తపోముద్రల వెనుక

రచన: రామా చంద్రమౌళి

తలుపులు మూసి ఉంటాయి
కొన్నిసార్లు తలుపులు మూసివేయబడ్తాయి
మూసినా, మూసివేయబడ్డా
వెనుకా, లోపలా గోప్యంగా ఉన్నది ఏమిటన్నదే ప్రశ్న –
ముందు ఒక ఛాతీ ఉంటుంది
వెనుక ఒక గుండెనో, ఒక హృదయమో ఉంటుందని తెలుస్తుంది
అరే .. ఒక నది తనను తాను విప్పుకుని
అలలు అలలుగా ప్రవాహమై వికసిస్తున్నపుడు
భరించగలవా నువ్వు జలసౌందర్య బీభత్సమధురాకృతిని
ప్రశాంతత నీలిమేఘాల వెనుకనో
తపోముద్రల వెనుక విలీనతలోనో
అప్పుడే వికసిస్తున్న పువ్వు ముఖంలోనో
ఉంటుందనుకోవడం భ్రమ –
శాంతత ఎప్పుడూ మరణంతో యుద్ధంచేస్తున్న
సమరాంగణ నాభికేంద్రకంలో ఊంటుంది
శోధించాలి నువ్వు
పిడికెడు మట్టినీ,
కొన్ని తడి ఇసుకలోని చరణముద్రలనూ,
పాత నగరాల్లోని పాకురుగోడలపై
ఎండిపోయిన దుఃఖపు మరకలనూ,
పురాతన హవేలీలలో
నిశ్శబ్దంగా వినిపిస్తున్న కాలిగజ్జెల ‘ వహ్వా వహ్వా ‘ లనూ-

మనుషులు సమూహాలుగా, జ్ఞాపకాలుగా స్మృతులుగా వెళ్ళిపోతున్నపుడు
ఇక ఇప్పుడు ఈ ఋణావశేషాలపై విశ్లేషణలెందుకు
మృదంగనాదాలూ, సారంగీ విషాద స్వరాలూ
అన్నీ అశృనివేదనలే వినిపిస్తాయి … కాని
తడి సాంబ్రాణి పొగలూ, గులాబీ పరిమళాలూ
ఎగిరిపోతున్న పావురాల రెక్కల్లో కలిసి
దిగంతాల్లోకి అదృశ్యమైపోయి శతాబ్దాలు గడిచిపోయాక
ఇప్పుడిక
నువ్వు తలుపులకేసి తలను బాదుకుంటే ఏం లాభం –
ఇంతకూ
నువ్వు తలను ఛిద్రం చేసుకునేది
లోపలినుండి బయటికి రావడానికా
బైటినుండి లోపలికి నిష్క్రమించడానికా-

1 thought on “తపోముద్రల వెనుక

  1. మంచి తాత్వికమైన కవిత. చాలా బాగుంది.
    రమేష్ రాచర్ల,హైదరాబాద్

Leave a Comment