*అమ్మేస్తావా అమ్మా*

 

రచన: అభిరామ్

 

 

అయ్య పనికెళ్ళగానే

నీవు కూలికి కదలగానే

ఇంట్లో ఉన్న అంట్లు తోమి

ఊరి చివర నుంచి కట్లు మోసి

మైళ్ళదూరం నడిచి నీళ్ళు తేచ్చిన నేను

నీకు బరువయ్యానా అమ్మ

అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా

 

చదువుల పలక పట్టకుండా

చేలోని సెలికపట్టి

అయ్య వెంట తిరుగుతూ

సాళ్ళు నీళ్ళతో తడిపి

నేను కూడ తడిచిపోయి

పగి‌లిన ప్రత్తిలా నవ్విన నేను

నీకు బరువయ్యానా అమ్మ

అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా

 

బువ్వ తినేటి గట్టుపై

పెరుగన్నపు ముద్దలాంటి నా పిల్లకు

పదేళ్లు నిండలేదంటూ

అందరికి చెప్పింది నువ్వే కదమ్మా

పదేళ్ళైన నిండని నన్ను

తాగి తాగి ప్రక్కూరి అక్కను

చంపేసిన సుబ్బయ్యకు

ఇచ్చేటంత భారమైయ్యానా నేను

నీకు బరువైయ్యానా అమ్మ

అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా

 

ప్రక్కింటి అక్కలాగా

ఎదిరింటి అన్నకు

పేపరు నేనివ్వలేదు కదమ్మా

ఆ వీధి సుబ్బిలా మన వీధి రంగడితో

రాత్రిళ్ళు తిరగలేదు కదమ్మా

పెళ్ళయ్యాకా ఎట్టుండాలో తెలియని నేను

నీకు బరువైయ్యానా అమ్మ

అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా

 

 

 

 

 

2 thoughts on “*అమ్మేస్తావా అమ్మా*

Leave a Comment