March 19, 2024

కలియుగ వామనుడు – 6

రచన: మంథా భానుమతి

మళ్లీ ఎలాగా ట్రాక్ కెళ్లాలి. ఆ రోజు చాలా పనే చేయించారు వాళ్ల చేత. ఎప్పడెప్పుడు కాసేపు వాలదామా అని చూస్తున్నారు.
చిన్నా టి.వి ఆన్ చేశాడు.
వెంటనే ఆన్ అయింది. చిన్నాకి ఆనందంతో గంతులేయాలనిపించింది.
అయితే.. ఒక్క దుబాయ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తున్నాయి.
కేబుల్ కనెక్షన్ లేదు.
ఎక్కువ అరేబిక్..
ఏదో ఒకటి. కొత్త మనుషులు, కొత్త పరిసరాలు కని పిస్తున్నాయి. అందులో అరాబిక్ లెసన్స్ ఒక ఛానల్ లో వస్తోంది.
కూర్చుని శ్రద్ధగా చూడ్డం మొదలు పెట్టాడు చిన్నా. కొన్ని మాటలు, పలికే విధానం నేర్చుకున్నాడు.
రోజూ తీరికున్నప్పుడు వచ్చి, కాసేపు టివి చూడాలని నిశ్చయించుకున్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది తన పుస్తకం.. డ్రాయింగులు వేసుకునేది. ఇక్కడి కొచ్చినప్పట్నుంచీ దాని గురించే మర్చి పోయాడు.
అందులో.. రోజూ తన అనుభవాలు రాసుకోవాలి. తన కోడ్ లోనే.. బొమ్మలు ప్స్.. తెలుగులో రాసుకుంటే, చూడగానే ఎవరికీ అర్ధం కాదు.
“లంచ్ వచ్చింది చిన్నా..” అబ్బాస్ పిలిచాడు, గది బైట నిల్చుని. చిన్నా, టి.వి కట్టేసి, తలుపు దగ్గరగా వేసి బైటికొచ్చాడు.
“త్వరగా తినెయ్యండి.. ఈ రోజు నించీ స్పెషల్ ట్రయినింగ్ అని చెప్పమన్నాడు నజీర్. ఎలుగు బంటిగాడు చాలా హుషారుగా ఉన్నాడు. హలీమ్ సాబ్ ఫోన్ చేశారుట. మన వాళ్లలో ముగ్గురిని సెలెక్ట్ చేస్తామని.” అబ్బాస్ సమాచారం ఇచ్చాడు నవ్వుతూ.
“అన్నా.. టింకూ..”
“చెప్పాను. కిచెన్ లో షెఫ్ అంకుల్ కి చెప్పి పడుక్కోబెడదాం. తగ్గి పోతుంది. నువ్వేం వర్రీ అవకు.”
“వాడు పుట్టినప్పటి నుంచీ నాకు మంచి దోస్త్ అన్నా. చాలా డెలికేట్. వానికేమైనా అయితే.. తట్టుకోలేను.” చిన్నా కళ్లలో మళ్లీ నీళ్లు.
“అదిగో.. ఫరవాలేదని చెప్పానా? పద.. నువ్వుండాలి ఈ రేసులో..”
“అలాగే ట్రై చేస్తా..”
“ఇవేళ లంచ్ నా ఫేవరెట్.. హామ్ బర్గర్స్. షెఫ్ అంకుల్ నడిగి ఒకటి ఎక్స్ ట్రా సంపాదించా. చలో..”
“నేనెప్పుడూ తినలేదన్నా…”
“చాలా బాగుంటాయి. టొమాటో సాస్, కట్ చేసిన కీరా ముక్కలు మధ్యలో పెట్టుకుని తింటే.. సూపర్.”
………………….

ప్రతిష్ఠాత్మకమైన ఎమిరేట్స్ హెరిటేజ్ క్లబ్ రేసులు ప్రారంభించే రోజు రానే వచ్చింది.
ముందు రోజు రాత్రే ఒంటెలని తీసుకుని ముధారీలంతా గ్రౌండ్ కి చేరుకున్నారు.
దగ్గర టౌన్ లో ఉన్న పైవ్ స్టార్ హోటళ్లన్నీ బుక్ ఐపోయాయి.
హలీమ్ యజమాని అయిన షేక్ కి పది ఫామ్ లున్నాయి. అందులో ముగ్గురు ముధారీలు ఇప్పటి రేసుల్లో పాల్గొంటున్నారు.
అందులో హలీమ్ ఉన్నాడు. హలీమ్, నజీర్ల ఆనందానికి అంతే లేదు.
మొత్తం మూడు వందల యాభై మంది పైగా రేసుల్లో పాల్గొంటున్నారు. రేసులలో పాల్గొంటున్న ఒంటెల యజమానులందరూ ముందురోజే వచ్చేశారు.
వారం రోజుల నుంచే అక్కడ పండగ వాతావరణం వచ్చేసింది.
ఒంటెలు, ముధారీలు, జాకీలు.. వారి మానేజర్లు అందరూ కాంపింగ్ చేసేశారు. పెద్ద ఫెన్సింగులు, వాటి లోపల గుడారాలు..
ట్రాక్ కి దగ్గరలోనే ఒంటెలకి హాస్పిటల్ ఉంది. పందేల సమయంలో అవి పడిపోయి దెబ్బలు తగిలించుకుంటే.. వెంటనే వైద్య సహాయం అందుతుంది.
కొంచెం దూరంగా వంట శాలలు.
బెడూయన్ స్త్రీలు తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శనకి పెట్టారు.. ఎంబ్రాయిడరీ చేసిన సంచీలు, టేబుల్ క్లాత్ లు, అల్లికలు.
టార్కాయిస్, ముత్యాలు వంటి జెమ్స్ తో చేసిన హారాలు, బ్రేస్ లెట్లు..
తాటాకు పాకల్లో, గుడారాల్లో తమ వంటలని రుచి చూపిస్తున్నారు.
మగవాళ్లు ఒంటెలని అటూ ఇటూ తిప్పుతూ, చూడ్డానికి వచ్చే వాళ్లని వాటి మీద తిప్పుతున్నారు..
ఇదే సమయం వాళ్లకి.. కాసిని దీనారాలు సంపాదించుకోడానికి.
బోలెడు షాపులు వెలిశాయి. అరేబియన్ కాఫీ, పిండి వంటలు.. కుండలు, పింగాణీ వస్తువులు, హాండీ క్రాఫ్ట్ వస్తువులు.. అన్నీ ప్రదర్శిస్తున్నారు.
కొన్ని గుడారాల్లో మాజిక్ షోలు..
ఒక పక్క చిన్న చిన్న యారెనాల్లో ఎరోబిక్స్ చేస్తున్నారు.
బెడూ యువకులు, పిల్లలు రకరకాల విన్యాసాలతో అలరిస్తున్నారు.
అరేబియన్ సంగీతం గాలిలో తేలుతోంది.
కొందరు ట్రాక్ దగ్గర నృత్యం చేస్తున్నారు.
మధ్యాన్నం అయే సరికి ఆ ప్రదేశమంతా ప్రజలతో నిండి పోయింది. టివి, పత్రికా రిపోర్టర్లు.. వాన్ లలో తయారుగా కూర్చున్నారు.
రెండు గంటలకల్లా అందరూ భోజనాలు ముగించేసుకుని ట్రాక్ దగ్గరకి వచ్చేశారు. చాలా మంది, అక్కడే షాపులలో తినేశారు.
ఎక్కడ చూసినా జన సందోహం..
కోలాహలం. సందడి మిన్నంటుతోంది.
రేసుల్లో పాల్గొనబోయే ఒంటెలు అక్కడే తాత్కాలికంగా వేసిన షెడ్ లలో నిల్చున్నాయి.
మొదటి రోజు, సీనియర్ ఒంటెల పందాలు.. మరీ పెద్ద వయసు (70 ఏళ్లు మాత్రమే) వాళ్లవి 500 మీటర్లు, నడి వయసు (50 సంవత్సరాలు) వాళ్లవి 1500 మీటర్ల రేసులు.. నడుస్తాయి.
ఒక మాదిరి ఆసక్తితో వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.
ఎక్కువగా కుశల ప్రశ్నలు, బిజినెస్ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అటువంటప్పుడు. అయినా.. అసలు ఒంటె రేసులంటేనే అరేబియన్ దేశాల్లో విపరీతమైన మోజు. అవి ఏ వయసువైతేనేం..
చిన్నా తమ బృందంతో, పాల్గొనే వారికి కేటాయించిన స్థలంలో కూర్చుని చూస్తున్నాడు.
హలీమ్ టీమ్ మరునాడు పాల్గొంటారు.
యవ్వనంలో ఉన్న ఒంటెలు.. 3000 మీటర్ల ట్రాక్.
రేసులు చూడటం కూడా బాగానే ఉంటుందన్నాడు అబ్బాస్. అసలు పందాలు ఎలాసాగుతాయో గమనిస్తే మెంటల్ గా తయారవచ్చు. పరిసరాలు కూడా అలవాటవుతాయి.
పరిసరాలు ఎక్కడైనా ఒకటేగా అనుకున్నాడు చిన్నా. ఆ విషయమే అడిగాడు అబ్బాస్ ని.
అంతా ఇసుకే కదా..
“ఇసుకే కాదురా బాబూ! ట్రాక్ మీద ప్రాక్టీస్ చేసినట్లు కాదు. చాలా ఒంటెలుంటాయి. అంతా.. ఎవరు గెలుస్తామా అన్నట్లుంటారు. ఒంటెలు అడ్డం వచ్చేస్తూంటాయి.. గుంపులుగా. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరూ అడ్డుండరు. ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది.
రేసులప్పుడు ఎవరు అడ్డు పడ్తారో తెలీదు. ఒడుపుగా ముందుకు పట్టుకుపోవాలి. అదంతా అబ్జర్వ్ చెయ్యి. ఒక ఒంటె పరుగెడుతుంటే, ఆ ఒంటెని పట్టుకోవడానికి నీ ఒంటెని పరుగెత్తించాలి.”
నిజంగానే.. ట్రాక్ మీద చాలా భీభత్సంగా ఉంది.
తడవకి పది పన్నెండు ఒంటెలు కంటే పట్టవు.
మొత్తం ముప్ఫై రౌండ్లు జరిగాయి.
కేకలు.. అరుపులు, ఈలలు.. గొడవ గొడవ.
ట్రాక్ పక్కనున్న రోడ్ మీద కార్లలో అందరూ ఫాలో అవుతున్నారు. వీడియోలు తీసే వాళ్లు, మీడియావాళ్లు, పందెంలో పాల్గొనే ఒంటెల యజమానులు ..చూట్టానికొచ్చిన వారు.. ముందుగా వీళ్ల హాడావుడి ఎక్కువగా ఉంది.
అందరూ కూర్చునే దగ్గర, స్టేడియమ్ లో పెద్ద పెద్ద తెరల మీద పందెం అంతా ప్రతీ క్షణం అన్ని కోణాల్లో చూపిస్తున్నారు.
పైనించి హెలికాప్టర్ లలో కూడా మీడియా వాళ్లు వీడియోలు తీస్తున్నారు.
అబ్బాస్ చెప్పింది నిజమే అనుకున్నాడు చిన్నా. ఇంత హడావుడిలో ఒంటె మీద కూర్చుని దృష్టి నిలపడం కష్టమే.
ముందుగా చూడబట్టి కాస్త తెలిసింది. మెంటల్ గా తయారవచ్చు.
సాయంత్రం వరకూ కూర్చుని రేసులన్నీ చూసే సరికే అలిసి పోయారు చిన్నా, మిగిలిన పిల్లలందరూ.
వాన్ తీసుకొచ్చి అందరినీ తమ గుడారానికి తీసుకెళ్లారు నజీర్, అబ్బాస్.
“రేపు మనది సెకండ్ రౌండ్ లో ఉంటుంది. సమీర్ జాగ్రత్త. నువ్వే లీడ్ చెయ్యాలి. మీరిద్దరూ కూడా ఉన్నారు..” చిన్నా రూమ్మేట్లనిద్దరిని కూడా పిలిచి చెప్పాడు నజీర్.
“లైట్ గా తినాలి, ఇప్పుడు డిన్నర్, రేపు లంచ్ కూడా. ఎక్కువ తింటే నిద్దరొస్తుంది.” అబ్బాస్, ఒక కప్పులో సాలడ్, ఒక ఎండి పోయిన రొట్టె ఇచ్చాడు.
పిల్లలకి సగం సగం తినడం అలవాటై పోయింది.
కడుపు కూడా సగం ఎండి పోయింది. అందరూ సన్నగా, గాలేస్తే ఎగిరి పోయేట్లే ఉన్నారు.
“లేవండి.. లేవండి..” నజీర్ డొక్కలో తన్నుతుంటే మెలకువొచ్చింది చిన్నాకి.
కళ్లు నులుముకుంటూ లేచాడు.
టైమెంతయిందో.. అనుకుంటూ, బాత్రూంలోకి నడిచాడు. రివ్వుమని కొట్టింది చలి గాలి. అలాగే, పళ్లు తోముకుని, జివ్వుమనే చల్లని నీళ్లతో మొహం, కాళ్లు చేతులు కడుక్కుని వచ్చాడు.
“చిన్నా.. పళ్లు కరచుకు పోతున్నాయి.. వేడి నీళ్లు ఉండవా?” రూమ్మేట్లు వణుకుతూ వచ్చారు.
ఫకాలున నవ్వాడు చిన్నా.
“ఉంటాయి.. నజీర్ అంకుల్ దగ్గర. వెళ్దామా?”
“హూ..హూ..” అంటూ వాళ్లు కూడా తయారయి గుడారంలోకి వెళ్లారు. అప్పటికే వంటలు తయారవుతున్నట్లుగా వాసనలొస్తున్నాయి.
“రండి.. కిచెన్ లోకెళ్లి టీ, బిస్కట్స్ తీసుకుందాం.” ముగ్గురినీ పిల్చుకెళ్లాడు అబ్బాస్.
భ్లాక్ టీ, గడ్డి లాంటి ఓట్స్ బిస్కట్లు.. కరకరా నమిలి, గడగడా తాగి గట్టిగా ఊపిరి పీల్చి వదిలారు జాకీలు ముగ్గురూ.
“ఎక్సర్ సైజ్ టైమ్.. గ్రౌండ్ లోకి చలో..” అబ్బాస్ వెనుకే వెళ్లారు. చిన్నాతో సెలెక్ట్ అయిన జాకీలని సుడాన్ నించి తీసుకొచ్చారు. వాళ్ల పేర్లు చిన్నాకి ఎప్పుడూ కన్ఫ్యూజనే.. అందుకే రాకీ, సాండీ అని పిలుస్తుంటాడు. ఆ అక్షరాలని పోలి ఉంటాయి వాళ్ల పేర్లు.
జన్యుపరంగా సుడానీల కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. తీగల్లాగ సాగిపోతారు.
వాళ్ల దగ్గరే స్వారీలో మెళకువలు నేర్చుకున్నాడు చిన్నా.
రాకీకి ఎప్పుడూ ఆకలేస్తూ ఉంటుంది. తిండి సరి పోదు.. కళ్లలో కాంతి అనేది ఉండదు. చిన్నా అప్పుడప్పుడు తన కిచ్చిన దానిలోది పెడుతుంటాడు.
రాకీకి బద్ధకం కూడా ఎక్కువే.
బైట కాంపౌండ్ లో ఉన్న పిచ్చిమొక్కల్ని పీకమంటే.. ఒకటి పీకి, కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంకొకటి పీకుతాడు. అందరూ అర పూటలో చేసే పని వాడు రోజంతా చేస్తాడు.
అందుకే నజీర్ చేతిలో దెబ్బలు, వాతలు తింటుంటాడు.
“నాకు చాలా భయంగా ఉంది చిన్నా!” రాకీ వచ్చి గుంజీలు తీస్తున్న చిన్నాతో మొత్తుకున్నాడు.
“ఎందుకు?”
“గెలవక పోతే నజీర్ పనిష్ చేస్తాడు. పొట్ట మీద వాతలు పెడతానన్నాడు.” రాకీ గొంతు వణికింది.
“అదేంటీ.. గెలవటం మన చేతుల్లోనే ఉందా? ఒంటె కదా పరిగెత్తాలీ.. మహా ఐతే మనం కాలితో పది తన్నులు తన్నగలం. అంతే కద!”
“అదే.. ఆ ఒంటెల పక్కలు తన్నడవే, బాగా చెయ్యాలి. కమ్చీని బాగా జాడించాలి. అంతా బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాడు.”
“ఇదివరకు ఆలా చేశాడా?” నమ్మలేనట్లుగా అడిగాడు చిన్నా. అలా వాతలెందుకు పెడతారు? ఇంత చిన్న పిల్లల్ని ఎలా కొట్టబుద్ధేస్తుంది? అందులో.. వాతలు.. తల విదిలించాడు.
“చూడు..” షర్ట్ పైకెత్తి చూపించాడు రాకీ.
బొడ్డు పైనించీ, కింది వరకూ.. పది వాతలైనా ఉంటాయి. గాయం మానిపోయింది కానీ.. అడ్డంగా.. గీతలు.
“ఓ మై గాడ్..” చిన్నాకి కళ్లు తిరిగినంత పనైంది.
“నన్ను కూడా ఎప్పుడూ కొడతాడు తెలుసా..” సాండీ కూడా షర్ట్ పైకెత్తి చూపించ పోతుంటే ఆపేశాడు చిన్నా.. నజీర్ వస్తున్న శబ్దం విని.
“తెలిసింది. మనం ట్రై చేద్దాం. ఆ తరువాత గాడ్స్ విల్. కమాన్.. రన్ చేద్దాం.” చిన్నా లేచి పరుగందుకున్నాడు.
గ్రౌండంతా మనుషులతో నిండి పోయింది.
అప్పుడే ఉదయ కిరణాలు విచ్చుకుంటున్నాయి.
కాఫీ వాసన.. అరేబియన్ కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బుల్లి బుల్లి కప్పుల్లో, చుక్కలు చుక్కలుగా తాగుతారు. గుండ్రని బల్లలు, వాటి చుట్టూ కుర్చీలు.. అందులో పొడవాటి గౌన్లు వేసుకున్న మనుషులు.
ఎక్కడికక్కడ చిన్న రెస్టారెంట్లు వెలిశాయి.
పిక్నిక్ వాతావరణం వచ్చేసింది.
ఎంతో మంది విదేశీయులు.. అరేబియన్ల సంస్కృతిని ఆస్వాదించడానికి వచ్చేశారు.
బుల్లి జాకీలు భయపడుతున్న సమయం రానే వచ్చింది.
ముగ్గుర్నీ వేర్వేరు రౌండ్లలో పిలిచారు.
నజీర్ చిన్నాని ఒంటెనెక్కించాడు.
చిన్నా ఒంటె ఎక్కాక, కళ్లు మూసుకుంటే, కళ్ల ముందు రాకీకి పెట్టిన వాతలు కనిపించాయి. ఒక్కసారి వెన్నులోంచీ వణికొచ్చింది.
పిల్లలందరినీ ఎక్కించి, నజీర్ లాంటి మానేజర్లు పరుగెత్తుకుంటూ ట్రాక్ మీదనుంచి పక్కకి తప్పుకున్నారు.
అడ్డంగా ఉన్న పెద్ద అడ్డు తెర తొలగింది.
ఒంటెలు పరుగందుకున్నాయి.
అప్పుడు సాయంత్రం ఐదు దాటింది.
రేసు మొదలవగానే, విపరీతమైన గాలి అందుకుంది.. నేల మీదున్న దుమ్మంతా పైకి లేపుతూ.
ఆ దుమ్ములో ఏమీ కనిపించలేదు.. హెల్మెట్లున్నాయి కనుక కళ్లలో దూరలేదు. ఇంకా దుమ్ము రేపుతూ ఎగిరెగిరి పరుగెడుతున్నాయి ఒంటెలు.
జాకీలు, భయానికి కంఠ నాళాలు పగిలేలా కేకలు పెడుతున్నారు. ఒంటెల వీపు మీద ఎగిరెగిరి పడ్తూ జీను కున్న తాడుని గట్టిగా ఒక చేత్తో పట్టుకుని బాలన్స్ చేసుకుంటున్నారు.
చిన్నాకి ఏం జరుగుతోందో ఏమీ తెలియలేదు. కుడిచేత్తో కమ్చీ తిప్పడం, ఒంటె ఎగరేస్తుంటే కింద పడకుండా.. తాడు బలంగా పట్టుకుంటూ, ఒంటె మీదే పడేలాగ చూసుకోవడం.. అంతే.
ఎక్కడ చూసినా దుమ్ము.
కళ్లకేం కనిపించడం లేదు.
“సాత్ అల్.. రన్..” (అదో కమ్చీ పరుగెత్తు)
“కమాన్.. ఫాస్ట్..”
“జమాల్.. రన్ ఫాస్ట్” (ఒంటే..అందుకో పరుగు)
“యా అల్లా..”
గొంతులు చించుకుని అనేక రకాల కేకలు.
ట్రాక్ ని ఆనుకుని ఉన్న రోడ్డు మీద పోయే కార్ల శబ్దాలు.. చెవులు పగిలి పోతాయేమో అనిపించింది.
ఎక్కడో ఊహాలోకంలో ఉన్నట్లు ఉంది చిన్నాకి.
ఒళ్లంతా గాలిలో తేలి పోతున్నట్లుంది.
ఎలాగైతేనేం.. చివరి క్షణం వచ్చింది. ఏ ఒంటె ముందు వెళ్లిందో.. తన ఒంటె ఏ స్థానంలో ఉందో ఏమీ తెలియలేదు. అంతా అయోమయం.
అబ్బాస్ వచ్చి చిన్నాని కిందికి దింపాడు.
చిన్నాకి ఇంకా గాల్లో తేలుతున్నట్లే ఉంది.
“అయి పోయిందా అన్నా?” అడిగాననుకున్నాడు.. నోట్లోంచి గాలి తప్ప శబ్దం బైటికి రాలేదు.
కార్లన్నీ వెనక్కి తిరిగాయి. తరువాతి రేసుని అందుకోవడానికి.
“ఒంటె రేసులకంటే, వాటిని ఫాలో అయే ఈ కారు రేసు ఇంటరెస్టింగ్ గా ఉంది.” కార్లో వెళ్తున్న ఒక విదేశీ వనిత అంటోంది.. పక్కనున్న భర్తతో.
చిన్నాని తీసుకుని గబగబా, పెద్ద తెర కింది నుంచి పక్కకి వెళ్లిపోయాడు అబ్బాస్. ఆలిశ్యం చేస్తే ఏ ఒంటె కాలి కిందో పడి పోతారు.
వాన్ ఎక్కించి, బాత్రూంల దగ్గరికి తీసుకెళ్లాడు.
అప్పటికి కొంచెం తేరుకున్నాడు చిన్నా.
“వాష్ చేసుకుని, టెంట్ దగ్గరికి వెళ్లిపో. తరువాత మాట్లాడుతా.” పరుగెడుతున్నట్లుగా నడుస్తూ బైటికెళ్లిపోయాడు.
కాసేపు, అక్కడే నేల మీద కూర్చుండి పోయాడు చిన్నా.
“ఏమయింది? ఎవరు గెలిచారు?” అక్కడ కూర్చున్న క్లీనింగ్ ఆమెని అడిగాడు.
“ఏం కాలేదు.. అన్ని రేసులూ అయాక రిజల్ట్ తెలుస్తుంది. ఒక్క రేసుకే ఏమవుతుంది?” పాకిస్థాన్ నించి వచ్చిందామె.. హిందీలో మాట్లాడింది.
నెమ్మదిగా లేచి, బట్టలు విప్పి, మొత్తం ఇసకంతా కడుక్కున్నాడు. ఎప్పటికప్పుడు అక్కడ పడ్డ ఇసకంతా తీసి బాగు చేస్తోంది అక్కడున్నామె.
పేపర్ టవల్స్ తో వత్తుకుని, దులిపేసి ఆ బట్టలే వేసుకున్నాడు. అడుగులో అడుగేసుకుంటూ తమ గుడారం దగ్గరికి వెళ్లి పక్క మీద వాలి పోయాడు.
బైట జరుగుతున్న కోలాహలం ఏమీ వినిపించట్లేదు చిన్నాకి.
అలా ఎంతసేపు పడున్నాడో..
“చిన్నా.. చిన్నా! లే. అయిపోయింది. వెళ్లి పోతున్నాం.” అబ్బాస్ వచ్చి లేపాడు.
“ఏమయింది.. ఎవరు గెలిచారు?” పక్క మీద లేచి కూర్చుని అడిగాడు.
“కంగ్రాచ్యులేషన్స్. నీ ఒంటెకి సెకండ్ ప్రైజ్ వచ్చింది.”
ఒక్క ఉదుట్న లేచి నిల్చున్నాడు చిన్నా.
“ఎంత ప్రైజ్?”
“పద్ధెనిమిది వేల దీనారాలు.”
“అవునా.. నేను రావాలా ప్రైజ్ తీసుకోవడానికి?” సంతోషంగా అడిగాడు.
“నువ్వా.. నువ్వెందుకు?” అబ్బాస్ ఆశ్చర్యంగా అడిగాడు.
“నేనే కదా.. తోలింది..” చిన్నా అమాయకత్వానికి జాలిపడ్డాడు అబ్బాస్. పిల్లలకి ఏమీ తెలీదులే అని ఈ రేసుల గురించి ఎక్కువగా చెప్పరు. కానీ.. చిన్నా బాగా మెచ్యూర్డ్. చెప్పి తీసుకు రావలసింది..
“ఒంటె ఎంతో నువ్వు కూడా అంతే.. ఒంటె వెళ్తుందా ప్రైజ్ తీసుకోవడానికి? అలాగే జాకీలు కూడా. వాళ్లకేం డబ్బూ రాదు, పేరూ రాదు. పేపర్లలో ఫోటో సంగతి దేవుడెరుగు.. కనీసం పేరు కూడా వెయ్యరు. ఈ పాటికి ఒంటెతో షేక్ గారి ఫొటో, పక్కన హలీమ్ ఫొటో.. టీవీల్లో వస్తూంటాయి. రేపు పొద్దున్న పేపర్లలో కూడా వస్తాయి ఫొటోలు.”
అబ్బాస్ జాలిగా చూశాడు.
నీరసంగా.. కుంచించుకు పోయి నిలుచున్న చిన్నాని.
“ఒంటె, నేను ఒకటెలా అవుతాం? ఒంటె ఫొటో పేపర్లో వస్తుంది కదా..” చిన్నా పక్కకి తిరిగి తన సంచీ సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“అనుకున్నంత అమాయకుడు కాదు చిన్నా..” అబ్బాస్ ఆలోచిస్తూ తన సామాన్లు కూడా సర్దుకున్నాడు.
చిన్నా మాటలెప్పుడూ సంభ్రమంగానే ఉంటాయి అబ్బాస్ కి.
ఇంత మెచ్యూరిటీ ఎలా సాధ్యం?
“అదేంటీ.. పొద్దున్నయి పోయిందా?” గుడారం బైటికొచ్చిన చిన్నా ఆశ్చర్యంగా అడిగాడు.
సగం పైగా ఎడారంతా ఖాళీ అయిపోయింది. కార్లన్నీ వెళ్లిపోయాయి. బెడూవియన్లు తమ సరుకులన్నీ సర్దు కుంటున్నారు.
“అవును. రాత్రంతా చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. నిన్ను లేపుదామని ట్రయి చేశాను. అలిసిపోయావులే అని ఊరుకున్నా. షేక్ గారి కొడుకు వచ్చి గెలిచిన వారికి ప్రైజులిచ్చారు. షాంపేన్ కాలువలా పారింది. పెద్ద ఫీస్ట్. ఒంటిగంట వరకూ డాన్సులు, పార్టీ.. ఫాబ్యులస్..”
“అయ్యో.. దూరంగా నిల్చునన్నా చూసే వాడిని. మిస్ అయిపోయానన్నమాట. వెరీ సాడ్ అన్నా..” మామూలుగా అంటున్న చిన్నాని ఆరాధనగా చూశాడు అబ్బాస్.
“పార్టీ అవుతూండగానే ఒక్కొక్కళ్లు వెళ్లి పోయారు. వెళ్లే ముందు హలీమ్ సాబ్, నజీర్ ని పిలిచి రెండువేల దీనారాలు ఇచ్చారు.”
“ఓ.. చాలా హాప్పీ అన్నా. నజీర్ అంకుల్ కష్టానికి మంచి నజ్రానా. అవునూ మనిద్దరమే మిగిలామా మన గుంపులో?” చుట్టు పక్కలంతా చూస్తూ అడిగాడు చిన్నా.
“అవును. నేను కిచెన్లో సామానంతా సర్దటంలో హెల్ప్ చేస్తుండి పోయాను. వాన్లన్నీ నిండి పోయాయి. మనం మోటర్ సైకిల్ మీద వెళ్లచ్చులే అని ఆగిపోయా. నేను కూడా నిద్ర పోయాననుకో.”
“బైక్ ఎక్కడిదీ?” అడిగాక సిల్లీగా అడిగాననుకున్నాడు చిన్నా. నజీర్ అరేంజ్ చేసుంటాడు.
సరిగ్గా అబ్బాస్ కూడా అదే చెప్పాడు.
“రెంట్ కి తీసుకున్నాడు నజీర్. మొత్తం బిల్ అంతా షేక్ గారికి వెళ్తుంది. బైక్ మనూర్లో ఇచ్చెయ్యచ్చు.”
“మరి కారే తీసుకోవచ్చు కదా?”
“తీసుకోవచ్చు. కానీ నాకు లైసెన్స్ లేదు. చలో.. బయల్దేరదామా?”
******
ఔజుబా దగ్గరికి వచ్చే సరికి పది గంటలయింది.
“త్రీ అవర్స్ పట్టిందా అన్నా?” చిన్నా కిందికి దూకుతూ అడిగాడు.
“ఆల్ మోస్ట్. కష్టం అనిపించిందా వెనుక కూర్చోడం?”
“ఏం లేదన్నా.. ఒంటె సవారీతో పోలుస్తే ఇదెంత? వాటి మీద రెండేసి గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేస్తాం కదా?”
నిజమే అనుకున్నాడు అబ్బాస్. చిన్నాని దింపేసి వెళ్లి పోయాడు
తమ రూమ్ లోకి వెళ్తూనే టింకూ కోసం చూశాడు చిన్నా.
నవ్వుతూ ఎదురొచ్చాడు టింకూ. ముందు పళ్లు రెండూ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా తొస్సిగానే ఉంది. ఆనంద్ కిడ్నాప్ చేయించడానికి ముందే ఊడిపోయాయి.
“అబ్బో.. పళ్లు వస్తున్నాయే..” దగ్గరగా తీసుకున్నాడు చిన్నా. వాడి మనసులో ఎత్తుకోవాలనే ఉంటుంది..
శరీరం సహకరించదు కానీ.
“చిన్నా.. నన్నెందుకు తీసుకెళ్లలేదూ? ఎంత భయం వేసిందో తెలుసా? షెఫ్ అంకుల్ తన దగ్గర పడుక్కో బెట్టుకున్నారు.”
“అవునా! షెఫ్ అంకుల్ కి థాంక్స్ చెప్దాం. టీ కూడా ఉందేమో కనుక్కుందాం.. పద.” ఇద్దరూ కిచెన్ కేసి నడుస్తున్నారు.
“ఉండు.. బాత్రూం కెళ్లి వస్తా..” చిన్నా బాత్రూంలో దూరాడు.
తాము చాలా లక్కీ అనుకున్నాడు చిన్నా.
రావణాసురుడి చెరలో త్రిజట సీతమ్మని కాపాడుతున్నట్లు షెఫ్ అంకూల్.. అబ్బాస్ అన్న తమని సేవ్ చేస్తున్నారు.
సాయినాధునికి రోజూ పూలు పెట్టిన పుణ్యం అయుంటుంది.
చిన్నాకి రామాయణంలో కొన్ని ఇష్టమయిన పాత్రలున్నాయి. అందులో త్రిజట ఒకటి.
ఒకసారి డిబేట్ పెట్టారు సరస్వతీ టీచర్. అప్పుడు మీకిష్టమయిన రామాయణంలో పాత్ర గురించి మాట్లాడమన్నారు.
మిగిలిన వాళ్లందరూ.. రాముడనీ, లక్ష్మణుడనీ, హనుమంతుడనీ.. చాలా పేర్లు చెప్పారు. కానీ చిన్నా తడుముకోకుండా త్రిజట అని చెప్పాడు.
“అంత చిన్న పాత్ర ఆవిడది, రామాయణంలో.. నీకెందు కిష్టం చిన్నా?” సరస్వతీ టీచర్ అడిగింది.
“సీతమ్మని అశోక వనంలో బంధిస్తే, రాక్షసి విమెన్ ఆవిడని కష్టాలు పెట్టకుండా కాపాడింది. తన వాళ్లెవరూ లేని చోట సీతమ్మని కాపాడింది.” అందుకని.. అంటూ త్రిజట స్వప్నం గురించీ, యుద్ధంలో రామ లక్ష్మణులు చనిపోలేదని సీతమ్మని ఊరడించిన సంగతీ.. అన్నీ చెప్పాడు.
చిన్నాని బల్ల మీద నిలబెట్టి మరీ చెప్పించింది టీచర్. అందరూ చప్పట్లు కొట్టారు.
సాయినాధుని తలుచుకోగానే నాయన గుర్తుకొచ్చాడు చిన్నాకి. ఎలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో!
ఆలోచిస్తూ బయటికి వచ్చి, టింకూ చెయ్యి పట్టుకున్నాడు.
తను బ్రతికే ఉన్నాననీ, ఎప్పటికైనా ఇంటికొచ్చేస్తాననీ కబురందించ గలుగుతే ఎంత బాగుంటుంది.
దూరంగా కనిపిస్తున్న సెల్ టవర్ కేసి చూశాడు.
ఇన్నిన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో.. ఇలా బందీ అయిపోతారని ఎవరైనా అనుకోగలరా?
ఒక్క ఫోన్ దొరుకుతే.. సరస్వతీ టీచర్ కి ఫోన్ చెయ్యగలుగుతే?
ఆకాశం కేసి చూశాడు.. సూర్యుడు పైపైకి వస్తున్నాడు.
“మా అయ్య ఈ పాటికి ఇంటికెళ్తుంటాడు. నువ్వు అక్కడ కూడ ఉన్నావుగా.. కాస్త చెప్పరాదా?”
“ఏంటి చూస్తున్నావు చిన్నా?”
కిచెన్ ముందు ఆగి పోయి, ఆకాశంలోకి చూస్తున్న చిన్నాని అడిగాడు టింకూ.
“సూర్యుడిని చూస్తున్నా. మన గురించి అమ్మకీ, నాయనకీ చెప్పమని చెప్తున్నా. ఆయన అక్కడ కూడుంటాడు కదా?”
“అవునవును..” చప్పట్లు కొట్టాడు టింకూ.
“కానీ.. అబ్బాజాన్ కి చెప్పక్కర్లేదు. అమ్మీకి చెప్తే చాలు.” కోపంగా అని వంటింట్లోకి పరుగెత్తాడు టింకూ.
“షెఫ్ అంకుల్.. చిన్నా వచ్చేశాడు.”
“ఓ.. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ చిన్నా. సెకండ్ వచ్చావంట కదా?” షెఫ్, టీ కప్పులో పోస్తూ అడిగాడు.
టీ కప్ తీసుకుని మైక్రోవేవ్ లో పెట్టాడు చిన్నా.
“నేను కాదంకుల్.. జమాల్ (ఒంటె) వచ్చింది సెకండ్. షేక్ సాబ్ కి ప్రైజ్ తెచ్చింది.”
“హూ.. నిజమే..” తలూపాడు షెఫ్. జాకీ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఆఖరుకి షేక్ కి కూడా.
ఒక్క నజీర్ మాత్రం.. ఇంక రాబోయే రేసులన్నింటికీ చిన్నాని పంపుతాడు. వాడి వల్ల గెలిచినా గెలవక పోయినా లక్కీ అని ప్రూవ్ అయింది కదా!
చిన్నాని చూస్తే జాలేసింది షెఫ్ కి.
“టీ తీసుకో. అందులో కుకీస్ ఉన్నాయి అవి కూడా..”
సగం టీ, ఇంకో కప్ లోకి తీసి, టింకూ కిస్తూ, కుకీలు తీసుకున్నాడు చిన్నా.. టింకూకొకటి, తన కొకటి.
“ఎలా ఉంది రేస్?”
“చాలా బాగుందంకుల్.. ఎంత మంది జనమో! ఫెయిర్ కూడా పెట్టారు. బోలెడు బొమ్మలున్నాయి అక్కడ.” చిన్నా నెమ్మదిగా టీ తాగుతూ చెప్తున్నాడు.
“ఇవేళ డ్యూటీ ఎవరిదంకుల్? చేసేశారా?”
“మీ రూమ్ మేట్స్.. ఇద్దరూ రాలేదు. రాత్రే బయల్దేరి వచ్చేరన్నారు. ఏమయ్యారో.. ఎలా అయినా కొంచెం డల్..”
“తయారై పోయుంటారంకుల్. నేను చేస్తా. ఫ్లోర్ క్లీనింగ్ మొదలు పెడ్తాను.” గబగబా తాగేసి, చీపురు చేతిలోకి తీసుకున్నాడు చిన్నా.
అక్కడన్నీ మిని సైజువే ఉంటాయి.. మరి పిల్లల చేత చేయించాలి కదా!
పిల్లలు గదిలో కూడా కనిపించలేదే? ఎక్కడికెళ్లారో.. అలా వెళ్లటానికి వీల్లేదు కదా! ఏమై పోయారో..
రాకీ, సాండీ కాకుండా ఇంకో కుర్రాడుండాలి. సూడాన్ వాడే.. వాడేమై పోయాడూ?
ఆలోచిస్తూనే, వంటిల్లంతా ఊడిచేసి, నేలంతా తడి బట్ట పెట్టి తుడిచేశాడు.
అంతలో టింకూ, కారట్ లు, కీరా దోస కాయలూ పీలర్ తో గీశాడు.
ఇద్దరూ కలిసి సాలడ్ కి ముక్కలు చేసి పెట్టేశారు.
“లంచ్ ఏంటంకుల్?”
“పాస్తా.”
పాస్తా పెట్టటానికి పెట్టెలు తీసుకొచ్చి పెట్టేసి, తమ గదికి వెళ్లి పోయారు చిన్నా, టింకూ.
“నైస్.. బాయిస్.” షెఫ్ ప్రసన్నంగా చూసి, అసిస్టెంట్ ని పిలిచాడు.
“టింకూ! స్నానం చేసొస్తా. ఇవేళ టి.వీ చూద్దాం. నజీర్ రాడనుకుంటా.. నిన్నటి ఆనందంలో పడుకునుంటాడు. నీ కాళ్లు తగ్గాయా? చూపించు?”
పడుక్కోబెట్టి చూశాడు.
పెచ్చు కట్టింది. తగ్గి పోయినట్లే.. నొప్పి కూడా లేదు కదా!
చిన్నా బాత్రూంలోకెళ్లి తలుపెయ్యబోయాడు. ఒక మూల ఏదో కదులుతున్నట్లు అనిపించింది. బాత్రూంలో కిటికీలు లేవు. మసక వెలుతురులోనే పనులు కానిచ్చుకోవాలి.
తలుపు బార్లా తెరిచి, దగ్గరగా వెళ్లాడు.
ముడుచుకు పోయి, వణుకుతూ తన రూమ్మేట్లిద్దరూ.. సాండీ, ఇంకొక కుర్రాడు.
ఇంకెవరూ లేరు.
మిగిలిన గదుల్లో పిల్లలు కాంపౌండ్ లో తమ పనులు చెయ్యడానికి వెళ్లి పోయినట్లున్నారు.
ఇద్దరినీ బైటికి తీసుకొచ్చాడు. ఆ షెడ్లో, వరుసగా బాత్రూంలు, లెట్రిన్ లు ఉంటాయి. వాటి ముందు పొడవుగా కారిడార్..
ఆ కారిడార్ లో బట్టలు మార్చుకుంటారు. అన్నీ శుభ్రంగానే ఉంటాయి. లేకపోతే తన్నులు తినాలి.
కారిడార్ లో నిలబెట్టి చూశాడు వాళ్లని చిన్నా.
ఇద్దరి మొహాల్లో జీవం లేదు. పొద్దుటి నుంచీ ఏమీ తిన్నట్లు లేదు. ఎలా అడగాలి? భాష..?
“రూమ్ లోకి రండి. టీ తెస్తాను. తాగి మాట్లాడుకుందాం.” సగం సైగలు, సగం తను నేర్చుకున్న ఐదారు అరాబిక్ పదాలు..
రామన్నట్లు తల అడ్డంగా తిప్పారు. ఇద్దరూ గజగజ వణుకుతున్నారు. నజీర్ కొట్టాడా? వాతలు పెట్టాడా? షెఫ్ అంకుల్ సరిగ్గా పని చెయ్యట్లేదని కంప్లైంట్ ఇచ్చాడా?
ఏదో చాలా పెద్ద విశేషమే..
“నజీర్ లేడు. ఇవేళ రాడు. ఐదు నిముషాలాగండి. ఒళ్లంతా ఇసక దూరిపోయింది. స్నానం చేసి వస్తా. రూమ్ లో కెళ్లి మాట్లాడుకుందాం.. ఓ.కే?” మిడిగుడ్లేసుకుని చూశారు. నల్లగా ఉంటారేమో.. వాళ్ల తెల్ల గుడ్లు ఇంకా తెల్లగా మెరుస్తుంటాయి.
వాళ్లనక్కడే వదిలేసి తను బాత్రూంలో దూరాడు చిన్నా.
బైటికొచ్చి, గదిలోకెళ్లి, ఆ పిల్లల తువ్వాళ్లు బట్టలు తీసుకొచ్చాడు.
“స్నానం చేసి రండి. మాట్లాడుకుందాం.”
అడ్డంగా తలూపారు.
సాండీ మరీ వణికి పోతున్నాడు.
“నీ పేరేంటి?” ఇంకో పిల్లాడ్ని అడిగాడు
“సాహిల్.”
“సాహిల్.. ఏం భయం లేదు. నేనున్నా కదా! మిమ్మల్నెవరూ ఏం చెయ్యరు. రండి. స్నానం నే చేయించనా లేకపోతే..” బలవంతంగా లేపి బాత్రూంలోకి పంపాడు.
ఏ పాపం ఎరుగని పసివాళ్లు. ఏ జాతైతేనేం.. ఏ రంగైతేనేం? వాళ్లనలా హింస పెట్టడానికి ఎవరికి హక్కుంది? తనేమీ చెయ్యలేడని తెలుసు. కానీ నాలుగు ముక్కలు చెప్పి ధైర్యం ఇవ్వటంలో తప్పేం లేదు కదా!
ఇద్దరికీ బట్టలేసి, గదిలోకి తీసుకెళ్లి కూర్చో పెట్టి, దుప్పట్లు కప్పాడు. ఇంకా వణుకు తగ్గలేదిద్దరికీ.
షెఫ్ అంకుల్ నడిగి, టీ, బిస్కట్లు తెచ్చి ఇద్దరి చేతా తినిపించి తాగించాడు.
“చెప్పండి. ఏమయింది? రాకీ ఏడి?”
ఘొల్లుమని ఏడుపందుకున్నారు ఇద్దరూ.
“ఏమయింది? రాకీ నిన్న రేసులకొచ్చాడు కదా? నువ్వు కూడా వచ్చావు కదా సాండీ..”
అవునన్నట్లు తలూపాడు సాండీ.
మౌనంగా ఉండిపోయాడు చిన్నా. నిన్న రేసుల్లో ఏదో అయుంటుంది. వాడికి దెబ్బ తగిలిందేమో.. వీడు భయపడి పోయాడు.
“దెబ్బ తగిలిందా? ఏడీ వాడు? తగ్గి పోతుందిలే.”
“కాదు.. కాదు..” తల అడ్డంగా ఊపాడు సాండీ. మెడ విరిగిపోతుందేమో నన్నంత స్పీడుగా..
నిశితంగా వాడి వంక చూశాడు చిన్నా.
“నిన్న నీ రేసు అయ్యాక, నాదీ రాకీదీ అయింది. ఒకటే దుమ్ము.. బాగా ఎక్కువయింది. మధ్యలో రాకీ హెల్మెట్ ఊడి పోయింది.. అంతే..” చేతులు తిప్పుతూ, యాక్షన్ చేసి చూపిస్తూ.. భోరుమన్నాడు మళ్లీ సాండీ.
చిన్నా ఊహించగలడు జరిగింది. దుమ్మంతా కళ్లలోకి వెళ్లిపోయుంటుంది.. పట్టు జారి.. తలుచుకుంటే గాభరా వస్తోంది.
“రాకీ కింద పడి పోయాడు. ఒంటె కూడా పడి పోయింది. గబగబా అందరూ వచ్చి ఒంటెని హాస్పిటల్ కి తీసుకెళ్లి పోయారు.. రాకీని అక్కడే వదిలేసి.”
“మరి రాకీ ఏడీ?”
“మెడ విరిగి పోయింది. కాళ్లు విరిగి పోయి, వేళ్లాడుతున్నాయి. నజీర్ వచ్చాడు. వెంటన్ హస్పిటల్ కి తీసుకెళ్లచ్చు కదా! రిజల్ట్ వచ్చేవరకూ ఆగాడు. అంతలో.. రాకీ..” నేల మీద పడుక్కుని, నాలిక బైట పెట్టి, చనిపోయాడని చెప్పలేక చెప్పలేక చెప్పాడు సాండీ.
“మరి బాడీ..” గొంతు పూడుకుపోగా సైగ చేసాడు చిన్నా.
“అప్పుడే తీసుకెళ్లి పాతి పెట్టేశాడు నజీర్. ఎవరికీ చెప్పక్కర్లేదు కదా! మమ్మల్ని అమ్మేశారు కదా!”
సాండీని చూస్తుంటే కడుపు తరుక్కు పోయింది చిన్నాకి.
దేశం కాని దేశంలో ఒకరికొకరు తోడై బ్రతుకుతున్నారు. కష్టాలని, కన్నీళ్లని కలగలిపి పంచుకుంటూ..
ఆ తోడే.. తన కళ్ల ముందే కను మరుగై పోతే.. అన్ని రకాలుగా కష్టాలు అనుభవించి.. వయసుకి మించి ఎదిగి పోయారు. మానసికంగా.
దగ్గరగా వెళ్లి, హత్తుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు చిన్నా. సాహిల్ కూడా దగ్గరగా వచ్చి చేతులు వేశాడు.
ఎవరైనా అంతే కదా.. రేపు తన పని కూడా..
ఎలాగైనా బైట పడాలి. వీళ్ల అరాచకాలని బైట పెట్టాలి.
గట్టిగా నిశ్టయించుకున్నాడు చిన్నా.
“నిండా మూడడుగులు కూడా లేని తను ఏం చెయ్యగలడు.” అని ఆలోచించలేదు. ఆ క్షణం నుంచీ వేయి కళ్లతో అదే పని మీద ఉండాలని తనకి తనే వాగ్దానం చేసుకున్నాడు.
కనీసం అప్పటి వరకైనా తనని కాపాడమని వేడుకున్నాడు తను నమ్మిన సాయి నాధుని.
ఎక్కడి నుంచో చిన్నగా వెక్కిళ్లు వినిపించాయి. సాండీ, సాహిల్ ల కేసి చూశాడు చిన్నా. ఊహూ.. నేను కాదన్నట్లు సైగ చేశారిద్దరూ..
ఒక మూల ముడుచుకుపోయి, వెక్కుతూ వణికిపోతున్నాడు టింకూ.
వాడికింకా ఇటువంటివి తెలియవు.
ముగ్గురూ ఒక్క ఉరుకులో వాడి దగ్గరకెళ్లి హత్తుకున్నారు. నలుగురూ ఒక మూటలా నేల మీద పడిపోయారు.

………………….
7

అబ్బాస్ ఆ రాత్రి అస్సలు నిద్ర పోలేకపోయాడు. అతనికి ఆ రోజు నజీర్ ఇంట్లో డ్యూటీ.
రాకీ మరణం అతన్ని బాగా కుంగదీసింది. నజీర్ పక్కనే ఉండి, ఆ రాక్షసుడికి అన్నింట్లో సాయం చెయ్యవలసి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని ఎంత చెప్పినా వినలేదు.
ముందు సెకండ్ ప్రైజ్ విజయం పంచుకోవాలి.. షేక్ వస్తాడు. ఆయన మెప్పుకోళ్లు కావాలి. పురుగుల్లాంటి ఈ పిల్లలు ఉంటేనేం పోతేనేం?
అసలు తమ లాంటి వాళ్లని ఎందుకు పుట్టించాలి ఆ దేవుడు?
శరీరం ఎండిపోయిన చెక్కలాగా, హృదయం బండలాగ అయిపోయినా అప్పుడప్పుడు తను మనిషినన్న స్పృహ కలుగుతుంటుంది అబ్బాస్ కి.
తను ఎవరు?
అమ్మ మొహం గుర్తుందా? మొహం మీద ఇంత పెద్ద బొట్టు గుర్తుంది. చిరిగిన చీర కొంగు కనిపించకుండా దోపుకోడం గుర్తుంది.
గవర్న్ మెంట్ బళ్లో ఒకటో తరగతి చదువుతూ.. బళ్లో మధ్యాన్నం అన్నం తినగానే ఇంటికి వచ్చేసి, వీధిలో కొచ్చిన టాంకరు నుంచి చిన్నచిన్న బకెట్లలో నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో డొక్కు ప్లాస్టిక్ బకెట్లలో నింపడం..
కూలికెళ్లిన నాన్న, సంపాదనలో సగం పైగా తాగేసి, చాలీ చాలకుండా బియ్యం, పప్పు తేవడం గుర్తుంది.
మధ్యాన్నం కడుపునిండా తిన్నావుగా అంటూ సగం చాల్లే అని కుండ ఖాళీ చేసే నాన్న .. అతగాడు చూడకుండా రెండు ముద్దలు తను తినేవి పెట్టే అమ్మ..
గుడిసె బయట అమ్మ పక్కనే పడుక్కుని, అమ్మ ఒళ్లోని తమ్ముడిని చూస్తూ.. పైనున్న చందమామని చూపించి, వాడితో కబుర్లు చెబుతుంటే..
ఒక పెద్దాయన.. కోటేసుకుని కారులో వచ్చి, అంత దూరంలో దిగి.. ఫుట్ పాత్ మీద నిలుచుని ఉన్న నాన్నతో మాట్లాడుతూ ఇంటికి రావడం గుర్తుంది.
ఏడుస్తున్న అమ్మని ఓదార్చడం..
“ఇక్కడ చూడమ్మా. అన్నానికి బడికి పంపుతున్నావు. చదువేం చదువుతున్నాడు? ఇంకో ఏడైతే పనికి పంపుతావు. నేనైతే.. వేరే దేశం తీసుకెళ్లి బాగా చదివిస్తా. పిల్లలు లేని వాళ్లు పెంచుకుంటారు.” వరుసగా రెండురోజులు తిరిగి అమ్మని ఒప్పించాడు.
నాన్న సంతోషంగా, అమ్మ ఏడుస్తూ ఆ పెద్దాయనతో పంపడం గుర్తుంది.
ఎలా వచ్చాడో గుర్తు లేదు. నిద్ర.. నిద్ర.. నిద్ర.
ఇప్పుడు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి ఉంటారని.
ఒంటెల షెడ్ పక్కనే ఇసుకలో పడుక్కుని రాత్రి తీక్షణంగా తనకేసి చూస్తున్న చందమామకి ఆకలేస్తున్న కడుపు చూపించడం బాగా గుర్తుంది.
ఇప్పుడు ఈ పిల్లలకున్నట్లు గదులేవీ తనకి? కప్పులేని తడికల మరుగు.. ఒంటెల షెడ్ పక్కనే.
ఎండ మరీ ఎక్కువైతే, ఒంటెల పక్కనే బితుకు బితుకు మంటూ కూర్చోవడం..
రోజుకొకసారి తెచ్చి పెట్టే తిండి..
ఒంట్లో కండ అనేదే లేకుండా చేసింది.
ఇప్పుడు ఈ పిల్లలు పడుతున్న బాధలకి నాలుగు రెట్లు పడ్డాడు.
వాతలు, తన్నులు అలవాటే.. కరవు లేదు వాటికి. ఇంకా తాగే నీళ్లకి ఉందేమో కానీ.. కన్నీళ్లకి మొదలే లేదు.
పన్నెండేళ్లు వచ్చే వరకూ అబ్బాసే బెస్ట్ జాకీ. కండ లేక పోయినా ఎముకలు పెరుగుతున్నాయి కదా! బరువు పెరిగాడు ముప్ఫై కిలోలు దాటగానే.. ఎప్పుడూ ఫస్ట్ ప్రైజో సెకండో తీసుకొచ్చే ఒంటే.. మొయ్య లేక పోయింది.
పందెం వరకూ ఆగక్కర్లేకుండానే ముందుగానే వాడిని రేసుల నించి తప్పించేశాడు నజీర్. అబ్బాస్ వంటివాళ్లు ఆ వయసు వచ్చే వరకూ అక్కడుండటం అరుదు.
కొంత మందికి, కాలో చెయ్యో విరిగితే వాళ్ల దేశాలకి పంపడమో..
కొందరిని అక్కడే ఇళ్లల్లోనో, కట్టడాలు కట్టే చోట్ల పని వాళ్లుగా వాడుకోవడమో..
ఏమవుతారో వాళ్లని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా అర్ధం కాదు.
అబ్బాస్ అసలు కథ అప్పుడే మొదలయింది.
*****
ఒంటె తన బరువుని మొయ్యలేక మెల్లిగా పరుగెత్తిన రోజు.. నజీర్ ఆగ్రహంలో ఊగిపోయాడు.
అబ్బాస్ ని చేతికందిన దాంతో చితక్కొట్టాడు.
ఎలా పెరిగాడు బరువు?
“ఏం తింటున్నావురా? నాకు తెలీకుండా.. కరెక్ట్ పొజిషన్ లో కొడ్తావు కదా.. అందుకే ఆ ఒంటె నీ మాట వింటుంది. ఇప్పుడేమయింది దానికి?”
అబ్బాస్ కి మాత్రం ఏం తెలుసు? ఎముకలకీ, చర్మానికీ మధ్య ఒక పొర మాత్రం కండ ఉంది వాడికి. పొడవయ్యాడనీ.. ఎముకలు, దొరికిన దాంట్లోంచే వెతుక్కుని పెరుగుతున్నాయనీ.. దాని వల్ల బరువు పెరిగాడనీ చెప్పగలిగిన జ్ఞానం వాడికి లేదు. ఉన్నా చెప్పడానికి అసలే లేదు.
అదే విధంగా ఒంటె కూడా ఆరేళ్లలో పెద్దదవుతుందనీ.. నలభై ఐదేళ్లకీ, యాభై ఏళ్లకీ మధ్య దాని శరీర ధారుఢ్యం తగ్గుతుందనీ కూడా తెలియదు.
నజీర్ కి కూడా అవగాహన లేదు.
తన్ని పనులు చేయించుకోడం తప్ప.
దిక్కు తోచని అబ్బాస్.. ఏడుస్తూ కప్పులేని తన రేకుల గదిలో, ఒక ఛద్దరు వేసుకుని పడుక్కున్నాడు. ఆరేళ్లలో ఒక ఛద్దరు, ఒళ్లు తోముకోడానికి సబ్బు, పళ్లు తోముకోడానికి పేస్టు, బ్రష్షు సంపాదించగలిగాడు.
పెద్దవాడయ్యాడని వాడికోసం హవాయి చెప్పులు, బట్టలు కూడా ఇస్తున్నాడు నజీర్.
నజీర్ కి షేక్ ఎంత ఇస్తాడో కానీ.. వాడు మాత్రం పిల్లలకి గీచి గీచి ఇస్తాడు.
శోషొచ్చినట్టు పడిపోయున్న అబ్బాస్ కి అర్ధరాత్రి ఎవరో ఒంటి మీద రాస్తున్నట్లు అనిపిస్తే మెలకువ వచ్చింది.
నజీర్..
తన్ని లేపకుండా.. ఏదో రాస్తున్నాడు ఒంటికి. తట్టు కింద మారిపోయిన వీపుకి నూనె రాస్తున్నాడు. కాళ్లని సున్నితంగా తడుముతున్నాడు.
ఇంత సౌమ్యత.. ఇంత ఆదరణ. ఇంతటి ఆప్యాయత.. నజీరేనా?
ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కి రెండు రొట్టె ముక్కలు, గ్లాసులో గొర్రె పాలు ఇచ్చాడు. బరువు పెరుగుతారని పాలు, పిల్లల దగ్గరకి రానియ్యడు నజీర్..
అటువంటిది పాలల్లో ముంచుకుని తినమన్నాడు.
“రేపట్నుంచీ నువ్వు కావలసింది తినచ్చు. నాకు అసిస్టెంట్ కింద ఉండచ్చు. పనేమీ చెయ్యక్కర్లేదు. పిల్లలందరినీ నువ్వే చూసుకో.. నేను ముధారీ ట్రైనింగ్ కి వెళ్తుంటా అప్పుడప్పుడు.” ఎంతో నెమ్మదిగా చెప్పాడు.
అబ్బాస్ కళ్లు పెద్దవి చేసి చూశాడు. అటూ ఇటూ వెతికాడు. మిగిలిన పిల్లలేరీ?
“ఇక్కడెవరూ లేరు. అందరినీ వేరే చోటికి పంపించేశా..”
ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు..
“ఇదేంటి?”
“నేను చెప్పిన మాట విను.. టోటల్ నీ లైఫే మారి పోతుంది.” దగ్గరగా తీసుకుని ఒళ్లంతా తడుముతున్నాడు.
చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో తెలుసు అబ్బాస్ కి.
చీకట్లో చాలాసార్లు అర్ధరాత్రి అబ్బాయిల మీద పడటం చూశాడు. వాళ్లు అరవకుడా నోరు నొక్కేసి.. చేతులు పట్టుకుని నజీర్ చేసిన పని అబ్బాస్ కి ఇప్పుడు అర్ధమయింది.
కాదనగల ధైర్యం ఉందా?
ఇంకేదైనా అవకాశం ఉందా?
అప్పటి నుంచీ నజీర్ కి ప్రియుడైపోయాడు అబ్బాస్.
“నాకు వేరే ఛాయిస్ ఏముంది?” ఒంటరిగా పడుక్కున్నప్పుడు ఆలోచిస్తుంటాడు. కళ్లలోంచి నీరు తెలియకుండానే కారిపోతుంటుంది.
తన జీవితం పాడయినా.. ఆ ఎలుగు బంటి ఇంకెవరి మీదా పడకుండా తనకి చేతనయినంత చేస్తున్నాడు.
ఆ తరువాత వచ్చిన పిల్లలకి తెలియదు.. అబ్బాస్ తమకి ఎంతటి మహోపకారం చేస్తున్నాడో!
ఎప్పటికైనా పిల్లలకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలి. అబ్బాస్ కళ్ల ముందు చిన్నారి రాకీ మెదిలాడు.
కానీ.. ఎలా?
ఇంకొకరెవరైనా తోడుంటే? ఎవరికీ చెప్పకోవడాని కానీ, సహాయం అడగటానికి కానీ లేదు.
అల్లావో, రాముడో.. జీసస్సో.. ఎవరైనా సరే! తనకి ఒక తోడు పంపకూడదూ?
అల్లా పంపిన తోడు సంగతేమో కానీ.. సైతాన్ పంపిన కీడు, నజీర్ దెయ్యం పళ్లన్నీ బైట పెట్టి నవ్వుతూ వస్తున్నాడు దగ్గరగా!
…………………..

చిన్నాకి కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. అబ్బాస్ అన్న ఉంటే కాస్త ధైర్యంగా ఉండేది. వారానికి మూడు నాలుగు రోజులు అబ్బాస్ అన్న ఎక్కడికెళ్తాడో.. కానీ, ఆ మరునాడు వచ్చిన అబ్బాస్ ఒంట్లో రక్తం అంతా ఎవరో తోడేసినట్లు నీరసంగా నడుస్తూ వస్తాడు.
నజీర్ అంకుల్ కి క్లోజ్ కదా! ఇద్దరూ బాగా తాగుతారు కాబోలు.. మస్తాన్ అంకుల్ లాగ. కొంచెం అలాగే, అంకుల్ లాగే కాళ్లు ఈడుస్తూ వస్తాడు అబ్బాస్ కూడా. ఎప్పటికో కానీ మామూలుగా అవలేడు.
చిన్నాకి తన శరీరంలో కూడా మార్పులు తెలుస్తున్నాయి. మందులు వేసుకోవట్లేదు. ఏంటో అస్థిమితంగా ఉంటోంది. డాక్టర్ గారి దగ్గరకెళ్తే ఏవో మందులిచ్చేవారు. అక్కడికీ, జాయంట్స్ అవీ సాగదీస్తూనే ఉన్నాడు. చెప్పిన వ్యాయామాలు చేస్తున్నాడు.
తన సమస్య అబ్బాస్ అన్నకి చెప్తే..
ఎవర్ని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో!
పొద్దున్న అందరూ ఆలిశ్యంగానే లేచారు. నజీర్ తన్నులు లేవు. కళ్లు నులుముకుంటూ బాత్రూంలోకి వెళ్లారు నలుగురూ.
అప్పటికే అక్కడ అబ్బాస్.. ఎర్రని కళ్లతో.. ఊగిపోతూ, స్నానం చేసి వచ్చి తువ్వాలుతో తుడుచుకుంటున్నాడు.
ఒళ్లంతా ఎర్రని గాట్లు.. రక్తం చిమ్ముతూ.
కెవ్వుమని కేకేశారు.. పిల్లలందరూ.
“ఏమయిందన్నా? ఏం కరిచాయి? అందుకేనా కళ్లు అంత ఎర్రగా ఉన్నాయి? మందు రాసుకున్నావా? మండటం లేదా?” చిన్నా ఆదుర్దాగా దగ్గరగా వెళ్లి అడిగాడు. సాండీ, సాహిల్ తమ చిన్న చేతులతో గాట్ల మీద నిమురుతున్నారు. టింకూ గోడ మూలకి వెళ్లి నోట్లో వేలేసుకుని కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు.
ఇంత ఆప్యాయంగా పలుకరించే ఆత్మీయులు! వీళ్లకి తనేమవుతాడనీ.. ఎందుకంత ప్రేమ?
అప్పుడు తెగింది ఆనకట్ట..
ఎన్నో ఏళ్ల నుంచీ లోపల్లోపల దాచుకున్న, గడ్డ కట్టిపోయిన కన్నీరు.. లావాలా బైటికి వచ్చింది.
అబ్బాస్.. ఎప్పుడూ నవ్వుతూ, పిల్లలకి ఏదో విధంగా సహయపడాలని చూసే అబ్బాస్.. హృదయవిదారకంగా ఏడవడం మొదలు పెట్టాడు.
అబ్బాస్ ని బాగా ఏడవనిచ్చి దగ్గరుండి బట్టలు వేసుకోమని, టివి గదిలో కూర్చోపెట్టాడు చిన్నా.
తను గబగబా బాత్రూమ్ లోకి వెళ్లి, పిల్లలని తయారవమని కిచెన్ లోకెళ్లి అబ్బాస్ కీ, తనకీ కాఫీ, బిస్కట్లు తీసుకుని టివీ రూమ్ కి వెళ్లాడు.
“అన్నకి ఒంట్లో బాలేదంకుల్.. అందుకని నేనే తీసుకెళ్తానివేళ..” షెఫ్ కి చెప్పి, పిల్లలకి కూడా టీ, బిస్కట్లు ఇచ్చి, తమ గదిలో కూర్చోమన్నాడు.
“నజీర్ అంకుల్ వస్తే.. ఒకళ్లు పరుగెత్తుకొచ్చి మాకు చెప్పండి.” పిల్లలు ముగ్గురూ తలూపారు.. బెదురు చూపులతో.
అబ్బాస్ కాఫీ తాగాక కాస్త తేరుకున్నాడు.
చిన్నా అతని ఎదురుగా కూర్చుని తను కూడా కడుపు నింపుకున్నాడు.
అబ్బాస్ ఎర్రబడిన మొహంతో అక్కడి నుంచి లేవబోయాడు.
“కూర్చో అన్నా! చెప్పు.. ఏమయింది? ఎవరో కరిచారు నిన్ను. ఎందుకు? నిద్ర పోతున్నప్పుడు కరిచారా? నీకు నొప్పి తెలీలేదా?”
“నీకు చెప్పలేని విషయంరా! నువ్వు చాలా చిన్నవాడివి. అర్ధం కాదు. బతికునన్నాళ్లూ భరించాల్సిందే. ఇక్కడున్నన్ని రోజులూ.. నాకు తెలిసీ, ఇక్కడ నుంచి కదిలే ఛాన్సే లేదు.”
కాసేపు నిశ్శబ్దం.. ఆ గదిలో ఉన్న ఏసి చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు. అబ్బాస్ కళ్లు మూసుకుని, గోడనానుకుని వెనక్కి వాలి కూరుచున్నాడు, నేల మీద పరచిన ఛద్దర్ మీద.
ఒక నిర్ణయానికి వచ్చాడు చిన్నా.
“నేను నువ్వనుకుంటున్నంత చిన్నవాడిని కాదు అన్నా!”
కళ్లు తెరచి, ఆశ్చర్యంగా చూశాడు అబ్బాస్.
“అవునన్నా. నేను లిటిల్ పర్సన్ ని. అంటే మరుగుజ్జుని. నాకు పన్నెండో ఏడు నడుస్తోంది. ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నా. చాలా ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. రామాయణ, భారతాలలో చాలా వరకూ కథలు వచ్చు. కార్టూన్ పుస్తకాలే కాకుండా, రాజగోపాలాచారి రామాయణం కూడా చదివాను. నాకు అన్నీ తెలుసు.”
చిన్నా మిగిలిన వాళ్లకంటే కొంచెం పెద్దే అయుంటాడని అనుకున్నాడు కానీ.. ఇంత పెద్దనుకోలేదు అబ్బాస్.
ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కి తన సంగతి పూర్తిగా చెప్పాడు చిన్నా. ఒకవేళ అబ్బాస్ మంచివాడు కాకపోతే..
ఇంత కంటే చెడిపోయేదేముంది.. ఎలాగా తను ఇంక తన వాళ్లని చూడగలడో లేదో.. ఇతను మంచివాడైతే తప్పించుకోడానికి మరింత అవకాశం దొరకచ్చు. అంతా చెప్పేశాక ఏదో భారం తగ్గి పోయినట్లు నిట్టూర్చాడు చిన్నా.
“అనుకున్నా.. నీకు ఐదారేళ్లకంటే ఎక్కువే ఉంటాయని. కానీ ఇంత ఎక్కువనుకోలేదు.” అబ్బాస్ కి.. ఇంకా తన సంగతెలా చెప్పాలో తెలియలేదు. తనకంటే తప్పలేదు.. ఆ వయసునించే.. కళ్లనిండా నీళ్లు తిరిగాయి.

ఇంకా వుంది

2 thoughts on “కలియుగ వామనుడు – 6

  1. ఈ ఆట గురించి గతంలో తెలుసుకున్నా. అమానుషమైన ఆట. చిన్నపిల్లలకు మరణమృదంగం లాంటిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *