March 19, 2024

ఏనుగు లక్ష్మణ కవి

రచన: శారదా ప్రసాద్

ఏనుగు లక్ష్మణ కవిగారు క్రీ. శ. 18 వ శతాబ్దికి (1797) చెందిన వారు. ఈయన తల్లిగారి పేరు పేరమాంబ, తండ్రిగారి పేరు తిమ్మకవి. జన్మ స్థలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో ఉన్నది). శ్రీ లక్ష్మణ కవిగారి ముత్తాతగారు “శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు”. ఈయన పెద్దాపుర సంస్థానీసాధీశ్వరుల యొద్ద ఏనుగును బహుమానముగా పొందుట చేత కాలక్రమేణ వీరి ఇంటిపేరు “పైడిపాటి” నుండి “ఏనుగు” వారిగా స్దిర పడినది. ఆ జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి. ఆయన మనుమడు ఏనుగు లక్ష్మణ కవి. ఈ వంశము కవుల వంశముగనే కనబడుచున్నది. శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద ఉన్న ప్రసిద్ద కవి కవిసార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణకవిగారి సమ కాలికుడు.
లక్ష్మణ కవిగారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతి తెలుగులోనికి “సుభాషిరత్నావళి” పేరు మీద అనువాదం చేసాడు . సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు. భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు 1. ఏనుగు లక్ష్మణ కవి 2. పుష్పగిరి తిమ్మన 3. ఏలకూచి బాలసరస్వతి. వీటన్నింటిలోను ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి “ఏనుగు లక్ష్మణ కవి” అనువాదాలు. ఈ సుభాషిత రత్నావళిని అతి మనోహరముగ, యథామూలముగ, ప్రౌఢముగ, సందర్భసముచిత శైలిలో కవి హృదయమును గ్రహించి రచియించె ననుట పెద్దల యభిప్రాయము. కాని దీని ఎడల లోటుపాటులు కలవు. పద్యములు రసవంతముగ నుండుటకు వానిని పండితులును పామరులును గూడ పఠించు చుండుటయే సాక్ష్యము.
లక్ష్మణ కవిగారి ఇతర రచనలు–రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, సూర్య శతకము(ఇది సంస్కృత భాషలోనిది), గంగా మహత్మ్యము, రామ విలాసము, లక్ష్మీనరసింహ శతకము, జాహ్నవీ మాహాత్మ్యము, విశ్వేశ్వరోదాహరణము, సుభాషితరత్నావళి ఇవి ఒకనాడు మాధ్యమిక విద్యలో బోధనాంశాలుగా ఈనాటికి కూడా ఉన్నాయి. ఈ పద్యాలు కంఠస్తం చేయదగినవి .
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఈ పద్యం రాని తెలుగు వారు ఉండరేమో! “ఆరంభింపరు నీచ మానవులు “, “గ్రాసము లేక స్రుక్కిన “, “తివిరి ఇసుమున తైలంబు”, “క్షమ కవచంబు”మొదలైన పద్యాలన్నీ చాలామందికి కరతలామలకాలే!
క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే~ఖిలాః
క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః|
గన్‌తుం పావక మున్మన స్తదభవ ద్దృష్ట్వాతు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి నతాం మైత్రీ పున స్త్వీదృశీ||–భర్తృహరి
పై పద్యానికి ఏనుగు లక్ష్మణ కవిగారి తెలుగు అనువాదం–
ఉ. క్షీరము మున్ను నీటికొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేరుటన్
క్షీరము దప్త మౌట గని చిచ్చుఱికెన్ వెతచే జలంబు దు
ర్వారసుహృద్విపత్తిఁ గని వహ్నిఁ జొరం జనె దుగ్ధ్హ మంతలో
నీరముఁ గూడి శాంతమగు నిల్చు మహాత్ములమైత్రి యీగతిన్. –ఏనుగు లక్ష్మణ కవి
అర్ధం-నీళ్ళకు పాలంటే కృతజ్ఞత. తనకంటూ ఆశ్రయమిచ్చినందుకు. పాలకు నీళ్ళంటే కృతజ్ఞత. తనలో ఇట్టే కలిసిపోయినందుకు, తన ఒంటరి జీవితంలో తోడై నిలిచినందుకు. నీళ్ళకు పాలు చక్కని రంగునిస్తాయి . కమ్మని రుచిని ప్రసాదిస్తాయి. పొయ్యి మీద పాలు మరిగిపోతుంటే నీళ్ళు తట్టుకోలేకపోతాయి. నీళ్ళు ఆ బాధను తమంతట తామే స్వీకరిస్తాయి. మౌనంగా ఆవిరై ఇంకిపోతాయి. అప్పటిదాకా తోడూ నీడగా నిలిచిన స్నేహితుడు ఆవిరైపోతుంటే ఆ బాధను తట్టుకోలేక పాలు ఉద్వేగంతో బుస్సున పొంగుతాయి. పొయ్యిలోని మంటను ఆర్పటానికి సమాయత్త మవుతాయి. ఇల్లాలు దోసెడు నీటిని చల్లగానే, పాలు- నీరు మళ్ళీ కలుసుకుంటాయి. మిత్రుడు తిరిగి వచ్చిన సంతోషంలో పాల ఉద్వేగం తగ్గిపోతుంది, పాలు చల్లబడుతాయి!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంత గర్వముల్
మనకి సర్వం తెలుసు అనే రోగం చాలామందికి ఉంది. ఈ స్థితికి ఎప్పుడైతే వస్తామో నిజానికి అది ఆత్మహత్యా సదృశ్యం. తెలుసుకోవాలనే తృష్ణ బాల్యంలో ఎక్కువగా ఉంటుంది. పెద్దైన తర్వాత ఆ తృష్ణ తగ్గిపోవటం మనం చూస్తున్నాం!ఇది సుమారు రెండువేల సంవత్సరాల నాటి శ్లోకం. ఇది ఇంకా గుర్తుండిపోవటానికి కారణం–“సుకవి జీవించు ప్రజల నాలుకల మీద” అని అన్న జాషువాగారి మాట నిత్య సత్యం! భర్తృహరి సుభాషితాలను తెలుగువారికి పరిచయం చేసిన ఏనుగు లక్ష్మణ కవి చిరంజీవి!
ఆ కవి పుంగవుడికి నా స్మృత్యంజలి!

10 thoughts on “ఏనుగు లక్ష్మణ కవి

  1. Very informative
    Thanks Sarada Prasad garu
    You have reignited passion in people to know greatness of Telugu language
    Truly Enugu Lakshmi Kavi garu lives in our hearts for ever
    And so do you

  2. చాల మంచి విషయాలు తెలియపరచారు.ఏనుగు లక్ష్మణకవ పుట్టు పూర్వోత్తరాలు ఆయన అనువాద చాతుర్యం చాలా చక్కగ వివరించారు

  3. చాలా మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  4. తెలియని విషయాలను ఎన్నో తెలియచేసినందుకు ధన్యవాదాలు!

  5. భర్తృహరి సుభాషితాల గురించి విన్నపుడల్లా స్ఫురణకొచ్చె పేరు ఏనుగు లక్ష్మణకవి. భర్తృహరి సుభాషితాలు వ్రాసినవారు ఎవరు అని ప్రశ్నిస్తే, చాలామంది నుండి వచ్చే జవాబు .. “ఏనుగు లక్ష్మణకవి” అని. అంతలా ఆయన చేసిన సుభాషితాల అనువాదం సహజరచనగా భాసిల్లిందనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి కవి గురించి మీ ప్రస్తావన బావుంది. మంచి వ్యాసం అందించారు.

  6. It is very nice to remember such a poets in this times. Recently I happened to meet few students of 4 to 6 th standard
    They does know the difference between padyam and slokam. Ramakrishna mission is doing good service in promoting Telugu letarature and culture. Thank you once again to remind Yenugu lakshmana kavi .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *