March 29, 2024

చదువు విలువ…

రచన: గిరిజారాణి కలవల

‘ బామ్మా ! ఫోన్ నీకే , ఎవరో రమణమ్మట..’ అంటూ మనవడు ఫోన్ తీసుకుని వచ్చాడు.
‘ హలో.. రమణమ్మా.. ఎలా వున్నావే? చాల రోజులైంది.. ఏమయిపోయావు ఇన్నాళ్లూ?’ అన్నాను.
‘ ఆ ఫోను పోయిందమ్మగారూ.. నెంబర్లు అన్నీ పోయాయి.. మీ అబ్బాయిగారి స్నేహితుడు మొన్న బజార్లో కనపడితే.. మీ నెంబరు తీసుకున్నాను. మీ వంట్లో ఎలా వుందమ్మా? ఎన్నాళ్ళయిందో మీ గొంతు విని. మీ ఇంటి ముందు నుంచి వెడుతూంటే మీరే గుర్తొస్తారమ్మా.. ఏడుపొచ్చేస్తుంది నాకు. మిమ్మల్ని చూడాలనివుంది.. ఓ సారి వస్తానమ్మా.. ‘ అంటూ ఆపకుండా మాట్లాడేస్తోంది రమణమ్మ.
‘ అలాగే.. వద్దువు గాని.. ఒక్కదానివీ రాగలవా మరి.. హైదరాబాద్ లో రైలెక్కితే ఇక్కడ దింపుకుంటాను. నాగలక్ష్మి, పార్వతి ఎలా వున్నారు? ‘ అని అడిగాను.
‘ బావున్నరమ్మా… పార్వతికి కూడా పెళ్ళి చేసేసాను. దానికి ఆడపిల్ల.. ఏడాది దాటింది.. నాగలక్ష్మికి కొడుకు.. వాడికి మూడేళ్లు… అది ఆ ఉద్యోగం చేస్తూనే వుంది.. బావున్నారమ్మా వాళ్ళు.. వాళ్ళ మామగారు… ఐదంతస్తుల ఇల్లు కట్టారమ్మా.. ఎంత బావుందో.. కిందన ఇంట్లో వీళ్లు వుంటున్నారు.. పైన నాలుగంతస్తుల్లో రెండేసి వాటాలేసి అద్దెలకిచ్చారు అద్దెలే ఎనభైవేల పైన వస్తున్నాయట. నాగలక్ష్మి వాళ్ళాయనకీ జీతం పెరిగిందట. నెలకి లక్ష రూపాయలట. వాళ్ళ సంసారం చాలా బావుందమ్మా… అంతా నీ దయ వల్లే అమ్మా… రోజుకోసారైనా నిన్ను తలుచుకోకుండా వుండదు నాగలక్ష్మి. ఆరోజు మీరే సరైన దారి చూపి వుండకపోతే.. అదీ నాలాగే కూలిపనులు చేసుకుంటూ వుండేది. అది ఈరోజు ఇంత వైభోగం అనుభవించడానికి మీరే అమ్మా.. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేనని నాగలక్ష్మి ఎప్పుడూ అంటుంది ‘ అని చెపుతున్న రమణమ్మ మాటలకి అడ్డం వచ్చి ‘ సరే లేవే.. ఇంక చాలు పొగడ్తలు ఆపు.. దాని అదృష్టం బావుంది.. అభివృద్ధి లోకి వచ్చింది.. నేను చేసిందేముంది ఇందులో.. సరే ఎప్పుడు రాదలుచుకున్నావో చెప్పు. టికెట్ బుక్ చేయిస్తాను.. ఈ నెంబర్ జాగ్రత్తగా రాసి వుంచుకో.. వుంటా మరి’ అని ఫోన్ పెట్టేసాను.
ఒక్కసారిగా.. పదిహేను సంవత్సరాల క్రితం .. జరిగిన సంగతులన్నీ గుర్తు వచ్చాయి.
మా ఇంట్లో ఈ రమణమ్మ మా ఇంట్లో పాచి పని చేస్తూ వుండేది. తనతో పాటు కూతురు నాగలక్ష్మి ని కూడా తీసుకువస్తూ వుండేది. . పిల్లలిద్దరినీ గవర్నమెంట్ స్కూల్ లో చేర్పించింది. చూస్తూండగానే పెద్దది పదో క్లాసు, చిన్నది ఏడో క్లాసులోకి వచ్చారు. పదో తరగతి పరీక్షలు అవడం రిజల్టు రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రం రమణమ్మ పెద్దపిల్ల నాగలక్ష్మిని వెంట పెట్టుకుని వచ్చింది.
‘ ఏం, నాగలక్ష్మి, రిజల్ట్స్ వచ్చినట్టున్నాయిగా?’ అని అడిగాను.
‘ అవునమ్మా.. ఆరొందలకీ ఐదొందల ఎనభై వచ్చాయట.’ అంది రమణమ్మ.
‘ ఓ.. అవునా.. కంగ్రాట్స్ నాగలక్ష్మి’
ఏం సమాధానం లేకుండా.. వెక్కెక్కి ఏడవడం మొదలెట్టింది. ఆశ్చర్యంగా ‘ అదేంటే.. అన్ని మార్కులు వస్తే ఏడుస్తావేంటీ.. పిచ్చా.. నీకు?’ అని మందలించాను.
దానికి సమాధానంగా ఫైయిలయినా బాగుండేదమ్మా… ఇప్పుడు ఇన్ని మార్కులు తో పాసయ్యేసరికి కాలేజీలో చేర్పించమని ఒకటే గొడవ.. నాకెక్కడవుతుంది.. బోలెడు డబ్బులు పొయ్యాలి… మా ఇళ్ల లో ఈ పాటికి పెళ్ళి అయిపోవాలసలు… పోనీలే పది చదివాక చేద్దామనుకున్నాను. అయినా ఇప్పుడు ఇది కాలేజీ చదువులు చదివితే.. అలా చదివిన మొగుడుని నేనెక్కడ తేగలను? ఇక చాలు నాతో కూలిపనికి రమ్మంటున్నాను. వినిపించుకోవడం లేదు. మీరైనా చెప్పండి దానికి. ‘ అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది రమణమ్మ.
‘ అది చదువుకుంటాను మొర్రో.. అంటోంటే వద్దంటావేమిటే.. ‘ అన్నాను.
‘ బావుందమ్మా.. దానికి మీ వత్తాసు.. చూస్తూనే వున్నారగా.. ఏ రోజు కూలి ఆరోజు తిండికే గగనం మాకు.. ఇక కాలేజీ ఫీజులూ.. పుస్తకాలూ నా వల్ల ఎక్కడవుతుంది ‘ అని వాపోయింది రమణమ్మ.
‘ ఆ సంగతి నేను ఆలోచిస్తాలే… ఇదిగో.. నాగలక్ష్మీ.. రేపీ నీ మార్కులషీట్ తీసుకుని పదిగంటలకల్లా రా.. ‘ అని చెప్పి పంపించాను.
చెప్పిన ప్రకారం పొద్దున్నే వచ్చి కూర్చుంది నాగలక్ష్మి. గబగబా వంట ముగించుకుని.. తనని తీసుకుని, పక్కింటి సింధు చదువుతున్న.. కృష్ణవేణి జూనియర్ కాలేజీకి వెళ్ళాను. తనని బయటే వుండమని, ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్లి, నాగలక్ష్మి మార్కులు చూపించి , తన కుటుంబ పరిస్థితి, చదువుపట్ల ఆసక్తి అన్ని వివరంగా చెప్పాను. ఆయన అంతా విని.. ఇంత తెలివైన అమ్మాయి మా కాలేజీలో వుంటే మాకే పేరు వస్తుంది.. ఇంటర్ లో సీట్ ఇస్తాను.. కాలేజీ ఫీజులు వద్దు.. కానీ పుస్తకాలు కొనుక్కోవాలి.. పరీక్ష ఫీజు కట్టమనండి.. అని అన్నారు. ఆ మాత్రం సాయం చాలండీ.. థాంక్యూ అని చెప్పి.. ఆఫీసులో నాగలక్ష్మి పేరు రిజిస్టర్ చేయించాను. అది ఆనందంతో పొంగిపోయింది. ఇంటికి వచ్చాక సింధుని పిలిచి, నాగలక్ష్మిని పరిచయం చేసాను. ‘ సింధూ.. నీ ఫస్టియర్ అయిపోయింది కదా.. నీ టెక్స్ట్ బుక్స్ ఈ అమ్మాయికి ఇయ్యమ్మా..’ అని చెప్పగానే సింధు సరే అని వెంటనే తెచ్చి ఇచ్చింది. ఈ సంగతి తెలిసి సింధు తల్లి.. మంచి డ్రస్సులు ఓ అరడజను ‘ సింధుకి పట్టడం లేదు.. ఈ పిల్లకి ఇమ్మంటారా పిన్నీ’ అని అడిగింది.
‘ మంచిగా వుంటే తీసుకురామ్మా. కాలేజీకి వెళ్లే పిల్ల కదా.. కాస్త మంచి డ్రస్సులు కావాలి కదా’ అన్నాను.
‘ అయ్యో .. అన్నీ మంచివే…బావుండకపోతే నేనెందుకు ఇస్తానంటాను..’ అంటూ ఓ కవర్ లో పెట్టి ఇచ్చింది.
ఇక నోట్ బుక్స్ కోసం లోపలికి వెళ్లి ఓ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి.. నాగలక్ష్మి చేతిలో పెట్టాను.
‘ సింధు ని తీసుకెళ్లి ఏం పుస్తకాలు కావాలో కొనుక్కో.. ఈ ఏడాదికి ఇక నీకు ఇబ్బంది లేదు.. అన్నీ అమిరాయి.. ఏడాది ఆఖరులో పరీక్ష ఫీజు కడతాలే.. మీ అమ్మ ని కాదని నీకు వత్తాసు పలికి కాలేజీ లో చేర్పించి నీ కోరిక తీర్చాను.
ఫలితం దక్కాలి. బాగా చదువుకో.. ఈ ఇంటర్ రెండేళ్లు అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. నాకు మాట రాకుండా చూడు.’ అని అనగానే.. నా కాళ్ళ మీద పడిపోయి..’ అమ్మగారూ.. మీ ఋణం తీర్చుకోలేనమ్మా.. నేను బాగా పెద్ద చదువులు చదవాలమ్మా.. మీ దయ వల్ల నా కోరిక తీరుతున్నది. మీకు మాట రానీయను. ‘ అంటూ చుట్టేసింది.
‘ అయ్యో… వదలవే.. నీకు చదువుకోవాలనే కోరికుంది.. నీ అదృష్టం బావుండి ఆ ప్రిన్సిపాల్ ఒప్పుకున్నారు కాబట్టి ఫీజులు లేవు.. వుండి వుంటే నాకు కొంత కష్టమయ్యేది.. పోనీలే ప్రస్తుతానికి అయింది కదా.. ఇంటికెళ్ళి మీ అమ్మకి చెప్పు. ‘ అని పంపించాను.
అనుకున్నట్టే.. నాగలక్ష్మి కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంది.. అన్నిటిలోనూ ఫస్టే.. అలాగే నా సహాయంతో ఇంటర్ రెండేళ్ళూ చదివేసి మంచి మార్కులు తెచ్చుకుంది.
చదువు మీదున్న నా ఇంట్రెస్ట్.. పైగా నేను చదువుకోలేకపోయాను.. ఆడపిల్లల కి చదువుండాలనే నా ఉద్దేశ్యంతో.. తర్వాత నాగలక్ష్మిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బి. ఎస్సీ లో చేర్పించాను. ఊళ్లో లయన్స్ క్లబ్ వాళ్ళో సంవత్సరం.. ఇంకా కొంతమంది తెలిసినవారి చందాలతో… పై ఎత్తున నా సహాయంతో డిగ్రీ కూడా పూర్తి చేసింది. రిజల్ట్స్ వచ్చిన రోజున దాని ఆనందాలకి పట్టపగ్గాలు లేవు. రమణమ్మకైతే ఇందంతా నిజమేనా అన్న భ్రమలో వుంది. ఆ తర్వాత ఉద్యోగ వేట లో పడింది. హైదరాబాద్ లో ఇన్ఫోటెక్ ఆఫీసుకి అప్లికేషన్ పంపడం.. ఇంటర్వ్యూలో సెలక్ట్ కావడం జరిగింది. స్వీట్ పాకెట్ తీసుకొచ్చి మళ్లీ కాళ్ల మీద పడిపోయింది.
‘ లేవే… తల్లీ.. మాటి మాటికి ఈ పాద నమస్కారములు ఏంటీ.. నీ కృషి, పట్టుదల వుండ బట్టే పైకి రాగలిగావు.. మీ అమ్మని బాగా చూసుకో..’ అని అభినందనలు చెప్పాను.
ఆ తర్వాత అది హైదరాబాద్ ఉద్యోగంలో చేరడం జరిగింది. పదివేలు జీతం. తన ఖర్చులు పోగా తల్లి కి కొంచెం పంపి.. చెల్లి పార్వతి ని నర్సింగ్ కాలేజీలో చేర్పించింది. మొదటి నుంచి చర్చికి వెళ్ళడం అలవాటు వుండే నాగలక్ష్మి ఉద్యోగం వచ్చాక కూడా క్రమం తప్పకుండా వెడుతూ వుండేది. క్రీస్తు పై ఇలాంటి నమ్మకం వుండే అమ్మాయే కోడలిగా కావాలని అనుకుంటున్న విజయకి ఈ నాగలక్ష్మి ఎంతగానో నచ్చింది. చర్చి ఫాదర్ ద్వారా రమణమ్మకి కబురుచేసి.. తన మనసులో మాట చెప్పించింది విజయ. తన కొడుకు మోహన్ MBA చేసి ఏదో ప్రవేట్ కంపెనీలో చేస్తున్నాడని.. ముఫ్ఫై వేల జీతం వస్తుందని.. చెప్పింది విజయ. భర్త RMP డాక్టర్ అనీ.. తను టైలరింగ్ చేస్తున్నట్లు… కృష్ణా జిల్లాలో తోట, పొలం వున్నాయని చెప్పింది.
రోజు కూలి చేసుకునే తమకి.. ఈ సంబంధం.. చాలా గొప్పదనీ.. మీ అంతస్తు కి తాము తూగలేమనీ రమణమ్మ చెప్పింది. అయినా కూడా విజయకి, నాగలక్ష్మి వినయం, సంస్కారం నచ్చాయి… కనుముక్కుతీరు కూడా ముచ్చటగా వుండేసరికి బాగా నచ్చింది.
‘ మీరు ఏ పని చేసుకుంటే మాకెందుకు… మాకు కాలసింది మీ అమ్మాయి.. మాకు కట్నం కూడా ఏమీ అక్కర్లేదు.. మీకు మా మీద సందేహం వుంటే.. మా అబ్బాయి ఉద్యోగం.. మా ఆస్తులు ఎంక్వయిరీ చేసుకున్నాకే పెళ్ళి చూపులు ఏర్పాటు చేసుకుందాం’ అని అన్నారు.
నా సలహా తీసుకోవడానికీ.. నన్ను అడగడానికీ.. కొంత వ్యవధి తీసుకుని రమణమ్మ చెప్పింది నాకు. వాళ్ళు చెప్పిన ఊళ్లో నాకు తెలిసిన వాళ్ళుండడంతో.. వివరాలు కనుక్కుని మంచి సంబంధమే అని నిర్ణయించుకుని ఒప్పుకోమని రమణమ్మకి చెప్పాను. తనకి అందని సంబంధమైనా కోరి వచ్చినదాన్ని వదులుకోలేక రమణమ్మ.. నాగలక్ష్మి పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తాను అందుకు ఒప్పుకుంటేనే అన్న నిబంధన పెట్టింది నాగలక్ష్మి. ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు మోహన్.
పెళ్ళి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో బెంగళూరులో వుంటున్న కొడుకు అక్కడకి వచ్చెయ్యమనడంతో… నేనూ ఇక్కడ ఒంటరిగా వుండలేక.. ఇల్లు బేరం పెట్టేసి బెంగళూరు వెళ్లి పోవడం జరిగింది.
పెళ్ళి కి పిలుస్తూ ఓ సారి ఫోన్ చేసింది.. రమణమ్మ. అంత దూరం నుంచి వెళ్ళడం కుదరక వెళ్ళలేదు తను. ఆ తర్వాత ఫోన్ లే లేవు. మళ్లీ ఇదిగో ఇప్పుడే చేసింది..

ఇంతలో మళ్లీ మరో ఫోను. ‘ హలో.. అమ్మగారు.. నేను నాగలక్ష్మిని.. ఇప్పుడే అమ్మ మీ నెంబరు ఇచ్చింది. వెంటనే మీతో మాట్లాడాలనిపించి.. చేస్తున్నానమ్మా..’ అంది.
‘ ఎలా వున్నావు? నాగలక్ష్మి… మీ ఆయనా.. పిల్లాడు ఎలా వున్నారు? ఉద్యోగం చేస్తున్నావటగా ఇంకా.. మీ అమ్మ చెప్పింది.’ అన్నాను.
‘ అవునమ్మా…. పెళ్లి అయినా కూడా నాకు ఆర్థిక స్వాతంత్య్రం కావాలి కదమ్మా.. ఇదంతా మీరు పెట్టిన భిక్షే.. ఈ రోజు ఇలా వుండడానికి మీ చలవే అమ్మా… ఆరోజు మీరు గనుక ఇంటర్ లో చేర్పించి వుండకఫోతే.. నాకీ ఉద్యోగం.. ఈ సంసారం కూడా వుండేవి కావు.. ఏ కూలిపని చేసుకునేవాడింట్లోనో వుండేదాన్ని. మీ దయ వల్ల మంచి కుటుంబం లోకి వచ్చాను. అర్థం చేసుకునే భర్త.. అత్తమామలు.. నాకు లభించారు. నా జీతంలో సగం అమ్మకి పంపుతున్నాను. చెల్లికి పెళ్ళి చేయగలిగాను. దీనికంతా కారణం మీరేనమ్మా.. మిమ్మల్ని తలుచుకోని రోజు లేదు.. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేనమ్మా.. మీరు ఒక్కసారి మా ఇంటికి రావాలి… నాకు చేతనైనంతలో మిమ్మల్ని సత్కరించుకోవాలి. అది నా కోరిక. ‘ అంది నాగలక్ష్మి.
‘ అలాగే… తప్పకుండా వస్తాను. నా నమ్మకం వమ్ము కానీయకుండా.. అభివృద్ధిలోకి వచ్చావు. అంతకన్నా కావలసినదేముంది. ఆడపిల్లలు చదువుకోవాలి.. తమ కాళ్ల మీద తాము నిలబడాలి.. అని అనుకునేదాన్ని. ఏదో నాకు చేతనైనంత సహాయం చేసాను. నువ్వూ నిలబెట్టుకోగలిగావు. చాలా సంతోషం. హైదరాబాద్ వచ్చినపుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాను. వుంటాను. మరి. ‘ అని ఫోను పెట్టేసాను.
చిన్ననాడు తనకు చదువుకోవాలని వున్నా.. కాదని పెళ్ళి చేసేసారు.. .. ఆ తర్వాత సంసారం.. పిల్లలు బాధ్యతలు మధ్య చదువు సంగతే మర్చిపోయాను. ఇలా నాగలక్ష్మి లాంటి వారికి చదువు విషయంలో చేతనైనంత సహాయం చేస్తూ తృప్తి పొందేదాన్ని.
తన చదువు కోరిక తీర్చుకుందుకి ఇన్నాళ్ళకి సమయం వచ్చింది. ఇప్పుడైనా డిగ్రీ చదివాలన్న కోరిక తీరబోతోంది… అనుకుంటూ.. కొడుకు తెప్పించిన పుస్తకాలు తీసాను.. ఇంకో రెండు నెలలలో పరీక్షలు.. అయిపోతే కనుక తన అరవైఏళ్ళకి డిగ్రీ వచ్చేస్తుంది. అనుకుంటూ ఆనందంగా పుస్తకంలో మునిగిపోయాను.

1 thought on “చదువు విలువ…

Leave a Reply to మాలిక పత్రిక జులై 2018 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *