March 28, 2024

కౌండిన్య హాస్యకథలు – పెళ్ళిలో చీరింగ్ గల్స్

రచన: రమేశ్ కలవల

“ఏవండి, పెళ్ళిలో ఆర్కెస్ట్రా అన్నారు, సంగీత్ అన్నారు.. అందరి పిల్లల పెళ్ళిళ్ళు గ్రాండ్ గా చేసుకుంటుంటే మన ఒక్కగానొక్క కూతురు పెళ్ళి కూడా అదిరిపోయేలాగా చేయాలి కదండి” అంది కుశల.
“ఆ సంగతి నాకు వదిలేయ్” అని కంగారుపడకు అన్నట్లు సైగలు చేసి మళ్ళీ టీ వి లో క్రికెట్ మ్యాచ్ చూడటం మొదలుపెట్టాడు.
“పెళ్ళి వారంలో పడింది, ఇంట్లో చుట్టాలంతా వచ్చి ఉన్నారు. మీరు తీరిగ్గా క్రికెట్ చూస్తే ఎలాగండి? వాళ్ళకి ఫోను చేసి ఆ రెండు పనులు ఈ పూట అవ్వగొట్టండి, నాన్చద్దండి” అంది కుశల
అక్కడ టీ వీ లో క్రికెట్ మ్యాచ్ రక్తి కడుతోంది. ఆయన అభిమాన టీమ్ బాగా ఆడటంతో దాంట్లో చీర్ గాల్స్ ను పదే పదే చూపిస్తున్నారు. వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా నృత్య ప్రదర్శన చేస్తూ వారి టీమ్ ను ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు నచ్చిన టీమ్ బాగా ఆడటంతో ఆ టీ వీ ముందు ఆయన కూడా ఆ చీర్ గాల్స్ ను అనుకరిస్తూ స్టెప్లు వేయబోయి జారుతున్న లుంగీని సరైన సమయంలో పట్టుకున్నాడు, ప్రమాదం తప్పిందనుకున్నాడు. అదంతా చూస్తున్న కుశల కోపంతో “పెళ్ళి విషయాలు మీకు ఏ మాత్రం పట్టడం లేదు కాబోలు” అంటూ వెళ్ళి ఆ టీ వీ ఆపేసింది కుశల
ఆందోళన పడుతున్న కుశల వైపుకు చూసి “సరేగానీ, నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది. మన అమ్మాయి పెళ్ళిలో ఓ లేటెస్టు ట్రెండ్ సెట్ చేద్దాం” అన్నాడు. కుశల ఏదో చెప్పండన్నట్లుగా మొహం పెట్టింది. ఇంతలో హరి “టి ట్వంటీ క్రికెట్ లో లాగా పెళ్ళిలో చీర్ గాల్స్ ను పెట్టిస్తే ఎలా ఉంటుంది” అన్నాడు. “ఏడ్చినట్లుంది. సరదాకి కూడా ఓ సమయం ఉండద్దూ. మీతో పెట్టుకుంటే అయ్యేలాగా లేదు నేనే ఏదోకటి చేస్తాను” అంటూ కుశల వేరే గదిలోకి వెళ్ళింది. హరి కి మాత్రం తనకు తట్టిన ఐడియా విపరీతంగా నచ్చింది, అప్పుడే ఆ గదిలోనుంచి అటు వెళ్ళబోతున్న చెల్లెలు కూతుర్లు, తమ్ముడు కూతుర్ని పిలిచాడు. మళ్ళీ టీ వీ ఆన్ చేసాడు హరి. ఆ చీర్ లీడర్స్ ను చూపిస్తూ “అమ్మాయిలు, మీరు అచ్చం అలాగే డాన్స్ చేయగలరా?” అని అడిగాడు. “ఓ అది ఎంత పని” అంటూ వాళ్ళలానే వయ్యారంగా డాన్స్ వేయడంతో “పెళ్ళిలో మీరు ముగ్గురూ ఇలాగే చేస్తే గనుక ఒక్కొక్కళ్ళకు వెయ్యి రూపాయలు ఇస్తాను. ఈ వారం రోజులూ ప్రాక్టీసు చేస్తారా?” అని అడిగారు హరి. “ఓ తప్పకుండా” అంటూ “వాళ్ళ చేతిలో ఉండేవి ఎలాగా?” అని అడిగారు. “అవా! పాం పాం లు జిగేల్ జిగేల్ మనేవి నేను తీసుకొస్తాను కదా” అన్నాడు.
“ఇంతకీ మీకు క్రికెట్ లో చీర్ గాల్స్ ఎలా వచ్చారో తెలుసా?” అని అడిగాడు హరి. లేదన్నట్లు తల ఊపి తెలుసుకోవాలన్నట్లు కుతూహలంతో హరి వైపుకు చూసారు. “ఓ రోజు క్రికెట్ క్లబ్లో ఒకావిడ బోర్ కొట్టకుండా పాటలు పొట్టుకొని బూజులు దులుపుతుంటే ఆవిడ వేసే స్టెప్లు చూసి ఆ క్లబ్ వోనర్ ఇదేదో బావుందని, ఈ డాన్స్ క్రికెట్ ఆడుకున్నపుడు పెట్టిస్తే బావుంటుందని తలచి ఇంకో ఇద్దరిని పెట్టి డాన్స్ పెట్టించగానే అది అందరికీ బాగా నచ్చి అప్పటి నుండి ప్రతీ మ్యాచ్ లో అలానే చేస్తున్నారనమాట” అన్నాడు హరి. “నిజంగా” అని అడిగారు హరి సంగతి తెలిసి. “అవునుకానీ, మీరు మటుకు పెళ్ళిలో అదరకొట్టేయాలి” అనగానే ఆ టీ వీ ముందు నించొని ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టారు.
వారం రోజులు గిర్రున తిరిగాయు పెళ్ళి రోజు రానే వచ్చింది. కుశల సంగీత్, ఆర్కెష్ట్రా మాట్లాడనందుకు పెళ్ళిలో హరి కనపడితే చాలు దెప్పి పొడుస్తూనే ఉంది. హరి ఉద్దేశ్యం ఏమిటంటే క్రికెట్ లో లాగా పెళ్ళి తంతులలో కూడా గోల్స్ ఉంటాయనమాట. వధువరులు నీరసపడకుండా ఈ చీరింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తన అభిప్రాయం, అదీకాక ఒక్కొక్క తంతుకు ఒక్కో రకం పాట, బీట్ తో స్టెప్స్ వేస్తుంటే ఆ తంతుకు అందం కూడా వస్తుందని ఆలోచించాడు.పెళ్ళిళ్ళలో అస్సలు బొత్తిగా తంతుల వైపు దృష్టి లేకుండా ఏ బాతాకాణీ వేసుకునే వారికి, తోచక సెల్ఫీలు తీసుకునే వారి స్టేజీ మీద చీర్ గాల్స్ చేసేది చూస్తూ, ఈ వధువరుల వైపు కూడా చూస్తారని ఓ ఆశ కూడా.
కళ్యాణ మండపం ముందు వచ్చే వారిని ఆహ్వానించడానికి ఓ బల్ల వేసి జల్లటానికి పన్నీరు, రాయటానికి గంథం, బొట్టు పెట్టడానికు కుంకుమ అన్నీ పెట్టారు. ఇంతలో హరి వాళ్ళ ఓ సారి వేలి విడిచిన కాలు పట్టుకొన్న మావయ్య, అత్తయ్య రావడంతో ఆహ్వానించి పన్నీరు జల్లి, గంథం, బొట్టు పెట్టారు. తరువాత అకస్మాత్తుగా తెరచాటునుండి ముగ్గురు చీర్ గాల్స్ వచ్చారు. క్రికెట్ మ్యాచ్ చీర్ గాల్స్ కు ఏమాత్రం తీసిపోరు. ఆ వచ్చిన వారి పక్కనే నించొని డాన్స్ మొదలుపెట్టారు. ఆ చేతిలో మెరిసిపోతున్న పాం పాం లోతో ఆయన మొహం మీద ఓ సారి రాసారు. ఆయనకు అసలే డస్ట్ ఎలర్జీ, అలా రాయడంతో ఓ రెండు తుమ్ములు తుమ్మి “ఏరా హరి, ఏవిటిరా ఇదంతా? నా మీద ఇంకా నీకు కోపం పోలేనట్లుంది” అన్నారు. “అదేం లేదు మావయ్యా! ఏదో పెళ్ళిలో కొత్త ట్రెండ్ సెట్ చేద్దామని. మీరు లోపలికి పదండి” అంటూ పెళ్ళి జరుగుతున్న ప్రదేశానికి తీసుకొని వెళ్ళాడు హరి.
తరువాత వాళ్ళ దూరపు చుట్టాలయిన “బాయిలర్” బామ్మగారు కావడంతో ఆ చీర గాల్స్ అటు పరిగెత్తారు. ఆవిడ ఎవరింటి కెళ్ళినా సరే బాయిలర్ లో వేడి వేడిగా సల సలా కాగే నీళ్ళు పోసుకోవడం అలవాటు, అందుకే అందరికీ ఆవిడ బాయిలర్ బామ్మాగారనే తెలుసు. ఆవిడ కాలు క్రింద మోపారో లేదో ముగ్గరూ చెంగు చెంగున “ఒన్ టూ త్రీ ఫోర్” అంటూ డాన్స్ మొదలు పెట్టారు. అది చూసి ఆవిడ ఎక్కడ లేని సంతోషం వేసి దిగగానే “ఏదీ ఒకటి నాకు కూడా ఇవ్వండ్రర్రా” అంటూ వాళ్ళ చేతిలో ఓ పాం పాం లాక్కొని డాన్స్ వేయడం మొదలుపెట్టబోతుంటే అటు వెడుతున్న కుశల అది కాస్తా చూసి “ఇదేనా మీరు పెళ్ళిలో పెట్టిస్తానన్నది” అని హరిని కోపంతో అంటూ ఆ పాం పాం పిల్లల మొహాన పడేసి బాయిలర్ బామ్మగారిని పలకరిస్తూ లోపలకు తీసుకెళ్ళింది.
పెళ్ళి తంతులు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ చీర్ గాల్స్ జనాలు నించున్న చోట్లా అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతున్నారు ప్రదర్శన ఇస్తున్నారు, సందడి చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఈ అకస్మాత్తుగా డాన్సులు వేయడంతో పెద్దవాళ్ళు దడుచుకున్నారు. కొంతమందికి అది వింతగా అనిపించి ముసి ముసి నవ్వులు కూడా నవ్వుతున్నారు.
శుభ ముహూర్తం ఆసన్నమయ్యింది. హరి మండపం పైనుండి చుట్టూరా చూసి ఆ చీర్ గాల్స్ కు సైగలు చేయడంతో వాళ్ళు కూడా ఆ స్టేజ్ ఎక్కారు. ఓ పక్కన డాన్స్ మొదలుపెట్టారు. పంతులు గారు “వాయిద్యాలు వాయిద్యాలు” అని అరుస్తున్నారు, ఇంతలో ఆయన ఇటు తిరిగే సరికి వీళ్ళ డాన్సులు చేయడం చూసి కళ్ళార్పకుండా అటు చూసారు. ఎన్నో పెళ్ళిళ్ళు చేయించిన మనిషి ఆయన ఎన్నడూ ఇలా చూడలేదు కానీ ఇదేదో కొత్తగా, ఆకర్షణగా ఉండటంతో ఆయన చిరునవ్వు నవ్వి తన మానా మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. పెళ్ళికి విచ్చేసిన వారందరూ అటు స్టేజి వైపుకు చూస్తూ ఉండిపోయారు. ఒక్కో తంతుకు ఒక్కో నృత్యం చేసి ఆ ముగ్గురూ కూడా అందరినీ అలరించారు, అందరి మనసుకు నచ్చేలా డాన్స్ లతో ఆకట్టుకున్నారు. పెళ్ళి యథావిధిగా ముగిసింది. అందరినీ భోజనాలకు వెళ్ళమని మైకులలో చెప్పడంతో కొందరు లేచి బయలుదేరారు.
ఓ పక్క భఫే భోజనాలు పెడుతుంటే ఇంకో వైపు నించొని తింటున్నారు. ఇంతలో ఆ తింటున్న దగ్గర ఓ ఎనౌంట్మెంట్ చేయటంతో అందరి చూపు అటు మళ్ళింది. “మీ భోజనాలతో పాటుగా ఆర్కెష్ట్రా కాకుండా కొత్తగా ఉండేలా చీర్ గాల్స్ ప్రదర్శన చేయబోతున్నారు” అనగానే ఆ ముగ్గురూ ఆ పక్కనే ఉన్న స్టేజీ ఎక్కారు. మంచి పాటలతో వయ్యారంగా డాన్స్ చేస్తుంటే అందరూ మైమరిచీ ఊగిపోతూ భోజనం చేస్తూ వీక్షిస్తున్నారు.
కొంతసేపటి తరువాత ఎక్కడి నుండి వచ్చారో బాయిలర్ బామ్మ గారు, ఇంకో ఇద్దరితో ఆ స్టేజి మీదకు చేరి ఆ ముగ్గురు పిల్లల చేతిలోనుండి ఆ పాం పాం లు లాక్కొన్నారు. ఆవిడ మధ్యలో నించొని మైఖేల్ జాక్సన్ లా ఓ చేయి పైకి ఎత్తి ఓ పోజు పెట్టారు. మైఖేల్ లానే కీచు గొంతుతో ఓ పాట మొదలు పెట్టి మ్యాజిక్ తో చక్కటి రిథమ్ తో డాన్స్ వేయడంతో అక్కడ ఉన్న వారు, భోజనం చేస్తున్న వారు నోరు తెరిచి ఆ ప్రదర్శన చూస్తూ, చప్పట్లు కొడుతూ, కేరింతలు కొట్టడంతో అక్కడ పెళ్ళి పీటలు మీద కూర్చున్న పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురుకి అక్కడ ఏం జరుగుతుందో చూడాలన్న కుతూహలం కలిగింది. ఎలాగూ అరుంధతీ నక్షత్రం చూపించే తంతు ఉంది కాబట్టి అటు బయటకు నడిచారు. ఆ బామ్మ గార్లు చేతులలో ఉన్న వాటితో ఆ నృత్యం చేయడం చూసి పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఆశ్చర్యపోయారు. అటు అరుంధతీ నక్షత్రాన్ని చూసే తంతుతో పాటు బామ్మగార్ల ప్రదర్శన చూసి ముగ్దులయ్యారు.
ఇంతలో హరి దగ్గరకు ఒకాయన పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ అందిస్తూ “ మా సార్ మీతో మాట్లాడుతారుట” అంటూ ఫోన్ అందించాడు.
“హలో” అన్నాడు
“హలో. నేను హైదరాబాద్ క్రికెట్ జట్టు కల్చరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి పెళ్ళిలో ముగ్గురు పిల్లలు, ముగ్గురు బామ్మ గార్లు చీర్ గాల్స్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారట కదా.? ఓ నెల రోజులలో మేము ఓ చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాము ఆ మ్యాచ్ లో వారితో ప్రదర్శన ఇప్పిద్దామని కాల్ చేసాను” అన్నారు.
“సార్ బానే ఉంది కానీ ఇప్పుడే నాలుగు పెళ్ళిళ్ళలో వారి ప్రోగ్రామ్ పెట్టించాలని నలుగురు అడిగారు, కాబట్టి మీరేమనుకోక పోతే డేట్సు ఒక్క సారీ చూసి కాల్ చేస్తానని” ఫోన్ పెట్టేసారు.
అటు ఆ బాయిలర్ బామ్మగారి వైపుకు పరుగెట్టుకొని వెళ్ళి ఆ సంగతి చెప్పగానే ఆవిడ “ఓరేయ్ హరి మాకు కూడా టీ వీ లో కనిపించే వారిలా మోడ్రన్ డ్రెస్ కుట్టిస్తేనేరా డాన్సులు వేసేది. ఇలా పట్టు చీరలలో చేయడం కష్టంగా ఉంది” అన్నారు. అక్కడ ఉన్నవారంతా నవ్వేసారు.
“ఓ ఆ మాత్రం చేయలేనా” అన్నాడు హరి. ఇంతలో కుశల ఏం జరుగుతుందో చూడటానికి అటు రాగానే తన స్నేహితురాలు “ఏది ఏమైనా మీ అమ్మాయి పెళ్ళలో కొత్తగా సందడి పెట్టించావు కుశల, మా అందరికీ మీ ఐడియా భలే నచ్చింది” అంటూ పొగుడుతుంటే ఏం అనాలో అర్థం కాక హరి వైపుకు చూసింది. హరి కాలర్ ఎగరేసాడు.
“బాయిలర్ బామ్మగారి వైపుకు తిరిగి ఇంతకీ ఏ క్రికెట్ టీమంటే ఇష్టం అని చెప్పావు?” అని అడిగాడు
“మియా! మేరొకో క్యా సమ్జా ? తుమ్హారుకు ఇత్నా భీ నై మాలూమ్ ? హమ్ బచపన్ మే హైదరాబాద్ కె హర్ మొహల్లే మే క్రికెట్ దేఖా హై తో హైదరాబాద్ టీమ్ కో ఛీర్ కరేంగా!” అంది
“కైసే కైసే యైసే యైసే హో గయా ధేఖో?” అన్నాడు హరి పక్కనున్న ఆయనతో

సమాప్తం.

2 thoughts on “కౌండిన్య హాస్యకథలు – పెళ్ళిలో చీరింగ్ గల్స్

  1. రమేష్ గారు వ్రాసిన కథ ఎంతో బాగుంది. ఏమేమి క్రికెట్ పోటీలలో చీర్ గాల్స్ విన్యాసములను కుటుంబ సమేతముగ చూచుటకు లేని ఇబ్బంది ,వివాహ సమయములో ఈ కార్యక్రమమును పెట్టినట్లయితే ఎందుకు కలగాలి. కథయెక్క లక్ష్యం సమాజములో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుటకే. బయటి వారిని చీర్ గాల్స్ గా చూడగా లేని దోషము దగ్గర బంధువులను ఆ పనికి వినియేగిస్తే తప్పేమున్నది. ఏమైనప్పటికి చక్కటి కథా వస్తువును ఎన్నుకుని కొంత మంది లోనైనా( ఇంతకు ముందు స్పందన తెలియపరచిన వారితో సహా) ఆలోచన కల్గ జేయగలిగితే ఆ రచనకు సత్ఫలితము అందినట్లే నిస్సందేహముగా.
    పేరి లక్ష్మీనరసింహం
    9493570292

  2. In marriage of his daughter father asked for cheer girl and that to sister s daughter and brothers daughhter. Even for laughing stock….need to think in this vulgar manner. Accha telugu lo paithyam antaru…writer must think on this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *