March 19, 2024

కౌండిన్య హస్యకథలు – 2 – ఇడ్లీ డే క్యాట్ వాక్ విత్ ఇడ్లీస్

రచన: రమేశ్ కలవల


ఆ రోజు ఇడ్లీ జంట తమను తాము చూసుకుంటూ ఎంతో మిడిసి పడుతున్నాయు.
వాటిని చూసి అక్కడున్న రెండు వడలు “ఎందుకో అంత మిడిసిపాటు?” అన్నాయి
అందులో మిస్టర్ ఇడ్లీ కొంచెం గర్వం ప్రదర్శిస్తూ “ఈ రోజు తారీకు ఎంతో తెలుసా” అని అడిగాయి.
“తారీకులు గుర్తుపెట్టునేంత ఏ సంగతో?” అన్నాయి వడలు
“ఈ రోజు మార్చి మప్పై. ప్రపంచమంతా ఇడ్లీల దినాన్ని ఘనంగా మూడేళ్ళ నుండి చేసుకుంటున్నారు. మీకు ఏమి తెలిసినట్లులేదే” అంది మురిసిపోతూ
ఆ వడలు కాస్తా నొచ్చుకున్నాయి. “ఇడ్లీ డే ట. వీళ్ళకు ఓ రంగా? ఓ రుచా? ఎప్పుడు చప్పగా ఉంటాయనే కదా వారితో పాటు మనల్ని కూడా ప్లేట్లలో పక్కన పెట్టి అమ్ముతారు హోటళ్ళలో. ఆమాత్రం తెలీదు వీళ్ళకు? వీటికి ప్రత్యేకంగా ఓ దినం కూడానూ?” అని గుసగుస లాడుకుంటున్నాయి.
ఆ వడల పరిస్థితి అర్థమయ్యి వాళ్ళతో “కొంచెం పక్కకు తప్పుకుంటే మేము ఓ పెద్ద ఫంక్షనుకు హాజరుకావాలి. ఈ రోజు అక్కడ సంబరాలు ఘనంగా జరుగుతాయి. మమ్మల్ని ప్రత్యేకంగా సత్కరిస్తారుట. ఇదిగో ఆహ్వానం కూడా పంపారు” అన్నాయి ఆ ఇడ్లీలు.
“ఏం సంబరాలో అవి? మీరు రోజూ మాతోనేగా కలిసి ఉండేది. ఈ రోజు మీరొక్కరే వెళ్ళి ఆ సంబరాలు చేసుకోకపోతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చుగా?” అని అడిగాయి ఆ వడలు.
ఇంతలో మిసెస్ ఇడ్లీ మిస్టర్ ఇడ్లీతో “రేపు వాళ్ళకి కూడా ఓ దినం అంటూ ప్రకటించినా ప్రకటించవచ్చు .. కాబట్టి మనతో వాళ్ళని కూడా కలుపుకుంటేనే మంచిది” అని సలహా ఇచ్చింది.
ఆ మాటకు ఆ మిస్టర్ ఇడ్లీకి గర్వం వచ్చి “ఆ వడలకు మనలాగా అసలు నిండుతనం ఏది? మధ్యలో ఇంత రంధ్రం ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఇలా ప్రత్యేక దినాలు కావాలంటే ఎలా? ఓ అర్హత అంటూ ఉండద్దు?” అన్నాడు మిసెస్ ఇడ్లీతో వెటకారంగా.
“గట్టిగా మాట్లాడకండి. వింటే నొచ్చుకుంటారు” అని ఆయనతో అంటూ మిసెస్ ఇడ్లీ అటు తిరిగి చూసింది. వాళ్ళు అది విని మొహాలు వాడినట్లుగా పెట్టారు. వేయించినవి కాబట్టి వాళ్ళ హవభావం బయటకు ఏమాత్రం కనపడనివ్వ లేదు. ఆ మిసెస్ ఇడ్లీ బ్రతిమిలాడినట్లుగా చూసింది “సరే రమ్మను. కాకపోతే ఓ షరతు.. ఓ పక్కనే నించొని చూడమను” అన్నాడు మిస్టర్ ఇడ్లీ.
“ఇంతకీ ఏమి ఫంక్షను?” అని అడిగాయి వడలు
“మేము వెళ్ళే చోట ఈ రోజు వెయ్యి రకాల ఇడ్లీలు ప్రదర్శించ బోతున్నాయనమాట” అంటూ “అక్కడ బుల్లి బుల్లి ఇడ్లీలు, వేగించిన ఇడ్లీలు, రంగు రంగుల ఇడ్లీలు అదీకాక వాటిలో రకరకాలైన సగ్గుబియ్యం ఇడ్లీలు, రవ్వ ఇడ్లీలు ఇలాగా బోలెడు ఇడ్లీలు ప్రదర్శిస్తారనమాట. వాటిన్నికంటే అందమైన, స్వచ్ఛమైన జంటగా మమ్మల్ని ఎంపికచేసారు. అక్కడ మమ్మల్ని సన్మానించి ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచుతారనమాట” అంది డబ్బా కొట్టుకుంటూ.
వడలు నోరు వెళ్ళపెట్టుకొని చూస్తూ వింటున్నాయి ఆ ఇడ్లీలను. మనసులో “నిజమేనేమో, ఇడ్లీలో ఏదో ప్రత్యేకత ఉందేమో? లేకపోతే వేయి రకాలుగా మలవటానికి కుదురుతుందంటే మాటలా? మనం ఉన్నాము ఒక్క రంగు కంటే ఎక్కువ రంగు ఎన్నడూ కనివిని ఎరుగలేదు సుమీ!” అంటూ తమ కన్నంలోంచి ఒకరినొకరు చూసుకున్నాయి. ఈ సంభాషణంతా దోసెలు, పూరీలు, కట్టె పొంగలి, దద్దోజనం, ఉప్మా లాంటివి చాటుగా విన్నాయి.
ఇడ్లీలు ముందు దొర్లుతూ నడవటం మొదలుపెట్టాయి, వెనుక వడలు నడుస్తున్నాయి. మిగతా టిఫిన్లు చడి చెప్పుడూ చేయకుండా వాటి వెనుక నడుస్తున్నాయి. కొంత దూరం నడవగానే మిస్టర్ ఇడ్లీకి ఎందుకో అనుమానం వేసింది వెనుక ఎవరో ఉన్నారని. వెనక్కి తిరిగేలోగా క్షణకాలంలో అంతా దాక్కున్నారు. ఇడ్లీలు అక్కడికి చేరుకున్నారు. లోపలకు వెళ్ళే ముందు ఇడ్లీలు వడలతో “మేము ప్రవేశించగానే మామీద ఫోకస్ లైట్లు వేస్తారు. మేము నడుస్తూ ముందుకు వెడతాము. మేము నడవగానే మీరు వెనకాలే ఆ చీకటిలో లోపలకు ప్రవేశించి ఎక్కడో ఒక చోట ఉండండి. సరేనా? వెళ్ళేటపుడు కలిసి తిరిగి వెడదాము” అంటూ వివరించి వారి పిలుపుకు వేచి ఉన్నాయి. రకరకాల ఇడ్లీలను ఆహ్వానిస్తున్నట్లుగా వినపడుతున్నాయి చివరలో ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఇడ్లీలకు ఆహ్వానం పలికారు.
“లేడీస్ అండ్ జంటిల్మెన్ .. ఈ రోజు ప్రదర్శనలో పాల్గొన్న ఇడ్లీలన్నింటిలోకి అందమైన జంట మరియు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మిస్టర్ అండ్ మిసెస్ సౌతిండియన్ ఇడ్లీ” అని ఆహ్వానించగానే లైట్ల వెలుగులో మెరిసిపోతూ ముందుకు నడిచారు. ఆ లైట్లు ఆ ఇడ్లీల వైపుకు ఫోకస్ చేసి ముందుకు వెళ్ళేకొద్ది వెనుక చీకటిలో ఆ వడలు, ఒకరి తరువాత ఒకరు అన్నీ టిఫిన్లు ఓ మూలకు చేరుకున్నాయి. ఇంతమంది వెనకనే ఉన్నారని గమనించిన వడలు కంగారులో గట్టిగా అరవబోయేలోగా దోసెలు నోరు నొక్కేసరికే మిగతావి ఊపిరిపీల్చుకున్నారు.
విచ్చేసిన పలు రకాల ఇడ్లీలు ఒక చోటకు చేరాయి. ఓ పెద్ద స్టేజీ ఏర్పాటు చేసారు. అక్కడ ముందుగా ఆ ర్యాంప్ మీద “క్యాట్ వాక్ విత్ ఇడ్లీస్” అనే షో జరగబోతోంది. అందమైన మోడల్స్ చక్కటి దుస్తులు ధరించి నిగనిగ లాడే ప్లేట్లు పట్టుకొని తెరవెనుక నించొని ఉన్నారు. ముందుగానే ఇడ్లీ జంటలకు వారు ఎవరి ప్లేటులో ప్రవేశించాలో తెలియజేసారు. ఓ జంట ఇడ్లీలు హడావుడిగా బయలు దేరాయి ఆ మోడల్ వొంగి ప్లేటు పెట్టగానే ఆ ప్లేటు మీదకు ఇడ్లీ జంట చేరి ఒకరికొకరు ఆనుకొని ఓ భంగిమ పెట్టారు. ఆ మోడల్ ర్యాంప్ మీద ఆ ప్లేటును అందరి ముందు ప్రదర్శిస్తూ ఆకర్షణగా నడుస్తూ వెడుతోంది. అక్కడ వీడియోలు, చిత్రాలు పదే పదే ఆ జంట ఇడ్లీలను తీస్తున్నారు. టివి ల కోసం ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్నాయి. ఆ రకం ఇడ్లీ నచ్చిన వారు చప్పట్లతో అభినందిస్తున్నారు.
తరువాత వేగించిన ఇడ్లీల వరుస వచ్చింది. వీరి ముద్దు పేరు “ఫ్రైడ్లీలు” వీరి మోడల్ కూడా తన ప్లేటును ప్రదర్శిస్తూ ముందుకు నడిచింది. ఈ ఇడ్లీ జంట నించొన్న ప్లేటు మీద వారి వొంటి మీద ఉన్న నూనె కారడం అదీకాక వారిని ప్రదర్శిస్తున్న మోడల్ వయ్యారి భామ నడక నడవటంతో కుదుపులకు తట్టుకోలేక మిసెస్ ఇడ్లీ దొర్లుకుంటూ కిందకు జారి పడింది. మిస్టర్ ఇడ్లీ చెయ్యి అందించాడు కానీ ఏం లాభంలేక పోయింది. వీడియో కెమెరాలు అలా దొరలుతూ వెడుతున్న దానిపై పదే పదే చూపిస్తున్నారు.
ఆ మూల నుండి అంతా గమనిస్తున్న టిఫిన్లు ఏం జరుగుతోందో ఆశ్చర్యంగా స్కీను వైపుకు చూస్తూ ఉన్నారు. అలా దొరలుతూ జడ్జెస్ కూర్చున్న వరకూ టేబులు దగ్గరకు చేరింది. అందులో ఒక జడ్జి వొంగి ఆ మిసెస్ ఇడ్లీని చేతిలోకి తీసుకున్నారు. ఇంతలో ఇద్దరి వడలలో ఒకరు “ఏదోకటి చేయాలి లేకపోతే నోట్లో వేసుకునేలా ఉన్నాడు” అంది. కాకపోతే జడ్జి ఆ ఫ్రెడ్లీ అందాన్ని ఒక్కసారి దగ్గరగా పరికించి చూసి, ఓ ముద్దు పెట్టి లేచి వెళ్ళి ఆ మోడల్ కు అందజేసారు. మిసెస్ ఇడ్లీ తిరిగి మిస్టర్ ఇడ్లీతో కలుసుకోవడంతో చప్పట్లతో ఆ ప్రదేశం మారు మ్రోగింది.
ఇకపోతే బుల్లి బుల్లి పిల్ల “బుడ్లీలు” ప్రదర్శన అందరి మనసుకు హత్తుకునేలాగా ప్రదర్శించడంతో అక్కడంతా చర్చనీయాంశంగా అయ్యింది. ఎంతైనా ముద్దు బుడ్లీలు ముద్దు బుడ్లీలే. కాకి పిల్లలు కాకికి ముద్దులాగా బుడ్లీలంటే ఇడ్లీ తల్లితండ్రులకు ఎంత ముద్దో! వారి ప్రదర్శన అయ్యి తిరిగి రాగానే బుడ్లీల మీద మిగతా ఇడ్లీలు ప్రేమానురాగాలు కురిపించడం ప్రత్యక్ష ప్రదర్శనలలో బ్రేకింగ్ న్యూస్లలో చూపిస్తున్నారు.
తరువాత కొత్తదైన సగ్గుబియ్యం ఇడ్లీల “సగ్లీలు” ప్రదర్శన మొదలయ్యింది. ఇంతలో ఆ టిఫిన్లలో ఒకరు “వీరి శాఖ వేరే శాఖట గదా? వీరికి కూడా ప్రదర్శన లో బానే చోటిచ్చారే?” అంది. “నీకెలా తెలుసు?” అని కొందరు అడిగారు. “నాకు మాత్రం వాటి శాఖ వేరే అని ఏం తెలుసు ఆ వంటాయన అంటుంటే విన్నాను” అంది. “ఇదిగో వాళ్ళలాగా మనకు శాఖలు, పట్టింపులు ఉండవు. చిన్నతనంగా అలా వాగకూడదు. అటు చూడు ఎవరైతేనే ఎంత మంచి ప్రదర్శనో చూడు” అని వినిపించడంతో వారందరి దృష్టి అటుమళ్ళింది.
చివరగా ప్రత్యేక అతిథులైన మన మిస్టర్ అండ్ మిసెస్ సౌతిండియన్ ఇడ్లీల ప్రదర్శనకు అందరూ ఎంతగానో వేచి ఉన్నారు. మిగతా తొమ్మిది వందలా తొంభై తొమ్మిది ఇడ్లీ జంటల ప్రదర్శన వేరు ఈ స్వచ్ఛమైన, సుందరమైన, పాదరసంలాంటి, మేలిమి ముత్యం లాంటి, పౌర్ణమి చంద్రుడు లాగా మెరిసి పోతున్న ఇడ్లీ జంట ప్రదర్శన వేరు. వీరి అందం ఆ మోడల్స్ కంటే చూడముచ్చటగా ఉండటంతో వీరి ప్రదర్శనకు మోడల్స్ అవసరం లేదని నిశ్చయించారు. వీరే క్యాట్ వాక్ చేస్తారనమాట. వీరి ప్రదర్శన చూడటానికి టిఫిన్స్ అంతా సిద్దమయ్యాయి. దద్దోజనంలో మెతుకు మెతుకు, ఉప్మాలో రవ్వకు రవ్వ కూడా ప్రదర్శన చూడటానికి ఆసక్తికరంగా వేచి ఉన్నాయి. ఇంతలో జిగేల్ మని రకరకాల డిస్కో లైట్లు వెలుగులతో పెద్దగా వీరిని క్యాట్ వాక్ ఎనైన్సెమెంట్ చేసారు. అందరి కళ్ళు పెద్దవి చేసి అటు చూడటం మొదలుపెట్టారు.
మంచి సంగీతం వినిపిస్తూ ఇద్దరూ చూడముచ్చటగా ఒకిరినొకరు ఆనుకొని ఆ వెలుగులో నడుస్తూ వస్తుంటే, ఆ చిత్రం రోమాంచితంగా ఉండి అందరూ లేచి నించొని, కరతళాధ్వనులతో వారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ మైమరిచి కన్నార్పకుండా ఆ జంటను చూస్తున్నారు. ఆ జంట వారి ముందు అద్భుతంగా ప్రదర్శించి, అందరినీ ముగ్గులను చేసి వారి క్యాట్ వాక్ ముగించారు. వారి ముగించిన కొన్ని నిమిషాల వరకూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. వారిని మళ్ళీ పిలిపించి ప్రత్యేక సత్కారం జరిపారు. మిగతా వడ, దోస,పూరి, దద్దోజన, కట్టెపొంగలి, ఉప్మాలు మా దినాలు ఎప్పుడు జరుపుకుంటారో ఏమో అని గట్టిగా నిట్టూర్చాయి.
ఇంతలో అందరూ ఓసారి వినమని చెప్పడంతో అందరి ధ్యాస అటుమళ్ళింది. క్యాట్ వాక్ అద్భుత ప్రదర్శనలు ముగిశాయి కాబట్టి ఇపుడు వారందరిని ఒక చోట ఉంచి అందరూ దగ్గరగా వీక్షించడానికి వీలుగా ఒక ప్రదర్శన జరుగుతుంది కాబట్టి అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే వాటిని దూరంగా మాత్రమే చూడగలరు, వాటిని ముట్టుకోవద్దని మాత్రం కోరారు. అన్నీ ఇడ్లీల జంటలు వారి వారి ప్లేట్లలో నించొని రకరకాలు ఫోజులు పెట్టారు ప్రదర్శనకు సిద్దమయ్యారు.
అందరూ వాటిని నడుస్తూ రకరకాలు ఇడ్లీలను వీక్షిస్తున్నారు. అంతా సవ్యంగా నడుస్తోంది అనుకునేలోగా జరగరానిది ఒకటి జరగబోయింది. ఒక కొంటె మనిషి మిస్టర్ అండ్ మిసెస్ సౌతిండియన్ ఇడ్లీలను ఉండబట్టలేక చేతిలో ప్లేటును తీసుకోవడం జరిగింది. ముందుగానే ఇడ్లీలను ముట్టుకోవద్దని చెప్పినా అతను పెడచెవిన పెట్టి వాటిని అలా చేయడంతో వీడియో వారి వైపుకు చూపించడంతో అది గమనించిన అందరూ ఒక్కసారిగా కేకలు పెట్టారు. అతనికి వాటిని చూస్తూ తట్టుకోలేక పోతున్నాడు, వాటిని ఎలాగైనా భక్షించాలని పెట్టుకున్నాడు. అదంతా గమనిస్తున్న వడలు అప్రమత్తం అయ్యాయి. త్వరగా వెళ్ళి ఏదోవిధంగా లైట్లు ఆపమని దోసెలతో చెప్పారు. వెంటనే వెళ్ళి వాటిని ఆపారు. క్షణం కూడా ఆలశ్యం చేయకుండా ఆ ఇడ్లీ జంటలు మిగతా టిఫిన్లతో మాయమయ్యాయి. కొంతసేపటికి లైట్లు వేసారు. చూస్తే ఒక్క ఇడ్లీ కనపడకపోవడంతో అందరూ నువ్వు తిన్నావా అంటే నువ్వు తిన్నావా అన్నట్లుగా ఒకరునొకరు చూసుకుంటున్నారు.
సమయానికి వాళ్ళని రక్షించినందుకు వడలకు ఆ మిస్టర్ అండ్ మిసెస్ సౌతిండియన్ ఇడ్లీల జంటలు కృతజ్ఞతలు తెలియజేసాయి. ఇందాక గర్వం ప్రదర్శించినందులకు క్షమించమని అడిగాడు ఆ మిస్టర్ ఇడ్లీ. మన టిఫిన్ల అందరిలో ప్రత్యేక స్థానం సంపాదించుకొని, దినాలు జరుపునే అంతలా ఎదిగిన మీకు ఆ మాత్రం చేయడం మా బాధ్యత అన్నారు ఆ వడలు. మిగతా అందరూ ఏకీభవించారు. వారు అందరూ కలిసి ఒక్కసారిగా తిరిగిరావడంతో అక్కడ ఎంత సేపుగా వేచి చూస్తున్న రకరకాలు చట్నీలు, సాంబార్లు, కూరలు వగైరాలు “ఎక్కడికి మాయమయ్యారు? మీకోసం ఎంత గాలించామో తెలుసా? “ అన్నారు. తిరిగొచ్చిన వారు జరిగిందంతా చెప్పారు. అందరూ మున్ముందు ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడానికి ప్రత్యేక సభను త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ రభసలో గాయపడిన కొన్ని ఇడ్లీలను సముదాయిస్తూ అందం శాశ్వతం కాదని కొందరు నొక్కి చెప్పారు.
ఇంతలో ఒకరు “ఇడ్లీ డే” అంటే “భక్షించి పైకి పంపించే డే” అని ఎవరికి తెలుసు? ఏదో సన్మానాలు చేస్తామంటే వెళ్ళాము కానీ లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదు అన్నారు.
అవునవును మన రక్షణ కోసం ఈ ప్రత్యేక దినాలను బహిష్కరించాలి అంటూ ఉద్యమం సాగిద్దామంటూ “పదండి ముందుకు పదండి త్రోసుకు” అన్నడొక శ్రీ శ్రీ ఇడ్లీ గారు ఉద్యమం లేవదీస్తూ.
అందరూ క్షేమంగా వచ్చినందుకు మనందరం ఇడ్లీ డే జరుపుకోవాలి అంటూ ఒకరు సలహా ఇచ్చారు.

శుభం భూయాత్!

1 thought on “కౌండిన్య హస్యకథలు – 2 – ఇడ్లీ డే క్యాట్ వాక్ విత్ ఇడ్లీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *