April 16, 2024

బ్రహ్మలిఖితం – 20

రచన: మన్నెం శారద

జోసెఫ్ మీదపడి నిశ్శబ్దంగా రోదిస్తున్న అతని భార్యని భుజాలు పట్టుకొని లేవదీసింది లిఖిత.
ఆమె కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని అదుపు చేస్కునే ప్రయత్నం చేసింది.
“మిమ్మల్ని ఓదార్చే ధైర్యం చేయలేను. కాని.. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదంటే.. మీలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉంటారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను” అంది లిఖిత బాధగా.
ఆమె శుష్క మందహాసం చేసింది. ఆ నవ్వు తుఫానులో పొడసూపిన సూర్యకిరణంలా ఉంది.
“జోసెఫ్ గురించి మీకు తెలియదు. అతను కోటీశ్వరుడంటే బహుశ మీరు నమ్మకపోవచ్చు. ఆయన తండ్రి ఇక్కడ కొన్ని వందల ఎకరాల రబ్బరు, టీ తోటలకు అధికారి. నేనొక టీచర్ని. నన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన ఆంత ఆస్తిని వదులుకొని ఓ హోటల్లో మేనేజరుగా ఉద్యోగం సంపాదించి నన్ను పెళ్ళి చేస్కున్నారు. నా అదృష్టం వక్రించి ఒక్కసారే ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తిన్నాయి. నేను ఒకసారి మీరిచ్చిన డబ్బు వాడదామన్నాను. ఆయన చస్తే అంగీకరించలేదు. చివరికి…” అందామె కన్నీరు కారుస్తూ.
లిఖిత కళ్లనిండా నీళ్ళు నిండేయి.
“రియల్లీ హీ వాజ్ గ్రేట్” అంది.
“అవును. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయనతో కొన్నాళ్లయినా జీవితం గడిపిన అదృష్టాన్ని తలుచుకుంటూ .. ఈ పిల్లల కోసం మిగతా జీవితాన్ని గడపాలి”అందామె భారంగా.
హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని జోసెఫ్ మృతదేహాన్ని ఆమెకప్పగించేరు.
లిఖిత వారితోపాటు వెళ్లింది.
జోసెఫ్ ఖనన కార్యక్రమం చాలా నిరాడంబరంగా హోటల్ యాజమాన్యం వారి రాకతో జరిగిపోయింది.
జోసెఫ్ భర్య వెనుదిరిగి వస్తుంటే లిఖిత ఆమె ననుసరించి “ఏమండి?” అని అంది.
ఆమె వెనుతిరిగి చూసింది.
“మీ పేరడగలేదు నేను”
“మరియా”
మీరేమీ అనుకోకపోతే ఈ డబ్బు..”
“నన్ను తీసుకోమంటారు.!” అందామె విషాదంగా నవ్వుతూ.
లిఖిత అవునన్నట్లుగా తల పంకించింది.
“నా జోసెఫ్ ప్రాణాలు ఈ డబ్బు దొరక్కే పోయేయి. ఇప్పుడెందుకీ డబ్బు నాకు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు” అంది మరియ.
“కనీసం. పిల్లల భవిష్యత్తు కోసమైనా!”
“వద్దండి. నా పిల్లల్ని నేను పెంచగలను. మీకు తెలియదు. జోసెఫ్ ఒకరోజు ఇంటికి చాలా ఆనందంగా వచ్చేశారు. ఏంటి విశేషం అని అడిగితే .. ఈ రోజు జాక్‌పాట్ కొట్టేసేనోయ్. ఒక ముసలమ్మ అన్నం లేకుండా ఏడుస్తుంటే హోటల్‌కి తీసుకెళ్ళి అన్నం పెట్టించేను” అనేవారు. మరో రోజు ఎవరికో బీదవాళ్లకి వందరూపాయలిచ్చాననేవారు. నేను పిచ్చిపిచ్చిగా దానాలు చేసేస్తున్నరని కోప్పడితే మనం వెనకేసుకోవాల్సింది దానం, ధర్మం కాని డబ్బు కాదని చెప్పేవారు. అలాంటీ మహానుభావుణ్ణే పోగొట్టుకున్న నాకీ డబ్బెందుకు?” అందామె నిర్లిప్తంగా.
లిఖిత స్పందించిన హృదయంతో ఆ మాటలు వింది.
ఈ దేశంలో ఎందరెందరో తమ స్వలాభాల కోసం పదవులనలంకరించేరు. కొందరు కోట్ల ఆస్తులు కూడబెట్టి విదేశాలు వెళ్ళేరు. ఇంకొందరు ప్రాచుర్యం కోసం రోడ్లమీద సత్యాగ్రహాలు చేసేరు. మరి కొందరు ఇరవైనాలుగ్గంటలు ఏకధాటిగా ఆడో, పాడో, గెంతో పబ్లిసిటీ తెచ్చుకున్నారు. కాని.. ఇంత ఉదాత్తమైన వ్యక్తిత్వమున్న మనిషి మరణాన్ని ఎవరూ చివరికి కన్నతండ్రి కూడా గుర్తించలేడు.
అతి సామాన్యంగా అతనెళ్ళిపోయేడు.
లిఖిత కప్పుడొచ్చింది దుఃఖం భూమిలోంచి జలం ఎగదన్నినట్లు.
ఆమె వెనుతిరిగి లిఖిత భుజాలు పట్టుకొని “ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరందరూ అతను లేడని నాకు గుర్తుచేయొద్దు. హీయీజ్ విత్ మీ వోన్లీ” అంది.
ఆమె మనోస్థయిర్యానికి లిఖిత చేతులు జోడించింది మనస్ఫూర్తిగా.
*****
అతను చిన్నగా దగ్గేడు.
సిటవుట్ లో కూర్చున్న కేయూరవల్లి ఉలిక్కిపడి అతనివైపు చూసింది.
అతను నమస్కారం పెట్టేడు.
“ఎవరు మీరు?”
“నా పేరు కుటుంబరావు. నేను మీకు తెలియదు. మీ దగ్గరకొచ్చే వెంకట్ గురించి తెలుసుకోవాలని వచ్చేను”
వెంకట్ పేరు వినగానే కేయూర తేరుకుని “రండి కూర్చోండి. ఏంటి పని?” అనడిగింది.
కుటుంబరావు కూర్చున్నాడు.
“చెప్పంది” అంది కేయూర.
“అతను మీకు తెలుసా?”
“తెలుసు. మా అమ్మాయి క్లాస్‌మేటతను” అంది కేయూర అతన్ని నిశితంగా గమనిస్తూ.
కుటుంబరావు కాస్సేపు తల దించుకున్నాడు. అతనెందుకొచ్చేడో కేయూరకర్ధం కాలేదు.
“ఏమిటో చెప్పండి” అంది తిరిగి రెట్టిస్తున్నట్లుగా.
“ఏం లేదు. నాకు నిజంగా ఎలా చెప్పాలో తెలియడం లేదు. చాలా సిగ్గుచేటుగా ఉంది” అన్నాడు మెల్లిగా.
అలా చెబుతున్నప్పుడతని కళ్ళనిండా అభిమానం చంపుకోవాల్సి వచ్చినందుకు దెబ్బతిన్నట్లుగా ఎర్రజీరలలుముకొన్నాయి. పెదవులు చిన్నగా కంపించేయి.
“వెంకట్ ఏం చేసేడు?”
“చాలా ఘోరమే చేసేడు మేడం. నా భార్యని పెళ్ళి చేసుకున్నాడు.”
ఆ మాట విని తల తిరిగింది కేయూరకి.
కుటుంబరావుని పిచ్చివాడిలా చూసి “మీరంటున్నదేమిటి? మీ భార్యని పెళ్లి చేసుకోవడమేంటి?”అనడిగింది విస్మయంగా.
“నేనబద్ధం చెప్పడం లేదు” అంటూ జరిగినదంతా క్లుప్తంగా చెప్పేడు కుటుంబరావు.
అతను చెప్పిన కథ వినడానికే కాదు నమ్మడానిక్కూడా అసంబద్ధంగా, కాకమ్మ కథలా అనిపించింది కేయూరకి.
“మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా?”అనడిగింది చివరికి.
ఆ మాట విని కుటూంబరావు మొహం పాలిపోయింది. “ఇది నా ఖర్మ. ఏం చెప్పమంటారు. అది నా మేనకోడలే. ఉద్యోగం కూడా చేస్తుంది. ఎవడో వాడు పూర్వజన్మలో దీని భర్తని చెప్పేడంట. వాణ్ణి తీసుకుని అహోబిళం వెళ్ళి పెళ్ళి చేసుకొచ్చింది. ఇప్పుడూ వాడికి డబ్బు కావాలట. ఆస్తి పంపకం చేసేస్తే వాడితో వెళ్ళిపోతుండంట. మాకిద్దరు పిల్లలు. వాళ్ల కోసమే నా విచారం.
“అయితే ఈ మధ్యనొక అమ్మయితో చూశానతన్ని. ఆవిడేనా?”
“కాదు. వాడి మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడటీ మధ్య. దాంతో ఇది పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. గదిలో పెట్టి తాళం వేసేను. ఎవరో అతను మీకు తెలుసని చెబితే.. వివరాలు తెలుసుకుందామని వచ్చేను. దయచేసి అతన్ని మందలించండి. నా సంసారాన్ని కాపాడండి.”అన్నాడతడు చేతులు జోడించి.
“ఎప్పుడు జరిగిందితంతా?”
“ఈ మధ్యనే. పోయిన వారం సెలవు పెట్టి వాళ్ల ఊరెళ్లొస్తానని ఈ నిర్వాకం చేసింది.” అన్నాడాయన ఉక్రోషంగా.
కేయూర ఆ జవాబు విని దిగ్భ్రమకి గురయింది.
అంటే .. ఇతను కేరళ వెళ్లడం, లిఖితని కలవడం అంతా అబద్ధమన్నమాట.
ఆ విషయం గ్రహింపుకి రాగానే ఆమె కళ్లెర్రబడ్డాయి.
“రాస్కెల్! వాడిని చూస్తే నాకెప్పుడూ అపనమ్మకమే. ఈ మధ్య నా ఒంటరితనంలో నేను వాన్ని నమ్మక తప్పలేదు. మీరెందుకు ఊరుకున్నారు. పోలీసు రిపోర్టివ్వండి” అంది కోపంగా.
అతను శుష్కంగా నవ్వేడు.
“ఈ దేశంలో పోలీసు స్టేషన్లు నందిని పంది చెయ్యడానికి తప్ప దేనికి పనికొస్తాయి? పైగా నా సంసారం రచ్చకెక్కుతుంది. అందుకే అతను మీకు భయపడతాడేమో మందలించి మా మధ్యకి రావొద్దని చెప్పమని అడగడానికొచ్చాను” అన్నాడు కుటుంబరావు ప్రాధేయపూర్వకంగా.
కేయూరవల్లికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అతను తననే మోసగిస్తున్నాడని చెప్పలేకపోయింది.
కుటుంబరావు లేచి నిలబడి చేటులు జోడించి “వస్తానమ్మా. మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షమించండీ” అన్నాడు.
కేయూర నీరసంగా తల పంకించి నమస్కారం పెట్టిందతనికి
కుటుంబరావు బయటకొచ్చి స్కూటర్ స్టార్టు చేసుకొని ఆ వీధి మలుపు తిరుగుతుండగా వెంకట్ అతన్ని గమనించి పక్కకి తప్పుకొన్న విషయం కుటుంబరావు గమనించలేదు.
వెంకట్ మెదడులో చకచకా ఆలోచనల రీళ్ళు తిరిగిపోయేయి.
నిస్సందేహంగా అతను కేయూరవల్లిని కలిసి వెళ్తున్నాడు. అంటే… తన గుట్టు ఆవిడకి తెలిసిపోయుంటుంది. ఇప్పుడు తనెళ్తే ఆవిడ తనని చంపినంత పని చేస్తుంది. అనుకొని వెంకట్ గబగబా భీమిలీ రోడ్డులోని ఓంకారస్వామి దగ్గరకి బయల్దేరేడు.
*****
చోటానికరాలోని భగవతి గుడి ప్రాంగణంలో బాగా దిగువగా ఉన్న కోనేటిలో కార్తికేయన్ మొలలోతు నీళ్ళలో నిలబడి ఉన్నాడు.
లిఖిత, కాణ్హా కొంచెం ఎగువలో నిలబడి అక్కడ జరుగుతున్న తతంగాన్ని కొంత భయంగానూ, మరి కొంత ఆసక్తిగానూ గమనిస్తున్నారు.
కోనేరంతా పసుపు రంగులో ఉంది. పసుపు బట్టలతో చేతబడి చేయబడిన వ్యక్తులు దిగడం వలన కోనేరంతా పసుపు రంగుకు మారింది.
ఆ ఆలయపూజారి పసుపు, కొబ్బరినూనె కలిపిన ముద్దని కార్తికేయన్ శరీరమంతా మర్ధించేడు శిరస్సుతో సహా. కొబ్బరాకుల దోనెతో కార్తికేయన్ తలపై నీరు గుమ్మరిస్తూ మలయాళంలో మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాదాపు ఒక గంట ఆ తతంగాన్ని సాగించేడు.
ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి చందనం పూత చేసి ముందు భాగంలో ఉన్న కోవెలలో కూర్చోబెట్టేరు. లిఖిత, కాణ్హా కూడా అక్కడ దగ్గర్లో కూర్చున్నారు. ఆలయమంతా తైల దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. గర్భగుడికి దగ్గరగా ఇరువైపులా ఉన్న రెండు స్తంభాల్ని చూపించేడు కాణ్హా లిఖితకి.
ఆ స్తంభాల నిండా సూది మోపేంత ఖాళీ లేకుండా మేకులు దిగబడి ఉన్నాయి.
“ఏంటవి?” అనడిగింది లిఖిత ఆశ్చర్యపడుతూ.
“ఇక్కడున్న మేకుల సంఖ్యనుబట్టి అంతమందికి ఇక్కడ చేతబడి తీసేరని అర్ధం”
అతని జవాబు విని సంశయంగా చూసింది లిఖిత.
“నిజంగా చేతబడులున్నాయంటావా?” అనడిగింది లిఖిత.
“అక్కడ కూర్చున్నవాళ్ళని చూడు”
లిఖిత గర్భగుడికి ఇరువైపులా ఉన్న మండపాల్లో కూర్చుని ఉన్న వ్యక్తుల వైపు చూసింది.
అక్కడ చాలా మంది స్త్రీ పురుషులు చందనపు పూతలతో కూర్చుని ఉన్నారు. ఎవరూ ఈ లోకంతో సంబంధం లేనట్లుగా కళ్లు మూసుకుని పూనకం వచ్చినట్లుగా వూగుతున్నారు. కొందరు గజగజా వణుకుతున్నారు.
ఒక పక్క భక్తులకి ఆలయంలో దైవ దర్శనం జరుగుతున్నా వాళ్లు మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కూర్చుని ఉన్నారు. కార్తికేయన్ చిన్న టవల్ కట్టుకుని వాళ్లలో ఒకడుగా కూర్చుని ఉండటం లిఖితకి ఎనలేని బాధని కల్గించింది.
ఒక గొప్ప సైంటిస్టుకి ఆ గతి పట్టడమేంటి? నిజంగా చేతబడులంటూ ఉన్నాయా?
వెంటనే కొచ్చిన్‌లో భగవతి కోవెల పూజారి కుట్టికారన్ చెప్పిన మాటలు గుర్తొచ్చేయి.
మనసు బలహీనమైనప్పుడు మానసిక రుగ్మతలు అందులోకి తేలిగ్గా జొరబడతాయి. తన తండ్రి ఎన్నో సంవత్సరాలు ప్రయొగశాలలో చేసిన శ్రమ వృధా అయిందని కృంగిపోయేడు. ఇక తనేం చేయలేనన్న భావనతో తనలో ఉన్న శక్తిని తనే మరచిపోయేడు. ఫెయిల్యూర్ అతన్ని తీవ్ర సంక్షోభానికి గురి చేసింది. ఆ బాధే అతన్నిలా కొందరి క్షుద్రోపాసకుల వశం చేసింది.
లిఖిత అక్కడి పూజారులు చేస్తున్న తతంగాన్ని గమనించింది. వాళ్లు ఇప్పుడు తన తండ్రి తలలో, శరీరంలో నరాల్ని చల్లబరిచే వైద్యాలు, రకరకాల ఆయుర్వేద మూలికలతో చేస్తూ మరో పక్క క్షుద్ర చేతబడులు తీస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు.
లేకపోతే మూలికల తైలాన్ని శరీరం తలకి మర్దించాల్సిన అవసరమేముంది?
ఎన్నాళ్లకి తన తండ్రి మామూలు మనిషి అవుతాడో! తననెప్పుడు గుర్తిస్తాడో. దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంది లిఖిత.
*****
“డబ్బు తెచ్చేవా?” లోనికి ప్రవేశించిన వెంకట్‌ని ప్రశ్నించేడు ఓంకారస్వామి.
“ఏం డబ్బు నా పిండాకూడు. ఆ ఈశ్వరి మొగుడు లిఖిత తల్లి దగ్గరకెళ్లి నా సంగతంతా చేప్పేసేడు. ఆవిడిప్పుడేం చేస్తుందోనని వణుకుతూ పరిగెత్తుకొచ్చేనిక్కడికి” అన్నాడు వెంకట్.
“ఆ ఒంటరి ఆడదేం చేస్తుంది?” అనడిగేడు ఓంకారస్వామి హేళనగా.
“అంతలా తీసిపారేయకండి. మొగుణ్ణొదిలేసి ఇరవై సంవత్సరాలు ఫాక్టరీ సొంతంగా నడుపుతూ మహారాణిలా బతికింది. ఏదో కూతురు దూరమైందని డీలాపడింది కానీ.. లేకపోతేనా?”
“ఏం చేస్తుందంటావు?”
“ఏమో నేనేం చెప్పగలను. ఇదంతా ఆ ఈశ్వరి వల్లనే వచ్చింది. అది నేనే దాని భర్తనని రంకెలేసి వీధిన పడటం వల్లనే ఈ ముప్పొచ్చింది. అది సీక్రెట్‌గా ఆస్తి తెస్తుందని ఆశపడ్డాను గానీ. ఇలా రచ్చకెక్కి పిచ్చి పట్టిస్తుందనుకోలేదు.”
ఓంకారస్వామి వెంకట్ భయాన్ని హేళనగా తీసుకున్నాడు.
“నువ్వూరికే తాడుని చూసి పామనుకుంటున్నావు. ఆ కేయూరని ఇంట్లోనే బంధించిరా. భయమేం లేదు. అదేం చేస్తుంది!” అన్నాడు.
వెంకట్ సంశయంగా చూసి “ఇంకా గొడవవుతుందేమో!” అన్నాడు.
“సింగినాదమవుతుంది. ప్రస్తుతానికాపని చేసి రా. తర్వాత ఆలోచిద్దాం.” అన్నాడు.
వెంకట్‌కి ఆ ఉపాయం నచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టడానికి తిరుగుమొహం పట్టేడు.

ఇంకా వుంది.

1 thought on “బ్రహ్మలిఖితం – 20

Leave a Reply to పద్మజ యలమంచిలి Cancel reply

Your email address will not be published. Required fields are marked *