April 19, 2024

ఇకనైనా మేల్కో

రచన: శ్రీనివాస్ సూఫీ

 
మెదడు పొట్లం విప్పి
నాలుగు పదాలు వాక్యాలకోసం
అకస్మాత్తుగా వెతుక్కుంటే అలానే ఉంటుంది…

స్పష్టత కరవైతే అంతే…
గోదారిలో మునిగి
కావేరిలో తేలి యమున గట్టుకు కొట్టుకు పోవటం…..

అవగాహన గాలమో, వలో లేకపోతే
ఎవరికైనా మాటలు, భావాల వేట ఎలా సాగుతుంది..
జాలరి ఒంటరిచేతులు విసిరినంత మాత్రాన చేపలు చిక్కటం చూశావా…

నీ ఇంటి ముందో వెనుకో.. ఒకడు
ఆఖరి యాత్రకు ఒట్టికాళ్ళతోనే నడిచాడని తెలిసినపుడు..
అతన్ని సమీక్షించేందుకు నీ దగ్గర అవగాహనేం మిగిలిందని…

రెటీనాపై గతం తెర
హఠాత్తుగా వేళాడ దీసినంత మాత్రాన
తనకు చెందిన ఏ సినిమా ఆడదు..ఏ సన్నివేశమూ కదలదు…

ఇకనైనా మేల్కో
మనిషీ…ఎన్నేళ్ళు నిద్ర పోతావ్..
సామాజిక స్పృహ అంటే…వ్యక్తులు పరిసరాలు స్థల కాలాది వివేచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *