March 19, 2024

తేనెలొలుకు తెలుగు-2

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

భాషలోని తియ్యదనం తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్లక తప్పదు. నగరాలు ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో గ్రామీణ జీవితాల్లోకి తొంగి చూస్తే…
అప్పటి ఆటలు, పాటలు, వేడుకలు, సంబరాలు, జాతరలు, బారసాలలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు, పేరంటాలు అన్నీ సాహిత్యంతో ముడిపడి ఉన్నవే.
పుట్టిన దగ్గర్నుంచి పుడకల్లోకి చేర్చేదాకా అన్ని సందర్భాలను సాహిత్యమయం చేశారు మనవాళ్లు.
పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడానికి తల్లి
చిన్నగా రాగం తీస్తూ పాట పాడుతుంది. ఏమని. .
.
‘ఏడవకు ఏడవకు చిన్నినాయనా
ఏడిస్తె నీ కళ్ల నీలాలు గారు
నీలాలుగారితే నే చూడలేను
పాలైన గారవే బంగారుకళ్లా’ జో జో

ఆప్యాయత నిండిన అలతి పదాల్లో ఎంత సొగసున్నదో చూడండి. ఏడవకురా నాన్నా ఏడిస్తే నీ కళ్లల్లో నీళ్లు కారుతాయి. నీ కన్నీళ్లు నేను చూడగలనా అనే తల్లి మనసు ఎంత సుందరంగా పాటలో ఒదిగిందో.
ముప్పయి నలభై ఏళ్ల కిందివారు విన్నవే ఇవన్నీ. ఇంట్లో బారసాల, అదే తెలంగాణాలో ఐతే ఇరవైయొక్కటో దినం నాడు పాపనో బాబునో తొట్లెలో వేసి పేరంటాళ్లందరూ తలా ఒక లాలి పాటగాని, జోలపాటగాని పాడటం ఆనవాయితీ. వాటిల్లో

జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా బాగా ప్రసిద్ధి వహించింది.

అలాగే ఇంకాస్త పెద్దైన తరువాత పిల్లవాడికి ఉగ్గు తినిపిస్తూనో, ఏడిచే పిల్లణ్ని ఓదారుస్తూనో ఆరు బయట వెన్నెల్లోకి వెళ్లి

చందమామ రావె జాబిల్లి రావె
కొండెక్కి రావె గోగు పూలుతేవె అంటూ సముదాయించేవారు.

అప్పుడప్పడే నిలబడే పిల్లల్ని అమ్మమ్మనో నానమ్మనో ఆడిస్తూ
తారంగం తారంగం
తాండవకృష్ణా తారంగం
వేణూనాథా తారంగం
వేంకటరమణా తారంగం అని

అరచెయ్యి తిప్పుతూ పాడుతూంటే వాళ్లూ అలాగే తిప్పటం చూసి మురిసిపోయే సన్నివేశాలు ఇప్పుడు అరుదయ్యాయి. ఎందుకంటే ఒకప్పుడు సమిష్టి కుటుంబం ఉండేది. ఇంట్లో ఒకరో ఇద్దరో పెద్ద వయసు వాళ్లు, అలాగే నడీడు వాళ్లు, పడుచు జంటలు, అమ్మాయిలు , అబ్బాయిలు, చిన్న పిల్లలు అందరూ కలిసి ఉండటంతో సందడి ఉండేది, సరదాలుండేవి. వంటలూ, వార్పులూ, వడ్డనలూ, ఉప్పునీళ్ల మోత, మంచినీళ్ల మోత ఇలాంటివన్నీ ఇప్పుడు కనిపించే అవకాశం లేదు. భార్యా భర్తలు ఉద్యోగాలకు, చిన్న పిల్లలుంటే బేబీ కేర్ సెంటర్లకు, పెద్దపిల్లలయితే స్కూళ్లకు, ముసలి వాళ్లు అయితే పల్లెటూళ్లల్లోనో, వృద్ధాశ్రమాల్లోనో ఉండేసరికి ఈ అచ్చట్లూ ముచ్చట్లూ కనుమరుగవుతున్నాయి. ఇది గమనించాల్సిన విషయం.

భాష తీయదనం తెలియాలంటే ఆడవాళ్లు కాని మగవాళ్లు కాని ముచ్చట్లు పెట్టుకునేప్పుడు గమనించాలి. సందర్భానికి తగిన హావభావాలు, ఆనందాశ్చార్యాలు మాటల్లో కలగలిసి ఒక అనుభూతిని కలిగిస్తాయి. వెనకటి వాళ్లయితే మాటల్లో జాతీయాలు నుడికారాలు అలవోకగా పొదిగి మాట్లాడేవారు. అవి సహజసుందరాలు.
“ఏమో వొదినా. ఈయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు పిల్లదాని సంబంధం కోసం. చెప్పులరిగేట్టు తిరిగినా ఒక్క సంబంధమూ కలిసిరావడంలేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు. ఏం చెయ్యడమో దిక్కుతోచడం లేదు.

అవునమ్మా నువ్వన్నది నిజమే. అయినా దేనికైనా కాలం కలిసి రావాలి. కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్టు పెళ్లి ఘడియ వచ్చిందంటే అన్నీ వాటంతటవే జరిగి పోతాయి. “

“అబ్బో మా మనవలు వస్తే ఇల్లు పీకి పందిరి వేస్తారు”

“వాడొస్తే కొంప కొల్లేరే”

“వాళ్లాయన నోరు మెదపరు. అది ఏం చెబితే దానికి గంగిరెద్దులా తలూపుతారు. ”

ఒకప్పటి నవలలు చదివినా, పాత తెలుగు సినిమాలు చూసినా జీవద్భాషయైన తెలుగు సోయగం కనిపిస్తుంది.
కవులైనా రచయితలైనా సహజమైన సన్నివేశాలను తమ రచనల్లో పొందు పరిచినప్పుడు అవి అందించే ఆనందం అంతా ఇంతా కాదు.

గోప బాలకులు చల్దులారగించే సన్నివేశాన్ని పోతన్న సీస పద్యంలో చిత్రీకరించిన విధానాన్ని చిత్తగించండి.

సీ. మాటిమాటికి వేలు మడిచి యూరించుచు
యూరుగాయలు దినుచుండునొక్క
డొకని కంచములోని దొకడు చయ్యన మింగి
చూడులేదని నోరు చూపు నొక్క
డేగు రార్గుర చట్టు లెలమి బన్నిద మాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్క
డిన్నియు దగబంచి యిడుట నెచ్చెలితన
మనుచు బంతెన గుండులాడు నొకడు

ఆ. కృష్ణు జూడు మనుచు గికురించి పరు మ్రోలి
మేలి భక్ష్య రాశి మెసగు నొకడు
నవ్వు నొకడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకడు మురియి నొకడు

ఎంత అందమైన సన్నివేశం. ఎంత రమ్యమైన వర్ణన.
నలుగురు పిల్లలు చేరితేనే సందడి. అలాంటిది కలిసి తింటే రకరకాల మనస్తత్త్వాలు కలిగిన గోప బాలకుల ఆకతాయితనం ఎలా ఉంటుందో సహజ సుందరంగా రచించారు. చదువుతుంటే మన బాల్యాలు మనకు గుర్తు రావటం ఖాయం. ఈ పద్యానికి ప్రత్యేకంగా వివరణ అవసరం లేదనుకుంటున్నా. వచ్చే నెల మరిన్ని కబుర్లు చెప్పుకుందాం.

1 thought on “తేనెలొలుకు తెలుగు-2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *