March 19, 2024

పాజిటివ్ థింకింగ్

రచన: గిరిజ కలవల

పూజ, టిఫిన్ అవగానే…. వంటకు తొందరలేదు.. ఈరోజు లంచ్ కి ఈయన ఎలాగూ రానన్నారు.. నెమ్మదిగా ఆలోచిద్దాం దాని సంగతి అనుకుంటూ, చాలా రోజులుగా పెండింగ్ లో వున్న నవలని తీసుకుని సోఫాలో చతికిలపడ్డాను. రెండు పేజీలు చదివానో లేదో, వసుధ దగ్గరనుండి ఫోను వచ్చింది. ” వాణీ… ఏం చేస్తున్నావు…. ఉన్నపళంగా బయలుదేరి మా ఇంటికి రా..” అంది.. ఏమీటే సంగతి అని అన్నా కూడా ఏం చెప్పలేదు. ఇక చేసేదేం లేక లేచి చీర మార్చుకుని, తాళం వేసి బయలుదేరాను. రోడ్డు మీదకి రాగానే ఆటో దొరికింది. వసుధ అడ్రసు చెప్పి ఆటోలో బయలుదేరాను. ఏమయి వుంటుంది.. ఏ సంగతీ చెప్పకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు రమ్మందో అని ఆలోచించసాగాను. వసుధ, నేను చిన్నపాటి నుండి ప్రాణస్నేహితురాళ్ళం. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఒకేవూరికి కాపురాలకు రావడంతో ఆ స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది. నాకూతురు పూజ, వసుధ కూతురు సింధు కూడా ఒకే వయసు వారవడంతో.. మా స్నేహం రెండో తరానికి కూడా పాకింది. పై చదువుల కోసం మేము పూజని అమెరికా కి పంపినపుడు, వసుధ, వాళ్ళాయన సింధుని పంపడానికి ధైర్యం చేయలేకపోయారు. పిల్లని వదిలి వుండలేమని పంపలేదు. సింధు కూడ అమ్మ నాన్న లని వదిలి ఒక్క రోజు కూడా వుండలేదు. ఉన్న వూళ్లో నే MBA లో జాయిన్ చేసారు.
మా పూజ అక్కడ చదువుతూండగానే, గ్రీన్ కార్డు వున్న అమెరికా సంబంధం గురించి మా అన్నయ్య చెప్పాడు. అన్నయ్య స్నేహితుని కొడుకు కిరణ్, అన్ని విధాల అందరికీ నచ్చడంతో, కిందటి సంవత్సరం పూజ, కిరణ్ ల పెళ్లి గ్రాండ్ గా చేసి, పర్మినెంటు గా పూజని అమెరికా నివాసిని చేసేసాము. దాని కోరికా అదే.. మేము కోరుకున్నదీ దాని సుఖమే..
అయితే వసుధ మాత్రం ఈ విషయంలో నాతో చాలా పోట్లాడింది. ఒక్కగానొక్క కూతురిని అంత దూరంలో పంపడమేమిటి అని దాని వాదన. తన కూతురు సింధుని మాత్రం దూర ప్రాంతాల సంబంధాలు చచ్చినా చెయ్యనని చెప్పింది. ఈ కారణంతో సింధు పెళ్ళి కొద్దిగా ఆలస్యం అయింది.
సింధుకి తగిన వరుడు రవి అనుకోకుండా నా కంట పడ్డాడు. శ్రీవారి స్నేహితుడు మూర్తి, రూప ల కూతురి పెళ్ళి కి మేము వెళ్ళడం, అక్కడ రూప కి అక్క కొడుకు రవి ని చూడ్డం జరిగింది. ఆరడగుల అందగాడు, చలాకీగా అందరితో కలివిడిగా తిరగడంతో ఆసక్తి తో రూపని వివరాలు అడిగాను. ” మా అక్క సుమతి ఇద్దరి కొడుకుల్లో వీడు రెండోవాడు. పెద్దవాడు అమెరికా వెళ్లి పోయాడు. వీడికి లక్షల్లో జీతంతో అమెరికా ఆఫర్స్ వచ్చినా అమ్మ నాన్న లని వదిలి వెళ్ళేది లేదని అవన్నీ వదులుకున్నాడు. MBA చేసి ఇక్కడే ఏదో MNCలో నెలకి ఏభై వేల జీతం సంపాదించుకుంటున్నాడు. వచ్చే పిల్ల కూడా అమెరికా మోజు లేనిదీ, తన తల్లి తండ్రులు తో పాటు వుండడానికి ఇష్టపడేదీ అయివుండాలనుకుంటున్నాడు. ” అంటూ చెప్పి తన అక్క సుమతిని పరిచయం చేసింది. ఆవిడతో నేను సింధు గురించి చెప్పి ఫోటో చూపించగానే ఆవిడకి సింధు ఎంత గానో నచ్చింది. కొడుకు ని పిలిచి చూపించింది. రవి కి కూడా సింధు నచ్చింది. సింధుకి కూడా తల్లితండ్రులను వదిలి విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదని తెలిసేసరికి సుమతి కొంచెం ఉత్సాహం చూపింది . నేను వెంటనే వసుధ కి ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పి రెండురోజుల్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసాను. అన్ని విధాల ఉభయులకూ నచ్చడంతో ముహూర్తాలు పెట్టేసుకున్నారు. రెండు వైపులా నేను మథ్యవర్తిత్వం వహించి వైభవంగా పెళ్ళి జరిపించాను. ఆహుతులందరి నోటా ఒకటే మాట.. చూడ ముచ్చటి జంట.. రవి సింథు అని.
పదహారురోజుల పండుగ అవగానే మంచిరోజు చూసి సింధుని అత్తగారింటికి కాపురానికి పంపారు. ఉన్న ఊళ్లో నే అయినా కూడా పంపలేక పంపలేక పంపారు. వాళ్ళ బెంగ చూసి సుమతి, వసుథ తో ” వదినా, బెంగ పెట్టుకోకండి… ఊళ్ళోనేగా.. ప్రతీ వారం కలుసుకుంటూవుండవచ్చు.. ఓ ఆదివారం మీరిద్దరూ మాఇంటికి వచ్చెయ్యండి, మరో ఆదివారం మేమంతా మీ ఇంటికి వచ్చేస్తాము” అంటూ ధైర్యం చెప్పింది. ఆడపిల్లలు లేని సుమతికి సింధు ఆ లోటు తీర్చింది. కోడలిని ఎంతో అపురూపంగా చూసుకునేది సుమతి. ఈ ఆనంద సందోహాల మథ్యలో సింథు నెలతప్పిందన్న శుభవార్త రెండు కుటుంబాలలోనూ సంతోషం ఇనుమడించింది. మూడో నెల వచ్చిందని వసుథ మొన్ననే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇంత అర్జంటుగా ఉన్నపళాన ఎందుకు రమ్మందో ఏమిటో అర్థం కాలేదు.
ఆటోవాడు” ఇల్లు ఎక్కడమ్మా..” . అని అడుగుతూంటే ఆలోచనలనుండి బయటకి వచ్చి “అదిగో ఆ పచ్చగేటు ముందు ఆపు” అన్నాను. వాడికి డబ్బులు ఇచ్చి.. లోపలకి వెళ్ళాను. తిన్నగా బెడ్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ సింధుకి టిఫిన్ కాబోలు తినిపిస్తోంది వసుధ. ” ఏరా.. సింథూ.. ఎలా వున్నావురా…కంగ్రాట్స్ తల్లీ..” అని పలకరించాను. సింథు జవాబు ఇవ్వకుండా కళ్ళు తుడుచుకుంటూ బయటకి వెళ్లి పోయింది. ఏం జరిగిందో తెలీక నివ్వెరపోయాను ” ఏమైంది వసూ… ఏం జరిగింది? ఎందుకు అర్జంటుగా రమ్మన్నావు? సింధు అలా ఎందుకు వుంది? ” అని అడిగాను. వసుధ కూడా కళ్ళు తుడుచుకుంటూ..” ఏం చెప్పమంటావు.. అంతా మా ఖర్మ.. దేముడు మామీద చిన్నచూపు చూసాడు” అంది.
” అసలేం జరిగిందో చెప్పు వసూ… సింధు కాపురం సజావుగా సాగడం లేదా… రవితో కానీ, సుమతితో కానీ ఏమైనా తేడాలు వస్తున్నాయా.. ” అని అడిగాను.
జవాబుగా వసుధ చెప్పిన విషయం విని నివ్వెరపోయాను. నోట మాట రాలేదు. ఏమిటిది? నిజంగానేనా? ఎలా ఇప్పుడు? ఇలా ఎన్నో జవాబు లేని ప్రశ్నలు ఉదయించాయి.
” నిజంగానేనా… ఇంకో సారి టెస్టు చేయిద్దాం ” అన్నాను. ” లేదు వాణీ… రిపోర్టు సరిగ్గానే వచ్చింది.” అంది వసుధ. ఇంతలో వాళ్ళాయన పిలవడంతో హాల్లో కి వెళ్ళింది. తను చెప్పిన మాటలు నా చెవిలో ఇంకా వినపడుతూనేవున్నాయి. ” వాణీ… మొన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ దగ్గరికి సింథుని తీసుకువెళ్లాను. ఆవిడ అన్ని టెస్టులు రాసింది. ఆప్రకారం అన్నీ చేయించాను. అప్పుడే బయటపడింది సింథుకి ఎయిడ్స్ వుందని. మాకు ప్రపంచం తలకిందులు అయిపోయింది ఆ మాట వినగానే. సింధు సంగతి చెప్పనవసరమే లేదు. అప్పటినుంచి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే వుంది. మేమేం పాపం చేసామని భగవంతుడు ఇలా చేసాడు. ఉన్న ఊళ్లో ఎదురుగా వుంటుందికదా.. అని పెద్దగా వాకబు కూడా చెయ్యకుండా నువ్వు చెప్పిన సంబంధం చేసి దాని బతుకు బుగ్గి చేసాము. వాడి మూలంగా నా చిట్టితల్లి అన్యాయం అయిపోయింది. ” అంది.
“వసుధా..రవిని అనుమానిస్తున్నావా? ” అన్నాను.
“అంటే.. సింథుని తప్పు పట్టమంటావా?” అంది వసుధ. నేనేం మాట్లాడలేకపోయాను.
రవి అటువంటి అలవాట్లు వున్నవాడు కాదని నా నమ్మకం. అలా అని సింధు చిన్నప్పటి నుండి నాముందు పెరిగిన పిల్ల. అయినా అలాంటి ఊహే నాకు ఒళ్లు జలదరించింది. ఇలా ఎలా జరిగిందో.. ఇప్పుడేం చెయ్యాలో.. తోచడం లేదు.
వసుధ వాళ్ళాయన ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆయన చేతుల్లో ఏవో మెడికల్ రిపోర్టులున్నాయి. ” ఆ రవికి కూడా టెస్టు చేయించాము ఉదయం. ఆ రిపోర్టు లే ఇవి.” అని నాకు చెప్పి ” ఏమయిందండీ…. రిపోర్టు లో ఏముంది? ఎన్నాళ్లు నుండి అతనికీ జబ్బు వుందో చెప్పారా డాక్టర్లు?” అని అడిగింది.
ఆయన ” లేదు వసూ…. రవి రిపోర్టులు నార్మల్ గా వచ్చాయి. అతనికి ఈ జబ్బు లేదట. కేవలం మనమ్మాయికే వుందట. రవి ద్వారా సింధుకి ఈ జబ్బు రాలేదట.” అనగానే వసుధ ఒక్కసారిగా గొల్లుమంది.
సింధు మా మాటలు, వసుధ ఏడుపు వికుండా తలుపు దగ్గరకు వేద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే సింథు మా మాటలు వినడం, రెండో బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోవడం జరిగింది. నేను కంగారుగా””వసూ.. సింధూ రూమ్ తలుపు వేసుకుంది.. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో.. ఏంటో ” అని పెద్దగా అరిచాను. వెంటనే ముగ్గురం ఆ రూమ్ తలుపు దబదబా బాదుతూ” సింధూ.. తలుపు తీయమ్మా.. నిన్ను మేమేమీ అనుకోవడం లేదు.. ఏమీ చేసుకోకు తల్లీ… ముందు తియ్యి.. ” అంటూ అరవసాగాము.
ఇంతలో రవి వచ్చాడు. పరిస్థితి గమనించి బలంగా తలుపుని బాది పగలకొట్టి లోపలకి వెళ్లేసరికి సింధు ఫేన్ కి చీర బిగించే ప్రయత్నం లో వుంది. ఒక్కవుదుటన సింధుని కిందకి లాగి హాల్లోకి తీసుకువచ్చాడు. హిస్టీరియా వచ్చినదానిలా సింధు తలబాదుకుని ఏడ్చేస్తోంది.
” నాదగ్గరకు రాకండి.. నన్ను తాకకండి.. రేపు పుట్టబోయే నా బిడ్డకి కూడా ఈ జబ్బు వచ్చేస్తుంది. నేనేం పాపం ఎరుగను. నాకెందుకు అవాలి ఇలా… పదిమందికి మొహం చూపీయలేను. మిమ్మల్ని క్షోభ పెట్టలేను. నన్ను చచ్చిపోనివ్వండి” అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. సింధుని దగ్గరకి తీసుకుని ఓదార్చాడు రవి. మంచినీళ్లు తాగించి సింథు ఊరడిల్లాక” అత్తయ్యా, మామయ్యా, ఆంటీ, సింథూ.. ఇప్పుడు ఏమయిందని మీరందరూ ఇంత బాధ పడుతున్నారు. కారణం నేనుకున్నారు.. కానీ కాదని తెలిసింది. నేనెక్కడ సింధుని తప్పుపడతానో అని మీరందరూ ఫీలయిపోతున్నారు. అయినా, ఇదివరకు ఒకసారి సింధు కళ్లు తిరిగి పడిపోవడంతో, రక్తం తక్కువగా వుంది ఎక్కించాలని డాక్టర్ చెప్పిన ప్రకారం ఎవరో డొనేట్ చేసిన రక్తం ఎక్కించామని అన్నారు గుర్తువుందా.. అప్పుడు సరైన టెస్టులు చేయించకుండా ఎక్కించివుంటారు. దాని ఫలితమే ఇప్పుడు సింధు అనుభవిస్తోంది. ఎలా వచ్చిందో ఇప్పుడు మనకి అనవసరం. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు. ఇకముందు ఎలా వుండాలన్నదే ముఖ్యం. నేను డాక్టర్ ని కనుక్కున్నాను. ముందు సింధు ధైర్యంగా, మనోనిబ్బరంగా వుండాలి. ప్రసవ విషయం లో డాక్టర్ చెప్పినట్టు విని, ఇప్పటినుండి మందులు వాడితే పుట్టబేయే బిడ్డకు ఎటువంటి హాని వుండదట. సిజేరియన్ ఆపరేషన్ జరగాలట. తల్లి పాలు వద్దన్నారు. డబ్బా పాలు పడదాం. మంచి ఆహారం తీసుకుంటూ, వేళకి మందులు వేసుకుంటూ, మంచి ఆలోచనలతో, భవిష్యత్తు మీద ఆశతో, నమ్మకంతో సింధు వుంటే చాలు. ఒక బి. పీ, ఒక సుగర్ వ్యాథి లాగానే ఇది కూడా అనుకోండి. వాటికి చికిత్స లేదు జీవితాంతం మందులు వేసుకున్నట్లే ఈ జబ్బు కి కూడా వేసుకోవడమే. ముందు మనందరం థైర్యాన్ని సింథుకి ఇవ్వాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సింథు చేయి వదిలేది లేదు. అయినా ఏ మనిషి కి మాత్రం కలకాలం బతుకుతామనే హామీ ఎక్కడుంది? ఎవరు ముందో.. ఎవరు వెనకో.. ఎవరికి తెలుసు? ఇది అంటరాని జబ్బు కాదు. వెలివేయాల్సిన అవసరం లేదు. నేనైతే సింధుకి జీవితాంతం తోడుగా నీడగా వుండి తీరతాను. ఎటువంటి అపార్థం నేను చేసుకోలేదు. దేముడు చిన్న పరీక్ష పెట్టాడు అంతే. మన మనో స్థైర్యం తో గట్టెక్కుతాము. ఇటువంటి అఘాయిత్యం సింథు మరెన్నడూ చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. మనందరం తనకి తోడుగా నిలబడి జీవితం మీద ఆశని కల్పించి థైర్యాన్ని ఇద్దాము. పూర్ణాయుష్షుతో సింథు తన ఆరోగ్యవంతురాలైన బిడ్డతో గడుపుతుంది. ”
రవి మాటలు విన్న మాకు ఎంతో ఎత్తుకు ఎదిగిన మహనీయుడిలాగా అనిపించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక భర్త ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అలాగే ఆలోచిస్తాడని అనుకున్న మాకు రవి భగవంతుని రూపంలో కనిపించాడు. ఎంత తేలిగ్గా మా బాధని చెరిపేసాడు. అతని ఔన్నత్యం ఎంత గొప్పగా వుంది. దేముడు చిన్న చూపు చూసిన సింథు పాలిట దేముడే అయ్యాడు. ఆనందంగా నేను, వసుధ కళ్లు తుడుచుకున్నాము. సింధు తన కన్నీటి తో రవికి పాదాభిషేకం చేసింది. రవి ఆప్యాయంగా సింధు ని కౌగిలి లోకి తీసుకుని తల నిమురుతూ ” ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. నాకు నచ్చలేదు. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. భోంచేసి రెస్ట్ తీసుకో. ఇకనుండీ నీ బాధ్యత నాదే” అన్నాడు. తేలికపడ్డ మనసుతో సింథు పసిపిల్లలా రవి చేతిలో ఒదిగిపోయింది. మాకు కూడా మనసులోని భారం చేతితో తీసినట్లయిపోయి ఊపిరి పీల్చుకున్నాము.
ఇంటికి బయలుదేరిన నా మనసు నిండా రవే నిండిపేయాడు. నిజానికి ఈ హెచ్. ఐ. వి. పాజిటివ్ అనే జబ్బు ఓ భయంకరమైనదే అందరి దృష్టిలో. ఆ జబ్బు పాల్పడిన వారిని అంటరాని వారిగా చూడడం సమాజంలో పరిపాటి అయింది. దీనిపట్ల అవగాహన లేని వారిలోనూ, దిగువతరగతి కుటుంబాలలోనూ ఈ భావన ఎక్కువగా వుంది. వారి చెడు అలవాట్లు ద్వారా వారి జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా జీవిత భాగస్వామిని కూడా బలి తీసుకుంటున్నారు. అంతేకాక ముక్కుపచ్చలారని పిల్లలు కూడా తల్లితండ్రుల తప్పులకు బలి అవుతున్నారు. సింథు లాంటి అమాయకులు ఇతర కారణాల తో ఇలాంటి జబ్బులకి బలవుతున్నారు. ఒకసారి నేను విన్న సంఘటన గుర్తు వచ్చింది. సరదాగా స్నేహితురాళ్ళ తో సినిమాకు వెళ్లిన ఒక అమ్మాయి కి వీపు మీద ఏదో గుచ్చుకున్నట్లు అయిందట. ఏదో కుట్టింది అనుకుని తడుముకుని చూసేసరికి, ఓ స్టిక్కర్ అంటించివుంది. దాని మీద మా ప్రపంచంలోకి ఆహ్వానం అని వుందట. ఆ తర్వాత ఆ అమ్మాయి జబ్బు పడడం, పరీక్షలు చేయిస్తే హెచ్. ఐ. వీ. అని తేలడం జరిగిందట. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనమైపోయిందని తెలిసాక ఎంతో బాధ పడ్డాను. అటువంటిదే ఇప్పుడు సింధు జీవితంలో జరిగింది. రెపరెపలాడే ఆ జ్యోతి కి రవి తన రెండుచేతులు పట్టి ఆరనీకుండాచేస్తున్నాడు. ఆ పాజిటివ్ జబ్బుకి నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా తన సపోర్టు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం.

2 thoughts on “పాజిటివ్ థింకింగ్

  1. మా చుట్టాలమ్మాయికి అక్షరాలా ఇదే పరిస్థితి ఎదురైంది. పాపం ఆ అమ్మాయిని పుట్టింటికి పంపేశారు. రవి లాంటి వారు నిజ జీవితంలో ఉంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *