April 25, 2024

కంభంపాటి కధలు – ఎన్ని’కులం’

రచన: కంభంపాటి రవీంద్ర

ఉదయాన్నే ఏడున్నరకి నోటీసు బోర్డులో ఏదో నోటీసు అంటిస్తున్న అపార్ట్మెంట్ సెక్రటరీ నరహరి గారిని చూసి, బేస్ మెంటులో వాకింగ్ చేస్తున్న వరాహమూర్తిగారు ఆసక్తిగా వచ్చి ‘ఏమిటండీ ..ఏదో అంటిస్తున్నారు ? ‘ అని అడిగితే ‘ఇక్కడేమీ కొంపలు అంటించడం లేదు లెండి .. జస్ట్ కాయితాన్నే అంటిస్తున్నాను .. అదీ నోటీసు బోర్డులో ‘ అని తనేసిన జోకుకి తనే గెట్టిగా నవ్వేసుకుంటూ వెళ్ళిపోయేడు నరహరి.

ఒళ్ళు మండి ‘ఇప్పుడీ నోటీసు అంటించేవుగా ..ఇంక వెళ్లి కొంపలంటించుకో ‘అని మనసులోనే తిట్టుకుంటూ నోటీసు బోర్డు వేపు చూసేడు వరాహమూర్తి . అపార్ట్మెంట్ అసోసియేషన్ కి వచ్చే ఆదివారం ఎన్నికలట .. అదీ సారాంశం . క్రితం రెండేళ్ల నుంచీ ఈ నరహరే సెక్రటరీ గా ఉన్నాడు , ఈసారి కూడా అతను ఖచ్చితంగా పోటీ చేస్తాడు, ఈసారి మటుకూ వీడిని చచ్చినా గెలవనియ్యకూడదు , అసలు పోటీకే అడ్డుపడాలి ఎలాగైనా అనుకున్నాడు వరాహమూర్తి .

దాదాపు పాతిక దాకా అపార్టుమెంట్లున్న ఆ ‘పీస్ ఫుల్ నెస్ట్’ అపార్ట్మెంట్ లో అసోసియేషన్ పదవి అంటే డబ్బుల విషయం లో పెద్దగా లాభం లేకపోయినా, చిన్న చిన్న విషయాలలో తెగ పరపతి ఉపయోగించొచ్చు .. అంటే అసోసియేషన్ కి ప్లంబర్ ని నియమించడం దగ్గరినుంచీ , సెక్యూరిటీ ఏజెన్సీ వరకూ బోలెడు విషయాల్లో నిర్ణయాల్ని ప్రభావితం చేయచ్చు , కుదిరితే ఎంతో కొంతడబ్బూ చేసుకోవచ్చు మరి.

ఏతావాతా అందరూ అనుకుంటున్నది ఈసారి మటుకు ఎలాగైనా ఇప్పుడున్న సెక్రటరీని తీసేసి కొత్త సెక్రటరీని ఎన్నుకోవాలని !

అనుకున్నట్టే ఆ ఆదివారం ఉదయం పదింటికి అపార్టుమెంటు బేస్ మెంటులో సర్వసభ్య సమావేశం మొదలైంది . ముందుగా అందరికీ పేపర్ ప్లేట్లలో బూందీ , ప్లాస్టిక్ కప్పుల్లో టీ ఇచ్చేక నరహరి అన్నాడు ‘నేను గత రెండేళ్ల నుంచీ ఈ అపార్టుమెంటు బాధ్యతలు చూసేను , నేను చేసిన పనులు మీలో కొంతమందికి నచ్చి ఉండొచ్చు , కొంత మందికి నచ్చకపోయి ఉండొచ్చు .. కానీ అందరినీ కలుపుకుపోయేందుకు నా ప్రయత్నం మటుకు నేను చేసేను .. మన అపార్టుమెంట్ బై లాస్ ప్రకారం ప్రతి ఏడాదీ ఎలక్షన్ పెట్టుకోవాలి అని రాసుకున్నాం .. కాబట్టి .. ఇదిగో ఈ మీటింగు పెట్టాల్సి వచ్చింది .. మనం ఎలాగ పెద్ద జనాభా కూడా లేము కాబట్టి చిట్టీలు , ఓటింగు స్లిప్పులూ లాంటివి వేరే అక్కర్లేకుండా జస్టు ఎవరికి ఓటేస్తారో చేతులెత్తి చెబితే చాలు..అన్నట్టు ఈసారి కూడా నేను పోటీ చేస్తాను..ఇప్పుడు పది గంటలైంది .. పదకొండింటికి ఎవరెవరు పోటీ చేస్తున్నారో చెబితే వెంటనే ఎలక్షన్ పెడదాం ‘

వరాహమూర్తికి ఈసారి నేను పోటీ చేస్తేనో అనుకున్నాడు .. కానీ తనకి ఎంత మంది ఓట్లేస్తారు ? అనుకుంటూ ఆలోచించడం మొదలెట్టేడు

నాలుగో ఫ్లోర్ లో ఉండే మనీష్ అగర్వాల్ ‘ఈసారి నేను సెక్రటరీ గా పోటీ చేస్తాను’ అని హిందీలో అంటే వెంటనే అపార్ట్మెంట్ లోని జనాలంతా తెగ చప్పట్లు కొట్టేసి , ఆ మనీష్ అగర్వాల్ దగ్గరికెళ్లి కంగ్రాట్యులేషన్స్ అంటూ అతని చెయ్యట్టుకుని తెగ ఊపేసేరు .

భద్రకుమార్ అనే అతను వరాహమూర్తిని అడిగేడు , ‘మీరు పోటీ చెయ్యొచ్చుగా .. మీలాగే నాకు కూడా ఆ నరహరి అంటే అసహ్యం… ఎలాగైనా ఓడించండి ‘

‘గొప్పోడివయ్యా బాబూ .. మా క్యాస్ట్ వాళ్ళు ఈ అపార్టుమెంట్లో చాలా తక్కువమంది ఉన్నారు .. నాకు గెలిచేన్ని ఓట్లొస్తాయని నమ్మకం లేదు..అదేదో నువ్వే పోటీ చెయ్యొచ్చుగా ‘ అన్నాడు వరాహమూర్తి

‘నేనూ , నరహరి ఒకే క్యాస్ట్ అండి .. మా కులపోడి మీద నేనే పోటీ చేస్తే బావుండదు కదా ..అందుకే మీకు మద్దతు ఇస్తాను ..కాపోతే నేను మీకు ఓటేసినట్టు బయటకి చెప్పకూడదు ‘ అని భద్రకుమార్ అంటే ‘మీరూ మీరూ ఒకటే కులం అయినప్పుడు నువ్వు నాకే ఓటెయ్యాలని ఎక్కడుంది ? లోపాయికారీగా నువ్వా నరహరకే ఓటేసి మీ ఇద్దరూ కలిసి నన్నెదవని చెయ్యాలని ప్లానేసుండచ్చుగా ‘ అని వరాహమూర్తి బదులిచ్చేడు

‘పోనీ .. మనం ఇద్దరం ఆ మనీష్ అగర్వాల్ ని గెలిపిస్తేనో ?’ అన్నాడు భద్రకుమార్

‘ఒద్దు .. నాకు హిందీ వాళ్లంటే గిట్టదు .. ఆ మధ్యేప్పుడో అతగాడు లిఫ్ట్ లో కనిపిస్తే ‘హలో .. ఆప్ కైసే హై ?’ అని అడిగితే ‘అచ్చే హై ‘ అన్నాడు తప్ప తిరిగి ‘ఆప్ కైసే హై ‘ అనలేదు .. అలాంటి ఒళ్ళు పొగరు మనిషి కి ఛస్తే ఓటెయ్యను ‘ అన్నాడు వరాహమూర్తి

‘పోనీ.. అదిగో ఆ మొదటి ఫ్లోరులో ఉండే ఆనందరావుగారిని అడుగుదాం .. ‘ అని భద్రకుమార్ ‘ఏవండీ ఆనందరావు గారూ .. ఈసారి మీరు పోటీ చెయ్యొచ్చుగా ‘ అని అడిగితే ‘భలేవారే .. మా ఆవిడ క్యాస్టూ ఆ నరహరి గారి క్యాస్టూ ఒకటే .. వాళ్ళ క్యాస్టు వాడి మీద పోటీ చేసేనంటే ఇంక మా ఇంట్లో కురుక్షేత్రమే ‘ అన్నాడా ఆనందరావు

‘ఎలాగూ ఇంటర్ క్యాస్టు పెళ్లి చేసుకున్నారు కదా .. ఇంకా క్యాస్టు ఫీలింగేమిటండీ ‘ అని వరాహమూర్తి అడిగితే ‘భలే వారే .. మా ఆవిడ ఏదో నా ఖర్మ కాలి నాతో ప్రేమలో పడి, పెళ్ళికొప్పుకుంది గానీ, అసలు నన్ను పెళ్లి చేసుకోడానికి ముందు పెట్టిన కండిషను “రేప్పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళని తన క్యాస్టు వాళ్ళకే ఇచ్చి పెళ్లి చెయ్యాలి” అని నా చేత ఓ ప్రామిసరీ నోటు కూడా రాయించుకుందండీ బాబూ ‘ అన్నాడా ఆనందరావు

ఈలోపులో మనీష్ వచ్చి ‘ఈసారి మీరు నాకే ఓటు వెయ్యాలి ‘ అని దణ్ణం పెడితే , ‘తప్పకుండా .. మా అందరి ఓట్లూ మీకే ‘ అన్నాడు వరాహమూర్తి . అవునవునని తలలూపేరు ఆనందరావు, భద్రకుమారు!

‘ఏమిటి రచయిత గారూ .. నేనెందుకు ఎవ్వరినీ నాకు ఓటెయ్యమని అడగడం లేదు అనుకుంటున్నారా ‘ అని నరహరి నన్ను అడిగితే , ‘ .. మన తెలుగాళ్ళు ఓటెయ్యాలంటే కులం చూస్తారు గానీ గుణం చూడరు కదా .. ఈ అపార్ట్మెంట్లో ఎక్కువమంది మీ కులం వాళ్ళే ఉన్నారు… కాబట్టి ఇందులో వేరేగా అనుకోడానికేముంది’ అన్నాను

‘బానే పట్టారు తెలుగు ఓటరు నాడి .. ఎలాగూ నేనే గెలుస్తాననే శుభవార్త మీరు అన్యాపదేశంగా అన్నారు కాబట్టి , మీకో ఉచిత సలహా ఇస్తాను ‘ అన్నాడు నరహరి

‘ఏమిటో ఆ ఉచిత సలహా ?’ అన్నాను

‘ఈ కధ పేరు “ఎన్నికలు” అని కాకుండా “ఎన్నికులం” అని పెట్టండి .. మన తెలుగాళ్ళకి సరిగ్గా సరిపోతుంది ‘ అని అంటూ ‘ఇదిగో పదకొండయ్యింది .. ఇంక మన అపార్ట్మెంట్ సెక్రటరీకి ఎన్నికలు మొదలెడదాం .. ఆ మనీష్ కి ఓటేసేవారు చేతులెత్తండి .. ‘ అంటూ వెళ్ళిపోయేడు నరహరి!

1 thought on “కంభంపాటి కధలు – ఎన్ని’కులం’

Leave a Reply to వెంకట అద్దంకి Cancel reply

Your email address will not be published. Required fields are marked *