June 14, 2024

కంభంపాటి కథలు-2 – ‘చుట్ట’పు చూపు

రచన: కంభంపాటి రవీంద్ర

‘పూర్వం రోజుల్లో మా అక్కా వాళ్ళ కుటుంబం శెలవులకి హైదరాబాద్ వచ్చినప్పుడు అందరం కలిసి భలే సరదాగా గడిపేవాళ్ళం కదండీ. ఇల్లంతా చాలా సందడిగా ఉండేది’ అంది రాధిక.
ఆఫీసు నుంచొచ్చి బాత్రూంలో కాళ్ళూచేతులూ కడుక్కుంటున్న వాళ్ళాయన శ్రీధర్ ’మీ అక్కా వాళ్ళు గుర్తొస్తున్నారా? ఈ ఏడాది శెలవులకి వాళ్ళని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయాల్సింది. ఇప్పటికైనా ఏమొచ్చింది. వాళ్ళకోసారి ఫోన్ చేసి పిలవొచ్చుగా ?. వద్దులే. మీ బావగారికి నేనే ఫోన్ చేస్తానుండు’ అన్నాడు
‘ఏమక్కర్లేదు. వాళ్ల్లు హైదరాబాద్ లోనే ఉన్నారు. కాపోతే మనకి ఏమీ చెప్పలేదు. ఇందాక కూకట్ పల్లి రైతు బజారుకి వెళ్తూంటే చూసాను. రమ్య, వాళ్ళాయన, పిల్లలు అందరూ తెగ నవ్వేసుకుంటూ మంజీరా మాల్ లో కెళ్తున్నారు. ఈ ఊరు వచ్చినట్టు కనీసం మనకి చెప్పను కూడా లేదు’ అంది రాధిక ఏడుపు మొహంతో !
‘ఏమో. వాళ్లకేం ఇబ్బంది ఉందో. మనది చిన్న ఫ్లాట్ కదా. బహుశా మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళు వచ్చి ఉండరు’ అన్నాడు శ్రీధర్
‘భలే చెబుతారండీ. పదిహేనేళ్ళనుంచీ ఇదే ఫ్లాట్ లో ఉంటున్నాం. మూడేళ్ళక్రితం దాకా ప్రతి ఏడాదీ వచ్చేవారు కదా. అప్పుడు లేని మొహమాటం ఇప్పుడెందుకు ?’ బాధగా అంది
‘అదే చెబుతున్నాను. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకో తెలీనప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ? ఈసారెప్పుడైనా కలిసినప్పుడు మాటల్లో మెల్లగా కనుక్కోడానికి ప్రయత్నించు. లేదా ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి’ అంటూ భోజనానికి కూర్చున్నాడు శ్రీధర్
‘మీకు చెప్పడానికి సులువుగానే ఉంటుంది. “ఇంతటితో వదిలేయ్ అని.” . కానీ నా సొంత అక్క ఇలా మనూరొచ్చి కనీసం తెలియపరచకపోతే బాధగా ఉంటుంది కదా’ అంది రాధిక అన్నం వడ్డిస్తూ
‘నిజమే. కాదనను. కానీ ఒకటే అనుకో. మనం మనవైపు నుంచి ఏ తప్పూ లేకుండా వాళ్ళని బాగానే చూసుకున్నాం. అయినా వాళ్ళు మన ఊరొచ్చి కూడా మనకి చెప్పలేదంటే. ఏం చేస్తాం. వాళ్లకేం ఇబ్బందులున్నాయో మరి. ఆ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా తిరిగెళ్లాలని మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకో.’ అన్నంలో దోసావకాయ కలుపుకుంటూ శ్రీధర్ అంటే, రాధిక ఇంక ఏమ్మాట్లాడలేదు.

**********************

ఆ రాత్రి దసపల్లా హోటల్ సూట్ రూములో హాయిగా పిల్లలతో కూర్చుని టీవీ చూస్తున్నరమ్యతో వాళ్ళాయన వెంకట్ అన్నాడు ‘మనం ఇందాకా అనవసరంగా వెళ్ళేమేమో ఆ మంజీరా మాల్ వేపు. ఎక్కడ మీ రాధికా, వాళ్ళాయన కనిపిస్తారేమోనని తెగ టెన్షన్ పడ్డాను’
‘మీరు మరీనండి. మా మరిదిగారేమైనా మీలాగా మాంఛి ఆఫిసర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడేంటీ ? ఆఫ్టరాల్ ఓ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్. అంతే. మాల్ మొహం తెలిసిన మొహాలేనా అవి ?. పైగా వాళ్ళింటికెళ్ళేమంటే వాళ్ళనీ మనతో తిప్పాలి. మనకదో ఖర్చు.’ అని రమ్య విసుక్కుంటే, వెంకట్ అన్నాడు ’నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్నేళ్లూ వాళ్ళింటికే వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడలా తీసిపడేస్తావేమిటి ?’
‘ఓ రాకెట్ పైకెళ్తూ ఉంటే అనవసరమైనవి ఒక్కొక్కటీ వదిలేస్తూ పైకెగురుతుంది. మనం కూడా జీవితంలో పైకెదుగుతున్నప్పుడు ఇలాంటి పనికిమాలిన చుట్టరికాలు వదిలిపడేయాలి. ఆ దేవుడి దయవల్ల మీరో పెద్ద ఆఫీసరైయ్యారు. అలాంటప్పుడు మీకో లెవెలుండాలి కదా. హైదరాబాద్ వెళ్ళేం. దర్జాగా దసపల్లా హోటల్లో ఉన్నాం అంటే బావుంటుందా లేక కూకట్ పల్లి రైతు బజారు వెనక సందులో ఉన్న మా తోడల్లుడి రెండు బెడ్ రూం అద్దింట్లో ఉన్నాం అంటే బావుంటుందా ?’ అడిగింది రమ్య
నిజమేనన్నట్టు తలపంకించి ఊరుకున్నాడు వెంకట్ !

*****************

ఆ తర్వాత రెండు రోజులూ రాధిక తనకేమైనా రమ్య వాళ్ళూ ఫోన్ చేస్తారేమో, ఇవాళ మీ ఇంటికొస్తాం అని చెబుతారేమో అని చాలా ఆత్రుతగా ఎదురుచూసింది. రమ్య నుంచి తనకే ఫోనూ రాలేదు. ఆ రాత్రి మళ్ళీ భర్త తో చెప్పింది ’మా అమ్మా, నాన్నా పోయింతర్వాత తనే నాకన్నీ అనుకున్నా. చూసారా. కనీసం ఈ ఊరొచ్చి మనకి ఫోన్ కూడా చెయ్యలేదు. పైకి ఏడవలేదు కానీ ఏడుపొచ్చేస్తూంది’

‘నీకు ఏడుపొచ్చిందనుకో. మనస్ఫూర్తిగా ఏడ్చెయ్యి, నేనేమీ ఆపను . హాయిగా నవ్వగలగడం, మనస్ఫూర్తిగా ఏడవడం కన్నా విలువైన ఆస్తులు లేవని నా అభిప్రాయం’ అన్నాడు శ్రీధర్
కాసేప్పటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ ’హమ్మయ్య. ఇప్పుడు మనసులో దిగులు తగ్గి హాయిగా ఉంది’ అంది రాధిక
***************

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రాత్రి ఏడవుతూంది. వెంకట్ తెగ కంగారుగా జేబులన్నీ వెతికేసుకుంటున్నాడు. రమ్య మొహం పాలిపోయివుంది.
‘అంత కేర్లెస్ గా ఎలా ఆటో దిగేరండీ?. టిక్కెట్లు, ఫోను, మీ క్రెడిట్ కార్డులు అన్నీ ఆ క్యాష్ బ్యాగులో ఎందుకెట్టేరు ? అదేమైనా కూరల బుట్టా ? అన్నీ వెరైటీలు ఒకే చోట గుమ్మరించడానికి ?’ అంటూ ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది రమ్య
‘అసలు దీనికి నువ్వే కారణం మమ్మీ. హాయిగా స్టేషన్ దాకా క్యాబ్ లో వస్తూంటే నువ్వే మధ్యలో ఆ పారడైజ్ దగ్గర బిర్యానీ పాకెట్ అంటూ అక్కడ దింపించి, అక్కణ్ణుంచి పక్కనే అంటూ ఆటో ఎక్కించేవు. ఇప్పుడా ఆటోవాడు మన కాష్ బాగ్ తో ఎటో వెళ్ళిపోయేడు’ అంటూ ఇంతెత్తున రమ్య కూతురు దివ్య ఎగిరితే నిజమేనన్నట్టు తలూపేడు వెంకట్
‘అవును అందరూ నన్ను చూసి ఏడవండి. తర్వాత ఏం చెయ్యాలో మటుకూ ఆలోచించొద్దు’ అని రమ్య అంటే ’చేసేదేముంది. మీ చెల్లెలింటికి ఫోన్ చేసి విషయం చెబుదాం. కొంచెం డబ్బులిస్తే ఊరెళ్ళిన వెంటనే తిరిగి పంపిద్దాం’ అని వెంకట్ అన్నాడు
‘అసలు మిమ్మల్ని ఆఫీసర్ చేసిన ఆ మహానుభావుడికి దణ్ణమెట్టాలి. కొంచెం బుర్ర వాడండి. ఇప్పుడందరం వెర్రి మొహాలేసుకుని క్షమించండి తప్పైపోయింది అంటూ వాళ్లకి చెబుతామా ఏమిటి ?. మీరొక్కరే ఆఫీసుకొచ్చినట్టు. ఇక్కడ మీ పర్సు పోయినట్టు, అబద్ధమాడి మా మరిది దగ్గర డబ్బులుచ్చుకోండి. ఆ తర్వాత మన పాట్లేవో మనం పడదాం’ అంది రమ్య
‘మరి అంతదాకా మీరెక్కడ ఉంటారు?’ అని వెంకట్ అడిగితే ’ఏం చేస్తాం. నేనూ పిల్లలూ ఏ ఆటో వెనకో నుంచుంటాం అతనెళ్ళిపోయేదాకా’ అంది రమ్య

***************

వెంకట్ తన తోడల్లుడైన శ్రీధర్ కి ఫోన్ చేసి’ఇలా ఏదో ఆఫీస్ పని మీద హైదరాబాద్ వస్తే డబ్బులు పోయేయని, కొంచెం స్టేషన్ దగ్గరికొచ్చి ఓ పదివేలు సర్దితే ఊరెళ్ళిన వెంటనే పంపిస్తానని చెబితే ’అయ్యో తప్పకుండా’ అంటూ, శ్రీధర్ వెంటనే బయల్దేరేడు.
‘మా అక్క ఆ పక్కనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. దాని మొహం చూడాలని ఉంది. నేనూ వస్తాను.’ అని రాధిక పిల్లల్ని పక్క ఫ్లాట్ లో వాళ్ళకి అప్పజెప్పి శ్రీధర్ తో స్టేషన్ కి బయల్దేరింది.
స్టేషన్ బయట వెంకట్ ని దూరం నుంచి చూసిన రాధిక బైక్ దిగి ’మీరు వెళ్ళండి. ఏమవుతూందో నేను దూరం నుంచి చూస్తూంటాను. అతను వెళ్లిపోయిన తర్వాత నా సెల్ కి ఫోన్ చెయ్యండి. నేను వచ్చేస్తాను’ అంది
బైక్ దిగిన రాధిక రోడ్డుకి అవతలవేపు అన్నివైపులా చూసుకుంటూ గబగబా నడుస్తూంటే దూరంగా ఓ ఆటో వెనకనుంచి పిల్లలతో దాక్కుని, వెర్రిమొహం వేసుకుని దూరంగా మాట్లాడుకుంటున్న శ్రీధర్, వెంకట్ ని చూస్తున్న రమ్య కనిపించింది. రమ్య కంటపడకుండా ఆ షాపుల రద్దీలో వాళ్ళవేపు రాధిక నడుస్తూంది, అలా దాక్కుని దాక్కుని చూస్తున్న రమ్యని చూస్తూంటే నవ్వొస్తూంది తనకి.
*****
షకీల్ కి ఆ సాయంత్రం నుంచి ఒక్క గిరాకీ కూడా తగల్లేదు. ఎవడైనా ఆటో ఎక్కుతాడని చూస్తూంటే ప్రతీ ఒక్కడూ ఓలా, ఊబరు, మరీ కాదంటే మెట్రో, తప్ప తన ఆటో కేసి ఎవ్వడూ చూడ్డం లేదు. ఒక్క గిరాకి తగిల్తే చాలు, ఇంటికెళ్లి పడుక్కోచ్చు, సాయంత్రం నుంచి ఇక్కడే ఎండలో ఉండిపోయేననుకుంటూ, చేతిలో ఉన్న చుట్ట చిరాగ్గా విసిరేస్తే అది కాస్తా ఆ పక్కనే నుంచునున్న ఎద్దుకి తగిలి చిరాగ్గా కాస్త ఆటో వెనక్కి జరిగి, ఒక్కసారి బర్రున అంత పేడ వేసేసింది. తన చీర మీద ఆ పేడంతా పడేసరికి, ఏడుపొచ్చేసింది రమ్యకి.
‘ఛీ ఛీ. అమ్మ చీరంతా బఫెలో పాట్టీ’ అంటూ పిల్లలు దూరంగా జరిగేసరికి, బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటున్నరమ్యతో ’ఫర్వాలేదక్కా! ముందు ఆ షాపు దగ్గిరికెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. కడుక్కుని, ఆ తర్వాత ఏడుద్దువు’ అని అంటున్న రాధికని చూసి ఎందుకేడవాలో కూడా తెలీని ఓ విచిత్రమైన స్థితిలో ఉండిపోయింది రమ్య !

6 thoughts on “కంభంపాటి కథలు-2 – ‘చుట్ట’పు చూపు

 1. మళ్ళీ చివరికి కధ తిప్పేసారుగా , సాహో

 2. బావుంది. .
  తమ పరిస్థితి, పక్కవాడి పరిస్థితి కన్నా కొద్దిగా మెరుగయిందంటే, కళ్ళు నెత్తిమీద పెట్టుకునేవారు కోకొల్లలు.

 3. మంచిపని అయ్యింది. ధనమూలమిదం జగత్! అని అననే అన్నారు కదా! మా ఒక దొడ్డమ్మ పిల్లలు పల్లెటూర్లలో పెరిగి అక్కడే సెటిల్ అయ్యారు. వెర్రిఅభిమానాలు. పెళ్లిళ్లకు మూడురోజుల ముందే అభిమానంగా వచ్చేసేవారు. చిన్నతనంలో మేము కాస్త విసుక్కున్నట్టు గుర్తు. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుతో తల అవనతం అవుతుంది. మనమేం గొప్ప ? ఏవిధంగా గొప్ప? అని. వాళ్లు ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తారు. కడుపునిండా పెట్టి, డబ్బాల్లో అప్పచ్చులు పెట్టి మరీ పంపుతారు మమ్మల్ని.

 4. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్న మాట నిజం కాదని అందంగా చెప్పారు. మీరెంత మెత్తగా చెప్పినా కొందరికి చెంపమీద కొట్టినట్టవుతుంది.. ఎందుకో మరి.

 5. భలే ..భలే..ఇలా వెంటనే నేల మీదకి లాగేసే సంఘటనలు దేవుడు అందరికీ ప్లాన్ చేస్తే ఎంత బాగుంటుంది..
  ఎంజాయ్ చేసాను..
  వసంత లక్ష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *