March 29, 2024

కంభంపాటి కథలు – ఆవే పులి

రచన: కంభంపాటి రవీంద్ర

ఆ రోజు మధ్యాహ్నం టీ తాగుతూ, టీవీ చూస్తున్న హైందవికి భర్త నుంచి వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది, ఎవరా అని చూసేసరికి , భర్త గోవర్ధన్ . ‘ఏమిటండీ ఇప్పుడు ఫోన్ చేసేరు?’ అని అడిగితే ‘ప్రణతి స్కూల్ నుంచి జాగ్రత్తగా వచ్చిందా ?’ అని అడిగేడు .

‘ఆ ..వచ్చింది .. బ్యాగు హాల్లో పడేసి దాని గదిలోకెళ్ళిపోయింది ‘ అంది హైందవి

‘ఏం .. ఏవైంది ? ఒంట్లో బాగానే ఉందా ? అడిగేవా ? ‘

‘ఊరికే కంగారుపడకండి .. అది బాగానే ఉంది .. ఏముందీ ..స్కూల్లో ఏదో అయ్యుంటుంది .. అసలే మహాతల్లి పరమ సెన్సిటివ్ కదా ‘

‘అదే నేనడుగుతూంది .. అయ్యుంటుంది అనుకునే బదులు అదేమిటో కనుక్కోవచ్చు కదా ‘

‘ప్రపంచంలో ఇంకెవరికీ కూతుళ్లే లేనట్లు ..ఎందుకంత టెన్షన్ పడతారు ? పద్నాలుగేళ్ల పిల్ల .. దాని సంగతి అది చూసుకోలేదా ?’

‘మిగతా ప్రపంచం సంగతేమో గానీ , మనిద్దరికీ అదే ప్రపంచం.. కాబట్టి .. వెళ్లి దాంతో మాట్లాడు ‘

‘ఇదిగో .. అదే వచ్చింది .. మీరే మాట్లాడండి ‘

ప్రణతి ఫోనందుకుని చెప్పింది ‘అబ్బా ..ఏం లేదు నాన్నా .. కొంచెం స్కూల్లో ఏవో చిన్న చిన్న గొడవలుంటాయి కదా .. ప్రతిదానికి వర్రీ అవకు ‘

‘ఏం లేదు కన్నా .. మాకు నీకన్నా ఎవరున్నారు చెప్పు ? అందుకే .. ఈ కంగారు .. పోన్లే .. ఏదైనా తిను .. మీ అమ్మ నీకోసం ఏవో స్నాక్స్ చేసే ఉంటుంది ‘ అని ఫోన్ పెట్టేసేడు

‘అమ్మా .. నీతో మాట్లాడాలి ‘ అంది ప్రణతి

‘ఏమైంది ? ఏమైనా మార్కులు తక్కువొచ్చేయా ?’ అడిగింది హైందవి

‘ఎహె .. ఎప్పుడూ నీకు మార్కులు గోలే .. మళ్ళీ ఇవాళ ఆ అభయ్ గాడు నన్ను లవ్ చేస్తున్నానంటూ వెంటబడ్డాడు ‘

‘వాడిని ఇగ్నోర్ చేసేయ్ .. పోనీ మీ టీచర్ కి కంప్లైంట్ చేద్దామా ?’ ఆలోచిస్తూ, అంది హైందవి

‘వాడికి ఆల్రెడీ చెప్పానమ్మా .. నాకు ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్ లేవు .. పైగా నువ్వు టెంత్ క్లాస్ ఇప్పుడు .. నీ స్టడీస్ మీద ఫోకస్ పెట్టుకో అన్నాను, కానీ వాడు నువ్వు యెస్ చెప్పేదాకా వదలను .. అనేసి వెళ్ళిపోయేడు .. అక్కడితో ఆగకుండా, మా క్లాస్మేట్స్ అందరితో “షీ ఈజ్ మై గర్ల్ ‘ అనేసెళ్లిపోయేడు .. పైగా మా ఫ్రెండ్ సోనియా తో “తనని నా లవ్ అర్ధం చేసుకోమను .. ఇప్పటికే నేను కూడా అర్జున్ రెడ్డిలాగా తాగడం మొదలెట్టేను” అన్నాడట ‘ అని చెబుతున్న ప్రణతి కేసి చూస్తే హైందవికి ఏడుపొచ్చేసింది .

‘అసలు ఈ సమాజం ఏమవుతూంది ? తొమ్మిదో క్లాసు పిల్లకి పదో క్లాసు పిల్లాడి బెదిరింపులా ? అదీ ఏదో దరిద్రగొట్టు సినిమా తాలూకు హీరోతో తనని తాను పోల్చుకుంటూ ! ఆ కుర్రాడికి తల్లితండ్రులు లేరా ? ఉంటే ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఓ కంట కనిపెట్టి ఉండలేరా?’ ఇలా రకరకాల ఆలోచనలు కమ్మేసాయి హైందవిని .

ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక గోవర్ధన్ పడుక్కోబోతూంటే , ప్రణతి విషయం కదిపింది , ‘ప్రతీ చిన్న విషయం మీకు చెప్పడమెందుకని ఇంతవరకూ మీకు చెప్పలేదు .. కానీ ఇప్పుడు టైం వచ్చింది .. ఇలా రోజూ మన పిల్లని ఆ కుర్రాడు ఇబ్బంది పెడుతూంటే , దానికి మానసికంగా ఎంత బాధగా ఉంటుంది .. పోనీ స్కూల్లో కంప్లైంట్ ఇద్దామంటే , అనవసరంగా విషయం పెద్దదై , మళ్ళీ మన పిల్లకి ఏం ఇంపాక్ట్ ఉంటుందోనని కంగారుగా ఉందండి ‘ అని చెప్పింది

గోవర్ధన్ అన్నాడు ‘నువ్వు చెప్పింది నిజమే .. ముందు ఆ కుర్రాడి పేరెంట్స్ ని కలిసి విషయం చెబుదాం .. పిల్లల్ని కనేసి అలా ఊరిమీదికి ఆంబోతులా ఒదిలేస్తే ఎలా .. ఒకవేళ అప్పటికీ ఆ కుర్రాడిలో బుద్ది రాకపోతే అప్పుడు స్కూల్ మానేజ్మెంట్ ని కలుద్దాం ‘

‘అయినా .. ప్రభుత్వాలు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలని ఎలా పర్మిట్ చేస్తున్నాయండీ ? ఇప్పుడు చూడండి .. ఆ తీసిన వాళ్ళు, వేసిన వాళ్ళూ బాగానే ఉంటారు ,మధ్యలో ఇలాంటి కుర్రాళ్ళు చెడిపోతారు , ఆడపిల్లల్ని బాధపెడతారు ‘ అని హైందవి అంటే , ‘మనం ఓ దిక్కుమాలిన సమాజం లో ఉన్నాం హైందవీ .. ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వాళ్ళే , ఇలాంటి సినిమాలు చూసి, ‘ఓహో అద్భుతం ‘ అని ట్వీట్లు వదిలే రోజులివి ..మనల్ని మనమే కాపాడుకోవాలి ‘ అన్నాడు గోవర్ధన్

మర్నాడు ఆ అభయ్ తండ్రి ఫోన్ నెంబర్ కనుక్కుని , అతనికి ఫోన్ చేసి విషయం వివరిద్దామని గోవర్ధన్ ప్రయత్నిస్తే ,’అసలు ముందు మీ అమ్మాయిని మీరు ఎందుకు అనుమానించరు ? ఏమో తనే మా అబ్బాయి వెంటపడుతూందేమో .. పైగా నేనూ , మా మిస్సెస్ ఇద్దరం వర్కింగ్ .. మాకు ఇలాంటి సిల్లీ విషయాల మీద డిస్కస్ చేసేంత టైం ఉండదు .. ప్లీజ్ డోంట్ బాదర్ అజ్ ‘ అని ఫోన్ పెట్టేసేడాయన !

ఆ సాయంత్రం ప్రణతి చెప్పింది , ‘అమ్మా .. ఆ అభయ్ గాడు మనింటి ముందు బైక్ వేసుకుని తిరుగుతూ , ఊరికే హారన్ కొడుతున్నాడు ‘

వెంటనే హైందవి బాల్కనీలోకి వెళ్లి చూస్తే , ఓ పదిహేనేళ్ల కుర్రాడు కేర్లెస్ గా బైక్ నడుపుతూ కనిపించేడు , హైందవిని చూసి వెకిలిగా నవ్వేడు !

‘సరే .. పోన్లేమ్మా .. నువ్వు బాల్కనీ లోకెళ్లకు .. లోపలి గదిలో కూర్చుని చదువుకో’ అని ప్రణతి కి చెప్పింది

ఎవరూ తనని ఏమీ అనకపోవడంతో ఇంక రోజూ వాళ్ళింటి ముందునుంచి బైకేసుకుని వెళ్లడం , అదే పనిగా హారన్ కొట్టడం . ఒక రోజు ఇంటి కాంపౌండ్ గోడ మీద ‘ప్రణతి ఈజ్ మై లవ్ ‘ అని రాసుంది . అది చూసి ప్రణతి ఒకటే ఏడుపు . హైందవి ‘చూసారా దొంగ వెధవ తెలివిగా తన పేరు రాయలేదు ‘ అంది , గోవర్ధన్ అన్నాడు ,’పోనీ మనం షీ టీమ్స్ కి కంప్లైంట్ ఇస్తేనో ?’

‘మళ్ళీ మీరే మొదటికొచ్చేరు.. ఒకటి.. వాడి తల్లితండ్రులు అవసరమైన డబ్బు పడేసి వాణ్ని బైటికి తీసుకొచ్చేస్తారు , పైగా మన అమ్మాయికి అనవసరమైన పబ్లిసిటీ ‘ అంది హైందవి

గోవర్ధన్ ఇంకేమీ మాట్లాడలేదు .

అభయ్ గాడి భయంతో ప్రణతి స్కూల్ నుంచి ఇంటికొచ్చేక బయటికెళ్ళడం తగ్గించేసింది , రోజూ సాయంత్రం కాసేపు తన ఫ్రెండ్స్ తో గడిపే పిల్ల అలా భయంగా ఇంట్లో కూచోడం బాధగా అనిపించేది హైందవికి . అలా రోజులు గడుస్తున్నాయి, ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు పెద్ద శబ్దం వినిపిస్తే ఏమిటాని హైందవి బాల్కనీ లోకి వెళ్లి చూసేసరికి , రోడ్డు మీద ఏదో ఆక్సిడెంట్ అయినట్టు కనిపించింది . గబగబా రోడ్డు మీదకి పరిగెత్తుకెళ్లి చూస్తే , ఓ బైకు రోడ్డు మీద వస్తున్న గేదెల్ని గుద్దేసింది , ఆ గేదెలన్నీ ఆ బైకు మీదున్న కుర్రాణ్ణి కుమ్మేసేయి . ఒళ్ళంతా కొట్టుకుపోయి, మొహం అంతా ఎర్రగా, వికారంగా ఏడుస్తున్నాడు అభయ్ ! ఎవరో అంటున్నారు ‘ప్రతీ కుర్రనాకొడుకూ బైకులు నడిపితే ఇలాగే ఉంటుంది మరి ‘ అంటూ !

ఆ రాత్రి హైందవి గోవర్ధన్తో అన్నాడు ‘ఆ బురఖాలో వెళ్లి కరెక్టుగా ఆ గేదెలొచ్చే టైముకి వాడి కళ్ళల్లో కారం భలే కొట్టేరండీ ‘ అని !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *