ఉష అనిరుద్ధుల ప్రేమ కథ

రచన: శారదాప్రసాద్

ఉష అనిరుద్ధుల ప్రేమ కథను నేటి యువతీయువకులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాణాల శృంగార కథలలో ఉష అనిరుద్ధుల ప్రేమ కథ సుప్రసిద్ధం. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండం నూట పధ్నాలుగో అధ్యాయంలో ఉంది. కథలోకి వస్తే శ్రీకృష్ణుడి మనుమడు అనిరుద్ధుడు. కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడితడు. ప్రద్యుమ్నుడు సాక్షాత్తు మన్మథుడే. ఆయన కుమారుడు అందంలో తండ్రిని మించిన వాడు. ధైర్య సాహసాలు కూడా అతడి సొంతమే. ఆ రోజుల్లోనే బాణుడు అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. గొప్ప శివ భక్తుడైన ఆ రాక్షసుడి కుమార్తె ఉష. ఈమెకు పార్వతీ దేవి అనుగ్రహం ఉంది. అనిరుద్ధుడికి దీటైన అందం ఈమె సొంతం. ఒక రోజున అనిరుద్ధుడు చక్కగా అలంకరించిన శయ్య మీద రాత్రి వేళ హాయిగా నిద్ర పోయాడు. స్వప్నంలో ఒక సుందరాంగి కనిపించింది. విశేషమేమంటే , అది పరమాత్ముడు సృష్టించిన స్వప్నం కాబట్టి అది యదార్ధ సంఘటన లాగా కూడా ఉంది. స్వప్నంలో ఆమెను చూసిన అనిరుద్ధుడు ఆమె మోహంలో పడ్డాడు . తనను వివాహమాడమన్నాడు. అప్పుడా యువతి తాను బాణుడి కుమార్తె అయిన ఉష అని, తాను తండ్రిచాటు బిడ్డనని చెప్పింది. తల్లితండ్రుల అనుమతితోనే తాను పెళ్ళాడుతాననీ, తనకు యోగ్యుడైన వరుడినే వారు తెస్తారని ఆమె చెప్పింది. యువతీ యువకులు తల్లితండ్రుల మీద ఇలాంటి నమ్మకంతో ఉండటం ధర్మమని కూడా చెప్పింది. ఒకవేళ అనిరుద్ధుడు తనను నిజంగా ఇష్టపడితే తన తండ్రిని కానీ, తన తండ్రి పూజించే పార్వతీ పరమేశ్వరుల అనుమతిని గానీ తీసుకుని తనను వివాహమాడమన్నది ఉష.

ఇంతలో కల చెదిరింది. తెల్లవారింది. తెల్లవారిన దగ్గరనుంచి అనిరుద్ధుడు పరధ్యాసతో ఉండటాన్ని రుక్మిణి గమనించింది. రుక్మిణి శ్రీకృష్ణుడికి విషయాన్ని వివరించింది. శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాడు . ఉషకు కూడా తనొక స్వప్నాన్ని కలిగించి అనిరుద్ధుడి మీద ప్రేమ కలిగేలా చేస్తానని చెప్పాడు శ్రీ కృష్ణుడు . ఉష స్వప్నంలో అనిరుద్ధుడిని చూసింది. తనను చేపట్టమని కలలో అనిరుద్ధుడిని కోరింది. అనిరుద్ధుడు పెద్దల అనుమతి లేకుండా తాను మాట ఇవ్వలేనని చెప్పాడు. ఇంతలో తెల్లారింది. ఉష పరధ్యాసను గమనించిన చెలికత్తెలు ఆ విషయాన్ని పెద్దలకు చెప్పారు. ఉషాదేవి ఆమె చెలికెత్తె చిత్రలేఖ ప్రోత్సాహంతో పూర్తిగా పార్వతీదేవిలాగ అలంకరించుకొని శివుని చేరబోయింది. ఉష హృదయం తెలిసిన పార్వతి ‘కార్తీక శుద్ధ ద్వాదశీ తిథి’ యందు నీకొక పురుషుడు తారసపడి నిన్ను రమించి, నిన్ను వరించగలడు అని వరం ఇచ్చి, ఆమెను పంపించింది. శివసంకల్పం వల్ల అనిరుద్ధుడు ఉషాంతఃపురాన వ్రవేశించి ఆమెతో రతిసుఖాలాడి వెళ్లిపోయాడు. మన్మధుని మించిన అందగాడైనందున ఉష అతడికి ఎటువంటి అభ్యంతరాన్ని చెప్పలేదు కానీ వివాహం గాకుండానే పరపురుషుని కలుసుకోవటం ఏమిటని మథనపడింది. అతన్ని గురించి ఆమె వర్ణించలేకపోయింది. ఈ విషయాన్ని చెలికత్తె చిత్రలేఖతో చెప్పుకుంది. చిత్రలేఖ ఉపాయం ఆలోచించింది. దేశ దేశాల రాకుమారుల చిత్రాల్ని తెప్పించి, అందులో ఉషను రమించిన వాడిని గుర్తుపట్టమంది . ఇదిలా ఉండగా, ఓ రోజు శివుడి దగ్గర కొచ్చిన బాణాసురుడు “పరమేశా! వెయ్యి చేతులిచ్చావు, నా సహస్ర బాహువులతోనూ ఏకకాలంలో యుద్ధం చెయ్యగల వైరిని చూపించవయ్యా!” అని వేడుకున్నాడు. “అభీష్ట సిద్ధిరస్తు! సరైన ఘనుడితో నీకు యుద్ధం త్వరలోనే సంప్రాప్తించు గాక!” అని దీవించాడు శివుడు. ఉష చెప్పిన రాకుమారుడిని, చిత్రపటాల ద్వారా అనిరుద్ధుడిగా గుర్తుపట్టిన చిత్రలేఖ తనకున్న యోగశక్తి చేత అనిరుద్ధుడిని అపహరించి తెచ్చి, ఉష శయ్యాగృహంలోకి చేర్చింది. ఉష ఆనందంతో తన ప్రియుడితో సుఖాల తేలియాడింది.

ఈ విషయం బాణాసురుడికి తెలిసి, తన అంతఃపురంలోకి అతనెలా ప్రవేశించాడో అర్ధంగాక యుద్ధసన్నద్ధుడయ్యాడు. అశరీరవాణి హెచ్చరిక మేరకు అనిరుద్ధుని వధించక, చెరలో బంధించాడు. ఉషా అనిరుద్ధులు దుర్గా స్వరూపురాలైన అమ్మవారిని అర్చించడంతో, అనిరుద్ధుడు చిత్రంగా చెరసాలనుంచి బైటికి వచ్చాడు. మళ్ళీ ఉషాఅనిరుద్ధులు యధాప్రకారం సుఖాలలో మునిగిపోయారు. ద్వారకలో అనిరుద్ధుడు అదృశ్యమైన సంగతి అందర్నీ విచారంలో ముంచగా, నారదుడు జరిగిన విషయం చెప్పగానే శోణపురాన్ని కృష్ణుడు ముట్టడించాడు. బాణాసురునికి వరమిచ్చిన శివుడు బాణాసురుడికి బాసటగా నిలిచాడు. శివుడు బాణాసురుడికి ఇచ్చిన వరం, దేవతలకు అనుకూలంగా మార్చటానికి కృష్ణుడు ఒక ఉపాయాన్ని కనిపెట్టాడు. శివుడు స్థాణువుగా అయ్యేటట్లుగా కృష్ణుడు జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడు. మహనీయమైన ఆ అస్త్ర ప్రభావంతో శివుడు యుద్ధ భూమి నుంచి తొలిగాడు. బాణాసురుడు తనకు తగిన శత్రువు దొరికాడని సంతోషించి యుద్ధానికి దిగాడు. లోకభీకరమైన యుద్ధం సాగింది. కృష్ణుడు సుదర్శన చక్రంతో అన్ని చేతులనూ ఒక్కటొక్కటిగా నరికేసాడు. నాలుగు చేతులను మాత్రం మిగిల్చి, కృష్ణుడు చక్తో బాణాసురుని శిరస్సు ఖండించబోగా, శివుడు అడ్డుపడ్డాడు. “వాసుదేవా! బాణుడి గర్వం అణచటానికే నేనీవరం ఇచ్చాను తప్ప, అతడి శిరః ఖండనం జరగాలని కాదు” అని అనుగ్రహించి ఉషా అనిరుద్ధుల వివాహం దగ్గరుండి జరిపించాడు శివుడు.

ఈ కథలోమనకు తెలిసింది ఏమంటే– ఉషాఅనిరుద్ధులు చెప్పినమాటల ప్రకారం, వివాహానికి పెద్దల అనుమతి అవసరమన్న విషయం సుస్పష్టమయింది. యువతీ యువకులు ప్రేమ, వివాహం వంటి విషయాలలో తొందర పడకుండా, పెద్దల అనుమతితో ముందుకు అడుగులేస్తే మంచి జరుగుతుందన్నసందేశం ఉషఅనిరుద్ధుల కథ మనకు ఇస్తుంది.

8 thoughts on “ఉష అనిరుద్ధుల ప్రేమ కథ”

  1. ఉషా అనిరుద్ధుల ప్రేమ గూర్చిన మీ చక్కటి కథనం బావుంది.

  2. నేటి తరం యువతీ యువకులు తెలుసుకోదగిన ప్రేమ కధ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *