May 26, 2024

కలియుగ వామనుడు 9

రచన: మంథా భానుమతి

చిన్నాకి, అబ్బాస్ తో మాట్లాడ్డానికి సమయం దొరకలేదు. తమ ‘ఇంటి’కి వెళ్లగానే పెట్టె తీసి బట్టలు తడిమి చూశాడు. చేతికి గట్టిగానే తగిలింది.
ఫోన్ కూడా తీసి ఇంకొక షర్ట్ జేబులో పెట్టాడు. గుడ్ అంకుల్ ధర్మమా అని నాలుగు షర్టులు, నాలుగు నిక్కర్లు ఉన్నాయి. నజీర్ ఎప్పుడూ తన పెట్టె జోలికి రాలేదు.
అబ్బాస్, నజీర్ తోనే ఉన్నాడు. ఇద్దరూ ఒంటెల దగ్గర, వాటికి కావలసిన తిండి చూస్తున్నారు. రేసులు దగ్గర కొస్తున్నాయంటే శ్రద్ధ మరీ పెరుగుతుంది.
నయారాకీ చిన్నా దగ్గరకొచ్చాడు..
వాడికి ఇంకా సరిగ్గా అలవాటవలేదు. ఏవో సైగలు చేస్తున్నాడు. సాహిల్, సాండీ ఎక్కడో పని చేస్తున్నట్లున్నారు.
పొట్ట చూపిస్తున్నాడు. నాలిక బైట పెడుతున్నాడు.
ఆకలా? డిన్నర్ వచ్చేవరకూ ఏం దొరకదు. కిచెన్ పని అవలేదు చిన్నాది. టింకూనీ, నయారాకీని కూడా తీసుకెళ్లాడు. వంట అయిపోయింది. ముగ్గురూ కలిసి క్లీనింగ్ చేశారు. నయారాకీ మధ్య మధ్య చిన్నా దగ్గరకొచ్చి కడుపు చూపిస్తున్నాడు.
ఏం చెయ్యాలో అర్ధం అవలేదు. షెఫ్ అంకుల్ రాలేదు. అసిస్టెంట్ షెఫ్ చేశాడు కుకింగ్. టొమాటో సూప్, బ్రెడ్. నీళ్ల పాలు. పెద్ద చేసే దేముంది..
అతన్నే అడిగి సూప్ ఇచ్చాడు తాగమని నయారాకీకి. వాడు వద్దని తల అడ్డంగా తిప్పుతూ కడుపు చూపిస్తున్నాడు. కడుపు నొప్పేమో..
చిన్నా వెంటనే స్పైసెస్ కబ్బోర్డ్ తీసి, అందులోంచి వాము వేడి నీళ్లలో మరిగించి తాగించాడు వాడి చేత. అసిస్టెంట్ అంతా గమనిస్తున్నాడు. వాళ్లకి అలవాటయిపోయాయి, చిన్నా చిటకాలు.
రూమ్ కి తీసుకొచ్చి పడుక్కో పెట్టాడు నయారాకీని. వాడు మాట్లాడకుండా పడుక్కున్నాడు. అప్పుడనిపించింది చిన్నాకి, తమదారి తాము చూసుకుంటే వీళ్ల మాటేంటీ అని. కానీ, వీళ్లు వాళ్ల దేశం వెళ్లలేరు. ఆలీ అంకుల్ చూసుకుంటానన్నారు కదా! ఫరవాలేదు. అయినా తనేం చెయ్యగలడు?
అబ్బాస్ ని ఇవేళ వదిలేస్తే బాగుండు ఆ నజీర్. స్నానం చేసేసి టింకూని టివీ దగ్గర కూర్చోపెట్టి, పుస్తకం తీసి అందులో రాయసాగాడు. రాకీ పోవడం, అబ్బాస్ ని పెట్టిన హింస వరకూ రాశాడు అంతకు ముందు. ఆ తరువాత జరిగిందంతా నింపాడు. ఆలీగారికి అదంతా ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటూ. అయినా ఇక్కడెవరికీ ఇంగ్లీష్ రాదు. అందులోనే రాస్తే పోయేదేమో..
గబగబా ఇంగ్లీష్ లో కూడా రాశాడు వీలైన చోట్ల. సమ్మరీలాగ.
గుమ్మం దగ్గర చప్పుడయింది. గోడవైపుకి తలపెట్టి రాస్తున్న చిన్నా, పుస్తకం మూసేసి పెట్టెలో పెట్టేశాడు.
సాహిల్, సాండీ ఆయాస పడ్తూ వచ్చారు. వాళ్ల వెనుకే అబ్బాస్.
వెనక్కితిరిగిన చిన్నా, నజీర్ కోసం చూశాడు. అబ్బాస్ వెళ్లిపోయినట్లు సైగ చేశాడు. అమ్మయ్య.. త్వరగా డిన్నర్ తినేసి కూర్చోవాలి. సాహిల్, సాండీలు స్నానానికి వెళ్లగానే అబ్బాస్ కి చెప్పాడు, రాత్రికి ఆరుబయట కూర్చుని మాట్లాడు కుందామని.
……………………..

“టూమచ్.. కడుపులో తిప్పుతోంది.” ఫాతిమా వికారంగా పెట్టింది మొహం..
“నాకైతే బుర్ర పన్చెయ్యట్లేదు.” అప్పటి వరకూ అబ్బాస్, చిన్నాలు చెప్పింది రికార్డ్ చేసిన అసిస్టెంట్-1..
ఇంకొక అసిస్టెంట్ డ్రైవ్ చేస్తూ చేత్తో తల కొట్టుకున్నాడు.
ఆలీ మౌనంగా, రెండు గంటల సేపు తను విన్నది, చూసింది తల కెక్కిస్తున్నాడు.
“మన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు పిల్లల్నీ తీసుకు పోవాలి. తరువాత ఈ దేశాల అధికారులతో మాట్లాడాలి. ఇప్పుడే, హోటల్ కెళ్లాక యునిసెఫ్ (uncef) డైరెక్టర్, యురోప్ వింగ్ తో మాట్లాడుతాను.” ఆలీ తన ప్లాన్ చెప్పాడు.
“యస్. లండన్, న్యూయార్క్ ఇద్దరు డైరెక్టర్లతో మాట్లాడాలి. ఈ వీక్ లో జరగబోయే రేసులకి రమ్మని అడగాలి. అప్పుడే ఇంటర్ పోల్ సహాయంతో ఈ పిల్లలి తీసుకెళ్లి, మిగిలిన పిల్లల సంగతి కూడా చూడాలి.” ఫాతిమా ధృడంగా అంది.
ఫాతిమా లండన్ లో ఉంటుంది.
“ఇవేళ అందరినీ కాంటాక్ట్ చేద్దాం. చిన్నా. అబ్బాస్ చెప్పినవి వీడియో తీశాం కదా! ఆ క్లిప్పింగులు చూపిద్దాం.” అసిస్టెంట్1.
“పిల్లల్ని బ్లర్ చెయ్యడం మర్చిపోవద్దు. వాళ్లని బైటికి తీసుకెళ్లే వరకూ సీక్రెట్ గా ఉంచాలి. అబ్బాస్ పాస్ పోర్ట్ రెన్యూ చేయించాలి. ఎప్పుడో ఎక్స్ పైర్ అయిపోయింది. స్పెషల్ రిక్వెస్ట్ తో.” ఆలీ చకచకా, తన డైరీలో రాసుకున్నాడు.. చెయ్యవలసిన పనులు. కదులుతున్న వాన్ లోనే. రోడ్లు చాలా బాగుంటాయి. వేన్ కుదుపుల్లేకుండా వెళ్తోంది.

“నిజంగా ఈ అంకుల్ వాళ్లు మనల్ని తీసుకెళ్తారంటావా?” అబ్బాస్ అడిగాడు చిన్నాని. ఆ రోజు పొద్దున్నే మొదలుపెడుతున్నాము ప్రాక్టీస్ అని ఆలీకి మెస్సేజ్ పెట్టాడు చిన్నా. ముందురోజు ఉన్న దగ్గరకే వచ్చెయ్యమని కూడా పెట్టాడు.
చిన్నా మొదటి బాచ్ లోనూ, నయారాకీ చివరి బాచ్ లోనూ ఉండేట్లు లిస్ట్ చేసి ఇచ్చాడు హలీమ్ కి అబ్బాస్. నజీర్ ట్రాక్ దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. బాగా నసిగాడు.. కానీ హలీమ్ సాబ్ అలా వేశారంటే ఊరుకున్నాడు. ట్రైనర్ ఉండాలి, ప్రాక్టీస్ చేసేటప్పుడు.
చిన్నా స్వారీ అయిపోయాక, ఆలీ బృందాన్ని కలిశారిద్దరూ, బాత్రూమ్ ల వెనుక. టింకూని తీసుకురాలేదు.. ఫామ్ లో ఉంచేశారు.
చిన్నా, తన పుస్తకం తీసుకొచ్చి, అంతా వివరంగా చెప్పాడు. అబ్బాస్ తన అనుభవాలు చెప్పాడు.
“తప్పకుండా చేస్తారన్నా! నాకా నమ్మకం ఉంది.” చిన్నా భరోసా ఇచ్చాడు.
ఆలీ, చిన్నా టింకూల వీడియో క్లిప్పింగులు బుల్లయ్య సూరమ్మలకి చూపించాడు.. ముందు రోజే. వాళ్ల ఫొటోలు కూడా చిన్నా చూశాడు.
“యూనిసెఫ్ అంటే ఏంటి? ఏం చేస్తారు వాళ్లు? ఆలీ అంకుల్ వాళ్ల సహాయం తీసుకుంటానన్నారు కదా!” అబ్బాస్ అడిగాడు చిన్నాని.
“అది పిల్లల సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రపంచ సంస్థ. చిన్న పిల్లలని హింసించే వాళ్ల దగ్గర్నుంచి తీసుకు పోయి, వారి తల్లి దండ్రుల దగ్గరకో, అనాధ శరణాలయానికో పంపుతారు. యు.యన్.ఓ కి అనుబంధ సంస్థ అది. వాళ్లు కనుక వస్తే భయపడతారు అందరూ కాస్త. మొత్తం అన్ని దేశాల్లోనూ బద్నామ్ ఐపోతామని. ఒక ట్రస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్లందరూ అందులో డైరెక్టర్లు, మెంబర్స్ ఉంటారు. వాళ్లు చెయ్య లేక పోతే ఎవరూ చెయ్యలేరు. ఆలీ అంకుల్ కి వాళ్లు బాగా తెలుసట.” చిన్నా వివరించాడు.
“అవునా! అటువంటిది ఉన్నా వీళ్లు ఇంత ఘోరంగా మనల్ని ట్రీట్ చేస్తున్నారన్నమాట. సరే.. చూద్దాం. ఏమవుతుందో!”

“ఎక్కడ పోయావ్?” నజీర్ కంఠం పెంచి, గట్టిగా అడిగాడు. హలీమ్ వెళ్లిపోయాడని అర్ధమయింది అబ్బాస్ కి.
కాళ్లు వణక సాగాయి. ఎద్దుగాడికి అనుమానం వచ్చిందా?
“సమీర్ కి స్టమక్ పెయిన్ అంటే బాత్రూంలో వాడికి హెల్ప్ కి వెళ్లాను. ఏమైనా ఐతే రేసెస్ కి రాలేడు కదా?”
“ఓ.. ఎలా ఉన్నాడు? నయారాకీ చాలా బాగా చేస్తున్నాడు. వాడికి మంచి జమాల్ (ఒంటె) ఇద్దామని చూస్తున్నా. ఏమంటావు?” నజీర్ వాన్ లో కూర్చుంటూ అడిగాడు. అంతకు ముందే ఆలీ బృందం వెళ్లి పోయారు.
“మంచి జమాల్ సమీర్ ప్రాక్టీస్ చేస్తున్నది కదా?”
“అవును. అది మంచి షేప్ లో ఉంది. సమీర్ త్వరలోనేర్చుకుంటాడు.. ఇంకొకటిచ్చినా ఫరవాలేదు.”
“సాయంత్రం ఇంకొకసారి రైడ్ చేయించినప్పుడు ఒంటెలని మార్చి చూద్దాం. తెలిసి పోతుంది.” అబ్బాస్ తెలివిని అభినందిస్తున్నట్లు చూశాడు నజీర్.
అబ్బాస్ కుదుట పడ్డాడు.
పిల్లలందరినీ వాన్ ఎక్కించి ముందుకి నడిపాడు నజీర్.

*****

ఆలీ పంపిన మైల్స్ కి మంచి స్పందన వచ్చింది. లండన్ లో ఉండే యునిసెఫ్ డైరెక్టర్ వీడియోలు చూసి, చిన్నా చెప్పింది విని చాలా బాధ పడ్డాడు.
జరగబోయే రేసులకి వస్తానన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని కలుస్తానన్నాడు. అవే క్లిప్పింగులు న్యూయార్క్ డైరెక్టర్ కి కూడా పంపించాడు ఆలీ.
సరస్వతికి ఎప్పటికప్పుడు జరుగుతున్నదంతా చెప్తున్నారు.
అనుకున్న రోజు రానే వచ్చింది.
చిన్నా, టింకు, అబ్బాస్ పాస్ పోర్ట్ లు లోపల వైపు జేబుకి కుట్టిన చొక్కాలు వేసుకున్నారు.
దుబాయ్ లో ప్రఖ్యాతి గాంచిన మార్మూన్ రేస్ ట్రాక్ మీద జరుగుతున్నాయి రేసులు.
ఆలీ బృందం పెందరాళే బ్రేక్ ఫాస్ట్ తినేసి బయల్దేరారు.
పెద్ద వాన్..
వెనుక వరుస సీటు, బూట్(డిక్కీ) కింద మారటానికి వీలుగా ఉంది. లోపల్నుంచే, స్విచ్ నొక్కుతే, పైన కవర్ పరుచు కుంటుంది.
ముందురోజే కోలాహలం మొదలయింది.
అన్ని రకాల దుకాణాలు తెరిచారు.
మొబైల్ హాస్పిటల్ కూడా పెట్టారు. ఆలీ వాళ్లు వెళ్లే సరకే, డాక్టర్లు, నర్సుల బృందం వచ్చేసి, కావలసిన విధంగా సర్దేసుకున్నారు.
గుజరాతీ స్త్రీలు ఒక పక్క దాండియా ఆడుతున్నారు.
ఇంకొక పక్క కరాటే, జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేస్తున్నారు.
బెడూ స్త్రీల చేతి పనుల షాపులు సరే సరి.
నాలుగు ఒంటెలను వినోదానికి, వచ్చిన ప్రేక్షకులని తిప్పడానికి తీసుకొచ్చారు. వాటికి రంగు రంగుల జీనులు అమర్చారు.
హలీమ్ బృందం ముందురోజే వచ్చేసి, వారికి వేసిన గుడారాలలో సర్దుకున్నారు.
ఎప్పటిలాగానే ముందుగా సీనియర్ ఒంటెల రేసులు జరుగుతాయి.
ఆలీ బృందం తమ వాన్ నే గుడారంగా వాడుకుంటున్నారు. మొబైల్ టాయిలెట్లు ఎలాగా ఉంటాయి. అవి కాక, పర్మనెంట్ వి ఉన్నాయి..
ఒంటెలని, తీసుకొచ్చి వాటి కొట్టాలలో నిలుపుతున్నారు. అవి వస్తుంటే, నిరాటంకంగా వీడియోలు తీస్తున్నారు అందరూ.. వచ్చిన ప్రేక్షకులు.
ఆ సంరభాన్నంతా వీడియోలో భద్ర పరుస్తున్నాడు. ఆలీ అసిస్టెంట్.
ప్రభుత్వ అధికారులు వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు.
ఆలీ తమ వాన్ లో వెళ్తూ, ఒంటెల పరుగులని చూడాలని నిశ్చయించాడు. అంతలో..
ఆలీ ఫోన్ రింగయింది. “యునిసెఫ్ డైరెక్టర్.. ఓ మై గాడ్..” అలీ ఫోన్ ఆన్ చేశాడు.
“నెక్స్ట్ సెషన్ కి వస్తున్నాం. అప్పుడే యు.ఏ.యి ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. కలుద్దాం.” డైరెక్టర్ చెప్పాడు.
“మరి.. పోలీస్ ఫోర్స్?”
“ఎక్కువ మందిని అలౌ చెయ్యరు. బట్.. తీసుకొస్తున్నాం. పర్మిషన్ దొరికినంత వరకూ.”
అందరూ ఆనందంగా కరచాలనం చేసుకున్నారు, ఒకరితో ఒకరు. తాము అనుకున్నది సవ్యంగా జరుగుతుంటే కావలసిందేముంది?
“అరుగో జాకీలు.. బాగా డెకొరేట్ చేశారే! చిన్నాని గుర్తు పట్టలేం. అందరూ ఒకలాగే ఉన్నారు. అబ్బాస్ కనిపిస్తున్నాడు.” ఫాతిమా అంది.
వేన్ లో కూర్చునే అంతా పరిశీలిస్తున్నారు ఆలీ బృందం.
“అమ్మో! అటు చూడండి..” అసిస్టెంట్ చూపిస్తున్న వైపు చూశారు.
కొంచెం దూరంగా, జాకీలని ఫొటోలు తీస్తున్న వారి దగ్గరగా వెళ్లి బెదిరిస్తున్నారు ట్రైనీలు.
“నో.. నో ఫోటో. నో ఫొటో.”
వినకుండా తియ్యబోయినతని దగ్గర్నుంచి కామెరా లాగేసుకుని, అందులో చిప్ తీసి దూరంగా ఇసుకలోకి విసిరేశాడు ఒకతను. కామెరా నేలకేసి కొట్టాడు.
“ఓ మై గాడ్..” తన కామెరాని దాచేశాడు ఆలీ అసిస్టెంట్.
జనం అలా వస్తూనే ఉన్నారు. కొత్త కొత్త గుడారాలు వెలుస్తున్నాయి.
“చిన్నాకి, మన వాన్ రంగు, నంబర్ మెస్సేజ్ ఇవ్వు ఫాతిమా!” ఆలీ బైనాక్యులర్ లోంచి చూస్తూ అన్నాడు. అందరూ తలొక బైనాక్యులర్ తెచ్చుకున్నారు. ఒక్కొక్కళ్లు ఒకో దిక్కు చూస్తుండాలని అనుకున్నారు.
రేసులు మొదలయ్యాయి.
టింగ్ టింగ్.. మెస్సేజ్. చిన్నా దగ్గర్నుంచి.
“మీ వాన్ గుర్తు పట్టాను. మీరు ఇప్పుడు ఫాలో అవద్దు ట్రాక్ ని. మా రేస్ లంచ్ అయాక. అప్పుడు వాన్ లో ఫాలో అవండి. మేం చూస్తుంటాం.”
“అమ్మయ్య కనెక్షన్ దొరికింది. ఇంక ఫర్లేదు, ఆ పిడుగు చూసుకుంటాడు.” ఆలీ వెనక్కివాలి కళ్లు మూసుకున్నాడు.
“ఏం క్రేజ్.. ఏం క్రేజ్. టూ మచ్.”
స్టేడియం దగ్గరున్న పెద్ద తెర మీద అంతా కనిపిస్తోంది. ఇంకా.. అక్కడక్కడ కొంచెం చిన్న తెరలు పెట్టారు. పైనుంచి హెలికాప్టర్ లోంచి వీడియో ఫిల్మ్ తీస్తున్నారు.
“ఒలింపిక్ లెవెల్లో జరుగుతోంది.” ఫాతిమా అంది. ఎవరూ బైనాక్యులర్ వదలట్లేదు. తన కామెరాకి చాలా పవర్ ఫుల్ టెలిస్కోపిక్ లెన్స్ పెట్టాడు అసిస్టెంట్. వాన్ కి బిల్టిన్ సదుపాయం ఉంది, టెలిస్కోప్ గొట్టం దూరడానికి.
“అడుగో అబ్బాస్..” కేకేసింది ఫాతిమా.
మోటర్ సైకిల్ మీద కూర్చుని రేస్ ఫాలో అవుతున్నాడు అబ్బాస్. వీళ్ల వాన్ కేసి తిరిగి బొటనవేలు పైకెత్తి చూపించాడు.
చూస్తుండగానే ఒక రౌండ్ అయిపోయింది.
“ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మధ్యాన్నం ఉంటుంది మజా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని తీసుకెళ్లడం అంత సులభం కాదనిపిస్తోంది.” ఆలీ వార్నింగ్ ఇచ్చాడు.
జాగ్రత్తగా ఉండటం చాలా కష్టం అని త్వరలోనే తెలిసి పోయింది ఆలీ వాళ్లకి.
మధ్యాన్నం అయింది. అసలు రేసులు మొదలవ బోతున్నాయి. అక్కడి సెక్యూరిటీ వచ్చి వాన్ ని పరిశీలించారు. కామెరాలు తప్ప ఏం కనిపించలేదు. టెలిస్కోప్ గొట్టం గురించి అడిగాడొకడు.
వివరాలు తెలుసుకుని, వెళ్లి పోయారు.
రేస్ ట్రాక్ పక్కన ఫాలో అయే రోడ్డంతా చాలా గందరగోళంగా ఉంది. చాలా కార్లు వచ్చాయి, మధ్యాన్నం అవుతున్న కొద్దీ.
“ఆ రోడ్ మీదికి వెళ్లామంటే, మనం తప్పించుకోడం కష్టం.” ఆలీ అన్నాడు.
“అవును. రేస్ అయిపోయాక వాళ్లు వచ్చేది ఈ చివరికే. ఇక్కడే ఆగుదాం.” ఫాతిమా సలహా..
“మరి టింకూ?”
“వాడిని చిన్నా గైడ్ చెయ్యాల్సిందే. మనం ఏం చెయ్యలేం ఈ క్రౌడ్ లో.” ఆలీ పెదవి విరిచాడు.
“అదిగో.. యునిసెఫ్ డైరెక్టర్..” ఫాతిమా అరిచింది. తనకి తెలుసు అతను. పెద్ద వాన్ లో వచ్చారు. చాలా మందే ఉన్నట్లున్నారు.
ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు. అందరూ స్టేడియమ్ లో స్పెషల్ వింగ్ లో కూర్చున్నారు.
రేసు మొదలయింది. అదృష్టం బానే ఉంది. దుమ్ము లేవట్లేదు.
జనం గోల మధ్య మొదటి రేస్ ఐపోయింది.
రెండోది మొదలవబోతుండగా జరిగిందా సంఘటన..
బుల్లి జాకీలందరూ ఒక పక్కకి వెళ్లారు. నయారాకీ సాహిల్ దగ్గరికి వెళ్లి నిలుచున్నాడు, ఆయాస పడ్తూ. వాడి ఒంటె చాలా వేగంగా పరుగెత్తింది. రికార్డ్ టైమ్ లో వచ్చింది. అందరికీ తెలిసి పోయింది, అదే మొదటి ప్రైజ్ గెలుచుకుంటుందని.
చిన్నా కూడా అక్కడే ఉన్నాడు. వాడిది నాలుగో రేస్.
అంతకు ముందు జరిగిన రేసుల్లో ఫస్ట్ వచ్చినవాడు వచ్చాడు.. తలెగరేస్తూ. కళ్లు పెద్దవి చేసి అడిగాడు నయారాకీ గురించి. సాహిల్ చెప్పాడు.. కొత్తగా వచ్చాడని.
“ఐతే.. ఇంత ఫాస్ట్ గా తీస్కెళ్తావా నిన్న గాక మొన్నొచ్చి..” కోపంతో ముక్కుపుటాలదురుండగా అరిచాడు. వాడు, హలీమ్ ఔజుబా వాడే. కానీ, చిన్నా వాళ్ల దాంట్లో ఉండడు. ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటాడని వాడిని ప్రత్యేకంగా చూస్తుంటారు అందరూ. హలీమ్ తో సహా..
నయారాకీ బిత్తరపోయి చూస్తున్నాడు. అసలు వాడికి ఇదంతా ఏమిటో అర్ధం అవట్లేదు. కింది పెదవి చప్పరిస్తూ కళ్లు పెద్దవి చేసి భయంగా చూస్తున్నాడు.
అదంతా తమాషాగా అనిపించి, ఆలీ అసిస్టెంట్ వీడియోకి ఎక్కించడం మొదలు పెట్టాడు.
అరవడమే కాదు, నెత్తి మీద ఒక్కటిచ్చాడు. నయారాకీ బెదిరి పోయి ఏడుపు లంకించుకున్నాడు. వాడు ఇంకా విజృంభించేశాడు. వాడి ఔజుబాలోని స్నేహితులంతా చుట్టూ మూగారు. అందరూ కలిసి వాడిని కుమ్మేసి తన్నటం మొదలెట్టారు.
వీడియో తియ్యడానికి ఏమీ కనిపించడం లేదు. కానీ ఏదో ఘోరం జరుగుతోంది.. తెలిసి పోతోంది అందరికీ.
చిన్నా అందర్నీ తోసుకుని బైటికొచ్చాడు. గట్టిగా కేకలేస్తూ.
పరుగెత్తుతూ అటూ ఇటూ చూస్తున్నాడు, ఎవరికి చెప్పాలా అని. అందరూ ఎవరి హడావుడిలో వాళ్లున్నారు.
ఆలీ వాన్ దగ్గర్లోనే ఉంది కానీ.. వాళ్లకి చెప్తే ప్రయోజనం లేదని తెలుసు. పైగా వాన్ లో వాళ్లకి ప్రమాదం కలగచ్చు. అక్కడ ఉన్నది నెలలే ఐనా, వాళ్ల మనః స్థితిని సరిగ్గానే అంచనా వేశాడు చిన్నా.
కొంచెం దూరంలో నజీర్, అబ్బాస్ తో మాట్లాడుతూ వస్తున్నాడు. అయ్యో అనుకున్నాడు. అబ్బాస్ తో చెప్పటానికి కూడా లేదు. నజీర్ రాక్షసుడు పట్టించుకోడు. తరువాతి రేసులో ఒంటెని పరుగెత్తించేది తనే మరి. తిట్టి ఒక మూల కూర్చో పెడతాడు. అంతలో స్టేడియమ్ లోకి వెళ్తున్న హలీమ్ కనిపించాడు.
ఒంట్లో ఉన్న శక్తి అంతా కాళ్లలోకి తీసుకొచ్చి పరుగెత్తాడు. తన పైనున్న యూనిఫామ్ టీషర్ట్ ని తీసి, చేత్తో ఊపుతూ, హలీమ్ దృష్టిని ఆకర్షించాలని అరవటం మొదలెట్టాడు, కంఠం పగిలి పోయేట్లు.
“అయ్యో! టీషర్ట్ తీసేశాడు. లోపలి షర్ట్ మీద పాస్పోర్ట్ కుట్టిందగ్గర ఎత్తుగా కనిపిస్తోంది.” ఫాతిమా ఆందోళనగా అంది.
ఆలీ చిరునవ్వు నవ్వాడు.
“అదే వాడి ప్రత్యేకత. అక్కడ అంతమంది ఉన్నారు, ఒక్కరైనా బైటికొచ్చారా? ఏదో వింత చూసినట్లు చూస్తున్నారు. చిన్నా స్వభావం అంతే.. తన గురించి కూడా పట్టించుకోడు. ఎవరైనా బాధ పడుతున్నారంటే వెంటనే స్పందిస్తాడు, తనకి చేతనైన సహాయం చేస్తాడు. అంతటి ఆందోళనలో కూడా ఆ పిల్లవాడి విచక్షణ చూడండి. హలీమ్ దగ్గరికి పరుగెడ్తున్నాడు. అతనే ఏమైనా చెయ్యగలడనే నమ్మకంతో.”
“మరి ఆ పాస్ పోర్ట్..”
“ఏమీ అవదు ఫాతిమా! ఈ సందడిలో ఎవరు పట్టించుకుంటారు? పైగా మనకి తెలుసు కనుక కనిపెట్టగలిగాం. అల్లా నే కాచుకుంటాడు వాడిని. చూడండి.. హలీమ్ చూశాడు వాడిని. మన ట్రస్ట్ లో మెంబర్ గా చెయ్యచ్చు చిన్నాని.” ఆలీ భరోసా ఇచ్చాడు.
“అంతే కాదు, వాడి అనుభవాలన్నీ ఎంత చక్కగా బొమ్మలతో రాశాడో చూశారు కదా! రోబోలని జాకీలుగా వాడచ్చని, బొమ్మవేసి చూపించాడు. ఈ పుస్తకం తీసుకెళ్లి, డైరెక్టర్ కి చూపిస్తాను. ఇదెవరిదో తెలియదులే.. అంత ప్రమాదమేం ఉండదు.” ఆలీ మాటలు వింటున్న సభ్యులు తలలూపారు, ఔనన్నట్లుగా.
హలీమ్, చిన్నాని చూశాడు. వాడి దగ్గరగా వచ్చి ఏమయిందని అడిగాడు.
చిన్నా, గొడవ జరుగుతున్న దిక్కుకి చూపించి జరుగుతున్న ఘోరం చూపించాడు.
హలీం సెల్ తీసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తూనే పరుగెత్తాడు.
అప్పుడు చిన్నాకి గుర్తుకొచ్చి, టీషర్ట్ వేసేసుకున్నాడు.
హలీం వెళ్లే సమయానికే నజీర్, అబ్బాస్ కూడా అక్కడికి చేరారు. పిల్లల గుంపుని చెదరగొట్టి చూస్తే ఏముంది.. నయారాకీ స్పృహ తప్పి పడున్నాడు, కదలకుండా మెదలకుండా.
వాడిని చూస్తుంటే ప్రాణం పోయుంటుందని, బైనాక్యులర్స్ లోంచే అనిపించింది ఆలీకి. చిన్నా అక్కడే నేల మీద కూలబడిపోయాడు. వాడిక్కూడా తెలిసి పోయింది, నయారాకీ ఇంక లేవలేడని. వాడికి రాకీ అని తనే పేరు పెట్టాడు. అందుకే రాకీ లాగే చచ్చి పోయాడా? వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చిన్నా.
అభం శుభం తెలియని అమాయకుడు. వాడికే తెలియని, వాడిలోని ప్రతిభ వాడి ప్రాణం తీసింది.
అంతలో..
నజీర్ వచ్చి వాడి రెక్క పట్టుకుని లేపాడు.
“ఇప్పుడు నీ రేసుంది. బైటికిరా ఏడుపు నుంచి. హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా! వస్తాడులే.. కమాన్. లే..లే.”
అయోమయంగా చూశాడు చిన్నా వాడిని. వీడు మనిషే కదా? కొంచెం కూడా గుండె కదలదా? ఛా.. వీడిదగ్గరుండడం, వీడిని చూడడం.. ఎంత అసహ్యంగా ఉందో! త్వరగా బైట పడాలి. వాన్ ఉందా అని చూశాడు. అక్కడే ఉంది.
లేచి, కాళ్లు సవరించుకున్నాడు చిన్నా.
నజీర్ వెంట వెళ్తూ అటూ ఇటూ చూశాడు టింకూ కోసం. వాడు అక్కడే ఉన్నాడు, తన పక్కనే, నోట్లో వేలేసుకుని భయంగా చూస్తూ. వెనక్కి తిరిగి, కనిపించే వాన్ దగ్గరికి వెళ్లమని సైగ చేశాడు.. ఎవరి కంటా పడకుండా. అయినా ఆ గోలలో ఎవరూ టింకూని పట్టించుకునే స్థితి లేదు. నజీర్ అబ్బాస్ కోసం చూస్తున్నాడు..
ఎక్కడా లేడు. చిన్నాని అడిగాడు.
“హలీమ్ సాబ్ తో వెళ్లాడు. ఆయన రమ్మన్నాడు.” మారు మాట్లాడకుండా చిన్నాని చెయ్యి పట్టుకుని ఒంటె దగ్గరికి తీసుకెళ్లాడు.
రేసు మొదలవటానికింకా పది నిముషాలు టైముంది. ఒంటెని మచ్చిక చేసుకోమని చిన్నాకి చెప్పి, తను కూడా దాన్ని నిమర సాగాడు.. ఏదో మాట్లాడుతూ, ఎంతో సౌమ్యంగా.
తమతో కూడా ఇలా మాట్లాడచ్చు కదా! నోరులేని జంతువు మీదున్న అభిమానం మనిషి పిల్లల మీద లేదు.

ఆలీ సెల్ రింగయింది. యునిసెఫ్ డైరెక్టర్..
“మీరు స్టేడియమ్ లోకి రాగలరా? పి.యమ్ కలవాలనుకుంటున్నారు.”
ఆలీ వాన్ తలుపు తీసుకుని దిగుతుండగానే టింకూ తలుపు దగ్గరికి వచ్చాడు.
అటూ ఇటూ చూశాడు ఆలీ.. ఎవరి హడావుడి వాళ్లదే!
“ఏడిచి గొడవ చెయ్యవుకదా?” సైగలతో అడిగి, చటుక్కున వాడిని వాన్ లోకి ఎక్కించేశాడు ఆలీ. లోపలున్న వారు వాడిని వెనుక సీటులోకి లాగేశారు, సీటు కింద కూర్చోమని సైగ చేస్తూ. టింకూకి కొన్ని బిస్కట్లిచ్చింది ఫాతిమా. షర్ట్ తడిమింది. పాస్ పోర్ట్ ఉన్నట్లు గట్టిగా తగిలింది.
“వన్ మిషన్ సక్సెస్ ఫుల్..” అసిస్టెంట్ నోట్ చేసుకున్నాడు.
“అంకుల్!” వెనక్కి వంగి చూశాడు ఒకటో అసిస్టెంట్.
“ఇంక రేపట్నుంచే నేను పేడ ఎత్తక్కర్లేదు కదా? చేతులు మండవు కదా?” రెండు చేతులూ పైకి లేపి చూపించాడు టింకూ.
అరచేతులు నల్లగా.. చేతుల నిండా గీతలు. రకరకాల స్టేజిల్లో మానుతూ గరుకుగా.. పువ్వుల్లా ఉండాల్సిన చేతులు. పని చేయించుకోవచ్చు కానీ, ఇట్లాగా? చూసిన వాళ్లకి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“అక్కర్లేదు బాబూ! మీ ఇంటికెళ్లి స్కూల్ కెళ్లచ్చు.” ఫాతిమా వాడి తల నిమిరి చెప్పింది.

ఆలీ యునిసెఫ్ డైరెక్టర్ తో జరుగుతున్నదంతా చర్చించాడు. చిన్నా పుస్తకాన్ని చూపించి వివరించాడు. అందులోనే, రోబోస్ ని జాకీల కింద ఏ విధంగా వాడచ్చని చిన్నా ప్రపోజ్ చేశాడో చెప్పాడు.
“ఇది ఆల్ రెడీ ఉంది. కొన్ని చోట్ల చేస్తున్నారు కూడా. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి పాపులర్ చెయ్యాలి. ఈ ఛైల్డ్ జాకీలదంతా పెద్ద రాకెట్. బోలెడు డబ్బు రోటేట్ అవుతుంది. ఇందులో ఉన్న కిక్ ప్రాణంలేని రోబోల్లో ఉండదు కదా!”
“యస్. కానీ చైల్డ్ అబ్యూజ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే.. ఇంతకు ముందే, ముక్కు పచ్చలారని ఒక జాకీని మర్డర్ చేశారు, తోటి జాకీలే.. జెలసీతో. ఆ మర్డరర్లకి కూడా ఏమీ తెలియదు. వాళ్లూ పసి పిల్లలే.. ఈ రాకెట్ ని ఆపాలి మనం.” చాలా సేపు డిస్కజ్ చేసి, మరునాడు కలుద్దామని నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ కూడా ఆలీ బృందం ఉన్న హోటల్ లోనే ఉన్నారు.
డైరెక్టర్, పి.యమ్ ని పరిచయం చేశాడు.
పి.యమ్ సెక్రెటరీ, రెండు నెలల తరువాత పీ.యమ్ ని కలవడానికి అపాయింట్ మెంట్ ఇచ్చాడు.. వాళ్లందరికీ.
“ఫరవాలేదు.. మువ్ మెంట్ వచ్చింది. థాంక్యూ సర్. మా రిక్వెస్ట్ వెంటనే కన్సిడర్ చేసి, ఇంత శ్రమ తీసుకుని వచ్చినందుకు.” ఆలీ డైరెక్టర్ దగ్గర్నుంచి వెళ్లి పోతూ షేక్ హాండ్ ఇస్తూ చెప్పాడు.
“నోనో.. ఇది నా డ్యూటీ. మీకే మేము థాంక్స్ చెప్పాలి.”
“రేపు ఇమ్మీడియట్ గా నాకొక ఫేవర్ చెయ్యాలి మీరు. దాని గురించి రేపు చెప్తాను.” ఆలీ అడిగాడు, డైరెక్టర్ పక్కనున్న కుర్చీలోంచి లేస్తూ.
“తప్పకుండా. చెయ్యగలిగితే తప్పక చేస్తాను.”
అప్పుడే చిన్నా పాల్గొన్న రేస్ అయిపోయింది. చిన్నా ఒంటె ఆ రేసులో ఫస్ట్ వచ్చింది. ఈ సారి చిన్నానే చూడ గలిగాడు.
నజీర్ ఆనందంగా దగ్గరకొచ్చి చిన్నాని దింపాడు. దింపుతూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. అసహ్యంగా ఉన్నా, ఆనందంగా మొహం పెట్టాడు చిన్నా.
అబ్బాస్ వచ్చి, చిన్నా చెయ్యి పట్టుకున్నాడు.
“నజీర్ అంకుల్! టాయిలెట్ కి వెళ్లి వస్తాం. చిన్నా దుమ్ము కొట్టుకు పోయున్నాడు.”
“ఇవేళ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్కడికీ వెళ్లకు.” తల ఎగరేసి, హలీమ్ దగ్గరికి పరుగెత్తాడు నజీర్.
నజీర్, హలీమ్ చూస్తుండగా టాయిలెట్స్ దగ్గరికి వెళ్లారిద్దరూ. ఆలీ వాళ్లు వాన్ స్టార్ట్ చేసి, టాయిలెట్ల వెనక్కి తీసుకెళ్లారు. మొబైల్ టాయిలెట్లు. అక్కడ కూడా కిక్కిరిసి ఉన్నారు జనం. ఎవరి గోల వారిదే.
చిన్నా, అబ్బాస్ లు మొహాలు కడుక్కుని, పైనున్న రంగుల టీ షర్ట్ తీసేసి, బైటికొచ్చి చూశారు. జనాలు చాలా మంది చేరారు. మైదానమంతా నిండి పోయింది.
రకరకాల గోలలు.. కోలాహలంగా ఉంది. నజీర్, హలీమ్ లు కనిపించలేదు. లోపల్నుంచి వెనక్కి వెళ్లి, తీసున్న తలుపులోంచి వాన్ లోకి ఎక్కేశారిద్దరూ.
వెనుక సీటు లోకి దూకమని సైగ చేసి పైన కవర్ వేసేసి వెంటనే వాన్ ని ముందుకి నడిపించాడు రెండో అసిస్టెంట్.
“చిన్నా! మనం ఇక్కడ్నుంచి వెళ్లి పోతున్నామా?” టింకూ అడిగిన ప్రశ్నకి చిన్నా తలూపాడు, నోరంతా ఎండిపోయి మాట రాక పోతుంటే. అబ్బాస్ సీటు మీద అడ్డంగా పడిపోయాడు.
…………………..
10

ఆ తరువాత అంతా చకచకా జరిగి పోయింది. నజీర్ కానీ హలీమ్ కానీ తప్పిపోయిన తమ జాకీలని వెతక లేదు.
ముగ్గురినీ ఇల్లీగల్ గా తీసుకొచ్చారు కద. నోరెత్తుతే వాళ్లకే ప్రమాదం.
నయారాకీ ఒంటె ఫస్టు, చిన్నా ఒంటె థర్డ్ వచ్చాయి.
అంతా అయే సరికి రాత్రి ఒంటిగంటయింది. ఎక్కడో పడుక్కునుంటార్లే అనుకున్నాడు నజీర్. అబ్బాస్ దగ్గర మోటర్ బైక్ ఉండనే ఉంది.
ఔజుబాకి వచ్చినప్పుడు కానీ తెలియలేదు.
“ఎక్కడి కెళ్తారు వీధి కుక్కలు. ఎవరు తెలుసు. ఎడారిలో ఎండలో పడి మాడి చస్తారు.” నజీర్ పళ్లు పిండుకున్నాడు. అంతకు ముందు అనుభవమే వాళ్లకి. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేరు. తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది. అబ్బాస్ వెళ్లి పోయినందుకు చాలా బాధగా ఉంది వాడికి.
మరునాడు యునిసెఫ్ డైరెక్టర్, వారి బృందంతో చాలా సేపు మాట్లాడారు ఆలీ బృందం. తమ దగ్గరున్న సమాచారం అంతా ఇచ్చారు.
ముఖ్యంగా చిన్నా సాక్షం.. చాలా స్పష్టంగా తడుముకోకుండా కామెరా ముందు మాట్లాడాడు. వాడి పుస్తకం మంచి ప్రూఫ్ కింద పనికొచ్చింది. అందులో ఉన్న ఆనంద్ అడ్రస్ తీసుకుని వాళ్ల రాకెట్ అంతా మూసేశారు.
ఆనంద్ జైలుకెళ్లాడు.
అబ్బాస్ చెప్తున్నది వింటూ కంట తడి పెట్టని వారు లేరు.
అదంతా ఐక్యరాజ్య సమితి స్థాయికి తీసుకెళ్లాడు ఆలీ.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెలరేగింది.
ఆరబ్ దేశాల రాజులందరూ, పిల్లల రవాణాని బాన్ చేశారు.. కనీసం పేపర్ మీద.
రోబోలని వాడాలని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.

*****

పదేళ్ల తరువాత..
“అన్నా!” అంటూ వచ్చాడు చిన్నా.
“ఏంటిరా చిన్నా?” అబ్బాస్ గుట్టలుగా ఉన్నపూలని వేరు చేస్తున్న ఆడవాళ్ల పని తీరుని గమనిస్తూ చిన్నా కేసి తిరిగాడు.
బుల్లయ్య వీధి వాకిట్లో కూర్చుని వచ్చే పోయేవాళ్లని పలుకరిస్తున్నాడు. చిన్నా అబ్బాస్ ని తీసుకు రాగానే మారు మాట్లాడకుండా అక్కున చేర్చుకున్నారు, బుల్లయ్య, సూరమ్మ.
నర్సమ్మ బాగా ముసలిదైపోయి, ఒక పక్క కూర్చుని పూలు కడ్తూంటుంది. సూరమ్మ ఇల్లు చూసుకుంటూ, పూల సంగతి కూడా చూసుకుంటుంది.
కష్టపడి పదో క్లాసు పాసయ్యాక ఇంక చదవననేశాడు అబ్బాస్. తన పూల వ్యాపారం, బాంక్ లోన్ తీసుకుని, విస్తృతంగా చెయ్యడం మొదలు పెట్టాడు బుల్లయ్య. అబ్బాస్ మొదట్లో చేదోడు వాదోడుగా ఉంటూ, చివరికి మొత్తం వ్యాపారాన్ని త్వరలో తనే చూసుకోవడం మొదలు పెట్టాడు. వ్యాపారం చాలా బాగా సాగుతుండడంతో, ఊరికి కొంచెం దూరంలో, మంచి ఏరియాలో టూ బెడ్ రూమ్ ఇల్లు తీసుకున్నారు. ఇల్లు చిన్నదైనా ముందూ వెనుక పెద్ద వరండాలున్నాయి.
టింకూ వచ్చాక మస్తానయ్య ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకుంటున్నాడు. టింకూ ఇంటర్ చదువుతున్నాడు. వాడికి డాక్టరవాలని ఉంది.
“నాకు హార్వర్డ్ లో సీటొచ్చిందన్నా. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో.. యమ్మెస్ చెయ్యడానికి. కాకపోతే..”
“కాలేజ్ మంచిదేనా?”
“నంబర్ వన్ అన్నా. కానీ..”
“ఇంకేం.. వెంటనే చేరు. ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం. నీ చదువవ్వాలే కానీ ఎంతలోకి తీరుస్తాం?”
చిన్నాని పైకి లేపి అన్నాడు అబ్బాస్.
చిన్నా ఎత్తు ఇంకొక నాలుగంగుళాలు పెరిగాడు. హార్వర్డ్ లో మెరిట్ కి ప్రాధాన్యతనిస్తారు. భౌతిక లోపాలు పట్టించుకోరు.
ఆలీ, చిన్నా అబ్బాస్ లతో టచ్ లోనే ఉన్నాడు.
“చిన్నా!” టింకూ లోపలికొచ్చాడు.
“వెయ్యిమంది ఛైల్డ్ జాకీలని రెస్క్యూ చేశారుట. ఆలీ అంకుల్ మెస్సేజ్ ఇచ్చారు.”
చిన్నాని ఎంతో పొగిడి, ఆనంద్ వంటి వాళ్ల రాకెట్లని ఛిన్నా భిన్నం చేశాక కూడా, ప్రైవేట్ కామెల్ రేసుల వాళ్లు యధావిధిగా బుల్లి జాకీల వ్యాపారం సాగిస్తూనే ఉన్నారు.
చిన్నా, టింకూ.. ఇద్దరి ఐడిలకీ మైల్స్ వస్తుంటాయి. ఇంట్లో కూడా నెట్ పెట్టుకున్నారు.
“వెరీ గుడ్. నేను అమెరికా వెళ్లాక ఇంకా బాగా ఆలీ అంకుల్ వాళ్ల సంస్థలో పని చేస్తాను.” చిన్నా ఉటంకించాడు.
“అబ్బికి సంబంధాలొస్తున్నాయి. వాని పెండ్లయ్యాక నువ్వు ఎక్కడికెళ్లాలో వెళ్లు.” సూరమ్మ ఆర్డరేసింది.
అబ్బాస్ కేసి చూశాడు చిన్నా. అవునన్నట్లు తలూపాడు అబ్బాస్. గత నాలుగు సంవత్సరాల నుంచీ, చిన్నా డాక్టర్ గారి ద్వారా, ఆబ్బాస్ ని సైకాలజిస్ట్ కౌన్సెలింగ్కి తీసుకెళ్తున్నాడు చిన్నా. పాత సంగతులు పూర్తిగా తెర వోనక్కి తోసేసినట్లే అని చెప్పారు డాక్టర్ గారు.
“అలాగే అమ్మా! నువ్వు చెప్పాక కాదన గలనా? చిన్నా అబ్బాస్ని గట్టిగా పట్టేసుకున్నాడు.. వాడి నడుం దగ్గరకొచ్చిన చిన్నా.
“నువ్వు వామనుడంతటి గట్టివాడవేరా!” అప్పుడే లోపలికొచ్చిన బుల్లయ్య గర్వంగా మీసాలు మెలేశాడు.

*————–*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *