March 28, 2024

కంభంపాటి కథలు.. ‘జానకి’ ఫోన్’ తీసింది

రచన: కంభంపాటి రవీంద్ర

ఫోను ఒకటే బీప్ బీప్ మని శబ్దం చేస్తూండడంతో బద్ధకంగా లేచింది భార్గవి . అప్పటికే ఉదయం ఎనిమిదయ్యింది. ఫోన్లో వాట్సాప్ చూసేసరికి అప్పటికే ఇరవైకి పైగా మెసేజీలున్నాయి, జానకి పీఎం అనే గ్రూపులో !

ఛటుక్కున ఆ గ్రూప్ ఓపెన్ చేసేసరికి , ఒకటే చర్చ నడుస్తూంది . ఇంకా జానకి రాలేదు .. ఫోన్ కూడా తియ్యడం లేదు .. అంటే ఇవాళ డుమ్మా కొట్టేసినట్లే అనుకుంటూ !

వంద అపార్టుమెంట్లున్న ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని ఎనిమిదిళ్ళలో పని చేస్తుంది జానకి ! ప్రతిరోజూ ఆరింటికల్లా, సారిక సింగ్ అనే పంజాబీ ఆవిడ ఇంట్లో మొదలెడుతుంది తన పని, కానీ ఏడైనా రాకపోయేసరికి అనుమానమొచ్చి రాంభట్ల కీర్తనకి వాట్సాప్ చేసింది ‘ఈజ్ జానకి ఇన్ యువర్ హౌజ్ ?’ అని , ఠక్కుమని బదులివ్వడమే కాకుండా తిరిగి ఇంకో ప్రశ్న కూడా వేసేసింది కీర్తన ‘నో .. షీ కమ్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్ ఇన్ యువర్ హోమ్ .. డిడ్ యు కాల్ హర్ ?’ అని !

‘చాలాసార్లు కాల్ చేసాను . ఫోన్ తియ్యటం లేదు ‘ అని ఇంగ్లీష్ లో బదులిచ్చింది సారిక

‘ఆదివారం కదా . ఎగ్గొట్టేసుంటుంది .. ‘ అంది కీర్తన

ఇంక అప్పట్నుంచీ ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్నవాళ్ళందరూ ఒకటే డిస్కషన్లు,
‘ఈ పని మనుషులంతా ఇంతే .. ‘,

‘మా నార్త్ లో ఐతే ఇలా ఎగ్గొట్టేస్తే చితకతన్నేసేవాళ్ళం .. ‘,

‘వీళ్ళ మీద జాలిగా ఉండకూడదు ‘

‘ఇలా లేట్ చేసినందుకు , ఒక రోజు శాలరీ కట్ చేద్దాం ‘,

‘లక్కీగా నిన్న రాత్రి పిజ్జా తెప్పించుకున్నాం .. అందుకే మా ఇంట్లో వంట గిన్నెలు పెండింగ్ లేవు
ఓన్లీ గ్లాసెస్ ‘,

‘ అవునా .. పిజ్జా తెప్పించారా ? ఎనీ ఆఫర్ ?’,

‘అవును .. నిన్న డొమినోస్ వాడు 20% డిస్కౌంట్ ఇచ్చాడు ‘

‘గుడ్ .. కానీ మేము మొన్న తెప్పించుకుంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చేడు ‘

‘దయచేసి ఎవరూ టాపిక్ మార్చద్దు .. జానకికి కాల్ చేస్తూ ఉండండి .. ఫోన్ తీసేంతవరకూ ‘

ఇలాంటి మెసేజ్లన్నీ చూసుకున్న భార్గవికి ఒకసారి డిప్రెషన్ వచ్చేసి ‘ఛీ వెధవ బతుకు ‘ అని గట్టిగా గొణుక్కుంటూంటే ,
ఆవిడ భర్త జనార్దన్ లేచి , ‘ఏమైంది ?’ అని అడిగేడు

‘ఏముంది .. దట్ బిచ్ .. జానకి ఇవాళ ఇంకా పనిలోకి రాలేదుట .. సండే కూడా నాకు రిలాక్స్ అవడానికి లేదు ‘ అంది

‘చాల్లే .. ఈజీగా తీసుకో .. యూఎస్ లో ఉన్నప్పుడు మనమే కదా మనింట్లో పని చేసుకునేవాళ్లం.. అలా అనుకో .. ఈ ఒక్కరోజుకి ‘ అన్నాడు

‘మీకేం .. మీరు ఎన్నైనా చెబుతారు .. అయినా ఆ అమ్మాయి ఎందుకు రాలేదో కనుక్కోకుండా , మన పని అంటూ చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది ?’

‘అలా అని కాదు .. ఆ వాట్సాప్ చాటింగ్ మీద టైం వేస్ట్ చేసే బదులు మనమే పని చేసేసుకుంటే ఏ గొడవా ఉండదు కదా అని ‘
‘నేనూ అదే చెబుతున్నాను .. మీరు నాకు కొత్తగా జ్ఞానబోధ చెయ్యక్కర్లేదు .. నాకు తెలుసు .. నేనేం చెయ్యాలో ‘
‘సరే .. నీ ఇష్టం .. కానీ ఆ అమ్మాయికి ఏ జ్వరమో వచ్చి ఉండొచ్చునుగా ‘

‘మీకు నేను తప్ప మిగతా ఆడాళ్లంటే భలే జాలి .. జ్వరం వస్తే ఫోన్ తియ్యడానికేం ?’

ఇంక మాట్లాడి లాభం లేదని జనార్దన్ హాల్లోకి వెళ్ళిపోయేడు

ఇంతలో మళ్ళీ ఫోన్ బీప్ బీప్ మనడం మొదలెట్టింది

రెండో ఫ్లోర్ లో ఉండే వనజ ‘జానకి మొన్ననే శాలరీ హండ్రడ్ రుప్పీస్ పెంచమని అడిగింది, ఆలోచిస్తానని చెప్పేను ‘ అని మెసేజ్ చేస్తే , మిగతా వాళ్ళు బదులుగా ‘వీళ్ళు చాలా గ్రీడీ .. ‘, ‘వీళ్ళ ఆశకి అంతు లేదు ‘, ‘బహుశా శాలరీ పెంచలేదని మానేసిందేమో ‘ లాంటి మెసేజీలు పెట్టేరు

భార్గవి కూడా మెసేజ్ పెట్టింది ‘క్రితం వారం మా అబ్బాయికి కేక్ కొనడానికి కే ఎస్ బేకర్స్ కి వెళ్తే , అక్కడ తన కొడుక్కి ఎగ్ పఫ్ కొంటూంది .. వీళ్ళు చూడ్డానికి పనిమనుషులే కానీ .. ఖర్చులు మటుకు మనకన్నా ఎక్కువ పెడతారు ‘

ఆ మెసేజ్ చూసిన సారిక ‘సో .. ట్రూ .. ఇవాళ సండే అంతా పాడు చేసేసింది .. ఇంక ఇవాళ గిన్నెలు కడిగే ఓపిక లేదు .. టిఫిన్ స్విగ్గీ లో ఆర్డర్ చేసేసుకుందాం ‘ అని అంటే ‘యా .. గుడ్ ఐడియా .. స్విగ్గీ ఉండబట్టి సరిపోయింది .. లేకపోతే ఉదయాన్నే గిన్నెలు కడిగి బ్రేక్ ఫాస్ట్ చెయ్యాలంటే టార్చర్ ‘ అని కొంతమంది బదులిస్తే , భార్గవి మటుకు ‘జానకి పని మానేస్తే డబ్బు ఖర్చు పెట్టి , స్విగ్గీలో టిఫిన్ ఆర్డర్ చెయ్యడమెందుకు ? నా దగ్గిర స్పేర్ గిన్నెల సెట్ ఉంది .. వాటితో వండేస్తాను. రేపు తను పనిలోకొస్తే , డబుల్ లోడ్ రెడీగా ఉంటుంది .. అంత ఈజీగా వదలను దాన్ని ‘ అని రిప్లై ఇచ్చింది
‘ఐడియా బావుంది .. కానీ ఒకవేళ రేపు కూడా రాకపోతే ?’ అని కామేశ్వరి అనే ఆవిడ అడిగితే , భార్గవి ఏమీ రిప్లై ఇవ్వలేదు , కానీ భార్గవి అంటే పడని ఇద్దరు ముగ్గురు మటుకు ప్రైవేట్ గా కామేశ్వరి ఒక్కదానికే ‘సూపర్ పంచ్ అక్కా ‘ అంటూ మెసేజ్ పెట్టేరు

సారిక మళ్ళీ కలగజేసుకుని , ‘ప్లీజ్ .. టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు .. జానకి ని ఊరికే వదలొద్దు .. ఫోన్ చేస్తూనే ఉండండి ‘ అని వాట్సాప్ చేసింది

**********

ముజీబ్ 108 కి ఫోన్ చేసి చాలాసేపైంది , ముప్పావుగంట క్రితం నైట్ డ్యూటీ నుంచి వస్తూంటే చూసి, వెంటనే ఫోన్ చేసేడు కానీ ఇంతవరకూ ఆ అంబులెన్సు రాలేదు .. ఆ ఫోన్ చూస్తే ఒకటే మోగుతూంది , మెసేజ్ సౌండ్లు తెగ వచ్చేస్తున్నాయి. . కానీ ఆ ఫోన్ ముట్టుకుంటే తన మీదేమైనా కేసు వస్తుందేమోనని ముట్టుకోలేదు (అప్పటికే అతను మధుబాబు సాహిత్యం చాలా చదివేడు ).

ఇంకో అరగంటకి అంబులెన్సు , ఆ వెనకే వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ గిరినాథ్ వచ్చారు . ఫార్మాలిటీస్ పూర్తి చేస్తూంటే, ఆ ఫోన్ మోగడం మొదలెట్టింది, వెంటనే గిరినాథ్ ఫోన్ తీస్తే , ‘వెంటనే జానకికి ఫోన్ ఇవ్వు .. ఇంతసేపూ ఫోన్ తియ్యక టార్చర్ పెట్టింది .. దీని పాపం ఊరకనే పోదు ‘ అని వస్తున్న అరుపులకి భయపడి ఫోన్ చెవికి దూరంగా పెట్టి, జాలిగా ఏదో వాహనం గుద్దేసి పడున్న జానకి మృతదేహం వేపు జాలిగా చూసేడు !

3 thoughts on “కంభంపాటి కథలు.. ‘జానకి’ ఫోన్’ తీసింది

  1. Hahaha
    మూవీస్ పాడు చేస్తున్నాయి ఆడవారిని ప్రెగ్నెంట్ అవ్వగానే అత్త వారిట్లో అందరూ అందలం ఎక్కించినట్లు కాస్త అన్నం పెట్టగానే పని వాళ్ళు లైఫ్ లాంగ్ ఊరికే పని చేసినట్టు నిజ జీవితం లో రెండు పొరపాటున కూడా జరగవు
    పని వాళ్ళు కూడా అమ్మల గూర్చి ఎంత chendalanga మాట్లాడు కుంటారో ఎపుడైనా విన్నారా మేము విన్నాం
    ఇద్దరు ఇద్దరే

  2. ఆఖరిలైను పంచ్ చాలా హృదయవిదారకంగా ఉంది. ఐడోన్ట్ లైక్ ఇట్… సారీ యూ ద రైటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *