April 20, 2024

కార్తీక మాసపు వెన్నెల

రచన: నిష్కల శ్రీనాధ్

కార్తీక్ ఇంటి ముందు బండి ఆపి గేటు తీస్తుండగా రంగారావు ఇంటి బయటకు వస్తు కనిపించాడు వెంటనే నవ్వుతు బండి దిగాడు “ఏంటి మావయ్య ఎలా ఉన్నారు ? ఎప్పుడు వచ్చారు ఇంట్లో అందరు బాగున్నారా ” అంటూ పలకరించాడు, దానికి సమాధానంగా ” బాగున్నాను రా ! అందరు బాగానే ఉన్నారు అరగంట క్రితమే వచ్చాను అర్జంటు పని ఉంది నేను చెప్పాల్సిన విషయాలు అన్ని అమ్మకు చెప్పాను ఆదివారం ఏమి పనులు పెట్టుకోకు సరే నా వెళ్ళోస్తా ” అంటూ హడావిడి గా ఆటో ని పిలిచి ఎక్కేసాడు . గుమ్మం దగ్గరే నిల్చున్న తల్లి ని ప్రశ్నార్థకం గా చూశాడు నవ్వుతు ఇంటి లోపలకి రమ్మని చెప్పింది కార్తీక్ తల్లి వసుధ . కార్తీక్ బ్యాంకు ఉద్యోగి వయసు 32 సంవత్సరాలు ఎంబీఏ పూర్తి చేయగానే ఉద్యోగం వచ్చినా చెల్లి పెళ్ళి బాధ్యతల వల్ల పెళ్ళి గురించి ఆలోచనలు కాస్త ఆలస్యం అయ్యాయి తీరా సంబంధాలు చూడటం మొదలు పెట్టాక కార్తీక్ మనసును ఏ అమ్మాయి ఆకర్షించలేదు.
” అమ్మ నాకు పెళ్ళి మీద ఇష్టం పోయింది ఇంకో పెళ్ళి చూపుల కు వెళ్ళి మళ్ళి భంగపడటం అవసరమా?” అని అడిగాడు కార్తీక్ , వసుధ ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ ” ఏంట్రా అలా అంటావు మొదట్లో ఇలానే వంకలు పెట్టి మంచి సంబంధాలు చెడగొట్టి ఇప్పుడు పెళ్ళి మీద ఇష్టం లేదు అని కబుర్లు చెప్తున్నావ్ నీకు అమ్మాయి నచ్చితే జాతకాలు కుదరవు అవి కుదిరితే నీకు నచ్చదు అన్నీ సరిపోయాయి అంటే వాళ్ళ కుటుంబం నచ్చదు ఇంక మా వల్ల కాదు అని అందరు చేతులేత్తెసారు పాపం మావయ్య కష్టపడి ఎదో సంబంధం తీసుకొచ్చాడు మారు మాట్లాడకుండా పెళ్ళి చూపులకి రా ఆదివారం సాయంత్రం వెళ్దాం సరే నా “అంది వసుధ కార్తీక్ ని మాట్లాడనివ్వకుండా . ” సరే ” అని టీవీ రిమోట్ నొక్కాడు ఈ వాదన కొనసాగించడం ఇష్టం లేక , వంట గది లోకి వెళ్ళబోతు ఎదో గుర్తు వచ్చిన దాని లా వెనక్కి వచ్చి ” కార్తీక్ రేపు రెండో శనివారం కదా నీకు ఎలాగూ సెలవు కాబట్టి బాబాయి ని చూసి రా హాస్పిటల్ లో ఉన్నప్పుడు రావడమే నువ్వు మళ్ళి వెళ్ళలేదు బాగోదు , ఒకసారి చూసి రా ” అంది ‘సరే’ అన్నట్టు తల పంకించాడు కార్తీక్ .
*******************
తగరపువలస వెళ్ళే బస్సు వచ్చింది వెంటనే ఎక్కి కూర్చున్నాడు బస్సు ఇంకా ఆర్ టి సి కాంప్లెక్స్ లో ఉంది కాబట్టి ఖాళీ గా ఉంది కండక్టర్ ఇంకా రాలేదు బస్సు నిండితే స్టార్ట్ చేద్దామని డ్రైవర్ బస్సు పక్కనే నిల్చున్నాడు . కిటికీ పక్కన కూర్చోవడం వల్ల ఎండ ఎక్కువగా తగులుతుంది కార్తీక్ కి వాచీ చూసుకున్నాడు ఏడున్నర అయింది ‘ఇంకా నయం బండి మీద వెళ్ళలేదు ఎండ కి మాడిపోయే వాడిని అయినా నవంబర్ లో కూడా ఇలా ఎండలు ఉంటే మే గురించి ఆలోచించక్కర్లేదు . పైగా ఈమధ్య వైజాగ్ లో కూడా ట్రాఫిక్ బాగా పెరిగింది ఒకప్పుడు ఎంత దూరం అయినా బండి మీద వెళితే త్వరగా వెళ్లిపోయేవాళ్ళం ఇప్పుడు గంటలు గంటలు ట్రాఫిక్ లొనే ఉండాల్సి వస్తుంది ‘ అనుకున్నాడు మనసులో. కొన్ని సీట్లు నిండడం తో బస్సు ని స్టార్ట్ చేసాడు డ్రైవర్ అదేమిటో అంత వరకు ఎండ చురుక్కుమనేది బస్సు మొదలవగానే చల్లటి గాలి రావడం మొదలయింది బస్సు ఎక్కేవాళ్లు ,దిగేవాళ్ళ హడావిడి తో సాగిపోతుంది . ఇంతలో వెంకోజిపాలెం ఆంజనేయస్వామి గుడి వచ్చింది ఆ పక్కనే బస్ స్టాపు ‘ ఇంతకు ముందు అమ్మవారి గుడి దగ్గర వుండేది , నిజమే ఆ బస్ స్టాపు నాకు ఎన్ని జ్ఞాపకాలు ఇచ్చింది ‘ అనుకుంటూ గతం లోకి జారుకున్నాడు .
******పదకొండేళ్ళ క్రితం (2007)*****
కార్తీక్ బస్ స్టాప్ లో అసహనం గా నిల్చున్నాడు , ఇంతలో రాజు కార్తీక్ స్నేహితుడు పలకరించాడు. మూభావంగానే పలకరించాడు కార్తీక్ అది గమనించిన రాజు ‘ ఏమైంది రా? అలా ఉన్నావ్ . అవును నీ బైక్ ఏమైంది రిపేర్ కి ఇచ్చావా?” అన్నాడు . ” రిపేర్ ఆ తొక్క ! అదేమీ లేదు చక్కగా కిందటి వారం అంతా బైక్ మీద వెళ్లానా మొన్న మా నాన్న ఫ్రెండ్ కొడుక్కి ఆక్సిడెంట్ అయిందoటా , అప్పటి నుండి నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అది ఇది అంటూ బస్సు లో వెళ్ళమన్నారు మా అమ్మ,నాన్న . చక్కగా జాయిన్ అయిన వారం అంతా త్వరగా ఇంటికి వెళ్లిపోయి ఇప్పుడు అసలైన క్లాస్ లు మొదలైనప్పుడు ఇలా బస్సు లో వెళ్లాల్సి వస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు బస్సు లో వెళ్ళి ఒళ్ళు హూనం చేసుకోవాల్సిందే అంతా నా కర్మ ” అని కోపాన్ని వెళ్ళగక్కాడు కార్తీక్ . ” అయినా మరి రెండు సంవత్సరాలు ఆ భయం ఉంటుంది అంటావా నెలా రెండు నెలలు చూసి నువ్వే బ్రతిమలాడి బైక్ అడిగితే సరిపోతుంది ” అన్నాడు రాజు . ” ఒరేయ్ మా బాబు గురించి నీకు తెలిదు ఇంటర్ అయ్యాక బైక్ కొంటాను అని ఇదుగో ఎంబీఏ లో చేరే ముందు కొన్నాడు ఇంక ఇప్పుడు వచ్చిన భయం పోవాలంటే కనీసం సంవత్సరo పడుతుంది ..హు …వచ్చి అరగంట అయింది ఇప్పటికి రెండు బస్సు లు వదిలేసాను కనీసం కాళ్లు పెట్టడానికి కూడా స్థలం లేదు ..అదిగో బస్సు వస్తుంది ..పద” అని గబా గబా ముందుకు వచ్చి నిలబడ్డాడు కార్తీక్ . ఆ వెనకాలే రాజు కూడా వచ్చాడు బస్సు వచ్చింది కానీ ఇది కూడా జనాల తో నిండు గా ఉంది .
“కార్తీక్ లోపలికి వెళ్ళి మగ్గే కన్నా ఫుట్ బోర్డు మీద నిలబడటం ఎంతో నయం ” అని రాజు ఆపాడు కార్తీక్ ని . అందరు ఎక్కేక వాళ్ళ ఇద్దరు ఫుట్ బోర్డు మీద నిల్చున్నారు బస్సు బయలుదేరుతుంది అనగా ” స్టాప్….ఆపండి…స్టాప్…” అని గొంతు వినపడింది కార్తీక్ కి , ఎదురుగా ఉన్న రాజు తల పక్కకి జరిపి చూసాడు పసుపు రంగు చుడీదార్ పైన తెల్లటి చున్నీ తో భుజానికి బ్యాగ్ మరో చేతిలో పుస్తకాల తో పరిగెట్టుకుంటు వస్తున్న అమ్మాయి ని చూసాడు అప్పటికి ఓయ్ సినిమా విడుదల అవ్వలేదు లేకపొతే ‘ యెల్లో చుడీదార్ వైట్ చున్నీ తో దోచే నా ఎద ‘ అంటూ పాట వేసుకొనేవాడేమో అమ్మాయి ని చూస్తూనే బస్సు మీద గట్టిగా కొట్టాడు . బస్సు స్టార్ట్ చేద్దాం అనుకున్న డ్రైవర్ వెంటనే ఆపాడు . అమ్మాయి పరిగెడుతు వచ్చి కార్తీక్ కి నవ్వుతు థాంక్స్ చెప్పి ముందు వైపుకు వెళ్ళి ఎక్కింది . తన నవ్వు సూటిగా వచ్చి కార్తీక్ హృదయాన్ని తాకింది అంత కన్నా పిచ్చి ఎక్కించిoది ఆ అమ్మాయి నవ్వినప్పుడు బుగ్గ మీద పడిన సొట్ట మనసును ఎంత ఆపుదాo అనుకున్నా ఆగకుండా ఆమెను చూడమని తొందర పెట్టింది కార్తీక్ మనసు . బస్సు బయలుదేరింది ఆ అమ్మాయి కిటికీ పక్కన నిల్చుంది అందుకే గాలి కి ముంగురులు ఎగురుతూoటే సరి చేసుకుంటూ ముందు ఉన్న అమ్మాయి తో మాట్లాడుతుంది . ‘పొడుగాటి ఒత్తైన జడ ఆమెకు బరువు గా అనిపించదా ? ‘అనుకున్నాడు కార్తీక్ . అతను ఎదో మాట్లాడినట్టు ఒక్కసారి అతని వైపు చూసింది కంగారు గా తల దించుకున్నాడు. ఆమె ను చూస్తూనే తను దిగవలసిన బస్ స్టాప్ వచ్చిన సంగతి మర్చిపోయాడు . రాజు భుజం తట్టి ” దిగరా స్టాప్ వచ్చింది ” అని అనడం తో తనని వదిలి వెళ్ళవలసి వస్తున్నoదుకు బాధపడుతూ దిగాడు . అమ్మాయి కి సీట్ దొరకడం తో కూర్చుంది కార్తీక్ ని ఓరగా చూసింది అది చూసిన కార్తీక్ సంతోషానికి అవధులు లేవు ఇంక ఆరోజు నుండి బస్సు లో వెళ్ళవలసి వచ్చినందుకు బాధపడలేదు . కాలక్రమేణా ఆ అమ్మాయి పేరు ప్రియ అని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుంది అని తెలుసుకున్నాడు.
” కార్తీక్ ఈరోజు ప్రెసెంటేష్ న్ నీకు భయం గా లేదా ” అని అడిగాడు రాజు ప్రియ ని చుస్తూ తన్మయత్వం లో ఉన్న కార్తీక్ కి ఆ ప్రశ్న విసుగనిపించిoది . ” ఏమి భయం లేదు ఈరోజు కల లోకి ప్రియ వచ్చింది రా తను ఎప్పుడు కల లోకి వచ్చినా మంచే జరుగుతుంది ఎగ్జామ్స్ అప్పుడు కూడా వచ్చింది , చూసావు గా మన పర్స్oటేజి ఎంత వచ్చిందో కాబట్టి నాకు భయం లేదు ” అన్నాడు ధీమా గా కార్తీక్ . దానికి రాజు నవ్వుకుంటూ ” ఆబ్బో అది నీ తెలివి గాని ఆ అమ్మాయి గొప్పతనం ఏముంది సరే మనం ఒక పందెం పెట్టకుందాo నువ్వు ప్రెస్oటేష్ న్ బాగా ఇస్తే కుదిరితే ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున్న ప్రియ తో మాట్లాడాలి సరే నా ! ” అన్నాడు రాజు .” అబ్బా ఏమి పందెం రా ! అదిరిపోయింది , కానీ ప్రియ తో ఎం మాట్లాడాలి రా కొంచెం భయం గా ఉంది ” అన్నాడు కార్తీక్ ఆలోచిస్తూ . ” నీ ఇష్టం రా కానీ పందెం లో ఓడిపోతే నేను అడిగింది ఇవ్వాలి సరే నా ” అన్నాడు రాజు ‘సరే’ అన్నట్టు తల ఊపాడు కార్తీక్.
” ఏంట్రా ఈరోజు ఒక్క బస్సు రావట్లేదు ఇలా అయితే ఇంటికి ఎప్పుడు వెళతాం ” అన్నాడు వాచీ చూసుకుంటూ కార్తీక్ . ” హలో సర్ తమరు పందెం సంగతి మర్చిపోయారా ” అన్నాడు రాజు కార్తీక్ భుజం తట్టి , ఒక కన్ను మూసి నిట్టూర్చి ” నీకు ఇంకా గుర్తు ఉందా అయినా ప్రియ మనం వెళ్లిన బస్సు లో రావాలి కదా తను ముందే వెళ్లిపోయి ఉండచ్చు ” అన్నాడు కొంటె గా . ” సరే చూద్దాం అదిగో బస్సు పద నిండు గా ఉంది , తప్పకుండా ప్రియ ఉండే ఉంటుంది ” అని లాక్కొని వెళ్లాడు కార్తీక్ ని రాజు .
బస్సు నిండు గా ఉంది కండక్టర్ అందరిని లోపలకు తోస్తున్నాడు , అమ్మాయిలకు దగ్గరగా నిల్చున్నరు కార్తీక్ , రాజు . ప్రియ కూడా బస్సు లోనే ఉంది రాజు కార్తీక్ ని తొందరపెట్టాడు . వెంకోజిపాలేo బస్ స్టాపు వచ్చే లోపు మాట్లాడమని కానీ కార్తీక్ కి ధైర్యం చాలటం లేదు ఇంక చేసేదేమీ లేక ముందుకు తోసాడు రాజు. అప్పటివరకు వాళ్లకు కొంత దూరం లో ఉన్న ప్రియ దగ్గర కు వచ్చింది ఒక్క ఉదుటున చెయ్యెత్తి చెంప మీద కొట్టింది . తనను కొట్టిందేమో అని కళ్ళు మూసుకుని చెంప నిమురుకున్నాడు కార్తీక్ , కానీ చెంప పగిలిoది తనకు కాదు తన పక్కన ఉన్న ఇంకొ వ్యక్తి కి ఆశ్చర్యం గా చూసాడు కార్తీక్ ప్రియ వైపు . ” నేను అక్కడ నుండి గమనిస్తున్నాను చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఎక్కడెక్కడో చేతులు పెడుతున్నావ్ నీకు బుద్ది ఉందా ? లేదా ? నాకు అక్కడ నుండి కనిపిస్తుంది , మీకు ఎవరికీ కనిపించట్లేదా ?” అని ప్రశ్నించింది ఆ వ్యక్తి నడి వయసు లో ఉన్నాడు కాస్త తాగి ఉన్నట్టు అతని ఎర్రటి కళ్ళు చెప్తున్నాయి . అతనిముందు ఉన్న స్కూల్ యూనిఫామ్ లో అమ్మాయి ప్రియ ని హత్తుకుని ఏడ్చిoది . ఆమె ఏడ్పు బట్టి చూస్తే వాడు చేస్తున్న పని ని వ్యతిరేకించలేక నిస్సహాయoగా ఉండిపోయింది అని అర్ధం అయింది అందరికి . ఆ వ్యక్తి ప్రియ వైపు కోపం గా చూస్తూ ముందుకు రాబోయాడు , అంతే అందరు తలో చెయి వేసి బస్సు కిందకు దించి చితకబాదారు. ” అరేయ్ మావ ఏంట్రా అలా ఉండిపోయావ్ ” అని రాజు పిలిచే వరకు స్ఠానువు లా ఉండిపోయాడు కార్తీక్ ఇంతలో వెంకోజిపాలెం వచ్చింది , ప్రియ తో పాటు ఇద్దరు దిగారు . ప్రియ వడి వడి గా నడుచుకుంటూ వెళ్లిపోయింది . రాజు , కార్తీక్ మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ” రేయ్ పోనీ ఇప్పుడైనా మాట్లాడరా ” అన్నాడు రాజు ప్రియ వైపు చూపిస్తూ . ” పోరా ఇప్పటికి గుండె చూడు ఎలా కొట్టుకుంటూoదో కొన్ని రోజులు నన్ను వదిలేయ్ . నీకు ఎం కావాలో చెప్పు అది చేస్తా ” అన్నాడు కార్తీక్ గుండెల మీద రుద్దుకుంటూ . ” హ.. హ…హ… సరే పందెం ఓడిపోయావ్ నాకు కావాల్సినప్పుడు అడుగుతా గుర్తు పెట్టుకో ” అన్నాడు రాజు ఇద్దరు నవ్వుకుంటూ నడవసాగారు.
కార్తీక్ వాచి వైపు చూసుకుంటూ నుదుటి కి పట్టిన చెమట ను కర్చీఫ్ తో తుడుచుకుంటున్నాడు . పక్కన ఉన్న రాజు అడిగాడు ” ఏంట్రా అంత కంగారు గా ఉన్నావ్ ఏమైంది ?” అని దానికి కార్తీక్ ” ఏమైందో తెలిదు రా ప్రియ రెండు రోజుల నుండి రావట్లేదు ఏమైందా అని టెన్షన్ గా ఉంది ” అన్నాడు . ” ఫైనల్ ఇయర్ కదా రా ఏమైనా ప్రాజెక్ట్ లో బిజీ గా ఉందేమో ” అన్నాడు ధైర్యం చెప్తున్నట్టు . ” లేదు రా సెకండ్ సెమిస్టరు లో ఉంటాది రా ప్రాజెక్ట్ ” అని మరో సారి వాచి వైపు చూసుకున్నాడు . ఇంతలో ఎవరో అరిచారు ‘ ప్రియ వస్తుందే ‘ అని రాజు,కార్తీక్ అటూ వైపు చూసారు ప్రియ దాదాపు పరిగెడుతున్నట్టు వస్తుంది . ముఖం కాంతివంతం గా ఉంది , చేతులకి కాళ్ళకు గోరింటాకు , చేతుల నిండా గాజులు బస్ స్టాపు లోకి వచ్చి నిల్చుంది . అమ్మాయిలు అందరు ప్రియ చుట్టూ గూమిగూడారు , వాళ్ళలో ఒక అమ్మాయి అడిగింది ” నిశ్చితార్ధo ఎలా జరిగిందే ? ” అని అందరికి సిగ్గు పడుతూ ,నవ్వుతు సమాధానాలు చెప్తుంది . రాజు కి విషయం అర్ధం అయింది కార్తీక్ ని అక్కడ నుండి తీసుకువెళ్లాలి అన్న ఉద్దేశం తో కార్తీక్ వైపు చూసాడు , కానీ కార్తీక్ కళ్ళు అప్పటికే ఎర్రగా మారిపోయాయి. రాజు చేయి గట్టిగా పట్టుకుని ” అరేయ్ ఈరోజు కి ఆటో లో వెళ్లిపోదాం రా ” అన్నాడు . రాజు వెంటనే ఆటో ని పిలిచాడు ఇద్దరు ఎక్కారు ,ఎక్కిన వెంటనే కంట్లో ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకుని ” రాజు తనకి నా మీద ప్రేమ లేదా అలా ఎలా నిశ్చితార్థo కి ఒప్పుకుంది ” అన్నాడు కార్తీక్ . దానికి రాజు నవ్వి ” ఒరేయ్ చిన్న పిల్లాడి లా మాట్లాడకు ఆ అమ్మాయి తో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నీ ప్రేమ సంగతి అ అమ్మాయి కి చెప్పావా? ఆ అమ్మాయి నిన్ను చూసినంత మాత్రాన తనకి నువ్వు అంటే ఇష్టం అని నువ్వు ఊహించుకుంటే అది తన తప్పు కాదు ధైర్యం గా ప్రేమ విషయం చెప్పకుండా ఆ అమ్మాయి ని తప్పుబడుతున్నావ్ ” అని మందలించాడు . కార్తీక్ అప్పుడు తల దించుకున్నాడు , రాజు కార్తీక్ భుజం తట్టి ” జరిగింది ఎదో జరిగిపోయింది మర్చిపోడానికి టైం పడతాది కానీ మరచిపొతేనే నీకు మంచిది ఆరోజు పందెం ఓడిపోయి నప్పుడు ఏమి కావాలన్నా ఇస్తా అన్నావు గా నువ్వు మళ్ళి మాములు కార్తీక్ వి అయిపోవాలి రా అదే నాకు కావాల్సింది ” అంటూ ప్రమాణం చేయించుకున్నాడు రాజు.
*****ప్రస్తుతం****
ఫోన్ మోగడం తో గతం నుండి వర్తమానం లోకి వచ్చాడు కార్తీక్ . ఫోన్ లిఫ్ట్ చేసి ” ఆ! బాబాయి ఇదిగో కార్ షెడ్ దగ్గర ఉన్నాను ఇంకో పది నిముషాల లో వచ్చేస్తాను …ఆ అవును కొంచెం నడుం నొప్పి ఉంది అందుకే బస్సు లో వస్తున్నాను బండి డ్రైవ్ చేయడం కష్టం కదా అని..హ.. సరే ..నాకు తెలుసు కదా ఇల్లు పర్లేదు ..ఉంటాను…” అంటూ ఫోన్ పెట్టేసాడు ‘ అదే కదా ప్రియ ని చివరిగా చూడటం , తరువాత అమ్మ,నాన్న ని ఒప్పించి బండి మీద వెళ్లాను కాలేజీ కి ఎంత త్వరగా గడిచిపోయింది కాలం ‘ అనుకుంటూ ఉండగానే కార్తీక్ దిగే స్టాప్ రావడం తో ఆలోచనలు ఆపి బస్సు దిగాడు.
” కార్తీక్ ” అన్న వసుధ పిలుపు కి మేడ మీద సిమెంటు బెంచి మీద రగ్గు కప్పుకుని చంద్రుడు ని తదేకoగా చూస్తున్న కార్తీక్ ఉలిక్కిపడి తల్లి వైపు చూసాడు . ” ఏమి చేస్తున్నావ్ రా ఇంత చలి లో ?” అని అడిగింది వసుధ . ” చంద్రుడు ని చూడు అమ్మ ఎంత ప్రకాశవంతం గా ఉన్నాడో , అలా చూస్తునే ఉండాలని అనిపిస్తుంది కదా ” అన్నాడు కార్తీక్ . దానికి వసుధ ” పౌర్ణమి రెండు రోజుల్లో ఉంది కదా రా అందుకే అది సరే గానీ నీకో విషయం చెప్పడానికి వచ్చాను. ఒరేయ్ నీది ,వెన్నెల ది జాతకాలు బాగా కలిసాయి రా అందుకేనేమో నువ్వు కూడా ఆ చంద్రుడి ని ఆ చంద్రుడు ఇచ్చే వెన్నెల ని అంత ఇష్టం గా చూస్తున్నావ్ . ఈ సారి మాత్రం ఏమి సాకులు చెప్పకు రా మీ మావయ్య కి బాగా తెలిసిన వాళ్లు నువ్వు పెళ్ళి చేసుకుని సంతోషం గా ఉంటే చూడాలని ఉంది రా . దయ చేసి మా బాధ అర్ధం చేసుకో ” అంది వసుధ . ” అమ్మ నీకు మాట ఇస్తున్న ఈ సారి తప్పకుండా నీ మాట వింటాను . ఇన్నాళ్లు ఒక మనిషి ని అర్ధం చేసుకున్నాక పెళ్ళి చేసుకోవాలి అనుకున్నా కొంతమంది ఎక్కువ మాట్లాడేవారు ,కొంతమంది తక్కువ మాట్లాడేవారు అందుకే జీవితాంతం గడపాలి కాబట్టి ఎక్కువ మాట్లాడినా ,తక్కువ మాట్లాడినా ఇబ్బందే అనుకున్నా గానీ , నేను ఆలోచిస్తున్న విధానం తప్పు అని ఇప్పుడు అర్ధం అయింది . ఒక మనిషి ని అర్ధం చేసుకోవడం మనం మాట్లాడే పది నిమిషాల లో కుదరని పని అని పెళ్ళి చేసుకున్నాక కూడా అర్ధం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను ” అన్నాడు కార్తీక్ . ” సరే పోనీ ఇప్పటికైనా నీకు అర్ధం అయింది . భోజనానికి రా నాన్నగారు ఎదురు చూస్తున్నారు ” అంది వసుధ కిందకు దిగుతూ వెంటనే కార్తీక్ కూడా లేచాడు . మరొక సారి ఆకాశం వైపు చూశాడు ‘వెన్నెల’ అనుకున్నాడు . చాలా సంవత్సరాల తరువాత ఒక పేరు కార్తీక్ మనసులో పులకింత ని కలుగజేసింది.
************************
కారు లో కూర్చున్నాడు అన్నమాటే గానీ కార్తీక్ మనసు భయం,ఆత్రుత తో నిండిపోయి ఉంది . అందరు ఎక్కారు డ్రైవర్ పక్కన కార్తీక్ మావయ్య రంగారావు కూర్చుంటే వెనక సీట్ లో కార్తీక్, కార్తీక్ తల్లి వసుధ తో పాటు తండ్రీ ప్రసాద్ కూడా కూర్చున్నాడు కారు బయలుదేరింది . రంగారావు కు కార్తీక్ పరిస్ధితి అర్ధం అయిందేమో మాట్లాడటం మొదలుపెట్టాడు ” కార్తీక్ నువ్వు ఏమి భయపడకు తను నీకు తగ్గ జోడి అంటే చూడటానికి మాత్రమే కాదు ఆలోచనల కూడా నీ లాగే బాధ్యత గా ఉంటుంది కుటుంబం పట్ల . ఈరోజుల్లో మగపిల్లలే చెల్లెళ్ళ పెళ్ళి ఆలోచించడానికి భయపడుతున్నారు అలాంటిది ఆడపిల్ల అయ్యి ఉండి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి తండ్రీ స్థానం లో ఉండి ఘనంగా చేసింది . అప్పటికి అమ్మ ని చూసుకోడానికి ఎవరు లేరు నేను పెళ్ళే చేసుకోను అంటే నేను,వాళ్ళ అమ్మగారు ఒప్పించాము . నీ గురించి చెప్పాను అప్పటికి ఒప్పుకుంది ” అన్నాడు . ఆ మాటలు విన్న కార్తీక్ తల్లి తండ్రులు సంతోషించారు . కార్తీక్ కి వెన్నెల మీద గౌరవం పెరిగింది ఆమె ను చూడాలని కన్నా తనతో మాట్లాడాలి అన్న ఆత్రుత పెరిగింది .
ఇంతలో కారు అపార్ట్మెంట్ దగ్గర ఆగింది అందరు కిందకు దిగారు . ” అక్క లిఫ్ట్ పని చెయ్యట్లేదoటా మెట్ల మీద నుండి వెళ్లాలి 3వ అంతస్థు ” అన్నాడు వసుధ ను ఉద్దేశించి . అందరు మెట్లు ఎక్కుతున్నారు , ఇంతలో పై నుండి ఒక ఆవిడ చేతిలో ఉన్న పసుపు గిన్నె చేయి జారి కొంచెం కార్తీక్ షర్ట్ మీద పడి కింద పడింది ” అయ్యో సారీ బాబు ” అంటూ ఆవిడ సంజాయిషీ ఇచ్చుకుని గిన్నె తీసుకుని కిందకు వెళ్లిపోయింది . ” కార్తీక్ పైనే వాళ్ళ ఇల్లు వెళ్ళగానే వాష్ చేసుకుందువు గానీ ” అన్నాడు రంగారావు . ” ఆ..! సరే మావయ్య పర్లేదు” అని పైకి అన్నాడే కానీ లోపల మాత్రం ‘ ఇదేంటి ఇలా అయింది మొదటి సారి ఆ అమ్మాయి ని కలుస్తున్నాను ఇప్పుడు షర్ట్ మీద మరక తో బాగుంటుందా’ అనుకున్నాడు .
వెన్నెల వాళ్ళ అమ్మగారు అందరిని లోపలికి ఆహ్వానించి తనను తాను పరిచయం చేసుకుంది . ” ఆంటీ కొంచెం వాష్ రూమ్ ఎక్కడో చెప్తారా ? మరక పడింది క్లీన్ చేయాలి ” అన్నాడు సంశయస్తూ కార్తీక్ . దానికి ఆవిడ ” అయ్యో కామన్ బాత్ రూమ్ లో నీళ్లు రావట్లేదు రిపేర్ అయింది . బెడ్ రూమ్ లో బాత్ రూమ్ ఉంది వెళ్లు బాబు …పర్లేదు వెళ్లు బాబు ” అంది కార్తీక్ మొహమాటం చూసి . కార్తీక్ కాస్త భయం గానే బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టాడు ఎవరు లేరు బాల్కనీ లో ఎవరో నిలబడినట్టు నీడ కనిపిస్తుంది . బాత్ రూమ్ తలుపు దగ్గరే ఉంది వెంటనే లోపలి కి వెళ్ళి షర్ట్ మీద మెల్లగా నీళ్లు వేసి తుడిచాడు మరక మాత్రం పోవటంలేదు ‘ అయ్యో ప్చ్ ..ఇలాగే తనని కలవాలి అనుకుని ‘ బయటకు వచ్చాడు . ఎదురుగా ఎవరో వచ్చి ఢీ కొట్టడం బాత్రూమ్ తలుపు మీద ఇద్దరు పడి కిందపడటం ఒకేసారి జరిగింది సరిగ్గా అదే సమయం లో కరెంటు పోయింది .
” సారీ అండి చూసుకోలేదు మీకు ఏమి తగలలేదు కదా ” అన్నాడు కార్తీక్ . ” లేదు అండి ఏమి కాలేదు లేవండి ” అంది వెన్నెల మొదటి సారి ఆమె గొంతు విన్న కార్తీక్ మైమరిచిపోయాడు . లేచి నిల్చుని ముందుకు వెళ్ళబోయాడు , తన షర్ట్ కి ఎదో తగులుకున్న ట్టు అనిపించి చూస్తే వెన్నెల చీర చివరి లో చిన్న దారం తన షర్ట్ బటన్ దగ్గర చిక్కుపడింది . చీకట్లో ఏమి కనపడలేదు అనుకుంటూ వెన్నెల ఫోన్ గురించి వెతుకుతూ ముందుకు వెళ్ళబోయింది కార్తీక్ చిక్కు పడిన విషయం చెప్పాడు . ఇంతలో మళ్ళి కరెంటు వచ్చింది అప్పుడు చూసాడు వెన్నెల ని అప్రయత్నం గా అతని నోటి నుండి వచ్చిన మాట ” ప్రియ..?..” ఈలోగా వెన్నెల చిక్కు తీసింది . కార్తీక్ ఎదో మాట్లాడబోయెంతలో వసుధ వచ్చి కార్తీక్ ని హాల్ లోకి తీసుకువెళ్లింది .
“కార్తీక్ అమ్మాయి ని చూడు ” అంది వసుధ . కార్తీక్ కి అంతా గందరగోళం గా ఉంది ‘వెన్నెల, ప్రియ ఒక్కరే నా లేదా ఇద్ఢరా? ‘ అని అనుకుంటూ ఉన్నాడు. ‘ కానీ వెన్నెల తనని గుర్తు పట్టలేదు అయినా నేను ఏమైనా తనకి ఫ్రెండ్ నా గుర్తు పెట్టుకోడానికి కానీ ప్రియ కి పెళ్ళి అయిపోయింది కదా ‘ అని కార్తీక్ అనుకుంటుంటే వెన్నెల తల్లి కార్తీక్ వెన్నెల తో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నాడు ఏమో అని ” బాబు నువ్వు, అమ్మాయి వెళ్ళి ఆ రూమ్ లో మాట్లాడుకొండి ” అని చెప్పింది . ‘ నాకు కావాల్సింది అదే ‘ అనుకుని కార్తీక్ వెన్నెల వెనకనే వెళ్లాడు .
” మీ గురించి అమ్మ ,రంగారావు అంకుల్ అంతా చెప్పారు .నా గురించి కూడా మీకు చెప్పే ఉంటారు , కానీ మళ్ళి చెప్తున్నాను నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను పి.హెచ్.డి పూర్తి చేయాల్సి ఉంది ఇంకా…” అంటూ చెప్పబోతున్న వెన్నెల మాటలకూ అడ్డు వస్తూ ” మీరు ఇంజనీరింగ్ ఏ కాలేజీ లో ఎప్పుడు చదివారు ?” అని అడిగాడు . ఎందుకో వెన్నెల కు ఆ ప్రశ్న నచ్చలేదు ఎదో కూపీ లాగుతున్నట్టు అనిపించింది కానీ బయటకి కనపడనివ్వకుండా సమాధానం చెప్పింది . వెంటనే మరో ప్రశ్న వేసాడు ” మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా ?” అని అడిగాడు . మళ్ళి ఆదుర్దా కనిపిస్తుంది అతని ప్రశ్న లో కానీ వెన్నెల కు కాస్త చిరాకు తెప్పిస్తూన్నాయి అతని ప్రశ్నలు కానీ సమాధానం చెప్పాలని చెప్పింది ” వెన్నెల ప్రియ ” అని , అంతే కూర్చున్నవాడు కాస్త ఒకసారి నిల్చుని బాల్కనీ లోకి వెళ్ళి గంతులు వేయసాగాడు వెన్నెల అతని ప్రవర్తన కు బిత్తరపోయింది . ఇంతలో కార్తీక్ తన అంతట తనే తేరుకుని లోపలికి వచ్చి వెన్నెల ముందు కూర్చున్నాడు . ” నేను మీకు ఒక విషయం చెప్పాలి అది చెప్పేముందు , నేను మిమ్మలిని ఒకటి అడగాలి ” అన్నాడు వెన్నెల ఆయోమయం గా ముఖం పెట్టి ‘సరే ‘ అంది . ” మీకు ఇదివరకే నిశ్చితార్ధo అయింది కదా ?” అని అడిగాడు . ” అవును అయింది చదువు అయిపోయాక పెళ్ళి అన్నారు పెళ్ళి ఇంకో నెల రోజులు ఉంది అనగా నాన్న ఆక్సిడెంట్ లో చనిపోయారు . అప్పుడే తెలిసింది ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అందరు దూరం పెట్టారు . పెళ్ళి ఆగిపోయింది అప్పులు ఎన్ని ఉన్నాయో తెలిసింది . నాన్న పెంపకం లో గారాబం గా పెరిగిన నేను రంగారావు అంకుల్ సాయం తో ఇంటి బాధ్యత నా పై వేసుకుని ఇన్ని సంవత్సరాలు గడిపాను . నేను నా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేస్తున్నప్పుడు మళ్ళి మా బందువులు అందరు కలిసారు ప్రేమ వలకబోసారు కానీ నేను ఎవరిని నమ్మలేదు . పెళ్ళి అయితే అమ్మ బాధ్యత ఎవరు చూస్తారు అని పెళ్ళే వద్దు అనుకున్నా కానీ అంకుల్ మీ గురించి చెప్పారు అందుకే సరే అన్నాను . కానీ నాకో సందేహం మీకు నాకు ఇదివరకు నిశ్చితార్ధo అయింది అని చెప్పలేదు అన్నారు మీకు ఎలా తెలుసు ” అని అంది వెన్నెల . అంతవరకు వెన్నెల చెప్పిన గతం విని తను సంతోషం గా పెళ్ళి చేసుకుని జీవిస్తూoది అనుకున్నాడు కానీ ఇన్ని కష్టాలు పడింది అని తెలిసాక కార్తీక్ మనసులో ఉన్న భాధ కన్నీళ్ళ రూపం లో బయటికి వచ్చింది.
“ఒకసారి బాల్కనీ లోకి వస్తారా ?” అని అడిగాడు కార్తీక్ . ” ఎందుకు..?” అని అంది అనుమానం గా వెన్నెలప్రియ . ” ప్లీజ్..” అన్నాడు కార్తీక్ బాల్కనీ లోకి నడుస్తూ , చేసేదేమీ లేక అతని వెనకే నడిచింది . కార్తీక్ వెన్నెల ముందు నిల్చుని చంద్రుడి ని చూపిస్తూ ” చూసారా ఆ నిండు చందమామ ని పదకొండేళ్ళ క్రితం ఇలాంటి వెన్నెల రోజే ఆ చంద్రుడిని చూస్తూ ఆరోజు ప్రొద్దున చూసిన అమ్మాయి గురించి ఆలోచించాను . మళ్ళి సంవత్సరం తరువాత ఇలాంటి వెన్నెల రోజే ఆ చంద్రుడి ని చూస్తూ ఆ అమ్మాయి మరొకరి శ్రీమతి కాబోతుంది అని కన్నీరు పెట్టుకున్నాను . మళ్ళి ఇన్నేళ్ల తరువాత అదే అమ్మాయి నా ముందు నేను పెళ్ళి చూపులకు చూడడానికి వచ్చిన అమ్మాయి గా నిల్చుంది నా కన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా ?..” అన్నాడు వెన్నెల వైపు కన్నార్పకుండా చూస్తూ ఎదో చెప్తున్నాడు లే అనుకున్నా వెన్నెల కాస్త కంగారు పడి చెప్తుంది తన గురించే అని గ్రహించింది . అది కార్తీక్ కు అర్ధం అయింది వెంటనే వెన్నెల మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ” మీకు గుర్తు ఉందో లేదో ఒక రోజు కొంచెం లో మీ చెంప దెబ్బ తప్పించుకున్నా ” అన్నాడు చెంప ను నిమురుకుంటూ . అప్పుడు గుర్తు వచ్చింది వెన్నెల కి తన ముఖం లో భావాలు మారడం గమనించాడు . ఎదో దొరికింది అన్నoత గా వెలిగిపోయింది ” మీరా !! ఇప్పుడు గుర్తొచ్చింది . అసలు పోల్చుకోలేక పోయాను సారీ ” అంటూ తనలో తనే నవ్వుకుంది . ” ఇప్పుడు తెలిసిందా మీ నిశ్చితార్థo గురించి ఎలా తెలిసిoదో ? ఆరోజే చివరి సారి మిమ్మలిని చూడటం తరువాత ఇప్పుడే ” అన్నాడు కార్తీక్ . అప్పుడు వెన్నెల నవ్వింది బుగ్గ మీద సొట్ట పడింది , చాన్నాళ్ళ తరువాత అది చూసిన కార్తీక్ ఇంక ఆగకుండా మోకాళ్ల మీద నిల్చున్నాడు . ” ఆ వెన్నెల సాక్షిగా ఈ వెన్నెల ను ఈ కార్తీక్ మనస్పుర్తిగా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతున్నాడు మరి నీకు ఇష్టమేనా ?” అన్నాడు , వెన్నెల ఏమి అనకుండా నవ్వుతు చేయి ఇచ్చింది .ఇంతలో గట్టిగా చప్పట్లు వినిపించాయి . ఇద్దరు పక్కకు చూసారు అందరు బెడ్ రూమ్ లో ఉన్నారు ” ఏరా నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు , పోనీలే మొత్తానికి నువ్వు ఇష్టపడిన అమ్మాయి నే కలిసావు . అంతా ఆ దేవుడి దయ ” అంది వసుధ . ” అందుకే అంటారు పెళ్ళిళ్ళు స్వర్గం లొనే నిర్ణయించబడ తాయి అని మనం నిమిత్తమాతృలం అక్క త్వరగా ముహుర్తాలు చూస్తే మన బాధ్యత తీరిపోతుంది . కార్తీక్ మనం బయలుదేరాలి రా లేట్ అవుతుంది త్వరగా రా ” అన్నాడు రంగారావు . హాల్ లోకి వెళుతూ వెన్నెల తల్లి కూడా ఇద్దరి వైపు చూసి నవ్వుతు వాళ్లతో హాల్ లోకి వెళ్ళిపోయింది . ” కార్తీక్ అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు మనం ప్రేమించే వాళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ల తోనే మనం సంతోషం గా ఉంటాం అంటారు అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా నా మీద అంత ఇష్టాన్ని పెంచుకున్న నీతో జీవితం పంచుకోవడం నా అదృష్టం ” అంది కార్తీక్ కళ్లలోకి చూస్తూ . ” నాకు ఇంకో కోరిక ఉంది తీరుస్తావా ?” అన్నాడు కార్తీక్ కొంటె గా . ” ఏంటి అది ?” అంది వెన్నెల ” నీ నవ్వు మొదటి సారి చూసినప్పుడే కలిగింది అది .. అది… నువ్వు నవ్వితే పడే నీ బుగ్గ మీద సొట్ట ని తాకాలని …” అన్నాడు నవ్వుతు . ” ఓహో …. అది అయితే పెళ్ళి అయ్యాకే ..” అంది వెన్నెల . ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు . కార్తీక మాసపు వెన్నెల లో ఇద్దరు నవ్వుకుంటుoటే చంద్రుడికి కూడా ముచ్చట వేసిందేమో ఇంకాస్త ప్రకాశవంతం గా వెలిగిపోయాడు.

*****సమాప్తం*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *