March 19, 2024

సినీ (మాయా)లోకం – తారే జమీన్ పర్

పరిచయం: సరితా భూపతి

ఎప్పట్లాగే ఈ సంవత్సరమూ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థిని ఆ నాలుగు మార్కులేమయ్యాయని అరిచారు. సబ్జెక్ట్ పోయిన విద్యార్థిని వెలివేసారు. తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత సాధారణంగా వినగల్గుతున్నామో ఇవన్నీ. పువ్వుల్లాంటి పిల్లల బాల్యాన్ని చదువుల పేరుతో ఎలా నలిపేస్తున్నామో! పొద్దు పొద్దున్నే నిద్రలేపి, గాడిద బరువులు భుజానికేసి బడికి పంపిస్తాం. రాచిరంపాన పెట్టే చదువులు, పనిష్మెంట్లు బడిలో. ఇంటికి రాగానే హోం వర్కులంటూ పేరెంట్స్ యమకింకరుల్లా తయారు. చదువు ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వాలి. కానీ, ర్యాంకులు, మార్కులే ఇపుడు జీవన్మరణ సమస్యలయిపోయాయి. ప్రతి పిల్లలూ ఒక అద్భుతమే. ఒక్కొక్కరిలో ఏదో ఒక కళ దాగుంటుంది. అకాడెమిక్స్ లో ర్యాంకులే జీవిత పరమావధి కాదు అని ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, మార్కుల కోసం ఒత్తిడి పెంచుతున్న పేరెంట్స్ కి చిలక్కి చెప్పినట్టు చెప్పిన సినెమా ” తారే జమీన్ పర్”.

ఇషాన్ అనే ఎనిమిదేళ్ళ కుర్రాడు, డిస్లెక్సియా అనే రీడింగ్ డిసార్డర్ వల్ల సరిగ్గా చదవలేకపోతాడు. తన సమస్యని పేరెంట్స్ గానీ, టీచర్స్ గానీ గుర్తించలేకపోతారు. స్కూల్లో ఎప్పుడూ పనిష్మెంట్లతో క్లాస్ రూమ్ అవతలే నిలబడి ఉంటాడు ఇషాన్. హోం వర్క్ చేయకుండా బొమ్మలేస్తూ ఉంటూ, పేరెంట్స్ తో చీవాట్లు పడుతుంటాడు. తన ఆర్ట్ లో ప్రావీణ్యతను పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. సరిగ్గా చదువుకోకపోవటమే వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. క్రమశిక్షణ కోసం బోర్డింగ్ స్కూల్ కి పంపుతారు. ఇంట్లో ఉన్నపుడు బొమ్మలేస్తూ, బయట నచ్చినట్టు ఆటలాడుకుంటూ (చీవాట్లు పడుతున్నప్పటికీ) ఉన్న హ్యాపీ సోల్, హాస్టల్ కి వెళ్ళాక తనని తాను పూర్తిగా కోల్పోతాడు. తనకెంతో ఇష్టమైన ఆర్ట్ కూడా మానేస్తాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. పుస్తకాల్లో అక్షరాలు ఎంత చదవటానికి ప్రయత్నించినా, కదులుతున్నట్టు కనపడతాయి. చదవలేకపోతాడు. కొన్నాళ్ళకి, టెంపరరీ ఆర్ట్ టీచర్ గా రామ్ శంకర్ నికుంబ్ (ఆమిర్ ఖాన్) ఆ స్కూల్లో చేరతారు. మెుదటి రోజే, పిల్లలందర్ని ఆ ఒత్తిడి వాతావరణం నించి కులాసాగా మారుస్తాడు. కొద్ది రోజుల్లోనే ఇషాన్ సమస్యను గుర్తించి, ఆ లోపాన్ని అధిగమించే శక్తి తనలోనే ఉందనే ధైర్యాన్నిస్తాడు. తను అక్షరాలను రాస్తున్న విధానాన్ని స్టెడీ చేసి, నిదానంగా రాయటం, చదవటం సులభమయ్యేలా చేస్తాడు. తనలోని ఆర్ట్ ప్రతిభను గుర్తించి, బెస్ట్ స్టూడెంట్ గా నిలబెట్టే వరకూ తన తపన ఆగని, ఉన్నత ఉపాధ్యాయున్ని మనకు పరిచయం చేస్తాడు. చిన్న పిల్లలు సృష్టిలో ఎంత అద్భుతమో..వారి పసి హృదయాలకు స్వేచ్ఛ కావాలి. వారిని ఎదగనివ్వాలి. వారిలో కళాత్మకతను గుర్తించి, ప్రోత్సహించాలి. ర్యాంకులు భవిష్యత్తును ఏ మాత్రం నిర్ణయించలేవు. వారి మెదళ్ళను రాత్రి పగళ్ళు కార్పోరేట్ చదువులంటూ క్షోభ పెట్టడం క్రూరమైన పని. బాల్యం ఎంతో విలువైనది. అనుభవించనివ్వాలి. చూస్తున్నంత సేపు పదే పదే గుర్తు చేసే సినెమా ఇది. కమర్షియల్ సినెమాలకు భిన్నంగా ఆలోచించే ఆమిర్ ఖాన్ కృషి ఎప్పటికీ అభినందనీయమే.

3 thoughts on “సినీ (మాయా)లోకం – తారే జమీన్ పర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *