అమర్ చిత్ర కథా సృష్టికర్త-అనంత్ పాయ్

 

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు

 

 

చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన బొమ్మల కధల పుస్తకాలు అమర్ చిత్ర కథా సీరీస్ ఆ పుస్తకాల ద్వారా పిల్లలకు రామాయణము, భారతము వంటి పురాణాలను బొమ్మల ద్వారా వారిలో ఆసక్తి పెంచి చదివించేటట్లు చేసి పిల్లలకు పురాణాల గురించి జ్ఞానాన్ని కలుగజేసిన వ్యక్తి అనంత్ పాయ్. 1967లో దూరదర్శన్ లో పిల్లలకు నిర్వహించే క్విజ్ ప్రోగ్రామ్ అందులో పిల్లలు గ్రీక్ పురాణాల గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం మన పురాణాల గురించి కూడా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగేటట్లు చేయాలి అన్న ఆలోచన యువ జర్నలిస్ట్ అయిన అనంత్‌పాయ్  కి కలిగింది.  ఆ ఆలోచన కార్యరూపాన్ని దాల్చి అమర్ కథా చిత్ర సిరీస్ పేరుతో పుస్తకాలు వెలువడ్డాయి. ఈ పుస్తకాలలో భారత రామాయణాల లోని  కధలను అందమైన చిత్రాలతో పిల్లలకు ఆసక్తి కలిగించేలా కధలను చెపుతూ ఈ పుస్తకాలను పాయ్ తయారుచేశాడు.

అనతికాలంలోనే ఈ పుస్తకాలు పిల్లలలో బాగా ప్రాచుర్యాన్ని పొంది జన బాహుళ్యానికి చేరువ అయినాయి. ఈ విధమైన గుర్తింపు పొందిన అనంత్‌పాయ్ “ఫాదర్ ఆఫ్ ఇండియన్ కామిక్స్”గా గుర్తింపును పొందాడు. 2000 సంవత్సరానికి  ముందు  పుట్టిన భారతీయ సంతతి పిల్లలు వారి పెరుగుదలతో పాటు అమర్ చిత్ర కథ  పుస్తకాల రంగుల ప్రపంచములో విహరించే అవకాశము వచ్చింది. అంతకు మునుపు పౌరాణిక కథలు లేదా విశేషాలను తెలుసు కోవాలంటే లైబ్రరీలలో సంస్కృత పుస్తకాలు లేదా ఇంట్లో బామ్మలు, తాతయ్యలు చెప్పే కథలు  తప్ప వేరే దారి లేదు. అందుకే చాలామంది పిల్లలకు భారతీయ సంస్కృతీ వారసత్వ సంపదల గురించి  ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన విధానములో చెప్పే సదుపాయము లేకుండా పోయింది. అమర్ చిత్ర కథ పుస్తకాలు ఆ ఖాళీని పూరించాయి. పిల్లలు ఆ పుస్తకాలను చదవటానికి ఆసక్తి చూపుతూ, అనేక పౌరాణిక అంశాలను విశేషాలను తెలుసుకుంటున్నారు. పౌరాణిక, చారిత్రాత్మక అంశాలే కాకుండా జానపద కథలను ఆనాటి రాజుల గొప్పతనము మొదలైన విషయాలను కూడా తెలుసుకొనే అవకాశము ఈ పుస్తకాలు కల్పించాయి.

బాల పాఠకుల అభిమానాన్ని చూరగొని బాల బాలికలచే “అంకుల్ పాయ్ “గా పిలవబడ్డ వ్యక్తి అనంత్‌పాయ్ ఒక కధకుడు. అతను  ఏ విధంగా భారతదేశంలో పిల్లలచే అభిమానించబడే కామిక్ సిరీస్ సృష్టికర్త ఎలా అయ్యాడో తెలుసు కుందాము

సెప్టెంబర్ 17,1929న కర్ణాటకలోని కర్కాల అనే వూరిలో జన్మించిన అనంత్‌పాయ్ దురదృష్టవశాత్తు రెండేళ్ల వయస్సులోనే అనాధగా మిగిలిపోవటం వల్ల మంగుళూరులో బంధువుల ఇంట పెరిగాడు. ఆ తరువాత కొంతకాలము బొంబాయిలో పెరిగాడు. చిన్నతనంలోనే  సాహిత్యము పట్ల అభిమానాన్ని, ప్రేమను పెంచుకొని భారతీయభాషలను నేర్చుకున్నాడు. స్కూల్ చదువు పూర్తి అయినాక పాయ్ జర్నలిజమ్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ  తన అన్నగారి ప్రోద్బలముతో బొంబాయి యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీలో చేరాడు. కానీ అతని ఆసక్తి వేరే రంగములో ఉండటంవల్ల ఇంజనీరింగ్ విద్యను వదలి టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురిచతమయే ఫాంటమ్, ఫ్లాష్ గార్డెన్ వంటి  అమెరికన్ కామిక్స్(ఇంద్రరాజ్ కామిక్స్)ప్రచురణలో పనిచేసేవాడు.

పాయ్ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఒక టెలివిజన్ షాప్ లోచూసిన క్విజ్ ప్రోగ్రామ్ అతన్ని భారతదేశ  చరిత్ర, పురాణాలను అంశాలుగా తీసుకొని కామిక్స్ గా ఎందుకు తయారు చేయకూడదు అన్న ఆలోచన కలిగించింది. 1967లో ఉద్యోగాన్ని వదలి తన అదృష్టాన్నివెతుక్కునే ప్రయత్నములో అనేకమంది ప్రచురణకర్తలను కలిసాడు. చాలామంది ఈయన ప్రతిపాదనలను లాభసాటి కాదు అని త్రోసిపుచ్చారు. చిట్టచివరకు ఈయన అవిరళ కృషి, పట్టుదల వలన ఇండియా బుక్ హౌస్ అధిపతి మీర్ చందాని ఒక అవకాశము ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. రిస్క్ తీసుకుంటున్నాము అని తెలిసిన పాయ్- మీర్ చందాని టీమ్ చిన్న ప్రయత్నము చేసింది. కానీ వాళ్ళ భయాలకు తగ్గట్టుగానే అమర్ చిత్ర కథ పుస్తకాలను స్కూళ్ళు కొనటానికి ఇష్టము చూపలేదు షాపులవాళ్ళు కామిక్ బుక్స్ అని పెదవి విరిచారు. ఫలితముగా నష్టాలు వచ్చినాయి. పైపెచ్చు ఈ పుస్తకాలు ప్రముఖమైన, పేరుపొందిన  ప్రచురణ సంస్థలనుండి విడుదల కాలేదు కాబట్టి అమ్ముడుపోవు అన్న భయముతో ఏ పుస్తకాల షాపువాడు స్టాక్ పెట్టటానికి అంగీకరించలేదు.

ఇటువంటి విపత్కర పరిస్ధితులలో పాయ్ ఒక అమోఘమైన ప్రయోగాన్నిచేశాడు. అది ఏమిటి అంటే ఢిల్లీలోని ఒక స్కూల్ యాజమాన్యాన్ని ఒప్పించి విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు పిల్లలకు అమర్ చిత్ర కధల పుస్తకాలు ఇచ్చి వారికి చరిత్ర పాఠ్యాంశాలు, మరొక గ్రూపుకు వారి క్లాసు పుస్తకాలతో చరిత్ర భోధన జరిపించాడు. రెండు గ్రూపులను కొన్నాళ్ళ తరువాత పరీక్షిస్తే, అమర్ చిత్ర కధల పుస్తకాల ద్వారా చరిత్ర చదువుకున్నవారు  రెండవ గ్రూపు పిల్లల  కన్నా మెరుగైన ఫలితాలను సాధించారు. దీనికి కారణము అమర్ చిత్రకధల పుస్తకాలలో  బొమ్మల ద్వారా వారు చరిత్ర అంశాలను త్వరగా అర్ధము చేసుకున్నారు. బాగా గుర్తు పెట్టుకున్నారు. ఈ ప్రయోగము మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల పిల్లలలో, తల్లిదండ్రులలో ఈ పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగి, పాయ్ కామిక్ బుక్స్ అమ్మకాలు పెరిగినాయి. ఈ పుస్తకాలు చిత్రాలతో కూడిన పాఠాలతో సన్నివేశాలను వివరించేవి కాబట్టి బాల పాఠకుల ఆసక్తి అభిరుచులను పెంచి పుస్తకాల అమ్మకాలను పెరిగేటట్లు చేశాయి.

అప్పటినుంచి పాయ్ వెనకకు తిరిగి చూసే అవసరమే రాలేదు. అమర్ చిత్ర కథా పేరుతో కొన్ని వందల పుస్తకాలు విడుదల అయి, సంవత్సరానికి 3 మిల్లియన్ కాపీలు అమ్ముడుపోయినాయి. ఇప్పటివరకు 440 టైటిల్స్ తో 100 మిల్లియన్ కాపీలు అమ్ముడు అయినాయి. ఇది రికార్డ్  రెండేళ్ల తరువాత పాయ్ భారత దేశములోని మొట్టమొదటి హాస్య ప్రధానమైన సిండికేట్ ను ఏర్పాటుచేశాడు. దీనిలో పిల్లలకు ఆసక్తి కలిగించే అంశాలను చేర్చాడు. 1978లో పాయ్, పార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్ మెంట్   వర్కుషాపులను ప్రారంభించి కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా కౌమార దశలోనివారికి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను కొనసాగించాడు. 1980లో పాయ్ చిన్నపిల్లల కోసము ఒక మ్యాగజైన్ ను ప్రారంభించి దానిని కూడా అమర్ కథా చిత్ర లాగా పాపులర్ చేసాడు. టింకిల్ అనే ఈ మ్యాగజైన్ సమకాలీన చరిత్ర అంశాలను, ప్రముఖుల జీవిత చరిత్రలను బొమ్మలతో వివరిస్తూ పాఠకుల అనతికాలంలోనే చేరువ అయింది. ఈ మ్యాగజైన్ సైన్స్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులలో   క్విజ్ పోటీలు నిర్వహించేది. ఈ టింకిల్ పత్రికే పాయ్ కి అంకుల్ పాయ్ అనే పేరు సంపాదించి పెట్టింది. టింకిల్ మ్యాగజైన్ లో పిల్లల ఉత్తరాలకు వారి సందేహాలకు అంకుల్ పాయ్ పేరుతో జవాబులిచ్చేవాడు.

పాయ్ ఎల్లప్పుడూ సృజానాత్మక అంశాలపై శ్రద్ద పెట్టి, అటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాడు. పత్రిక లేదా పుస్తకాలలో ప్రచురణలో ప్రతి అంశము పట్ల వ్యక్తిగత శ్రద్ద వహించేవాడు, అందువలననే అయన విడుదల చేసిన ప్రతి పుస్తకము వెనుక బోలెడు పరిశోధన, కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ విధమైన కృషితో 439 అమర్ చిత్ర కథా టైటిల్స్ ను విడుదల చేయగగలిగాడు. అమర్ చిత్ర కథా కుటుంబములోని సభ్యులందరు పాయ్ ని నడిచే విజ్ఞాన బాండారము అని అంటారు. ఎందుకంటే తన దగ్గర పనిచేసేవారు ఏదైనా తప్పులు చేస్తే అప్పటి కప్పుడు సందర్భానుసారంగా ఒక కద  చెప్పి వారి తప్పులను సరిచేసేవాడు. అమర్ చిత్ర కథా పుస్తకాల కాపీలు పెట్రోల్ పంపుల్లో కూడా అమ్మేవారు. సోవియట్ రష్యా నాయకుడు మైఖేల్ గార్బచోవ్ ఒక సంస్కృత శ్లోకానికి అర్ధము చెప్పించుకోవటానికి ఈయనను పిలిపించాడు అంటే ఈయన ఎంత పేరు సంపాదించాడో అర్ధము అవుతుంది.

2007 లో ఇండియా బుక్ హౌస్ ను వేరొక టీమ్ కు అమ్మివేసారు కానీ పాయ్ మాత్రము ప్రధాన కథకుడి పదవిలోనే కొనసాగాడు. ఎముక విరగటం వల్ల జరిగిన సర్జరీ తరువాత అనారోగ్యము వలన గుండెనొప్పి వచ్చి 24 ఫిబ్రవరి 2011లో తనువు  చాలించాడు. అంతకు మునుపు ఒక వారము రోజుల ముందు భారత దేశము యొక్క మొట్ట మొదటి కామిక్ కన్వెన్షన్ లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ఆయనకు ప్రధానము చేశారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తముగా అసంఖ్యాక మైన బాలపాఠకులు ఉన్నారు తప్ప సొంత పిల్లలు ఎవ్వరు లేరు. ఈయన ఫాదర్ అఫ్ ఇండియన్ కామిక్స్ గా కీర్తింపబడ్డాడు.

అయనకు  పిల్లలలో ఎంత ప్రేమ గుడ్ విల్ ఉన్నదో తెలియజేసే సంఘటనను తెలుసుకుందాము. 1994 లోఅమర్ చిత్ర కథా ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరగటం వల్ల చాలా విలువైన పాత పుస్త కాలు పటాలు, మంచి మంచి పెయింటింగ్స్ కాలిపోయినాయి. అప్పుడు టింకిల్ పత్రిక ద్వారా పాత కాపీలను పంపవలసినదిగా రిక్వెస్ట్ చేస్తే పాఠకులు తాము దాచుకున్న కాపీలను, ఒక్క కాపీ కూడా మిస్ అవ్వకుండా అంతవరకూ ప్రచురించబడిన అన్ని కామిక్స్ ల కాపీలను పంపించారు.  పిల్లలు అన్నింటిని జాగ్రత్తగా భద్రపరచటము,  అడిగినప్పుడు ఉచితముగా మళ్ళీ ఇవ్వడము పూర్తిగా పిల్లలకు  అంకుల్ పాయ్ పట్ల గల ప్రేమకు నిదర్శనము. టింకిల్ కామిక్స్ ద్వారా, అమర్ కథా చిత్ర సిరీస్ ద్వారా పిల్లల మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొని పిల్లలకు పౌరాణిక పాత్రల పట్ల అభిమానాన్ని కలుగజేసిన వ్యక్తి అనంత్‌పాయ్.

 

1 thought on “అమర్ చిత్ర కథా సృష్టికర్త-అనంత్ పాయ్

Leave a Comment