April 23, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.

కీర్తన:
పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును
తేప యితడె మఱి తెరగేది

చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసులేని సుఖ మెక్కడిది
చేసినపాపము చేతుల నున్నది
మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥

చ.2. కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిక నేది
దీపనాగ్ని తో దిరిగెటి దేహము
పై పై విరతికి బట్టేది ॥ శ్రీపతి॥

చ.3. పంచేంద్రియముల పాలిటబడు ఇది
యించుక నిలుకడ కెడ యేది
యెంచగ శ్రీ వేంకటేశ్వరు డొకడే
పంచినవిధులను పాలించుగాక॥ శ్రీపతి॥
(రాగము: లలిత; ఆ.సం.రేకు:299; సం.3, కీ.573)

పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును
తేప యితడె మఱి తెరగేది

పూర్వం విదేహరాజుకు ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి వచ్చిన సందేహ నివృత్తికై హరి అనే ముని ఇలా వివరించాడు “సర్వభూత మయుడైన సరసిజాక్షు డాతడే, తన యాత్మ యందుండు ననేడు వాడు, శంఖ చక్ర ధరుడంచు జానెడు వాడు, భక్తి భావాభిరతుండు వోభాగవతుండు” అని చెప్తూ ఇంకా ఆ శ్రీమహా విష్ణువు “వర్ణాశ్రమ ధర్మంబుల నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సంపూర్ణుడు హరి యను నాతడే, వర్ణింపగ భాగవతుడు వసుధాధీశా!” అని చెప్పగా విదేహుని సందేహం తీరింది. కాని హరి నామ స్మరణం, ఆ కథామృత సేవనం కావాలనిపించి మళ్ళీ యిలా అడిగాడు. “గజరాజ వరదు గుణములు, త్రిజత్పావనము లగుటదేట డంగాసుజన మనో రంజనముగా విజితేన్ద్రియ వినగనాకు వేడుక పుట్టెన్” అని ఆ విషయం ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు “అంతరిక్షుడు” అనే మౌనివర్యుడు పరబ్రహ్మ మనగా, పరతత్త్వ మనగా బరమ దయాళువగు నీశ్వరుడన, గృష్ణు దన జగద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్” అని చెప్పి అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంలో తనకు విపర్యయం గా జన్మించిన జ్ఞానమే “మాయ” యనీ చెప్తాడు. ఆ మాయ చేతనే ఆయన ఈ జగత్తును నిర్మిస్తాడు. ఆయన మాత్రం నిశ్చింతుడు. మాయ కూడా ఆత్మలో లీన మవుతుంది. “పంచ భూతాదిక జీవులను సృష్టించేది ఆ మాయయే! లయించేదీ అదే” అన్నాడు మహర్షి. మరి ఆ మాయను దాటే ఉపాయం చెప్పమన్నాడు రాజు. దానికి “ప్రబుధుడు” అనే మహర్షి “శరీరమే నిత్యం అనే భావనతో జీవులు దుఖంలో మునిగిపోతారు. తమ్ము తాము తెలుసుకోరు. అనిత్యమైన పాంచభౌతిక దేహంకోసం అనేక అగచాట్లు పడుతూ ఉంటారు. విరక్తి మార్గం అవలంబించరు. సద్గురువును పొంది భూతదయ, హరికదామృతపానం, బ్రహ్మచర్య, సాధు సంగమం, సజ్జన మైత్రి, వినయ,శుచిత్వ, క్షమ, మౌనం, వేదార్ధ వివేచనం, అహింస, ద్వంద్వవిసర్జనం చేసి ఈశ్వరుని సర్వగతునిగా భావించాలి .గృహారామక్షేత్ర కళత్రపుత్రా విత్తాదులను శ్రీహరికి అర్పణ చేయాలి. పరమాత్మను తప్ప దేనినీ చూడ రాదు” అని వివరించి సందేహ నివృత్తి చేస్తారు మహర్షులు.
ఇలా ఎన్నివిధాల మనం వేద వేదాంగాలను వెదకినప్పటికీ హరికదామృతపానం, సాధుసంగమం, సజ్జన మైత్రి, వినయ,శుచిత్వ, క్షమ, మౌనం, వేదార్ధ వివేచనం, అహింసలే కైవల్యానికి పరమావధులని తెలుస్తోంది. వాటిలో అతి సులభమైనది హరికీర్తనము. ఆయన్ను కీర్తిస్తూ ఆయన శరణు పొందితే చాలు. మనకు వేరే మరే మార్గమూ అవసరం లేదు. కైవల్యము సిద్ధించి తీరుతుంది అని నమ్మికతో నివేదిస్తున్నాడు అన్నమయ్య.

చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసులేని సుఖ మెక్కడిది
చేసినపాపము చేతుల నున్నది
మోసపోనిగతి ముందర నేది

మనకు ఆత్మలో ఎన్నో ఆశలు, మోహాలు సహజంగా దేహంలో మనలను అంటి ఉంటాయి. ఈ మాయా లోకంలో ఈర్ష్య అనేది లేకుండా సుఖమయ జీవనం సాగించడం దుర్లభం. ఆ ఈర్ష్యా గుణం వలననే మనం మన చేతులతో ఎన్నో పాపాలు చేస్తూ గొప్ప ఆపదలను మూటగట్టుకుంటూ ఉంటాము. మోసాలు తిరిగి తిరిగి చేస్తూనే ఉంటాము. ఇక ఈ పాపాల ప్రవాహానికి అడ్డుకట్ట ఎక్కడ? తరుణోపాయం మనకు గోచరించదు.

చ.2. కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిక నేది
దీపనాగ్ని తో దిరిగెటి దేహము
పై పై విరతికి బట్టేది

మనకు ఆశాపాశాలు, వ్యామోహాలు ఉన్నంతవరకూ ఈ కోపం అనేది పోదు. ఇలా కృఒధంతో రగిలిపొయ్యే వారికి సుఖం ఉపశమనం అసలు ఉండదు కదా! జఠరాగ్ని(వైశ్వానరము) వంటి అరిషడ్వర్గాలతో కూడిన దేహంతో తిరిగే జీవులకు దేహం ఎప్పుడూ రగిలిపోతూ మసిలిపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ తాత్కాలికంగా “కుక్క దాలిగుంట” తీరుగా తాత్కాలిక విరక్తి కలిగినప్పటికీ మళ్ళీ కొంత సమయం తర్వాత అన్నీ షరా మామూలుగానే వచ్చేస్తాయి దేహంలోకి. ఈ పై పై విరక్తులకు తగ్గి పరబ్రహ్మను గూర్చి స్థిరంగా ఆలోచించే సమయం వస్తుందా?

చ.3. పంచేంద్రియముల పాలిటబడు ఇది
యించుక నిలుకడ కెడ యేది
యెంచగ శ్రీ వేంకటేశ్వరు డొకడే
పంచినవిధులను పాలించుగాక

బ్రతుకంతా కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము అనే పంచేంద్రియముల అధీనంలో ఉంటుంది. నిత్యం క్రొత్త క్రొత్త సుఖాలను ఆశించే జీవులకు నిలకడ లేకుండా అంతులేని వ్యామోహాన్ని పిపాసను కలుగజేస్తూ ఉంటాయి. దీనికి అసలు కారణం ఏమిటి? తరుణోపాయం ఏమిటి? అనే విషయం తెలుసుకోవలసి ఉంది. మనం అన్నివిధాలా యెంచి నిలకడగా కాస్తా సుబుద్ధితో ఆలోచించి చూసినట్లైతే శ్రీవేంకటేశ్వరుడొక్కడే దిక్కు. ఆయన మనకు పంచి ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వర్తించడమే మన విధి అని చెప్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు: శరణము = దిక్కు, ఆదుకునే నాధుడు; తేప = తెప్ప, ఏదైన దాటు సాధనము; ఆతుమ = ఆత్మ; ఈసు = ఈర్ష్య; గొందుల గుణములు = సంక్షోభించే గుణములు; ఏపున = ఎక్కువగా; దీపనాగ్ని = జఠరాగ్ని(వైశ్వానరము); విరతి = విరక్తి; ఇంచుక = కొంచెము; ఎంచగ = అన్నివిధముల చూడగా; పంచిన = మనకు ఇవ్వబడిన సుకర్మములు అనే అర్ధంతో ఇవ్వబడిన మాటగా యెంచదగును.
విశేషము: అన్నమయ్య ఇక్కడ ఒక వింత మాట “దీపాగ్ని” అని వాడడం జరిగింది. దీనిని అర్ధం కొంతమంది “బడబాగ్ని” గా భావిస్తే కొంతమంది “జఠరాగ్ని” గా భావించడం జరిగింది. సకల జీవుల దేహాలలో జఠరాగ్నినై ఆహారాన్ని జీర్ణం చేసే వాడు భగవంతుడు. దేహాన్ని గురించి అన్నమయ్య చెప్తూ ఉన్నప్పుడు “జఠరాగ్ని” అనే అర్ధం తీసుకోవడమే సమంజసంగా భావిస్తున్నాను. “అనియానతిచ్చె కృష్ణుడర్జునితో – విని యాతని భజించు వివేకమా|” అన్న కీర్తనలో కూడా అన్నమయ్య “దీపనాగ్నినై జీవదేహముల యన్నములు – తీపుల నరగించేటి దేవుడనేను” అంటాడు. అందువల్ల జఠరాగ్ని సరియైన అర్ధం అనుకుంటున్నాను. (విజ్ఞులు దీనిపై వ్యాఖ్యానిస్తే మరింత ప్రయోజనకరం)
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *