March 29, 2024

కౌండిన్య హాస్యకథలు 1 – ఇదేం సరదా

రచన: రమేశ్ కలవల (కౌండిన్య)

ఉద్యోగం రీత్యా గోపాలం ఆ ఊరికి ఈ మధ్యనే ఓ నెల క్రితం వచ్చాడు. పట్నంలో పనిచేసి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి ఈ మోస్తరు పల్లెటూర్లో అంతా కొత్తగా అనిపిస్తున్నాయి.
గోపాలానికి, అతని భార్య కామాక్షికి ఆఫీసువారు ఇచ్చిన పెద్ద పెంకుటింట్లో అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది.
ఆ ఇంట్లో పెరట్లోకి నడవగానే ఎదురుగుండా తులసికోట, ఒక ప్రక్క బావి, దాని ఆనుకోని ఎత్తైన కొబ్బరిచెట్లు కనపడటమే కాకుండా మరో పక్క వరుసగా రకరకాలైన మొక్కలతో ఆ పెరడంతా నిండుగా కనిపిస్తుంది.
అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉండటం మూలానా, పైగా పట్టణానికి విరుద్దంగా ఆ పల్లెటూరు నిశ్శబ్ద వాతావరణానికి అలవాటు పడటానికి ఇద్దరికీ కొంత సమయం పట్టింది. చీమ చిటుక్కుమన్న శబ్థం కూడా వినిపిస్తుంది ఆ ఇంట్లో.
పట్నంలో చేసుకోవడానికి కుదరక పోతే ఏ హాటలుకో వెళ్ళి తినే అలవాటు ఇద్దరికి. ఇక్కడ ఇంటికే వచ్చి వంటచేస్తారని తెలిసి సంతోషంతో ఒకావిడను కుదుర్చుకున్నారు.
కొత్తగా ఓ వారం క్రితం నుండి ఆ వంటమనిషి వచ్చి చక్కగా వంటచేసి పెట్టి వెడుతోంది. కానీ ఆవిడ వచ్చిన నుండి వంటింట్లో సామన్లు కనపడకపోవడమే కాకుండా పెరట్లో ఉన్న బావిలో ఏదోకటి పడిన శబ్ధం రావడంతో గోపాలంకు చెబుదామనుకుంది కానీ కామాక్షికి కుదరడం లేదు.
సాయంత్రం ఆఫీసు అవ్వగానే ఇంటికి వచ్చాడు గోపాలం. ఇలా కుర్చీలో కూర్చున్నాడో లేదో ధడేల్ మన్న శబ్థానికి కామాక్షి ఉలిక్కిపడి కిటికీలోంచి ఒక్కసారి పెరట్లోకి చూసింది. గోపాలం మాత్రం ఇంకా ఆఫీసు ఆలోచనలతో ఆ శబ్ధాన్ని పెద్దగా పట్టించుకొలేదు.
ఇంతలో కామాక్షి కంగారు పడుతూ “ఏవండి బావిలో ఏదో పడినట్లుందండీ. రెండు మూడు రోజుల నుండి ఏవోకటి పడుతున్న శబ్థాలు మీకు చెబుదామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు” అంది
“ఏ కొబ్బరి బోండమో పడి ఉంటుంది” అన్నాడు తీరిగ్గా. కాఫీ సంగతి చూడమన్నట్లు సైగలు చేసాడు.
కామాక్షికి కంగారు తగ్గలేదు ఎందుకంటే ఆయన ఇలా లోపలకు రావడం, ఆ వంటావిడ సాయంత్రం వంటపని ముగించుకొని అలా పెరటిగుండా బయలుదేరడం ఒకే సారి జరిగింది. కాకపోతే ఆవిడ ఇంటి బయటకు వెళ్ళడం గమనించలేదు అందువల్ల కంగారుతో మళ్ళీ గోపాలంతో “కొబ్బరి బోండం పడే శబ్ధం కంటే ఇంకా పెద్ద శబ్ధమే వచ్చిందండి” అంది.
ఆయన ఏమీ పట్టించుకోకపోవడంతో ఆయన దగ్గరకు వెళ్ళి మరీ “అది కాదండి. వంటావిడ ఇందాకా పెరట్లో బావి దగ్గరగా వెళ్ళడం చూసాను. తిరిగి వచ్చినట్లు లేదు…కొంపదీసి..కాలు జారి..” అంటూ సాగతీసేలోగా గోపాలానికి ఒంట్లో కంగారు పుట్టి ఆ పెరట్లోకి బయలుదేరాడు.
ఆ బావిలోకి తొంగి చూసాడు. ఇందాక పడిన దానికి నీళ్ళు కెరటాల అలికిడి కనిపిస్తూనే ఉంది. గోపాలం తలెత్తి ఆ కొబ్బరి చెట్టు వైపుకు చూస్తుండగా కామాక్షి ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ పక్కనే నిలబడి ఆ బావి లోపలకు చూస్తూ “బుడగలు కూడా వస్తున్నాయండి!” అంది. ఆ మాటలకు ఉలిక్కి పడ్డాడు.
“బుడగలు లేవు .. బూడిద గుమ్మడి కాయలు లేవు… నువ్వు అనవసరంగా నన్ను కంగారు పెట్టకు” అన్నాడు కామాక్షి సంగతి తెలిసిన మనిషి కాబట్టి.
కామాక్షి ప్రక్కనే ఉంటే తనకు ఊపిరాడనివ్వదని “ఓ పని చేయి! నన్ను ఆలోచించనీ.. నువ్వు ఈ లోగా ఒక కాఫీ అన్నా పట్రా లేకపోతే ఓ వంద ప్రదక్షిణాలు చేస్తూ ఆవిడకు ఏం జరగకూడదని దణ్ణం పెట్టుకో చాలు” అన్నాడు.
కామాక్షి తులసికోట దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు మొదలుపెట్టి మధ్య మధ్యలో గోపాలంను గమనిస్తూ ఉంది.
గోపాలం కొంత సేపు ఆలోచించాడు. తను ఆ బావిలోకి దిగే పరిస్ధితి కాదు. పోనీ ఆ వంటావిడ పేరు, ఉండే చోటు కనుక్కొని, ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తే కానీ తన మనసు కుదుటపడదని నిశ్చయించుకొని ఆవిడ వివరాలు కామాక్షిని కనుక్కొని “నేను ఆవిడ ఇంటికి వెళ్ళి వస్తాను. నువ్వు ఈ లోగా ఆ బావి జోలికి వెళ్ళకు. కావాలంటే ఇంకో నూరు ప్రదక్షిణాలు చేసుకో” అంటూ బయలుదేరాడు.
గోపాలం వీధిలో అందరినీ అడుగుతూ, రొప్పుతూ ఆ వంటావిడ ఇల్లు చేరుకున్నాడు. ఆయాసంతో వచ్చీ రాని మాటలతో ఆ ఇంట్లో ఉన్న అతనికి జరిగిన సంగతి చెప్పాడు.
అతను తనే ఆ వంటావిడ భర్తనని పరిచయం చేసుకొని, ఆవిడ ఇంటికి ఇంకా సాయంత్రం పని పూర్తి చేసుకొని రాలేదని వెంటనే గోపాలంతో బయలుదేరాడు.
ఇద్దరూ ఇంటికి చేరుకోగానే కామాక్షి తులసికోట చుట్టూరూ నూరు ప్రదక్షిణాలు ముగించి, ఆ బావి చుట్టూరూ కూడా ప్రదక్షిణాలు చేయడం చూసి కామాక్షితో “నువ్వు ముందు వెళ్ళి ఓ రెండు కాఫీ పట్రా” అంటూ ఆవిడ్ని లోపలకు పంపించాడు.
ఆ వంటావిడ భర్త, గోపాలం మాట్లాడుకున్న తరువాత ఆ వంటావిడ భర్త బావిలోకి దిగటానికి సిద్దమై తాడు నడుముకు బిగించాడు. తను దిగుతూ గోపాలాన్ని బావిలోకి చిన్న చిన్నగా తాడును వదలమన్నాడు.
ఇంతలో కామాక్షి కాఫీలతో బయటకు వచ్చింది. గోపాలంని కంగారుగా వెనకనుండి పిలిచి, సైగలతో అటు చూడమనడంతో అటు వైపుకు చూసాడు.
ఆ పక్కన ఆవరణ నుండి వంటావిడ బావి వైపుకు రావడం గమనించాడు. అది చూసిన గోపాలం ఆ కంగారులో తన చేతిలో ఉన్న తాడును కాస్తా వదిలేసాడు. పెద్ద శబ్థం చేస్తూ ఆ దిగిన ఆయన బావి లోపల పడ్డాడు. త్వరగా తేరుకున్న గోపాలం ఎలాగోలా చివరకు ఆ తాడు కొస మొత్తం బావిలో పడిపోకుండా పట్టుకోగలిగాడు. ఆ పడిన శబ్థానికి ముగ్గురూ కలిసి కంగారుగా లోపలకు తొంగి చూసారు.
ఈసారి నిజంగానే బుడగలు రావడం మొదలయ్యే సరికే గోపాలం దీనంగా ఆ వంటావిడ వైపుకు, కామాక్షి వైపుకు అయోమయంగా చూసాడు. ముగ్గురూ కళ్ళార్పకుండా ఆ బావిలోకి చూస్తున్నారు.
“పాపం ఎవరో ?” అంది ఆ వంటావిడ.
“మీకు దగ్గరైనవారే” అన్నాడు గోపాలం ఏం చెప్పాలో తెలియక.
ఆ దిగిన ఆయన బావిలో గాలించి, బయటకు వచ్చి గాలి పీల్చుకొని, లాగమన్నట్లుగా సైగలు చేయగానే గోపాలం ఆయన్ని బయటకు లాగాడు.
తీరా ఆయనను చూసి ఆ వంటావిడ “ఓ మీరా?” అంది. అదొక ఓ సర్వ సాధారణ విషయంలాగా.
గోపాలంకు ధ్యాస ఆయన చేతిలో ఉన్న దాని మీద పడింది. ఆయన చేతిలోంచి దాన్ని అందించడంతో ఎక్కడ లేని సంతోషంతో ఆ వంటావిడను పట్టుకొని “కామాక్షి …లంకెబిందె దొరికింది. ఎంత అదృష్టమో” అన్నాడు.
పక్కనే ఉన్న కామాక్షి గోపాలం వీపు తట్టింది. తేరుకొని ఒక్క సారిగా ఆవిడ్ని వదిలి కామాక్షి వైపుకు తిరిగాడు “ఏదో సంతోషంలో నువ్వనుకోని…” అనబోతుంటే
కామాక్షి చిరుకోపం ప్రదర్శిస్తూ “అదీ మన సొట్టల బిందె. లంకెబిందా నా మొహమా?” అంటూ
“అయినా అది బావిలో ఎలా పడిందో అర్థం కాలేదు.” అంది
ఆ వంటావిడ భర్త తన చొక్కా నీళ్ళు పిండుతూ “అది మా ఆవిడ పనే అయ్యింటుంది. బావి కనపడితే చాలు ఏదోకటి లోపల పడేసి నవ్వుకోవడం ఆవిడకు ఓ సరదా” అని నోరు జారాడు.
“అదేం సరదా? అందుకేనేమో ఓ వారం నుండి కొన్ని సామాన్లు కనపడటం లేదు“ అంది కామాక్షి.
ఆ మాటకు వంటావిడ కామాక్షి చేతిలో రెండు కాఫీలను తీసుకొని నీళ్ళలాగా త్రాగేసింది. మళ్ళీ అవి కూడా బావిలోకి విసురుతుందేమోనని వెంటనే ఆవిడ చేతిలోంచి అవి లాక్కుంది కామాక్షి.
ఇంటికొచ్చిన తరువాత ఇదే గోల సరిపోవడంతో కోపం వచ్చి గోపాలం అమాంతం అతన్ని ఎత్తి మళ్ళీ బావిలోకి దింపాడు. “ఆవిడ పడేసినవన్నీ తీసుకొస్తేనే మిమ్మల్ని పైకి రానిచ్చేది” అన్నాడు.
ఆయన తప్పేది లేక మళ్ళీ బావిలో దిగి అంతా గాలించిడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాలో తోచక ఆ వంటావిడతో “పైనుంచి అప్పుడపుడు కొబ్బరి బోండాలు పడుతుంటాయి. అవి లోపల ఆయన మీద పడకుండా చూసుకునే భాధ్యత మీదే” అన్నాడు. ఆవిడ పైకి చూస్తూ రెండు చేతులు ఎత్తి అప్రమత్తం అయ్యింది అవి గనుక పడితే పట్టుకునేలా”
సమయం తీసుకున్నా మొత్తానికి దొరికిన సామాన్లతో పైకి వచ్చాడు. ఓ బక్కెట్టు గోపాలానికి అందిస్తూ “ఇదిగోండి మీ లంకె బక్కెట్టు.. దాని లోపల లంకె పళ్ళెం, లంకె గ్లాసు వగైరా వగైరా ..”. “అన్నీ ఉన్నాయో లేదో ఓ సారి చూసుకోండి” అని అందించి, వాళ్ళవిడ వైపు తిరిగి దీనంగా “పడేస్తే పడేసావు కానీ ఇకముందు నుంచి చిన్న చిన్న సామన్లు పడేయకు. వెతకడం ఎంత కష్టంగా ఉందో నీకేం తెలుసు… నిమ్మకాయ పులుసు” అన్నాడు.

ఆ వంటావిడ ఆవిడ “మీకే నేనంటే అలుసు…నాకు వంటలన్నీతెలుసు .” అంది బుంగమూతి పెట్టి. ఆవిడకు ఎవరైనా వంటలు గురించి ఏదైనా అంటే పరమ చిరాకు.
వారిద్దరి సంభాషణ గమనించిన గోపాలం ఆయనతో “అంతా బానే ఉంది కానీ… ఇలా ఆవిడ బావిలో సామన్లు పడేయటం, మీరు వాటిని బయటకు తీయడం కొత్త కాదేమో?” అన్నాడు. ఆయన ఇబ్బందిగా నవ్వాడు.
మొత్తానికి వాళ్ళని సాగనంపి లోపలకు వచ్చారు. ఆ సాయంకాలం జరిగిన దానికి అలసిపోయి ఆవిడ చేసినవి ఏమి సరిగా తినకుండానే రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు గోపాలం.
తరువాత రోజు ఉదయం లేచాడు. కామాక్షి కోసం వెతుకుతూ అటూ పెరట్లోకి చూసాడు. ఆవిడ తులసికోట దగ్గర ప్రదక్షిణాల హడావుడిలో ఉండటం చూసి మళ్ళీ మంచంలో వాలాడు.
కొంత సేపట్లో ధడేల్ మని శబ్థం వినిపించింది. ఈ సారి నిజంగానే కొబ్బరి బోండం పడింది.
ఇంకా నిన్న జరిగిందానికి తేరుకోనేలేదు.గోపాలం పెరట్లోకి బయలుదేరి చుట్టూరూ వెతికాడు. కామాక్షి ఎక్కడా కనపడకపోయే సరికే ఆ బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూసాడు. ఇంకేమీ ఆలోచించకుండా ఉన్న పళంగా నిన్న బావిలోకి దిగిన ఆయన కోసం బయటకు పరిగెత్తాడు.
ఆ వంటావిడ ఇంటికి చేరుకొని ఆయనతో “మీరు త్వరగా మళ్ళీ మా ఇంటికి రావాలి” అన్నాడు గోపాలం.
“మళ్ళీ ఏమయ్యింది మా ఆవిడకు?” అని అడిగాడు
“మీ ఆవిడను కాదు. ఈసారి మా ఆవిడ” అన్నాడు ఆయనతో.
ఇద్దరూ కంగారుగా ఇంటికి బయలుదేరుతుంటే దారిలో గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ తెలిసిన వారిలా అనిపించడంతో అక్కడ వాళ్ళిద్దరూ ఆగారు. తీరా చూస్తే కామాక్షి అక్కడ ఉండటంతో గోపాలం ఊపిరి పీల్చుకున్నాడు.
కామాక్షి వాళ్ళ ఇద్దరి కంగారు చూసి, వివరాలు కనుక్కొని “నిన్న అంతా సవ్యంగా జరిగితే గుడిలో ప్రదక్షిణాలు చేస్తానని మ్రొక్కకున్నానండి” అంటూ
“మీరు నిద్ర లేచేలోగా తిరిగి వద్దామనికొని గుడికి వచ్చాను” అంది.
“మరి మా ఆవిడో అన్నాడు” ఆ వంటావిడ భర్త.
పదండి చూద్దాం అంటూ ముగ్గురూ ఇంటికి బయలు దేరారు. ఇంటికి చేరుకుండగానే ఆ వంటావిడ కూడా ఎదురవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ వంటావిడ కామాక్షితో “వంట పూర్తయ్యింది. నేను వెళ్ళొస్తాను” అంది భర్తతో బయలుదేరబోయింది.
“మీరు ఎలాగూ ఉన్నారు ఓ కాఫీ ఇచ్చి వెళ్దురూ?” అన్నాడు గోపాలం.
ఆవిడ కదలలేదు. “పోనీ నువ్వైనా త్వరగా చేసి తీసుకురా కామాక్షి …ముందు కాఫీ త్రాగితే కాని తల నొప్పి తగ్గదు” అంటూ సైగలు చేసాడు.

కామాక్షి వంటగది లోపలకు వెళ్ళింది. అంతా వెతికి “ఏవండి ఫిల్టరు కనపడటం లేదండి” అంది.
ఆ వంటావిడ భర్తతో చిన్నగా జారుకోబోతుండటం గమనించిన గోపాలానికి పరిస్థితి అర్థం అయ్యి వాళ్ళతో “ఆగండి” అన్నాడు.
ఆవిడ వడివడిగా బయటకు నడిచింది. ఆయనను మాత్రం పట్టుకోగలిగాడు గోపాలం.
“ఆవిడను ఆపకండి. మళ్ళీ ఏదోకటి పడేస్తుంది. నేనున్నాను గా తీయటానికి” అన్నాడు ఆ వంటావిడ భర్త.
ఆయనకు అలవాటైన పనే కదా హుందాగా అటు పెరట్లోకి నడిచాడు.
నిన్నటి నుండి చుక్క కాఫీ పడలేదు అంటూ విసుక్కుంటూ తప్పక ఆయన వెనక నడిచాడు గోపాలం.
ఆయన అదృష్టం బాగుంటే కాఫీ తాగే భాగ్యం కలగడం ఖాయం ఇక కామాక్షికి వంట చేయడం తప్పదేమో? ఏది ఏదైనా అలా బావిలో పడేయటం ఏం సరదా? కొంత మందికి అదో సరదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *