April 19, 2024

తేనెలొలికే తెలుగు-3

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

మారిషస్ లో సంజీవనరసింహ అప్పడు అనే ఆయన ఉన్నారు. ఆయనకు తెలుగంటే ఎంత అభిమానమంటే, ఆయన మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా ఒక్క ఆంగ్ల పదం దొర్లకుండా మాట్లాడుతారు. ఆంగ్లభాషాపదాలను ఆయన అనువదించే తీరు భలే అనిపిస్తుంది. పరాయి దేశంలో ఉన్నవాళ్లకు మన భాష మీద మమకారం ఎక్కువ. ఆ విషయం అమెరికాలో సైతం గమనించాను. అక్కడిమన వారు మన తీయని తెలుగు పలుకులకై మొహం వాచి ఉంటారు. తెలుగులో మాటాడేవారు కనిపిస్తే చాలు
ఎంతో ఆదరంతో, ఆప్యాయంగా పలుకరిస్తారు.
మరి మనమేమో ఇక్కడ మన భాషను వదిలేసి పరాయి భాష మోజులో పడిపోయి అందమైన మన భాషను నిరాదరిస్తున్నాం. ముఖ్యంగాఈనాటి పిల్లల్లో
ఇది మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దానికి కారణం మనకు తెలియనిది కాదు. ఈనాటి చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంతో నడిచే బళ్లల్లో కావటమే. ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను ఎన్నడూ చెప్పను, కానీ మన మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దనే నా తాపత్రయం.
దీనికి మరో కారణం మన దృశ్యశ్రవణ మాధ్యమాలు. వ్యాఖ్యతలుగా ఉండే వాళ్ల భాష దుర్భరంగా ఉన్న విషయం అందరికీతెలిసిందే. దీన్ని అరికట్టడానికి మనందరం పూనుకోవాల్సిందే. ’మొక్కై వంగనిది మానై వంగునా’అన్నట్లు చిన్నప్పట్నించే పిల్లలుతెలుగు భాషలో మాట్లాడ లేకపోతే పెద్దైన తరువాత అలవడటం చాలా కష్టం.
ఇక మన తేనెలొలికే తెలుగు భాష విషయానికి వస్తే
దాదాపు వెయ్యేళ్ల చరిత్రను తవ్వుకోవాలి. తెలుగు భాష తీయదనం తెలియాలంటే మన పూర్వ కవుల గురించి, వారి రచనల గురించిఅనేక విషయాలు తెలుసుకోవాలి. ’దేశ భాషలందు తెలుగు లెస్స’అన్న శ్రీకృష్ణ దేవరాయలు వంటి సాహిత్య పోషకుల గురించి తెలియాలి. నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగ్గడ, శ్రీనాథుడు, పోతన. పెద్దన, తిమ్మన, ధూర్జటి, రామరాజ భూషణుడు వంటి ఎందరో కవుల గురించి, వారు రాసిన కావ్యాల గురించి, అలాగేఅన్నమయ్య, త్యాగయ్య, రామదాసువంటి భక్త కవులు వాగ్గేయకారుల గురించి, వేమన లాంటి
ప్రజాకవుల గురించి తెలియాలి. ఆధునికకవులు రచయితలు ఎందరో తమ రచనల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసిన వారి గురించి మన పిల్లలకు అవగాహనకల్పించడం మన కనీస బాధ్యత. పరాయి దేశంలో ‘మనబడి’ వంటి తెలుగు భాషా వికాస కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేస్తుంటేమన పిల్లలేమో అటు తెలుగూ కాని ఇటు ఆంగ్లమూ కాని సంకర భాష మాట్లాడుతుంటే ఏం బాగుంటుంది?
క్రితం నెలలో మన భాషలో అన్ని సందర్భాలకూ తగిన సాహిత్య ప్రక్రియలున్నాయని చెప్పుకున్నాం.
చిన్నతనంలోనే ఆటలతో పాటలతో మన సాహిత్యం మన బుఱ్ఱల్లోకి ఎక్కే విధంగా అనేక ప్రక్రియలు వెలువడ్డాయి. అన్ని ప్రక్రియలకూజానపదాలే నేపథ్యాలని చెప్పవచ్చు. ఇప్పుడెవరైనా చెమ్మ చెక్క ఆడుతున్నారా? జాజిరాడే వాళ్లున్నారా? బొంగరాలాట, చిర్రగోనె(గిల్లిదండు), కోతికొమ్మచ్చి(జాడ్ బందర్), దాగుడుమూతలు, గోళీ కాయలాటలు ఎక్కడున్నాయి. ఇప్పుడు పల్లెటూళ్లల్లో కూడా క్రికెట్ ఆటలమైదానాలేర్పడ్డాయి. అంటే మన సంస్కృతిలోనే మార్పు వచ్చింది.
అప్పట్లో ఎన్ని ఆటల పాటలు. .

‘చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ
అట్లుపోయంగ ఆరడించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ
రత్నాల చెమ్మ రంగులేయంగ ‘ అంటూ సాయంత్రం పూట ఆడపిల్లలు ఆడుతూ పాడుతూ దృశ్యాలేవి?
‘దాల్ దడి దసన్నపొడి’ అంటు కాళ్లూ కాళ్లూ కలిపి ఒకరి చేతులొకరు పట్టుకుని తిరిగే సన్నివేశాలెక్కడ?
‘జాజిరి జాజిరి జాజిరి జాజ
జాజిరాడుదాం జమకూడుందాం
ఎప్పుడు మనతో ఎనభై మంది
రింగుడు బిళ్లా రూపులదండా
దండ కాదురా దాసన్నమొగ్గ
మొగ్గ కాదురా మోతుకు నీడ
నీడకాదురా నిమ్మల బావి
బావి కాదురా బసంత కూర
కూర గాదురా గుమ్మడి పండు
పండు కాదురా పాపడి మీసం
మీసం కాదురా మిరాలపోతు
పోతుకాదురా పొనగిరి గట్టు’
అంటూ కాముని పున్నమకు ముందు వాడకట్టు పిల్లలందరూ చేతిలో రెండు కోలల్ని లయాత్మకంగా కొడుతూ మాపటి వేళ ఇల్లిల్లూ తిరిగేసందర్భాలు
కనిపిస్తున్నాయా? జాజిరాడుదాం జమకూడుందాం
అని కలిసికట్టుగా ఉండటానికి సందేశం ఇవ్వటమే గాక ఆడుతూ పాడుతూ కోలలాడిస్తూ ఇల్లిల్లూ తిరిగే వ్యాయామం పిల్లలకునేర్పించడంతో పాటు పరిచయాలు పెంచుతుంది. ఇప్పుడవన్నీ ఏవి?
వర్షాకాలం వచ్చీ వానలు పడక పోతే కప్పతల్లి ఆటఆడే వాళ్లు. ఓ రోకలికి మధ్య గుడ్డలో కప్పను కట్టి ఇద్దరు పిల్లలు దానిని భుజం మీదమోస్తూ మిగతా పిల్లలు వారి వెనుక నడుస్తూ
‘కప్పతల్లి కప్పతల్లి కడుపునిండ పొయ్’
అని ఇల్లిల్లూ తిరిగే వాళ్లం. ఆ ఇంటి వాళ్లు ఆ కప్పమీదా మోసే పిల్లల మీదా నీళ్లు పోసి వాళ్ల చేతుల్లో పైసో ముడికాలో పెట్టే వాళ్లు.

వానాకాలం వచ్చి వర్షాలు పడితే
వానలో తడుస్తూ
‘వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగూ తిరుగూ తిమ్మప్పా
తిరుగా లేను నర్సప్పా’
ఇవి సాహిత్య బీజాలు కావా?

‘దాగుడుమూత దండాకోర్
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలు అక్కడ్నే
గప్ చిప్ సాంబారు బుడ్డి’
అని గుమ్ముల చాటునా, గరిసెల చాటునా, మంచాల కిందా, తలుపుల వెనుకా దాగి దొరకకుండా తప్పించుకునే ఆట ఇప్పుడుకనిపిస్తుందా ఎక్కడైనా. ఎక్కడ దాక్కుంటే దొరకకుండా ఉంటామనే విషయంలో ఆ చిన్నారి బుర్రలకు పదును పెట్టే ఆట అది.
‘ఒకటీ ఓచెలియా’
‘కాళ్లా గజ్జె కంకాళమ్మా’
వంటి ఆటల పాటలు మరుగున పడి పోయాయి.
మా చిన్న తనంలో ఊరూరా చిరుతల రామాయణం ఆడేవారు. ఇంట్లో శుభ కార్యానికో అశుభ కార్యానికో వచ్చిన అతిథుల వినోదార్థంఆడించేవారు . అలాగే యక్షగానాలు, హరికథలు, బుఱ్ఱకథలు ఒగ్గు కథలు పటం కతలు మొదలైనవన్నీ ఇప్పుడు మనంపరిశోధించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. నాకు బాగా గుర్తు నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు
మా ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలలో ఉండే గోపాలకిష్టవాయమ్మ అనే వితంతువు నా చేత చిరుతల రామాయణం పాడించుకుంటూమురిసిపోయేది.
జానపదుల భాషలో రామాయణం
ఎంత అందంగా ఉంటుందో-
‘రామచెంద్రుడనురా రాజీవనేత్రుడను
శ్యామల వర్ణుడ-రామచెంద్రుడనురా’
అలాగే
‘మారీచ సుబాహులాము
మరియన్నాదమ్ములాము’

లంకపురివరంబు మేలైన పట్టణంబు

‘ఉంగారామా ముద్దుటుంగారామా రామా
ఉంగారామా రామా’

‘ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నాను
ఏకామై ఉన్నాను
నీకేమిబెడుదుర కొడుకో ఓ ఆంజనేయ’

వంటి జానపదుల గేయరూపకాలను విన్నవాళ్లకి ఆ మాధుర్యం తెలుస్తుంది. ఒకవైపు పామరుల్లో పాట, మరోవైపు పండితుల్లో పద్యం దినదిన ప్రవర్ధమానంగా పెరిగి తెలుగు భాషకు ఎనలేని సాహిత్య సంపదను చేకూర్చింది. పామరులకోసం పండితులు రాసిన ద్విపదకావ్యాలు ఆటవెలది, తేటగీతి కంద పద్యాల వంటి దేశి ఛందస్సులో రాయబడ్డ కావ్యాలనేకం ఉన్నాయి. శ్రీనాథుని పల్నాటి చరిత్రద్విపద కావ్యం
అలాగే గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం వంటివి అప్పట్లో పాఠ్యాంశాలుగా ఉండేవి. అలాగే ఊర్మిళ నిద్ర లాంటి స్రీలపాటలు
ద్విపద ఛందస్సులో ఉండి హాయిగా పాడుకునే వీలుండేది. విసురుకుంటూనో వత్తులు చేసుకుంటూనో
శ్రీరామ భూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరతశత్రుఘ్నులపుడూ రాఘవుని చేరి పాదములొత్తగా అంటూ దీర్ఘాలు తీసుకుంటూ పాడే వాళ్లుఇప్పుడంతా టీవీమయం నగరాల్లోపల్లెల్లోసైతం.

ఈ ద్విపదలే విరిచి ఉయ్యాలో, వరలో చివర్లో కలిపి బతుకమ్మ పాటలు హోళీ పాటలూ పాడేవారు
హోళీ హోళీర రంగ హోళీ చెమ్మ కేళిల హోళీ
హోళీ పండుగొచ్చిందమ్మ హోళీ చెమ్మ కేళిల హోళీ
పల్లె పడుచులు చప్పట్లు కొడుతూ పాడుతుంటే వినడానికి ఎంత బాగుండేదో,
అలాగే నదులున్న చోట పడవల పాటలూ, వరినాట్లు
వేస్తూ పాడే పల్లెపదాలు ఇప్పుడు కనమరుగయ్యాయి. భాష బతకడానికి సందర్భాలు కూడా అవసరమే.

శ్రీనాథుడు రచించిన పల్నాటి చరిత్ర ద్విపద కావ్యం.
బాలచంద్రుడు తోటి బాలురతో కూడి బొంగరాల ఆట ఆడటం ఎంతో హృద్యంగా వర్ణించారు.
. ద్వి. బాలురతో గూడి బాలచంద్రుండు
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

ముత్యాల జాలను ముదమున జుట్టి
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
అలాగే
శ్రీకృష్ణుడు బాల్యంలో గోపబాలకులతో ఆటలాడే విధానాన్ని పోతన సీస పద్యంలో ఎలా వర్ణించాడో చూడండి

సీ. గోవల్లభుడ నేను గోవులు మీరని
వడి ఱంకె వైచుచు వంగి యాడు
రాజు నే భటులు మీరలు రండు రండని
ప్రాభవంబున బెక్కు పనులు పనుచు
నే దస్కరుండ మీరింటివారని నిద్ర
పుచ్చి సొమ్ములు గొని పోయి యాడు
నే సూత్రధారి మీ రిందఱు బహురూపు
లని చెలంగుచు నాటలాడ బెట్టు

తే. మూల లుఱుకును డాగిలి మూతలాడు
నుయ్యలల నూగు జేబంతు లొనర వైచు
జార జోరుల జాడల జాల నిగుడు
శౌరి బాలురతో నాడు సమయమందు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *