April 19, 2024

అంబులెన్స్

రచన: మణికుమారి గోవిందరాజుల

“ఒరే అన్నయ్యా! ఇందాకటి నుండి చెప్తున్నాను . . వెనక అంబులెన్స్ వస్తున్నది. దారి ఇవ్వు. ”
“యెహ్! వూర్కో. . . ఇప్పుడు దారి ఇచ్చి పక్కకి వెళ్ళానంటే సాయంత్రానికే మనం చేరేది. . మూవీ టైం అయిపోతున్నది ఒక పక్క. . . . ఇప్పుడు మూవీ గురించి ఆలోచించాలి కానీ సంఘ సేవ అక్కర్లేదు” సినిమాకి టైం అవుతుందన్న హడావుడిలో అన్నాడు.
“ఒరే! మనం యెక్కడికో వెళ్ళి యెవర్నీ వుద్దరించనక్కరలేదు. మన పరిధిలో మనం చేయగలిగేది చేస్తే చాలు. ”
“ఇంకోసారి చూద్దాం లే. . . ఈ సారికి ఇలా కానివ్వు” రయ్యిన కారుని ముందుకు పోనిస్తూ చెప్పాడు ఆకాశ్.
“ అదేంట్రా అలా అంటావు?. . పరాయి వాళ్ళెవరో అనేకదా నువ్వు ఇలా పట్టించుకోకుండా వున్నావు?. అందులో మనవాళ్ళే వుంటే ?? అని ఒక్కసారి ఆలోచించరా”
“ఓకే అవనీ. . . తప్పక ఆలోచిస్తాను. ఈ సారికి వదిలేయరా పండు”రిక్వెస్ట్ చేసాడు.
ఇక యేమీ చేయలేక వూరుకుంది అవని. ఆకాశ్ అవనిలు అన్నా చెళ్ళెళ్ళు. ఇద్దరికి ఒక సంవత్సరమే గ్యాప్ వుండడం వల్ల ఇద్దరూ స్నేహితుల్లానే వుంటారు. ఒకళ్ళంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. చిన్నతనంలో వచ్చిన అనారోగ్యం కారణంగా ఆకాశ్ ఒక సంవత్సరం వెనుక పడటం వల్ల ఇద్దరూ ఒకటే క్లాస్ లో చదవడం జరిగింది. అందువల్ల కూడా ఇద్దరి మధ్య స్నేహమే యెక్కువ. అవనికి అందరి పట్లా యెంతో ప్రేమ. సమాజానికి మన వంతు సేవ చేయటం మన కర్తవ్యం అంటుంది. అనటమె కాదు తను చేసి చూపిస్తుంది కూడా. ఆకాశ్ ది విపరీతమైన అల్లరి మనస్తత్వం. ప్రతిదీ యెంజాయ్ చేయాలంటాడు. యెప్పుడు చూసినా హుషారుగా వుంటూ ప్రపంచంలోని ఆనందం అంతా మనదే అంటాడు. చెల్లెలు చేసే సమాజసేవ పట్ల చిన్న చూపు లేకపోయిన ఇది ఆనందించే వయసంటాడు. స్వతహాగా మంచివాడే. . ప్రస్తుతం ఇద్దరూ బీటెక్ పూర్తి చేసారు. ఇద్దరికి వుద్యోగాలు వచ్చాయి జాయిన్ అవడానికి ఇంకా నెల వుంది టైం. సో ఇద్దరూ ఇల్లు పట్టకుండా సినిమాలు షికార్లూను.
“అరేయ్! చూడరా వాణ్ణి. మొబైల్ చెవుకీ భుజానికీ మధ్య ఇరికించి యెలా బండి నడుపుతున్నాడో. యేమన్నా అయితే తలిదండ్రులకు యెంత క్షోభ? అబ్బా! ఆ తింగరోణ్ణి చూడరా బండి యెలా వంకరటింకరగా నడుపుతున్నాడో?ఒరెయ్! ఒరేయ్!వాడు చూడు సిగ్గు లేకుండా రోడ్డు మీద యెలా ప్యాస్ పోసేస్తున్నాడో?”
“ఓరి దేవుడా!!! నన్ను డ్రైవ్ చేయమంటావా?రోడ్డు మీది విక్రుత చేష్టలు చూడమంటావా?. అయినా యెవరెలా పోతే మనకెందుకు?ఇప్పుడు అవన్నీ చూస్తూ నేను నడిపితే నువు చెప్పే వాళ్ళ లిస్ట్ లోకి నేను కూడా చేరుతాను. నా జీవితం అంటే నాకు తీపి తల్లోయ్. హమ్మయ్య థియేటర్ వచ్చింది. ఇక దిగు భూమాతా. నవ్వుకుంటూ దిగింది అవని. కార్ పార్క్ చేసి వచ్చాడు ఆకాశ్.

“ఇంకొక్కసారి నా ఫేవరేట్ అంటూ పిచ్చి సినిమాలన్నీ చూపించావంటే నీ సంగతి చెప్తాను. అయినా సినిమా అంతా ఫైటింగే. యెలా నచ్చుతుందిరా నీకు?అసలా ఫైటింగ్స్ లో యేమన్నా లాజిక్ వుందా అని? అసలు కొంతన్నా సామాజిక స్పృహ లేదు ఆ సినిమా టీంకి” .
“ఆ మరి ఓ ప్రేమగోలలైతే మీకు నచ్చుతాయి . ఆ చూపించే ప్రేమ సన్నివేశాల్లో లాజిక్ వుందా మరి?వాళ్ళకి వుందండీ మరి సామాజిక స్పృహ . అయినా మొన్న నీతో పాటు వచ్చిన సినిమాలో నేను నిద్ర పోయాను తెలుసా?” తను కూడా తగ్గలేదు ఆకాశ్.
“యెక్జాక్ట్లీ. అద్దే కదా నేను చెప్పేది. నాతో వస్తే నువు పీస్ ఫుల్ గా నిద్ర అన్నా పోతావు. నీతో పాటు వస్తే నేను నిద్ర కూడా పోలేను ఆ చప్పుళ్ళకు”. తిప్పి కొట్టింది అవని
“ కాస్త లోపలికి రండర్రా. . రోడ్డు మీద నుండే మొదలు పెట్టారు” వంటింట్లో నుండి కేకేసింది తల్లి. . .
“అమ్మా! థ్యాంక్యూ అమ్మా…”గిన్నెలోని పావ్ భాజి స్పూన్ తో నోట్లో వేసుకున్నాడు ”అబ్బ ! అమ్మా! పావ్ భాజి నీ తర్వాతే యెవరు చేసినా . . . సూపర్ వుంది. ”
“వావ్! అమ్మా. . గులాబ్ జాం. . థ్యాంక్యు. థ్యాంక్యూ. . సూప్పర్ వుందమ్మా. . ”ఒక గులాబ్ జాం నోట్లో వేసుకుని తన్మయత్వంగా అంది.
“హమ్మయ్య !ఇద్దరూ సాటిస్ ఫై కదా. . నా జన్మ తరించింది. ”తను కూడా తరించిన పోజ్ పెట్టింది లావణ్య.
“మరి నా సంగతేంటోయ్?నా కోసం యేమి చేసావు?”అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చాడు శ్యాంసుందర్.
నవ్వుతూ చూసింది భర్తని లావణ్య. ”పిల్లలకు చేసినవన్నీ మీ స్పెషల్సే కదా? మళ్ళీ కొత్తగా అడుగుతారు?”
“ఓకే !ఓకే! మరి వస్తున్నారా తినడానికి?” పిల్లల్ని అడిగాడు.
ఇప్పుడే వస్తాము నాన్నా . . కొద్దిగా ఫ్రెష్ అయ్యి. ”ఇద్దరూ చెరో బాత్ రూంలో దూరారు.
శ్యాంసుందర్ లావణ్యలు అన్యోన్యమైన దంపతులు. ఇద్దరిదీ ఒకేమాట. ఇతరులకి సహాయం చేయడంలో ఇద్దరూ కూడా యెప్పుడూ ముందుంటారు. పిల్లలకి కూడా అదే అలవాటు చేసారు. వాళ్ళకి రాత్రి భోజన సమయం చాలా విలువైనది. పిల్లలకి అన్నప్రాసన అయిన రోజులనుండి కూడా టేబుల్ దగ్గర తినిపించడమే అలవాటు. ఆకాశ్ అవని లకు మధ్య యెక్కువ తేడా లేకపోవడం వల్ల ఇద్దరూ కలిసి ఇద్దరు పిల్లలకు అక్కడే తినిపించేవాళ్ళు. కొద్దిగా పెద్ద అయ్యాక లంచ్ యెలా తిన్నా డిన్నర్ మటుకు అందరూ కలిసి అక్కడ తినాల్సిందే. పిల్లల చిన్నతనంలో నాయనమ్మా తాతయ్యా అమ్మా నాన్నాపిల్లలు అందరూ కలిసి తింటుంటే సమయం యెలా గడిచిపోయేదో తెలిసేది కాదు. రోజూ యేదో ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి యెవరికి తోచింది వాళ్ళని మాట్లాడమనేవాడు. అందులో ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రిలేషన్స్ , నొప్పింపక తానొవ్వక వుండగలగడం, కోపాన్ని అదుపులో వుంచుకోగలగడం, టైం మేనేజ్మెమెంట్ … ఇలా యెన్నొ రకాల విషయాలుండేవి. తను చేయలేనిది పిల్లలకు చెప్పేవాడు కాదు. చెప్పింది చేయడం, చేయగలిగేదే చెప్పడం మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెడుతుందని అతని విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటె పిల్లలకి వ్యక్తిత్వ వికాస శిక్షణ అంతా అక్కడే జరిగింది. అవని పూర్తిగా తండ్రిని ఫాలో అవుతుంటాడు. . ఆకాశ్ కి ఇంకా చిన్నతనం పోలేదు.
పిల్లలిద్దరూ వచ్చేలోపల టేబుల్ మీద అన్నీ సర్దడానికి లావణ్యకి సహాయం చేసాడు శ్యాంసుందర్. ఈ లోపల ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు.
“అమ్మా! ఆకలి దంచేస్తున్నది. త్వరగా పెట్టేయ్” టేబుల్ మీద దరువేస్తూ చెప్పాడు ఆకాశ్.
“యేంటి ఇవ్వాళ సంగతులు? సినిమా యెలా వుంది?”
“యెలా వుందా? అలా అడగడం అవసరమా?సూపర్ వుంది. ” అదే వుత్సాహంతో చెప్పాడు
“నువ్వేమీ మాట్లాడవేంటి? నీకు నచ్చలేదా?”కూతుర్ని అడిగాడు. .
“యేమో నాన్నా! నాకీ మధ్య అర్థం లేని ఫైటింగ్ సినిమాలు నచ్చడం లేదు. అదీ కాక ఈ మూవీలో హీరో హాస్పిటల్ లో ఫైటింగ్ చేయడం, లోపల వున్న పేషంట్స్ అందరూ ప్రాణభయంతో పారిపోవడం, కొంతమందికి ప్రాణాలు పోవడం. . ఇంకా ఒక అంబులెన్స్ మీదకెక్కి ఫైటింగ్ చేయడం. దానితో లోపల వున్న ప్రాణం పోయినట్లుగా చూపించడం…. జస్ట్ ఫైటింగ్ లో వెరైటీ చూపడం కోసం…. అది నటనే అయినా యేమో నాకు నచ్చలేదు నాన్నా.
కూతుర్ని ప్రియంగా చూసుకున్నాడు శ్యాంసుందర్.
“సినిమాని సినిమాగా చూడాలమ్మా అలా తప్పులు పట్టకూడదు. ” దీర్ఘం తీసాడు ఆకాశ్. ”
“అలాగే సార్. అయినా నాన్నా వీడేమి చేసాడొ తెల్సా? ఆంబులెన్స్ వస్తుంటే దారి ఇవ్వకుండా కారు పోనిచ్చాడు నాన్నా నేను చెప్తున్నా వినకుండా” కంప్లైంట్ చేసింది అవని
“అదేంట్రా? అట్లా యెందుకు చేసావు?” కొద్దిగా డిసప్పాయింటెడ్ గా అడిగాడు శ్యాంసుందర్.
“అదేమి లేదు నాన్నా. యేదో సినిమా తొందరలో అలా. . అయినా ఆ అంబులెన్స్ లో యెవరూ లేరు నాన్నా. . ” తండ్రి డిసప్పాయింట్మెంట్ అర్థమవుతున్నా సమర్ధించుకోబోయాడు.
“అయ్యో! ఖాళీగా వెళ్తున్నదంటే యెవరికోసమో వెళ్తుందేమో. . అప్పుడు దానికి దారి ఇవ్వడం ఇంకా ముఖ్యంరా” బాధపడ్డాడు శ్యాం సుందర్
“నాన్నా! వీడనె కాదు. రోడ్డు మీద చాలా మందికి తాము ముందు వెళ్ళడమే ప్రాధాన్యం కానీ తాము సమాజంలో వున్నామని తమకో బాధ్యత వుందనీ మర్చిపోతుంటారు”
“ఐయాం సారీ నాన్నా! ఇంకోసారి ఇలా చెయ్యను”వెంటనే తప్పు ఒప్పేసుకున్నాడు . . చెల్లి ఫిర్యాదు చేసిందే అన్న కోపం లేకపోగా.
“గుడ్! గుడ్! ఫస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం” వెంటనే టాపిక్ మార్చేసాడు
అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసారు. .

*****************

ఆ రోజు ఒక ఫ్రెండ్ ని కలవాలని వెళ్ళాడు ఆకాశ్. అవనిని రమ్మంటే రానన్నది. అందుకని బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆకాశ్. పొద్దుటినుండి సాయంత్రం దాకా ఇద్దరు ముగ్గురిని కలుసుకుని ఓల్డ్ సిటీ లో ఇంకో ఫ్రెండ్ వుంటే అటెళ్ళి తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఆకాశ్ వాళ్ళ ఇల్లు వున్న కాలనీ కి మైన్ రోడ్ కి మధ్యలో ఒక కిలో మీటరు పొడవు సన్న సందు వుంటుంది . దాన్ని వెడల్పు చేయటం ప్రభుత్వం వల్ల కూడా కాలేదేమో అలా వదిలేసారు. ఆ సందు మొదట్లోనే ఫుల్లు ట్రాఫిక్ . చాలామంది చేరి గొడవ పెట్టుకుంటున్నారు. ఆల్ మోస్ట్ సందు చివరి వరకు వున్నారు. అందరూ హారన్లు మోగిస్తున్నారు. గోల గోలగా వుంది అంతా.
“అబ్బా! వాళ్ళు రాజీకి యెప్పుడు వస్తారో?ఈ ట్రాఫిక్ యెప్పుడు క్లియర్ అవుతుందో? అమ్మకు ఫోన్ చెసి ఇక్కడే వున్నానని చెప్దాం అనుకుంటూ ఫోన్ తీసాడు. తెల్ల మొహం వేసి వున్నది ఫోన్. అబ్బా ఇప్పుడే చార్జింగ్ అయిపోవాలా?” విసుక్కున్నాడు. ఇక చేసేదేమి లేక వెనక్కి తిరిగి కొద్దిగా దూరం అయినా వేరే దోవ చూసుకుందామని వెనక్కి తిప్పబోయాడు బైక్ ని. ఈ లోగా గుంపుకి ఆ చివరనుండి హారన్ మోతల మధ్యలో నుండి సన్నగా అంబులెన్స్ సైరన్ వినపడింది. ఒక్క క్షణం ఆగి అవునా కాదా అని నిర్ధారణ చేసుకున్నాడు. అంబులెన్స్ సైరనే. ! విరామం లేకుండా మోగిస్తున్నా ఒక్కళ్ళ నుండి కూడా స్పందన లేదు. తండ్రి చెల్లెలి మాటలు గుర్తొచ్చాయి. తన భాధ్యత కూడా గుర్తొచ్చింది. ఈ గుంపు మామూలుగా కదలాలంటే ఇంకో గంట పట్టేట్లుంది. అనుకుంటూ తన బైక్ ఒక పక్కకి పార్క్ చేసి గుంపులో చొరబడ్డాడు అందర్నీ హెచ్చరిస్తూ , అంబులెన్స్ కి దారి ఇవ్వమని అడుగుతూ మొత్తం మీద పదినిమిషాల్లొ క్లియర్ చేయించగలిగాడు. నిరాటంకంగా వెళ్ళిపోయింది అంబులెన్స్. ”హమ్మయ్య“ అనుకుంటు ఒక మంచిపని చేశానన్న తృప్తితో ఇంటిదారి పట్టాడు ఆకాశ్. ఇంతలో “ఒరే ఆకాశ్” అని పిలిచారెవరో. యెవరా అని చూస్తే ఇంకో స్నేహితుడు ప్రకాశ్ పిలుస్తున్నాడు. అతనితో ఒక పదినిమిషాలు మాట్లాడి వెళ్దామనుకుంటే గంట అయింది. అరే ఇప్పటివరకు అమ్మ ఫోన్ చేయకపోవటమేమిటి అనుకుంటుంటే గుర్తొచ్చింది తన ఫోన్ లో చార్జింగ్ అయిపోయిందని . ”ఇక వెళ్తారా నేను అమ్మ యెదురు చూస్తూ వుంటుంది. పొద్దున్న యెప్పుడో బయల్దేరాను “ చెప్పి బైక్ స్టార్ట్ చేయబోయాడు. వెంటనే ప్రకాశ్ “ఆగరా బాబు. ఐమాక్స్ లో మూవీకి రెండు టికెట్స్ వున్నాయి. కంపెనీ యెవరూ లేరు నువ్వు రారా” పిలిచాడు. “ బాబోయ్ ! అలా వస్తే మా అమ్మ కాదు మా చెల్లి తంతుంది. నే వెళ్తారా . ఇప్పుడొద్దులే ఇంకొసారి చూదాం”మళ్ళీ బైక్ స్టార్ట్ చేయబోయాడు. ఈ సారి ప్రకాశ్ కీస్ లాక్కున్నాడు. ”ఫోన్ చెయ్యి” అని . ”వద్దులే ఫోన్ చేస్తే వెళ్ళొద్దంటారు. మెసేజ్ ఇవ్వు “
“నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయిందిరా. . ”
“అయితే నా ఫోన్ నుండి అంకుల్ కి మెసేజ్ ఇవ్వు. అవనికి ఇస్తే నన్ను తిడుతుంది. . ” అని మెసేజ్ ఇప్పించి బలవంతాన మూవీకి లాక్కెళ్ళాడు. సినిమా పూర్తయ్యి ఇంటికి బయల్దేరేసరికి రాత్రి పదయింది. అందరూ పడుకున్నారో యేంటో అనుకుంటూ ఇంటికెళ్ళి కూనిరాగాలు తీస్తూ తలుపు తాళం తీస్తుండగా పక్క ఫ్లాట్ ఆంటీ వచ్చి “మీ నాన్నగారికి సడన్ గా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. నీకు ఫోన్ చేసారట కాని స్విచ్చ్డ్ ఆఫ్ అని వచ్చిందట. నీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఆకాశ్” అని చెప్పి హాస్పిటల్ పేరు చెప్పింది.
ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది ఆకాశ్ కి. ఇక లోపలికి వెళ్ళకుండా వెంటనే పరుగున వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వేపు దూసుకుపోయాడు.
రిసెప్షన్ లో కనుక్కుని కార్డియో వింగ్ కి వెళ్ళాడు . అక్కడ విచార వదనాలతో వున్నారు తల్లి చెల్లి. కొంతమంది ఫ్రెండ్స్ కూడా వున్నారు . కొడుకుని చూడగానే దుః ఖం పెల్లుబికింది లావణ్యకి ఆకాశ్ ని పట్టుకుని యేడ్చెసింది. అవని అన్నని పట్టుకుని తను కూడా యేడ్చేసింది. యేడుస్తూనే తండ్రికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్న సంగతి చెప్పింది.
నిర్ఘాంత పోయాడు ఆకాశ్. “అయ్యో” అని తల కొట్టుకున్నాడు. . అలా యెలా టైం పాస్ చేసాను?కొద్దిగా ముందు వచ్చినట్లైయితే తాను తండ్రి వెంట వుండేవాడు కదా?తన్ను తాను తిట్టుకోసాగాడు ఆకాశ్.
“ఇదేంటి ? మీరంతా వున్నారు. నాకెందుకు తెలీలేదు?థ్యాంక్యూ వెరీమచ్ రా” స్నేహితులకి కృతజ్ఞతలు చెప్తూనే తల్లినిచెల్లిని ఓదార్చసాగాడు. ”
“ నీ ఫోన్ ఆఫ్ అయిందటరా. . అందుకని అవని మాకు చేసింది నువ్వొచ్చింది మా దగ్గరకు అని. వెంటనే మేము కూడా డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసాము. అంకుల్ ని వెంటనే ఆపరేషన్ కి తీసుకెళ్ళారు. లోపల బైపాస్ సర్జరీ జరుగుతున్నది. ధైర్యంగా వుండరా . అంకుల్ కి యేమీ కాదు”. వాళ్ళు కూడా ఓదార్చసాగారు.

అప్పటికి అవని కొద్దిగా తేరుకున్నది . అన్నతో యేదొ చెప్పబోయే లోపల డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఐ సీ యూలోకి యెవరైనా ఒక్కరు వెళ్ళి చూడొచ్చని చెప్పారు. అందరి మొహాల్లోకి ఒక్కసారిగా జీవం వచ్చింది రిలీఫ్ తో.
అప్పుడొచ్చింది అవనికి మళ్ళీ యేడుపు సంతోషంతో. ”ఒరే అన్నయ్యా నువ్వే బ్రతికించుకున్నావురా నాన్నని” అన్నని పట్టుకుని భోరున యేడుస్తూ చెప్పింది.
“యేమి ? నేను నాన్నతో పాటు లేనని యెగతాళా?”చిన్నబుచ్చుకున్నాడు అకాశ్. “ అయినా నేను నాన్న ఫోన్ కి ప్రకాశ్ ఫోన్ నుండి మెసేజ్ ఇచ్చాను. దానికి ఫోన్ చేసి నాకు చెప్పొచ్చు కదా?నాన్న కంటే యేదీ ముఖ్యం కాదు కదా?”
“కాదురా నేను నిజమే చెప్తున్నాను. సాయంత్రం నువు గుంపును తప్పించి అంబులెన్స్ కి దోవ ఇప్పించావా? దాన్లో నేరా నాన్నమృత్యువుతో పోరాడుతున్నారు. నిన్ను చూసి పిలుద్దామనుకునే లోపె మా వాన్ సందు తిరిగింది. నీ ఫోన్ స్విచ్చ్ ఆఫ్ అని వచ్చింది. వ్యాన్ ఆపమంటే లోపల అటెండెంట్ వద్దన్నారు. మా మాటలు పూర్తయ్యే లోపల మన మధ్య దూరం పెరిగింది . హాస్పిటల్ కి వచ్చాక డాక్టర్ చెప్పారు ఇంకో అరగంట లేట్ అయినా ఛాన్సెస్ తగ్గేవని. అందుకే అంటున్నారా నువే బ్రతికించావురా. . కాదు బ్రతికించుకున్నావురా నాన్నని. . ఇంకా నాన్న ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాం ఈ హడావుడిలో ” కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.
లావణ్య కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకుంది

_______________________శుభం. . . _____________________________

25 thoughts on “అంబులెన్స్

  1. I have noticed you don’t monetize your website, don’t waste your
    traffic, you can earn additional bucks every month.
    You can use the best adsense alternative for any
    type of website (they approve all websites), for more details simply search in gooogle:
    boorfe’s tips monetize your website

  2. మంచి కథ. కథనం కూడా. ముగింపు ఇలా ఉంటేనే మార్పు సాధ్యమవుతుంది. అభినందనలు… అభివాదములు

  3. VERY nice story , samajam patla Badhyata vundalani chakkaya cheppandi. Avarikiana manchi cheste manaki manchi jaruguthundani telustundi kadha nuchi. Nice story …..

  4. Very nice Attayya. Each and every person must have road sense and be responsible to each other. Chala baga raasavu.

  5. Very heart touching story mani…nuvvu kadha rasinaaa adi pakkana vundi cheputanttae vuntundi…that style really great…keep rocking

  6. కథ కథనం చాలా బాగుంది . కథ చదువుతుంటే
    కళ్ళలో నీళ్లు తిరిగాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *