం కూడా వచ్చింది.
చిన్నా ఏదయినా త్వరగా నేర్చుకుంటాడు. చేసే పని చక్కగా, అందరూ మెచ్చుకునేలా చేస్తాడు.
“నువ్వు చాలా షార్ప్ గా అన్నీ నేర్చుకుంటున్నావు కానీ, బయటికి చూపించకు. అలా చేస్తే ఎక్కువ సార్లు నిన్నే తీసుకెళ్తారు. ఇది చాలా రిస్క్ ఉన్న గేమ్. ఎప్పుడేమవుతుందో తెలీదు. ఇటువంటి వాటిల్లో తెలీనట్లుగా, అర్ధం అవనట్లుగా ఉంటేనే నయం.” అబ్బాస్ బోధించాడొక సారి.
రోజూ.. ట్రయినింగ్ కి వెళ్లకుండా ఔజుబాలో ఉన్నప్పుడు, అందరి చేతా వ్యాయామాలు చేయిస్తూ ఉంటాడు అబ్బాస్.
ఒక రకంగా, ఈ ఫిజికల్ యాక్టివిటీ చిన్నాకి మంచే చేస్తోంది. ఎముకలని బలహీన పరచకుండా, కండరాలని బలంగా చేసేలా చేస్తోంది. బరువు పెరగడం మొదలే లేదు.
అయినా డాక్టర్ గారిని కలవలేక పోతున్నాను.. ఎలా ఉందో ప్రోగ్రెస్.. అని మనసులో బాధ పడుతుంటాడు.
తన కున్న సమస్యని ఏదో విధంగా అధిగమించాలని ఆ చిన్ని బుర్రలో ఎప్పటి నుంచో పాతుకు పోయింది.
ఏం చెయ్యడానికీ లేకుండా.. ఇక్కడ పడేశావా అనుకుంటూ ఆకాశం కేసి చూశాడు.
ఒక్క మేఘం కూడా లేదు.. రాయబారం పంపటానికి.
…………………..

స్టార్ట్.. సిగ్నల్ ఇచ్చారు.
కాళ్లతో ఒంటెల పక్కలు తన్నారు జాకీలు.
ఒక్కసారిగా పరుగు మొదలు పెట్టాయి ఒంటెలు. అవీ.. ఎప్పట్నుంచో ట్రాక్ మీద పరుగు పెట్టడం అలవాటున్న ఒంటెలు.
అదిరి పోయిన జాకీలు కెవ్వుమని కేకలు పెడుతున్నారు.. కొండ నాలుకలు బైటికొచ్చేలాగ అరుస్తున్నారు.
ఆ అరుపులకి రెచ్చి పోయి మరింత వేగాన్ని పెంచుతున్నాయి ఒంటెలు. జాకీలు ఇంకా గట్టిగా అరుస్తున్నారు.
చిన్నాకి గుండె చేతిలో కొచ్చినట్లయి పోతోంది. కొంచెం బాలన్స్ తప్పినా కూడా కింద పడి పోడం ఖాయం.
కమ్చీ విదిలించ కుండానే అలా ఉంది.. ఇంక అది కదిలిస్తే..
ఐదు కిలో మీటర్లు చాలని అక్కడ ఆపేసారు ఒంటెలని. నెమ్మదిగా పిల్లలని దింపారు. కిందికి దిగాక, అందరూ గట్టిగా ఏడుపు మొదలు పెట్టారు.. అక్కడే, ఇసుకలో.. నేల మీద కూలబడి.
కాలి పోతున్న ఇసుక వేడి అనిపించ లేదు.
వాన్లు తీసుకు వచ్చి పిల్లలని ఎక్కించి, వెనక్కి తీసుకెళ్లి, రేకు గదుల దగ్గర ఆపారు. అబ్బాస్ వచ్చి అందరినీ దింపి, బాత్రూం లోకి వెళ్లి కాళ్లు చేతులు మొహం కడుక్కోమని చెప్పాడు.
చిన్నాకి ప్రతీ జాయింట్ దగ్గరా నొప్పి. మామూలు పిల్లల కంటే బుల్లి మనుషులకి బాల్యంలో కూడా జాయింట్లు కొంచెం బలహీనంగా ఉంటాయి. పెరుగుదల సహజంగా ఉండదు కదా!
ఎప్పుడెప్పుడు తన బొంత మీద వాలి పోయి పడుక్కుందామా అని ఉంది.
బాత్రూం లోకి చిన్నా వెళ్లి, పని ముగించుకోగానే.. టింకూ పరుగెత్తుకుంటూ వచ్చాడు, భోరు మని ఏడుస్తూ.. చిన్నాని గట్టిగా వాటేసుకున్నాడు.
చేతుల నిండా కాళ్ల నిండా ఇసుక.
చేతులు నల్లగా, మధ్య మధ్య ఎర్రగా.. మోకాళ్లు, మోచేతులు గీరుకు పోయున్నాయి. మొహం అంతా కూడా ఇసక.
వాడిని అలాగే తీసుకెళ్లి, బట్టలు విప్పి స్నానం లాగ చేయించాడు చిన్నా. అక్కడున్న పేపర్ టవల్స్ పెట్టి ఒళ్లంతా తుడిచి బట్టలు వేశాడు.
కాస్త తేరుకున్నాడు టింకూ. ఇంకా వెక్కుతూనే ఉన్నాడు.
టిష్యూ పేపర్ తో రక్తం ఉన్న దగ్గర అద్దాడు.
విశ్రాంతి కోసం ఉంచిన చెక్క గది లోకి తీసుకెళ్లి, గోడకానించి కూర్చో పెట్టాడు.
అప్పుడే లంచ్ బాక్స్ లు తీసుకుని అబ్బాస్ వచ్చాడు. హడావుడిగా అందరికీ తలో పెట్టే ఇచ్చి వెళ్లి పోయాడు. టింకూ పరిస్థితి చూడ లేదు.
టింకూకి తినిపించి, తను కూడా తిని.. కాస్త సేద తీరాక అడిగాడు..
“ఇప్పుడు చెప్పు. ఏమయింది? ఒక చోట కూర్చో మన్నా కదా? ఎందుకు లేచావు?”
“వాన్ పక్కన నీడలో కూర్చున్నా చిన్నా! నజీర్ అంకుల్ వచ్చి, గట్టిగా అరుస్తూ, చెయ్యి మీద కొడ్తూ తీసుకెళ్లాడు. వాన్ లో నన్నూ ఇంకో అబ్బాయినీ ఎక్కించి డ్రైవ్ చేసుకుంటూ ఒంటెలు పరుగెత్తే రోడ్ పొడుగూతా అక్కడక్కడ ఆగుతూ నడిపించాడు.”
“ఎందుకు? ఏం చేశారు?”
“వాన్ లో గంపలు పెట్టాడు. ఒంటెలు పేడ వేస్తాయి కదా.. ఆ పేడంతా ఎత్తించాడు గంపల్లోకి. ఎండ.. కాళ్లు మాడి పోయాయి.”
“చెప్పులున్నాయి కదా?”
“చెప్పుల్ని వాన్ లో ఉంచెయ్య మన్నాడు.. అవి వేసుకుంటే త్వరగా నడవలేంట.” మళ్లీ భోరు మన్నాడు టింకూ.
“మరీ రక్తాలేంటీ?” నీరసంగా అడిగాడు చిన్నా.. గొంతు పూడుకు పోయినట్లయి మాట రావట్లేదు..
“తొందరగా చెయ్యండని అరుస్తుంటే.. మధ్యలో చాలా సార్లు పడిపోయా. మోకాళ్లు, మోచేతులు గీరుకు పోయాయి. లేవలేక పోతుంటే వచ్చి ఇక్కడ కొట్టాడు.” వీపు చూపించాడు టింకూ. స్నానం చేస్తున్నప్పుడే చూశాడు చిన్నా, వీపు మీద ఎర్ర చారల్ని.
“ఎందుకంత తొందర పెట్టడం?”
“వెనకాల వేరే ఒంటెలు వస్తాయంట. అవి పేడ తొక్కేస్తాయిట. మేం కదలక పోతే మమ్మల్ని కూడా తొక్కేస్తాయిట. కాళ్లు కాలి పోతుంటే, పరుగు పెడ్తూ పేడ ఎత్తుతుంటే, అర చేతులు కూడా గీరుకు పోయాయి.. ఇసక సూదుల్లా గుచ్చుకుంది చేతులకి.”
“మరి గ్లోవ్స్ తెచ్చుకోలేదా టింకూ?”
“ఇక్కడ కూడా పేడ ఎత్తాలని ఎవరూ చెప్ప లేదు చిన్నా.. అమ్మ కావాలీ.. అమ్మ దగ్గరకెళ్లి పోతా. నన్ను తీసుకు పోవా?” గుండె కదిలేలా ఏడుస్తున్నాడు టింకూ.
నిస్సహాయంగా చూడ్డం తప్ప ఏం చెయ్యగలడు చిన్నా?
దగ్గరగా తీసుకుని, కాళ్లు చేతులూ రాస్తూ.. ఊరుకోబెట్టడానికి ప్రయత్నించాడు.
అలాగే వెక్కుతూ నేల మీద పడుక్కున్నాడు టింకూ.
టింకూ ఒక్కడే ఏడవట్లేదక్కడ. వాడికి పెద్ద కంపెనీయే ఉంది.
అరగంట గడవగానే కిషన్ వచ్చాడు, తన స్నేహితుల్నేసుకుని.
ఆ గదుల దగ్గర అంకుల్స్ కాపలా పెట్ట లేదు వాళ్లకి. బాచ్ తరువాత బాచ్ కి ప్రాక్టీస్ చేయిసున్నారు ట్రాకుల మీద. అదొకటి నయం.
వస్తూనే అందరూ ఏడుపు..
“జుట్టంకుల్ దగ్గర ఎంతో బాగుంది. ఇక్కడికొచ్చినప్పటినుంచీ రోజూ తన్నులే. వచ్చిన రోజే, రాత్రి రెండు గంటలకి లేపేశారు చిన్నా..” సిరాజ్.. తన భాషలో వాపోయాడు.
“తిండి అస్సలు పెట్టట్లేదు. ఎండి పోయిన బ్రెడ్ ముక్కలే.. అడుక్కు తినేటప్పుడే బాగుంది.” కిషన్ భోరుమన్నాడు.
“అసలు ఈ ఫుడ్డే బాలేదు. తైరు సాదం, సాంబారు సాదం ఎప్పటికైనా దొరికేనా?” తమిళ బాలుడు నయీమ్..
“జుట్టంకుల్.. ఇక్కడికి మనల్ని జాగర్తగా చేర్చాలి కనుక, బాగా పెట్టే వాడు. వీళ్లకి మనం ఎలా ఉన్నా ఏమై పోయినా ఫర్లేదు. వాళ్ల పని కావాలి.. పైసలు రావాలి. అంతే..” చిన్నా సర్ది చెప్పాడు.
“మీరు బానే ఉన్నారు కదా? ఏం చేస్తున్నారు?” కళ్లల్లో ప్రాణాలున్నట్లుగా ఉన్న తబ్రీజ్ అడిగాడు.
“మన యజమానిని, మనల్ని అప్పగించిన మానేజర్నీ బట్టి ఉంటుందనుకుంటా. వాళ్లు మంచి వాళ్లైతే మన పని బాగుంటుంది. మా మానేజర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు.. ఇండియన్. చిన్న వాడు.. కష్టాలన్నీ పడ్డ వాడు. అతను హెల్ప్ చేస్తుంటాడు.”
“అయ్యో మాక్కూడా అటువంటి వాడుంటే ఎంత బాగుండేది.. మా మానేజర్ బాడ్.. అసిస్టెంట్ మరీ బాడ్..” కిషన్ కన్నీళ్లు కారుస్తూ అన్నాడు.
“కిచెన్లో హెల్ప్ కి మీకు టర్న్ రాదా?”
“వస్తుంది చిన్నా.. బోలెడు పని చేయించు కుంటారు.”
“పెద్ద షెఫ్ ఉంటాడు కదా.. ఆయన కాళ్లు జాపుకుని కూర్చున్నప్పుడు, దగ్గర చేరి, కాళ్లు పట్టు. కబుర్లు చెప్పు. కొంచె మైనా కరక్క పోడు. అప్పుడు నీ కష్టం కొంచెం చెప్పు. ఎక్కువ టైమ్ అక్కడ గడుపు. ఎప్పడెప్పుడై పోతుందా అన్నట్లుండకు. అదే నీ లైఫ్ అన్నట్లు పిక్చర్ ఇవ్వు. సాధారణంగా ఇది వర్కౌట్ అవుతుంది.” చిన్నా మరి కొన్ని చిట్కాలు చెప్పాడు.
“మీకు ఈ రైడింగ్.. జాకీగా ఉండడం బాగా నచ్చిందనే అనిపించేలా ఉండండి. విసుగ్గా.. ఎందుకొచ్చిందిరా బాబూ అన్నట్లు అనిపించినా, పైకి సంతోషంగా ఉండండి. కష్టమే అనుకోండి… కనీసం ఆ ఏడుపు మానండి. మొహంలో కనిపించ నీయకండి.”
అంతలో పిలుపొచ్చింది చిన్నా టింకూలకి.. వాళ్ల గుంపులోని మిగిలిన పిల్లలు కూడా వచ్చేశారు.
“టైమ్ టు గో..” అబ్బాస్ వచ్చి పిలిచాడు.
“అమ్మయ్య.. ఇంకో ట్రయల్ ఉంటుందేమో అనుకున్నా. హాప్పీ అబ్బాస్ అన్నా.” చిన్నా లేచి, టింకూని కూడా పైకి లేపాడు.
కిషన్ బృందం ఆశ్చర్యంగా చూశారు..
ఇంత హాపీగా ఎలా ఉండ గలుగుతున్నాడో చిన్నా..
చిన్నా నిజంగా హాపీగా ఉన్నాడా?
ఉన్నట్లు కనిపిస్తున్నాడంతే.
మల్లె పందిరి లాంటి ఇంటి వాతావరణం నుంచి.. తనది కానీ, తన ఇంట్లో వాళ్లది కానీ ప్రమేయం లేకుండా బురద గుంట లాంటి చోట్లో వచ్చి పడ్డాడు.
మల్లె పువ్వులాగే సుకుమారంగా.. అమ్మా నాన్నల ప్రేమతో, నాయనమ్మ ఆప్యాయతతో పెరిగిన వాడు మోటు మనుషుల మధ్య, యాంత్రికంగా లాభ నష్టాల లెక్కలతో మాత్రమే పిల్లలని చూసే గుంపులోకి వచ్చి పడ్డాడు.
అసలు వాళ్లు చిన్న పిల్లలనే జ్ఞానమే లేని బండ రాళ్లలో పడ్డాడు.
కానీ.. పుస్తకాలు, కంప్యూటర్, సరస్వతీ టీచర్ నేర్పించిన విజ్ఞానంతో, భగవంతుడిచ్చిన తెలివితో పరిస్థితులను తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ భగవంతుడే ఇచ్చిన అవకరాన్ని తెలివిగా ఉపయోగించుకుని, బైటపడగల అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
చిన్నా పుట్టిన రోజివేళ.
పదకొండేళ్లు నిండుతాయి. తనని తీసుకొచ్చి మూడు నెలలవుతోంది. ఇంటి దగ్గరుంటే ఈ పాటికి, నాయనమ్మ గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తీసుకొచ్చేది.
ఇక్కడ ఎక్కడా గుడే కనిపించదు.. మజీదులు తప్ప. అయినా హలీమ్ ఫామ్ కి తప్ప ఎక్కడికెళ్లాడనీ.. ఇవేళ వెళ్లిన రేస్ ట్రాక్.. అంతే కదా!
అమ్మ పాయసం చేసేది. నాయన కొత్త బట్టలు తెచ్చే వాడు. తనకి బట్టలు చిన్న వైపోతాయనే బాధ లేదు కదా.. బోలెడు బట్టలుంటాయి.
అయినా సరే.. నాయన కొత్త బట్టలు తీసుకొస్తాడు. స్కూల్లో పంచడానికి చాకొలేట్లు తప్పదు.
స్కూల్లో పిల్లలకి తన సమస్య అర్ధమయి పోయింది. సరస్వతీ టీచర్, ఒక రోజు బోర్డ్ మీద బొమ్మలేసి మరీ వివరించింది.
ఒక్క సైజులో తప్ప, చిన్నా మీ అందరి కంటే ఎందులోనూ తక్కువ కాదని చెప్పింది. ఎప్పుడూ వేరుగా చూడ కూడదనీ, ఏడిపించ కూడదనీ మాట తీసు కుంది.
“అంతే కాదు.. మీరంతా వాడిని సాధ్య మైనంత వరకూ ప్రొటెక్ట్ చెయ్యాలి.. ఉదాహరణకి రోడ్ దాటుతున్నప్పుడూ, ముందు ముందు ప్రాక్టికల్స్ చేసే టప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడు ప్రత్యేకమైన సీటు వేసేటట్లూ..” అంటూఎంతో చక్కగా చెప్పింది.
క్లాసులో పిల్లలంతా తనతో ఆరేళ్ల నించీ చదువు తున్న వారే కదా..
“తప్పకుండా చూసుకుంటాం టీచర్..” అని ప్రామిస్ చేశారు.
అందరూ వంగుని చాక్లెట్లు తీసుకుని, హాపీ బర్త్ డే చెప్తారు.
ఏం చేస్తున్నారో అందరూ? సరస్వతీ టీచర్ ఎలా ఉన్నారో?
పాఠాలేం చెప్తున్నారో.. మాత్స్ లో జామెట్రీ లెసన్స్ మొదలు పెట్టారేమో.. మళ్లీ వాళ్లందరినీ చూడగలడో లేదో!
చిన్నాకి కళ్లలోంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి.
అక్కడ బుల్లయ్య, సూరమ్మల పరిస్థితి కూడా అలాగే ఉంది.
నాయనమ్మ పొద్దున్నే గుడికి వెళ్లి పోయింది.
మనవడి పేరు మీర అర్చన చేయించింది. ఎక్కడున్నా వాన్ని క్షేమంగా ఉండేట్టు చూడు తండ్రీ అని వేడుకుంది.
ప్రసాదం తీసుకొచ్చి ఇంట్లో కొడుక్కి, కోడలికీ పంచింది.
“లేవే.. పాయసం చెయ్యి. ఆడు క్షేమంగా ఉంటాడు. ఇక్కడున్నట్లుగానే చేసుకుందాం మనం. అరేయ్.. నువ్వెళ్లి బట్టలట్టుకురా! ఎప్పుడొచ్చినా రాగానే ఏసుకుంటాడు.. ఎలాగా సైజేం పెద్ద మారదు కదా..” అంటూనే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
పక్కింటి జానీ పరుగెత్తుకుంటూ వచ్చింది.
“ఏటయింది అమ్మా..”
“ఇయేల చిన్నా పుట్టినరోజే..” భోరున ఏడుస్తూ అంది సూరమ్మ.
అక్కడే నేల మీద కూలబడింది జానీ..
“ఎక్కడున్నారో.. ఏం చేస్తన్నారో.. మనకెందుకొచ్చిందమ్మా ఈ కట్టం? ఏ పాపం చేశాం?” జానీ కూడా ఏడవ సాగింది.
మస్తానయ్య కిక్కురు మనకుండా ఇంట్లోంచి బైటికెళ్లి పోయాడు.
పోలీసులు కేసు మూసేసారు.. అది కాస్త నయం మస్తానయ్యకి. తన మీదికేం రాలేదు.
కొత్త బిల్డింగు పనులవుతున్నాయి. పునాదులు తీస్తున్నారు. ప్రతీ శని వారం తన కూలీ డబ్బులొస్తున్నాయి.
ఇంట్లో బాగా డబ్బులిస్తుండడంతో జానీ కూడా గొడవ పెట్టటం లేదు. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకెళ్తున్నారు. కడుపు నిండా తింటున్నారు.
మస్తానయ్య అనుకున్నట్లు టింకూ కిడ్నాప్ డబ్బులేం రాలేదు. రాజా బృందం.. అక్కడి నుంచి మకాం ఎత్తేశారు..
కొత్త చోట్లో, కొత్త బేరాలు చూసుకోడానికి.
వాళ్లకి మాత్రం డబల్ డబ్బులొచ్చాయి.. ఇద్దరు కదా!
“లేరా బుల్లీ.. పూలకెల్లు.. ఒక్క రోజు మానేశావంటే నీ బేరాలన్నీ పోతాయి. దగ్గరుండి కాచుకోవాలి. చిన్నాగాడొచ్చేత్తాడు తొందర గానే.. దిగులు పడమాకండి.”
తల్లి మాటలు విని, సూరయ్య దొడ్లో కెళ్లాడు.. తయారవడానికి.
……………………
6

“కామెల్ రేసెస్ బిగిన్..” అరుస్తూ వచ్చాడు అబ్బాస్.
గదంతా తడి బట్ట పెట్టి తుడుస్తున్న చిన్నా చటుక్కున లేచాడు.
“అంటే.. ఏంటన్నా?”
“మనం ఇన్నాళ్లూ వీటి కోసమే శ్రమ పడ్డాం. అసలు చెప్పాలంటే.. ఈ రేసుల కోసమే మన మంతా ఇక్కడున్నాం. ఇన్ని రోజులుగా చేస్తున్న ప్రాక్టీసు ఈ రేసుల కోసమే. అందరూ తమ సత్తా చూపించు కోవాల్సిందిప్పుడే.”
గదిలో ఉన్న మిగిలిన పిల్లలు కూడా వచ్చేశారు.
చిన్నా, టింకూలు అక్కడి కొచ్చి నెల దాటింది.
టింకూ బాత్రూమ్ కి వెళ్లి, కాళ్లు అటూ ఇటూ వేస్తూ, ఈడుస్తూ వచ్చాడు.
అప్పుడే అందరూ హలీమ్ ఫామ్ లో ప్రాక్టీస్ కి వెళ్లి వచ్చారు.
“ఏమయిందిరా? ఎందుకలా కుంటుతున్నావు?” చిన్నాదగ్గరగా వెళ్లి ఆందోళనగా అడిగాడు.
హలీమ్ పర్మిషన్ ఇచ్చాడని టింకూని ఒంటె ఎక్కించాడు నజీర్. అదీ, పిల్లలందరినీ అబ్బాస్ రౌండ్ కి తీసు కెళ్లాక.
టింకూ బెదిరి పోతూ ఎక్కాడు. నజీర్ స్వయంగా దగ్గరుండి సవారీ చేయించాడు. అదీ ఎక్కువ దూరం లేదు. ఒక్కరగంట చేశాడంతే.
అబ్బాస్ కూడా తన న్యూస్ వాయిదా వేసి టింకూ దగ్గరికి వచ్చాడు.
అదే వయసైనా కూడా.. ఎందుకో.. మిగిలిన పిల్లల కంటే టింకూ చాలా సున్నితంగా ఉంటాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ టింకూ ఏడవడం మానేశాడు. ఏడిచీ ఏమీ సాధించలేనని తెలుసు కున్నాడేమో!
గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండి పోయాడు టింకూ.. మాట్లాడకుండా.
చిన్నా టింకూ కాళ్లు చూడ బోయాడు. ఇంకా దగ్గరగా తీసుకుని మూలుగుతూ పక్కకి తిరిగి పోయాడు.
అబ్బాస్, టింకూ కలిసి బలవంతంగా వాడిని తిప్పి, నిక్కరు విప్పి చూశారు. టింకూ కళ్లలో నీటి పొర..
వాడి తొడలు చూస్తుంటే, చిన్నాకి ఏడుపాగ లేదు. వణుకుతున్న చేతులతో సున్నితంగా రాయ బోయాడు. గట్టిగా కేక పెట్టాడు టింకూ.
పల్చని చర్మం చేతిలోకి వచ్చింది. రెండు తొడలూ ఎర్రగా.. గడ్డ కట్టుకుని పోయిన రక్తం బైటికి దుమకడానికి సిద్ధంగా ఉంది.
మర్మాంగాలు నల్లగా కమిలి పోయాయి.
ఎంత నొప్పెడుతోందో కానీ.. టింకూ వెక్కుతూ ఉండి పోయాడు. గట్టిగా ఏడవడం చాత కాని వాడిలా..
కాలి మీద నుంచి కారు వెళ్లిపోతే మూలిగే కుక్క పిల్లలాగ మూలిగాడు.
“చిన్నా! అబ్బాస్ అన్నా..” మూలుగుతూనే, నీరసంగా పిలిచాడు.
“ఏంట్రా?”
“ఇలా దెబ్బ తగిలిందని నజీర్ అంకుల్ కి చెప్పద్దు. చంపేస్తాడు. ముందే చెప్పాడు. ఈ రేసుల్లో కాక పోయినా వచ్చే రేసుల్లో నేను జాకీ అయి తీరాలిట. ఇన్ని రూపాయలిచ్చార్ట మా నాన్నకి.” చేతులు బార్లా చాపి అన్నాడు టింకూ.
అబ్బాస్ కేసి చూశాడు చిన్నా..
“అలాగే చెప్పను టింకూ. ప్రామిస్.” అబ్బాస్ తల తిప్పుకుని వెళ్లి పోయాడు.
“హూ.. వీడు కూడా అంతే కాబోలు.. గుండె బదులు బండ పెట్టుంటాడు దేవుడు.” చిన్నా తిట్టుకుంటూ, కిచెన్ దగ్గరకి పరుగెత్తాడు.
“షెఫ్ అంకుల్..” కిచెన్ అంతా వెతుకుతూ పిలిచాడు.
“ఏంటి సమీర్?” షెఫ్ నాప్కిన్ కి చేతులు తుడుచు కుంటూ వచ్చాడు.
షెఫ్ కి ఇంగ్లీష బాగా వచ్చు. చిన్నా అతనితో ఇంగ్రీష్ లోనే మాట్లాడతాడు. అసిస్టెంట్లతో సైగలే..
“చిన్న కప్ లో ఆయిల్ కావాలి.”
“ఎందుకు.. మళ్లీ ఏమైనా చిట్కా వైద్యమా?”
“అవునంకుల్. స్కిన్ ఊడి పోయి, బ్లడ్ వస్తోంది.. టింకూకి.”
“ఓ.. ఫస్ట్ టైమ్ కామెల్ ఎక్కాడా?”
తెల్లబోయి చూసాడు చిన్నా.
“ఇక్కడ కామన్ ఆ ప్రాబ్లమ్. అందులో సుభానీ కొంచెం డెలికేట్ గా, ఛబ్బీగా ఉంటాడు కదా.”
అవునన్నట్లుగా తలూపాడు చిన్నా. కంట్లోంచి నాలుగు నీటి చుక్కలు షర్ట్ మీద పడ్డాయి.
“తగ్గి పోతుందిలే. ఇదిగో ఆలివ్ ఆయిల్.” చిన్న సీసాలో తీసి ఇచ్చాడు.
పరుగు పరుగున చిన్నా తమ రూమ్ కి వచ్చే సరికి, అబ్బాస్ ఆయింట్ మెంట్ రాస్తున్నాడు.. టింకూని పడుక్కోబెట్టి.
“ఇది యాంటీ బయాటిక్ కూడా. ఇన్ ఫెక్షన్స్ రావు. ఆయిల్ అక్కడ రాయి.” మర్మాంగాలు చూపించాడు.
అబ్బాస్ ని తప్పుగా అనుకున్నందుకు సిగ్గు పడుతూ, అతను చెప్పినట్లు చేశాడు చిన్నా.
“ఈ మాత్ర వేస్తే నొప్పి తెలీదు. వాటర్ తీసుకురా.” మాత్ర వేస్తూండగానే, టింకూ నిద్ర పోతున్నాడు.
“లంచ్ వచ్చినప్పుడు లేపి తినిపించచ్చు. రండి.. మనం టివి రూమ్ లో కూర్చుందాం.” పిల్లలందరూ అబ్బాస్ వెనుకే వెళ్లారు.
చిన్నా ఇంకా తేరుకో లేక పోయాడు.
“అది చాలా కామన్ చిన్నా. తగ్గి పోతుంది. నీ కాళ్లు, థైస్ సన్నగా ఉన్నాయి. అందుకే నీకు రాలేదా ప్రాబ్లమ్. వీళ్లనడుగు.. టింకూ అంత కాక పోయినా కొంచెమైనా వీళ్లకి వచ్చే ఉంటుంది.”
అవునన్నట్లు తలూపారు ముగ్గురూ.
“ఇంతకీ రేసులు..” చిన్నా సర్దుకుని అడిగాడు.
“అవును. రెండు రోజులు.. చాలా ఫేమస్, ప్రెస్టీజియస్ రేసులు. ఎమిరేట్స్ హెరిటేజ్ క్లబ్ వాళ్లు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ క్లబ్ ఛైర్మన్, డిప్యూటీ ఫ్రైమ్ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో జరగ బోతున్నాయి.”
“ఎప్పుడు?” నలుగురూ ఒకే సారి అన్నారు.
“ఇంక సరిగ్గా టెన్ డేస్. మనం కనీసం నాలుగు ప్రాక్టీస్ లు చెయ్యాలి, ఈ లోగా.” అబ్బాస్ ఆలోచిస్తూ అన్నాడు.
“ఆ. పెద్ద రేసులెక్కడవుతాయి? మన రేస్ ట్రాక్ లోనేగా? అదే పెద్దది.. అప్పుడు వెళ్లాం కదా!”
“కాదు. పక్క దేశంలో. ఇక్కడికి టూ హన్డ్రెడ్ కిలో మీటర్లు దూరం. ‘ఆల్ కతమ్’ ఎడారిలో. అక్కడ ఇసుక కుప్పలు బంగారు రంగులో మెరుస్తూంటాయి.”
“ఓ..” ఇసుక రంగుతో పనేం లేదు ఈ జాకీలకి.
అక్కడ.. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాల్చేసే ఎండ లేకుండా ఉంటే చాలు.
ఒంటె ఎక్కేటప్పుడు, దిగాక.. చెప్పుల్లేని కాళ్లతో నడవాలి.
ఏ దెబ్బలూ లేకుండా బైట పడితే చాలు.
“హలీమ్ సాబ్.. సెలెక్ట్ చేస్తారు, మన రేస్ ప్రాక్టీస్ చివరి రోజున. ప్రాక్టీస్.. మన రేస్ కోర్స్ లోనే చేస్తాం. మీరు రోజూ ఎక్సెర్ సైజులు చేస్తుండాలి. చాలా ప్రతిష్ట కలిగిన రేసులు. ఫస్ట్ వస్తే మంచి బహుమానం ఉంటుంది.”
“సరే అన్నా. మేం గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తాం. కాసేపు టివి చూసి.” చిన్నా అందర్నీ కూర్చో పెట్టాడు.
“లంచ్ అయాక వెళ్తాం. రెడీగా ఉండండి.”
అబ్బాస్ వెళ్లి పోయాడు.. నజీర్ తో ఇహెచ్ సి రేసుల గురించి చెప్పటానికి.
అదే మొదటి సారి, చిన్నా టివి రూమ్ కి రావడం.
అదంతా చూసి.. అంత వరకూ ఎందుకు రాలేదా అని విచారించాడు.
చాలా విశాలంగా ఉండడమే కాదు.. చల్లగా కూడా ఉంది.
“మేం రూమ్ కి వెళ్తున్నాం. కాసేపు పడుక్కుంటాం.” రూమ్ మేట్స్ చెప్పేసి వెళ్లి పోయారు..

1 thought on “కలియుగ వామనుడు – 5

Leave a Reply to Geetha Gaddam Cancel reply

Your email address will not be published. Required fields are marked *