March 29, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “ఆ ఏడు భూములు”

 

రచన: విజయలక్ష్మీ పండిట్

అంతరిక్షకు ఆ రోజు కాలు ఒకచోట నిలవడం లేదు. అంతరిక్షంలో తేలుతున్నట్టే వుంది.

అందుకు కారణం ఆమెకు అమెరిక అంతరిక్ష సంస్థ “నాసా”(NASA) నుండి తనకు “ట్రాపిస్ట్-।”నక్షత్రం చుట్టు తిరుగుతున్న 7 భూములపై ప్రయోగాలలో అవకాశాన్ని కలిగిస్తూ ఆహ్వానం.

అంతరిక్షకు తన అద్భుతమైన కల నిజమయిన అనుభవం.

తన బాల్యం నుండి అంతరిక్షకువిశ్వం అంటే ఎంతో మక్కువ. అందుకు పునాదులు వేసింది వాళ్ళ అమ్మ వసుంధర చిన్నప్పటి నుండి అంతరిక్షకు చేసిన అలవాటు.

వసుంధరకు ఊహ తెలిసినప్పటి నుండి ఇష్టమయిన రాత్రిచర్య ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టడం, వాటిని వేలుతో గీతలు గీస్తూ కలుపుతూ జంతువుల పక్షుల బొమ్మలు గీయడం , ముగ్గులేయడం. వసుంధర యవ్వనంలో మిద్దెమీద రాత్రి పూట పడకనో చాపనో పరచుకుని వెల్లకిలా పడుకుని ఆకాశానికేసి చూస్తూ మెరిసే నక్షత్రాలను, వివిద ఆకారాలలో ఇటు అటూ కదిలి పోయే మేఘాలను, ఆ మేఘాల మాటున దోబూచులాడే చంద్రుడిని గమనించడం ఓ గొప్ప సరదా. ఆ సరదాతోనే వసుంధర భౌతిక శాస్త్రంలో ఎ. ఎస్సి. పట్టాపుచ్చుకుని లెక్చెరర్ అయ్యింది.

ఆకాశం అందాలను తిలకించే సరదా పెండ్లయి బిడ్డ పుట్టిన తరువాత కూడా కొనసాగింది. రాత్రులలో మిద్దెపైన తన పాపను ప్రక్కన పడుకోపెట్టుకొని ఆకాశంలో తాను గమనించిన ఆకాశంఅందాలు, అంతరిక్షంలోని అద్భుతాలు; పాలపుంతలోని నక్షత్ర సమూహాలను, గ్రహాల గోళాల విన్యాసాలు అన్నింటిని చెపుతూండేది. పాపకు అంతరిక్ష అని పేరు పెట్టింది.

వసుంధర భర్త ఆకాశ్ భార్య సరదాలో పాలుపంచుకుంటూ కూతురుతో పాటు తాను వసుంధర చెప్పే విశ్వం కథలను వింటూ నిద్ర పోయేవాడు.

తల్లి వసుంధర అంతరిక్షలో నాటిన విశ్వం పైని ఆసక్తి బీజం దినదినం పెరిగి పెద్దదై అంతరిక్షంలోకి పెరిగి విశ్వంరూపం దాల్చింది. చిన్నప్పటినుండి విశ్వం పుట్టుక, పాలపుంత, నక్షత్ర కూటములు సూర్యమండలం లోని గ్రహాల కదలికలు , గ్రహణాలు, తోకచుక్కలు అన్నింటిని అమ్మ తెచ్చిన వీడియోలు అట్లాసులలోఆశక్తితో చదివేది. ఆస్ట్రానమి కాస్మాలజి సబ్జెక్టులలో పి. జి. కోర్స్ చేసి గోల్డమెడల్ తెచ్చుకుంది. ఆమెరికాలో ఎమ్. ఎస్. చేసి NASA లో చేరింది . అంతరిక్షకు పేరుమోసిన మహిళా ఆస్ట్రోనాట్స్ వాలెంటిన తెరస్కోవా, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోల్మాడల్స్. కాలము దూరమును వివరించిన మేధావి ఐన్ స్టీన్ , విశ్వం రహస్యాలను వివరించిన స్టీఫెన్ హాకిన్స్ అన్నా గౌరవం.

అంతరిక్షకు విశ్వం లోతులు, అద్భుతాలు తెలుసుకొనే కొద్ది భూమిపై మానవ జీవనాన్ని సుసంపన్నం చేయాలనే తపన ఎక్కువైంది . రానురాను మానవుని ఆలోచనారహిత జీవిత విధానంతో భూమి వాతావరణం కళుషితమై స్వచ్చమైన గాలి నీరు ఆహారం కరువవుతున్న పరిస్థితులను గమనిస్తూ తనకున్న అంతరిక్షం పైని పరిజ్ఞానంతో భూమిని పోలి, నీరు ప్రాణులను కలిగిన భూగ్రహాలు మన భూమికి దగ్గరలో ఉంటే మనిషి మనుగడను కాపాడుకోవచ్చని ఊహాగానాలు చేసేది.

ఆ రోజు February, 23 , 2017 అంతరిక్ష కల నిజమయిన రోజు. నాసా’ (NASA) పంపిన హబుల్ టెలెస్కోప్ తీసిన ట్రాపిస్ట-1 ( TRAPPIST-1) నక్షత్రం చుట్టు దాదాపు భూమి సైజు, ఆకారము కలిగిన ఏడు భూములు ఏడు వలయాలలో తిరుగుతున్న సముదాయముందని పోటోలతో ప్రకటించింది. ట్రాపిస్ట-1 నక్షత్రం మన భూమికి కేవలం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, దానిచుట్టు తిరుగుతున్న భూములలో ముఖ్యంగా నక్షత్రానికి దూరంగా ఉన్న కడపటి మూడు భూముల ఉపరితలంలో నీరు వుందని, జీవం ఉండే అవకాశాలు లేకపోలేదని ప్రకటించారు. మన భూమికి అవతల జీవం గురించి పరిశోధనలు చేయడానికి చాలా అనువైన ప్రదేశమని చాలమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేసినట్టు ప్రకటించారు.

ఆరోజు అంతరిక్ష సంతోషానికి అవధులు లేవు.

భవిష్యత్ లో ‘నాసా ‘ అంతరిక్ష ప్రయోగాలలో ఆ ఏడుభూములపై వాతావరణం , నీరు, జీవం గురించి పరిశోధనలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నారని, ఆ ప్రయోగాలలో పాల్గొనడానికి అంతరిక్షకు ఆహ్వానమందింది.

ఆ ఆహ్వానం అందుకున్న అంతరిక్షకు ఆ ఏడు భూములపై తాను దిగి తిరుగాడుతూ అచ్చట స్వచ్చమైన నీటివనరులను చూసి మన భూమిపై ప్రజలకు స్వచ్చమైన నీరు దొరికే అవకాశలు మెండుగా వున్నాయని మురిసి పోతున్నట్టు కలలు కనసాగింది.

—/—/—/—/—/—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *