March 29, 2024

బాధ్యతను మరచిపోలేక…

రచన: భవాని ఫణి

“అమ్మాయ్, ఈ రోజు పంచమే కదూ ” అన్న మాటలకి లంచ్ బాక్స్ సర్దుతున్న మాధవి ఉలికిపడి తలెత్తి చూసింది.
స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి తొందర తొందరగా హోమ్ వర్క్ పూర్తి చేస్తున్న పదేళ్ల సిరి రాయడం ఆపేసి ఆమె వైపే చూస్తోంది.
“సిరీ, టైమైపోతుంటే ఏమిటి ఆ వేళాకోళం, హోంవర్క్ కంప్లీట్ చెయ్యి ముందు ” అంది మాధవి, కూతురు ఈ మాటలు ఏ సీరియల్ లో విని ఉంటుందా అని ఆలోచిస్తూ.
“నా పేరు సిరి కాదు, రుక్మిణి ”
“చూడు… నీ ఆటలకి ఇప్పుడు టైమ్ కాదు. రెడీ అవ్వు తొందరగా ” అంటూ మళ్ళీ తన పనిలో పడింది మాధవి.
తల్లి మాటలు పట్టించుకోకుండా సిరి హాల్లో నాలుగు వైపులా కలియజూసింది. ఆమె దృష్టి పూజ గది దగ్గర ఆగిపోయింది. చేతిలో పెన్సిల్ టేబుల్ మీద పడేసి ఆ గదివైపు నడిచింది. గదిలో కొంచెం సేపు వెతికి తనకి కావాల్సిన పుస్తకం తీసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చి బాసింపట్టు వేసుకుని కూర్చుంది.
“ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైహి శ్రుతః
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ”
అంటూ రామాయణం ముందు పెట్టుకుని గంభీరంగా ఒక శ్లోకం చదవడం మొదలు పెట్టింది సిరి.
ఈ సారి నిజంగానే ఆశ్చర్యపోయింది మాధవి. సిరికి తెలుగు చదవడమే రాదు; అలాంటిది ఇంత కష్టమైన శ్లోకం ఎలా చదవగలదు! ఎక్కడైనా నేర్చుకుని ఇప్పుడు చదువుతున్నట్టుగా నటించి ఆట పట్టిస్తోందేమోనని అనుమానం వచ్చి, వెనక నించి పుస్తకంలోకి తొంగి చూసింది. నిజంగా అక్కడ ఉన్న శ్లోకమే చదువుతోంది.
మాధవికి కంగారొచ్చింది ఈసారి. సతీష్ ఈ రోజు తొందరగా ఆఫీస్ వెళ్ళిపోయాడు ఏదో పని ఉందని. టేబుల్ మీద ఉన్న మొబైల్ అందుకుని అతనికి డయల్ చేసింది. విషయం చెబుతుండగానే సిరి అలా పుస్తకం మీదకి వాలిపోవడం చూసి, మొబైల్ పక్కన పడేసి కూతుర్ని చేతిలోకి తీసుకుంది గాభరాగా. అవతలి నించి ఫోన్ లో సతీష్ హలో హలో అంటున్నాడు.

రెండు గంటల తర్వాత హాస్పటల్ లో ఉన్నారు ముగ్గురూ. స్టెతస్కోప్ తో సిరిని పరీక్షిస్తున్న డాక్టర్ గారి వైపు ఆదుర్ధాగా చూస్తోంది మాధవి.
“కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని కంగారుపడ్డాను డాక్టర్ గారూ, రెండు మూడు సార్లు పిలవగానే లేచింది. అంతకుముందు జరిగిందేమీ గుర్తులేనట్టు నార్మల్ గానే మాట్లాడుతోంది. ఏమైదంటారు ” ఆత్రంగా అడిగింది. .
” షి ఈజ్ పర్ఫెక్ట్ లీ ఆల్ రైట్. పాప ఏదో తమాషా చేసినట్టుందమ్మా ” అన్నాడాయన చిన్నగా సిరి బుగ్గ మీద తడుతూ.
“గొంతు తనదే అయినా మాట్లాడే పధ్ధతి మాత్రం ఎవరో పెద్దవాళ్ళదిలా అనిపించింది” అంది మాధవి ఇంకా అనుమానం తీరక.
“ఇదే ఫస్ట్ టైం కదమ్మా ఇలా జరగడం, చూద్దాం లే” అని నవ్వుతూ టేబుల్ మీద ఉన్న బాక్స్ లోంచి రెండు చాక్లెట్స్ తీసి సిరి చేతికిచ్చారు ఆయన.

*****

దేశ రాజధాని ఢిల్లీకి యాభై కిలోమీటర్ల దూరంలో, హర్యానా రాష్ట్రంలో ఉన్న సోనీపట్ అనే సిటీలో ఉంటున్నారు సతీష్ – మాధవి. అతనిది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. ఉద్యోగరీత్యా సతీష్ ఇక్కడికి వచ్చి పదిహేనేళ్లవుతోంది. వాళ్ళ ఊరికే చెందిన మాధవిని, పెద్దవాళ్ల అభీష్టం మేరకు పెళ్లి చేసుకున్నాడు. సిరి పుట్టింది కూడా ఇక్కడే. ఇద్దరి పేరెంట్స్ ఆంధ్రాలో వాళ్ళ ఊరిలోనే ఉంటున్నారు. వీళ్లు ఎన్నిసార్లు రమ్మని పిలిచినా అంత దూరం రాలేమని దాటవేస్తూ ఉంటారు. సిరి వింత ప్రవర్తన గురించి చెప్పటం వల్ల తల్లితండ్రుల్ని, అత్తమామల్ని మరింత కంగారు పెట్టడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదని తెలుసు మాధవికి. అందుకే ఎవరితోనూ చెప్పలేదు.

*****

నెల రోజులు మామూలుగానే గడిచిపోయాయి. మాధవి సతీష్ లు దాదాపుగా ఈ విషయం మరిచిపోతున్న సమయంలో జరిగిందా సంఘటన.
ఆ రోజు ఆదివారం. కంగారేముందని మాధవి తొందరగా నిద్ర లేవలేదు. వంటింట్లో ఏవో చప్పుళ్లు అవుతుంటే మెలకువ వచ్చింది ఆమెకి. పక్కన చూస్తే సతీష్ ఇంకా నిద్రపోతూ కనిపించాడు. ఎవరా అనుకుంటూ కొంచెం భయంగానే వంట గదిలోకి వెళ్ళింది. అక్కడి వాతావరణం చూసి ఒక్కసారిగా అదిరిపడింది.
గ్యాస్ స్టవ్ బర్నర్స్ రెండూ మండుతున్నాయి. స్టూల్ వేసుకుని, దాని మీద నిలబడి సిరి వంట చేస్తోంది. అంతే కాదు, సిరి తన చీర కట్టుకుని ఉంది. అది కూడా కచ్చా పోసి కట్టుకుంది. తలస్నానం చేసినట్టుంది, జుట్టు ముడి పెట్టుకుంది. గుమ్మలో నిలబడిన మాధవి వైపు ఓ సారి చూసి మళ్ళీ తల తిప్పుకుంది.
“ఇంట్లో ఒక్క నిక్కార్సైన సిల్కు రవిక కూడా లేదేమిటే, ఈ కలగలుపు కాటన్ గుడ్డలే తడిపి మడి కట్టుకున్నాను… ఆరిపోవచ్చాయి. తగలకు నన్ను” అంది పెద్ద ఆరిందాలా.
కూతురు మాట్లాడిన వాటిలో కొన్ని పదాలు తనే ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది సిరి ఎలా మాట్లాడుతోంది! ఆ చీర అలా ఎలా కట్టుకోవాలో తనకే తెలీదు. సిరి ఎలా కట్టుకుంది! విస్తుపోతూ దూరం నించే కూతురు ఏం వండుతోందో చూసింది మాధవి. ఒక పక్క చక్కరపొంగలి, పులిహోర ఉన్నాయి. స్టవ్ మీద పప్పు అన్నం ఉడుకుతున్నాయి గిన్నెల్లో. గుత్తి వంకాయ కారం పెట్టి వండిన కూర, పులుసు కూడా కనిపిస్తున్నాయి పక్కనే.

“మావిడికాయ ఉంటే కాస్త పచ్చడి కూడా చేసి పడేసేదాన్ని. కొంచెం అసింటా జరుగు. పూజకి వేళ మించిపోతోంది ” అంటూ సిరి చీర కొంగు దగ్గరగా పెట్టుకుని మాధవికి తగలకుండా బయటకి వచ్చి పూజ గదిలోకి వెళ్ళింది.
తడబడుతున్న కాళ్లతో కూతురి వెనకే వెళ్లి పూజ గది గుమ్మంలో నిలబడింది మాధవి. గదంతా కడిగి ముగ్గులు పెట్టి ఉంది. పూజ సామాగ్రి సిద్ధం చేసి ఉన్నాయి. వత్తి మత్తి చేసి పక్కన పెట్టుకున్నట్టుంది ముందే. కుందిలో నూనె పోసి వెలిగించి దీపారాధన చేస్తోంది సిరి, ఏదో వల్లె వేస్తునట్టుగా పెదాలు కదిలిస్తూ.
అంతలో తలతిప్పి మాధవిని చూసింది. “ఈవేళ వాడి పుట్టినరోజు. అందుకే ఇవన్నీ చేసాను. పూజ అయిపోగానే మహా నైవేద్యం పెట్టేస్తాను” అని “ఇంట్లో అరిటాకు ఏమైనా ఉందా?” అంది మళ్ళీ.
మాధవి పాలిపోయిన ముఖంతో లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. సరేలే, కొత్త కంచం ఏమైనా ఉంటే బయటకి తియ్యి…వాడంది… అందరూ తిన్న వాటిలో నేను తినను” అని చెప్పి ఓ కేశవాయ స్వాహా,
నారాయణ స్వాహా, మాధవాయ స్వాహా అని చదువుతూ ఆచమనం చెయ్యసాగింది.
ఆందోళనతో, భయంతో సతీష్ ని లేపడానికి మాధవి బెడ్రూం లోకి పరుగు తీసింది. ఇద్దరూ వచ్చి చూసేసరికి అక్కడే మందిరం దగ్గర, తను కట్టుకున్న చీర కొంగు పరుచుకుని పడుకుని నిద్రపోతోంది సిరి. తమ గారాల పట్టిని నిస్సహాయంగా చూస్తుండి పోయారు భార్యాభర్తలిద్దరూ అలాగే కొంత సేపు.

“ఈ సారి మేటర్ కొంచెం సీరియస్ గా తీసుకోవాలనిపిస్తోంది. ఫిజికల్ గా పాపకి సమస్య ఏమీ లేదు. నాకు తెలిసిన చైల్డ్ సైకియాట్రిస్ట్ ఒకరు ఉన్నారు. ఆయనకి చూపించండి ” అన్నారు డాక్టర్ బలదేవ్ రాజ్ గారు. సిరిని మాధవితో బయటకి పంపించి సతీష్ తో ఈ విషయం చెప్పారాయన.

*****
మాధవికి చాలా ఆందోళనగా ఉంది.సిరి ఎప్పటిలాగే స్కూల్ కి వెళ్ళిపోతోంది. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ ఎక్కువై పోతోంది ఆమెకి. డాక్టర్ గారు చెప్పిన మరుసటి రోజే సిరిని చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఎదురుగా సిరి చాలా నార్మల్ గా బిహేవ్ చేసింది. ఆయన కూడా కొన్ని రోజులు ఆగి చూడమనీ, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఎపిసోడ్స్ రిపీట్ అయితే చూద్దామనీ, ప్రస్తుతం
అయితే మెడికేషన్ ఏమీ పెట్టడం లేదనీ చెప్పి పంపేసారు.

ఆమెకి మరో అనుమానం కూడా కలుగుతోంది. దెయ్యాలు ప్రేతాత్మలు గురించి మాధవికి పెద్దగా నమ్మకం లేదు; కానీ సిరిని చూస్తుంటే అలా ఆలోచించక తప్పడం లేదు. సతీష్ కి చెబితే కోప్పడుతున్నాడు. ఎవరు సహాయం చెయ్యగలరా అని ఆలోచించగా ఆలోచించగా, ఆమెకి హనుమంతుడి గుళ్ళో పూజారి గారు గుర్తు వచ్చారు. ఆయన చాలా విజ్ఞానం కలిగిన వ్యక్తిలా అనిపిస్తారు. ఆయన్ని అడిగితే ఏమైనా చెప్పగలరేమో ! అనుకున్నదే తడువుగా బయలుదేరి గుడికి వెళ్ళింది మాధవి. మద్యాహ్నం టైమ్ కావడం వల్ల ఆయన ఖాళీగా కూర్చుని ఏదో చదువుకుంటున్నారు.
మాధవి మెల్లగా ఆయన దగ్గరకి వెళ్లి నమస్కరించి జరిగిన విషయమంతా చెప్పింది. తనకి ఏమైనా దారి చూపించమని వేడుకుంది. ఆయన చాలా సేపు ఆలోచించారు.
“ఇక్కడికి రెండొందల కిలోమీటర్ల దూరంలో బృందావనం అనే ఊళ్ళో పెద్ద కృష్ణుడి మందిరం ఉంది ఇస్కాన్ వారిది. అక్కడ ‘గురు దాస’ అనే ఒక పూజారి ఉన్నారు. ఆయన మీ సమస్య ని పరిష్కరించగలరని నాకు అనిపిస్తోంది. ప్రయత్నించి చూడండి, ఆ తర్వాత భగవదేచ్ఛ” అన్నారాయన హనుమంతుడి విగ్రహం వైపు తిరిగి నమస్కరిస్తూ.

*****

రెండు రోజుల తర్వాత
“ఎక్కడికి నాన్నా వెళ్తున్నాం?” కార్ డ్రైవ్ చేస్తున్న తండ్రిని అడిగింది సిరి.
“బృందావనం అని… కృష్ణుడు చిన్నప్పుడు అక్కడే ఆడుకున్నాడమ్మా ”
ఓహో, మట్టి తినేస్తాడు, పాము మీదెక్కి డాన్స్ చేస్తాడు. అందర్నీ బాగా ఏడిపిస్తాడు. కృష్ణా చాలా అల్లరి కద నాన్నా” అంది సిరి తన కార్టూన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి.
“అవునమ్మా, కానీ కృష్ణుడేం చేసినా లోకకళ్యాణం కోసమే అంటే అందరి మంచి కోసమే చేసాడు.”
“మరి కొంచెం పెద్దయ్యాక పాపం ఎంతో బాగా చూసుకున్న యశోదమ్మని వదిలేసి వాళ్ళ అసలు మమ్మీ దగ్గిరికి ఎందుకు వెళ్ళిపోయాడు?”
వారి వారి పూర్వ జన్మల ఫలాన్ని అలా అనుభవించవలసి వస్తుందని చెబుదామనుకున్న సతీష్, సిరి ఇవన్నీ అర్ధం చేసుకోలేదని, పైగా లేని పోని కన్ఫ్యూజన్ లో పడుతుందని భావించి మాట మార్చేసాడు
“సిరీ.. ఆ ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయో!” అంటూ.

*****

తెల్లవారుఝామునే బయలుదేరడం వల్ల తొమ్మిదయ్యేసరికి గుడికి చేరుకున్నారు. మనోహరంగా ధవళ వర్ణంలో మెరిసిపోతున్న ఆ అందమైన కట్టడాన్ని చూడగానే వారి శరీరంలోని ఆణువణువూ ఉత్సాహంతో
ఉరకలు వేసింది. ఆ మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే భక్తి భావం పున్నమి నాటి వెన్నెల్లా మనసంతా ఆక్రమించుకుంది.
ముందుగా గుడి చుట్టూ తిరిగి ఆ అద్భుతమైన కట్టడపు సౌందర్యాన్ని తనివితీరా చూసారు. సిరి ఎంతో హుషారుగా ఆ ప్రాంతమంతా పరుగులు తీసింది. ముట్టుకుంటే మాసిపోయేంత శుభ్రంగా ఉన్నాయి పరిసరాలన్నీ.
తర్వాత లోపలికి ప్రవేశించి దైవ దర్శనం చేసుకున్నారు. మధ్యలో కృష్ణ బలరాములుండగా ఎడమ వైపు గోపి, లలిత,విశాఖలతో కూడి రాధాకృష్ణులు కనువిందు చేసారు.
నార్త్ ఇండియన్స్, టెంపుల్స్ లో తల కప్పి ఉంచుకుంటారన్న విషయం గుర్తు వచ్చి, మాధవి చున్నీ తల మీదకి లాక్కుని కృష్ణుడికి భక్తిగా నమస్కరించింది. తన సమస్యని పరిష్కరించమని, తన సిరిని మళ్ళీ ఎప్పటిలాగే చెయ్యమనీ ప్రార్ధించింది.
అక్కడి పూజారి గారిని ‘గురు దాస’ గారి గురించి అడిగాడు సతీష్. ఆయన సభా ప్రాగణంలో ప్రసంగిస్తున్నారనీ, కొంత సేపు వేచి ఉండాల్సి వస్తుందనీ అక్కడికి వెళ్లే మార్గం చూపించారాయన.

*****

సభా ప్రాంగణమంతా భక్తులతో కిట కిటకిట లాడిపోతోంది. కాషాయ రంగు వస్త్రాలు ధరించిన ఒక వృద్ధుడు అక్కడ ఇంగ్లీష్ లో అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. ఎందఱో స్వదేశీయులు, విదేశీయులు సంప్రదాయక దుస్తులు ధరించి అమితమైన భక్తి శ్రద్ధలతో ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. ఆడవాళ్లు చీరలు,మగవాళ్లు పంచెలు కట్టుకుని, పాలరాతి బొమ్మలు ప్రాణం పోసుకుని వచ్చినట్టుగా కూర్చుని ఉన్న ఫారినర్స్ ని చూస్తే మాధవికి ముచ్చటేసింది.
రెండు గంటల తర్వాత ఆయనతో మాట్లాడే అవకాశం లభించింది సతీష్ మాధవిలకి. సిరి మాధవితో దూరంగా పంపి గురుదాసగారికి వాళ్ళ సమస్య వివరించాడు సతీష్. అంతా ఓపికగా విని మెల్లగా తల పంకించారు ఆయన. తర్వాత సిరిని పిలిపించి ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. తదేకంగా ఆమె కళ్ళలోకి చూడసాగారు. కొంతసేపటికి సిరి ట్రాన్స్ లోకి వెళ్ళినట్టుగా బిగుసుకుపోయింది.
“చెప్పమ్మా, నీ పేరు ఏమిటి?” అని తెలుగులో అడిగారు.
“నా పేరు రుక్మిణి.” అంది సిరి.
“నీ కుటుంబం గురించి చెప్పమ్మా.”
“మాది రావులపాలెం దగ్గర గోపాలపురం. మావారి పేరు జగన్నాధ శర్మ. ఆయన స్కూల్లో మాస్టారుగా పని చేసేవారు. మాకు ముగ్గురు అబ్బాయిలు. పెద్దవాళ్లిద్దరూ బాగానే ఉండేవారు. మూడో వాడు విశ్వనాధ శర్మ మాత్రం కొంచెం అమాయకుడు. వాడికి నడక,మాటలు అనీ రావాల్సిన సమయం కంటే ఆలస్యంగానే వచ్చాయి. చదువు కూడా అంతంత మాత్రమే. ఎలాగో పది వరకు చదివించి గుమస్తా ఉద్యోగం వేయించారు వాళ్ళ నాన్నగారు. వాడు ఎంత అమాయకుడో అంత మంచివాడు. అందరికీ సాయం చెయ్యాలని చూసేవాడు. కానీ అందరూ వీడ్ని ఏడిపించి ఆనందించేవారు. అందుకే ఎప్పుడూ నా ప్రాణాలన్నీ వాడి మీదే ఉండేవి.” ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని మళ్ళీ చెప్పసాగింది సిరి.
“అంతా బాగానే ఉన్నా వాడి నడకలో, మాట తీరులో కనిపించే అమాయకత్వం చూసి ఎవరూ పిల్ల నివ్వలేదు. పెళ్లి చేద్దాం అని చాలా రోజులు ప్రయత్నం చేసి కుదరక ఊరుకున్నారు వాళ్ళ నాన్న. నా పెద్ద కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక చాలా ఏళ్ళ పాటు నేను, మా వారు, విశ్వనాధం దగ్గరే ఉండేవాళ్ళం. కానీ విధి మమ్మల్ని అనారోగ్యం రూపంలో దెబ్బతీసింది. కాన్సరుతో ఆయన, పక్షవాతంతో నేను ఇంచుమించుగా ఒకేసారి మంచాన పడ్డాం. తప్పని పరిస్థితుల్లో మా పెద్ద కొడుకు దగ్గరకి వెళ్లి ఉండాల్సి వచ్చింది” ఆపకుండా చెబుతోన్న సిరిని చూసి మాధవి కలవరపడి ఏదో అడగబోయింది. గురు దాస మాట్లాడవద్దన్నట్టు గా సైగ చేసారు.
సిరి ఇంకా చెబుతూనే ఉంది.
“మా కోడలి గురించి చెడుగా చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఎలాగో వంట చేసి పెట్టడమే ఆ పిల్లకి గండంగా ఉండేది. అందుకే మా విశ్వనాధం ఉద్యోగం మానేసి మా చాకిరీకి సిద్ధపడ్డాడు. అలా ఐదేళ్ల పాటు వాడి శరీరంలోని ఆణువణువూ మేము పీల్చి పిప్పి చేసాం. కదలలేని, మాట్లాడలేని అశక్తతతో వాడి కష్టాన్ని చూస్తూ నేను మౌనంగా కన్నీరు కార్చేదాన్ని. ఇద్దరికీ స్నానాలు చేయించడం, అన్నాలు తినిపించడం, మేము పాడు చేసిన బట్టలు శుభ్రం చెయ్యడం…వాడు చెయ్యని పని లేదు. ఆఖరికి ఓ మంచి కాలాన ఆయనా, నేనూ కొద్ది రోజుల తేడాలోనే వాడికి విముక్తి ప్రసాదించాం. కానీ ఏం ప్రయోజనం? ఇప్పుడు కూడా అన్నీ కష్టాలే నా బిడ్డకి. మా వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వదినగారి సూటి పోటి మాటలు పడలేక ఇల్లు వదిలి దేశాలు పట్టాడు. తినడానికి తిండి లేదు. కట్టు బట్టలతో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ బికారిలా తిరుగుతున్నాడు. పెద్ద వయసుతో, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంకా ఎంత నరకం అనుభవించాలో నా చిట్టి తండ్రి.” అంటూ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది సిరి.
మాధవి ఒక్క ఉదుటున లేచి కూతురి దగ్గరికి వెళ్లబోయింది. ఆగమన్నట్టుగా చెయ్యి చూపించిన గురు దాస, మెల్లగా అ పాప తల మీద చెయ్యి వేసారు. సిరి వెంటనే ఏడుపు ఆపేసి, మత్తులోకి జారిపోయి, అక్కడే పడుకుని నిద్రపోయింది.
“కొంతసేపు పాపని విశ్రాంతి తీసుకోనివ్వండి. ప్రమాదం ఏమీ లేదు.” అన్నారు గురు దాస, కంగారు పడుతున్న మాధవి వైపు చూసి.
“స్వామీ, పాపకి దెయ్యం…” అని అర్దోక్తి గా ఆపేసింది మాధవి.
“లేదమ్మా లేదు, ఆమె రుక్మిణమ్మగారే. మహా సాధ్వి; గొప్ప భక్తురాలు. చేసుకున్న పుణ్యకర్మల ఫలంగా తర్వాతి జన్మని తనే ఎంచుకునే అర్హత సంపాదించి, మీ ఇంట్లో జన్మించింది. కానీ కుమారుని మీద ఉన్న వెర్రి ప్రేమ, అతని ప్రస్తుత దుస్థితి, ఆమెకి పూర్వ జన్మ స్మృతుల్ని కలిగిస్తున్నాయి.”
“ఆవిడకి మేం తెలీదు కదా. ఎవరనుకుని మాతో మాట్లాడుతున్నారు?” స్వామీజీ చెప్పింది పూర్తిగా నమ్మలేక అడిగాడు సతీష్.
“గత జన్మ స్మృతి కలగడమనేది, చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. కుమారుని గురించి దిగులు కనుక, ఆ ఆలోచన తప్ప, మిగిలిన తర్కాలేవీ అటువంటప్పుడు స్ఫురణకు రావు.”
” ఎలా స్వామీ, ఈ సమస్యకి ఏమిటి పరిష్కారం? సిరికి ఆ జ్ఞాపకాలు రాకుండా ఏమైనా చెయ్యండి.” బేలగా అడిగింది మాధవి.
“ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఇప్పుడు ఆ విశ్వనాధ శర్మ ఎక్కడ ఉన్నాడో నేను చెప్పగలను. బాగా ముసలివాడు అయిపోయాడు. ఎన్నో కష్టాల్ని అనుభవిస్తున్నాడు. మీరు అతన్ని తీసుకుని వచ్చి, చివరి దశలో బాగా చూసుకోగలిగితే, పాపకి ఆ జ్ఞాపకాల నుండి విముక్తి కలిగే అవకాశం ఉంది. లేని పక్షంలో నాకు కూడా అదిశక్తికి మించిన పనే అవుతుంది.” అని ఆగి మళ్ళీ అన్నారు గురు దాస.
“అతనికి గానీ, పాపకి గానీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు; కేవలం ఒక చోట ఉంచితే చాలు. అలా మీరు చేయగలిగితే, ఇక మీదట అమ్మాయికి పూర్వ జన్మ స్మృతులు రాకుండా నేను చెయ్యగలను.”
మాధవి, సతీష్ లు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఒకేసారి అన్నారు, “అలాగే చేస్తాం స్వామీ ”

*********

“మమ్మీ, తాతయ్య డిన్నర్ కి టైం అయింది. రెడీ చేసావా?” అని అరిచింది సిరి అప్పటివరకు చూస్తున్న టీవీ కట్టేస్తూ.
“అయిపోవచ్చింది రా, ఫైవ్ మినిట్స్.” అని వంటింట్లోంచి సమాధానం చెప్పింది మాధవి.
” ఏంటి మమ్మీ, డోరేమాన్ అయిపోయింది. అంటే సెవెన్ కదా, ఏంటి లేట్?” వంటింట్లోకి వచ్చి, నడుం మీద చేతులు వేసుకుని కోపంగా అడిగింది సిరి.
“ఈలోగా తాతయ్యని లోపలికి తీసుకొచ్చి మెడిసిన్స్ ఇవ్వు, పెట్టేస్తాను అన్నం.” అంది మాధవి.
సరేనని, రయ్యిమంటూ బయటకి పరిగెట్టింది సిరి.
బాల్కనీలో కూర్చుని రోడ్డున పోయేవాళ్లని చూస్తున్న విశ్వనాధాన్ని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి, ఆయన మంచం మీద కూర్చో బెట్టింది. స్టూల్ తెచ్చి ఎదురుగా వేసింది.
మంచి నీళ్లు, మందులు తెచ్చి ఆయన చేతికిచ్చింది. “వేసుకో తాతయ్యా, అన్నం తిందువు గాని” అంటూ.
ఈలోగా మాధవి పొగలు కక్కుతున్న అన్నం, కూర వేసి ఉన్న కంచం తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టింది. సిరి, ఆయన తింటున్నంత సేపూ పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఆయనకి ఏం కావాలో చూడసాగింది. భోజనం అయిపోగానే టవల్ తీసుకొచ్చి, తనే ఆయన మూతి తుడిచి, చెయ్యి తుడుచుకోమని అందించింది.
విశ్వనాధంగారు చేతుల్తో పాటు కళ్లు కూడా తుడుచుకున్నారు. “ఎందుకురా తల్లీ, నేనంటే నీకంత ప్రేమ” అంటూ.
అంతే… సిరి చక్రాల్లాంటి కళ్లనిండా నీళ్లు తిరిగిపోయాయి. “నువ్వేడవకు తాతయ్యా, నువ్వేడిస్తే నాకూ ఏడుపొస్తుంది” అంటూ గారాలు పోవడం మొదలు పెట్టింది.
రోజు దాదాపుగా ఒక పావుగంట పాటు సాగే ఈ ప్రహసనాన్ని చూడటానికి అలవాటు పడిపోయిన మాధవి, నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది.

**************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *