May 26, 2024

కలియుగ వామనుడు 8

రచన: మంథా భానుమతి

వణుకుతున్న చేత్తో మళ్లీ, ఎన్నోసారో.. చూసింది మెస్సేజ్. ఎన్ని సార్లు చూసినా అవే మాటలు.
తల అడ్డంగా తిప్పింది, మాట రానట్లు.
“మెస్సేజ్ ఎక్కడ్నుంచొచ్చిందో నంబర్ ఉండదామ్మా? ఫోన్ లో మాట్లాడుతే వస్తుందంటారు కదా?” బుల్లయ్య ప్రశ్నకి మరింత తెల్ల బోయింది సరస్వతి.
తనకెందుకు తట్టలేదు? చదుకున్న వాళ్లకంటే చదువురాని వాళ్లు నయం అంటారందుకే.
మెస్సేజ్ చూసిన హడావుడిలో బుర్ర పన్చెయ్య లేదు.
వెంటనే మెస్సేజ్ మళ్లీ చూసింది. నంబర్ ఉంది. ఏం చెయ్యాలిప్పుడు?
వాళ్లకి ఫోన్ చేస్తే..
చిన్నా డేంజర్ లో పడ్తాడా? డేంజర్ అనుకుంటే ఇలా చెయ్యడు కదా? కిడ్నాపర్స్ అయుండరు. అయితే.. ఇది వరకే చేసే వాడు కదా?
కిం కర్తవ్యం? ఏదీ పాలు పోవట్లేదు.
తన ఆలోచనలు పైకి చెప్పింది. చిన్నా కుటుంబం వీళ్లు. ఏం చెయ్యాలో చెప్పాల్సింది కూడా వీళ్లే. కష్టమో నిష్ఠూరమో తేల్చాల్సింది వీళ్లే.
నలుగురూ కూర్చుని ఫోన్ చేస్తే మంచిదా కాదా అనేది అరగంట పైగా చర్చించారు.
చివరికి.. ముందుగా తానెవరో చెప్పకుండా, అసలు వాళ్లెవరో, ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు.
“నేనెవరో చెప్పక పోతే, అవతలి వారు టపీమని ఫోన్ పెట్టేయచ్చు.. ఏ యడ్వర్టైజ్ మెంటో అనుకుని. ఆ తరువాత కూడా పలక్క పోవచ్చు.” సరస్వతి ఉస్సురంది.
మళ్లీ మొదటి కొచ్చింది.
“చేసేద్దామమ్మా! ఆ సాయినాధుడే చూసుకుంటాడు. ఏది జరగాలో అది జరుగుతుంది. దొరికిన ఒక్క ఆధారాన్నీ వదిలెయ్యలేం కదా!” బుల్లయ్య అన్నాడు చివరికి.
“పోనీ, పోలీసులకి చెప్తే..” సూరమ్మ..
“అమ్మో.. ఒక సారి చూశాం కదా? పక్కన పడేస్తారు. పైగా మనకేం పనిలేదని తిడ్తారు.” బుల్లయ్యకి అయిన అనుభవం అలాంటిది.
“సరే.. చేస్తున్నా..” సరస్వతి ఫోన్ నొక్క బోయింది.
“ఒక్క నిముషం ఆగమ్మా!” సూరమ్మ లేచి, అలమారు దగ్గరికి వెళ్లి సాయి నాధుని పటం దగ్గర్నుంచి విభూతి తెచ్చి సరస్వతికి పెట్టి, సెల్ కి కూడా కొద్దిగా రాసింది.
“ఏదో నా చాదస్తం. ఇప్పుడు చేయమ్మా!”

*****

లాయర్ ఆలీ వ్రాత బల్ల దగ్గర కూర్చుని అప్పటి వరకూ దొరికిన సమాచారం తన డైరీలో రాసుకుంటున్నాడు. రాసిన తరువాత అసిస్టెంట్ ని కంప్యూటర్ లోకి ఎక్కించమని చెప్తాడు.
తను స్వయంగా రాసుకుంటే కానీ తృప్తిగా ఉండదు. చేత్తో రాస్తుంటేనే ఆలోచనలు వస్తాయంటాడతను.
“మీ బ్రైన్ మీ చేతిలో ఉందా” ఫాతిమా వేళాకోళం చేస్తుంది. చెప్తే నేనురాస్తాగా అంటుంది ఎప్పుడూ.
“సర్! త్రీ ఓ క్లాక్. ఒక గంటలో మనం బయల్దేరాలి. ఇంకా కొన్ని ఎడారి దారులున్నాయి సర్వే చేయాల్సినవి.” ఫాతిమా మాటలకి తలూపుతూ గబగబా రాస్తున్నాడు ఆలీ.
ఆరోజు మధ్యాన్నం కలిసిన పిల్లలు.. క్వయట్ ఇంటరెస్టింగ్. ముఖ్యంగా ఆ చిన్న పిల్లాడు. ఆ వయసులోనే అంత మెచ్యూర్డ్ గా మాట్లాడాడు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్.
సాధారణంగా స్ట్రీట్ బెగ్గర్స్ దగ్గర, లేదా చాలా పూర్ ఫామిలీస్ దగ్గర్నుంచి కొని తీసుకొస్తారని విన్నాడు. వాళ్లు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో.. తల విదిలించాడు ఆలీ.
ఆ అబ్బాయికి భరోసా ఇవ్వడానికి ఫోన్ నంబర్ ఇరేజ్ చేసేశాడు. ఇప్పుడు ట్రేస్ ఔట్ కూడా చెయ్యలేరు. ప్చ్.. టూ బాడ్.
ఆ విషయమే నోట్ చేస్తుండగా ఫోన్ మోగింది.
స్పీకర్ ఆన్ చేసి రాసుకుంటున్నాడు ఆలీ.
“హలో.. ఈజిట్..” ఫోన్ నంబర్ అడిగింది, ఎవరో లేడీ గొంతు. ఇంగ్లీష్ లో, స్పష్టంగా.
“యస్.” ఆలీ ఫోన్ నంబర్ చూశాడు. కొత్త నంబర్.
“యరౌండ్ ట్వెల్వో క్లాక్ యువర్ టైమ్, నాకు ఈ నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నా. మీరు ఎవరో.. ఎక్కడుంటారో చెప్పగలరా?”
గదిలో అందరూ ఒక్క సారి అలర్ట్ అయారు.
“హలో.. కెన్ యు స్పీక్ ఇంగ్లీష్?”
“యస్.. యస్ మేడమ్. మీరు..” ఆలీ గొంతు సవరించుకుని అన్నాడు.
“సారీ.. మీరెవరో చెప్తే కానీ నేనేం మాట్లాడలేను. ఎందుకంటే ఆ మెసేజ్ రియల్ ఆర్ ఫేక్ అనేది తెలియాలి. మీరు, ఆ మెస్సేజ్ ఇచ్చిన వాళ్ల వెల్ విషర్సో కాదో తెలియాలి. చాలా క్రిటికల్ సిట్యువేషన్. అర్ధం చేసుకోండి ప్లీజ్.” చాలా స్పష్టంగా సరస్వతి చెప్తున్నది వినగానే, అక్కడున్న వారందరికీ ఆసరా దొరికినట్లయింది.
“మేడమ్. మీరు ఫోన్ పెట్టెయ్యండి. నేను పిలుస్తాను. మీ దగ్గర నెట్ ఉందా?”
“ప్రస్తుతం లేదు. ఒక టెన్ మినిట్స్ లో చెక్ చెయ్యగలను.”
“ఐతే.. వెంటనే వెళ్లి, ‘హ్యూమన్ రైట్స్ స్లాష్ మొహమద్ ఆలీ’ సైట్ చూడండి. ఒక హాఫెనవర్ లో మీతో మాట్లాడుతాను.”
“ఓకే. తప్పకుండా చేస్తారుగా?”
“ష్యూర్ మేడమ్. ప్రామిస్. ఈ విషయం మీకెంత ముఖ్యమో మాక్కూడా అంతే ముఖ్యం.” ఆలీ స్విచ్ ఆఫ్ చేసి, తన పరివారాన్ని చూసి గట్టిగా నిట్టూర్చాడు.
“మంచి బ్రేక్ దొరుకుతున్నట్లుంది. మన సర్వే రేపు పొద్దున్నకి మారుద్దాం. ఈ లోగా కింద రెస్టారెంట్ కి వెళ్లి మంచి కాఫీ తాగుదాం. ఆ లేడీతో మాట్లాడుతే మనకొక దారి దొరకచ్చు.”

*****

ఫోన్ సంభాషణంతా విన్నారు బుల్లయ్యా వాళ్లు. వాళ్లకి అర్ధమయేట్లు వివరించింది.
“ఇదంతా తేలాక నేనొచ్చి మీకు ఏం జరిగిందే చెప్తాను.”
“అమ్మా! వారు ఫోన్ చేసే టయానికి మేం మీ ఇంటికి రావచ్చా?” బుల్లయ్య అడిగాడు, మొహమాటంగా.
సరస్వతి నొచ్చుకుంటూ చూసింది. నిజమే. తన కంటే వారికే ఎక్కువ ఆతృత ఉంటుంది కదా?
“తప్పకుండా రండి బుల్లయ్యా. ఒక అరగంటలో రండి. నీ పూల బండి మరి?”
“ఇవాళ్టికి బాబా గారిని క్షమించమని అడుగుతానమ్మా! మా చిన్నోడి ఆచూకీ తెలుస్తాందంటే బాబా సంతోషించరా చెప్పండి.”
“అలాగే..” స్కూటీ మీద తన ఇంటికి బయలు దేరింది సరస్వతి.
సరస్వతీ వాళ్లిల్లు అక్కడికో కిలో మీటరు దూరంలో ఉంటుంది. ఐదు నిముషాల్లో చేరుకుంది. వెళ్లిన వెంటనే కంప్యూటర్ ఆన్ చేసి, బూట్ అయేలోగా బాత్రూంకి వెళ్లి మొహం కడుక్కునొచ్చింది.
సరస్వతి భర్త బాంక్ ఆఫీసర్. ఇంటికొచ్చేసరికి రాత్రి పదవుతుంది. పిల్లలిద్దరూ.. హాస్టల్లో. ఒకబ్బాయి బిట్స్ పిలానీలో, అమ్మాయి తిరిచ్చి యనైటిలో చదువుతున్నారు.
రాత్రి ఎనిమిది వరకూ ఖాళీనే. అప్పుడు వంట మొదలు పెట్టి, అర గంటలో ముగిస్తుంది.
అందుకే, చిన్నా వాళ్ల పేటకి వెళ్లి తన శక్తి కొద్దీ సేవ చేస్తుంటుంది. తన పిల్లలు, చిన్నప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో ఉండే వారు. ఏదైనా మంచి పని చెయ్య దల్చుకుంటే దేవుడు కూడా మార్గం సుగమం చేస్తాడు సాధారణంగా.
సరస్వతికి నెట్లో, మొహమద్ ఆలీగారి సమాచారం చూస్తుంటే తల తిరిగినట్లయింది. ఇన్నాళ్లూ తనే ఏదో సంఘసేవ చేస్తున్నాననుకొని అప్పుడప్పుడు గర్వంగా అనుకునేది.
మానవ హక్కుల పరిరక్షణకై మొహ్మద్ ఆలీ బృందం చేస్తున్నదాని ముందు తనది చీమంత కూడా అనిపించ లేదు.
ఆ వెబ్ సైట్ లోనే ఆలీ బృందం పొటోలు, వారి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. అందులో తనకి మెస్సేజ్ వచ్చిన నంబర్, ఆలీ పేరు మీద ఉంది.
ఆలీగారి ఫొటో.. ప్రసన్నంగా, జరుగుతున్న అన్యాయానికి బాధ పడుతున్నట్లుగా కొంచెం విషాదంగా ఉంది.
అదంతా క్షుణ్ణంగా చదవడానికి సరిగ్గా అరగంట పట్టింది. వీధిలో ఉన్న కాలింగ్ బెల్ కూడా అప్పుడే మోగింది.
తలుపు తెరిచి, బుల్లయ్య వాళ్లనీ కూర్చో పెట్టి, మంచి నీళ్లిచ్చింది. ఇంటి నుంచి ముగ్గురూ నడిచి వచ్చినట్లున్నారు.
“అమ్మా! ఇప్పుడు చాయ్ అదీ వద్దమ్మా. ఆ బాబుగారు ఫోన్ చేస్తారు. ఆరు మంచోరేనామ్మా?”
“చాలా మంచి వాళ్లు. మనుషుల మీద జరిగే రకరకాల అన్యాయాలని అరికట్టాలని పోరాడుతున్నారు.”
“అంటే.. మనోడు అన్యాయమై పోతున్నాడామ్మా?” ముగ్గురి కళ్లలోంచీ ధారా పాతంగా నీళ్లు కారి పోతున్నాయి.
“కనుక్కుందాం. ఇప్పుడే కదా.. కాస్తంత ఆధారం దొరికింది.” సరస్వతి మాట పూర్తి కాకుండానే పోన్ మోగింది.
“మేడమ్! మీరే కదా ఇందాకా ఫోన్..” స్పీకర్ లో పెట్టాడు ఆలీ. అలాగే రికార్డ్ కూడా చేస్తున్నాడు.
“అవును ఆలీ గారూ చెప్పండి. మా చిన్నా కనిపించాడా? ఎలా ఉన్నాడు? వాడేనా మెస్సేజ్ ఇచ్చింది?” స్పీకర్ ఆన్ చేసింది. బుల్లయ్య వాళ్లకి అర్ధం కాకపోయినా కాస్త ధైర్యంగా ఉంటుందని.
“అవును మేడమ్. చిన్నానే ఇచ్చాడు ఆ మెస్సేజ్. ఎక్కువ సేపు మాట్లాడ లేక పోయాను. యాక్సిడెంటల్ గా కలిశాడు. వాడిక్కూడా మేమంటే నమ్మకం కలగాలి కదా? ఆ సమయం లేక పోయింది. జస్ట్ పైవ్ మినిట్స్ మాత్రం చూశాము, నేను మా బృందం.”
వింటున్న వాళ్ల ముఖాలు చాటంతయ్యాయి.
“కులాసాగా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఏ దేశంలో ఉన్నాడు? అసలక్కడికి ఎలా వెళ్లాడు?”
“ఆగండి మేడమ్. మీ ప్రశ్నలన్నింటిలో బాబు కులాసాగానే ఉన్నాడని మాత్రం చెప్పగలను. ఇది దుబాయ్. మేము వచ్చి వారం అయింది. ఇక్కడ జరుగుతున్న ఛైల్డ్ కిడ్నాపింగ్ గురించి తెలుసు కోవాలనీ, వీలైతే ఆపాలనీ వచ్చాము.”
“ఏం చేయిస్తున్నారు ఈ పిల్లల చేత? ఇంత చిన్న పిల్లలని తీసుకెళ్లి..” సరస్వతి మాట్లాడ లేక పోయింది.
“చిన్నా మీ అబ్బాయా మేడమ్? ఈ కిడ్నాపర్స్ కి ఎలా దొరికాడూ? స్కూల్ నుంచి ఎత్తుకెళ్లారా?” ఫోన్ లో కంఠం వింటుంటే మంచి ఫామిలీ అనే అనిపించింది.
“కాదండీ..” సరస్వతి జరిగిందంతా చెప్పింది వివరంగా.
“ఇద్దర్నెత్తుకొచ్చారా? ఇంకొక అబ్బాయి బాక్ గ్రౌండ్ ఏమిటి?”
టింకూ గురించి, మస్తానయ్య కుటుంబం వివరాలన్నీ చెప్పింది సరస్వతి.
“ఓ.. ఐతే, టింకూతో పాటు చిన్నాని కూడా ఎత్తుకొచ్చుంటారు. సాధారణంగా పేరెంట్స్ ని మాయమాటలతో నమ్మించి ఎత్తుకెళ్తారు. అదే.. వీళ్ల మాడస్ ఆపరెండీ.
ఆ మస్తానయ్యని గట్టిగా అడుగుతే బైట పడ్తాడు.” ఆలీ ధృడంగా చెప్పాడు.
“చిన్నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారండీ. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. వాళ్లకి ఒక్కడే కొడుకు. ఏం చేయిస్తున్నారు వీళ్ల చేత? ఆ కంట్రీలో దొంగలు, బెగ్గర్స్ ఉండరంటారు కదా?”
“అవును. దొంగతనాలు, బిచ్చం ఎత్తకోవడం ఉండదు.”
“మరి..”
“కామెల్ రైడర్స్ కింద తయారు చేస్తారు. అక్కడ గుర్రాల రేసుల్లాగే, ఇక్కడ కామెల్ రేసులవుతుంటాయి.”
“దానికి ఇంత చిన్న పిల్లలనా? అంతెత్తు నించి కింద పడి పోతే..” తలుచు కుంటేనే సరస్వతికి భయం వేసింది. ఆ మధ్యనొకడు ఒంటెని తీసుకొచ్చి ఊరంతా తిప్పి, ఊరేగించి డబ్బులు సంపాదించాడు. చిన్న పిల్లల్ని మీది కెక్కించి తిప్పాడు కూడానూ.
“అవునమ్మా! కామెల్ జాకీలు బరువుగా ఉండ కూడదు. అందుకని పిల్లల్ని జాకీల కింద తయారు చేస్తారు. దాని కోసం థర్డ్ వరల్డ్ దేశాల నుంచి, బేరాలాడి తీసుకొస్తారు. వాళ్లకి ట్రయనింగ్ ఇస్తారు.”
సంభాషణ వింటున్న శ్రోతలకి సగం సగం అర్ధమవుతోంది. చిన్నా క్షేమంగా ఉన్నాడన్న వార్త తెలిసింది. అదృష్టం ఉంటే.. ఆలీగారి ప్రయత్నం సఫలమైతే, ఇంటికొచ్చేస్తాడు.
“పాపం టింకూ ఏమైపోయాడో. వాడు మరీ చిన్న పిల్లాడు. వాడి సంగతేమైనా చెప్పాడా చిన్నా?” సరస్వతి నిట్టూర్చింది.
“లేదు మేడమ్. చెప్పా కదా.. చాలా తక్కువ టైమ్ దొరికిందనీ. ఆ సమయంలోనే సమయస్ఫూర్తితో నా దగ్గర ఫోన్ తీసుకున్నాడు. ఇక్కడి వాళ్ల లాగా పొడవాటి అంగీ వేసుకోకుండా, సూట్ వేసుకున్నాను. అందుకే నన్ను నమ్మినట్లున్నాడు.”
“అవును సర్. చిన్నా చాలా ఇంటెలిజెంట్. ఏక సంథగ్రాహి. నా ఫేవరెట్ స్టూడెంట్. టింకూని కూడా వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు.” సరస్వతి ధైర్యంగా చెప్పింది.
“ఇద్దరూ ఒకలాగే ఉన్నప్పుడు, చిన్నా టింకూని చూసుకోవడం ఏమిటి? అసలు అతని ఇంగ్లీష్, వాడిన వాక్యాలు, మాటలోని స్పష్టత.. ఆ వయసు వాళ్లు మాట్లాడుతున్నట్లు లేదు. మదర్ టంగ్ అయితే అది వేరే సంగతి. హి లుక్స్ లైక్ ఎ విజర్డ్.” ఆలీ సాలోచనగా అన్నాడు.
“మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు ఆలీ గారే అనే నమ్మకంతో చెప్తున్నాను. అయినా మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదనుకోండి. ఏటిలో కొట్టుకు పోతున్న వాళ్లకి గడ్డి పోచ దొరికి నట్లు అయింది. కనీసం అదేనా దొరికిందని సంతోషించాలి మేము..”
“మేము గడ్డి పోచ కాదు మేడమ్. బోట్ అనను కానీ దుంగ అని చెప్ప గలను. మాకు ఇంటర్నేషనల్ గా సపోర్ట్ ఉంది. చెయ్యాలన్న సంకల్పం ఉంది. పట్టుదల ఉంది.” ఆలీ కొంచెం నిష్ఠూరంగా అన్నాడు.
“సారీ సర్.. మిమ్మల్ని నొప్పించాను. కావాలని చెయ్యలేదు. చిన్న పిల్లలు కనిపించకుండా పోతే.. ఇక్కడ మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మీరు చాలా మంది దీనుల గాధలు వినే ఉంటారు. మీరే మా ఆశా దీపం.” సరస్వతి నొచ్చుకుంది మళ్లీ.
“ఫరవా లేదు మేడమ్. ఇంకో విషయమేమిటి.”
“అదే.. చిన్నా గురించి.” ఘొల్లుమని ఏడుపు లంకించుకున్నారు, నర్సమ్మా, సూరమ్మా.. చిన్నా పేరు వినగానే.
“టెన్ మినిట్స్ లో మళ్లీ చెయ్యనా? మీరు వారిని కొంచెం ఓదార్చండి.”
“ఫరవాలేదండీ. ఊరుకుంటారు. స్పెల్స్ వస్తుంటాయి అలాగే.” ఫోన్ చేతిలో పట్టుకుని బుల్లయ్య వాళ్లని అక్కడే ఉంచి, తను లోపలికెళ్లింది.
ఒక్క క్షణం ఆలోచించింది సరస్వతి, చిన్నా సంగతి చెప్పాలా వద్దా అని.
తన పరిస్థితిని ఉపయోగించుకుంటున్నాడేమో చిన్నా.. చెప్పి చెడగొట్టినట్లవుతుందా? ఏదేమైనా, ఆలీగారే దిక్కు. తప్పదు. వాళ్లుకూడా చిన్నా తెలివిని వాడుకోవచ్చు.
“హలో.. ఉన్నారా మేడమ్?”
“హా.. అదే సర్. చిన్నాకి బై బర్త్ ప్రాబ్లమ్ ఉంది. వాడు మరుగుజ్జు. లిటిల్ పర్సన్. ఎంత పెద్దయినా ఇంకో మూడు నాలుగంగుళాల కంటే పెరగడు. ఇప్పుడు వాడికి ట్వెల్వ్ ఇయర్స్. సెవెన్త్ చదువుతున్నాడు. టింకూకి ఆరేళ్లు. ఇద్దరూ చూట్టానికి కవలల్లా ఉంటారు.”
అవతల మౌనం. అందరూ షాక్ తిన్నట్లు ఊరుకుండి పోయారు.
“సర్.. నే చెప్పింది వినిపించిందా?”
“యస్ మేడమ్. ఈ విషయం నా సందేహాలన్నింటినీ తీర్చేసింది. చిన్నాని మళ్లీ చూడగలిగితే, ఈ సంగతి గుర్తు పెట్టుకుంటాను.”
ఆలీ మనసులోనే ఒక ప్రణాలిక వేసుకుంటున్నాడు అప్పుడే.
“అడ్రస్ తెలుసా?”
“ప్చ్.. తెలీదు. వాళ్లు బైటి వారిని రానియ్యరు. చాలా సీక్రెట్ గా నడుపుతారు వ్యవహారం. అందరినీ ఫామ్స్ లో ఉంచుతారు. అటువంటి ఫామ్స్ చాలా ఉన్నాయి. అదే ప్రాబ్లం.”
“అయ్యో! మరి కలవగలరో లేదో?” సరస్వతి విచారించింది.
“ఇంక సిక్స్ డేస్ లో రేసులున్నాయి. చిన్నా మంచి జాకీ అని ట్రైనర్ ఛీఫ్ చెప్పాడు. ఆ రేసులకి చిన్నాని తప్పక తీసుకొస్తారు. ఈ విధంగా చిన్నానీ, మిమ్మల్నీ కలిపిన అల్లా.. అన్ని సంగతులూ చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. చిన్నానే కాదు, వీలైనంత మంది పిల్లలని చెర విడిపించాలి.”
ఆలీ, ఔజుబాల్లోని భయంకరమైన పరిస్థితుల గురించి చెప్పదల్చుకోలేదు.
అనవసరంగా దూరాన ఉన్నవారిని బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఏముండదు దాని వల్ల.
“సరే సర్. ఇంకేదైనా విశేషం జరుగుతే నాకు ఫోన్ చెయ్యండి ప్లీజ్.. ఎనీ టైమ్. మీకేదైనా చిన్నా గురించి సమాచారం కావాలంటే కూడా ఫోన్ చెయ్యచ్చు.” సరస్వతి భారంగా నిట్టూర్చింది.
సరస్వతి ఫోన్ లో మాట్లాడినదంతా బైటికొచ్చి, అక్కడ ఆత్రంగా చూస్తున్న వాళ్లకి వివరంగా చెప్పింది.
బుల్లయ్య వాళ్లు సగం సంతోషంగా, సగం విచారంగా.. నవ్వు ఏడుపుల మధ్య కాసేపు మాట్లాడి వెళ్లి పోయారు.
…………………

ఆలీ బృందానికి కాస్త ఆధారం దొరికినట్లయింది. సర్వే మానేశారు.
“ఔజూబాల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం లేదు. ఇంతకంటే పెద్ద తెలిసుకునేదేమీ ఉండదు.” ఆలీ చెప్పేశాడు. అందరూ యస్ అన్నారు.
డిన్నర్ కి వెళ్లే వరకూ సాగాయి చర్చలు.
యు.యన్.ఓ కి పరిస్థితులు వివరిస్తూ ఒక లెటర్ డ్రాఫ్ట్ చెయ్యాలని నిశ్చయించారు. సంస్థ రిజిస్ట్రేషన్ ఒకరు చూసుకుంటామన్నారు. అప్పటి వరకూ తమ హ్యూమన్ రైట్స్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థని సంప్రదించి, చిన్నావాళ్లని తమతో తీసుకు వెళ్లేలాగ ప్రయత్నం చేద్దామని నిశ్చయించారు.
“ఈ రేసుల్లోగా చిన్నా దొరుకుతే బాగుండును. ఒకరగంటైనా చాలు. మనకి బోలెడు సమాచారం దొరుకుతుంది.” ఫాతిమా అంది.
“హలీమ్ నంబర్ హోటల్ వాళ్ల దగ్గరుంటుందేమో? అడిగి చూద్దామా? జాకీలని ఇంటర్ వ్యూ చేస్తామంటే ఒప్పుకోవచ్చనుకుంటా.” ఒక అసిస్టెంట్ సలహా.
“ఊహూ.. ఫొటో కే ఒప్పుకోలేదు. వాళ్లకే తెలుసు, పసిపిల్లల్ని జాకీలుగా ఉంచడం తప్పని.” ఆలీ తల అడ్డంగా తిప్పేశాడు.
“రేపొక సారి, అతని ఫామ్ దగ్గరికి వెళ్లి చూద్దాం. బయటే వెయిట్ చేస్తే ఏమైనా ఛాన్స్ దొరకచ్చు. ఇప్పుడు రేసుల టైమ్ కదా. తప్పకుండా ప్రాక్టీస్ చేయిస్తారు.” ఫాతిమా ఆశగా అంది.
“ప్చ్.. ఆ ఫామ్ ల అడ్రస్ లు ఎక్కడా ఉండవు.. ఈ చుట్టు పక్కల ప్రైవేట్ రేస్ ట్రాక్స్ సర్వే చేద్దాం. అవి పబ్లిక్ గా అందరూ వెళ్లి చూసే లాగ ఉండచ్చు. సాధారణంగా రేసుల ముందు, ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తుఁటారు. హలీమ్ ఈ హోటల్ కొచ్చాడు కనుక, ఈ చుట్టు పక్కలే ఉంటుంది అతని ఫామ్.” ఆలీ అయిడియా ఇచ్చాడు.
“బాగుంది. అదే చేద్దాం. డిన్నర్ అయాక తొందరగా పడుక్కుందాం. లంచ్ పాక్ చేసుకుని పొద్దున్నే ఎడారిలో పడదాం.”
“ఇవీ దగ్గరలో ఉన్న రేస్ ట్రాక్స్.” అసిస్టెంట్ రోడ్ ప్లాన్ చూపించాడు. మరునాడు పొద్దున్న అందరూ, బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.
అక్కడే లంచ్ కూడా పాక్ చేసిమ్మని ఫాతిమా చెప్పింది.
“రెండేనా”
“అంతే ఉన్నాయి ఇక్కడికి దగ్గర్లో. యునైటెడ్ ఆరబ్ ఎమరైట్స్ లో మొత్తం 15 రేస్ ట్రాక్స్ ఉన్నాయి. అన్నీ సిటీల ఔట్ స్కర్ట్స్ లో ఉంటాయి. ఇప్పుడు జరగబోయే రేసులు, దుబాయ్, అల్ మరూమ్ ట్రాక్ లో. అక్కడ ప్రాక్టీస్ కి ఒప్పుకోరనుకుంటా. గ్రాండ్ రేసులకి తయారు చెయ్యాలి కదా! మనం దగ్గర్లో ఉన్న దాని దగ్గరకి వెళ్దాం. రేపు దూరంగా ఉన్న దానికి.. ట్రై చేద్దాం. మన లక్.”
“ఆ పిల్లల అదృష్టం ఎలా ఉందో? చూద్దాం.” అసిస్టెంట్ చెప్పిందానికి ఆలీ సరే అన్నాడు.
టైమ్ చూసుకున్నారు. ఎనిమిదయింది.
“టూ అవర్స్ లో బయలు దేరుదాం. ఈ లోగా స్పేడ్ వర్క్ చేసుకుందాం.”
రూమ్ కి వెళ్లగానే, ఫాతిమా, డ్రాఫ్ట్ రాయడానికి కూర్చుంది.
………………..

“అన్నా! మన పాస్ పోర్ట్ లన్నీ ఎక్కడుంచుతారో నీకు తెలుసా?” ఆలీ, సరస్వతితో మాట్లాడుతున్న సమయం లోనే అబ్బాస్ ని అడిగాడు చిన్నా.
ఇద్దరూ టివి రూమ్ లో కూర్చున్నారు. పిల్లలంతా వాళ్ల మధ్యాన్నం పనులు చెయ్యడానికి వెళ్లారు. చిన్నా లంచ్ అవుతూనే కిచెన్ శుభ్రం చేసి వచ్చేశాడు.
“పాస్ పోర్ట్ లా? అంటే?” వింతగా చూశాడు అబ్బాస్.
చిన్నాకి కళ్లనిండా నీళ్లు తిరిగాయి. ఏమీ తెలియని వయసులో వచ్చాడు అబ్బాస్. నజీర్, హలీమ్, ఔజుబా, పిల్లలు తప్ప ఇంకో లోకం తెలియదు. టివీ కూడా చిన్నా వచ్చాకే చూడటం మొదలు పెట్టాడు.
పాస్ పోర్ట్ అంటే, వీసా అంటే ఏమిటో వివరించాడు చిన్నా.
“చిన్న చిన్న పుస్తకాలు. అట్ట మీది అశోక చక్రం ఉంటుంది. అవి ఉంటే కానీ మనం ఈ దేశం వదిలి వెళ్లలేము. మిగిలిన అందరికీ కూడా వాళ్ల దేశాల ముద్రలుంటాయి.”
“నజీర్ బాగా తాగి పడుక్కున్నపుడు వెతుకుతా. వాడి దగ్గరే ఉంటాయి.”
“వాడింట్లో ఎవరెవరుంటారు?” చిన్నా అడిగాడు.
“వాడొక్కడే.”
“అదేంటి? నో వైఫ్, నో కిడ్స్?”
“కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడుట. వీడి దెయ్యం చేష్టలు భరించలేక పారిపోయిందిట.” అబ్బాస్ కసిగా అన్నాడు.
“ఒక్కడే ఉంటాడా? మరి ఎందుకా కక్కుర్తి? మంచి తిండి పెట్టి పిల్లలని బాగా చూసుకోవచ్చు కదా? ఆ రాక్షసత్వం ఎందుకు?” చిన్నా బాధగా చూశాడు.
“అదంతే. వాడి నేచర్. ఎవరూ మార్చ లేరు.”
“పాస్ పోర్ట్ లు దొరుకుతే మాత్రం, నీది నాది, టింకూది తీసుకొచ్చెయ్యి. నజీర్ అంకుల్ లెక్క పెట్టుకుంటాడా?”
“అంత పట్టించుకుంటాడని అనుకోను. ఎప్పటి నుంచో అందరివీ ఉండే ఉంటాయి కదా! పైగా ఇప్పటి వరకూ వాటి జోలికి ఎవరైనా వెళ్లారా అనేది అనుమానమే. చూద్దాం.. మన లక్ ఎలా ఉందో!” అబ్బాస్ కొంచెం విచారంగా అన్నాడు.
“ఫరవాలేదన్నా! మనం తప్పక తప్పించుకుంటాం. నాకు నమ్మకం ఉంది. మనం ఇందాకా కలిసిన ఆ ఫారినర్ మనకి సాయం చేస్తాడని నాకు ఎందుకో అనిపిస్తోంది. అసలు అందుకే మనల్ని ఒంటెల స్విమ్మింగ్ కి తీసుకెళ్లారేమో! మీ అల్లా, మా సాయి అలా ప్రోగ్రామింగ్ చేశారేమో?” చిన్నా కంఠంలో ఉత్సాహం.
“చూద్దాం. వాళ్లు అలా చేసుంటే, ఇవేళ ఎలుగుబంటి, వాడింటికి నన్ను తీసుకెళ్లాలి, వాడు బాగా తాగాలి, నాకు పాస్ పోర్ట్ లు దొరకాలి. అప్పుడు ఏదైనా జరుగుతుందని నమ్ముతాను.”
“అంతే.. అలా ఒకదాంట్లో ఒకటి తమాషాగా అమరిపోతాయి. చూస్తుండు. నువ్వు మాత్రం ఎక్కడా, ఏమాత్రం లీక్ చెయ్యకూడదు. ప్రామిస్?” చిన్నా చెయ్యి చాపాడు.
ఆ చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకున్నాడు అబ్బాస్.
“ఎందుకంటానురా? ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా ఎవరి దగ్గరా ఏం మాట్లాడను. అల్లా నాకొక కొత్త జీవితం ఇస్తే అంతే చాలు.”
“అన్నట్లు మా సాయి ఎప్పుడూ ‘అల్లా మాలిక్’ అంటుంటాడు. నువ్వు సాయిని కూడా నమ్ముకో. తప్పక మన ప్రయత్నం ఓకే అవుతుంది.” చిన్నా భక్తిగా కళ్లు మూసుకుని అన్నాడు.
“ఆయనెలా ఉంటాడు? అల్లాలాగ రూపం ఉండదా? లేదా, మీ దేవుళ్లలాగా బొమ్మ ఉంటుందా?
సాయి నాధుడు కిందటి శతాబ్దంలో కూడా ఉన్నాడు కదా? ఆయన ఫొటోనే ఉంది. నేను బొమ్మ గీశాను. ఆ బొమ్మకే దణ్ణం పెట్టుకుంటా రోజూ.” చిన్నా పరుగెత్తి తన గదికి వెళ్లి, పెట్టె తెరిచి, పుస్తకం తీసుకొచ్చాడు.
అందులో మొదటి పేజీలోనే సాయిబాబా బొమ్మ గీశాడు చిన్నా.
రెండు చేతులూ జోడించి దణ్ణం ఎలా పెట్టుకోవాలో నేర్పించాడు అబ్బాస్ కి.
అప్పుడే నజీర్ లోపలికి వచ్చాడు పిల్లిలాగా నక్కి నక్కి.. అయినా అబ్బాస్ కనిపెట్టేశాడు.
దణ్ణం పెడుతున్న చేతులతో అలాగే ఒక్కటిచ్చాడు చిన్నా నెత్తి మీద అబ్బాస్. చూట్టానికి పెద్ద పంచ్ లాగుంది కానీ, పెద్ద దెబ్బేం తగల్లేదు.
“కిచెన్ లో సింక్ సరిగ్గా కడగలేదుటగా? షెఫ్ చెప్పారు. ఏదో జాకీ అయిపోయానని పనులు డుమ్మా కొట్టచ్చనుకున్నావా? నజీర్ అంకుల్ కి చెప్పి తోలు తీయిస్తా!”
చిన్నా కనిపెట్టేశాడు. తామిద్దరూ క్లోజ్ గా ఉంటున్నామని తెలియకూడదని.
లోపల సంతోషిస్తూనే, పైకి మొహం ఎర్రగా చేసుకుని, కెవ్వుమని కేక పెట్టాడు.
“అబ్బాస్. స్టాపిట్. ఈ రేసులయే వరకూ సమీర్ కి పని చెప్పద్దు. వాడి చేత బాగా ఎక్సర్ సైజులు చేయించు. అంతే..”
“యస్ బాస్. మీరు చెప్పారు కదా! అలాగే చేస్తా.”
“సమీర్! కిచెన్ లోకి వెల్లి టీ, బిస్కట్స్ తీసుకురా!” నజీర్ ఆర్డర్ వేశాడు.
చిన్నా పరుగెత్తాడు, వాడి పుస్తకం, నిక్కర్లో దోపేశాడు వెనుక..
“హా.. అబ్బాస్! ఇంటికెళ్దాం పద, టీ తాగి. ఇవేళ ఫీస్ట్ చేసుకోవాలి. హలీమ్ సాబ్ చిన్నాని, నయా రాకీని జాకీల కింద, మన ఒంటెలని రేసు లోకి తీసుకున్నారు. హాపీ.. ఈ సారి ఫస్ట్ ప్రైజ్ రావాలి మనకి. అందుకే సమీర్ని కొట్టొద్దన్నాను. బాడ్ గా ఫీల్ అవలేదుగా?”
“అబ్బే. అటువంటిదేం లేదు. ఎప్పుడు ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు కదా! నేనెందుకు ఫీల్ అవుతాను?” నజీర్ పెట్టబోయే హింస గుర్తుకొచ్చి కాళ్లు చేతులు వణకుతున్నా, పైకి నవ్వుతూ అన్నాడు అబ్బాస్.
ఒక రకంగా హాపీనే.. పాస్ పోర్ట్ ల సంగతి చూడచ్చు.
చిన్నా, ట్రేలో టీ, బిస్కట్లు తెచ్చాడు.
ఇద్దరికీ ఇచ్చి, తను చేతులు కట్టుకుని ఒక మూల నిలుచున్నాడు.
“అంకుల్! నేను బట్టలు తెచ్చుకుంటా. వన్ మినిట్.” అబ్బాస్ టీ తాగి పరుగెత్తాడు.
చిన్నా ట్రే లో కప్పులు పెట్టి తీసుకుని నెమ్మదిగా బైటికొచ్చాడు.
కిచెన్ కెళ్తుండగా, బొటన వేలు పైకి లేపి చూపించాడు అబ్బాస్.
“జాగ్రత్తన్నా! బి కేర్ఫుల్. రేపు నువ్వెలా వస్తావోనని భయంగా ఉంది. రాత్రి బాగా ప్రేయర్ చేస్తాను.” చిన్నా కళ్లనిండా నీళ్లతో అన్నాడు.
“ఎవర్నీ? మీ సాయి నేనా? కాస్త నన్ను చూసుకోమని రికమెండ్ చెయ్యి.”
“తప్పకుండా అన్నా!”
…………….
నజీర్ చాలా హుషారుగా ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం ఇద్దరు పిల్లలతో శ్రీలంక నుంచి ఎవరో తెచ్చి ఇచ్చిన విస్కీ సీసా బైటికి తీశాడు.
అబ్బాస్ వంటింట్లోకి వెళ్లి, నజీర్ కిష్టమైన ప్రాన్స్ వేపుడు చేశాడు. రెడీమేడ్ నూడుల్స్ పాకెట్లు కూడా తీసి, మైక్రోవేవ్ లో వేడి చేశాడు.
జీడిపప్పులు కూడా ఎక్కువగా వేయించాడు.
ఇటువంటి సంతోష సమయంలో అబ్బాస్ స్వేచ్ఛగా ఏదైనా తయారు చెయ్యచ్చు తినడానికి. తింటున్నామని తెలియకుండా, పొట్ట పగిలేలా తినగలిగేవి ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచించాడు అబ్బాస్.
వేరు సెనగ గుడ్లు, బియ్యం కలిపి ఉడికించి, బాగా వెన్న వేసి వేయించి, మసాలా చల్లాడు.
అరడజను గుడ్లు ఉడికించి వలిచి, ఉప్పు కారం చల్లాడు.
పళ్లాలలో అందంగా సర్దాడు. అన్నీ తీసుకొచ్చి, నజీర్ ముందు పెట్టాడు. అప్పటికే, నజీర్ స్నానం చేసొచ్చి, ఒక రౌండ్ పూర్తి చేశాడు.
“వెరీ గుడ్. కట్టుకున్న పెళ్లాం కంటే బాగా తయారు చేశావు. థాంక్స్. ఇట్రా.. ఇలా వచ్చి కూర్చో..” సోఫాలో తన పక్కన చోటు చూపించాడు.
“వస్తా.. వస్తా. నేను కూడా స్నానం చేసొస్తా.” అబ్బాస్, గ్లాసులో విస్కీ ఎక్కువ, సోడా తక్కువ వేసి, రెండు గ్లాసుల నిండా డ్రింక్ తయారుచేసి నజీర్ ముందు పెట్టాడు. మామూలుగా కంటే ఎక్కువ తాగాలి వీడు.
బాత్రూంలోకి వెళ్లి అరగంట పైగా టబ్ లో కూర్చున్నాడు.
ఏం చెయ్యాలి? ఆ జంతువు తనని హింసించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
చిన్నా చెప్పింది గుర్తుకొచ్చింది.. ప్రేయర్.
చకచకా స్నానం చేసి తయారయి, గదిలోకొచ్చి ఒకరగంట నమాజ్ చేశాడు. మనసంతా పెట్టి, తమ ప్రయత్నాన్ని సఫలం చెయ్యమని కోరుకున్నాడు.
ఆ తరువాత, ఎంతో ప్రశాంతంగా, శక్తి వచ్చినట్లుగా అనిపించింది. బుర్రంతా తేలిగ్గా అనిపించింది.
నెమ్మదిగా హాల్లోకి వచ్చాడు.
నజీర్ కళ్లు మూతలు పడుతున్నట్లు అనిపించాయి. సగం పైగా పళ్లాలు ఖాళీ అయ్యాయి. అబ్బాస్ కి అనుభవమే.. ఎక్కువ తాగితే మత్తుగా పడుక్కుంటాడు. కానీ, సాధారణంగా అతిగా తాగడు.
అబ్బాస్ గ్లాసు మళ్లీ నింపాడు.. ఈ సారి విస్కీ ఇంకా ఎక్కువగా వేసి.
పక్కన కూర్చుని, చేతులూ, తలా సున్నితంగా రాస్తూ, తనే తాగించాడు.. మధ్య మధ్యలో చేతికందినవి తినిపిస్తూ.
“ఇంక తినలేనురా.. పొట్ట పగిలి పోతోంది. నువ్వు దగ్గరగా రా.. నా పక్కన కూర్చో..” నజీర్ ముద్ద ముద్దగా అన్నాడు. అంటూనే అలా వాలిపోయాడు.
అబ్బాస్ ఏసీ కొద్దిగా పెంచి, రగ్గు తీసుకొచ్చి కప్పి.. లైట్ ఆర్పి, చిన్న లైట్ వేశాడు.
ఆకలి వేస్తోంది. ఎదురుగా ఎన్నో పదార్ధాలు.. ఆకలి మరింత పెంచేలా.
కానీ కర్తవ్యం ముందుకు తోసింది. తిండి ఎప్పుడైనా తినచ్చు.
నజీర్ ఇల్లు చిన్నదే. ఒక హాలు, పడగ్గది, వంటిల్లు.
వంటిల్లంతా అబ్బాస్ కి బాగా తెలుసు. అక్కడ ఉన్న కబ్బోర్డ్ లో గిన్నెలు ప్లేట్లే ఉంటాయి. ఒక ఫ్రిజ్, డిష్ వాషర్, గాస్ గట్టు. గట్టుకింద కాగితం ప్లేట్లు, కప్పులు. అక్కడేం స్టోర్ లేదు.
బెడ్ రూంలోనే ఉండాలి.
హాల్లోకి వెళ్లి చూశాడు. నజీర్ గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు.
అబ్బాస్ కి ఆకలి దంచేస్తోంది. గబగబా రెండు గుడ్లు, నాలుగు చెంచాలు నూడుల్స్ తినేసి, పళ్లాలన్నీ, వంటింట్లో పెట్టేశాడు.
బెడ్ రూంలోకి వెళ్లి, ఒక్కొక్క కప్ బోర్డూ తీసి చూడ్డం మొదలు పెట్టాడు. ఎక్కడా లేవు. సూట్ కేసుల్లాంటివి కూడా లేవు. అసలు ఉన్న సామాన్లే చాలా తక్కువ.
ఉన్నట్లుండి నీరసం, ఏడుపూ వచ్చేశాయి అబ్బాస్ కి. ఏదో మిరాకిల్ జరుగుతుందేమో.. బైట పడచ్చనుకున్నాడు. అబ్బే.. అల్లాకి అంత దయే ఉంటే, ఇలా ఎందుకు పుట్టిస్తాడు? ఏ షేక్కో మూడో పెళ్లాం కొడుగ్గా పుట్టించేవాడు.
నిరాశగా, నిస్పృహతో వెళ్లి, నజీర్ ఎద్దులా పడుక్కున్న సోఫా పక్కన కింద కూర్చున్నాడు.
కళ్లు మండి పోతున్నాయి. తను పడిన కష్టానికి, కనీసం నజీర్ మీద పడి కొరికెయ్య లేదు. ఇలా తాగిస్తే, పడి నిద్రపోతాడని కూడా తెలిసింది.
సోఫాకీ, గోడకీ మధ్యలో ఏదో నల్లగా కనిపించింది. నజీర్ ఎప్పుడూ అటుపక్కకి వెళ్లనియ్యడు.
అబ్బాస్ దూరి, ఏమిటా అని చూశాడు. నల్లటి సూట్కేస్. ఒంట్లో రక్తం సరసరా పాకుతున్నట్లు అనిపించింది. ఇందులోనే ఉండుంటాయి. కిందినుంచి లాగబోయాడు. రాలేదు. సోఫా కదుల్తేనే కానీ రాదు.
ఎలాగ? నజీర్ తెలివిగా ఉన్నాడంటే తియ్యడం అసాధ్యం.
ఇప్పుడే దీని అంతు చూడాలి.
చిన్నా చెప్పింది గుర్తుకొచ్చింది. చిన్నా కొలిచే దేముడ్ని తల్చుకున్నాడు. చిన్నా కూడా బైటపడాలంటే ఇదొక్కటే ఛాన్స్. “జై సాయినాధా!”
సోఫాని కొద్దిగా జరిపాడు, దడదడలాడుతున్న గుండెతో.
ఆశ్చర్యం.. చాలా సులువుగా జరిగి పోయింది. నజీర్ ఒక్క మూలుగు మూలిగి, పక్కకి తిరిగి పడుక్కున్నాడు, రైలింజన్లా గుర్రు పెడ్తూ.
నెమ్మదిగా సూట్కేస్ బైటికి లాగాడు. పెద్ద బ్రీఫ్ కేస్ లాగుంది. మూత తియ్య బోయాడు తెరుచుకో లేదు. అటూ ఇటూ తిప్పి చూశాడు.. తాళం వేసినట్టుంది.
హూ.. మళ్లీ నీరసం. మొహం మీది నుంచీ ధారగా చెమట కారిపోతోంది.. ఏసి ఉన్నా కూడా.
నెమ్మదిగా సూట్ కేసుని గదిలోకి పట్టుకు పోయాడు.
ఎలుగుబంటిగాడు తాళాలెక్కడ పెడ్తాడో.. చటుక్కున గుర్తుకొచ్చింది. జీపు తాళాల్లోనే ఇంటి తాళాలు కూడా ఉంటాయి. పిల్లిలా అడుగులు వేస్తూ సోఫా దగ్గరగా వెళ్లాడు. అక్కడ టీపాయ్ మీద పడున్నాయి.
క్షణం కూడా ఆలోచించకుండా, తీసుకెళ్లి తాళం తీశాడు. అబ్బాస్ మొహం విచ్చుకుంది సంతోషంతో.
పెట్టె నిండా డబ్బు. కొంత తీసేస్తే..
చెయ్యి వెనక్కి లాక్కున్నాడు అబ్బాస్. డబ్బు ముట్టుకుంటే పెట్టె తీసినట్లు తెలుస్తుంది. అయినా ఏం చేసుకుంటాడు ఆ డబ్బుతో? నజీర్ కి తెలీకుండా ఏం కొనగలడు?
అందులో డబ్బు తప్ప ఇంకేం కనిపించలేదు.
టెన్షన్ కి తల తిరుగుతున్నట్లనిపిస్తోంది అబ్బాస్ కి. నజీర్ లేస్తే తన్ని చంపెయ్యడం ఖాయం.
మూతదగ్గరో జిప్ కనిపించింది. చప్పున తెరవకుండా.. అల్లానీ, సాయినీ తలుచుకున్నాడు. నెమ్మదిగా జిప్ లాగాడు.
అందులో ఉన్నాయి.. పాస్ పోర్ట్ లు. రకరకాల దేశాలవి. చిన్నా బొమ్మగీసి చూపించాడు ఎలా ఉంటాయో. గుండె వేగం పెరిగింది. చకచకా వెతికి చిన్నా, టింకూలవి తీసుకున్నాడు. మరి తనది?
ఒక్కొక్కటీ తీసి, వెతకాలి. ఇండియావి తక్కువే ఉన్నాయి. ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాలు. మొత్తం యాభై పైగా ఉన్నాయి.
అమ్మయ్య కనిపించింది. చిన్నప్పటి ఫొటో. గుర్తుపట్టేట్లు లేదు. బుగ్గలూ అవీ.. పూర్తిగా వేరుగా ఉన్నాడు. చిన్నా దగ్గర అక్షరాలు, అంకెలు నేర్చుకోవడం మంచిదయింది. అందులో తన పేరు రాయడం నేర్పించాడు ముఖ్యంగా.
‘ అబ్బాస్’ పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం.. గుర్తున్నంత వరకూ సరిపోయింది.
అమ్మయ్య. తాము అనుకున్నది సాధించగలిగేట్లే ఉంది.
మూడు పాస్ పోర్ట్ లూ తీసి, తను విప్పేసిన బట్టల జేబుల్లో పెట్టేశాడు.
పెట్టె ఎలా ఉందో అలా సర్దేసి, సోఫా కిందికి తోసేసి, సోఫా జరిపేశాడు. నజీర్ ఇంకా గుర్రు పెడ్తూనే ఉన్నాడు.
అప్పుడు వేసింది విపరీతమైన ఆకలి.
లాభం లేదు. ఇంక అందినంత మటుకు తింటూ ఉండాలి. కుంచించుకు పోయిన పేగులకి తిండి హరాయించుకోవడం నేర్పాలి. పళ్లేల లో మిగిలినవన్నీ తినేశాడు.
జీవితం మీద ఆశ కలిగితే అలాగే ఉంటుంది. ఆలోచనా విధానం మారి పోతుంది.
తినేసాక ఎప్పుడు తెల్లారుతుందా అని చూడ సాగాడు.
………
“అబ్బాస్!”నజీర్ లేవగానే గట్టిగా ఓండ్ర పెట్టాడు.
“ఏమిటి అంకుల్” అబ్బాస్ వణుకుతూ వచ్చాడు. తెలిసి పోయిందా?
“తలా పగిలి పోతుందిరా. ఎదో ఒకటి చెయ్యి. రాత్రి బాగా ఎక్కువైనట్టుంది. నువ్వేనా ఆపక పోయావా?”
“ట్రై చేశానంకుల్! మీరు వినలేదు. అక్కడికీ సీసా తీసేసి దాచేశా. ఒక్క నిముషం..” అబ్బాస్ లోపలికెళ్లి స్ట్రాంగ్ గా కాఫీ చేసి తెచ్చాడు. అలమార్ లోంచి రెండు యాస్ప్రిన్ మాత్రలు, మంచి నీళ్లు ఇచ్చాడు.
అన్నీ మింగి మళ్లీ పడుక్కున్నాడు నజీర్.
అబ్బాస్ కూడా కాఫీ తాగి నాలుగు బ్రెడ్ ముక్కలు వేయించుకుని తిన్నాడు, మధ్యలో ఛీజ్ పెట్టుకుని. నజీర్ కి కూడా చేసి పెట్టి, తను స్నానం చేసి వచ్చాడు.
“దేవుడా! నీదే భారం.” శ్రద్ధగా నమాజ్ చేశాడు.
“అబ్బాస్! లే. వెళ్దాం. హలీమ్ సాబ్ రమ్మన్నాడు. ఇవేళ రేస్ ట్రాక్ ప్రాక్టీస్. హర్రీ అప్.”
“ఇదో, బ్రేక్ఫాస్ట్. తినేస్తే తల నొప్పి కూడా తగ్గుతుంది. హలీమ్ సాబ్ దగ్గరికి కద.. స్నానం చేసి వస్తే నయం.” నమాజ్ అయాక కళ్లు మూసుకుని కూర్చున్న అబ్బాస్ లేచి అన్నాడు. వాడికి ఏం చేస్తున్నాడో తెలియలేదు కానీ, అలా.. ధ్యానం లోకి వెళ్లి పోయాడు, అల్లాని తలుచుకుంటూ.
“ఓకే. అలాగే చేద్దాం.” ఇంకా స్తబ్దుగానే ఉన్న బుర్రని విదిల్చి, లేచి బాత్రూంలోకి వెళ్లాడు నజీర్.
అబ్బాస్ గబగబా లేచి, తన బట్టలన్నీ ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టేశాడు. పాస్ పోర్ట్ లు, జాగ్రత్తగా పైజామా జేబులో సర్ది, షర్ట్ మధ్యలో పెట్టాడు.
సోఫా కింద చూశాడు.. పెట్టె సరిగ్గా ఉందా అని.
నజీర్ బ్రేక్ ఫాస్ట్ పళ్లెం తెచ్చి టీ పాయ్ మీద పెట్టాడు.
“హాయిగా ఉందిరా. పద.. డ్రైవ్ చేస్తూ తింటా. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. వాళ్లే స్టేజ్ లో ఉన్నారో!” నజీర్ రెండంగల్లో ఇంటి బైటికి వచ్చాడు.

“ఈ ప్లాస్టిక్ కవరేంట్రా? ఒక బాక్ పాక్ కొంటా ఉండివేళ నీకు.” నలిగి పోయినట్లున్న ప్లాస్టిక్ కవర్, అందులో బట్టలు చూసి అన్నాడు నజీర్.
అబ్బాస్ గుండె వేగం పెరిగింది. అందులొ బట్టలు తీసి దులపడు కదా!
“థాంక్యూ అంకుల్. నిజంగా ఇవేళ కొంటారా?” పక్కకి వంగి, వాడి బుగ్గ మీద ముద్దు పెట్టాడు.. లోపల తిట్టుకుంటూనే.
నజీర్ మొహం వికసించింది. మూతి ఈ చివర్నుంచా చివరికి సాగ దీసి నవ్వాడు.
“నువ్వు నా జానూవి రా. ఎందుకు కొననూ?” చాలా మంచి మూడ్ లో ఉన్నాడు.
“ఓ..ఓ.. థాంక్యూ థాంక్యూ! పిల్లలు రెడీ గానే ఉంటారు. నిన్ననే అందరికీ చెప్పాను. మనం ఇంజన్ కూడా ఆఫ్ చెయ్యక్కర్లేదు. వచ్చేస్తారు.”
అబ్బాస్ వెయ్యో సారి అల్లాకి థాంక్స్ చెప్పుకున్నాడు.
బైట ప్రపంచం ఎలా ఉంటుందో?
గట్టిగా ఊపిరి పీల్చుకుని తన ఉద్వేగాన్ని ఆపుకుంటున్నాడు.
“ఈ బాగ్ లోపల పెట్టేసి పిల్లల్ని తీసుకొచ్చేస్తా. మీరిక్కడే ఉండండి అంకుల్” అబ్బాస్ ఔజుబా గేటు లోపలికి పరుగెత్తాడు..
“చిన్నా.. చిన్నా..” గట్టిగా అరుస్తూ వాళ్ల షెడ్ దగ్గరికి వెళ్లాడు.
చిన్నా, వెనుక మిగిలిన పిల్లలు బైటికొచ్చారు.
“అందరూ అక్కర్లేదు. మీరు ఇక్కడ పని చేసుకోండి. నయా రాకీని.. మరో ఐదుగురు పిల్లల్ని బైటున్న వాన్ దగ్గరికి వెళ్ల మన్నాడు. టింకూని కూడా..
“చిన్నా! నువ్వు లోపలికి రా..” చిన్నాని తీసుకెళ్లి తలుపు వేసి, పాస్ పోర్ట్ లిచ్చాడు.
“గ్రేట్ అన్నా! ఎలా ఉన్నావు? నా కెంత భయం వేసిందో తెలుసా?” చిన్నా అడుగుతూనే, తన సూట్ కేసులో, బట్టల మధ్య, ఒక షర్ట్ జేబులో జాగ్రత్తగా పెట్టాడు మూడు పాస్ పోర్ట్ లనీ.
“పద.. పద. బైట వాడు వెయిట్ చేస్తున్నాడు.”
“మరి.. దీనికి తాళం లేదు. ఫరవాలేదా?” చిన్నా బెదురుగా అడిగాడు.
“ఇన్ని రోజలూ ఎవరూ ముట్టుకోలేదుగా. ఇప్పుడు కొత్తగా తాళం వేస్తే అనుమానం వస్తుంది. ఎప్పట్లాగే, నాచురల్ గా ఉండాలి మనం. ఏదో దారి మీ, మా దేవుళ్లు చూపిస్తార్లే.” నమ్మకంగా అన్నాడు అబ్బాస్.
చిన్నాకి తెలుసు, పాస్ పోర్ట్ లని తనతో తీసికెళ్తే ఇంకా సమస్యవుతుందని.

ఆలీ బృందం నెత్తికి టోపీలు, తెల్లని తేలిక బట్టలు, కళ్లకి గాగుల్స్ తో బయలు దేరారు.
“సెల్స్ ఫుల్ ఛార్జ్ లో ఉన్నాయి కదా! అక్కడ వీలైతే మనం వీడీయోలు తీద్దాం.” ఆలీ తీసుకెళ్ల వలసిన సామాన్లు చెక్ చేసుకుంటూ అన్నాడు.
“నా దగ్గర టెలిస్కోపిక్ లెన్స్ ఉన్న చిన్న కామెరా ఉంది. తెస్తున్నా. మనం 200 యార్డ్స్ దూరం నుంచి తియ్యచ్చు. ఎక్కడైనా హైడింగ్ ప్లేస్ దొరుకుతే చూద్దాం.” అసిస్టెంట్-1 అన్నాడు.
“వెరీ గుడ్. మనం చేయ బోయేది మంచి పని. ప్రయత్నం చేద్దాం.” ఆలీ చకచకా వాన్ దగ్గరికి నడుస్తూ అన్నాడు.
ఆ రోజు ఏసి వాన్ తీసుకున్నారు. ట్రాక్ దగ్గర వెయిట్ చెయ్యాలని.
అక్కడ ప్రాక్టీస్ కొస్తారనేది అంతా ఊహ. లేక పోతే, దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంకొక ట్రాక్ కి వెళ్లాలి. ఎక్కడికైనా, ఏసి లేకుండా వెళ్లలేరని తెలిసి పోయింది.
“మరీ తొందరగా వెళ్తున్నామేమో!” ఫాతిమా అంది. వాన్ లో ముందు సీట్లో కూర్చుంటూ. అసిస్టెంట్-2 డ్రైవ్ చేస్తున్నాడు. మాప్ ఒళ్లో పెట్టుకుని ఫాతిమా గైడ్ చేస్తోంది.
“అవును. వాళ్లు అందరూ కలెక్ట్ అయి వచ్చేసరికి నూన్ అవచ్చు. నిన్న హోటల్ కి కూడా అదే టైమ్ కి వచ్చారు. ముందుగా వెళ్తే మనం మంచి స్పాట్ చూసుకోవచ్చు. వాళ్లకి కనిపించకుండా ఉండేట్లు. నిన్న హలీమ్ వ్యవహారం చూస్తే మనకి వెల్ కమ్ చెప్తాడని అనిపించట్లేదు.” ఆలీ నవ్వుతూ అన్నాడు.
రేస్ ట్రాక్ దగ్గర చాలా హడావుడిగా ఉంది.
ఆలీ బృందం జాగ్రత్తగా, చుట్టూ ఒక సారి తిరిగారు.
అంతా ఓపెన్ గ్రౌండ్. ఎక్కడా నీడ లేదు. ట్రాక్ మీద ఒక మూల షామియానా వేశారు. అక్కడే ఒంటెలని నిలబెడ్తారనిపించింది. కొంచెం దూరంలో కొన్ని షెడ్లు కనిపించాయి.
వాన్ అక్కడికి తీసుకెళ్లి దాని చుట్టూ తిప్పారు. షెడ్ల వెనుక ఆపుకోవడానికి వీలుగా ఉంది. కొన్ని తుప్పలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ట్రాక్ బాగా కనిపిస్తుంది.
ఫాతిమా దిగి, ఆ షెడ్లేమిటా అని చూసింది. బాత్రూములు. అన్ని షెడ్లూ ఏసీవే. ఈ ట్రాక్ లు కొన్ని గవర్న్ మెంట్ వి. కొన్ని ప్రైవేట్. ఔజుబాల స్థితులు అధ్వాన్నంగా ఉన్నా ఇక్కడ సదుపాయాలు బాగా ఉన్నాయనుకుంది ఫాతిమా.
“హే.. కమాన్. ఒంటెలు వస్తున్నాయి.” ఆలీ పిలిచాడు.
ఫాతిమా వాన్ ఎక్కేసింది.
ఒంటెలని షామియానా దగ్గరగా తీసుకొచ్చే లోగా, బుల్లి బుల్లి ఓపెన్ వాన్లు వచ్చి ఆగాయి. ఒక్కో వాన్ లోంచీ బిలబిలా పిల్లలు దిగారు.
ఆలీ సైగ చేసే లోగానే, అసిస్టెంట్ వీడియో తీస్తున్నాడు.
ఆ వేడిలో, టాపు లేని వాన్ లో.. అంతమంది పిల్లలు.
“ఓ మై గాడ్.” ఫాతిమా తల పట్టుకుంది.
పిల్లలంతా దిగాక, సెలెక్ట్ చేసిన పిల్లలని విడిగా తీసుకెళ్లారు. మిగిలిన వాళ్లు షామియానా దగ్గర ఒక పక్కగా కూర్చున్నారు.
“అడిగో చిన్నా.. పక్కనే వాడి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాళ్ల దగ్గరలో ఒకడు, నల్లగా పొడుగ్గా, కసుర్తూ.. వాడే ట్రైనర్ అనుకుంటా.” కామెరా లోంచి చూస్తున్న అసిస్టెంట్ అరిచాడు.
“అమ్మయ్య. ఇంకెక్కడా తిరక్కుండా దొరికారు. ఎలాగైనా చిన్నాని కలవాలి. ఆ తరువాత ఏం చెయ్యాలో డిసైడ్ చేద్దాం. మన దగ్గర చిన్న సెల్ ఫోన్ ఏదైనా ఉందా?” ఆలీ అడిగాడు.
“నా దగ్గర ఉంది. సింపుల్ ఫోన్. ఫుల్లీ ఛార్జ్ అయి. జాగ్రత్తగా వాడుకుంటే వారం రోజులొస్తుంది. వాళ్ల దగ్గర ఛార్జ్ చెయ్యడానికి ఉంటుందో లేదో.” ఫాతిమా తన బాగ్ చూపించింది.
మెచ్చుకుంటున్నట్లు చూశాడు ఆలీ.
“పిల్లలని ఎక్కిస్తున్నారు ఒంటెల మీదికి. చిన్నా ఎక్కాడు ఒక ఒంటె.” ఆపి ఆపి వీడియో తీస్తూ కామెంటరీ ఇస్తున్నాడు అసిస్టెంట్.
మిగిలిన వాళ్లకి విడిగా పిల్లలు కనిపించడం లేదు.
“మనం వాళ్లకి కనిపించం కద..”
“కనిపించం.” బాత్రూంలోంచి కర్ర చీపురు తీసుకొచ్చి, తుడుస్తున్నట్లుగా ముందునుంచి చుట్టూ తిరిగి వచ్చిన అసిస్టెంట్-1 అన్నాడు.
“ఐనా ఈ పొద వెనక పెడ్తే ఇంకా సేఫ్.” అక్కడున్న పొదని చూపించాడు.
ఆలీ ముందుకి వెనక్కి జరిపి పొద వెనుకగా పెట్టాడు వాన్ ని.
“మొదలవుతోంది ప్రాక్టీస్.” కామెంటేటర్ కమ్ ఫొటో గ్రాఫర్..
“వావ్.. ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో. సూపర్.నిజం చెప్పద్దూ బుల్లి జాకీలు భలే ముద్దుగా ఉన్నారు.” కామెరా ఇచ్చి ఒక్కొక్కళ్లకీ చూపించాడు అసిస్టెంట్.
“కానీ, వాళ్లు బాగా అరుస్తున్నట్లున్నారు కదా!” ఫాతిమా దీక్షగా చూస్తూ అంది.
“అవును. భయానికి అరుస్తున్నారనుకుంటా. లేదా.. అలా అరవమని చెప్తారో.. ఒంటెలకి కిక్ ఇవ్వడానికి.” ఆలీ పరిశీలనగా చూసాడు కాసేపు.
“చాలా డేంజరస్ గేమ్. ఆ బేబీస్ కి ఏమైనా ఐతే?” ఫాతిమా నిట్టూర్చింది.
“ఏముంది? ఎవరికీ వాళ్లు ఆన్సర్ చెప్పుకోనక్కర్లేదు. గప్ చుప్ అంతా.”
“అదిగో.. హలీమ్ వచ్చాడిప్పుడే. అయ్యో.. ఒక కుర్రాడు కింద పడిపోతున్నాడు. ఒంటె మీది నుంచి జారి పోయాడు. వెళ్దామా?”
“వద్దొద్దు. మనం మొత్తానికే ఈ అరాచకాన్ని ఆపాలి. ఇప్పుడు వెళ్తే ఇక్కడే ఆగపోతుంది.” ఆలీ నివారించాడు.
“అమ్మయ్య.. నిలదొక్కుకున్నాడు. పట్టు దొరికింది.”
ఒక అరగంట చూసేసరికి అందరికీ విసుగొచ్చింది.
వాన్లో కూర్చుని చర్చిస్తూ నోట్స్ రాసుకోసాగారు. ఆలీ టైమ్ చూశాడు.. గంట సేపయింది. చేతులు విరుచుకుని వాన్ దిగ బోయాడు.
షెడ్ల ముందు కలకలం..
తలుపు వేసేసి, కారు స్టార్ట్ చెయ్యమన్నాడు. ట్రైనీలో, ముధారీలో చూస్తే లేని పోని తంటా.
“అడుగో చిన్నా..” కేకేశాడు కామెంటేటర్.
చిన్నా, టింకూ చెయ్యి పట్టుకుని వస్తున్నాడు. టింకూ చేతికి గ్లోవ్స్. ట్రాక్ మీద పేడ ఎత్తడం వాడికి అలవాటై పోయింది.
నాలుగైదు ఫోటోలు, చిన్న వీడీయో క్లిప్పింగ్ తీసేశాడు అసిస్టెంట్.
టింకూని లోపలికి తీసుకెళ్లి, తను కూడా మొహం కడుక్కుని, బైటికొస్తుండగా, కిషన్ బృందం కలిశారు. కాసేపు కష్టాలు కలబోసుకుని బైటికొచ్చారు.
అబ్బాస్, నజీర్ ఇతర ట్రైనీలు ట్రాక్ దగ్గరే ఉన్నారు.. ఇంకా మిగిలిన బాచ్ లకి ప్రాక్టీస్ చేయిస్తూ.
“ఇక్కడేదో వాన్ ఉంది చిన్నా! మనల్ని ఎత్తుకు పోతారేమో పరుగెత్తుదాం.” టింకూ వార్నింగ్..
“మనల్ని..ఇక్కడ్నుంచెవరెత్తుకు పోతారు.. అదేదో చూద్దాం పద. ఎలుగు బంటి రావడానికి ఇంకా అరగంట ఉంది.” చిన్నా వాన్ దగ్గరికి దారి తీశాడు.
“చిన్నా! ఇట్రా..” ఆలీ ఆనందంగా అరిచాడు, వాన్ కిటికీలు తెరిచి.
ఇక్కడ తనని చిన్నా అని పిలిచే వాళ్లు..
సంభ్రమంగా చూస్తూ వెళ్లాడు.
“మీరా అంకుల్? మా టీచర్ తో మాట్లాడారా? మెస్సేజ్ ఇరేజ్ చెయ్యమన్నా కదా?” కాస్త నిష్ఠూరంగా, కాస్తంత సంతోషంగా అన్నాడు చిన్నా.

“చేశాను. కానీ, రిసీవ్ చేసుకున్న వాళ్లకి నంబర్ వెళ్తుంది కదా! వాళ్లూరుకో గలరా?” ఆలీ జరిగిందంతా చెప్పాడు.
టింకూ నోట్లో వేలేసుకుని చూస్తున్నాడు.. కొంచెం భయంతో, కొంచెం ఉల్లాసంతో. వాడికి బాగానే అర్ధమయింది.
“ఇంకా ఏమన్నారు అంకుల్? అమ్మతో, నాయనతో మాట్లాడారా? ఓ.. వాళ్లకి ఇంగ్లీష్ రాదు కదా! ” చిన్నా ఉత్సాహంగా గడగడా మాట్లాడ సాగాడు.
“ఎక్కువ సమయం లేదు. మనం ఏం చెయ్యాలో తొందరగా తేల్చాలి. నువ్వు ఎంత వరకూ మాకు సహాయం చెయ్యగలవో..” ఆలీ మాట సగంలో ఆపేశాడు చిన్నా.
“నేను మీకు సాయం చెయ్యడమేమిటంకుల్? మీరు కదా మమ్మల్ని తప్పిస్తారు” అయోమయంగా అడిగాడు చిన్నా.
“మీరు మాత్రం తప్పించుకుంటే సరి పోతుందా? మిగిలినవాళ్ల సంగతేంటి? వాళ్లని కూడా ఈ నరకం నుంచి తీసుకెళ్లాలి కదా? నీకు యు.యన్.ఓ తెలుసు కదా.. వాళ్ల ద్వారా ప్రయత్నించి అసలు ఈ పిల్ల జాకీల కాన్సెప్ట్ తీయించెయ్యాలి. దానికి నువ్వు మాకు కొన్ని ప్రూఫ్ లు సేకరించాలి. కొంత రిస్క్ ఉంటుంది. నీకిష్టమేనా?”
“మీకు నా సంగతి టీచర్ చెప్పారా?” చిన్నా అడిగాడు ఆలీని.
ఆలీ తలూపాడు.
“అంటే నేను మీకు ఏజంట్ కింద పని చెయ్యాలా?”
వాన్ లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. ఎవరేనా వస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తున్న అసిస్టెంట్ కూడా తల తిప్పి కనుబొమ్మలెగరేశాడు.
చిన్నాని చూస్తూ వాడి మాటలు వింటున్న వారికి ఆశ్చర్యం కలుగక మానదు.
“అలాగే. మన ప్రాజక్ట్ కి పనికొచ్చే ఇంకొక అబ్బాయిని కూడా మీకు పరిచయం చేస్తాను.. నాకంటే కొంచెం పెద్ద, ఎక్కువ సఫరింగ్, ట్రైనర్ తో ఎక్కువ క్లోజ్. అతన్ని కూడా మాతో తప్పించాలి మరి.” చిన్నా ఏదో పెద్ద వాళ్లలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవడం మానేశారు అందరూ. సరస్వతీ టీచర్ చెప్పింది అక్షరాలా నిజం అనుకుంటూ.
“ఆ అబ్బాయిని నమ్మచ్చా?” ఫాతిమా అడిగింది.
“హండ్రెడ్ పర్సంట్.” అబ్బాస్ చేసిన పనులన్నీ చెప్పాడు చిన్నా.
“వెరీ గుడ్. మన పని అంత కష్టం లేకుండా జరిగి పోయేట్లే ఉంది. ఐతే.. మీ పాస్పోర్ట్ లు మీదగ్గరున్నాయా?” నమ్మలేనట్లు అడిగాడు ఆలీ.
“జస్ట్.. ఇవేళ పొద్దున్నే తెచ్చాడు అబ్బాస్. నా పెట్టెలో బట్టల మధ్య దాచాను. సూదీ దారం ఉంటే, ఒక షర్ట్ వెనుక కుట్టేయాలి. అప్పుడు బట్టలు దులిపినా కనిపించవు.”
కళ్లు పెద్దవి చేసి విన్నారు అక్కడున్న నలుగురు పెద్ద వాళ్లూ.
“నాకు కుట్టడం వచ్చు. మా మోరల్ టీచర్ నేర్పించారు.” సన్నగా అన్నాడు టింకూ ఇంగ్లీష్ లో. వాడికి ఇంగ్లీష్ మాట్లాడ్డం నేర్పించాడు చిన్నా. వాడి తల నిమిరింది ఫాతిమా ఆప్యాయంగా.
“మళ్లీ ఇక్కడికి వస్తారా ప్రాక్టీస్ కి?” ఆలీ అడిగాడు.
“రోజూ తీసుకొస్తారు. ఈ రేసులు చాలా ప్రిస్టీజియస్ ట. ఎలాగైనా గెలవాలని.”
“ఎవరో వస్తున్నారు, పిల్లల్ని తీసుకుని.” అసిస్టెంట్ వార్నింగ్..
“సరే, ఈ ఫోన్ నీ దగ్గరుంచు. మా నంబర్లు ఫీడ్ చేసి పెట్టాను. రేపు నీడిల్, త్రెడ్ తెస్తాను. మిమ్మల్ని ఎవరూ చెక్ చెయ్యరుగా?” ఫాతిమా బాగ్ లోంచి సెల్ తీసింది. అది చిన్నా అరచేతిలో ఇమిడి పోయింది.
“ఇప్పటివరకూ చెయ్యలేదు. ఇక్కడ మమ్మల్నెవరు కలుస్తారులే అని. రేపు అబ్బాస్ తో ఏదో ప్లాన్ వేసి మీరు కలిసేట్లు చేస్తాను.”
కలకలం దగ్గరౌతుంటే, చిన్నా, టింకూ బాత్రూంల లోకి వెళ్లి పోయారు.
“ఓ మై గాడ్.. వీడు పిల్లాడా పిడుగా?”
“దేవుడు పంపిన దూత.” ఫాతిమా అంది.

వచ్చే నెలలోనే ముగింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *