April 19, 2024

సర్ప్రైజ్ ట్విస్ట్

రచన: మోహన

కాలింగ్బెల్ మోగగానే, లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది మాయ. . విష్ణు వస్తాడని గంట నుంచి వెయిట్ చేస్తోంది. కానీ ఫ్లైట్ లేట్ అవడంతో, రావడం లేట్ అయ్యింది. అందుకే మాయకి అంత ఆతృత. విష్ణు మాయ బెంగళూరు లో ఉంటున్నారు. వాళ్లకి రాకేష్ అనే పదేళ్ల అబ్బాయి.
ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది, రాకేష్ కూడా పెద్దవాడు అయ్యేడు కదా అని మాయ ఈ మధ్యనే ఫేషన్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యింది. జాబ్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కానీ, రాకేష్ కి అవసరం అని ఇంట్లో నే ఉండి అన్ని చూసుకుంటుంది. విష్ణుకి ఒక
ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం. చాలా టూర్స్ ఉండే ఉద్యోగం. నెలలో పదిహేను రోజులు ఊరిలోనే ఉండడు.
ఆ రోజు మాయ కి క్లాస్ ఉంది. అది చాలా దూరం. రెండు బస్సు లు మారి వెళ్ళాలి. రాకేష్ స్కూల్ కి వెళ్ళేక స్నానం చేసి రెడీ అయ్యింది. బ్రేక్ఫాస్ట్ చేసి, విష్ణు కి టేబుల్ మీద పెట్టింది. విష్ణు ఇంకా రాలేదు. లేట్ అయిపోతోంది. నాలుగు రోజుల తర్వాత వస్తున్నాడు విష్ణు. అసలు క్లాస్ కి వెళ్లాలని లేదు. కానీ ఈ మధ్య ఎదో ఒక అడ్డు వచ్చి క్లాసులు మిస్ అవుతున్నాయి , వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది.
అందుకే కాలింగ్బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది. విష్ణు లోపలికి రాగానే, గట్టిగా పట్టేసుకుంది. విష్ణు కూడా పైకి ఎత్తి తిప్పేసి కిందకి దింపేడు. అంతే, వెంటనే
“సరే విష్ణు వెళ్తాను. క్లాస్ కి టైం అవుతోంది. సాయంత్రం మాట్లాడదాము. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద ఉంది. . లవ్ యు” అంటూ బయటికి పరిగెట్టేసింది మాయ. ఎప్పుడు విష్ణు వెళ్తుంటే, మాయ చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే వెళ్ళద్దు అన్నట్టు మొహం పెడుతుంది. కానీ , ఈ రోజు, తను విష్ణు ని వదిలి వెళ్లడం కొత్తగా అనిపించింది. పాపం ఇప్పుడే వచ్చేడు. ఎలా మేనేజ్ చేస్తాడో అనుకుంటూ బయలుదేరింది.
అదేంటి నన్ను వదిలి వెళ్ళిపోతావా అనబోయాడు విష్ణు. కానీ మాయ ఫేషన్ డిజైంగ్ నేర్చుకోడానికి ఫుల్ సపోర్ట్ చేస్తానన్నాను కదా, కొంచం కష్టం అయినా భరించాలి అనుకుంటూ, రెడీ అయి, బ్రేక్ఫాస్ట్ చేసి పదకొండు గంటలకి ఆఫీస్ చేరేడు. విష్ణు కి కూడా పని మీదకి మనసు పోవట్లేదు. ఊరు నుంచి రాగానే బయలుదేరేడు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, నిద్ర సరిగా లేదు. సరే డల్ గా అలాగే పని లాగిస్తున్నాడు.
క్లాస్ కి పదిహేను నిముషాలు లేట్ అయ్యింది మాయకి. వెళ్లి కూర్చుంది కానీ , మనసు అంతా విష్ణు మీద ఉంది. పెళ్లి అయి పన్నెండు సంవత్సరాలు అయినా, ఇద్దరికీ ఒక్కళ్లని విడిచి ఒకళ్ళు ఉండడం ఆంటే కష్టం. ఎల్లాగో క్లాస్ ముగిసేసరికి వన్ థర్టీ అయ్యింది. సరే బస్సు ఎక్కుదామని బస్టాండ్ కి వెళ్లి వెయిట్ చేస్తున్న మాయ బస్ కోసం చిల్లర తీద్దామని పర్స్ తీసి చూసుకుంటే అందులో ఇంటి కీస్ కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది మాయకి విష్ణు వచ్చిన సంబరంలో పర్సులో కీస్ పెట్టుకోవడం మర్చిపోయినట్టు. వెంటనే విష్ణుకి ఫోన్ చేసింది.
సరిగ్గా ఆఫీస్ లో అందరు లంచ్ కి వెళ్దాం అని లేస్తుంటే, వన్ థర్టీ కి విష్ణు ఫోన్ మోగింది. మాయ ఎందుకు చేసిందా అనుకుంటూ ఫోన్ ఎత్తిన విష్ణుకి తాను కీస్ పట్టుకెళ్ళడం మర్చిపోయేనంటూ చెప్పింది మాయ. “అవునా అలా ఎలా మర్చిపోయేవు ? ఇప్పుడు ఎలాగ?” అన్నాడు. “అదే, ఎప్పుడూ నువ్వు ఆఫీస్ కి వెళ్ళేక నేను తాళం వేస్కుని వెళ్తాను కదా. ఇవాళ నువ్వు ఉండేసరికి మాములుగా వచ్చేసేను. ఇప్పుడెలా?” అంటూ మాయ కంగారు పడేసరికి, పాపం అనిపించింది విష్ణుకి.
“సరేలే, నువ్వు బస్సు ఎక్కి కోరమంగళ ఫోరమ్ మాల్ బయట వెయిట్ చెయ్యి. నేను మా ఆఫీస్ బాయ్ తోటి కీస్ పంపిస్తాను. ” అన్నాడు. హమ్మయ్య అనుకుని వేరే బస్సు ఎక్కి ఫోరమ్ మాల్ దగ్గరకి వెళ్ళింది. అక్కడికి చేరే సరికి రెండు అయ్యింది. బాగా ఎండ. ఎప్పటికి ఇంటికి చేరుతాను, అనుకుంటూ నించుని వెయిట్ చేస్తోంది. ఆ ఆఫీస్ బాయ్ ఒకటి రెండు సార్లు ఆఫీస్ పని మీద విష్ణు కోసం ఇంటికి వచ్చేడు. . అతని కోసం అటు వచ్చే అన్ని బైక్ల కేసి చూస్తోంది.
రెండుం పావుకి ఒక బైక్ తన వైపు వస్తున్నట్లనిపించి కాస్త పరీక్షగా చూసేసరికి బైక్ అపి హెల్మెట్ తీసి వస్తున్నాడు విష్ణు. విష్ణును చూడగానే మాయ మొహం లో ఎక్కడలేని ఆనందం , సంతోషం, సంబరం , ఆశ్చర్యం .
“హాయ్” అంటూ దగ్గిరికి వెళ్లి “ఏంటి నువ్వు ? కారేదీ ? బైక్ ఎవరిదీ ? ఆమ్మో ఆఫీస్ పని వదిలేసి వచ్చేవా ? ఆఫీస్ పరిస్థితి ఏంటి ?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
పొద్దున్న వెళ్తే రాత్రి లేట్ గా కానీ రాడు విష్ణు. రాకేష్ ని చూసుకోవడం చదివించడం ఇంటి పనులు, బయట పనులు అన్నీ మాయ నే చేసుకుంటుంది. ఊళ్ళో ఉన్నా కూడా వేటికీ టైం ఉండదు విష్ణుకి. అలాంటిది ఇవాళ ఆఫీస్ టైం లో కీస్ ఇవ్వడానికి రావడం చాలా హ్యాపీ గా అనిపించింది. మళ్ళి విష్ణు ని కలవడానికి రాత్రి వరకు వెయిట్ చెయ్యాలి అనుకుంటున్న మాయ మొహం వెలిగి పోతోంది. విష్ణు కూడా ఆంతే హ్యాపీ గా , “ఏం, నేను రాకూడదా ? సర్ప్రైస్ ఇద్దామని చెప్పలేదు. ” అన్నాడు నవ్వుతూ.
“ఇవాళ వర్క్ మీదకి దృష్టి పోవట్లేదు. అందుకే వచ్చేను. లంచ్ చేద్దామా. ” అన్నాడు. ఇంట్లో వంట చేసినది ఉంది గాని, ఇలాంటి ఛాన్స్ ఎప్పుడో కానీ రాదు. రాకేష్ పుట్టేక ఇద్దరే వెళ్లడం తగ్గిపోయింది. అది, . వీక్ డేస్ లో. “సరే పద” అంది హ్యాపీ గా.
ఇద్దరు. . బైక్ ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చెయ్యడానికి ఫోరమ్ మాల్ లో కి వెళ్ళేరు. విండో షాపింగ్ చేస్కుంటూ, వెళ్లి ఫుడ్ కోర్ట్ లో రాజధాని లో లంచ్ చేసేరు. ఇద్దరికీ ఇష్టమైన లంచ్ చేసేక, రాకేష్కి ఏదైనా గేమ్ కొనాలి అని వెతకడం మొదలు పెట్టేడు విష్ణు. ఎప్పుడు టూర్ కి వెళ్లి వచ్చినా, ఒక గేమ్ ఏదైనా ఎయిర్పోర్ట్ నుంచి తేవడం విష్ణు కి అలవాటు. ఇవాళ లేట్ అయేసరికి కుదరలేదు. కానీ రాత్రి ఇంటికి వచ్చేక గిఫ్ట్ తేలేదంటటూ రాకేష్ బాధ పడటం విష్ణు కి నచ్చదు. రాకేష్ ఆంటే పిచ్చి విష్ణుకి. సరే వెళ్లి చూస్తే అన్ని ఇంట్లో ఉన్నవి, తాను ఆల్రెడీ కొన్నవీను. ఆఖరికి వెతికి వెతికి ఒక గేమ్ కొన్నారు . అప్పటికి మూడు గంటలయింది. స్కూల్ నుంచి నాలుగ్గంటలకల్లా రాకేష్ ఇంటికి వస్తాడు. ” ఇంక బయలుదేరుతాను “అంది మాయ. ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ లాగ ఇంక ఇవాళ్టికి మళ్ళి కలవవేమో అన్నట్టు ఇద్దరికీ ఒకళ్ళని విడిచి ఒక్కళ్ళు వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు.
“సరే నేను మా ఆఫీస్ బాయ్ బైక్ మీద వచ్చేను కదా. చాలా రోజులయ్యింది మనిద్దరం బైక్ మీద వెళ్లి . పద. ” అన్నాడు విష్ణు. “ఏంటి బైక్ మీదా ? ఎక్కడికి ? ఆఫీస్ కి వెళ్ళవా ? నేను ఇంటికి వెళ్ళాలి. ” అంది కానీ మొహం లో మాత్రం ఎక్సైట్ మెంట్ కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.
“ కొంచం దూరం దాకా దింపేస్తాను. చాలా రోజులు అయ్యింది కదా. బైక్ మీద వెళ్లి. అక్కడి నుంచి ఆటో ఎక్కేయి. ”అన్నాడు విష్ణు. వద్దు అనే ఆలోచనే లేని మాయ హ్యాపీ గా బైక్ ఎక్కి కూర్చుంది. ఇద్దరికీ పెళ్లి అయినా కొత్తలో ఎలా బైక్ మీద వెళ్లేవారు, ఎలా వర్షం లో బైక్ మీ రౌండ్స్ కి వెళ్ళేరో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ, ఎదో లోకం లోకి వెళ్ళిపోయేరు . చాలా కాలం తర్వాత ఇలా బైక్ మీద తిరగటం తో , చాలా ఎక్సైటెడ్ గా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేసేరు.
రాకేష్ పుట్టిన వన్ ఇయర్ లోపు కార్ కొనాలి . కార్ లో కంఫర్టబుల్ గా తీసుకువెళ్లాలి అని విష్ణు కోరిక. అల్లాగే, వన్ ఇయర్ లోపు కార్ కొన్నాడు. అప్పటి నుంచి బైక్ మీద వెళ్ళింది లేదు. దానితో, ఇద్దరు, బాగా ఎంజాయ్ చేసేరు ఆ బైక్ రైడ్. ఇంకా ఇంటికి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంది అనగా,
“ఐతే ఇంటికి వచ్చేయి. ఇంక ఆఫీస్కి రేపు వెల్దువుగానిలే” అంది మాయ.
“లేదు, లాప్టాప్ ఉంది. కార్ ఉంది. గమ్ముని బయలుదేరాను లే . ఇంక ఆఫీస్ కి వెళ్తాను. ” అంటూ బైక్ ని పక్కకి ఆపేడు. తానే ఒక ఆటో మాట్లాడి ఎక్కించి, బాయ్ చెప్పలేక చెప్పలేక చెప్పి, పంపించేడు మాయ ని. మాయకి చాలా సంతోషం గా ఉంది. ఇలా విష్ణు తో ఒంటరిగా టైం స్పెండ్ చెయ్యడం, లంచ్, బైక్ రైడ్ అన్ని అనెక్స్పెక్టెడ్ గా జరగడం తో , ఎదో ఎక్సైట్మెంట్. ఇంటికి చేరే వరకు మొహం లో నవ్వు పోలేదు. గుర్తు తెచ్చుకోవడం, నవ్వడం, అలాగే కూర్చుంది ఆటోలో. ఆటో అతను చూస్తే పిచ్చేమో అనుకుంటాడు నా నవ్వు చూసి అనుకుంటూనే, అలా నవ్వుతూనే ఉంది మాయ.
అలా అన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆటో కి డబ్బులు ఇచ్చి లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి వెళ్లి పర్సు ఓపెన్ చేద్దామనుకుంటూ, ఒక్క క్షణం ఆగింది. కీస్. . . . కీస్ తీసుకోలేదు. నవ్వు ఆగలేదు మాయ కి. ఇంతా తిరిగి, ఆల్మోస్ట్ ఇంటి దాగా దింపి వెళ్తే, కీస్ ఇవ్వడం విష్ణు కి గుర్తు లేదు. కీస్ తీసుకోవడం మాయ కి గుర్తు లేదు. కీస్ మర్చిపోయేను, ఎలాగా అనే ప్రాబ్లెమ్ కన్నా, ఈ ఎక్స్పీరియన్స్ బావుంది అనుకుంటున్న మాయకి నవ్వు ఆగట్లేదు. అక్కడ ఆఫీస్ లో విష్ణు పరిస్థితి ఏమిటా అని తల్చుకుంటున్నకొద్దీ ఇంకా నవ్వు రావడం మొదలయింది.
ఆఫీస్ కి వెళ్లి బైక్ కీస్ ఆఫీస్ బోయ్ కి ఇచ్చి, చనువు గా భుజం మీద చెయ్యి వేసి,
“థాంక్స్ రాజు, నీ వల్ల ఇవాళ బైక్ మీద తిరిగేము మేము . థాంక్ యు” అంటూ మంచి హుషారుగా తన కేబిన్ లోకి వెళ్లి కూర్చున్నాడు విష్ణు.
“పర్లేదు సర్. దీనికి థాంక్స్ ఎందుకు ? బిజీ గా ఉన్నాను, నాకు పని చెప్పడం ఎందుకు అని మీరే వెళ్లేరుకదా సర్, మీకే నేను థాంక్స్ చెప్పాలి. ” అన్నాడు కేబిన్ దాకా వెనకాలే వెళ్తూ.
ఇంతలో, మాయ చేసిన ఫోన్ అందుకున్నవిష్ణు “హలో, ఏంటి………. . , ఇంటికి చేరేవా. . ఏంటి……. . . . అవునుకదా. . అయ్యో. . అవునా. . ”అంటూ ఫోన్ పెట్టేసి, తన పాకెట్ లోంచి కీస్ తీసి రాజు కి ఇస్తూ, మొహమాటంగా రాజు కేసి చూసేడు.

2 thoughts on “సర్ప్రైజ్ ట్విస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *