April 25, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 26

 

 

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

భగవంతుని కరుణను గ్రహించలేక పోయాను. ఏవేవో అవసరం లేని వాటికి వెంపర్లాడాను. బాధలు కలిగినప్పుడల్లా, కోపం వచ్చినప్పుడల్లా నోటిదూల తీరేంతవరకూ ఎదురుగా ఎవరుంటే వాళ్ళను దూషించడమే పనిగా పెట్టుకున్నాను. ఇంతకాలం నా బ్రతుకు అడవి గాచిన వెన్నెల అయింది కదా అని ఆవేదన చెందుతూ కీర్తించిన గొప్ప ఆధ్యాత్మిక కీర్తన.

 

కీర్తన:

పల్లవి: ఇంతగాలమాయను యేడనున్నారో వీరు

వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు  

 

.1.యేలేవారి దూరితి యెడరు వుట్టినవేళ

కాలమును దూరితిని కలఁగేవేళ

తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి

యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము  ఇంత॥

 

.2.దైవమును దూరితి తమకించినట్టివేళ

కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ

సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి

యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము ఇంత॥

 

.3.పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ

కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి

జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె

యిట్టె యింతటివారు యెవ్వరును లేరు

(రాగము: రాయగౌళ; .సం.రేకు:260; సం.3, కీ.344)

 

పల్లవి: ఇంతగాలమాయను యేడనున్నారో వీరు

వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు  

ఇన్నాళ్ళూ నాతో తిరిగి, నాతో బంధం పెంచుకొని నాతో ఉన్నవాళ్ళంతా ఏమయ్యారు? హయ్యో వేంకటేశ్వరా! నా బ్రతుకంతా అడవి గాచిన వెన్నెల చందాన తయారయింది కదా! ఏమి చెయ్యాలి.

 

 

.1.యేలేవారి దూరితి యెడరు వుట్టినవేళ

కాలమును దూరితిని కలఁగేవేళ

తాలిమిలేని వేళ తగుఁగర్మము దూరితి

యేలాగని కాచేవారి నెవ్వరిఁ గానము

ఏదైనా కష్టం వచ్చి నేను భంగపడినప్పుడల్లా నావల్లనే అవన్నీ జరిగాయని గుర్తించలేక, తెలుసుకోకుండా యజమానులను ఇష్టానుసారం నిందించాను. కష్టాలు చుట్టుముట్టిన వేళల్లో హయ్యో! నాకు కాలం కలిసి రావడంలేదే అని వాపోయాను. నేను ధైర్యం కోల్పోయిన వేళల్లో నా కర్మ ఇలా కాలిందని నన్ను నేనే నిందించుకున్నాను. ఏదో విధంగా నన్ను రక్షించే వారిని కనీసం గుర్తించనైనా గుర్తించలేకపోయాను భగవంతుడా ఏమిటీ మాయ?

 

 

.2.దైవమును దూరితి తమకించినట్టివేళ

కావించి నన్నే దూరితిఁ గాఁగినవేళ

సోవగాఁ గోపపు వేళ చుట్టాల దూరితిమి

యీవలఁ దోడైనవారి నెవ్వరిఁ గానము

ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ దేవుడే కలిగించాడని దైవ దూషణ చేశాను. ఒక్కోసారి ఏమీ చేత గాక నన్ను నేనే ఆత్మనింద కూడా చేసుకున్నాను. కోపాన్ని నిగ్రహించుకునే శక్తిలేక ఎదురుగా కొడుకులు, మనుమలు చుట్టాలు అందర్నీ ఎవరు కనిపిస్తే వారిని ఇష్టం వచ్చినట్టు నిందించాను. నాకు తోడు నీడగా నిలబడే వాడొకొడుంటాడని కనీసం గుర్తించనైనా లేదు కదా! ఓ భగవంతుడా! నన్ను ఎంత మాయలో భ్రమింపజేశావయ్యా!

 

 

.3.పుట్టుగు దూరితిమి పోరానియట్టివేళ

కట్టఁగడ నెందువంకఁ గానమైతిమి

జట్టి శ్రీవేంకటేశుఁడు శరణంటేనే కాచె

యిట్టె యింతటివారు యెవ్వరును లేరు

 

ఇప్పుడు అన్ని ముగిసిపోయాయి. పోరాని కాలం సంప్రాప్తమయింది. కష్టాలలో నలిగే వేళ ఆసన్నమయింది. నా పుట్టుక ఎందుకు? ఆశ్చర్యం ఏమిటంటే తిట్టడానికి ఇప్పుడు ఎవ్వరూ కనబడడంలేదు. కానీ శ్రీవేంకటేశ్వరుడు ఎంత దయాళువు? శరణు అని ఒక్కమాట అనగానే నన్ను పూనికతో వెంటనే నిశ్చయించి రక్షించాడు. ఇంత ఘనమైన భగవంతుడు ఎక్కడా మనకు కనిపించడు. అట్టి శ్రీనివాసుని శక్తిని గమనించి భక్తితో శరణు కోరండి అని ఉద్బోధిస్తున్నాడు అన్నమయ్య.

 

ముఖ్యమైన అర్ధాలు: ఇంత కాలమాయను = ఇంత కాలం గడచినది; అడవిగాసే వెన్నెలాయె బ్రదుకు =  అడవిలో వచ్చిన వెన్నెల లాగా జీవితం ఎందుకూ పనికిరానిదైపోయిందని చెప్పడం;  ఎడరు = భంగం కలగడం, ఆపద కలగడం; కలగు = కష్టనష్టముల కాలము; కాగు = బాధపడు, తపించిపోవు; తాలిమి = ధైర్యము, కాచే వారు = కాపాడు వారు; తమకించు = బాధలలో చలించిపోవు; సోవగా = ఆగ్రహము రాగా; తోడైనవారు = అండదండగా ఉండేవారు; పోరానియట్టివేళ = సకలబాధలలో ఉన్నప్పుడు; కట్టగడ = చిట్టచివరకు.

 

విశేషము:  ఈ కీర్తనలో సరదాగా అన్నమయ్య “జట్టి శ్రీవేంకటేశ్వరుడు” అన్నాడు. జట్టి అనగా ఖరీదు కట్టడం అనీ, ఏదో ఒక వెల కట్టడం, మూల్యము, రొక్కము  అని అనేక అర్ధాలు నిఘంటువులలో ఉన్నాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ… శరణు అనగానే వెనువెంటనే నిర్ణయం (కాపాడాలనే నిశ్చయంతో) తీసుకుని కాపాడాడు అని చెప్తున్నాడు అనిపిస్తోంది. కనుక “జట్టి” అంటే నిర్ణయం లేక నిశ్చయం అనే అర్ధం తీసుకొని వాడిన పదం అనిపిoచక మానదు. (విజ్ఞులు దీనిపై వ్యాఖ్యానిస్తే మరింత ప్రయోజనకరం)

-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 26

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *