April 16, 2024

లేలేత స్వప్నం

రచన: రామా చంద్రమౌళి

 

ఆమె లీలావతి – పదవ తరగతి
అప్పటిదాకా ‘లీలావతి గణితం’ చదువుతోంది.. అన్నీ లెక్కలు
కాలం – దూరం, కాలం – పని, ఘాతంకముల న్యాయం
చకచకా ఒక కాగితం తీసుకుని రాయడం మొదలెట్టింది పెన్సిల్ తో
బయట ఒకటే వర్షం.. చిక్కగా చీకటి

2

చెత్త.. తడి చెత్త.. పొడి చెత్త
ఆకుపచ్చ.. నీలి ప్లాస్టిక్ టబ్స్
” ఐతే చెత్త ఎప్పుడూ పదార్థ రూపం లోనే ఉండదు
చెత్త ఎక్కువ ‘ మానవ ‘ రూపంలో ఉంటుంది
బాగా విద్యావంతులైన మానవులు త్వరగా చెత్తగా మారుతారు ”
చెత్త ఎప్పుడూ చెడు వాసన మాత్రమే వేయదు
అప్పుడప్పుడు ‘ డీ ఓడరెంట్ ‘ సువాసనలతో ప్రత్యక్షమౌతుంది
దాన్ని గుర్తించడం చాలా కష్టం
బ్యాంక్ లకు వందల కోట్ల అప్పు ఎగ్గొడ్తూ ప్రధాన మంత్రి ప్రక్కనే ఒక మంత్రుంటాడు
చెత్త.. సురక్షితంగా –
సుప్రీం కోర్ట్ అతని నెత్తిపై చెత్తను కుమ్మరిస్తూనే ఉంటుంది
ఐనా చెత్తను గుర్తించరు
‘ మన్ కీ బాత్ ‘ లో రోడ్లను ఊడ్వడం.. చీపుళ్లను కొనడం గురించి
దేశ ప్రజలు చెవులు రిక్కించి ‘స్వచ్ఛ భారత్ ‘ ప్రసంగం వింటూంటారు
‘ మానవ చెత్త ‘ ను ఊడ్చేయగల ‘ చీపుళ్ళ ‘ గురించి
‘ ఆం ఆద్మీ ‘ చెప్పడు
ఐదు వందల రూపాయల అప్పు కట్టని రహీం పండ్ల బండిని జప్త్ చేసే బ్యాంక్ మగాళ్ళు
సినిమా హీరోలకూ, మాల్యాలకూ, నీరబ్ మోడీలకు, దొంగ పారిశ్రామిక వేత్తలకు
వాళ్ళ ఇండ్లలోకే వెళ్ళి వేలకోట్లు
అప్పిచ్చి .. లబోదిబోమని ఎందుకు ‘ రుడాలి ‘ ఏడ్పులేడుస్తారో తెలియదు
చాలావరకు చెత్త .. కోట్ల రూపాయల కరెన్సీ రూపంలో
రెపరెపలాడ్తూంటుంది లాకర్లలో

విశ్వవిద్యాలయాలు
ఈ దేశ పేదల అభున్నతికోసం పరిశోధనలు చేయవు
పెద్దకూర పండుగలు.. అఫ్జల్ గురు దేశభక్తి చర్చల్లో
ఉద్యమ స్థాయి ప్రసంగాల్లో తలమునకలై ఉంటాయి
‘ హక్కుల ‘ గురించి మాట్లాడే చెత్తమేధావి
‘ బాధ్యత ‘ ల గురించి అస్సలే చెప్పడు –

లీలావతి ఎదుట ఆ రోజు దినపత్రిక..దాంట్లో ఒక ఫోటో ఉంది
రైలు లోపల బెంచీపై.. ఆమె కూర్చుని చేతిలో ‘ వాట్సప్ ‘ చూస్తోంది
ముఖంలో.. తపః నిమగ్నత
పైన కుర్తా ఉంది.. కాని కింద ప్యాంట్ లేదు..అర్థనగ్నం
తెల్లగా నున్నని తొడలు
రైలు బాత్రూంలో ‘ వాట్సప్ ‘ చూస్తూ చూస్తూ..ప్యాంట్ వేసుకోవడం
మరచి వచ్చి కూర్చుంది.. అలా
అదీ ఫోటో.. చెత్త.. ఉన్మాద యువతరం.. మానవ చెత్త –

పది రోజుల క్రితమే తమ వీధిలో వేసిన
ఐదు లక్షల తారు రోడ్డు
నిన్న రాత్రి వానకు పూర్తిగా కొట్టుకుపోయి
‘ చెత్త కాంట్రాక్టర్ ‘ .. తడి చెత్త

లక్షల టన్నుల మానవ చెత్తతో నిండిన ఈ దేశాన్ని
ఎవరు.. ఏ చీపుళ్ళతో.. ఎప్పుడు ఊడుస్తారో
చాలా కంపు వాసనగా ఉంది.. ఛీ ఛీ-
ఐనా..’ భారత్ మాతా కీ జై ‘
3

లీలావతి పెన్సిల్ ను ప్రక్కన పెట్టి నిద్రపోయింది
నిద్రలో కల ‘వరిస్తూ’ ఒక కల
ఒక నల్లని బుల్ డోజర్ లారీ నిండా.. కోట్లూ , టై లతో మనుషుల శవాలు
కుప్పలు కుప్పలుగా
అంతా మానవ చెత్త.. చెత్తపైన వర్షం కురుస్తూనే ఉంది.. ఎడతెగకుండా
లీలావతి కల .. లేత ఎరుపు రంగులో లేలేత కల –

2 thoughts on “లేలేత స్వప్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *