April 18, 2024

కలియుగ వామనుడు 7

రచన: మంథా భానుమతి

అల్లా ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఇస్తాడు జీవితాన్ని? నోరంతా చేదుగా అయిపోయింది.
“అన్నా ఆ ఎలుగుబంటి గాడు నిన్ను యబ్యూజ్ చేస్తున్నాడా? నీ మీద పడుతున్నాడా?” చిన్నా బాంబేసినట్లు అడిగాడు.
అబ్బాస్ కళ్లు పెద్దవి చేసి చూడ్డం తప్ప ఏం మాట్లాడలేక పోయాడు.
“నాకు తెలుసన్నా. హోమో సెక్షువల్స్, పీడో ఫైల్స్.. చాలా పుస్తకాల్లో చదివాను. కంప్యూటర్ లో కూడా వాళ్ల గురించి చదివాను.”
అబ్బాస్ ఇంకా మిడిగుడ్లేసుకుని చూస్తున్నాడు.
“నాకు పన్నెండేళ్లే కానీ పదహారేళ్ల బ్రైన్ ఉందని అంటారు మా డాక్టర్. నా సైజ్ చూడకన్నా. నీ అంతే ఉన్నాననుకో. అప్పుడు నీకు వింతగా అనిపించదు.” చిన్నా మళ్లీ ఒకసారి చెప్పాడు తనలాంటి వాళ్ల గురించి.
అలాగే అని తలూపాడు అబ్బాస్.
“ఎలుగుబంటిగాడిని చూసినప్పుడే అనుకున్నా వీడు మామూలు వాడు కాదని. వాడు చేతులు తిప్పడం.. మా కేసి ఏదో వెతుకుతున్నట్లు చూడ్డం, అవన్నీ చూస్తుంటేనే తెలిసి పోయింది. ఎప్పుడో మా ఎవరి మీదైనా పడతాడేమో అని అనుకుంటూనే ఉన్నా.”
తనని రక్షించడానికి వచ్చిన దేవుడ్ని చూసినట్టు చూశాడు అబ్బాస్, చిన్నాని. కనీసం తన కష్టం చెప్పుకోడానికి, చెప్తుంటే అర్ధం చేసుకోడానికీ ఒకళ్లు కనిపించారు.
“నిజంగా నువ్వు దేవుడివన్నా! నీకు రోజూ మొక్కాలి మేమంతా.” చిన్నా వంగి దణ్ణం పెడుతూ అన్నాడు.
ఎందుకన్నట్లు చూశాడు అబ్బాస్.
“ఆ ఎలుగుబంటి కుమ్ముతుంటే కష్టమంతా నువ్వు పడుతూ మమ్మల్ని కాపాడుతున్నావు కదన్నా?”
ఇదంతా చిన్నా మాట్లాడుతున్నాడంటే నమ్మలేక పోతున్నాడు అబ్బాస్. ఇంకా అయోమయంగా చూస్తున్నాడు.
“అదేంటిరా?”
“అదే.. నువ్వే లేకపోతే మమ్మల్ని కూడా రోజూ కరిచే వోడా రాక్షసుడు. నాకు తెలీదా అన్నా. నీ కుర్బానీ ఎంత గొప్పదో! మమ్మల్ని నీ తమ్ముళ్ల లాగే చూసుకుంటున్నావు. ఏం చేసినా నీ ఋణం మేం తీర్చుకోలేమన్నా.”
“ఎప్పుడో చంపేస్తా వాణ్ణి.. ఒంటె కింద పడేసి.” పళ్లు నూరుతూ అన్నాడు అబ్బాస్.
“అది ప్రాబ్లం తీర్చదన్నా. ఇట్లాంటి వాళ్లు ఎంత మందున్నారో.. మొత్తం అంతా బయట పెట్టాలి. ఇంత పెద్ద ప్రపంచంలో మనలాంటోళ్ల కష్టాలు, పూర్తిగా కాకపోయినా సగమన్నా తీర్చగలిగే వాళ్లని వెతకాలి. యు.యన్.వో వరకూ తీసుకెళ్లాలి ఈ సమస్యని. సమస్యని సృష్టించిన ఆ దేవుడే తీర్చడానికి దారి చూపించాలి చూపిస్తాడు. ఎవర్నో పంపుతాడు మన కోసం.”
“ఆ దేవుడు నిన్ను పంపాడురా ఆల్ రెడీ. ఇప్పటి వరకూ ఎవరూ ఇలా ఆలోచించలేదు, మాట్లాడలేదు. పాలుతాగే పసివాళ్లని తీసుకొస్తే వాళ్లేం మాట్లాడ గలరు? మావంటి వాళ్లని రక్షించడానికే నిన్నిలా పుట్టించాడేమో! చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకొస్తోంది. దేవుడు నీ అంతే ఉండి రాక్షసుడికి బుద్ధి చెప్పాట్ట.”
“వామనావతారం కదన్నా?”
“అవునురా.. అదే.”
“అది దేవుడి అవతారం కనుక సరి పోయింది. ఇప్పుడు నేను ఒక్కణ్ణి సరి పోను. నువ్వు తోడున్నా కూడా. ఎవరైనా దన్నున్న వాళ్లు, బైటనుంచి రావాలి సహాయానికి. వాళ్లే నిజమైన దేముని అవతారాలు. ఎవరైనా ఉన్నారో.. ఎక్కడున్నారో? ఎప్పుడొస్తారో?”
……………….

చిన్నా, అబ్బాస్ ఒకరికొకరు తోడుగా నిలిచి, ఎవర్నైనా రక్షకుడిని ఏ దేముడైనా పంపకపోతాడా అని వేడుకుంటున్న సమయానికి..
కొన్ని సంవత్సరాలకు ముందు అక్కడికి దగ్గరలోనే ఉన్న మరొక దేశంలో, జైల్లో ఖైదీగా ఉన్న ఒక కాబోయే ప్లీడరు మొహ్మద్ ఆలీగారు ఆలోచించారు.. కొన్ని రోజులు నిద్ర లేకుండా.
అక్కడ అన్యాయంగా జైళ్లలో ఇరుక్కున్న తోటి ఖైదీలని ఎలా విడిపించాలా అని..
ఆలీది ఆ రోజుల్లో నియంతృత్వ దేశం. బ్రిటిష్ వారు ఏలిన రవి అస్తమించని రాజ్యాల్లో అది కూడా ఒకటి. వారు స్వతంత్రం ఇచ్చాక సైనికాధికారం పాలన పగ్గాలు పట్టుకుంది.
ఇరవై సంవత్సరాల వయసులో, విద్యార్ధి నాయకుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థని సమర్ధిస్తూ ఉపన్యాసాలు ఇచ్చాడని ఆలీని జైల్లో పెట్టింది ప్రభుత్వం. ఎనిమిది నెలలయాక విడుదల చేసి, మళ్లీ అరెస్ట్ చేశారు. అంతే కాదు.. మూడు జైళ్లు తిప్పారు.
అప్పుడు అతన్ని అరెస్ట్ చెయ్యడం అన్యాయమైనా, ఆ తరువాత అది కొన్ని వేల మందికి న్యాయం చేకూర్చింది.
జైల్లో ఉన్నప్పుడే అతను ఖైదీల దీన పరిస్థితి చూశాడు. ఏ నేరం చెయ్యకపోయినా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న వారిని చూశాడు.
ఒకతను పోలీస్ స్టేషన్లో తన ఇంట్లో దొంగలు పడ్డారని రిపోర్ట్ చెయ్యడానికి వెళ్తే, తప్పుడు కేసి బనాయించి జైల్లో తోశారు. సరిగ్గా ముప్ఫై సంవత్సరాలయింది.
ఇంకొకతన్ని ఒకే పేరున్న కారణంగా ఎవరో చేసిన హత్యని అతని మీదికి తోసి జైల్లో పడేశారు. కేసు విచారణ కూడా లేదు. అతను తన కుటుంబాన్ని కలిసి ఇరవై ఐదు సంవత్సరాలయింది.
ఇంకొకతనిది మరీ విచిత్రమైన కేసు. పేరు అమీర్. అతని తల్లిని నేరస్తురాలిగా ముద్ర వేసి జైలుకి పంపుతే.. అక్కడ కాపలా దారులే ఆవిడ మీద అత్యాచారం చేశారు. ఆమెకి పుట్టిన కొడుకే అమీర్.. ఏ పాపం ఎరుగని అమాయకుడు. ఐదేళ్లప్పుడు తల్లి చనిపోతే, తండ్రి ఎవరో తెలియక, ఎక్కడా ఎవరూ లేక, ఎక్కడికెళ్లాలో తెలియని స్థితిలో నలభై సంవత్సరాలుగా జైల్లోనే మగ్గి పోతున్నాడు.
కొన్ని కేసులు కోర్ట్ మొహం చూడనే చూడవు.
ఇటువంటి ఎన్నో హృదయ విదారకమైన కేసుల్ని స్వయంగా చూసిన ఆలీ గారికి గుండె తరుక్కు పోయింది.
జైల్లోనుంచి విడుదలయ్యాక, లాయర్ పట్టా పుచ్చుకుని.. ప్రాక్టీస్ ప్రారంభించాడు. మానవ హక్కుల పరిరక్షణకై ఒక సంస్థని ఏర్పాటు చేసి, న్యాయ పోరాటం చేయడం మొదలు పెట్టాడు.
ఖైదీల సహాయక కేంద్రం పని సాగిస్తూ ఉండగానే, ఆలీ చెవిన పడింది.. విదేశాలకు చిన్న పిల్లల తరలింపు గురించి. పెద్దవారి కష్టాలనే చూడలేక పోయిన ఆలీ పసివారి పాట్లు గురించి పట్టించుకోకుండా ఉండగలడా?
ముఖ్యంగా తన దేశం నుంచే ఎక్కువ సంఖ్యలో ముక్కు పచ్చలారని పసి వారు మాయమై పోతున్నారు.
ఏమై పోతున్నారు? ఎక్కడ తేల్తున్నారు?

తన మానవ హక్కుల సంస్థ ద్వారా రంగంలోకి దిగారు లాయర్ గారు.. సరిగ్గా చిన్నానీ, టింకూనీ దుబాయ్ తరలించినకొద్ది రోజులకే!
చాలా పకడ్బందీగా సాగుతోంది తరలింపు. తనవంటి బీదదేశాలెన్నిటి నుంచో..
ఎందుకు? ఏం చేస్తారీ పసి వారిని?
తన బృందం చేత శోధన చేయించారు లాయర్ ఆలీ. చాలా హృదయ విదారకమైన సంగతులు బైట పడ్డాయి.
ఆడపిల్లలని పెంచి వ్యభిచారం లోకి దించడానికి..
మగ పిల్లలని బానిసలుగా, ఒంటె రేసుల్లో జాకీలుగా వాడుకోవడానికి. ఆ తరువాత వెట్టి చాకిరీ చేయించుకోడానికి
తన దేశంలోనే కాక సూడాన్, బంగ్లాదేశ్, ఇండియా.. ఆఫ్రికా దేశాల నుంచి ఎందరో పసివారిని.. రెండు నించీ ఆరేళ్ల మధ్య వయసు వారిని తరలిస్తున్నారని పక్కాగా తెలిసి పోయింది.
స్వయంగా ఆలీ వెళ్లి విచారించాడు.
పిల్లల్ని అమ్మేసిన తల్లి దండ్రులకి, ముఖ్యంగా తండ్రులకి పట్టక పోయినా..
తల్లులు ఒప్పుకున్నారు.
“నా ఇద్దరు పిల్లల్ని.. వాళ్ల బ్రతుకులు చాలా బాగుంటాయని అంటే, ఇచ్చేశానండీ. ఇప్పుడు వాళ్లు వెనక్కి వస్తే చాలండీ. పక్కింటి సులేమాన్.. అక్కడ పెద్ద పెద్ద ఒంటెల దొడ్లలో పని చేస్తాడు. అతను ఐదేళ్లకో సారి వస్తాడు.. అతను చెప్పాడు. చాలా హీనంగా చూస్తున్నారుట పిల్లల్ని. మా పిల్లలు అతను పని చేసే దగ్గర లేక పోయినా.. వాళ్లని కూడా అంతేగా.. వాతలు తేలేట్లు కొడ్తారట.” ఒక మాతృమూర్తి భోరుమని ఏడ్చింది.
ఆలీ ట్రస్ట్ సభ్యులు ఊరుకో లేక పోయారు.
తమ బృందంతో ఆలోచన చేశాడు ఆలీ..

“మొదటగా మనం యు.యన్.వో కి రిపోర్ట్ చేద్దాం.” ఆలీ అన్న మాటలకి తల ఊపారు సభ్యులు.
“ఇది అంతర్జాతీయ సమస్య కదా.. అదే మంచి పద్ధతి.” సంస్థ సభ్యుడొకడు అభిప్రాయం చెప్పాడు.
“ఏమని చేస్తాం? మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు కదా?” అసిస్టెంట్ ఫాతిమా అంది.
నిజమే. పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్లు ఫిర్యాదు చెయ్యాలి. ఫిర్యాదు చేసినా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియాలి.
లేదా.. ఇమిగ్రేషన్ వాళ్లు దొంగ పాస్ పోర్ట్ లనీ, వీసాలనీ పట్టుకుని రిపోర్ట్ చెయ్యాలి. మాకు అనుమానంగా ఉందని అంటే ఎవరూ వినిపించుకోరు కదా!
చట్టానికి, ఏదైనా చర్య తీసుకోవడానికీ సాక్షం కావాలి.
“సరే.. ఒంటె రేసులు ఎప్పుడు జరుగుతాయో కనుక్కుందాం. మనందరం విజిటర్ వీసా తీసుకుని వెళ్లి వాచ్ చేద్దాం. వీలయినంత వరకూ ప్రూఫ్ లు సంపాదిద్దాం. కొంత మంది వినోదం కోసం ఎందరో చిన్న పిల్లల జీవితాల్ని బలి ఇవ్వడం అమానుషం.” ఆలీ కంఠం బొంగురు పోయింది.. ఆ పసి వారిని తలచుకొని.

సాధారణంగా విజిటర్ వీసాలు అంత సులువుగా ఇవ్వరు ఆరబ్ దేశాల్లో. అక్కడ బంధువులుండడమో, ఉద్యోగం దొరకడమో.. ఉంటే కానీ. దుబాయ్కి, మస్కట్కి.. కొన్ని దేశాలకి మాత్రం ఇస్తున్నారు పర్యాటకులకి. అదికూడా గత కొన్ని సంవత్సరాలుగా.
ఆలీగారిది, ఒక అసిస్టెంట్ దీ ముసల్మాన్ దేశం కనుక అంత కష్టం అవలేదు. ఫాతిమాకి, ఇంకొక అసిస్టెంట్ కి సమస్యే లేదు.
ఫాతిమా బ్రిటిషర్, అసిస్టెంట్ అమెరికన్. ఆ రెండు దేశాల పౌరులకీ వీసా అక్కర్లేదు.
ఎడారి రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు లాయర్ ఆలీ బృందం. ఆలీ, ఫాతిమా, ఇద్దరు అసిస్టెంట్లు.
కిలో మీటర్లు తరుగుతున్నాయి.. జీపులో ఎండ కాల్చేస్తోంది.
‘ఔజుబా’ ల అడ్రస్ అంత పబ్లిక్ గా దొరకదు. రేసు కొర్సుల చుట్టు పక్కల ఇరవై ముప్ఫై కిలో మీటర్ల దూరంలో వెతుకుతున్నారు. రోజు కొక దిక్కున.
అప్పుడు వెళ్తున్నది మూడో దిక్కు. రెండు దిక్కులలో యాభై కిలో మీటర్ల వరకూ ఏమీ కనిపించ లేదు.
కనుచూపు మేరలో ఏమీ లేదు. అప్పటికి రెండుగంటల నుంచీ సాగుతోంది ప్రయాణం.
“అవిగో.. అక్కడ కనిపిస్తున్నాయి షెడ్స్.” ఫాతిమా అరిచింది.
రేసులు మొదలవడానికి వారం రోజులు సమయ ముంది. ముందుగా ఆ చుట్టుపక్కల పరిస్థితులు గమనిద్దామనుకుని బయల్దేరి వచ్చారు.
మెల్లిగా.. షెడ్ కి కొంత దూరంలో ఆపారు జీపుని.
రేకు తలుపు.. గొళ్లెంతో రేకు గోడలో కొక్కానికి కట్టి ఉంది. తలుపు తీసి, తలుపు పడిపోకుండా, నేలకి ఆనించి పెట్టి లోపలికి వెళ్లారు.
ఆ ఎండలోనే, గుబురుగా పెరిగిన తుప్పల్ని తియ్యడానికి అవస్థ పడుతున్నాడో కుర్రాడు. ఆరేడేళ్లుంటాయి. పల్చని బనీన్లోంచి, వెళ్లు కొచ్చిన ఎముకలు కనిపిస్తున్నాయి.
కొంచెం దూరంలో ఉన్న ఒంటె శాలల్లో, ఇద్దరు పిల్లలు, పేడ ఎత్తి గంపల్లో పోస్తున్నారు. మిగిలిన ఆవరణ అంతా ఖాళీగా ఉంది. ఒక పక్క మూలగా, గోలెంలో నీళ్లున్నాయి. అక్కడక్కడ రేకుల గదులు కనిపిస్తున్నాయి.
గుబురు దగ్గరున్న కుర్రాడి దగ్గరగా వెళ్లి నిలుచున్నారు ఆలీ బృందం.
ఆ పసివాడు వణికి పోతూ లేచి నిలుచున్నాడు.. మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని.
“ఎందుకు బాబూ అంత భయం? నిన్నేమీ చెయ్యం” అరాబిక్ భాష వచ్చిన ఫాతిమా అడిగింది.
మీరెవరన్నట్లు చూశాడు.
“మిమ్మల్ని చూడ్డానికి వచ్చాం. మిగిలిన వాళ్లేరీ? నువ్వెందుకు అలా వణికి పోతున్నావు?”
“సరిగ్గా పని చెయ్యట్లేదని, కొట్టటానికి వచ్చారేమో అనుకున్న..”
“ఎప్పుడూ కొడుతుంటారా?”
“మీరు మా ట్రయనర్ కి చెప్పరు కదా?”
“చెప్పం.. వీలైతే మీకు సాయం చెయ్యడానికి చూస్తాం” ఫాతిమా ధైర్యం ఇచ్చింది.
వెంటనే ఆ కుర్రాడు, తాముండే గదికి తీసుకెళ్లాడు. గది అనే కంటే కొట్టం అనడం బాగుంటుంది. ఎప్పుడు పడి పోతుందో తెలియని టాపు, గాలికి ఊగిస లాడుతున్న రేకు గోడలు.
ఒక పక్క బట్టల మూటలు, ఇంకొక పక్క పడుక్కోడానికి కుక్కి మంచాలు. ఆ గదిలో.. నలుగురి సామాన్లున్నాయి. నడవడానికి మాత్రం జాగా ఉంది. నేలంతా ఇసుక.. గచ్చు లేదు.
ఇటువంటి స్థితిలో మనుషుల జీవించ గలరా! ఆలీ గారికి దుఃఖం తన్నుకొచ్చింది. అదంతా ఒక ఎత్తు.. పిల్లల ఆకారాలు ఇంకొక ఎత్తు. కళ్లల్లో ఉన్నాయి ప్రాణాలు.
“చెప్పు బాబూ! ఎందుకు భయపడ్డావు?”
“మా టైనర్ వచ్చాడేమోననండీ. పని చేస్తున్నా కూడా చెయ్యట్లేదని కొడతాడు.. బెల్టు పుచ్చుకుని మరీ..” చొక్కా విప్పి చూపించాడు వాతలన్నీ.
ఆలీ అదంతా సెల్ లోకి ఎక్కించాడు.
“మిగిలిన వాళ్లు, ఒంటెలు ఏరీ?”
“స్వారీకి వెళ్లారు. మేము, ఇక్కడ క్లీన్ చేస్తున్నాము. మీరు లోపలికెలా వచ్చారు? గేటు తాళం వెయ్యలేదా?” ఆ బాబు నీరసంగా అడిగాడు.
ఆలీ, తాము లోపలికొచ్చిన తలుపు కేసి చూశాడు. నిజమే.. ఆ గొళ్లానికో తాళం ఉంది.
“మర్చి పోయినట్లున్నారులే. ఎప్పుడొస్తారు వాళ్లు?”
“లంచ్ టైమ్ కొస్తారు. ఈ లోగా మీరెళ్లి పోండి.”
“అలాగే. ఏమిస్తారు లంచ్? ఇంత సన్నగా ఉన్నారేంటి మీరు?” ఫాతిమా అడిగింది.
“చాలా తక్కువ పెడతారు తినడానికి. ఎప్పుడూ ఆకలి వేస్తుంటుంది. ట్రయినర్ తీసుకొస్తాడు.. ఎండి పోయిన బ్రెడ్, పల్చని సూప్. టీ ఇక్కడే పెడతారు. ఒంటె పాలుంటాయి. ఆ పాలైనా ఇవ్వచ్చు కదా.. ఇవ్వరు. లావయి పోతామట.”
ఇతను మాట్లాడుతుండగానే, పేడ తియ్యడం అయి పోయి, మిగిలిన పిల్లలిద్దరూ, చేతులు కడుక్కుని వచ్చారు.
వాళ్లని దగ్గరగా తీసుకుని మాట్లాడాడు ఆలీ.
“మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి వచ్చారా?” ఒక కుర్రాడు అడిగాడు, ఆశగా చూస్తూ.
“తీసుకెళ్తాం. త్వరలోనే. మళ్లీ వస్తాం. తప్పకుండా.” ఫాతిమా ప్రామిస్ చేస్తున్నట్లు, చేతిలో చెయ్యేసింది.
“తొందరగా రండమ్మా.. మమ్మల్ని రోజూ రేప్ చేస్తారు. ఎంత నొప్పెడుతుందో తెలుసా?” ఒక కుర్రాడు తన శరీరాన్నిచూపాడు.
ఈ సంగతి ఊహించని ఆలీ బృందం మాట రాక నిలబడి పోయారు. ఆలీ అదంతా తన మొబైల్ లో ఎక్కించాడు.
“తప్పకుండా వస్తాము. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. అంతే కాదు.. ఇంక ఎవ్వరినీ ఇలా తీసుకొచ్చి ఇటువంటి పనులు చెయ్యకుండా చూస్తాము. మా ప్రయత్నం మేం చేస్తాం. ఆ పై అల్లా దయ.”
“హూ.. అల్లా..” ఎవరా అల్లా అన్నట్లుగా, ఆ పిల్లలు నిస్తేజమైన చూపులతో చూస్తుండగా, ఆలీ కళ్ల నిండా నీళ్లతో అక్కడి నుంచి కదిలాడు, తన బృందంతో.

చాలే సేపు ఏమీ మాట్లాడ లేదెవ్వరూ. నిశ్శబ్దంగా కూర్చున్నారు, వడగాలి వేస్తున్న జీపులో.. ఇసుక తిప్పల్ని చూస్తూ.
హోటల్ కి వెళ్లాక చాలా సేపు ఆ పిల్లల గురించే ఆలోచిస్తూ ఉండి పోయాడు ఆలీ. ఎలా ఈ విషయాన్ని డీల్ చెయ్యడం?
ఆ దేశంలో ఎవరికి చెప్పినా లాభం ఉండదని తెలిసి పోయింది.
“మనం విడిగా ఒక ప్రైవేట్ పార్టీ గా ఏమీ చెయ్యలేం. ఇక్కడ ధన బలం ఉంది. ఇది వారి రాజ్యం. ఏమైనా చేసినా ఎవరూ అడగడానికి లేదు.” ఫాతిమా అంది..
అందరూ భోజునాలకి కూర్చున్నారు. ఏసి డైనింగ్ హాల్..
తలెత్తి చూశాడు ఆలీ.
కప్పుకి కళ్లు చెదిరే చాందిలీర్లు.
గోడలకి వేల డాలర్లు ఖరీదు చేసే పెయింటిగ్స్. తళతళా మెరిసిపోయే కట్లరీ.
మెరిసి పోతున్న వెండి గ్లాసుల్లో మంచి నీళ్లు తీసుకొచ్చి పెట్టాడు వెయిటర్. ఆలీ కళ్ల ముందు, ఔజుబాలోని విరిగి పోయిన ప్లాస్టిక్ డొక్కు గ్లాసు మెదిలింది. ఇంతటి ఐశ్వర్యం.. అక్కడెందుకు అంత హీన పరిస్థితులు? రైట్ రాయల్ గా పిల్లలకి మంచి వాతావరణంలో ట్రయినింగ్ ఇవ్వచ్చు కదా!
రెండు మూడు సంవత్సరాలు బరువు పెరక్కుండా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ వ్యాయామం చేయిస్తూ జాకీల కింద వాడుకోవచ్చు. బరువు పెరిగాక కొత్త వారిని తీసుకోవచ్చు.
ఇంత డబ్బు ఉన్నప్పుడు అదేమంత కష్టం?
ఎందుకీ వ్యత్యాసం?
“ఆలీ సాబ్! మీరేం చెప్పట్లేదు?” ఫాతిమా అడిగింది.
“అదే ఆలోచిస్తున్నా. ఏదో చెయ్యాలి. ఇక్కడ మన దగ్గరున్న ఎవిడెన్స్ సరి పోదు. ముందుగా, మన మానవ హక్కుల సంస్థకి అనుబంధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చెయ్యాలి. దానిని ఇంటర్నేషనల్ సంస్థలాగ రిజిస్టర్ చెయ్యాలి. అందులో బాగా పలుకుబడి ఉన్న వాళ్లని సభ్యులుగా చేర్చుకోవాలి. ఆ ట్రస్ట్ ద్వారా, ఇక్కడి షేక్స్ ని, రాజులని కలిసి పరిస్థితులు వివరించాలి. ఒక వేళ ఈ జాకీలని విడిపించ గలుగుతే వాళ్లకి రిహాబిటేషన్కి ఏర్పాట్లు చెయ్యాలి. చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కడ మొదలు పెట్టాలా ఆని ఆలోచిస్తున్నాను.” సూప్ ఎమ్మదిగా స్పూన్ తో తాగుతూ అన్నాడు ఆలీ.
“ఈ వారం అంతా, ఇంకా కొన్ని కామెల్ ఔజుబాలను చూసి, రేసులను చూసి, అప్పుడు యు. కే వెళ్ళి అక్కడ ట్రస్ట్ ఫామ్ చేద్దాం. ఈ లోపు మీరు ప్లాన్ అంతా పాయింట్ వైజ్ ఫైల్ చెయ్యండి.” ఫాతిమా తన అస్సిస్టెంట్కి చెప్పింది.
…………..

“మళ్లీ రేసుల టైమ్ వచ్చేసింది.” అబ్బాస్ ఆ రోజు పొద్దున్నే టీ తాగుతూ ప్రకటించాడు.
అప్పటికి రాకీ పోయి నాలుగు నెల్లయింది. కాలం ఎవరికోసం ఆగదు కదా! సాండీ, సాహిల్ కూడా అలవాటు పడిపోయారు.. రాకీ స్థానంలోకి, వాళ్ల దేశం నుంచే ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చారు. నాలుగేళ్లుంటాయేమో వాడికి.
మరీ పసివాడిలా ఉన్నాడు. కింది పెదవి నోట్లోకి తోసి చప్పరిస్తూ వచ్చాడు.
మొదట్లో ఏం చెప్పినా వాడికేం అర్ధం అవటం లేదు. నజీర్ తన్నులు తట్టుకోలేక, అపస్మారకంలోకి వెళ్లి పోతున్నాడు.
“రేయ్.. వీడిని సీదా చెయ్యండి. లేకపోతే మీకు తగుల్తాయి తన్నులు.” నజీర్, సాండీకి వార్నింగ్ ఇచ్చాడు.
వాడి పేరేదైనా, నయా రాకీ అని పేరు పెట్టాడు చిన్నా. అలాగే పిలుస్తున్నారు పిల్లలంతా.
చిన్నా దగ్గర కూర్చో పెట్టుకుని, నయారాకీని బుజ్జగిస్తూ సాండీతో చెప్పించాడు. చివరికి బుల్లి చేతులతో పనులు చెయ్యడం నేర్చుకున్నాడు, కొద్ది కొద్దిగా.
కానీ, ఎవరూ ఊహించని శక్తి ఒకటి ఉంది వాడిలో. మొదటి సారి ఒంటె సవారీ కెళ్లినప్పుడు బైట పడింది. అబ్బాస్, చిన్నాలు నివ్వెరపోతూ చూస్తుండగా..
ఒంటె స్వారీ చాలా తొందరగా వచ్చేసింది నయా రాకీకి. కాళ్లు ఎంత లావుండాలో, అంతే లావుగా, సరైన పొడవులో కొలిచినట్లుగా ఉన్నాయి. అలా.. బొమ్మలా అమరిపోయాడు ఒంటె మీద.
తొడల దగ్గర ఏమాత్రం ఒరుసుకోలేదు.
బాలన్స్ చేస్తూ కూర్చోడం.. కొరడా తిప్పడం, ఒంటె పక్కలో సరిగ్గా కాలితోఎక్కడ తన్నాలో అక్కడ తన్నడం.. చాలా సహజంగా స్వారీ చేసేస్తున్నాడు.
అన్ని షెడ్లలో పిల్లలూ నోరు తెరుచుకుని చూస్తున్నారు.
అబ్బాస్ మొదట్లో వాడి నైపుణ్యం గురించి నజీర్ కి తెలియనియ్యలేదు. ఇంక రాచి రంపాన పెట్టేస్తాడని.
ఎన్నాళ్లు దాచ గల్గుతాడు..
వాడి నాలుగో సవారీ అప్పుడు చూడనే చూశాడు. నజీర్ ఆనందానికి అంతులేదు. వాడికి రోజూ గొర్రె పాలు ఇమ్మని చెప్పాడు. చిత్రంగా.. ఒక నెల అయినా బరువు కొంచెం కూడా పెరగలేదు.
‘నయా రాకీ’ కి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాడు నజీర్.
రేసులు ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాడు.
ప్రాక్టీస్ కెళ్లినప్పుడు హలీమ్ కూడా చూశాడు ఒక రోజు.
“యా అల్లా.. ఇటువంటి విజర్డ్ని ఇప్పటి వరకూ చూడ లేదు. వీడిని చాలా ప్రెషస్గా చూడాలి. చాలా జాగ్రత్తగా, మంచి తిండి పెడ్తూ కాపాడండి. వీడికి కొంచెం ఎక్కువ అలౌవేన్స్ ఇస్తాను నజీర్.”
నజీర్ మొహం వేయి ఓల్టుల బల్బ్ లాగ వెలిగి పోయింది.

ఆ నాలుగు నెలల లోనూ చిన్నా, అబ్బాస్ కలిసి కొంత ప్రణాలిక వేసుకున్నారు. చిన్నా తన డ్రాయింగ్ పుస్తకంలో బొమ్మలు వేస్తూ, ఆ బొమ్మల్లో మధ్య మధ్య తమ పరిస్థితి రాస్తున్నాడు. ఇంగ్లీష్లో.
ఆ పుస్తకం ఎవరికైన ఇచ్చినా అర్ధం అవాలి కదా.. నజీర్ చదువుతాడన్న బాధ లేదు. వాడికి ఇంగ్లీష్ రాదు. వచ్చినా, ఆ బొమ్మలు చూస్తే ఏమీ తెలియదు.. అందులో ఏదో రాసుందని అనుమానం కలగదు.
చిన్నా రోజూ టివి చూస్తున్నాడు. వీలున్నప్పుడు అబ్బాస్ కూడా చేరి ఆరబిక్ నేర్పిస్తున్నాడు.
చిన్నా అబ్బాస్ కి ఇంగ్లీష్, చదవడం రాయడం, అంకెలు నేర్పిస్తున్నాడు.
కామిక్స్ చూస్తుంటే త్వరగా వచ్చేసింది భాష. పాఠాలు కూడా ఉంటాయి చిన్నపిల్లలకి. అందులో చూసి అరాబిక్ రాయడం కూడా నేర్చుకున్నాడు చిన్నా.
అబ్బాస్, నజీర్ ఇచ్చిన డబ్బులోంచి ఒక నోట్ బుక్ కొనుక్కొచ్చి ఇచ్చాడు.
ఒకోసారి ఏదైనా పని తలపెడితే పరిస్థితులు అనుకూలంగా మారతాయి.
చిన్నా, అబ్బాస్ల విషయంలో అదే జరిగింది.
అబ్బాస్ మీద నజీర్కి నమ్మకం బాగా కుదిరింది. పైగా వాడికి చదువేం రాదు. ఏం చెయ్యగలడు? ఎక్కడికి పోతాడు.
నజీర్కి ఆ ఔజుబాలో ముధారీ బాధ్యత అప్పజెప్పాడు హలీమ్, రేసులో అతని ఒంటెకి సెకండ్ ప్రైజ్ వచ్చాక. తన ఫామ్లో జరిగే ఒంటె స్వారీలని నజీర్ని పర్యవేక్షించమని చెప్పాడు. దానికి తగిన ప్రతిఫలం ఎలాగా ఉంటుంది.
చిన్నాకి సహకరించాలని నిశ్చయించుకున్నాక, అబ్బాస్ నజీర్ పెట్టే హింసని నిశ్శబ్దంగా భరించడం నేర్చుకున్నాడు.
ఒకరోజు, పొద్దున్నే టివిలో కార్టూన్లు చూస్తుంటే తట్టింది చిన్నాకి! ఆ సమయంలో కాసింత ఖాళీ దొరికితే చిన్నా పక్కన వచ్చి కూర్చున్నాడు అబ్బాస్.
పిల్లలంతా స్నానాలు చేసి తయారవుతున్నారు. హలీమ్ ఫామ్కి వెళ్లాలి.. స్వారీకి.
టింకూ తనంతట తను తయారవడం.. ఒంటె షెడ్లు శుభ్రం చెయ్యడం వంటి పనులన్నీ సులభంగా, తొందరగా చెయ్యడం నేర్చుకున్నాడు. ఆరు నెలల్లోనే రెండేళ్లు పెరిగాడు మానసికంగా.
నజీర్ కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు. ఆ లోపు అందరూ తయారుగా ఉంటే చాలు.
“అన్నా! అటు చూడు!” టివిలో వస్తున్నషో చూపించాడు చిన్నా.
రొబో ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ, ఇంటివాళ్ళు చెప్పిన పనులు చెయ్యడం, ఏ సమస్య వచ్చినా ఆర్టిఫిషియల్ తెలివితో పరిష్కరించడం.. అప్పుడు వస్తున్న షోలో ఉన్న విశేషం.
అబ్బాస్ అరుదుగా టివి చూడ్డానికి కూర్చుంటాడు. ఆ ఔజుబాలోని పిల్లలందరి బాధ్యతా ఆ అబ్బాయిదే. పధ్నాలుగు ఏళ్లు నిండీ నిండకుండా మీద పడిన బరువు ఆ కుర్రవాడిని సహజ బాల్య చేష్టలని కోల్పోయేట్లు చేసింది. ఆ వయసు పిల్లలకుండే ఆసక్తి, అభిరుచులని చంపేసింది.
“ఏంటది?” నిరాసక్తంగా చూశాడు.
“ఆ బొమ్మని రోబో అంటారు. బొమ్మ లోపల కంప్యూటర్ ఉంటుంది. దూరం నుంచి రిమోట్తో బొమ్మని మనిషిలాగే ఉపయోగించు కోవచ్చు.” చిన్నా వివరించాడు.
“ఇంకేం.. ఈ పిల్లలందరినీ ఇలా హింసించే బదులు వాటికే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా! ఈ ట్రైనీలు దగ్గర కొచ్చినప్పుడల్లా నెత్తిమీద ఒక్కటిచ్చేలా ప్రోగ్రామ్ చెయ్యాలి. రోగం కుదురుతుంది.” కళ్ళప్పగించి చూస్తూ ఉన్నట్లుండి అన్నాడు అబ్బాస్.
“సరిగ్గా అదే చెప్పబోయానన్నా! నువ్వే పట్టేశావు. ప్చ్.. నీ తెలివికి చదివిస్తే ఈ పాటికి టెంత్ కొచ్చేవాడివి.అదీ ఫస్ట్ గ్రేడ్లతో.”
“అయ్యన్నీ మనలాంటోళ్లకి కాదురా. మనకి ఇంత చెత్త లైఫే రాసిపెట్టాడు అల్లా..”
“మార్చేద్దావన్నా! ప్చ్.. ఒక కంప్యూటర్ ఉంటే ఎంత బాగుంటుంది? బోలెడు నేర్చుకోవచ్చు.” చిన్నా విచారించాడు.
“నయం సెల్ ఫోన్ వద్దూ? ఈ టివి రావడానికే నానా పాట్లూ పడ్డాం. అయినా.. అవన్నీ వాడడం ఎవరికి వస్తుంది?” అబ్బాస్ కూడా ఎక్కువ తక్కువ చెయ్యడానికి లేదు. వాడికి కూడా దెబ్బలు వాతలు పడతాయి. నజీర్ వెయ్యి కళ్లతో కాపలా కాస్తుంటాడు.
“నిజమే. పైగా చాలా ఖరీదుంటుంది. ఇక్కడ షాపులే ఉండవు. కంప్యూటర్ ఉన్నా ఇంటర్ నెట్ ఉండాలి. కానీ ఏదో ఒకటి చెయ్యాలన్నా! ఎక్కడన్నా సెల్ ఫోన్ దొరుకుతే బాగుండు.. ఇంటికి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నానని చెప్పాలి.”
“మీ ఇంట్లో ఫోన్ ఉందా?” ఆశ్చర్యపోయాడు అబ్బాస్.
“లేదు. మా నాయన తీసుకుందా మనుకునేవోడు. కానీ నా హాస్పిటల్ తిరుగుడు ఖర్చులు సరిపోయేది. మా సరస్వతీ టీచర్ దగ్గరుంది. ఆవిడకి మెస్సేజ్ పెట్టినా చాలు. వాళ్లకి బతికున్నానని తెలుస్తుంది. కాస్త ఊపిరి తీసుకుంటారు. టీచర్గారి నంబరు నాకు కంఠతానే. మర్చిపోకుండా నా బొమ్మల పుస్తకంలో రాసి పెట్టుకున్నా.” చిన్నా సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నట్లు చూశాడు అబ్బాస్.
“నువ్వు చాలా తెలివైనోడివిరా. చాలా పెద్దోడివవుతావు.”
“ఏం పెద్దన్నా? ఎంత పెద్దైనా ఇంతే ఉంటా కదా!” చిన్నా చాలా మామూలుగానే అన్నాడు. కానీ..
అబ్బాస్ గుండె కదిలినట్లయింది.
“అందుకే గదరా.. నువ్విక్కడున్నావు. అందరిలా ఉంటే నీ జోలికొచ్చే వారుకాదు. నీ చాత ఏదో పని చేయించుకోవాలనే అల్లా నిన్నిలా పుట్టించాడు. ఈ సారి, ఎలుగుబంటిగాడు ఎక్కడన్నా మర్చిపోతే తెచ్చిస్తాలే. ఓ ఫోన్ కొట్టేసి ఇచ్చేద్దాం.” భరోసా ఇచ్చాడు అబ్బాస్.
“కుదరదన్నా.. అందులో కాల్ లిస్ట్ ఉంటుంది. పట్టుబడిపోతాం. బోలెడు సార్లు షెఫ్ అంకుల్ ఫోన్ దొరికింది. ఎంత బాగా ఉన్నా వాళ్ళంతా ఒక్కటే. అందుకే ఊరుకున్నా. చూద్దాం.. సాయి ఏదో దారి చూపించకపోడు.”
“సాయి ఎవరు?”
“మీ అల్లా రూపమే. దేవుడు పంపాడు ఆయన్ని..” చిన్నా, సాయిబాబా గురించి వివరించాడు. తన తండ్రి వ్యాపారం.. ఇంట్లో వాళ్లు తనమీదనే ప్రాణాలన్నీ నిలుపుకుని ఉండడం, తన స్కూల్ గురించి, స్నేహితుల గురించి చెప్పాడు.
మధ్యలో ఏడుపొచ్చేసింది. అలాగే వెక్కుతూనే చెప్పాడు.
అబ్బాస్ కళ్ళు పెద్దవి చేసుకుని విన్నాడు. ఇలా ఉంటాయా ఇళ్ళంటే?
అమ్మ, నాన్న, నాన్నమ్మ.. తనక్కూడా ఉండేవారా? ఉండే వుంటారు. లేకుండా తనెలా పుట్టాడు.
కళ్ల నిండా నీళ్ళు తిరిగాయి.
“అన్నా! కష్ట పెట్టానా నిన్ను?”
“లేదురా! అమ్మానాన్నలతో లైఫ్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నా.”
“మనం తప్పించుకోవాలే కానీ.. నిన్ను కూడా తీసుకు పోతానన్నా మా ఇంటికి.. అమ్మా నాన్నా ఏమీ అనరు. మాకు డబ్బు లేదు కానీ, బోల్డంత ప్రేమ ఉంది. నాకు నిజంగానే అన్న అవుదుగాని. ఈలోగా నీకు ఇంగ్లీష్, లెక్కలు, తెలుగు నేర్పుతుంటాను.” చిన్నా మాట పూర్తవకుండానే, వాడిని ఎత్తుకుని గిరగిరా తిప్పి, గట్టిగా హత్తుకుని వదిలేశాడు అబ్బాస్.

హలీమ్ ఒంటె ఫామ్ దగ్గర చాలా సందడి గా ఉంది, నజీర్ బృందం వెళ్ళే సరికి.
వేరే ఔజుబాల దగ్గర్నుంచి కూడా పిల్ల జాకీలు, వాళ్ల ట్రైనర్లు.. వంద మంది వరకూ వచ్చారు.
రేసులు మొదలవడానికింకా వారమే ఉంది. ఈ సారి, హలీం యజమాని ఆధ్వర్యంలో, వాళ్ల దేశంలోనే జరుగుతున్నాయి.
చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు వాళ్ల షేక్.
హలీమ్ ఫామ్ ముందు, ఒక పెద్ద ట్రక్ నిలబెట్టి ఉంది. అందులో ఐదారు ఒంటెలు పట్టేంత జాగా ఉంది.
“ఒంటెలని ట్రక్లో తీసుకెళ్తారా అన్నా?” ఆశ్చర్యపోయాడు చిన్నా.
“నేను కూడా ఇదే చూట్టం. ఎక్కడికి తీసుకెళ్తారో!” అబ్బాస్ పిల్లలందరినీ ఫామ్ లోకి తీసుకెళ్తూ అన్నాడు.
హలీమ్, నజీర్ హడావుడిగా ఐదు ఒంటెలని అసిస్టెంట్ ముదారీలు నడిపిస్తుండగా ఎదురయ్యారు. అందులో చిన్నా స్వారీ చేసిన, సెకండ్ ప్రైజ్ ఒంటె కూడా ఉంది. దాని మూపురం మీద పెద్ద మచ్చ ఉంది. అందుకే గుర్తు పట్టగలిగాడు చిన్నా.
“అబ్బాస్! నువ్వు కూడా వెళ్ళు.?” నజీర్ అరిచాడు. తన వాడు లేకపోతే ఒంటెలని మార్చేస్తారేమో! ఎందుకైనా మంచిది.. జాగ్రత్తగా ఉంటే నష్టం ఏముంది?
ఎక్కడికి అని అడిగే ప్రసక్తే లేదు. చెప్పిన పని చెయ్యడమే.
“ఈ కుర్రాడు మొన్నటి రేసుల్లో గెలిచాడు కదూ?” చిన్నాని చూసి హలీమ్ అడిగాడు.
చిన్నా ఎక్కడికెళ్లినా నీట్గా తయారవుతాడు. మంచి నడతతో అందరినీ ఆకట్టుకుంటాడు. నజీర్ ఉన్నప్పుడు, సాధ్యమయినంత వరకూ గుంపులో కలిసిపోయుంటాడు. అయినా.. ఎలాగో బైటపడిపోతుంటాడు.
“ఈ అబ్బాయిని కూడా పంపండి. ఆ ఒంటెకి బాగా అలవాటు చేయాలి.”
చిన్నా గుండెలో రాయి పడింది. అయ్యో.. మరి టింకూ?
బెదురుగా అటూ ఇటూ చూశాడు.. టింకూ కోసం.
టింకూ వచ్చి చేయి పట్టుకున్నాడు.
“ఫరవాలేదు చిన్నా! నువ్వెళ్లు. నేను సాండీ, సాహిల్ తో ఉంటా. నయా రాకీ కూడా ఉన్నాడు కదా! అయినా మమ్మల్ని వాళ్లే ఎక్కడికో.. ఏదో చెయ్యడానికి పంపుతారు కదా? ఇక్కడ మనిద్దరం ఎప్పుడూ ఒక చోట లేము. మర్చిపోయావా?”
“సరే.. జాగ్రత్త.”

ఐదు ఒంటెలనీ, అబ్బాస్ చిన్నాలనీ ఎక్కించుకున్న ఆ ట్రక్ మొత్తం ఏసీ. ఒక గంట ఎడారిలో ప్రయాణం చేసి ఒక పెద్ద పాలస్ ముందు ఆగింది.
“ఏంటిది?” అబ్బాస్ డ్రైవర్ని అడిగాడు అరాబిక్ భాషలో.
ఇప్పుడు చిన్నాకి కూడా బాగా అర్ధమైపోతోంది అరాబిక్.
“ఫైవ్ స్టార్ హోటల్.” డ్రైవర్ కాస్త స్నేహంగానే ఉన్నాడు, ఎక్కువ మాట్లాడక పోయినా.
“ఇక్కడికి ఒంటెలెందుకు?” అబ్బాస్కి అయోమయంగా ఉంది. షేక్గారికి చూపిస్తారేమో! ఒంటెలతో పాటు తాము కూడా.. ఒక సారి తన కేసి చూసు కున్నాడు. బానే ఉంది డ్రెస్. నజీర్ ఇచ్చిన బ్లూజీన్స్, తెల్లని టీషర్ట్. ఒకవేళ షేక్ దృష్టిలో పడ్తే.. తనకి వేరే పనిచ్చి, ఈ చెర తప్పించి.. వాడికే నవ్వొచ్చింది. తప్పించుకునే ఛాన్స్ ఉందనుకుంటే నజీర్ పంపనే పంపడు కదా!
“స్విమ్మింగ్కి” డ్రైవర్, హోటల్ వెనక్కి తీసుకెళ్ళి ట్రక్ ఆపి అన్నాడు. అక్కడంతా పెద్ద పెద్ద చెట్లు.. చల్లగా ఉంది.
“ఒంటెలకి స్విమ్మింగా! ఫైవ్ స్టార్ హోటల్లోనా?”
“హా..” డ్రైవర్, కిందికి దూకి, వెనుక తలుపు తెరిచాడు. ఒక పెద్ద బల్లని తీసుకొచ్చి ట్రక్ కి ఆనించారు పనివారు. ముదారీలు వచ్చి ఒక్కొక్క ఒంటెనీ కిందికి దింపారు.
“ఇక్కడ ఈ చెట్లెలా మొలిచాయి? ఎడారి కదా?” అబ్బాస్ కూడా అటువంటి చోటికి రావడం అదే మొదటి సారి.
“మట్టి దగ్గర్నుంచీ షిప్స్ లో తెప్పిస్తారు. ఎండ ఎక్కువ పడకుండా షేడ్స్. ఇంకా లోపలికెళ్తే సముద్రం, మబ్బులాకాశం కూడా ఉంటుంది. మళ్లీ మాట్లాడితే, ఎడారిలో వెనిస్ నగరం ఉంటుంది.. పక్క దేశం ఖతార్లో.” ఓపిగ్గా వివరించాడు డ్రైవర్, పిల్లల ఉత్సాహం చూసి.
నిజమే. ఎత్తైన కాంపౌండ్ వాల్ల మీద ఎండకి అడ్డం పడుతూ నీలం రంగు షేడ్స్..
“వెనిస్?” అబ్బాస్ ఏదో అనబోతే చిన్నా ఆపేశాడు. అబ్బాస్కి వెనిస్ నగరం గురించి ఏం తెలుస్తుంది?
“నేను చెప్తాలే అన్నా. పద.. హలీమ్ సాబ్ వచ్చేశారు చూడు.” అప్పుడే, హలీమ్ తన బెంజ్ కారు లోంచి దిగుతున్నాడు.
ఒంటెలని కూడా ఒక పెద్ద గేటులోనుంచి హోటల్లోకి తీసుకెళ్తున్నారు.
మరీ ఏమీ తెలియని వాళ్లలాగా కనిపించ కుండానే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు చిన్నా, అబ్బాస్.
“దేవలోకం అంటారు కదా పురాణాల్లో.. ఇలాగే ఉంటుందేమో!” చిన్నా చిన్నగా అన్నాడు తెలుగులో.
“అంతే అయుంటుంది. మన ఒజుబాలు, ఫామ్స్, రేస్ గ్రౌండ్స్.. ఇవే కాదు ప్రపంచం. చాలా ఉంది. మనకి తెలియనిది.” అబ్బాస్ కేసి తలెత్తి చూశాడు చిన్నా.
అన్న కంటే తనెంత అదృష్ట వంతుడో అనుకున్నాడు. తను చాలా ప్రపంచాన్నే చూశాడు.
ఒంటెలతో పాటుగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లారు చిన్నా, అబ్బాస్.
అక్కడ ఒంటెల కోసం ప్రత్యేకంగా కట్టినట్లున్నారు స్విమ్మింగ్ పూల్. మనుషులు ఎవరూ ఈదట్లేదు. ఒంటెలు కొలను లోకి వెళ్లడానికి వీలుగా రాంప్ ఉంది. దాని మీదినుంచి దింపుతున్నారు.
హలీమ్ అక్కడున్న వాలు కుర్చీలో కూర్చున్నాడు. రెండేసి ఒంటెల చొప్పున పూల్లోకి వదులు తున్నారు.
ఏసి స్విమ్మింగ్ పూల్ ఏరియా.. పూల్లో గోరువెచ్చని నీరు. హాయి హాయిగా జలకాలాడుతున్నాయి ఒంటెలు.
“ప్చ్.. మనం ఒంటెగా పుట్టినా బాగుండేది.” అబ్బాస్.. విచారంగా..
“అన్ని ఒంటెలకీ ఈ భోగం లేదన్నా. ప్రైజు తెచ్చిన వాటికే. మనుషులకి రాసినట్లే వాటికి కూడా నుదుటి రాత ఉంటుంది.” చిన్నా మాటలకి చిరునవ్వు నవ్వాడు అబ్బాస్.
ఒంటెలని నిలబెట్టిన చోట స్టూల్స్ ఉంటే వాటి మీద కూర్చున్నారు చిన్నా, అబ్బాస్.
“ఇంతకీ మనల్ని ఎందుకు రమ్మన్నట్లో?” చిన్నాకి సందేహం..
“చూద్దాం. నీకు ఈత వచ్చా?”
“వచ్చన్నా. నేను పెరగట్లేదని, మొదట్లో ఈత కొడ్తుంటే ఎముకలు సాగుతాయని చెప్పారు డాక్టర్లు. అప్పుడు నేర్చుకున్నా. ప్రతీ ఆదివారం మునిసిపల్ పూల్కి వెళ్లి ఈత కొట్టి వస్తుంటా.” చిన్నా చెప్పాడు.
“అదిగో.. నీ ఒంటెని దింపుతున్నారు నీళ్ల లోకి.” అబ్బాస్ చూపించాడు.
“భలే వాడివే. నా ఒంటెనా? హలీమ్ సాబ్ విన్నాడంటే..” చిన్నా ఆపేశాడు, ఎవరో వస్తుంటే.
హలీమ్ సాబ్ దగ్గరికి హోటల్ మానేజర్ వచ్చి ఒక చీటీ ఇచ్చాడు.
ఒక్క క్షణం ఆలోచించి రమ్మన్నట్లుగా తలూపాడు హలీమ్.
లాయర్ ఆలీ బృందం స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వచ్చి, హలీమ్కి సలాం పెట్టి పక్క నున్న కుర్చీల్లో కూర్చున్నారు.
“వాళ్లెవరో ఈ దేశం వాళ్ల లాగ లేరు కదన్నా?”
అబ్బాస్ తలూపాడు, కుతూహలంగా చూస్తూ.
“రేసులు చూట్టానికి వచ్చుంటారు. వాళ్లతో మాట్లాడ్డానికి ఛాన్స్ దొరుకుతే బాగుండును.” నిట్టూర్చాడు అబ్బాస్.

పరిచయాలయ్యాక, అందరికీ కాఫీ తెప్పించాడు హలీమ్.
ఫాతిమా సాంప్రదాయ అరాబిక్ దుస్తులు వేసుకుంది. నల్లని బురఖాలో ఆమె తెల్లని మొహం తప్ప ఏమీ కనిపించడం లేదు.
“చెప్పండి.. మా దేశంలో విశేషాలన్నీ చూశారా?” హలీం మర్యాద పూర్వకంగా అడిగాడు.
సంభాషణ అరాబిక్లోనే ఫాతిమా సాగిస్తోంది.
“చూశాము..హలీమ్ సాబ్. ఇంక కామెల్ రేసెస్ చూడాలని. చాలా ఫేమస్ కద?”
“హా.. దేశ దేశాల్నుంచీ డిగ్నిటరీస్ వస్తారు వాచ్ చెయ్యడానికి. ఒక వారంలో ఇక్కడే ఉన్నాయి. చూసి వెళ్లండి. ఈ రేసెస్కి చాలా హిస్టరీ ఉంది.” ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో అంతా వివరించాడు.
“సో.. ఒంటెలకి అంతా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందన్న మాట.”
“హా. వాటి ఫుడ్ కూడా చాలా రిచ్. చాలా కేర్ఫుల్గా చూస్తాము. మంచి వాతావరణంలో స్ట్రెస్ ఫ్రీగా పెంచుతాము. చూస్తున్నారు కదా! స్విమ్మింగ్ వంటి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి.”
“వెరీ ఇంట్రెస్టింగ్.” ఫాతిమా చిరునవ్వు నవ్వింది.
సంభాషణంతా ఆలీకి అర్ధమవుతోంది. నోటి వరకూ వచ్చింది, జాకీల మాటేమిటని. బలవంతంగా ఆపుకున్నాడు.
“ఒక సారి ఒంటెల దగ్గరగా వెళ్లి చూడచ్చా? వాటి దగ్గర పిక్చర్ తీసుకోవచ్చా?” ఫాతిమా అడిగింది, తియ్యగా నవ్వుతూ.
“తప్పకుండా. మీకు రేస్ ట్రాక్ దగ్గర ఈ ఛాన్స్ దొరకదు. అంతా హడావుడి, దుమ్ము, నాయిస్. మీరు లక్కీ.. ఇదే టైమ్కి ఇక్కడికి రావడం. నేను కూడా వస్తాను.” హలీం లేచాడు.
అంతలో.. అతని సెల్ రింగయింది.
“సారీ.. ఒక్క నిముషం.” ఫోన్ నంబర్ చూసి, టెన్షన్ గా అన్నాడు..
“షేక్ పిలుస్తున్నారు. అక్కడ అసిస్టెంట్ ఉన్నాడు. అతను మీకు హెల్ప్ చేస్తాడు. మనం మళ్లా కలుద్దాం.” అబ్బాస్కి సైగ చేసి పూల్ దగ్గర్నుంచి లోపలికెళ్లాడు హలీమ్.

ఆలీ ఒంటెల దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూస్తున్నాడు.
ఫాతిమా అబ్బాస్ని ఇంటర్వ్యూ చేస్తోంది. అంతలో అసిస్టెంట్ ఒక ఒంటె వెనుక ఉన్న చిన్నాని చూశాడు.
“ఈ కుర్రాడు..”
“జాకీ సాబ్. ఒంటెలకి బరువు తక్కువగా ఉన్న జాకీ కావాలి. అందుకే చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ అబ్బాయి మంచి జాకీ.”
ఒంటెల గురించి, జాకీల గురించి మరింత వివరించాడు అబ్బాస్. చిన్నా అంతా పరికిస్తూ, వింటున్నాడు.
“మీరు ఫారినర్సా?” చిన్నా అడిగాడు అరాబిక్లో కూడ బలుక్కుంటూ.
“యస్.” వాళ్ల దేశం పేరు చెప్పాడు ఆలీ, చిన్నాని ముచ్చటగా చూస్తూ.
“మీరు అక్కడే ఉంటారా?”
“తిరుగుతూ ఉంటాము. లండన్లో కూడా ఉంటాము.” ఆలీ, చిన్నా ఎదురుగా, నేల మీద మోకాళ్ల మీద కూర్చుని అన్నాడు.
“అయితే మీకు ఇంగ్లీష్ వస్తుంది కదా?
“యస్.”
“ఒకసారి మీ సెల్ ఫోన్ వాడచ్చా? మీరు ఇక్కడెవరికీ చెప్పనంటేనే..” అటూ ఇటూ చూసి అడిగాడు చిన్నా.
“ష్యూర్. ఎవరికి చేస్తావు?” ఆలీ అడిగాడు.
“మా దేశంలో మా టీచర్కి. డబ్బు ఎక్కువవుతుందంటే మెస్సేజ్ ఇస్తాను. మిమ్మల్ని నమ్మచ్చా? ఎవరికీ..”
“చెప్పను బాబూ! నీ పేరేంటి? మెస్సేజ్ ఇవ్వటం వచ్చా?” సెల్ తీసి ఆన్ చేసి ఇచ్చాడు లాయర్ ఆలీ.
అబ్బాస్, ఫాతిమాతో మాట్లాడుతూనే ఆందోళనగా చూస్తున్నాడు. ఎవరో తెలియకుండానే వాళ్ల హెల్ప్ తీసుకుంటే.. ఎలా చెప్పడం వాడికి?
“చిన్నా. థాంక్యు అంకుల్. వచ్చంకుల్.” చిన్నా గబగబా సరస్వతీ టీచర్ నంబర్ డయల్ చేసి, మెస్సేజ్ పెట్టి, వెంటనే సెల్ ఆలీకి ఇచ్చేశాడు.
“అంకుల్! ఒక రిక్వెస్ట్. ప్లీజ్ ఎరేజ్ థట్ మెస్సెజ్. ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లమ్.”
“ఇంత మంచి ఇంగ్లీష్ నీకు ఎలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగాడు ఆలీ, మెస్సేజ్ వెళ్లిందని వెలగ్గానే, చిన్నా చూస్తుండగానే ఇరేజ్ చేసేశాడు.
“నేను ఇంగ్లీష్ మీడియమ్ లో చదువుతున్నా అంకుల్. థాంక్యూ వెరీ మచ్. ఆ దేముడు పంపినట్లే వచ్చారు మీరు.”
ఎంత ఇంగ్లీష్ మీడియమ్ అయినా.. ఇంత చిన్న పిల్లాడు అంత ధారాళంగా మాట్లాడ్డం.. నమ్మలేక పోయాడు ఆలీ.
హలీం వాళ్ల దగ్గరగా వస్తుండడం చూసి ఆపేశాడు చిన్నా.
ఆలీ లేచి ఒక ఒంటె దగ్గరగా వెళ్లి నెమ్మదిగా దాన్ని రాయ సాగాడు.
“చాలా మాజెస్టిక్గా ఉన్నాయి హలీం సాబ్. మీరు కూడా వస్తే పిక్చర్స్ తీసుకుందాం.”
పూల్లో ఆనందిస్తున్న ఒంటెలని వీడియో తీశాడు అసిస్టెంట్. తాము ఒంటెల దగ్గర నిలబడి ఫొటోలు తీసుకున్నారు.
“వీళ్లని మాత్రం పిక్చర్ తియ్యద్దు. ఇక్కడ చాలా పోటీ ఎక్కువ. మంచి జాకీలకి మంచి డిమాండ్. మా కాంపిటీటర్స్ దొంగిలించుకు పోతారు.” గట్టిగా నవ్వుతూ, చిన్నానీ, అబ్బాస్నీ అక్కడి నుంచి పంపేశాడు హలీమ్.

“అలా చేసి ఉండకూడదు చిన్నా.” అబ్బాస్ నిష్ఠూరంగా అన్నాడు.
ఒంటెల జలకాలాటలయ్యాక పెద్ద పెద్ద తువాళ్లు తీసుకుని వాటిని తుడుస్తున్నారిద్దరూ. చిన్నా వాటి కాళ్లని బాగా వత్తుతున్నాడు.
ఆ ఒంటెలు కూడా చక్కగా తుడిపించుకుంటున్నాయి.. తమ సేవకులకి అనువుగా శరీరాలని తిప్పుతూ.
“ఏం చెయ్యమంటావన్నా? అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలనిపించింది. ఆ అంకుల్ వాళ్లు ఇండియన్స్ లాగా అనిపించారు. పైగా లండన్లో కూడా ఉంటారుట. ఇంతకంటే చెడిపోయిందేముందన్నా? ఆ దేవుడే వీళ్లని పంపాడేమో.. లేకపోతే అనుకోకుండా మనం ఇదే సమయానికి ఇక్కడికొచ్చేలాగ ఎందుకు జరిగింది? ఎప్పుడైనా అనుకున్నామా ఫైవ్ స్టార్ హోటల్ చూస్తామని..” అనునయించాడు చిన్నా.
“అంతే అయుంటుందిలే చిన్నా! ఏదైతే అదవుతుంది. దేవుడి మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు. చూశావా.. నీతో మాట్లాడుతుంటే తెలుగు ఎంత బాగా వస్తోందో నాకు.” ఆనందంగా అన్నాడు అబ్బాస్.
“ఎందుకు రాదన్నా.. మన మాతృభాష అమ్మ లాంటిది..” అని నాలిక కొరుక్కున్నాడు చిన్నా. అమ్మ, నాన్నఅంటే అబ్బాస్కి అంత ఇదేం లేదని.
“నిజమేరా. అమ్మంటే, మీ అమ్మ గురించి నువ్వు చెప్తున్న సంగతులే గుర్తుకొస్తుంటాయి నాకు.”
ఆఖరి ఒంటె తుడుస్తుండగా, హలీమ్ రమ్మని పిలిచాడు. ఒంటెలని బైటికి తీసుకెళ్లి పోయారు ట్రయినీలు, ట్రక్ ఎక్కించడానికి.
“రండి. లంచ్ తినండి. బయలు దేరుదాం.” చిన్నా, అబ్బాస్లకి బల్ల మీద ఉన్న ప్లేట్లు చూపించాడు హలీం.
తాము.. ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్..
నమ్మలేనట్లు చూశారు. చిన్నా, అబ్బాస్ షర్ట్ వెనుక దాక్కుని చూస్తున్నాడు. ఒక్క క్షణం అనిపించింది.. ట్రైనీలు తమని ఎంత ఘోరంగా ఉపయోగించుకుంటారో చెప్దామని. కానీ.. ఈ హలీం ఇవాళే.. ఇప్పుడే ఉంటాడు. ప్రతీ రోజూ తాము గడప వలసింది నజీర్ లాంటి వాళ్ల తోనే. అందుకే మాట్లాడకుండా ప్లేట్లు తీసుకుని, కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుని తిన సాగారు.
చూట్టానికి మామూలు సాండ్ విచ్ లాగానే ఉంది. కానీ ఎంత రుచిగా ఉందో. మధ్యలో గుడ్డు ఉడికించి ముక్కలు చేసి పెట్టారు. కీరా ముక్కలు.. టొమాటో ముక్కలు, సాస్..
బ్రెడ్ అయితే, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లుంది.
దాంతో పాటుగా, కొద్దిగా వాల్ నట్స్, బాదం పాలు. నాలుగు రకాల పళ్ల ముక్కలు.
“‘ప్రోటీన్ ఫుడ్’ అంటూ దీని గురించే చెప్తుంటాడనుకుంటా హలీమ్ సాబ్.” సన్నగా అన్నాడు చిన్నా.
“అవును. ప్రతీ వారం లెక్కలేసి దీనికి అయేంత డబ్బు తీసుకుంటాడు. మనకి నీళ్ల టీ డికాషన్, షాపులోంచి చవగ్గా కొనుక్కొచ్చిన, నాలుగురోజుల నాటి ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు.. చవగ్గా దొరికే కూరగాయల ముక్కలు. సగానికి సగం మిగుల్చుకుంటాడు ఎలుగు బంటి.” రోషంగా అన్నాడు అబ్బాస్.
“ఇంత అన్యాయం చేస్తూ చిన్న చిన్న పిల్లల్ని ఏడిపించి దాచిన డబ్బుతో ఏం చేస్తారు వీళ్లు? నజీర్ మాత్రమే కాదు.. అన్ని చోట్ల ట్రైనర్లూ ఇలాగే ఉన్నారని చెప్తున్నారు కదా! మా మతంలో పిల్లల్ని దేముడి రూపాలంటారు.” చిన్నా కళ్ల్లల్లో నీళ్లు తిరిగాయి. గొంతు నొక్కుకు పోయినట్లై పోయింది.
హలీం లంచ్ ముగించి లేచాడు.
వెంటనే చిన్నా, అబ్బాస్ కూడా లేచారు, గబగబా బాదం పాలు తాగేసి.
ట్రక్ రెడీగా ఉంది. ఒంటెలు ఎక్కి పోయాయి అప్పుడే. వీళ్లకోసమే ఆగినట్లున్నారు. పరుగెత్తుకుంటూ వెళ్లి ఎక్కేశారు.
“ఒంటెలు ధగధగా మెరిసి పోతున్నాయి చూశావా అన్నా?”
“హా.. మరి తలంటయింది కదా!”
“ఈ ఎండకి బైటికొచ్చి ట్రక్ ఎక్కే లోపు ఎండి పోతుంది కదా.. అంతంత పెద్ద తువ్వాళ్లు తెచ్చి, ఒంటెల్ని తుడవటం అవసరమంటావా అన్నా?”
“చాలా అవసరం.. జలుబు చెయ్యదూ తడి ఉండి పోతే..” కొంటెగా చూశాడు అబ్బాస్.
………………….
8

ఒకటికి పది సార్లు చూసింది సరస్వతీ టీచర్, తన సెల్ కొచ్చిన మెస్సేజ్.
నిజమేనా.. ఇది చిన్నా యేనా ఇచ్చింది? తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేసుంది. దాదాపు ఎనిమిది నెలలవుతోంది చిన్నా కనపడక.
ఇంత కాలానికి వాడు మెస్సేజ్ ఇవ్వగలిగాడా?
రెండే రెండు లైన్లు..
“నేను బాగున్నాను తొందర్లో వస్తా. అమ్మకి నాయనకి చెప్పండి. చిన్నా.”
ఫోన్ లో మాట్లాడ్డానికి గానీ, ఎక్కువ రాయడానికి కానీ కుదరలేదా? ఇప్పడేం చెయ్యాలి తను? బుల్లయ్య వాళ్లకి చెప్పాలా? ఇదసలు నిజంగా వాడి దగ్గర్నుంచి వచ్చిందేనా?
మధ్యాన్నం ఒంటిగంటన్నర కొచ్చింది మెస్సేజ్. అందులో టైమ్ పన్నెండుంది. ఒక సారి టైమ్ జోన్లు చూసింది నెట్ లో. అంటే దుబాయ్ లో ఉన్నాడా?
స్కూల్ అయే వరకూ అతి కష్టం మీద ఆగింది.
అయి పోయిన వెంటనే స్కూటీ మీద చిన్నా ఇంటికెళ్లింది. చిన్నా వెళ్లాక స్కూటీ కొనడం, నేర్చుకోడం, నడపడం.. అన్నీ వరసగా జరిగాయి. ఇంచు మించు రోజూ వాళ్లింటికి వెళ్తోంది. చిన్నాఉన్నప్పటి కంటే అనుబంధం పెరిగింది.
బుల్లయ్య ఇంట్లో ఉండే టైమే అది. నాలుగింటికి బయల్దేరి, పూల మార్కెట్ కి వెళ్లి పూలు కొనుక్కుని, గుడి దగ్గరకెళ్తాడు.
చిన్నా కనిపించకుండా పోయినప్పట్నుంచీ, నర్సమ్మ కూడా వెళ్తోంది. పూలన్నీ సర్ది ఇవ్వటానికి.
“రండి టీచర్. సూరీ! చాయ్ పెట్టవే. టీచర్ గారొచ్చారు.” వీధి వరండాలోనే కూర్చున్న బుల్లయ్య చటుక్కున లేచి కుర్చీ తన పైగుడ్డతో దులిపాడు.
పక్కిల్లు తాళం వేసుంది. ఇదీ మంచిదేలే అనుకుంది సరస్వతి. వాళ్లకి సమాధానం చెప్పే పని తప్పింది. తనకే తెలియని విషయాలెలాగ చెప్ప గలదు?
ఒక గడ్డి పోచ దొరికింది ఆధారంగా.. అంతే.
సరస్వతి కుర్చీలో కూర్చుని, చెంగుతో మొహం వొత్తుకుంది. చెమట ధారగా కారుతోంది.
బుల్లయ్య వెంటనే ఇంట్లోకెళ్లి, స్టూల్ తెచ్చి టేబిల్ ఫాన్ అమర్చాడు.
గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. ఎలా మొదలు పెట్టాలి? ఇంట్లో ఆడవాళ్లని కూడా రానీయనుకుంది.
చిన్నా ఇంట్లో వాళ్లకి రోజు రోజుకీ ఆశ సన్నగిల్లుతోంది. ఇప్పుడు టీచర్ కూడా తమని చూసి పోడానికి వచ్చిందనుకుంటున్నారు.
సూరమ్మ తళతళ మెరిసే స్టీలు గ్లాసుల్లో వేడి వేడి టీ తెచ్చి, బుల్లయ్యకీ, సరస్వతికీ ఇచ్చింది.
“సూరమ్మా! నువ్వుకూడా చాయ్ తెచ్చుకో. నర్సమ్మ ఏదీ? ఆవిడని కూడా రమ్మను.”
ముగ్గురూ, సరస్వతి ఎదురుగా చాప మీద కూర్చున్నారు.
అందరూ టీ తాగి, సత్తువ తెచ్చుకున్నాక మొదలు పెట్టింది.
“ఇందాకే నా సెల్ కి ఒక మెస్సేజ్ వచ్చింది. అందులో ‘చిన్నా’ అని ఉంది.”
ఒక్కసారిగా లేచి నిల్చున్నారు ముగ్గురూ, నమ్మలేనట్లుగా చూస్తూ. టీచర్ గారికి మెస్సేజా?
“మెస్సేజ్ అంటే?” నర్సమ్మ అడిగింది.
“సెల్ ఫోనుంది కదా.. ఇందులో మాట్లాడకుండా, చెప్ప దల్చుకున్నది రాసి పంపచ్చు. రెండే లైన్లు రాసున్నాయి.” చదివి వినిపించింది.
సూరమ్మ నిశ్శబ్దంగా ఏడవ సాగింది.
“ఏడవకమ్మా! ఎవరైనా చూస్తే బాగోదు. అందరూ వచ్చారంటే మనం మాట్లాడుకోలేము.”
“పదండే.. మనం లోన కూర్చుందాం.” ఇంట్లోకి తీసుకెళ్లాడు బుల్లయ్య అందరినీ.
సరస్వతి అదే మొదటి సారి ఇంట్లోకి వెళ్లడం. ఒకటే గది. వెనుక వరండాలో ఒక పక్క వంటకేర్పాటు చేసుకున్నారు.
పక్క బట్టలన్నీ ఒక మూల పెట్టి ఉన్నాయి. ఇంకొక మూల బుల్లి స్టడీ బల్ల.. చిన్నాది. ఉన్న అలమార్లో ఒక అరంతా చిన్నా పుస్తకాలు. పొందిగ్గా, శుభ్రంగా సర్ది ఉంది గది.
“చిన్నా ఎప్పుడూ చెప్తాడమ్మా.. శుభ్రంగా సర్దుకోవాలని. ఇదంతా వాడి అయిడియానేనమ్మా!” అంతా పరికిస్తున్న సరస్వతితో, బొంగురు పోయిన గొంతుతో అన్నాడు బుల్లయ్య.
సరస్వతి కుర్చీలో కాసేపు మౌనంగా కూర్చుంది. ఇదేదో ఆకతాయిల పనైతే.. అనవసరంగా ఆశలు కల్పించినట్లవుతుందేమో! కానీ ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడొచ్చిందంటే.. నిజం అయే అవకాశం కూడా ఉంది.
గట్టిగా ఊపిరి పీల్చి మొదలు పెట్టింది.
“ఇది చిన్నానే ఇచ్చాడని నాకు బాగా అనిపిస్తుంది. మీకు ధైర్యం చెప్పమని వాడి ఉద్దేశం అయుండచ్చు.”
“ఫోనే కదమ్మా. మాటాడచ్చు కదా? ఇంకాస్త ధైర్యంగా ఉండేది.” నర్సమ్మ అంది, నెమ్మదిగా. నూతిలోంచి వస్తున్నట్లుంది గొంతు.
“మాట్లాడే అవకాశం కలిగి ఉండక పోవచ్చు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో?”
“ఎక్కడ్నుంచొచ్చిందమ్మా?” ముగ్గురూ ఒకే సారి..
“దుబాయ్ టైమ్ ఉంది. అక్కడి నించేనని అనుమానంగా ఉంది. ఆ చుట్టు పక్కల దేశాల్నుంచి కూడా అయుండచ్చు.” సరస్వతి మాటలకి ఉలిక్కి పడి చూశాడు బుల్లయ్య.
“దుబాయా? అక్కడికి బానిసలుగా తీసికెల్తారని చెప్పుకుంటారు కదమ్మా? ఈడు పెరగను కూడా పెరగడు. ఏం చేస్తాడక్కడ? ఎంత అపురూపంగా చూసుకున్నాం? పువ్వులా పెంచుకుంటన్నాం. కంప్యూటర్ ఇంజనీర్ అవుతానని అనేవోడు.” పైపంచె నోట్లో కుక్కుకుని కుళ్లి పోతున్నాడు బుల్లయ్య.
సరస్వతికి కూడా కన్నీళ్లాగలేదు.
“టింకూగాడి గురించేం రాయలేదేమ్మా?” ఉన్నట్లుండి అడిగింది సూరమ్మ.
సరస్వతి తెల్లబోయి చూసింది. నిజమే! టింకూ వాడి దగ్గర లేడా? వాడేమైపోయాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *