March 28, 2024

గిలకమ్మ కతలు .. గిలకమ్మ..ఆర్నెల్ల ముందే పెద్దదైపోయిందంటల్లా..!

“ఎవర్నీ కొట్టగూడదు..అర్ధవయ్యిందా..?”
పాయల్ని బలం కొద్దీ గట్టిగా లాగి జడల్లుతా సరోజ్నంది.
“పలకలు పగలగొట్తేవంటే ఈపు ఇమానం మోతెక్కుద్ది ఏవనుకున్నావో..కణికిలసలే తినగూడదు..” మాట్టాళ్ళేదు గిలక. ఊకొట్టిందంతే..
“ ..ఎవర్నీ గిల్లగూడదు..గిచ్చగూడదు..ముక్కూడొచ్చేతట్టు నోటితో కొరెకెయ్యగూడదు…యే ఇనపడతందా..మూగెద్దులా మాట్తాడవే..” చేతిలో ఉన్న జుట్టలాపట్టుకునే ఒక్క గుంజు గుంజింది సరోజ్ని కూతుర్ని..
“ ఊ..అన్నాను గదా..నీకినపడాపోతే నేనేంజెయ్యనూ..” తల్లి విదిలింపులతో అసలే విసిగెత్తిపోయి ఉందేమో..అంతకంటె గట్టిగా ఇసుక్కుంది గిలక ఆళ్లమ్మ మీద.
“ నువ్ నోట్టో..నోట్టో..అనుకుంటే నాకినపడద్దా..? గట్టిగా అను. నోరు పడిపోయిందా? ఆడి మీద అరిసేటప్పుడు అంత నోరెలావత్తదో.! అయినా అలా ఎదిరిత్తారా పెద్దోళ్లని ? అదే నేర్సుకో.. ” మళ్ళీ గుంజింది..సరోజ్ని. సురుక్కుమందేమో నెత్తి మీద సివుక్కుమంది గిలక్కి.
మామూలప్పుడైతే..జుట్తంతా బలంగా సేతుల్తో పట్టుకుని ఆళ్లమ్మ గుంజిన గుంజుడుకి “ నాకు నువ్వు జడెయ్యా అక్కల్లేదూ..పెట్టా అక్కల్లేదు..పో ..అవతలికి “ అంటా..ఒక్కుదుట్న లేచిపొయ్యేదే.. అక్కణ్ణించి. కానీ.. మాట్తాడకుండా మూతి ముడుసుక్కూచ్చుంది గిలక.
అసలే బళ్ళో సేరతందేమో…మనసిక్కళ్ళేదు..రోజూ పుస్తకాల సంచీ భుజానేసుకుని ఏదోటి నోరాడిత్తా బళ్లోకెల్లే జతకత్తుల సుట్టూ తిరుగుతుంది..అంతుకే ఆల్లమ్మ తిట్టినా , కసిర్నా పట్టిచ్చుకుంటాలేదు. లేపోతేనా టపారం ఎగిరిపోను..
“ బళ్ళో..ఆళ్లూ, ఈళ్ళూ..తాటితాండ్రనీ..ఉప్పులో ముక్కలనీ, రేగొడియాలనీ ఎర్రజీళ్లనీ ఏయే ఒకటి ఆయ్యీ ఇయ్యీ తెచ్చుకుని నోరాడిత్తా ఉంటారు. అడిగేవంటే తోల్దీసేత్తాను. ఒకేల అడిగినా పెట్టాపోతే ఆల్లని..కట్రోరు అంజిగాణ్ణి ముందుకి తోసేసినట్టు తోసేత్తేవా? ఆ ముండగాడు ఇప్పటికీ నడవలేపోతంటే ఆల్లమ్మ సంకనేసుకుని తిరుగుతుంది మొయ్యలేక మొయ్యలేక మోత్తా..నూ..”
“ సుభవా అంటా పిల్ల బళ్ళో సేరతంటే అయ్యన్నీ ఇప్పుడెంతుకేటి..? జడేసి, మొకానికి కాత్తంత పొగడ్రు పావి బొట్టెట్టి పంపక.. “ సరోజ్నిని గదివింది ఆళ్లమ్మ. ఆవె..అంతకు రెండ్రోజుల ముందే దిగడింది ఊర్నించి పిల్లని బళ్ళో ఏత్తన్నావని కవురెడితే.
“ నువ్వూరుకో..! సెప్పొద్దేటి? సెప్పాలేమ్మా..! లేపోతే దీనికి సెయ్యూరుకోదు. అసలే బళ్ళో ఏత్తన్నాం. ఊరోల్ల పిల్లలంతా అక్కడే ఉంటారు. ఏదన్నా గొడవొచ్చిందంటే ఊర్రూ వాడా ఏకవవుద్ది. ”
అంటానే జడ సివరదాకా అల్లి రిబ్బన్నుకి కుచ్చులు కడతా ..
“…మొన్నిలాగే ఏదో అడిగితే పెట్లేదని ఎనకనించెల్లి అంజిగాణ్ని ముందుకి తోసేసింది..”
“ అంజిగాడా ? ఆడెవడు..?” మన్రాలెంక సూత్తా అంది పెద్దావె.
“ ఆడే..! నువ్వూ ఎరుగుదువ్ ఆణ్ణి. ఆల్లమ్మ కూడా మజ్జిక్కోసం గిన్నెట్టుకుని వత్తుంటాడాడు.. మనింటికి. ఆ..మూలమీద శాంతమ్మ కొడుకు కడాకరోడు. ఇత్తోసిన తోపుకి తూంకాలవలో పడిపోయేడాడు..మూతి పళ్ళూడొత్తవే కాదు కాలిరిగి ఆల్లమ్మ సంకెక్కేడు. దొరికిందే సందని సంక దిగుతాలేదాడు. మొయ్యలేక సత్తంది శాంతమ్మొదిని. రెక్కలడిపోతన్నాయని ఒకటే గోల మొన్న మజ్జిక్కొచ్చి. తెలిసినోల్లంగాబట్టి , మనింట్లో మజ్జిగోడకం ఉందిగాబట్టి నోర్మూసుకుందిగానీ రేవు రేవెట్టేస్ను..మరెవరన్నా అయితేనీ.. “
“ ఇంకలాగ సెయ్యదులే..ఊరుకో..! అమ్మ సెప్పిందినమ్మా. నా బంగారంకదా..! బాగా సదుంకోవాలి. ఎవుర్నీ కొట్తగూడదు, గిల్లగూడదు ..మనవోటి కొడితే ఆల్లు రెండుగొడతారు..” మనవ్రాల్నే సూత్తా అంది గిలక అమ్మమ్మ.
“ పుస్తకాల్లో కాయితాలు సింపెయ్యపగూడదు..ఎవరి పెనిసిళ్ళూ దొబ్బగూడదు.. ఓపక్కన కళాసులు జరుగుతుంటే బళ్ళోంచి బయటికొచ్చేసి…తుమ్మసెట్లమ్మటా పాకి..గుర్రాలు గుర్రాలంటా పురుగూ పుట్రా..ముట్టుకోగూడదు..”
జడ సివరకంటా అల్లి పైక్కట్టి రిబ్బన్ కుచ్చులెడతా..సరోజ్నింకా సెప్తానే ఉంది. ఇంతలో..
“ ఏ.. అయ్యిందా? ఎంతసేపా జడేత్తం..అవతల నాకు సేలో కూలోల్లున్నారు. దీన్ని బళ్ళో ఏసి పొలంబోవాలి..నువ్వియ్యాలెట్టేవ్ మూర్తం..” విసుక్కున్నాడు గిలక నాన్న ఎంకటేసర్రావ్.
మొగుడెనక్కి సూత్తా సర్లెమ్మని బుర్రూపి .. గబగబా రెండో జడిప్పి సిక్కు తీత్తా..
“ .నువ్వెల్లి కుండలో పాలు గళాసులోకొంపి రెండు గరిట్లు పంచదారేసి తిప్పు ఈలోపు..” అడావిడిగా అంది సరోజ్ని తల్లికేసిజూత్తా..
……………..
“ ఏట్రా..ఎంకటేసర్రావ్..! యెక్కడికి పిల్లనేస్కుని బయల్దేరేవ్ పొద్దున్నే….?”
దార్లో ఎదురుపడ్ద మేనత్త కొడుకొరొస సలపతి..అన్నదానికి.. ఆల్ల నాన్న ఇంకా ఏవీ మాట్తాడకుండానే..
“ సిన్నానా.. నే..బళ్లో ..సేరతన్నా..” గిలకంది సూసేరో లేదో అన్నట్టు పలకని సంకలోకంటా లక్కుంటా..
“ఓరోరి…మా గిలకమ్మ..పెద్దాపీసరైపోద్దన్నమాట..” బుగ్గ గిల్లేడు..సెలపతి.
“మరీడ్నెప్పుడు ..సేరుత్తా ..బళ్ళో? ఏరా..నువ్వెప్పుడెల్తా బళ్ళోకి..?” అంటా బుగ్గగిల్లేడు అక్కడే ఉన్న గిలక తమ్ముడు శీనుకేసి సూత్తా. మల్లీ అంతలోనే..
తల్నిండా నూనెట్టి పాపిడి తీసి అణిసణిసి మరీ నున్నగా దువ్విన తలతో ముద్దొత్తన్న శీను తల మీద సెయ్యేసి తల్నిమురుతా..
“ మన పక్కూళ్ళో..కానివెంటెట్టేరంటగందా….ఆళ్ళెవళ్లో మిషనోల్లు. యలమాటోరీధిలో ఇద్దరు ముగ్గురేసేరంట దాన్లో..పొద్దున్నే రిచ్చాలొత్తన్నాయ్..ఆల్లని తీస్కెల్తాకి..అందుల్లో యేసెయ్యాలని గొడవ మీయక్క..మావోణ్ణి..” అన్నాడు సెలపతి..
అటూ ఇటూగా ఇద్దరూ ఓ తోటోళ్ళే..
“ సదూ వచ్చేవోల్లకి యాడైనా వత్తాదిరా బావా..! అయినా..మనకి తెల్దేటి..ఈ బడెడతాకి మన పెద్దోల్లు పంచాయతాపీసులో కలుత్తుం. పొద్దోయేదాకా మాట్తాడుకుంటం..గవర్నమెటాపీసుల్జుట్టూ తిరుగుతుం. నీగ్గుర్తుందో లేదోగానీ ..మనిద్దరం సిన్నోల్లం. బుజాల మీదికెక్కిచ్చుకుని మరీ తిప్పేటోల్లు పొద్దు గూకులా సందాల కోసం..మీ నానా, మానానా. ఇద్దరూ తిరిగినోల్లు తిరిగినట్తు తిరిగీవోరు బడేట్తాలెలాగైనానని.
పైగా పెసిండెంటులు కూడా సేసినోళ్ళాళ్ళు. మనవే.. మన పిల్లల్ని సేర్సాపోతే బడి నిలవద్దా..!
గవుర్నమెంటోళ్లకి తెలిత్తే ఎత్తేత్తారుగూడాను. అంతుకే..మీయక్క పిల్లోణ్ణి మిసను బల్లో ఏద్దావంటా సన్నాయి నొక్కులు పోతావుందిగానీ ..దానికేందెల్సు..ఈ బడి గోడల్లేపుతాకి మనోల్లు పడ్ద కట్తం.? అదలాగే అంటాది..” .
“అయినా సెలపతే.. ఏమాటకామాటే సెప్పుకోవాల..కాన్వెంట్లల్లో సదివినోల్లకి సూటూబూటే గానీ ఇలాటి బళ్లల్లో సదుంకున్నోల్ల కున్నంత జానం ఆల్లకి ఉంటదంటావా? నాకవుతే డౌటే..”
“ సర్లే..! అయ్యన్నీ ఇప్పుడెందుగ్గానీ ..బయల్ధేరు. నాకూ పనుంది..గిత్తకి నాడాలేయిత్తన్నాను. ఆడొత్తానన్నాడియ్యాల.. ”
………
“ పుట్టిన్రోజెప్పుడో సెప్పగల్తారాండి..” బళ్ళో ఎడ్ మాస్టర్ అన్నమాటల్కి అక్కడే గోడల మీదున్న తండ్రి, తాత, పెత్తాతల పొటోల్కేసి ఎగాదిగా సూత్తన్నాడేమో.. ఎంకటేసర్రావ్..గబుక్కున అట్నిండి తలతిప్పి.
“ నాకైతే ఆట్తే గుర్తులేదండా..మాస్టరు గారా! వరిసేను మాంచి పనల మీదుంది సేలో..సరిగ్గా సందేల అయిదయ్యేతలికి లంకిచ్చుకుందోన..నీళ్లల్లో మునిగిపోయిన పనల్ని సూత్తా నవ్వాలో ఏడ్వాలో తెలవక కూకునున్నాం..సావిట్లో కూలోల్లు పన్జేత్త్నారో పక్క..ఈలోపు కవురెట్టేరు..మాయాడాల్లకి ఆడపిల్లుట్టిందని.” అని కాసేపాలోసిచ్చి..
“ ఇది పుట్తిన్నెల్లోనే వారంపది రోజులకనుకుంటానండా మాస్టరుగారా సుబ్బారాయుడి సట్తొచ్చింది. సేగల్లెల్లేం..ఎడ్లబండి కట్టుకుని… నాకు బాగ్గుర్తు. “
దాంతో..డిశంబర్ నెలని రాసిన ఎడ్డు మాస్టర్ గారు..
“ ఏ సంవచ్చరవో..సెప్తే..ఇక్కడ్రాయాలండి..”
“ అద్దెలవదుగానీ పిల్లకిప్పుడు నాలుగెల్లి అయిజ్జొరబడిందండి….పోయిన పుస్కరాలకనుకో..కాత్తంత అటూఇటూగా.. ”
అదిని కాసేపాలోసిచ్చిన ఎడ్డుమాస్టర్ గారు..
“ ఆ లెక్కన్జూత్తే మీ యమ్మాయికింకా అయిదేల్లు నిండలేదండి ..అయిదేల్లు నిండితేనేగానీ బళ్లో సేర్సుకోం..”
“ అలాగనకయ్యా..బాబూ..! దీంతో ఇంట్లోవోల్లు యేగలేపోతన్నారయ్యా బాబూ.. ఏరుసెనక్కాయలోడేటి, బఠానీలమ్మేవోడు, జాంపళ్ళోడు.. సెక్రకడ్డీలు, జీడిమావిడి పల్లూ..పుల్లైసు..ఒకటేటి..ఒక్క గుల్లముగ్గూ, కుంకుడుగాయలూ, ఉప్పూ తప్ప ఈధిలోకి ఏదొత్తే అది కొనాపోతే కొంపలెగిరిపోతన్నాయ్. ఎవరి సెట్టున కాయున్నా..పిందెలని కూడా సూడకుండా కోసి పాదేత్తంది మాస్టరుగారూ. కూడా ఈణ్ణొకణ్ణి ఏసుకుని..ఊరంతా తిరుగుతా..ఎవరి సెట్టుకి ఏ కాయుందా..ఏ సెట్టుకి ఏ పువ్వుందా..ఇదే సూపు. ఏదో తాతముత్తాతలు సంపాయిచ్చి యిచ్చిన పేరుంది కాబట్టి నోర్మూసుకుంట్నారుగానీ లేదంటే రోజూ గొడవలే..”
“ అది నిజమేగానండి..అయిదేల్లూ పురాగాకుండా బల్లో ఏస్కుంటాకి మా రూల్సు ఒప్పుకోవండి..గొడవైపోద్ది..నా ఉజ్జోగం పోయినా పోవచ్చండి” దీనంగా అన్నాడు ఎడ్డు మాస్టరు.
“ అదంతా నాకు తెల్దు. ఏదోటి మీరే సెయ్యాల..”
సెప్పెసేడు..ఎంకటేస్సర్రావ్.
“ ఎక్కడ పుట్టిందో సెప్పగల్తారాండి.పోనీ ..”
“ఎక్కడేటయ్యా..బాబా.. మా ఇంటోనే..! నెప్పులొత్తే ..మంత్రసానిక్కబురెట్టిందంట మాయత్తగారు..ఆవిడొచ్చేతలికే ..కాన్పొచ్చేసి పిల్లుట్టేసిందంట.. “
అదింటూ కాసేపు అక్కడున్న నల్లగా మాసిపోయి ముక్కలూడిపోతన్న లావాటి పుస్తకంలో ఏదో గీకి..
“ఇయ్యాల ఏప్రిల్ రెండో తారీఖండి..నిన్నటికి అయిదేల్లు నిండినట్టు రాసేసేనండి మరి..పాపగారు ఏదైనా ఉజ్జోగం సేసేటప్పుడు తొరగా దిగిపోతారండి మరి..”
“ ఉజ్జోగవా..సజ్జోగవా..? “ అంటా ఇరగబడి నవ్వ్గి..
“ .. ఇప్పుడుజెప్పు నేనెంతగట్తాలో..ఏంజయ్యాలో..” అన్నాడు జేబీలో సెయ్యేడతా..
ఇక్కడిదంతా జరుగుతుండగానే..సుక్కలా తయారై పలకట్టుకుని ఆల్ల నాన్న కూడా బల్లోకొచ్చిన గిలకన్జూసి “ ఏయ్ ..గిలక బళ్లోజేరంతందే..” అని ఒకళ్లనించి ఒకళ్లకి పాకిపోయిందేమో..ఆ ఇసయం ..తెలిసినోల్లు తెలిసినట్టు వచ్చి గిలకసుట్టూ మూగేత్తా ఉన్నారు..పిలకాయలంతా.
“ నీ పలక్కొత్తదా..?” అనడిగేదొకత్తైతే..
“ గిల్కా..నీ గౌను కుచ్చిల్లు ఇంచక్కున్నాయ్..నేనోసారి ముట్టుకోనా?”
“కొత్త రిబ్బన్ లా..”
“బొట్టు సూడండల్లా..ఎలా మెరుత్తుందో..”
“ సెప్పులు కూడా కొత్తయ్యే ఏసుకుందల్లా..! గౌన్రంగే..అచ్చు కదా..”
ఆల్లలా ఒక్కొక్కటీ ఇవరంగా సూత్తా పొగడ్తా ఉంటే మెకం మువ్వారింపుగా ఎట్టి వాటన్నింటెనక్కీ గర్వంగా సూసుకుంది గిలక. ఇంతకి ముందంతా..ఆళ్లందరూ పకలట్టుకునీ, పుస్తకాలట్టుకునీ బళ్ళోకి ఎల్తంటే ఆళ్ళెనక్కే సూత్తా ఉండిపోయేది..
ఇప్పుడు తనూ జేరేసింది.
కాసేపయ్యాకా పెద్ద మేస్టారు కళాసులోకెల్లి కూకోమనేసరికి..జతకత్తులు కూడా రాగా..బళ్ళోవోళ్లందరికీ నిమ్మతొనలు పంచి పెట్తేసింది కూడాను..
——-
“ఊహూ..! గిలకమ్మ బళ్ళోజేరిందన్నమాట. ఇంకేం? గిలకమ్మ గొంతినపడక…ఈది ఈదంతా ఏదో లేనట్టుంటే ఏటో అనుకున్నాను..ఇదన్నమాట సంగతి..బాగానే ఉంది..”
అంది సరోజ్ని పొరుగింటామె సీతామాలచ్మి.
“ అవును..జేర్సేం..! ఇయ్యాలే..! దాన్నందులో జేర్సేసి..ఈయన పొలవెల్లేరు..నీకినపడే ఉమ్టదనుకున్నాను ఇనపళ్లేదా? ” అంది సరోజ్ని అయ్యాల సందేళ ఈధరుగు మీద కూకుని సేట్లో ఉన్న బియ్యంలో రాళ్లేరతా..
“ అన్నట్టు..ఈ కుర్రకుంకకి అప్పుడే అయిదేల్లు నిండినియ్యా..?” అదే సేట్లో తనూ మట్టి బెడ్దల్ని ఏరతా, ఏరిందాన్నల్లా నోట్లో ఏసుకుంటా.. అంది సీతామాలచ్మి..
“ నిండలేదు గానీ నిండినట్టు రాయించేత్తానన్నారు.. దీని గొడవ పళ్ళేక సరేనన్నాను..ఇంట్లో ఉండి ఏడిపిచ్చి ఎసరోత్తందని.. ”
“ అంతేలే..నిండితే ఏటి? నిండాపోతే ఏటి? ఉజ్జోగాల్జెయ్యాలా? ఊళ్ళేలాలా? ” అందో లేదో..ఇంత ఉత్సాహంగా సంకలో పలకెట్టుకుని మురంబిలాగా ముఖవెట్టి తలెగరేస్తా వచ్చింది గిలక..ఆ ముఖంలో తైతక్కలాడతన్న గర్వాన్ని సూత్తా..సీతామాలచ్మి..
“ అయితే ..గిలకమ్మ..ఆర్నెల్ల ముందే పెద్దదైపోయిందన్న మాట..” అంది పక పకా నవ్వుతూ..
అంతే..ఆ మాటతో కోపవొచ్చేసిన గిలక సిర్రెత్తిన శివంగిలాగా .. ఆంబోతల్లే సీతామాలచ్మి మీదడిపోయి.. పిడి గుద్దులు గుద్దినియ్యి గుద్దినట్టు గుద్దింది..
గుద్దుతానే ఉంది అలాగ గిలక..ఎంతమంది ఆపమన్నా ఎంతకీ ..ఆపదే..!
కాళ్ల మీదున్న బియ్యం సేటని కిందెట్టి గిలక రెక్కట్టుకుంది సరోజ్ని..
“ పెద్దంతరం , సిన్నంతరం లేకుండా అలా గుద్దు గుద్దెయ్యటమేనా? పిచ్చెక్కిందా ఏటి? నిన్నేం పూనిందే శనిగొట్టుదానా..” అంటా బలంగా ఒక్క ఈడ్సు ఈడ్సిపారేసిందవతలకి..
“ మరి సీతామలచ్మత్త సూడు ఏవంటుందో..ఆర్నెల్లు ముందే పెద్దదాన్నయిపోయేనంట.
ఆ మాట తెలిత్తే మా పెద్ద సారు నన్ను ఇంటికప్పేత్తేనో…” పడ్దసోట నించి లెసి నిలబడి..గౌనుకంటిన మట్టిని దుపుకుంటా గిలకన్న మాటలకి..
“ హార్ని..కుర్రకుంకా..! ఇంటికంపేత్తారా..”
అంటూ.. అప్పుడే అక్కడికొచ్చిన గిలక అమ్మమ్మతో సహా పెంకులెగిరిపోయేలా నవ్వేరంతా

3 thoughts on “గిలకమ్మ కతలు .. గిలకమ్మ..ఆర్నెల్ల ముందే పెద్దదైపోయిందంటల్లా..!

  1. అహ్హహ.. ఇంటికంపేత్తేనో??
    .సాధారణంగా పల్లెటూర్లలో పుట్టినరోజు లెక్కలు.. ఇలాగే ఏదో ఒక పండుగ ముందో వెనుకో.. అని చెప్పటమే కానీ తేదీలు,వ్రాతలు కోతలు ఏమీ ఉండేవి కావు!
    ఇలాగే ఈ గిలక కూడా ఓ ఆర్నెల్లు ముందే పెద్దదై పోయింది మరి..కథ బావుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *