April 20, 2024

ఏడు విగ్రహాలు

రచన: ఝాన్సీరాణి.కె

భార్గవ్‌ రవి మారేడ్‌పల్లి చేరేసరికి అక్కడంతా మనుషులు హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. షెనాయ్‌ నర్సింగ్‌ హోం నుంచి తుకారాంగేట్‌కి వెళ్ళేదారిలో ఒక అపార్ట్మెంట్‌ ముందు జనం గుమిగూడి వున్నారు. ఫోటోగ్రాఫర్స్‌, ఫింగర్‌ప్రింట్‌ ఎక్స్‌పర్ట్‌ అంబులెన్స్‌ హత్య జరిగిన వాతావరణం పోలీసు వాసన గుర్తు చేస్తున్నాయి. భార్గవ్‌ మీట్‌ మిస్టర్‌ వంశీకృష్ణ జర్నలిస్ట్‌ వీరు భార్గవ్‌, రవి సౌరభా డిటెక్టివ్‌ ఏజన్సీ వాళ్ళు అని పరస్పరం పరిచయం చేశాడు.
మీ గురించి చాలా విన్నాను. మిమ్మల్నిలా కలవడం సంతోషంగా వుంది. అనలేను: ఎందుకంటే ఈ సంఘటన జరిగింది నా ఇంటిముందు. నా ఇంట్లోని విగ్రహం పగిలింది. అదే వేరే వారికి సంబంధించినవైతే ఈపాటికి ఫోటోతో హాట్‌ హాట్‌ హెడ్‌లైన్లతో న్యూస్‌ తయారయ్యేది. స్వయంగా నా దాకా వచ్చేసరికి ఆ సందర్భంలో వాళ్ళు ఎటువంటి స్థితిలో వుంటారు. వారి మానసిక పరిస్థితి అన్నీ అనుభవంలోకి వస్తున్నాయి. అయినా జరిగింది మీకు చెబుతాను. గ్రౌండ్‌ఫ్లోర్‌ పస్ట్‌ ఫ్లోర్‌ రెండు తీసుకొని ఇవి ఎల్‌ఐజి అపార్ట్‌మెంట్స్‌కావడంతో మా ఇంట్లో అందరూ పెళ్ళికని ఊరికి వెళ్ళారు. నేను పైన గదిలో కూర్చుని వేసవికాలం`అర్థరాత్రి దొంగతనాలు`తీసుకోవల్సిన చర్యల గురించి ఒక ఆర్టికల్‌ తయారు చేయడంలో మునిగిపోయాను. ఆ రోజు రాత్రి దాటింది ఉన్నట్లుండి ఒక పెద్ద చప్పుడు. బాల్కనీలోకి వచ్చి చూస్తే వెన్నెలరాత్రి కావడంతో క్రిందంతా స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మానుష్యం, నిశ్శబ్దం. ఏదో ఆలోచనలో ఉండటంతో భ్రమపడ్డాననుకున్నాను. మళ్ళీ వెళ్ళి వ్రాసుకోవటం ప్రారంభించాను. ఇంతలో పెద్దకేక. జీవితంలో ఎప్పుడూ భయపడలేదు. ఏమయిందని లైట్‌తో క్రిందికి వచ్చాను. డ్రాయింగ్‌ రూంలో ఎన్‌.టి.ఆర్‌ విగ్రహం మాయం. న్యూస్‌ రెగ్యులర్‌గా చదవడంతో ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుస్తూంది. అందుకే ముందు ఎన్‌.టి.ఆర్‌ విగ్రహం ఉందా అని చూశాను. బయటకు వెళ్ళి చూద్దామని తలుపుతీసి బయటకు ఆడుగేయగానే ఒక శరీరం నా కాలికి తగిలింది. లైట్‌ వెలుతురులో చూద్దునుగదా ఒకశవం రక్తంతో పడివుంది. కొంచెం దూరంలో ఒక కత్తి పడివుంది. కొంచెందూరంలో స్ట్రీట్‌లైట్‌ కింది విగ్రహం ముక్కు. వెంటనే ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసుకు ఫోన్‌ చేశాను. ఇప్పుడు ఇలా లోపలికి తీసుకెళ్ళారు. వంశీ లోపలికెళ్ళాడు.
ఈ కేస్‌లో డెవలప్‌మెంట్స్‌ ఏమిటి!’ అడిగాడు భార్గవ్‌.
‘ఒక స్మగ్లర్‌ దగ్గర పని చేసేవాడు ఆ మరణించినవాడు గాయం బలంగా తగిలింది. కత్తి అతనిదైనా కావచ్చు హంతకుడిదైనా కావచ్చు. ఫింగర్‌ప్రింట్‌ చెక్‌ చేయిస్తున్నాము. హంతకుడు హతుడికి బాగా తెలుసు. అందుకే అతని మొహంలో మరణించాక కూడా ఆశ్చర్యార్థపు గుర్తులు చెరిగిపోలేదు.’ అన్నాడు జార్జి భార్గవ్‌ మరో విషయం. హతుడి జేబులో ఈ ఫోటో దొరికింది. అని ఒక ఫోటో ఇచ్చాడు జార్జి భార్గవ్‌ అది తన జేబులో పెట్టుకున్నాడు.
‘ఆ విగ్రహాల కథ ఏమైనా తెలిసిందా?’ భార్గవ్‌ అడిగాడు.
ఇక్కడ హత్య జరిగింది. జేబులో ఫోటో దొరికింది. ఆవి కాపీలు తీయించాము. హంతకుణ్ణి ట్రేస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు కూడా ఆ విగ్రహాల గొడవెందుకు?’ అన్నాడు జార్జి.
‘ఇక్కడ కూడా ఒక విగ్రహం పగిలింది గనుక’ అన్నాడు రవి.
‘మేమా ఆ విగ్రహాలు ఎవరికి అమ్మారో ఎక్కడ కొన్నారో అన్ని డీటైల్స్‌ సంపాందించాము. వాళ్లని ఎన్‌క్వయరీ చేయడమే మిగిలింది’ అన్నాడు రవి.
‘ఈ రోజు సాయంత్రం లోపల హంతకుణ్ణి కనుక్కుని అతన్ని అరెస్ట్‌ చేసి ఈ కేస్‌ కంప్లీట్‌ చేస్తాను’ అన్నాడు జార్జి.
‘ఆల్‌ది బెస్ట్‌. సాయంత్రం 6గం॥కు కుద్దాం’ అంటూ వంశీకృష్ణతో మాట్లాడి బయలుదేరారు భార్గవ్‌. రవి ఆఫీస్‌కి వెళ్ళాక రవి చేయాల్సిన పనులు చెప్పాడు భార్గవ్‌.
మారెడ్‌పల్లి పార్టీనీ ఇక్కడికి రమ్మని మెసేజ్‌ ఇవ్వు. వచ్చాక అన్నీ చెప్పు. బంజారాహిల్స్‌ వాళ్ళని కూడా అలెర్ట్‌ చెయ్యి.
‘ఇప్పుడు మారేడ్‌పల్లె నుంచే కదా వచ్చారు ఆ పని పూర్తి చేసుకుని రావాల్సింది అంది సౌమ్య.
‘మా మూవ్‌మెంట్స్‌ ఎవరైనా ఫోలో అయితే కష్టం. అందుకే వచ్చేశాం’ అన్నాడు భార్గవ్‌. తన తొందరపాటుకు బాధపడింది ఆజ్‌యూజువల్‌ సౌమ్య.
భార్గవ్‌ బయలుదేరాడు. ముందు ‘టేక్‌ ఆండ్‌ వాక్‌’ కి వెళ్ళాడు.
‘మీరు ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు అమ్మారా?’ అడిగాడు కౌంటర్‌లో ఉన్న అతనిని. అంతే అతడు ఇంత ఎత్తున లేచాడు. ‘చాల్చాల్లేవయ్యా ఎళ్ళు. ఇతనికి మంచితనం పనికి రాదని తన ఐడెంటిటి కార్డు చూపించాడు అది మంత్రదండంలా పని చేసింది. మూగవాడిలా అయిపోయాడు.
‘నీ పేరేంటి?’
‘భాస్కర్‌ సర్‌’ ‘ఎన్నాళ్ళనుంచి పని చేస్తున్నావ్‌?’`రెండేళ్ళనుంచి సర్‌’
‘మీరు ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు ఈ సంవత్సరంలో ఎన్ని తెప్పించారు’ ఫోటోలు పోస్టర్లు చాలా తెప్పించాము సార్‌, విగ్రహాలు మాత్రం మూడు తెప్పించాము సర్‌ ` మూడు డాక్టర్‌ చతుర్వేదిగారే తీసుకున్నారు సర్‌’ ` అన్నాడు భాస్కర్‌.
‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూశావా’ అంటూ తన జేబులోని ఫోటో చూపించాడు భార్గవ్‌.
‘ఈ రాస్కేలే సార్‌ 3 నెల క్రితం వచ్చాడు తన పేరు శ్రవణ్‌ అని చెప్పాడు. తను ఒక ట్రస్ట్‌ నుంచి వస్తున్నాని ఎన్‌.టి.ఆర్‌ ఫాన్లకి ఆర్థికంగా సహాయం చేయడమే ఆ ట్రస్ట్‌ ఉద్దేశమని షాపులో ఎన్‌.టి.ఆర్‌ ఫోటోలు, పోస్టర్లు కనిపించడంతో ఇక్కడ సర్వే చేయడానికి వచ్చానని రకరకాల ప్రశ్నలేశాడు, చాలా డీటైల్స్‌ వ్రాసుకున్నాడు. నేను పని చేసే విధానం, నాకో ఆపరేషన్‌ నచ్చాయని నేను విడిగా షాపు పెట్టుకోవడానికి ట్రస్టు నుంచి ఫండ్సు సాంక్షన్‌ చేయిస్తానని చెప్పి వెళ్ళాడు మళ్ళీ కనిపించలేదు అందుకే మీరు అదే విషయాలడగడంతో అలా ప్రవర్తించాను. సారీ సార్‌’ అన్నాడు భాస్కర్‌.
‘ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాల గురించి కూడా అడిగాడా?’ భార్గవ్‌ ప్రశ్నించాడు.
‘ఎవరి దగ్గర కొన్నారు? ఎవరికి అమ్మారు అన్నీ వ్రాసుకున్నాడు సార్‌’ అన్నాడు భాస్కర్‌.
‘నాకు కూడా ఆ వివరాలు కావాలి’ అన్నాడు భార్గవ్‌
‘అమరావతి’ నుంచి ఆర్డర్‌ చేశారు సార్‌’ భాస్కర్‌
ఆ అడ్రస్‌, బై ఆండ్‌ ప్లై వాళ్లు కొన్న అడ్రస్‌ ఒక్కటే అనుకున్నాను చాలా థాంక్స్‌ భాస్కర్‌ అని అక్కడి నుంచి బయుదేరాడు భార్గవ్‌.
‘అమరావతి’ దగ్గర బైక్‌ ఆపాడు అమరావతి నిజంగా అమరావతిలాగే వుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్ కోకొల్లలు. ఎందరో రాజులు అంబారి ఎక్కి ఊరేగింపు, అష్టలక్ష్మీ దశావతారాలు` గీతోపదేశాలు ` మయూరాలు వాటితో పోటీపడే నాట్య మయూరాలు ` క్షీరసాగర మధనం ఒకవేపు, భువన విజయం, మరో వైపు ` పెళ్ళి సెట్‌, పల్లెటూరి సెట్‌, ఉద్యాన వనాలు, కొలను ఇలా ఒకటేమిటీ ఇంకో ప్రపంచం కనిపించి అలాగే నిలబడిపోయాడు భార్గవ్‌.
‘రండి సార్‌’ అని ఒక కుర్రాడు భార్గవ్‌ని ఒక గదిలో కూర్చోబెట్టాడు. కాస్సేపటికి లాల్చీ పైజామాలో హుందాగా ఉన్న ఒక నలభై ఏళ్ళ వ్యక్తి ప్రవేశించాడు.
నా పేరు మహేంద్ర సార్‌ ఈ అమరావతికి యజమానిని అన్నాడు నవ్వుతూ నమస్కరిస్తూ.
భార్గవ్‌ విష్‌ చేసి తన ఐడెంటిటి కార్డు ఇచ్చాడు.
‘చెప్పండి సార్‌’ ఏ పనిమీద వచ్చారు బొమ్మలేమైనా కావాలా అడిగాడు మహేంద్ర.
‘మీ ఫ్యాక్టరి మొత్తం చూడొచ్చా’ అడిగాడు భార్గవ్‌.
లోపలికి తీసుకెళ్ళాడు మహేంద్ర. ఒకవైపు మెషిన్‌ మీద కొన్ని బొమ్మలు తయారవుతున్నాయి. ఇవి లోకల్‌ మార్కెట్‌కి సార్‌ అన్నాడు. ఇంకొక గదిలో బొమ్మలు చెక్కుతున్నారు. పాతిక మంది పనివారు శివధనస్సు వంచుతున్న రాముడు ఎదురుగా పూమాలతో సీత, రుక్మిణిని రథంపై తీసుకెళ్తున్న శ్రీకృష్ణుడు ` వెన్నెలలో బృందావనం పద్మావతి అలమేలు మంగా సమేతుడైన శ్రీనివాసుడు ఇలా రకరకాల బొమ్మలు తయారవుతున్నాయి. నాకు ముందునుంచి మన పురాణాలంటే చాలా ఇష్టం భార్గవ్‌గారు. అందుకే ఎమ్‌.ఎ లిటరేచర్‌ చేశాను. ఈ బొమ్మల వ్యాపారం ప్రారంభించాలని పించింది. నా ఊహ కనుగుణంగా రకరకాల పుస్తకాలు చదివి. ఈ బొమ్మలు స్వయంగా రూపక్పన చేస్తాను’ అన్నాడు మహేంద్ర. నాకు స్ఫూర్తి శ్రీ ఎన్‌.టి.ఆర్‌ గారు భార్గవ్‌ అన్నా. అందుకే నా రాముడు, కృష్ణుడు, శ్రీనివాసుడి బొమ్మల్లో ఆయన పోలికలు కొట్టొచినట్లు కనిపిస్తున్నాయి’ అడిగాడు నవ్వేశాడు మహేంద్ర.
ఈ మధ్య ఈ బొమ్మకు విదేశాల్లో డిమాండ్‌ బాగా పెరిగింది. మనవాళ్ళు చాలామంది అక్కడకు వెళ్తున్నారు గదా వీటికి బాగా ప్రచారం లభించింది.
అమెరికా నుంచి ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు పన్నెండు కావాలని ఆరు నెలల క్రితం ఒక ఆర్డర్‌ వచ్చింది అన్నాడు మహేంద్ర. బోర్‌ కొడ్తున్నానా’ అని ఆగాడు. లేదు ప్లీజ్‌ కంటిన్యూ అన్నాడు వెదకపోయిన తీగ కాలికి తగిలిందనుకుంటూ భార్గవ్‌.
మా దగ్గర శరవణన్‌ అని ఒక చెన్నై కుర్రాడు పని చేసేవాడు సార్‌. చక్కని పనితనముంది అతని దగ్గర. చాకు లాంటి కుర్రాడు. ఎన్‌.టి.ఆర్‌ విగ్రహం తయారు చేసేవాడు. రెండు భాగాలుగా మౌల్డుగాతయారుచేసి తర్వాత ఆ రెండు కలిపి ఎండబెడతామిలా అని అప్పుడు వాళ్ళు చేస్తున్న విగ్రహాలు చూపించాడు. ఏడు విగ్రహాలు తయారయ్యాయి. ఆ ఆర్డరిచ్చిన వాళ్ళు ఆక్సెడెంట్‌లో పోయారని ఆ ఆర్డర్‌ కాన్సిల్‌ చేయమని వాళ్ళ ఫ్రెండ్‌ ఎవరో యూ.ఎస్‌. నుంచి మెసేజ్‌ ఇచ్చారు. అవి అక్కడతో ఆపేశాం. విగ్రహాలు ఉండిపోయాయి. ఒకసారి బేగంపేట్‌ షాపు బై ఆండ్‌ ప్లై అతనిని చూచి నాలుగు విగ్రహాలు తీసుకున్నాడు. అక్కడే ఉన్న టేక్‌ ఆండ్‌ వాక్‌ అతను మిగిలిన మూడు తీసుకున్నాడు అన్నాడు మహేంద్ర.
‘బై ఎనీ చాన్స్‌ మీరు చెబుతున్న శరవణన్‌ ఇతనేనా? అని ఫోటో చూపించాడు భార్గవ్‌.
‘ఎగ్జాక్ట్లీ ఇతనే ఇతని ఫోటో మీ దగ్గరకి ఎలా వచ్చింది. వీడివల్ల మా ఫ్యాక్టరీకి ఒకసారి పోలీసు వచ్చారు. మిస్టర్‌ భార్గవ్‌ ఇతనిని అరెస్ట్‌ చేశారని విన్నాను మళ్ళీ అతను నా దగ్గరికి రాలేదు’ అన్నాడు మహేంద్ర.
‘ఇతడు ఎప్పుడు అరెస్టయ్యాడో చెప్పగరా?’ అడిగాడు భార్గవ్‌.
శరవణ అరెస్టయింది ఏఫ్రిల్‌లో’ మహేంద్ర ఒకసారి ఆలోచించి చెప్పాడు.
మీరు ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు ఎప్పుడు అమ్మారో చెప్పగరా?
సేల్స్‌బుక్‌ చూసి జూన్‌లో అని జవాబిచ్చాడు మహేంద్ర
ఈ మధ్య మారెడ్‌పల్లెలో ఒక హత్య జరిగింది చూశారా ఆ చనిపోయినవాడి దగ్గర మాకు ఈ ఫోటో దొరికింది అన్నాడు భార్గవ్‌
‘ఆ చనిపోయిన మినన్‌ అనే కేరళావాడు ఈ శరవణన్‌ స్నేహితులు ఒకే చోట ఉండేవారనుకుంటాను అప్పుడప్పుడు శరవణన్‌ని కలవడానికి అతను ఇక్కడికి వచ్చేవాడు’ అన్నాడు మహేంద్ర.
‘శరవణన్‌ అడ్రస్‌ ఉందా మీ దగ్గర?’ అడిగాడు భార్గవ్‌
అది రెండేళ్ళ క్రితం అతను రాగానే ఇచ్చినది మరిప్పుడు అక్కడ ఉన్నాదో లేదో అయినా తీసుకోండి అంటూ పాత పేరోల్స్‌ తెప్పించి అడ్రస్‌ వ్రాసి ఇచ్చాడు మహేంద్ర.
తను అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్ఫర్శేషనే దొరికింది అనుకుని థాంక్స్‌ చెప్పి బయుదేరాడు భార్గవ్‌.
బయటకు రాగానే పబ్లిక్‌ బూత్‌ నుంచి రవికి ఫోన్‌ చేసి వివరాలు చెప్పి ఆ అడ్రస్‌లో ఎన్‌క్వయరీ చేయించమన్నాడు ఒకసారి బై ఆండ్‌ ప్లైకి వెళ్తే అనుకుండా బైక్‌ అటు తిప్పాడు. లక్కీగా అవినాష్‌ ఉన్నాడు షాపులో.
భార్గవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
మీ దగ్గర నుంచే రవిగారనుకుంటాను వచ్చారు. అన్ని డీటైల్స్‌ ఇచ్చాను అన్నాడు అవినాష్‌.
సారీ మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్‌ చేస్తున్నందుకు నిన్నొక హత్య జరిగింది. అందుకు మీమ్మల్ని కలవాల్సి వచ్చింది అన్నాడు భార్గవ్‌.
‘అడగండి ఏ వివరాలు కావాలో’ అన్నాడు అవినాష్‌
‘ఈ ఫోటోలో వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా?’ అన్నాడు శరవణన్‌ ఫోటో చూపిస్తూ
‘ఇతని పేరు శ్రావణ్‌’ చాలా నెల క్రితం ఉద్యోగం కావాలని చాలా రిక్వస్టింగా మాట్లాడాడు. ముందు పనిచేసే ఒక కుర్రాడి పెళ్ళి ఉండటంతో అతను ఒక నెల శెలవు పెట్టాడు. అందుకని ముందు ఒక నెల పని చెయ్‌ తర్వాత ఆలోచిద్దాం అన్నాను. చాకులాంటి కుర్రాడు త్వరగా పిక్‌ఆప్‌ అయ్యాడు. పదిరోజుల తర్వాత ఉన్నట్టుండి మాయమయ్యాడు. జీతం కూడా తీసుకోలేదు’ అని చెప్పాడు అవినాశ్‌.
‘మీ సేల్‌ బుక్‌ ఒకసారి చూడవచ్చా’ అడిగాడు భార్గవ్‌
‘కౌంటర్‌ ప్రక్క షెల్స్‌లోంచి తీసి ఇచ్చాడు’ అవినాశ్‌
‘రవికి పర్టిక్యులర్స్‌ అన్ని ఇచ్చానన్నారుగా చూస్తాలెండి థాంక్యూ’ అని బయుదేరాడు భార్గవ్‌ వెళ్తూ దార్లో ఈవెనింగ్‌ ఎడిషన్‌ ఒకటి కొన్నాడు. ఆఫీసులో లిఫ్ట్‌లో వెళ్తూ తనకు కావల్సిన న్యూస్‌ చదివాడు.
‘సిటీలో ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు పగులకొట్టింది, మారెడ్‌పల్లిలో హత్య చేసింది ఒక మతిస్థిమితంలేనివాడని ప్రముఖ డిటెక్టిమ్‌ భార్గవ్‌ రవి అభిప్రాయపడుతున్నారు. అది ఎన్‌.టి.ఆర్‌ రాజకీయ జీవితంలో ద్వేషం పెంచుకున్న వ్యక్తి మతిచలించి ఇలా ప్రవర్తిస్తున్నారని పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌కి డిటెక్టిమ్‌ చెప్పారు అని వుంది.
‘కరెక్ట్‌గా వ్రాశాడు వంశీకృష్ణ’ అనుకున్నాడు భార్గవ్‌.
భార్గవ్‌ ఆఫీస్‌కెళ్ళగానే సౌమ్య రవి స్వయంగా శరవణన్‌ గురించి విచారించడానికి వెళ్ళారు అని చెప్పింది.
‘నో డిస్ట్రబెన్స్‌ ఫర్‌ టెన్‌ మినిట్స్‌ అండ్‌ వన్‌ కప్‌ హోట్‌ కాఫీ’ అని లోపలికి వెళ్ళాడు భార్గవ్‌ బాగా అలసి పోయారేమో అందుకే నో డిస్ట్రబెన్స్‌ అనుకుంటూ కాఫీ రాగానే చల్లని నీళ్ళు కాఫీ బెస్కెట్స్‌ ట్రేతో స్వయంగా వెళ్ళింది సౌమ్య.
టేబుల్‌ నిండా చాలా న్యూస్‌ పేపర్స్‌ ఉన్నాయి.
థాంక్యూ సౌమ్య అని ఆ ట్రే అందుకున్నాడు భార్గవ్‌.
‘సౌమ్య ఎన్‌.టి.ఆర్‌ ఏడు తలలు అని ఫైల్‌ ఓపెన్‌ చెయ్‌. ఈ పేపర్లలో నేను అండర్‌ లైన్‌ చేసినవన్నీ కట్‌ చేసి ఫైల్‌ చేయ్‌, ఈ పేపర్స్‌, ఓచర్స్‌ కూడా ఫైల్‌ చెయ్‌ అని కొన్ని పేపర్లు, ఓచర్లు తను రాసుకున్న డీటైల్స్‌ సౌమ్యకందించాడు కాని ఇంతలో రవి వచ్చాడు ‘న్యూ టర్న్‌’ అంటూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని కొంచెం కాఫీ రవికిచ్చాడు భార్గవ్‌ ఫైల్‌ చూశాడు రవి.
యూఆర్‌ ఎక్జాట్లీ కరెక్ట్‌ భార్గవ్‌. నేను నీవు చెప్పిన అడ్రస్‌కి వెళ్ళాను. అర్జెన్సీని బట్టి నేను వెళ్ళడమే మంచిదనిపించింది. శరవణన్‌ మినన్‌ పక్కపక్క ఇళ్ళల్లో చాలా ఏళ్ళ నుంచి వుంటున్నారు. చాలా స్నేహంగా వుండేవాడు. కాని కొంత కాం నుంచి వాళ్ళ మధ్యమాటల్లేవు.
‘అంటే జూన్‌ జూలైనుంచా?’ అడిగాడు భార్గవ్‌.
‘ఎక్జాట్లీ!’ ఈమధ్యనే శరవణన్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడ వుంటున్నాడో ఎవరికి చెప్పలేకపోయారు. వన్‌ మోర్‌ ఇంటరెస్టింగ్‌ న్యూస్‌ ఆ మినన్‌ చెల్లెలు హెలెన్‌ హోటల్‌ నయాగరాలో మైయిడ్‌గా పని చేస్తుందట’ అన్నాడు రవి.
ఇంతకీ ఇదంతా ఏమిటి రవి అని సౌమ్య అడుగుతూండగానే జార్జి రావడం ‘నో లీకేజ్‌’ అని భార్గవ్‌ హింటివ్వడం అన్ని ఒక్కసారిగా జరిగిపోయాయి.
‘ఏమిటి చాలా హాపీగా ఉన్నారు?’ అడిగాడ భార్గవ్‌
కేసు తేలిపోయింది హంతకుడెవరో తెలిసింది. ఇక అతణ్ణి పట్టుకోవడమే తరువాయి మావాళ్ళు అన్ని వైపులా గాలిస్తున్నారు’ అన్నాడు జార్జి ‘పూపర్లో న్యూస్‌ చూశారా? అడిగాడు మళ్ళి.
ఇంతకీ హంతకుడెవరు? అడిగాడు రవి
శరవణన్‌ అని ‘అమరావతి’లో వర్క్‌ చేసి (ఏదో కేసులో) ఎవర్నో కొడితే జైల్లో పెట్టారు 3 నెలు శిక్ష పడింది. అతడి స్నేహితుడే ఆ చనిపోయిన మినన్‌. వాళ్ళిద్దరికీ ఈ మధ్య మాటల్లేవని తెలిసింది. వాళ్ళిద్దరూ గొడవపడితే శరవణన్‌ మీనన్‌ ని చంపేసాడు. శరవణన్‌ని వెదకడానికి పోలీసు వెళ్ళారు. నా రిపోర్టు ఇవ్వడమే మిగిలింది అన్నాడు జార్జి.
‘మరి ఆ విగ్రహాలు కూడా శరవణన్‌ పగుకొట్టాడా?’ అడిగాడు
‘60 రూపాయాలు కూడా చేయని ఆ విగ్రహాల గోల మరచిపో భార్గవ్‌. నాతో స్టేషన్‌కి వస్తావా మావాళ్ళు శరవణ్‌ని అరెస్ట్‌ చేస్తే చూద్దువు గాని’ అన్నాడు జార్జి. ముందు నీవు ఒక నలుగురు పోలీసులను మారేడ్‌పల్లిలో నేను చెప్పే ఆడ్రెస్‌కి పది గంటలకల్లా వచ్చి బయరుగార్డెన్‌లో కనిపించకుండా వెయిట్‌ చేయమని చెప్పు. నీవు, నేను రవి కూడా అక్కడికి వెళ్దాం. ఒకగంట తర్వాత అందరం స్టేషన్‌కెళ్దాం అన్నాడు భార్గవ్‌.
‘వాట్‌ ద హెల్‌ యూ ఆర్‌ టెల్లింగ్‌’ అన్నాడు జార్జి.
‘నా మాట మీద నీకు నమ్మకముంది గదా. మారేడ్‌పల్లిలో పోస్టాఫీస్‌ పక్కగల్లీలో స్ట్రీట్‌ నెం.3 కి వెళ్దాం పదండి’ అని లేచాడు భార్గవ్‌. భార్గవ, రవి, జార్జి మారేడ్‌పల్లిలోని ఇల్లు చేరుకున్నారు. ముగ్గురు ఆ ఇంటి ముందు చెట్ల వెనకాల సిమెంట్‌ బెంచిపై కూర్చున్నారు. వాళ్ళకు ఇంటి ముందు జరిగేది కనిపిస్తుంది, కాని ఎవరికి వాళ్ళు కనిపించరు. ఆ టైంలో అక్కడ ఎవరైనా ఉంటారని ఎక్స్‌పెక్ట్‌ చేయరు కనక అక్కడికి ఎవరూ వచ్చే ప్రసక్తి లేదు. ముగ్గురూ మాట్లాడకుండా కూర్చున్నారు. వాళ్ళకు కొద్ది దూరంలో పోలీసు జీపు ఆ సందు చివర వదలిపెట్టి వచ్చారు. సిగరెట్‌ వెలిగించుకున్నాడు జార్జి అలా 15`30`45 ఒక గంట గడిచింది. రెండు గంటలు గడిచాయి. సహనంగా ఎదురు చూస్తున్నారు. పోలీసులకు అనుమానం కలిగింది తాము అనవసరంగా వెయిట్‌ చేస్తున్నాము. ఇంతకీ ఇక్కడేమైనా జరుగుతుందా? ఆ హంతకుడిక్కడికి వస్తాడా?’ అని అంతవరకు చాలా ఓపికగా కూర్చున్న వారిలో అసహనం ప్రారంభమయింది. నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఇంతలో ఆగంతకుడు ఆ హంతకుడు రానే వచ్చాడు. వెళ్ళి ఆ ఇంటి పరిసరాలన్నీ ఒకసారి చెక్‌ చేసుకున్నాడు. తన దగ్గరున్న ఇస్ట్రుమెంట్స్‌ సహాయంతో తలుపు చాలా సులభంగా తెరిచాడు. సిట్టింగ్‌ రూంలోనే వుంది అతనికి కావాలిసిన విగ్రహం. ఇంట్లో వారంతా గాఢనిద్రలో ఉన్నారని దృవపరచుకున్నాడు ఆ విగ్రహాన్ని ఇంటిముందు ఉన్న లైట్‌ పోల్‌ దగ్గరికి తెచ్చి గడ్డి ఉన్నచోట కింద పడేశాడు విగ్రహం ముక్కలయింది. ఆ ముక్కల్లోకి ఒకసారి తొంగిచూశాడు. ఇంటికేసి ఒకసారి చూశాడు. ఎవరూ లేవలేదు ఇంతలో జార్జి, భార్గవ్‌, రవి వెనక నుంచి వచ్చి అతనిని పట్టుకున్నారు. అతని కళ్ళలో విగ్రహం పగులకొట్టిన ఆనందంలేదు. ఏదో పోగొట్టుకున్న బాధ మాత్రమే కనిపించింది. అతని సైగ అందుకున్న పోలీసుజీపుతో వచ్చారు. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చారు. ఆ ఇంటి వాళ్ళ కు థాంక్స్‌ చెప్పి బయలుదేరాడు రవి.
ఫోటోలో వ్యక్తి ఇతనే సార్‌ అన్నాడొక కానిస్టేబుల్‌ అతని చేతికి బేడిలేస్తూ ఇతన్ని స్టేషన్‌కి తీసుకెళ్ళండి. ఎసీపి వివేక్‌కి అప్పగించండి నేనొక అరగంటలో వస్తాను, అని జార్జి భార్గవ్‌, రవితో ‘సౌరభా’కి వచ్చాడు. ముగ్గురు కూర్చున్నారు ఆఫీసులో. సౌమ్య లోపలికొచ్చింది. ‘మీ కోసం నరేంద్రగారు రెండు గంటలనుంచి వెయిట్‌ చేస్తున్నారు’ అంది సౌమ్య. లోపలికి పంపించు అన్నాడు భార్గవ్‌. అప్పుడు టైం రాత్రి 12 గంటలు. అతను లోపలికి వచ్చాడు.
‘ఐయాం భార్గవ్‌’ మీట్‌ మిస్టర్‌ రవి. జార్జి అందరిని పరిచయం చేశాడు.
‘నాపేరు నరేన్‌ బంజారాహిల్స్‌లో వుంటాను. హైటెక్‌ సిటీలో ఒక కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనేర్‌గా పనిచేస్తున్నాను. ఇదుగొండి మీరడిగిన ఎన్‌.టి.ఆర్‌ విగ్రహం. మా అమ్మగారు ఎన్‌.టి.ఆర్‌ ఫాన్‌. ఒకసారి షాపులో ఈ విగ్రహం కనిపించింది. చాలా లౌలీగా అనిపించి కొన్నాను. కాని ఈ మధ్య జరిగిన సంఘటనతో ఈ విగ్రహం ఉండటం వలన మా ఇంట్లో వాళ్ళకేమైనా అపాయం కలుగుతుందేమో అని భయమేసింది. ఇంతలో రవిగారు మీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి ఈ విగ్రహం తెచ్చివ్వమని దాని వేయి రూపాయలిస్తామని అన్నారు. దానిని నేను 60 రూపాయలకే కొన్నాను. అన్నాడు హానేస్ట్‌గా నరేన్‌ బాగ్‌లోంచి ఆ విగ్రహం తీసి బయట పెట్టాడు. ఇంతలో సౌమ్య అందరికి కాఫీలు ఇచ్చింది ఒకట్రేలో బిస్కెట్స్‌, ఆపిల్‌ ముక్కలు పెట్టింది.
‘థాంక్యూ సౌమ్య. ఈ టైంలో కూడా అన్నీ అరేంజ్‌ చేసినందుకు అన్నాడు భార్గవ్‌ కాఫీ కప్‌ తీసుకుంటూ.
‘ఇందుకే అలీతో ఫ్లాస్కోలో కాఫీ తెప్పించాను. మీరెటూ ఆలస్యంగా వస్తారని తెలుసుకదా’ అంది సౌమ్య తనూ అక్కడ కూర్చుంటూ
‘రవి చెప్పినట్లు మీకు థౌజండ్‌ రుపీస్‌ ఇస్తాను. ఒక రెసీట్‌ మీద మీరు సైన్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది’ అన్నాడు భార్గవ్‌.
భార్గవ్‌ చెప్పినట్లు ఆల్‌రెడీ సౌమ్య చేత టైప్‌ చేయించి పెట్టిన రెసీట్‌ అందించాడు రవి.
అది అందుకుని పైకే చదివాడు నారేన్‌
‘ఈ ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాన్ని నేను భార్గల్‌ గారికి వెయ్యి రూపాయలకు ఇవ్వడమైనది. ఇప్పటి నుంచి ఆ విగ్రహం పై సర్వ హక్కు భార్గవ్‌కి చెందుతుంది. అని వుంది అందులో
‘దీనికి మీకేమైనా అభ్యంతరమా?’ అడిగాడు భార్గవ్‌
‘60 రూపాయలకు కొన్న విగ్రహానికి వెయ్యి రూపాయలిచ్చారు. ఆ హంతకుని బారినుంచి మా కుటుంబాన్ని కాపాడారు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు.’ అని ఆ రసీదు మీద అంటించిన ’ రెవిన్యూ స్టాంపుమీద సంతకం చేసి ఇచ్చాడు నరేన్‌
‘థాంక్యూ సోమచ్‌ నరేన్‌. ఇంత దూరం వచ్చి, ఇంతసేపు వెయిట్‌చేసి ఈ విగ్రహం ఇచ్చినందుకు. మీరెలా వచ్చారు మిమ్మల్ని డ్రాప్‌ చేయమంటారా?’ అడిగాడు భార్గవ్‌.
‘నా కారుంది డ్రెవరున్నాడు. నోప్రాబ్లెం. ఇంతకీ ఈ విగ్రహం మీరెందుకు అంత డబ్బిచ్చి మరీ కొన్నారో తెలుసుకోవచ్చా అసలు ప్రశ్న అప్పుడడిగాడు నరేన్‌.
‘రేపు టీవీలో జార్జి చెబుతారు’ అన్నాడు భార్గవ్‌
జరిగేదంతా సినిమాలా చూస్తున్న జార్జి ఆశ్చర్యపడ్డాడా జవాబుకు.
పోలీసు వ్యవహారమనగానే ఆ తలనొప్పి తనకెందుకన్నట్లు అందరికీ చెప్పి మరోసారి రవి థాంక్స్‌ అందుకుని బయుదేరాడు నవీన్‌. రవి క్లోజ్‌ది డోర్స్‌. మొన్న అలీ ఒక సుత్తి పెట్టాడు చూద్దాము అది పట్రా’ అన్నాడు భార్గవ్‌
భార్గవ్‌ గదిలోంచి ఒక బెడ్‌షీట్‌ తెచ్చి సోపా మీద పరిచాడు. సుత్తితో రెండే దెబ్బలు. విగ్రహం తునాతునకలైపోయింది వాటి మధ్య ఒక చిన్న పాలిధిన్‌ కవర్లో మెరుస్తూ రెండు వజ్రాలు కనిపించాయి అది తీసి జార్జికందించాడు భార్గవ్‌.
‘రాజా చైతన్యవర్మగారి వద్ద మాయమైన వజ్రాలు’ అన్నాడు రవి నోట మాటరాలేది జార్జికి.
యుఆర్‌ రియల్లీ గ్రేట్‌ మీరొక సారి మా హెడ్‌ క్వార్టర్స్‌కి రావాలి మొత్తం డిపార్ట్‌మెంట్‌ మీ ద్వయానికి సెల్యూట్‌ చేస్తుంది.
అందుకేనా ఎంతసేపటికీ విగ్రహాలు విగ్రహాలు అని వాటి వెంటబడ్డావ్‌. అసలెందుకు అనుమానం వచ్చింది. ఆ వజ్రాలు అక్కడ మాయమై ఈ విగ్రహాల్లోకెలా వచ్చాయి? ప్రశ్న వర్షం కురిపించాడు భార్గవ్‌.
ఈ మధ్యనే రవి ఉన్మాదులవారి ప్రవర్తన గురించి ఒక ఆర్టికల్ లో చదివానని చెప్పాడు. వాళ్ళ ప్రవర్తన నిముషానికో రకంగా ఉంటుంది. వారేపని ఎందుకు చేస్తారో వారికే తెలియదు అని వారి గురించి చాలా విషయాలు చెప్పాడు రవి. ఈ కేసు ప్రారంభంలో నేను కూడా శరవణన్‌ చర్యను ఉన్మాదచర్యగానే అనుకున్నాను. కాని ‘చటర్జీ ఇంట్లో హాస్పిటల్‌లో విగ్రహాలు పగిలేసరికి ఆ వ్యక్తి పిచ్చివాడు కాదని అనుకున్నాను. రవి అభిప్రాయం కూడా అదే కావటం మా ఆలోచన మారింది. బై ఆండ్‌ ప్లై లో కాని, ఛటర్జీ ఇంట్లో గాని, హాస్పిటల్‌లో కాని ఎన్నో విలువైన వస్తువులు టి.వి. ఫ్రిజ్‌, విడియో, సిడి.ప్లేయర్‌ లాంటివి వున్నా వేరే విగ్రహాున్నా వాటిజోలికి వెళ్ళలేదు నేరస్థుడు. ఇది పాయింట్‌ నెంబర్‌ వన్‌ ఇక ఆ విగ్రహాలను వెలుతురులోనే పగులకొట్టాడు నేరస్థుడు. షాపుముందు, ఛటర్జీ ఇంట్లో,గార్డెన్‌లో లైట్‌ పోల్‌ముందు, హాస్పిటల్‌ గదిలో అంటే ఆ విగ్రహాలను ఊరికి పగులకొట్టడం కాదు అతడేదో వెతుకుతున్నాడనుకున్నాం.అది పాయింట్‌ నెంబర్‌ టూ. ఇక మారేడ్‌పల్లిలో హత్య జరిగింది, అక్కడ కూడా విగ్రహం పగిలింది. అంటే ఆ విగ్రహాలకు హతుడికి హంతకుడికి సంబంధముందన్నమాట. ఆ విగ్రహాల్లో ఏముందో ఆ చనిపోయిన వాడికి తెలిసుండాలి. అందుకే అతడు బ్రతికి వుంటే వాటాకొస్తాడనో, తన విషయం బయటపెడతాడనో, వాటాలు కుదరలేదనో, అతడిని హత్య చేసి వుండాలి శరవణన్‌ పాయింట్‌ నెం. మూడు. అలా అనుకుని ప్రోసీడయ్యాము. ఏమిటంటే చనిపోయిన మీనన్‌ జేబులో శరవణన్‌ ఫోటో దొరకడం.
అమరావతిలో చాలా వరకు అతని డీటైల్స్‌ దొరికాయి. తర్వాత రవి శరవణన్‌ అడ్రస్‌కి వెళ్ళి కనుక్కుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి. శరవణన్‌, మీనన్‌ పక్క పక్క ఇళ్ళలో చాలా ఏళ్ళ నుంచి వుండేవారు. మీనన్‌ చెల్లెలు హోటల్‌ నయాగరాలో పని చేస్తూండేది. అని చెప్పాడు. నేను విగ్రహాలలో మిగిలినవి పది ఏవైతే వుండటానికి వీలవుతుందో ఊహించడానికి ప్రయత్నించాను.
పాత పేపర్స్‌ తిరిగేస్తూంటే రాజా చైతన్యవర్మ కేసు గురించి చదివాను ఆ రోజులో చాలా సంచలనం కలిగించింది కదా. రాజా చైతన్యవర్మ గారు హోటల్‌ నయాగరాలో దిగినప్పుడే ఈ వజ్రాలు పోయాయని చెప్పారు. అక్కడే మీనన్‌ చెల్లెలు పని చేసింది. ఆ వజ్రాలు కాజేసి వుండాలి. హోటల్‌లో అడిగితే ఆ రోజు హోటల్‌లో ఆ రూంలో చేసింది గౌరమ్మ అనే మనిషి. ఆ గౌరమ్మను ఆమె ప్రియుడు కలవడానికి వచ్చాడని అడ్జస్ట్‌మెంట్‌లో ఈ హెలెన్‌ను ఆ గదికి పంపించింది. అప్పుడు ఆ వజ్రాలు ఆమెకు కనిపించి వుండాలి అంతే దొంగతనం జరిగిపోయింది. అది ఆమె తన అన్న మీనన్‌కి ఇచ్చి వుండాలి. అది అమ్మడానికి అతను శరవణన్‌ సహాయం తీసుకున్నాడేమో. ఎందుకంటే నాలుగేళ్ళ క్రితం శరవణన్‌ ఒక బంగారం కొట్టులో పని చేశాడని అక్కడ ఏదో దొంగతనం జరిగి అతడిని పనిలోంచి తీసేశారని తెలిసింది. ఆ వజ్రాలు శరవణన్‌ చేతికి వచ్చాయి. అతడు ఎవరితోనో గొడవపడి కొట్టుకోవడంతో పోలీసుతనిని తరుముకుంటూ ‘అమరావతి’కి వెళ్ళారు. అప్పుడే ఈ ఎన్‌.టి.ఆర్‌ విగ్రహాలు మౌల్డ్‌ తయారు చేసి టేబుల్‌ మీద ఆరడానికి పెట్టి వున్నారు. శరవణన్‌ తన జేబులోని వజ్రాల కవర్‌ ఒక విగ్రహంలో వేసి అతికించేశాడు`ఇంతలో పోలీసుతనిని అరెస్ట్‌ చేశాడు. 3 నెలలు శిక్ష పడింది. బయటకు వచ్చాక ‘అమరావతికి’ వెళ్ళాడు ప్రొప్రైటర్‌ లేని టైం చూసి. ఆ విగ్రహాలు అమ్ముడుపోయాయి అని తెలిసింది. బై ఆండ్‌ ప్లైలోఒక వారం పని చేసి సేల్‌ బుక్‌లో నుంచి ఎవరెవరికి ఆ విగ్రహాలు అమ్మాడో తెలుసుకున్నాడు టేక్‌ ఆండ్‌ వాక్‌లో సర్వే చేసేవాడిలాగా వెళ్ళి అన్ని వివరాలు కనుకున్నాడు. దాంతో ఏ విగ్రహంలో వజ్రాలున్నాయో కనుక్కోవడానికి ఆ విగ్రహు పగులకొట్టడం ప్రారంభించాడు.
మారేడ్‌పల్లిలో మీనన్‌ ఎదురపడటంతో వజ్రాల కోసం అతడిని హత్య చేశాడు. అంటే అప్పటివరకు అతడు వెతుకుతున్నది దొరకలేదని అర్థం. అందుకే బంజారాహిల్స్‌ పార్టీని విగ్రహం తెమ్మని కబురు చేయించాను. మారేడ్‌పల్లి 3 స్ట్రీట్‌లో కూడా విగ్రహంలో ఏమి దొరకక పోవడంతో మిగిలిన విగ్రహంలోనే రహస్యం దాగుండానుకున్నాను. అందుకే అతని దగ్గర రెసీట్‌ తీసుకుని ఆ విగ్రహం పగులకొట్టాం. వజ్రాలు దొరికాయి అంతే అన్నాడు భార్గవ్‌.
కంగ్రాట్స్‌ ‘సౌరభా’ మీ చెక్‌ త్వరలో అందుతుంది అంటూ లేచాడు జార్జి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *