May 19, 2024

సుచి

రచన- డా.లక్ష్మి రాఘవ.

కారు దారి తప్పింది అని తెలుస్తూంది!
తారు రోడ్డు అయిపొయింది. మట్టి రోడ్డు మొదలయినా ఎక్కడో మళ్ళీ తారు రోడ్డు ను కలుస్తుందని అనిపించి రవి ముందుకు వెడుతూనే వున్నాడు. కాస్త నిద్రవచ్చి జోగుతున్న గాయిత్రి కి కారు కుదుపులతో మెలుకువ వచ్చింది.
‘ఎక్కడ వున్నాం?” అనడిగింది.
“తారు రోడ్డు అయిపోతే ముందుకు వచ్చా ..రోడ్డు రిపేరు ఉండచ్చు అనుకుంటూ..” అన్నాడు రవి.
కానీ చూద్దాం ఎక్కడో కలవకపోతుందా అన్న ఆశతో ముందుకే వెళ్ళాడు రవి..చుట్టూ వూరు కూడా లేక పోవడంతో గాబరా ఎక్కువైంది గాయిత్రికి.
“ఇంకొంచెం సేపు ఇలాగే వుంటే చీకటి పడుతుంది. వెనక్కి వెళ్లి పోదాం రవీ” అంది.
ఎటుపోవాలో తెలియని పరిస్థితి! గాయత్రి చెప్పినదే మేలు అనుకుంటూ వుండగా …
ఇంతలో దూరంగా ఒక లారీ వస్తూ కనిపించింది.
‘అమ్మయ్య’ అనుకుంటూ కారు దిగి రవి లారీ వాళ్ళకి కనిపించేలా చేయి ఊపాడు.
లారి స్లో చేసి దగ్గరగా వచ్చాక “ఈ రోడ్డు ముందుకి ఎక్కడికి వెడుతుంది?” అని అడిగాడు.
“ముందుకి వెడితే అంతా అడివే సార్. వెనక్కి వెళ్లి తారురోడ్డులో రైట్ తీసుకోండి. వూర్లు కనబడతాయి..”అన్నాడు.
కారు రివర్స్ చేయబోతుంటే దూరంగా ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుని రావటం కనిపించింది.
జనసంచారమే లేని చోట ఇలా పిల్లలు కనబడటం విచిత్రంగా అనిపించింది గాయిత్రికి.
రవిని ఒక నిముషం కారు ఆపమంది. రవి ఆపగానే 6 ఏళ్ళ పిల్ల, నాలుగేళ్ల పిల్లవాడు కారు దగ్గరికి గస పోసుకుంటూ వచ్చారు. జుట్టు చింపిరిగా, బట్టలు చిరిగి చాలా దీనంగా వున్నారు వాళ్ళు. కారులో వున్న బాస్కెట్ తీసి అందులో వున్న బిస్కెట్ పాకెట్లు రెండు, బ్రెడ్డు పాకెట్ ఒకటి ఇచ్చింది.
ఆ అమ్మాయి ఇంకా ఆశగా చూస్తూ వుంది కారు లోపలకు.
“ఇంకేమీ లేవు పాపా, వున్నవి ఇచ్చాను కదా…”అంది.
ఆ పిల్ల గాయత్రి సీటు మీద వున్న టవల్ వైపు చెయ్యి చాపింది..
“ఇది కావాలా?” టవల్ చూపుతూ ఆశ్చర్యంగా అంది గాయిత్రి.
ఎందుకు ? ఏమీ చేసుకోలేవు దానితో ….”
“నాకు కాదు మా అమ్మకి” అని తన చేతిలో వున్న మాసిన గుడ్డను చూపించింది. అది లారీ క్లీన్ చేసిన పాత బట్ట!
“ఇవి లారీ వాళ్ళు పడేస్తే తీసుకునే దానికి రోజూ వస్తాం..”అంది.
“దేనికి ?”
“తెలీదు..అమ్మకు అక్కకు అప్పుడప్పుడూ రక్తం భేదులు అవుతాయి కదా…ఇవి వాడతారంట.” గాయిత్రికి కొంచెం అర్థం అయ్యింది..
రవి విసుగ్గా “ఇక పోదాం గాయత్రి లేట్ అవుతుంది” అన్నాడు.
“ఒక్క నిముషం రవీ” అని బ్యాగ్గు తీసి రెండు కాటన్ చీరలు, రెండు టవల్లు ఆ పిల్లకు ఇస్తూ…
“మీ వూరెక్కడ? ఏమి పేరు?” అని అడిగింది.
“తలమర్లపల్లె మా వూరు. ఈడికి దగ్గరే కానీ అడివి లో …”అంది
“నీ పేరు?”
“గంగ …”
రవి కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు..గాయిత్రి తల వెనక్కి తిప్పి సంతోషంగా పోతున్న అక్కా తమ్ముళ్లను చూసింది.

పది కిలోమీటర్లు వెళ్ళినాక ఇంకో దారి కుడి వైపున కనిపిస్తే అలా వెళ్ళారు. అదే దారిలో కొన్ని వెహికల్స్ వెళ్ళడం చూడడంతో ఊపిరి పీల్చుకున్నారు రవి, గాయిత్రులు. ఒక చిన్న వూరి దగ్గర ఆపి టీ తాగారు. అక్కడ వూరి పేరు అవీ కనుక్కున్నారు.
ఇల్లు చేరేసరికి రాత్రి పది గంటలు దాటింది.
రాత్రి పడుకున్నా గంగ ముఖమే గుర్తుకు రాసాగింది…
ట్రిప్ తో అలసి పోయినా మరురోజు రవి ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చింది. రవి ఆఫీసుకు వెళ్ళాక ఇంట్లో పని ముగించుకుని తను సాయానికి వెళ్ళే సాయి సేవా సంస్థకు వెళ్ళింది.
ఒక గ్రూప్ వాలంటీర్లకు పని గురించి దిశానిర్దేశం చేస్తూ..బిజీగా వున్నారు మేనేజేర్ సంధ్యమ్మగారు.
ఆ రోజు స్వచ్చభారత్ ద్వారా అమలు అవుతున్న టాయిలెట్ నిర్మాణాలు చెక్ చెయ్యడానికి రెండు పల్లెలకు వెళ్ళడానికి సిద్దపడుతున్నారు. పల్లె ప్రజలకు మరుగుదొడ్ల అవసరాన్నితెలియచెప్పే విధానాన్ని వివరిస్తున్నారు ఆవిడ. తరువాత ఒక 15 నిముషాలలో అందరూ వెళ్ళిపోయారు.
గాయత్రి ని చూస్తూ “గాయత్రీ, మీరు పోయిన నెల ఇచ్చిన డొనేషన్, విమలగారు, సావిత్రి గార్ల డొనేషన్ తో కలిపి రెండు
ఆశ్రమాలకు వినియోగించుకున్నాము. ఆ వివరాలు రిజిస్టర్ లో వున్నాయి. ఒకసారి చెక్ చేసి సంతకం పెట్టండి.” అను రిజిస్టర్ గాయత్రీ కి ఇచ్చింది ఆవిడ.
“అక్కా, నేనొక విషయం చెప్పాలి మీకు…” అంటూ రవి, తనూ వెళ్ళిన ట్రిప్ లో దారి తప్పి పోవడం, బట్టల పీలికలు కోసం వెదుకులాడుతున్న గంగా, తన తమ్ముడూ గురించి చెప్పింది.
“నెలసరి వచ్చే ఆడవాళ్ళు పల్లెలలో తీసుకునే జాగ్రత్తలు గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా వుంది. కట్టుకొనే బట్టలు లేని కుటుంబాలలో నెలసరి వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు?..మనం మరుగు దొడ్ల గురించి ఆలోచిస్తున్నాం..కానీ ఇది తేలికగా తీసి పారేసేటువంటి విషయం కాదు..అందుకే నేను ఇక్కడ బి.సి. హాస్టల్ లలో ఇచ్చే శానిటరీ నాప్కిన్స్ ఈసారి పల్లెవాళ్లకు కూడా ఇస్తే …అన్న ఆలోచనతో వున్నాను. ఒకసారి డోనర్స్ మీటింగ్ పెట్టించండి అక్కా..” అని అడిగింది.
“రేపు ఒక మీటింగ్ మానేజ్మెంట్ తో కూడా వుంది, దానిలోనే డోనర్స్ ని కూడా పిలుద్దాము గాయత్రీ..”అని చెప్పింది సంధ్యమ్మ.

“నేను కూడా వస్తాను…ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇస్తాను..”
“రేపు 11 గంటలకు రావాలి…నీలాటి వారు వుంటే ఇంకా ఎంతమందికో మన సాయం అందుతుంది” అంది సంధ్యమ్మ.
మరురోజు మీటింగులో గాయిత్రి పల్లెటూరు నుండీ ఆడవాళ్ళ ఇబ్బందులకు ఒక సర్వే నిర్వహించాల్సిన అవసరం గురించి చెబుతూ తన వంతుగా కొన్ని సానిటరీ పాడ్స్ తీసుకుని తలమర్ల పల్లెకు వాలంటీర్స్ తో వెళ్ళేలా ఏర్పాటు చేసింది.
ఆదివారం రోజు గాయిత్రి ,వాలంటీర్లను తీసుకుని తలమర్ల పల్లెకు వెళ్ళారు.
ఒక వాహనం వచ్చిందంటే ఆ పల్లె పిల్లలకు ఎంత ఆనందమో!
వూరిలోని ఇళ్ళ దగ్గరకు పోయి ఆడవాళ్లకు మీటింగ్ అని చెప్పగానే ఒక ముపై మంది ఆడవాళ్ళు వచ్చారు.
అందరినీ వూరిముందు వున్న రాములోరి గుడి దగ్గరకు రమ్మని చెప్పి అక్కడ వాళ్లకు నెలసరి రావటం, దానికి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు గురించి అడిగారు.
“ఏముందీ మాయమ్మ ఆ రోజుల్లో ఆకులు తీసుకుని తుడిచేదంటా…నాకు చెరువులో కడుక్కుంటా వుండు అనింది. ఎన్నిసార్లు కడిగినా వస్తూ వుంటే పానం బేజారు అయ్యేది…బూడిద పాతబట్టలో కట్టి వాడుతూ వుంటే ఎర్రబారి పుళ్ళు వచ్చినాయి. నెల దగ్గరపడితే ఏడుపు! ఏమిసేయ్యాలో తోచక పోయేది. పెల్లిసేసేసినాక నా మొగుడు వాడేసిన పంచెలు వాడుతున్నా….నా బిడ్డకు ఈ బాధ తప్పించాల అమ్మగారూ…” ఏడుపొచ్చింది ఆమెకు
“మాయమ్మ ౩౦ ఏళ్లకే చచ్చింది కింద పుండు అయ్యి. రాగి పొట్టు టెంకాయ పట్టలో కట్టి వాడేది..యీడ అందరికీ ఇదే గోడు…ఎన్నని సెప్పేది?? పోనీ గుడ్డలు వాడుదామంటే కరువు రోజుల్లో కట్టుకోనీకి గుడ్డలు లేకపోతే దీనికి యాడ నుండి తెస్తాము?”
“అందుకే లారీలోల్లు రోడ్లలో పారేసిన బట్టల కోసరం పిల్ల్లలని తరుముతాము…” ఇంకొకామె అంది.
హృదయ విదారకంగా వున్నవాళ్ళ మాటలతో గాయిత్రికి ఏడుపు వచ్చింది. వినడానికే కష్టం అయ్యింది. తరువాత వారికి వాలంటీర్లు ‘ఆ రోజుల’లో ఎలా శుబ్రత పాటించాలో చెప్పినారు. తరువాత సానిటరీ నాప్కిన్స్ చూపి వాటి వాడకం ఎలా చెయ్యాలో చెప్పి ప్రతి ఇంటికీ ఇన్ని అని ఇచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి నెలా వచ్చి ఇస్తామని చెప్పినారు.
“అంతే కాదు ఈ సారి పాత చీరలు, పంచలు కూడా తెస్తాము… శుభ్రత పాటించండి..ఆరోగ్యాలు బాగుంటాయి…” అని వివరంగా చెప్పినారు.
అందరూ గాయిత్రికీ, వాలంటీర్లకూ దండాలు పెట్టినారు…
అప్పుడు చూసింది గంగను గాయిత్రి.
దూరంగా వున్న గంగను దగ్గరికి పిలిచి “నేను గుర్తుకువచ్చానా?” అంటే తల ఊపింది గంగ.
తను ప్రత్యేకంగా తెచ్చిన ఒక ప్లాస్టిక్ కవర్ గంగ చేతిలో పెడుతూ, నీకూ, నీ తమ్ముడికీ కొన్ని బట్టలు తెచ్చినా వేసుకోండి” అంది గంగ సంతోషంగా తల ఊపుతూ తీసుకుంది.
ఈ కార్యక్రమ విజయానికి నాంది పలికిన గంగను దగ్గరకు తీసుకుని బుగ్గన ముద్దేట్టుకుంది గాయిత్రి తృప్తిగా..
వెహికల్ లలో కూర్చున్న వారంతా ఈ సమస్యను చర్చించుకుంటూ వుంటే గాయిత్రి ఆలోచనలు వేరుగా వున్నాయి.
స్వతంత్ర భారత దేశం లో ఇంకా ఎంతమంది దుర్భర జీవితాలను గడుపుతున్నారా ??
స్త్రీల హక్కులూ, సాధికారత , సమానత్వం అని మాట్లాడే మనం…ఇంత సున్నితమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి పల్లెలోనూ అవగాహన పెంచి సంస్కరిస్తే …..ఇంటింటికీ మరుగుదొడ్లు అని స్వచ్చ భారత్ కార్యక్రమంలాగా ఈ సమస్యకు పరిష్కారం చూపితే…. గాయిత్రి ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తూనే వున్నాయి.
***********
[సంధ్య గొల్లమూడివారి స్ఫూర్తితో ……రచయిత్రి ]

6 thoughts on “సుచి

  1. Chaalaa sphoorti daayakamgaa undi! Ila prathi vaaLLu alochostE ee samasya ku parishkaaram doraka vachhu. Abhinandanalu Lakshmi garu!

  2. అమ్మా! ధన్యవాదములు ఈ కధని పురే కి టాగ్ చేసుకుంటాము . దయచేసి అనుమతి నివ్వండి .
    Sandhya go

  3. అమ్మా! ధన్యవాదములు ఈ కధని పురే కి టాగ్ చేసుకుంటాము . దయచేసి అనుమతి నివ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *