June 14, 2024

ఒక చిన్నారి చెల్లి .. 2

రచన: అనామిక

తాయిలం కొనుక్కున్నాను కానీ ఒక్కరోజులో తినేస్తే ఐపోతుంది.అమ్మ రోజూ డబ్బులివ్వదు గా. ఏం చెయ్యాలి? కొంచెం దాచుకుంటే? అమ్మో! ఎవరైనా తినేస్తారేమో! దాచినా ఎవరికీ కనబడకుండా దాచాలి. చాలా సేపు ఆలోచించి కొంచెం పీచు మిఠాయి తిన్నాను. జీడిపాకం తో చేసిన పిల్లి బొమ్మ తినేసాను.వాచీ మాత్రం దాచుకోవాలనుకున్నాను. చిన్నన్నయ్య పాత కంపాస్ బాక్స్ నా బాగ్ లో దాచుకున్నాను. బలపాలు పెట్టుకుందుకు.

ఆ బలపాలు తీసి ఒక చిన్న కాగితం లో పొట్లాంకట్టి, నేను కట్టుకున్న పరికిణీ తో ఆ కంపాస్ బాక్స్ శుభ్రంగా తుడిచాను. అందులో పీచు మిఠాయి, జీడి పాకం వాచీ దాచుకున్నాను. అది కూడా ఎవరూ చూడకుండా మా క్లాస్ పాక వెనకకి వెళ్ళి. ఇంటికెళ్ళి బధ్రంగా దాచాలి అనుకున్నాను.

స్కూల్ అయ్యేదాకా ఆగడానికి కూడా మనసు ఆగటం లేదు.మొత్తానికి స్కూల్ అయ్యాక ఇంటికెళ్ళి, కంపాస్ బాక్స్ ఎక్కడ దాచాలో ఆలోచించాను. మూల ఉన్న పెద్ద గదిలో బియ్యం డ్రమ్ము పెద్దది ఉంది. అక్కడ అమ్మా,నాన్నా పడుకుంటారు.ఆ గదిలోకి ఎక్కువగా ఎవ్వరూ రారు. నాన్నగారికి ముద్దు వచ్చినప్పుడు నన్ను ఆయన పక్కలో పడుకోబెట్టుకునేవారు. అలా పడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో?

బియ్యండ్రమ్ము ఒక పెద్ద పీట మీద ఉండేది.ఆ పీట కింద పెడితే ఎవ్వరూ చూడరు. ఎవ్వరూ లేనప్పుడు కంపాస్ బాక్స్ దాని కింద దాచేసాను.

ఐనా భయం ఎవరైనా తీసి తినేస్తేనో? అస్తమానూ ఆ గదిలోకి వెళ్ళడం చూసిన అమ్మ అడగనే అడిగింది. “ఏముందే ఆ గదిలో అన్నిసార్లు వెడుతున్నావు”అని. అమ్మో చెపితే ఇంకేమైనా ఉందా !

మర్నాటి దాకా ఆ తాయిలం దాచుకోవాలిగా మరి..స్కూల్లో చేరాక ఇన్నాళ్ళకు తాయిలం తీసుకెళ్ళే అవకాశం దొరికింది.అప్పుడప్పుడు ఆవకాయ డొక్క అమ్మ చూడకుండా కడిగేసి ఎంగిలి, అంటు,సొంటు అంటుందిగా అందుకని తీసుకెళ్ళేదాన్ని. ఆవకాయ డొక్క అని వెక్కిరిస్తారని చిన్న తెల్లగుడ్డలో చుట్టి ఏదో అపురూపమైన వస్తువులా ఫోజ్ ఇచ్చి మరీ తినేదాన్ని.అదన్న మాట.
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి రోజూ కన్నా తొందరగా లేచాను. అమ్మ కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటోంది.

“ఏమయ్యిందే ఇంత తొందరగా లేచావు? నిద్ర పట్టలేదా? రోజూ పదిసార్లు లేపితే కానీ లేవవు కదా!” అంది.

“ఏం లేదు ఊరికేనే”అంటూ నీళ్ళ గదిలో ఉన్న పళ్ళపొడి చేతిలో వేసుకుని గోలెంలో ఉన్న నీళ్ళు చెంబుతో ముంచుకుని పెరట్లో ఉన్న గట్టు మీద కూర్చున్నాను. అక్క లేస్తే పోటీకి వస్తుంది. నాకన్నా పెద్దది కదా! అన్నిటికీ అధారిటీ.

అది చూడకుండా దాని వస్తువులు వాడుకోవడం నాకు సరదా.అప్పుడప్పుడు దాని ఓణీలు కూడా చుట్టబెట్టుకుంటాను.

మొహం కడుక్కుని వచ్చేసరికి అమ్మ తనకీ నాన్నగారికీ కాఫీ కలుపుతోంది.ఇంట్లో నాకొక్కర్తికే పాలు. అందులో కొంచెం నీళ్ళు పోసి ఒక్క చుక్క కాఫీ వేస్తుంది.అప్పటికి మా ఇంట్లో బోర్నవిటా తెలియదు. కోకోమాల్ట్
అని కొంతమంది గొప్పవాళ్ళ పిల్లలు తాగేవారుట. ఒకసారి అమ్మ నాన్నతో చెప్పడం విన్నాను. ఒక డబ్బా
చిన్నదాని కోసం తెండి” అని. నాన్న నవ్వి “అలాగే” అనేవారు.లేదు అన్నమాట ఆయనకు ఇష్టం ఉండేది కాదుట. అది కొంచెం పెద్దయ్యాక తెలిసింది.

అమ్మ ఇచ్చిన పాలు తాగేసి గబగబా స్నానం చేసేసాను. తాయిలం ఎలా ఉందో ఒకసారి చూడాలని ఉన్నా అందరూ అడుగుతారని భయం.
ఎనిమిది దాటాక అక్కని చద్దన్నం పెట్టమంది అమ్మ. ఒక కంచం తీసి కాస్త తరవాణి అన్నం పెట్టి.కొద్దిగా మాగాయ వేసింది అక్క. గబగబా అన్నం తినేసాను.
“అక్కా జడ వెయ్యవా?” అన్నాను. అక్క ఏ మూడ్ లో ఉందో “నీకు ఇవ్వాళ వేరే రకం జడ వేస్తాను”అంది.
బహుశా తన స్నేహితురాలి దగ్గర నేర్చుకుని ఉంటుంది.అది నా మీద ప్రయోగం.
కానీ అక్క జడ చాలాబాగా వేసింది. ఆ తరువాత మా స్కూల్లో కూడా అందరూ తెగ మెచ్చుకున్నారు. స్కూల్ కి తయారయ్యి ఎవరూ చూడకుండా డ్రమ్ కింద ఉన్న కంపాస్ బాక్స్ తీసి తెరిచి చూసాను. ఒక్కసారిగా ఏడుపు వచ్చింది.
పీచు మిఠాయి అసలు కనబడ లేదు. గులాబీ రంగులో చిన్న చిన్న పొక్కుల్లా డబ్బా అంతా నిండి ఉంది. జీడిపాకం తో చేసిన వాచీ వేడికి కరిగిపోయి అది వాచీ వా మరొకటో తెలియకుండా ఉంది.

అప్పుడే అక్కడకు వచ్చిన అక్క ఏడుస్తున్న నన్ను చూసి “ఏమయ్యిందే” అని అడిగింది.ఏడుస్తూ జరిగింది చెప్పాను.
“పిచ్చి మొహమా! పీచు మిఠాయి వెంటనే తినెయ్యాలి. అది గాలితో ఉంటుంది ఆ గాలి పోగానే ఏమీ మిగలదు ఇంక జీడిపాకం వేడికి కరిగిపొతుంది.అన్నీ ఒక్కరోజు కొనుక్కునే బదులు రెండు రోజులు కొనుక్కోవాలసింది”.

నా అజ్ఞానానికి ఏడుపు వస్తున్నా ఏం చెయ్యాలో తెలియక పరికిణీతో కళ్ళు తుడుచుకున్నాను.అక్కకి ఏమనిపించిందో “పోనీలే ఏడవకు ఈసారి అమ్మతో చెప్పి మళ్ళీ డబ్బులిప్పిస్తాలే.ఇప్పుడు మాత్రం ఆ జీడిపాకం కూడా తినకు. ఆ డబ్బా తుప్పు దానికి అంటుకుని ఉంటుంది” అంది.
అక్క అలా అనేసరికి నా బాధ ఏమని చెప్పను. ఎంత ఆపుకున్నా కన్నీళ్ళు ఆగటం లేదు. అపురూపంగా దొరికిన తాయిలం అలా ఐతే ఎవరికైనా ఏడుపు ఆగుతుందా?అందులో చిన్నపిల్లలకు.

అన్నట్లు చెప్పడం మరిచాను. నేను నాలుగేళ్లు దాటాక ఎప్పుడూ గౌన్ వేసుకోలేదు. అమ్మ కు ఇష్టం ఉండదు.ఇంచక్కా పరికిణీ ఐతే కాళ్ళు కనబడవు అనేది.నాన్నేమో బట్ట తక్కువవుతుంది అనేవారు. అమ్మేమో గౌను పొట్టి ఐపోతే మళ్ళీ కొత్త గౌను కుట్టించాలి అనేది.పరికిణీ ఐతే లోపల ఫిల్ట్ వేస్తే రెండు మూడేళ్ళు వాడుకోవచ్చని ఆవిడ అభిప్రాయం

అలా నేను చిన్నపిల్లప్పుడే పరికిణీల్లోకి మారిపోయాను.కానీ మా స్కూల్లో అందరూ గౌన్లే.నేను తప్ప.కన్నీళ్ళు తుడుచుకుని,పలకా బలపం తీసుకుని స్కూల్ కి వెళ్ళాను. స్కూల్ ముందర ఆ పీచు మిఠాయి వాడిని చూడగానే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు.కానీ అందరూ చూస్తారని మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాను. నా బొడ్లో రుమాలు ఉంది.
రుమాలంటే కొన్న ది కాదు.అమ్మ బట్తలు పాడుచేసుకుంటామని. నాన్నగారి పాతపంచెలు చింపి అంచులు కుట్టి రుమాళ్ళ లాగానూ, కొంచెం పెద్ద బట్టలు రాత్రి మంచం ఎక్కేముందు కాళ్ళు కడుక్కుని తుడుచుకుందుకు తయారుచేసేది.

కొత్త పరికిణీ కట్టుకున్నా కింద కూర్చున్నప్పుడు ఇలాంటి బట్ట వేసుకుని కూర్చోవాలి.పరికిణీ మాసిపోతుంది కదా మరి.
మొత్తానికి ఏడుపు ఆపుకుని స్కూల్ లోపలికి వెళ్ళాను. ఆ తరువాత అందరి తో ఆటల్లో మాష్టారు చెప్పే
పాఠంతో నా తాయిలం సంగతి మర్చిపోయాను..

మా ఐదో అన్నయ్య తాను కొంచెం తెలివైనవాడని అనుకునేవాడు.అమ్మా నాన్నా కూడా అలాగే చూసేవారు. ఆ తెలివేమిటో నాకెప్పుడూ అర్ధం కాలేదు.క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు.అలా ఐతే నేనూ క్లాస్ లో ఫస్ట్ వచ్చి తెలివైనదాన్నని నిరూపించుకోవాలని అప్పుడప్పుడు అనుకునేదాన్ని.

అందుకని అన్నయ్య ఏమడిగినా అమ్మానాన్నా కాదనేవారు కాదు.తాననుకున్నది అయ్యేదాకా అమ్మని సతాయించేవాడు. అమ్మ కోపం వచ్చినప్పుడు “ఏమిట్రా సైంధవుడిలా తగులుకుంటున్నావు”అనేది. నా కెందుకో ఆ పేరు తెగ నచ్చేసింది. అందుకని ఈ నా కధ లో ఈ అన్నయ్య పేరు సైంధవుడనే చెప్తాను.

ఎందుకో ఈ సైంధవుడన్నయ్య కూ నాకూ ఎప్పుడూ పడదు.అమ్మ అన్నట్లు ఎప్పుడూ నా వెనకాల సైంధవుడిలాతగులుకుంటాడు. ఇలా చెయ్యద్దు అలా చెయ్యద్దు అంటూ .అసలు మన కన్నా ముందు పుడితే అజమాయిషీ చెయ్యాలా?
అసలీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల మీద ఇంత నిఘా ఎందుకు పెడతారో.వాళ్ళ ఇష్టమున్నట్లు ఉండనివ్వచ్చు కదా! చిన్నపిల్లల కు అందరూ శత్రువులే,అమ్మా,నాన్నా, అన్నయ్యలు, అక్కయ్యలు, బాబయ్యలుంటే వాళ్ళు పిన్నులు,అత్తలూ.ఎంతసేపూ ఇలా చెయ్యకు అలా చెయ్యకు అంటూ.

ఏం వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అల్లరి చెయ్యలేదా? పిల్లలు అల్లరి చెయ్యరా? నేను అల్లరి అస్సలు చెయ్యను.ఐనా పాడయిపోయిన కాగితం చింపుతే ఎందుకే ఆ కాగితం చింపి పోగులు పెడుతున్నావు అంటారు. పెరట్లో పుల్ల ముక్కలు ఏరుకొచ్చి ఆడుకుంటే ఇంటి నిండా చెత్తపోస్తున్నావు అంటారు.

బొమ్మలు కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేవు. అక్కకు మూడ్ బాగున్నప్పుడు తాటాకు బొమ్మ చేసి ఇచ్చేది.దానికి చీర కట్టి జాకెట్ట్ ఎలా వెయ్యాలో తెలియక పమిట కప్పేదాన్ని. ఆ చీర కోసం కూడా మా వీధి చివర ఉన్న టైలర్ దగ్గరకు వెళ్ళి గుడ్డముక్కలు తెచ్చేదాన్ని.అక్కని అడిగితే దానికి జాకెట్ కుట్టడం వచ్చు.కానీ దానికి మూడ్ లేకపోతే నన్ను కసురుకుంటుంది.అమ్మకి తెలియకుండా నవల పుస్తకంలో పెట్టి చదవాలిగా.

వేసవి సెలవల్లో బొమ్మల పెళ్ళిళ్ళు. చేసేవాళ్ళం .మా ఇంట్లో కాదు మా స్నేహితుల ఇళ్ళల్లోనే బొమ్మల పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయో? ఇంచక్కా కొంత మందిమి ఆడపెళ్ళివారిగా కొంత మంది మగపెళ్ళివారిగా విడిపోయి, ఎవరి దొడ్లోనైనా పువ్వుల చెట్లు ఉంటే అవన్నీ కోసి మాలలు కట్టడం రాదు కదా అందుకని సూది దారం పెట్టి గుచ్చేవాళ్ళం.
ఎవరింట్లో బొమ్మల పెళ్ళి చేస్తే వాళ్ళ అమ్మలు మాకు తినడానికి ఏదైనా చేసేవాళ్లు.నేనెప్పుడూ ఏదీ తెచ్చేదాన్ని కాదు. ఒకసారి ఇందిర అననే అంది. “ఇదెప్పుడూ వుత్తి చేతులతో వస్తుంది.ఏమీ తెయ్యదు”అని.
దానికి ఎన్నిసార్లు “తెయ్యదు” అనకూడదు అది తప్పు అన్నా వినిపించుకోదు. దానికి సరిగా మాటలే రావు.పోట్లాటకు మాత్రం ముందు ఉంటుంది.
ఈసారి ఎలాగైనా నేనూ ఏదైనా తేవాలి అనుకుని అమ్మను వెళ్ళి అడిగాను. అమ్మ ఏ కళనుందో అలాగే పులిహార చేసి ఇస్తాను లే కారం తక్కువ వేసి .మీరు పిల్లలు తినలేరుగా అలాగే గెల వేస్తే అరటిపళ్ళు కూడా ఇస్తాను” అంది. నాకెంత ఆనందం వేసిందో.అవన్నీ పట్టికెళ్ళి ఆ కజ్జా కోర్ ఇందిర కి చెప్పాలి నేనూ తెచ్చాను చూడు అంటూ.
అన్నట్లుగా అమ్మ పులిహార చేసి డబ్బాలో పెట్టి, అవి తినడానికి పెరట్లో బాదం చెట్టుకు ఉన్న ఆకులు కూడా కోసి ఇచ్చింది.అరటిపళ్ళు రెండు అత్తాలు ఒక గుడ్డ సంచీలో పెట్టి, అన్నయ్యను పిలిచి ఇవన్నీ మా స్నేహితురాలింటికి పట్టికెళ్ళమని,నన్ను కూడా సైకిల్ మీద దింపి రమ్మని చెప్పింది.
అన్నయ్య సైకిల్ సీట్ మీద కూర్చుంటే మహారాణిలాంటి ఫీలింగ్ అక్కడికి నేనేదో గొప్ప అయినట్లుగా అనిపించింది.దానికి కారణం, వాళ్ళందరూ నడిచే వస్తారు. ఒక్క కామాక్షికి కారుంది కానీ అది కూడా ఎప్పుడూ నడిచే వస్తుంది.
నేను తెచ్చిన పులిహార, అరటి పండ్లు చూసి అందరూ సంతోషించారు. ఇందిర మొహం మాత్రం మాడిపోయింది.దాన్ని ఏదేదో చాలా అనేద్దామనుకున్నాను కానీ ఏమీ అనలేదు.

బొమ్మల పెళ్ళి మొదలయ్యింది. తలంబ్రాల కింద కూడా బంతి పువ్వులు విప్పి వాడేవాళ్ళం.ఒకసారి నిజం తలంబ్రాలు కావాలని అరుణ వాళ్ళ ఇంట్లోంచి బియ్యం తెచ్చింది. ఆ రోజు మహా బాగా పెళ్ళయ్యిందనుకున్నాము. మర్నాడు దాని వీపు విమానం మోత మోగిందని తెలిసి ఇంకెప్పుడూ అలా చెయ్యకూడదనుకున్నాము.
ఎంత మాలో మేం దెబ్బలాడుకున్నా మాలో ఎవరికి దెబ్బలు పడ్డా మా అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. అదేనేమో స్నేహమంటే.
“పెళ్ళి కొడుకు తల్లి అలిగిందమ్మా”అన్నారెవరో
“ఏం ఏమయ్యింది”?
“వంటలు బాగులేవుట”
“అదేమిటీ పులిహార బాగుందిగా”
నాకు కోపం వచ్చేసింది మా అమ్మ పులిహార బాగా చేస్తుంది.అదీకాక ఈ రోజు మా కోసం ఎక్కువ జీడిపప్పు వేసి కారం లేకుండా కమ్మగా చేస్తానంది. నేను పులిహార డబ్బా తీసి కాస్త నోట్లో వేసుకున్నాను. అబ్బ ఎంత బాగుందో? అలాంటిది ఇది బాగులేదంటుందేమిటీ?
పెళ్ళికూతురి తల్లిగా త్రిపుర, పెళ్ళికొడుకు తల్లిగా కల్యాణి ఉన్నారు. పులిహార నాదిగా అందుకని నేను ఆడపిల్ల వైపు అంటే త్రిపుర వైపు.
పులిహార తిన్న చేత్తోనే కల్యాణి దగ్గరకు వెళ్ళి ఒక్క లెంపకాయ ఇచ్చాను. అది కుయ్యో మొర్రో మని ఏడుపు.
“ఏం దొబ్బుడాయి ఇంత మంచి పులిహార నీ జన్మలో తిన్నావా?”అన్నాను.
అది మాట్లాడకుండా ఒకటే ఏడుస్తోంది.
నా చెయ్యి పట్టుకుని, మా అందరి లోకి కాస్త పెద్దదైన శాంత “ ఊరుకోవే అవన్నీ పెళ్ళిలో ఆడే ఆట. నిజం కాదు. నిజం పెళ్ళిలో పెళ్ళి కొడుకు తల్లి అలిగితే పెళ్ళి కూతురి తల్లీతండ్రి వచ్చి బతిమాలుతారుగా అలాగన్న మాట.అది నిజం అనుకుని నీ పులిహార బాగులేదని దాన్ని చచ్చేటట్లు కొట్టావు”అంది.
అవును నిజమే అలా నిజం పెళ్ళిలా ఉండాలని మేం పెళ్ళిలో చూసినవన్నీ ఇక్కడ కూడా చేస్తాం అది మర్చిపొయాను. అంతే పాపం దాన్ని కొట్టినందుకు నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి. అంతే కల్యాణి ని కౌగలించుకుని సారీ చెప్పాను. దాని చెయ్యి తీసుకుని, నన్ను కూడా కొట్టవే అనగానే ఒక్కసారిగా ఏడుపు ఆపి పకపకా నవ్వింది.
“నిజంగా పెద్దయ్యాక నీ కొడుకు పెళ్ళిలో ఇలాగే చేస్తావేమిటే” అన్నాను నవ్వుతూ.
అప్పట్లో నాకర్ధం కాలేదు. బట్టీ పట్టినట్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం మాట్లాడితే అవే మాట్లాడేవాళ్ళం. పిల్లల ముందు పెద్దవాళ్ళు అలా మాట్లాడకూడదని చాలా పెద్దదాన్నయ్యేదాకా నాకు తెలియలేదు.
పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళను అనుకరిస్తారు. ఆడపిల్లలు తల్లిని, మొగపిల్లలు తండ్రిని.ఆ చిన్న సంఘటన తప్ప ఆ రోజు మా స్నేహితుల మధ్య నాకు కూడా ప్రముఖ పాత్ర దొరికింది.

బొమ్మల పెళ్ళిళ్ళు లేనప్పుడు ఆడుకుందుకు ఎవరూ ఉండేవారు కాదు. మాకు నాలుగిళ్ళవతల ఒక అమ్మాయి ఉండేది. నా ఈడే.వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాను. దాని లక్కపిడతలన్నీ వెండివి.దానితో ఆ రోజు భలే అడుకున్నా. ఆ గిన్నెల్లో బోలెడు వంటలు చేసాం.వాళ్ళ అమ్మగారు మాకు ఆడుకుందుకు రకారకాల స్వీట్స్, కొన్ని మరమరాలు ఇచ్చారు. అవన్నీ ఎంత బాగున్నాయో!

చీకటి పడేదాకా అలా ఆడుతూనే ఉన్నాను. చీకటి చూసి అమ్మకు నేను ఇంకా రాలేదని గాభరా వేసి ఎక్కడున్నానో వెతకమని అన్నయ్యను పంపింది.నేను వెళ్ళడం చూసిన పక్కింటావిడ మీ అమ్మాయి మాచిరాజు వాళ్ళింట్లో ఉంది అని చెప్పిందిట.
అన్నయ్య వచ్చేసరికి ఇంకా ఆడుకుంటున్నాము.అన్నయ్య ఒక్క కేకపెట్టి “నడువు అమ్మ పిలుస్తోంది చీకటిపడ్డా ఇంకా ఆటలేమిటి” అన్నాడు .
అన్నయ్య అలా అనేసరికి ఒక్కసారి భయం వేసింది ఇంటికెళ్ళాక అమ్మ కొడుతుందేమో అని.అమ్మ కొట్టకపోయినా మా సైంధవుడు రెండు మొట్టికాయలు వేస్తాడు. వాడికి నాకు మొట్టికాయలు వెయ్యడమంటే అదేం సరదావో నాకు తెలిసేది కాదు.పెద్దయ్యాక కూడా దెబ్బలు తిన్నాను అది వేరే విషయం.

అన్నయ్య తో ఇంటికెళ్ళాను.అమ్మ కొట్టలేదు. అలా చీకటి పడేదాకా బైట తిరగద్దని చెప్పింది. ఆ తరువాత అన్నం పెడుతున్నప్పుడు చెప్పాను.వాళ్ళింట్లో లక్కపిడతలతో ఆడుకున్నాని,అవి చాలా అందంగా తెల్లగా ఉన్నాయని.
“ఇంకెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళద్దమ్మా అవి వెండివి. అందులో ఏ ఒకటి పోయినా నువ్వు దొంగతనం చేసావంటారు”అంది అమ్మ.

నా లక్కపిడతలు కూడా ఎవరో తీసేసుకున్నారు కదా!”అన్నాను.
“అవి వేరు ఇవి వేరు వెండి వి చాలా ఖరీదు ఉంటాయి”అంది అమ్మ.
అర్ధం కాకపోయినా తలూపాను. పెద్దక్క ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఒక లక్కపిడతల బుట్ట తెచ్చిపెట్టింది. అది ఉన్నన్నాళ్ళూ చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నాను. ఆడుకున్న ప్రతీసారి ఒకటి పోయేది.అలా అన్నీ పోయాక మళ్ళీ అమ్మను కొనమంటే కొనలేదు. మళ్ళీ ఆ అమ్మాయి పిలిచినా వెళ్ళలేదు.

సాయంకాలం ఆడుకుందుకు వెళ్ళినా మా అన్నయ్య ఎప్పుడూ నా మీద నిఘా ఉంచేవాడు.అమ్మకు మొగపిల్లలతో ఆడ్డం ఇష్టం ఉండేది కాదు.అప్పటికీ నాన్న చిన్నపిల్ల అవన్నీ దానికేం తెలుసు అని చాలాసార్లు అనేవారు.
మగపిల్లలు ఆడే ఆటలు ఆడపిల్లలు ఆడకూడదుట. అలా అని ఏశాస్త్రాల్లో రాసారో నాకు పెద్దయ్యాక కూడా అర్ధం కాలేదు.
ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు. అమ్మ ఉంటే ఇవన్నీ చూపించాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆడపిల్లకు ఇన్ని ఆంక్షలూ నిబంధనలూ సంకెళ్ళు అవసరమా?అని.

కానీ ఏమీ చెయ్యలేని అశక్తతతోనే జీవితం గడిచిపోయింది.ఆ తరువాత మారిన పరిస్థితులు కూడా నావల్ల మారినవి కావు,మారుతున్నవాటితో మారడమే నేను చేసిన పని.

“ఇదిగో చెల్లాయ్ నీకోసం పిప్పర్ మెంట్ తెచ్చాను”అన్నాడు చిన్నన్నయ్య.
“సరదాగా నిన్ను అలా సైకిల్ మీద తిప్పుకురానేమిటే “అన్నాడు సైంధవుడు.
“ఇవ్వాళ నీకు కొత్త రకం జడ వేసి,దొడ్లో పూసిన మల్లెపూలు పెడతాను”అంది అక్కయ్య.
అయ్యబాబొయ్ ఇవ్వాళ వీళ్ళందరికీ ఏమయ్యింది?ఒక్కసారి అందరూ నా మీద ప్రేమ కురిపిస్తున్నారు.

చిన్నబుర్రకు అర్ధం కాలేదు.” అక్కా నిజంగా జడ వేసి మల్లెపూలు పెడతావా?” అన్నాను.ఎప్పుడూ అదే పెట్టుకుంటుంది. నాకు పెట్టమంటే సూదిపిన్ను కు రెండు గుచ్చి పెడుతుంది.అలాంటిది మాల కట్టి పెడతానంటోంది.
చిన్నన్నయ్య ఇచ్చిన పిప్పరమెంట్ కూడా చాలా బాగుంది.అది నోట్లో పెట్టుకుని కొంచెం తిన్నాక నోరు మూసుకుని బుగ్గలనిండా గాలి పీలిస్తే నోరంతా ఎంత చల్లగా ఉంటుందో..
అసలే మావాళ్ళ దగ్గర నించి ప్రేమ దొరకడం కష్టం ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని పెద్దలు చెప్పారట. అందుకనీ అన్నీ చేయించేసుకున్నాను.

దానికి చెప్పరా అంటోంది అక్క నువ్వు చెప్పు అన్నాడు చిన్నన్నయ్య. ఈ లోపల నాన్నగారు వచ్చినట్లుగా సైకిల్ చప్పుడు వినిపించింది.

అంతే చిన్నన్నయ్య నన్ను పట్టుకుని లోపలి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు.బుగ్గ మీద ముద్దు పెట్టి, “ మా బంగారు తల్లి కదూ. విజయా టాకీస్ లో చెంచులక్ష్మి సినిమా వచ్చింది.నాన్నగారితో సినిమాకెడతాం అని అడగవా?” అన్నాడు.

వాళ్ళు ఈ విషయం లో నన్ను కాకాబట్టారన్న సంగతి అప్పుడు అర్ధం కాలేదు.అంత వయసు కూడా లేదు. సినిమాకి నాన్నగార్ని అడిగితే అన్నయ్యలు,అక్కా నన్ను ప్రేమగా చూస్తారన్నమాట. అనిపించింది.

అలాగే అని తల ఊపి, నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆఫీస్ నించి రాగానే సైకిల్ వరండా లో పెట్టాక ఆయన మీసాలు గుచ్చుకుంటున్నా ఒక్క ముద్దు పెట్టి పెద్ద కంచుగ్లాస్ తో మంచినీళ్ళు తెచ్చి ఇస్తాను.
నాన్నగారికి నేను అలా చెయ్యడం ఇష్టం అని నాకు తెలుసు.

“ఏరా బుజ్జి తల్లీ ఏం చేసావు?” అన్నారు నాన్నా. ఆ రోజు నేను చేసినవన్నీ పూస గుచ్చినట్లు చెప్పాను. అన్నయ్యలేం చేసారు?అన్నారు.

అవి చెపితే నా వీపు విమానం మోతే. “నాన్నా మరేమో విజయాలో చెంచులక్ష్మి సినిమా వచ్చిందట. మా మాస్టారు చెప్పారు చాలా బాగుంటుందని. అక్కయ్యలూ అన్నయ్యలతో కలిసివెళ్ళనా?” అన్నాను.

“ఒరేయ్ చిన్నాడా”అని పిలిచారు నాన్న. నాకు అర్ధం కాకపోయినా వాళ్ళు అడిగించారని నాన్నకు అర్ధమయ్యింది.

నాన్న పిలవగానే బుద్ధిగా అన్నయ్య నాన్న ముందుకు వచ్చాడు. “చిన్నపిల్ల దాంతో అడిగించక పోతే మీరే అడగవచ్చు కదా! ఎన్నాళ్ళయ్యింది వచ్చి?కొత్తదైతే మానేజర్ పంపడు”అన్నారు నాన్న.

ఆ టాకీస్ మానేజర్ నాన్నకు ఫ్రెండ్. రష్ లేనప్పుడు మాకు సినిమా ఫ్రీ.ఇది పెద్దయ్యాక తెలిసింది నాకు.అన్నయ్య చెప్పాడు రష్ లేదని “ సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది” అన్నారు నాన్న.

నోటికొచ్చినది చెప్పాడు అన్నయ్య. “సరేలే రేపు తయారుగా ఉండండి వాడితో చెప్తాను”అన్నారు నాన్నగారు.సినిమా ఎలా ఉందో మళ్ళీ వారం.

2 thoughts on “ఒక చిన్నారి చెల్లి .. 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *