March 29, 2024

కౌండిన్య హాస్యకథలు – కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి

రచన: రమేశ్ కలవల

ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతం తెచ్చిన వైనతేయుడిలా డిస్ట్రిబ్యూటర్లతో పోరాడి డబ్బులు కట్టల బ్యాగు అచ్యుతరావుగారికి అందించాడు పక్కిసామి. సినిమా ప్రొడ్యూసర్ అచ్యుతరావు గారికి ఎక్కడకైనా వెళ్ళేటపుడు పక్కిసామి పక్కన ఉండి తీరాల్సిందే. పక్కిసామి ఎన్ని డబ్బులు కట్టలు బ్యాగులలో మోసుకొచ్చిన ఒక్కసారి కూడా లోపలకు కన్నేసి కూడా చూడడు. నిస్వార్థపరుడు, అచ్యుత రావు గారి మీద గౌరవం అలాంటిది.
అచ్యుతరావుగారు ఆ అందించిన బ్యాగులోంచి డబ్బుల కట్టలు తీసి తను పడుకునే పరుపు కింద పరిచి, ఇక మిగిలినవి తలకింద ఎత్తుగా ఉండేలా పెట్టబోతున్నాడు. ఆయన భార్యా ఆ ధనాన్ని చూస్తూ మురిసిపోతోంది. ఇంతలో స్రిప్టురైటర్ మునీస్వర్రావు ఇంట్లో పనబ్బాయిలు వద్దంటున్నా కథ ఇప్పుడే ప్రొడ్యూసర్ గారికి వినిపించాలంటూ దూసుకొని లోపలకు వచ్చాడు. ఆ అలజడి విని మిగిలిన డబ్బుల బ్యాగు దిండులా తలకింద పెట్టి పడుకున్నాడు అచ్యుతరావు గారు.
“సార్ ని వద్దన్నా లోపలకు వచ్చారు” అన్నాడొకడు. “నేను ఆయనను చేత్తో అడ్డుకొంటే సారు కరవబోయాడు” అన్నాడు రెండో పనివాడు. విష్ణుమూర్తి దగ్గరకు రావడటానికి నారదుడికి పర్మిషన్ కావాలా అన్నట్లుగా మొహం పెట్టాడు ఆ స్రిప్టు రైటర్. ఫర్వాలేదు అన్నట్లుగా ఆ ప్రొడ్యూసర్ గారు సైగలు చేయగానే ఆ ఇద్దరూ ద్వారపాలకులు జయ, విజయులు బయలుదేరారు. అచ్యుతరావు గారు ఆ పరిచిన డబ్బుల కట్టల శేష తల్పం మీద పడుకున్న విష్ణుమూర్తి లాగా గోచరిస్తున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర వాళ్ళ ఆవిడ లక్ష్మిదేవి లాగా, స్రిప్టు రైటర్ ఆ శ్రీమన్నారాయణుడికి లోకం సంగతులు వివరించటానికి వచ్చిన నారదుడిలా వినయంగా వొంగి నించున్నాడు. మొత్తానికి ఆ గది వైకుంఠంలా ఉంది.
“మంచి స్క్రిప్టు సార్.. కొత్త లవ్ స్టోరీ” అన్నాడు మునీస్వర్రావు. “నువ్వు అలానే అంటావు” అన్నారు అచ్యుతరావు గారు. పక్కిసామిని పిలిచాడు. ఏ కథైనా పక్కిసామి ఓకే అంటేనే అచ్యుతరావు గారు ఓకే చేసేది. పక్కిసామి వచ్చి పక్కన నించున్నాడు, అచ్యుతరావు గారు “సరే వినిపించు” అన్నారు, తన భార్య వైపుకు చూసి సైగలు చేసాడు ఆవిడ కాళ్ళు వత్తడం మొదలుపెట్టింది.
మనసులో నారాయణ మంత్రం స్మరించిన వాడిలా కళ్ళు మూసుకొని తన ఇష్ట దైవాన్ని ప్రార్థించి దీంట్లో హీరోయిన్ పేరు “రుక్కు” అన్నాడు. ఆ హీరోయిన్ కాళ్ళు చిగురాకుల్లా మృదువుగా లేతగా ఉంటాయు.. ఆమె చేతులు.. అనగానే ఆ ప్రొడ్యూసర్ గారు “పాతకాలం ప్రబంధాలలో లాగా వర్ణించక్కర్లేదు” అన్నాడు. “అదికాదండి ఆవిడ ఎలా ఉంటుందో చెప్పాలి కదా? రచయితకు వర్ణనే ముఖ్యం కదండి” అన్నాడు. “నాకు అర్థమయ్యింది హీరోయిన్ ఎలా ఉండాలో, నువ్వు కానివ్వు” అన్నారు అచ్యుత రావుగారు. దీంట్లో విలన్ పాలబాబు. వాళ్ళ నాన్న పెద్ద పాల డైరీ ఓనరు అంటూ సన్నివేశం చెబుతున్నాడు.
పాలబాబు వాట్సాప్ లో రుక్ కు మెసేజ్ పంపిస్తాడు. వెడ్డింగ్ కార్డు డిజైన్ ఎలా ఉంది? అని అడుగుతాడు. తను మెసేజ్ చదివిందో లేదోనని ఓ పది సార్లు ఇన్ఫర్మేషన్ నొక్కి మొత్తానికి చదివిందని తెలుసుకొని “టైపింగ్” అన్న స్టేటస్ చూసి తెగ మురిసిపోతాడు. ఇంతలో రుక్ ఓ ఎర్రటి మొహం ఎమోజీ పంపి, కార్డు డిజైన్ ఒకే బట్ వరుడు నాట్ ఓకే, నా పెళ్ళి నీతో జరగదు అంటూ “రుక్ జోస్యం” చెబుతుంది. పాలబాబు ఓ స్మైల్ పంపుతాడు. ఇది మొదటి సన్నివేశం అని ఆగాడు. “ ఇంతకీ హీరో ఎవరు “ అని అడిగారు అచ్యుతరావు గారు. “అక్కడికే వస్తున్నాను సార్” అన్నాడు మునీస్వర్రావు. రుక్ కు పదేళ్ళ వయసులోనే వాళ్ళ నాన్న గారు మొబైల్ ఫోను కొని ఇస్తారు. సంవత్సరం తిరగగానే రుక్ కు కళ్ళద్దాలు వస్తాయి.
. “అంటే హీరోయిన్ కళ్ళద్దాలు పెట్టుకుంటుందా?” అని అడిగారు అచ్యుతరావు.
“కళ్ళద్దాలు చిన్నప్పుడు వేసే కారెక్టర్లో పెట్టుకుట్టుందండి, అయినా హీరోయిన్ కళ్ళద్దాలుంటే తప్పేంటండి” అంటూ
రుక్ ఆన్లైన్ లో ఓ రాణిలాగా చలామణి అవుతూ ఉంటుంది. పాతకాలంలో చెలికత్తెలు రాణి గారిని పొగుడుతుంటారే అలాగే ఆన్లైన్ల వాళ్ళు స్నేహితులు పొగుడ్తూ, మంచి కామెంట్స్ చేయడం వల్ల ఆహ్లాదంగా ఉండి అందంగా తయారవుతూ ఉంటుంది. ఆన్లైన్ స్నేహితులే ఆమెకు బలం. రుక్ ఆన్లైన్ లో అందరి ప్రొఫైల్ చూస్తూ ఒక సారి ఒకతను గురించి వింటుంది. అతని ప్రొఫైల్ కు వెళ్ళి అతని గురించి, చిన్నప్పటి నుండి చేసే చేష్ఠలు అన్నీ చదువుతుంది. అతనంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుంది. అతనే మన సినిమాలో హీరో అన్నాడు.
ఆ హీరో చిన్నప్పుడు వాళ్ళ ఉర్లో చదువుకోనేటప్పుడు పాకెట్ మనీ కోసం అందరి ఇళ్ళకీ వేసే పాల ప్యాకెట్లు ఉద్యోగం సంపాదిస్తాడు. హీరోకు ఆ డైరీలో పాలు, పెరుగు లాంటివి భలే ఇష్టం. ఒక్కోసారి తనే పాలు తాగేసేసి, పెరుగు తినేసి ఖాళీ కవర్లు ఇంటి బయట పడేసి వెళ్ళిపోతుంటాడు. ఇలా రోజూ ఆకతాయి పనులు చేస్తుంటే అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఏమీ లాభం లేకపోయింది. కొంతమంది తింటే తిన్నాడులే అని వదిలేసేవాళ్ళు. ఇలా ఊళ్ళో అందరిళ్ళకూ వెళ్ళడం వల్ల అతని గురించి అందరికీ తెలుస్తుంది. హీరో అంటే అందరికీ విపరీతమైన ప్రేమ కూడా పెరుగుతుంది. అలాగే ఓ రోజు ఊర్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే ఓ పెద్ద పాము వస్తే హీరో పిల్లలను రక్షిస్తాడు, పాముతో భయం లేకుండా ఆడుకుంటాడు , అది తెలిసి ఊర్లో అందరూ హీరో ఎంతో ఎత్తుకు ఎదిగి ఊరికి ఉపయోగపడతాడని అందరూ అంటారు. ఇలా బోలేడు సన్నివేశాలు హీరోలో హీరోయిజం చూపించేలా ఉంటాయి.
“ఎక్కడో విన్న కథ లాగా ఉందయ్యా!” అన్నారు అచ్యుత రావు గారు.
“అన్నీ అలానే ఉంటాయండి. పాత కథైనా కొత్తదనంగా చెప్పడంలో, సినిమా తీయడంలో ఉంటుంది. ఇదిగోండి ఇంకో మంచి సన్నివేశం చెబుతాను వినండి. ఇదీ కథకు టర్నింగ్ పాయింట్,” అన్నాడు మునీస్వర్రావు.
ఈ సన్నివేశంలో హీరోకి పాలబాబుకి పెద్ద ఫైట్ అవుతుంది. పాలబాబు “బ్రతికుంటే మా నాన్న చేసిన బజ్జీలు తినైనా బ్రతుకుతా గానీ నాకు ఈ డైరీ వద్దూ, ఈ పెళ్ళి వద్దూ బాబోయ్” అని పరిగెడుతుంటాడు. చిరుతలా వెనక పరిగెడుతున్న హీరో ఆడియన్స్ వైపుకు మొహం తిప్పుతాడు ఇక్కడ ఇంటర్వల్” అన్నాడు.
“అదేంటంది! హీరో పాలబాబును ఎందుకు కొడతాడు?” అని అడిగాడు అచ్యుతరావుగారు.
“అది ప్రేక్షకులకు చివరలో తెలుస్తుంది” అంటూ
సెకండ్ హాఫ్ లో సినిమా మొదలవ్వగానే పాలబాబు నాన్న ఆ పాల డైరీ ముందు మిరపకాయల బజ్జీ కొట్టులో బజ్జీలు వేస్తుంటాడు. ఇది పాలబాబు ఫ్లాష్ బ్యాక్.
“బజ్జీ కొట్టేంటి? అంటే ఆ పాల డైరీ పాలబాబు నాన్నది కాదా?” అని అడిగింది అచ్యుతరావుగారి భార్య.
“అప్పట్లో రైతులు వాళ్ళింట్లో పితికిన పాలు డైరీలో ఇచ్చి బయట ఉన్న బజ్జీ కొట్లో బజ్జీలు తినడమే కాకుండా చిన్న మొత్తాల అప్పులు చేస్తుంటారు” చిన్న మొత్తాలు పెద్దవై గోరు కొండంతలవ్వగా, పాలబాబు నాన్నకు ఎన్నాళ్ళు ఈ మిరపకాయ బజ్జీలు చిన్న బిజినెస్ చేయాలి? ఛీ.. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి అనుకొని రైతులతో కుమ్మక్కై డైరీ కే ఎసరు పెడతాడు. అదేసమయంలో పిల్లవాడు పుట్టడం, వాడు పుట్టినందువల్ల అదే సమయంలో డైరీ చేజిక్కినందువల్ల చాలా అదృష్టం కలిసివచ్చిందని “పాలబాబు” అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. బజ్జీలో కల్తీ నూనె వాడినట్లు డైరీలో కల్తీ చేయడం వల్ల ఊర్లో అందరూ కలత చెందుతుంటారు. ఏదో రోజు మన కథ హీరో పెద్దయిన తరువాత వఆయన బట్టతల మీద మొట్టికాయ కొట్టకపోతాడా అని అందరూ ఎదురు చూస్తుంటారు. మంచి టేస్టుకు అలవాటైన హీరోకు ఆ డైరీ వేరే వాళ్ళ పాలయ్యిందని, టేస్టు లో తేడా గమనించి మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.అటూ పాలబాబు, ఇటు హీరో, మరో వైపు రుక్ పెరిగి పెద్దవాళ్ళవుతుంటారు అన్నాడు స్క్రిప్టు రైటర్.
“హీరోకి పేరు లేదా?” అన్నాడు.
“అంటే మీ అబ్బాయి పేరే హీరోకి పెడదామని అనుకున్నాను, మిమ్మల్ని ముందు అడిగి” అన్నాడు స్క్రిప్టు రైటర్ అచ్యుతరావు గారితో.
“క్రిష్, చాలా బావుంటుంది” అన్నాడు వాళ్ళావిడ వైపుకు చూసి ఆ ప్రొడ్యూసర్.
“ఇంతకీ క్రిష్ ఆ పాలబాబు ను ఎందుకు కొడతాడు” అని అడుగుతాడు అచ్యుతరావు గారు టెన్షన్ తట్టుకోలేక అదీకాక వాళ్ళబ్బాయి హీరో లాగా ఫీల్ అవుతూ.
“రుక్ కు వెడ్డింగ్ కార్డు పంపగానే ఇంక ఏం చేయాలో తెలీక వాళ్ళ అంకులును పంపి ఎలాగైనా క్రిష్ ను కలిసి తన గురించి చెప్పి తన పర్సనల్ వాట్సాప్ నెంబరు అర్జెంటుగా తీసుకురమ్మని కబురు పంపుతుంది.
పెళ్ళి ఇంక ఓ వారంలో పడుతుంది ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఆ అంకుల్ మొత్తానికి కలిసి రుక్ గురించి చెబుతాడు.
క్రిష్ కూడా రుక్ ది ఇంటరెస్టింగ్ కారెక్టర్ లాగా ఉంది అనుకోని తన ఆన్లైన్లో తన ప్రోఫైల్ చూస్తాడు. చూడగానే లవ్ ఎట ఫస్ట్ సైట్ లాగా రుక్ అంటే అభిమానం పెంచుకుంటాడు. కానీ రుక్ కు అన్నయ్య ఉన్నాడని అతని ప్రోఫైల్ ద్వారా తెలుసుకొని, చెల్లెలు విషయంలో తేడాలు వస్తే ఊరుకోడని జాగ్రత్తపడాలనుకుంటాడు. అయినా సరే రిస్క్ తీసుకోవడానికి సిద్దపడతాడు క్రిష్.
రుక్ కు వాళ్ళ అంకుల్ దగ్గరనుండి కొన్ని రోజుల వరకూ ఏ విధమైన మెసేజ్ రాకపోయేసరికే కంగారు పడుతూ తన ప్రొఫైల్ పిక్చర్ అరగంటకు మారుస్తూ, క్రిష్ పాత పోస్టు వెతికి మరీ లైకులు కొడుతూ ఉంటుంది. వాళ్ళ ఆన్లైన్ ఫ్రెండ్స్ కు మెసేజులకు రిప్లై కూడా ఇవ్వకుండా కూర్చొని దిగులుగా ఉంటుంది.
పెళ్ళి రేపు అనగా వాళ్ళ అంకుల్ తిరిగి వస్తాడు. రుక్ సంతోషానికి హద్దులు ఉండవు. వాళ్ళ అంకుల్ అన్నీ సంగతులు క్రిష్ కు చెప్పానని పెళ్ళి జరగబోయే హోటల్ బయట దేవుడి మందిరం ఉంటుంది అక్కడ క్రిష్ కలుస్తానని చెబుతాడు. క్రిష్ వాట్సప్ నెంబరు తీసుకొని ”క్రిష్, నీ గురించి చాలా విన్నాను, ఆన్లైన్ లో చదివాను. నాకు తెలుసు నీకు బోలెడు మంది ఫాలోవర్స్ ఉన్నారని, నీ హ్యాండ్సమ్నెస్ కు బోలెడు మంది నీ వెంటపడతారని తెలుసు అయినా సరే నేను నీ ప్రేమలో పడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరినీ చేసుకోనని శపథం చేసాను. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ యామ్ ఓన్లీ మేడ్ టు గెట్ మారీడ్ టు యు! ఐ వాంట్ టు బీ యువర్ వైఫ్ నాటోంన్లీ ఇన్ దిస్ లైఫ్ బట్ నెక్ట్ హండ్రెడ్ లైవ్స్” అని సెండ్ కొట్టింది.
“అయితే పాలబాబు కు మూడిందన్న మాట” అంది అచ్యుతరావు గారి భార్య. “అవునండి! క్లైమాక్సు బాగా తీయమని డైరక్టర్ గారికి చెప్పాలి” అన్నాడు పక్కిబాబు.
“నాకో ఐడియా వచ్చిందయ్యా!” అన్నాడు అచ్యుతరావు గారు. చెప్పండి అన్నాడు మునీస్వర్రావు.
“క్లైమాక్సు లో రుక్ కార్లోంచి దిగగానే హోటల్ లో పెళ్ళి మండపంలో నడిచేలోగా క్రిష్ ఆ వందస్తుల హోటల్ టాప్ నుండి స్పైడర్ మ్యాన్ లాగా సన్నటి తీగ వెనుక కట్టుకోని దిగ్ రుక్ కి చేయి అందించాలి, క్రిష్ రుక్ పైకి గాల్లోకి ఆ వైర్ సహాయంతో రూఫ్ టాప్ ఎగురుతూ వెడితే అదిరిపోతుంది అన్నాడు, తరువాత పాలబాబు లిఫ్ట్ లో పైకి పరుగెట్టాలి. ఓ మంచి క్లైమాక్సు ఫైట్ ఆ రూఫ్ టాప్ లో పెట్టిద్దాం” అన్నారు అచ్యుత రావు గారు.
“ఓ తప్పకుండా సార్” అన్నాడు మునీస్వర్రావు.
ఇంతలో మాటలలో క్రిష్ బయటనుండి తిరిగి వచ్చి ఆ బెడ్ రూమ్ లోకి నడుస్తాడు.
“సార్! ఈ స్రిప్టు మీ అబ్బాయి ని దృష్టిలో పెట్టుకొనే రాసాను” అన్నాడు మునీస్వర్రావు. క్లైమాక్సు లో ఏమవుతుందోన సీను చెప్పమంటారా? అని అడిగాడు.వద్దు అని సైగలు చేసి అచ్యుత రావు గారు పక్కిబాబు వైపుకు చూసాడు. స్రిప్టు నచ్చినట్లు తల ఊపాడు. భార్య మొహం ఎలాగూ వికసించి ఉండటంతో తన తల కింద పెట్టిన బ్యాగ్ తీసి మునీస్వర్రావు కి ఇచ్చి “ఉంచుకోవయ్యా!” అంటూ చేతిలో ఆ స్రిప్టు పేపర్లు లాక్కున్నాడు. “నువ్వు ఇంకేమీ చెప్పక్కర్లేదు అంతా అర్థం అయ్యింది” అన్నాడు అచ్యుతరావు గారు.
సరిగ్గా మూడు నెలలు తిరగ్గానే వాళ్ళబ్బాయి క్రిష్ హీరోగా సినిమా తీసి, ఎబ్రాడ్ లో వెయ్యి థియేటర్లు, ఇండియాలో రెండువందలు థియేటర్లలో రిలీయ్ చేయటానికి సిద్దంచేసారు. మొదటి రోజూ ప్రివ్యూ. క్లైమాక్సు సీను నడుస్తోంది.
క్రిష్ రుక్ కౌగలించుకొని తీగ వాళ్ళిద్దరినీ పైకి లాగుతుంటే రుక్ పాలబాబు కు బాయ్ చెబుతూ చిలిపిగా కన్నుకొడుతుంది . అది చూసి పాలబాబు “డాడీ..” అంటూ మారాం చేస్తుంటాడు. రుక్ వాళ్ళ అన్నయ్య “ఓరీ క్రిష్ …మిల్క్ ప్యాకెట్లు లో పాలు పెరుగు దొంగిలించి తిని కండలు పెంచావు. నీ కారెక్టర్ అస్సలు బాలేదు, నీ ఫ్రొఫైల్ చూసాను … మా రుక్ కు మ్యాచ్ కుదరదు” అంటాడు.
క్రిష్ బటన్ నొక్కుతాడు. పైకి వెళ్తున్నది కాస్తా మళ్ళీఆగి కిందకి వస్తుంది. క్రింద దాకా వచ్చిన తరువాక రుక్ వాళ్ళ అన్నయ్య రుక్ ను పట్టుకోబోతాడు, కుదరక క్రిష్ ను పట్టుకుంటాడు. క్రిష్ బ్యాక్ పోకెట్ లోంచి ఎలక్ట్రిక్ షేవర్ తీసి రుక్ వాళ్ళ అన్నయ్య మీసాలు లేకుండా కట్ చేస్తాడు, ఒక్క తనను తంతాడు. ఇంకో జేబులోంచి మొబైల్ తీసి, మీసాలు లేకుండా ఒక ఫొటో తీసి పైకెళ్ళటానికి బటన్ నొక్కుతాడు. ఇద్దరూ పైకి వెడిపోతూ ఆ మీసాలు లేని ఫొటో ఆన్లైన్ లో ఇన్సల్టు చేయటానికి పోస్టు చేయపోతాడు క్రిష్.. రుక్ వాళ్ళ అన్నని క్షమించమంటుంది. సరేనని పోస్టుచేయకుండా క్షమించానంటాడు క్రిష్.
ఇదంతా చూస్తున్న పాలబాబు అప్పటి దాకా లేని పౌరుషం ఉప్పొంగి రూఫ్ టాప్ కు లిఫ్టులో బయలు దేరతాడు.
ఆ సినిమా క్లైమాక్సు అంత బాగా కుదిరినందుకు అచ్యుత రావు గారి వాళ్ళ భార్య వైపుకు చూస్తాడు. సినిమా లో కొడుకును చూస్తూ ఆవిడ కళ్ళనిండా నీళ్ళు చూసి అసలు సినిమా ఎలా చూడగలుగుతోందబ్బా అనుకుంటాడు అచ్యుతరావు గారు.

స్రిప్టు ప్రకారం అసలైతే క్రిష్ రుక్ రూఫ్ టాప్ లో హెలీపాడ్ నుండి వెళ్ళిపోవాల్సింది కానీ పాలబాబు పైకి చేరగానే క్రిష్ ఇంకా ఎదురుగా నించొనే ఉంటాడు. “నీకోసమే ఎదురు చూస్తున్నాను” అంటాడు. ఆ సీనుకు పక్కిబాబు వేసిన విజిల్ కు సినిమా హాలు పక్కనే ఉన్న ఈ మధ్యనే నాణ్యత లేకుండా కట్టిన అపార్టుమెంట్ బ్లాకు కూలి పడిపోతుంది, ఇంకా ఎవరూ గృహప్రవేశం కాలేదు కాబట్టి ఫర్వాలేదు.
మునీస్వర్రావు క్రిష్ పెట్టిన ఫోజు కు తట్టుకోలేక తన బ్యాగ్లోంచి కొన్ని డబ్బులు పైకి విసిరి మళ్ళీ ఎందుకు చేసానా అనుకొని కింద పడినవి ఏరుకోవడంలో బిజీ అయిపోయాడు
ఇక సినిమా సన్నివేశంలో పాలబాబు ముందుకు నడుస్తాడు, క్రిష్ ఉన్నచోటే నించొని ఉంటాడు. ఇంకా ముందుకు నడుస్తాడు. ఆడియన్స్ టెన్షన్ తో “క్రిష్ బటన్ నొక్కు…” అని అరుస్తుంటారు. హెలీకాప్టర్ నుండి రుక్ సైగలు చేస్తూ టెన్షన్ పడుతూఉంటుంది, కానీ క్రిష్ థైర్యంగా అలానే నించుంటాడు. పాలబాబు క్రిష్ ముందుకెళ్ళి నించుంటాడు ముక్కు మక్కు ఆనుకునేలా ఇద్దరూ నిలబడతారు. ఇద్దరూ మెల్లకన్నుతో చాలా సేపు నించుంటారు, ప్రేక్షకులకు టెన్షన్తో ఉంటారు. కొంతసేపటిక క్రిష్ కళ్ళలోకి కళ్ళు పెట్టి మాములుగా చూసి పాలబాబు కళ్ళు తిరిగి “సగం దాకా వచ్చిన తరువాత లిఫ్టు అవుటాఫ్ ఆర్డర్… ఫిఫ్టీ ఫ్లోర్సు నడిచి వచ్చా…” అంటూ డబ్బున వెనక్కి పడతూ “క్రిష్ …నువ్వు పెద్ద మాయగాడివి” అంటాడు.
క్రిష్ కాలర్ ఎగరేసి అప్పుడు బటన్ నొక్కుతాడు. హెలీకాప్టర్ లో రుక్ చెయ్యి అందిస్తుంది. సినిమాలో వాళ్ళ పెళ్ళి వెనకాల జరుగుతుంటే టైటిల్ పడుతూ సినిమా ముగిస్తుంది. అందరూ చప్పట్లు కొడుతూ లేస్తారు.
“సినిమా ఎబ్రాడ్ లో వారం ఖచ్చింతగా ఆడుతుంది సార్” అంటాడు స్ర్కిప్టు రైటర్ మునీస్వర్రావు అచ్యుతరావు గారితో.
“రెండు రోజులాడితే చాలు మన డబ్బులు మన కొచ్చేస్తాయి” అంటాడు అచ్యుత రావు.
ఆడియో రిలీజ్ రోజు క్రిష్ స్టేజీ మీద “అసలు చెప్పాలంటే ఈ స్టోరీ మా నాన్నగారి బయోపిక్, ఇంత మంచి స్ర్కిప్టు నా మొదటి సినిమాకు రావడం నా అదృష్టం” అన్నాడు వాళ్ళ నాన్న, అమ్మ వైపుకు చూసి ఓ కిస్ గాలిలో వదులుతాడు. పిచ్చి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
క్రిష్ తరువాత డైరక్టర్ స్టేజీ మీదకు వచ్చి మైకు తీసుకొని “ఈ స్టోరీ పాతదే” అని నోరు జారాడు. అంతా నిశ్శబ్దం కానీ “మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ ఇది. కొత్తదనం జోడించాం” అన్నాడు. ఎవడో ఒకడు తప్పట్లు కొడతాడు, వాడిని చూసి మిగతావాళ్ళు కూడా తప్పట్లు కొడతారు.
ఇక స్ర్కిప్టు రైటర్ ఆ మైకు తీసుకొని “క్రిష్ బాబు కోసమే ఇది ప్రత్యేకంగా రాయడం జరిగింది. మీరు నమ్మరు కానీ దీనికి సీక్వెల్ కూడా రాసాను ఇంకా అచ్యుత రావు గారికి కూడా వినిపించ లేదు ఆడియన్స్, ఫాన్స్ మీకే మొదట రివీల్ చేస్తున్నాను, ఒక్క సీన్ చెబుతాను” అంటూ
“ఈ సినిమాలో క్రిష్ ఆస్ట్రోనాట్” అన్నాడు. ఆయన అన్నది సరిగా అర్థం కాని వాళ్ళు, వినపడని వాళ్ళు కూడా చప్పట్లు, విజిల్స్ తో గోల గోల చేసారు. ఇండియా వాళ్ళు ఆకాశంలో ఓ స్పేస్ స్టేషన్ పెడతారు, దాంట్లో దేవతావృక్షం పారిజాతం చెట్టు వేస్తే పెరుగుతుందా లేదా అని ఎక్సెపరిమెంట్ కోసం ఆ మొక్కని వేస్తారు. అది కాస్తా అక్కడ విరగ పూస్తుంది. హీరో వాళ్ళ మిసెస్ సినిమాలో హీరోయన్ ఆ ప్లాంటును ఎలాగైనా తెచ్చి ఇవ్వమంటుంది. క్రిష్ సరే అంటాడు. అతను స్పెషల్ మిషన్ మీద ఎలా వెళ్ళి సాధిస్తాడో అదే అద్భుతమైన కథ”
ఆ హాలులో ఫాన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అతి చేస్తుంటే “జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళమని క్రిష్ ముగించాడు”
ఆ సినిమా గురించి రాయబోయే విలేకరి మాత్రం మనసులో “ఇలాంటి రచయితల వల్లే కథలు కంచికి వెళ్ళడం ఎప్పుడో మానేసాయ్, మనం ఇంటికి పోతే సరిపోతుంది” అనుకున్నాడు.
కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి!
సమాప్తం.

1 thought on “కౌండిన్య హాస్యకథలు – కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి

Leave a Reply to మాలిక పత్రిక ఆగస్టు 2018 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *