April 19, 2024

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద

“ఈ రోజు పౌర్ణమి”.
చోటానికరా పూజారి వైపు అర్ధం కానట్లుగా చూశారు కాన్హా, లిఖిత.
పక్షపు దినాలుగా మీ నాన్నగారికి చేతబడి తీయడానికి నిరంతర నిర్విరామ కృషి జరిగింది. ఇలా ఇంతవరకూ ఎవరికీ ఇంత దీర్ఘకాలపు చికిత్స జరగలేదు. మీ నాన్నగారి మానసిక స్థితి చాలా బలహీనంగా వుంది. నాడీమండలం నీచ స్థాయిలో పని చేస్తోంది. అందుకే ఇలా జరిగింది. మేం చేయవలసిందంతా చేసేం. మానసిక శారీరక రుగ్మతలన్నింటిని తీసేసే అద్భుత మూలికా వైద్యాలన్నీ మీ నాన్నగారికి జరిగేయి. అమ్మవారి పూజలు కూడా బాగా జరిగేయి. ఇక మేం చేయగల్గిందేమీ లేదు. ఈ అర్ధరాత్రి లోపున ఆయన మామూలు మనిషి కాలేకపోతే..” అంటూ సందిగ్ధంగా ఆగి లిఖిత కళ్లలోకి చూశాడు పూజారి.
లిఖితకిప్పుడు కొద్ది కొద్దిగా మలయాళం అర్ధమవుతోంది.
ఆమె ఆందోళనగా పూజారివైపు చూసింది.
ఆ కళ్ళలో రాలడానికి సిద్ధంగా నీటి బిందువులున్నాయి.
కాన్హా ఆమె పరిస్థితిని గమనించి ఆమె భుజం మీద చేయ్యేసేడు ఊరడింపుగా.
ఆ స్పర్శతో లిఖితకేదో పట్టు దొరికినట్లయింది.
ఏదో అగాధంలోకి పడిపోతున్న తననెవరో పట్టి ఆపినట్లనిపించింది.
ఒక పురుషుడు స్త్రీని స్పర్శిస్తే అందులో కామం తప్ప మరొకటి లేదని చెప్పే మనుష్యులు ఎంత నీచ స్థాయికి దిగజారి ఆలోచిస్తారో ఆమెకిప్పుడర్ధమయింది.
అతని స్పర్శలో అండ, లాలింపు, ధైర్యం, ప్రేమ ముప్పిరి గొని ఆమెకి లభించేయి.
ఆమె అతని చేతిని తన చేతితో బిగించి పూజారి వైపు చూసింది.
“మీ నాన్నగారిని తీసికెళ్ళొచ్చు”
“అంటే..?” అంది లిఖిత గాభరాగా.
“భయపడొద్దు. ఆయన్ని తీసుకెళ్ళి ఈ అర్ధరాత్రి సముద్రస్నానం చేయించండి. బహుశ ఆయన మనలోకి వస్తాడీ రాత్రి. నాకు నమ్మకముంది. ఇదీ వైద్యంలో ఆఖరి ప్రయోగం”.
లిఖిత అయోమయంగా కాన్హా వైపు చూసింది.
కాన్హా ఏం ఫర్వాలేదన్నట్లుగా కళ్లతోనే ఆమెని ఊరడించాడు.
ఆమె నిస్తేజంగా చూస్తూ నిలబడింది.
కాన్హా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా వున్న కార్తికేయన్‌ని లేవనెత్తి వెళ్దామా అన్నట్లుగా చూశాడు లిఖిత వైపు.
లిఖిత తేరుకొని బాగ్ తెరచి పూజారికి డబ్బు ఇవ్వబోయింది.
“ఇప్పుడొద్దు.”
లిఖిత అతనివైపు తెల్లబోయినట్లుగా చూసింది. “ఆయనకి నయమైతేనే మేం డబ్బు తీసుకుంటాం. నిజానికిది ఫీజు కాదు. మేం ఉపయోగించే మూలికలు చాలా ఖరీదైనవి. పైగా ఈ చేతబడి పూజలు మమ్మల్ని చాలా బలహీనుల్ని చేస్తాయి. ఈ పూజలు జరిగినన్ని రోజులూ మేము అభుక్తంగా వుంటాం. సరే. ఆయన సముద్ర స్నానఘట్టమయ్యేక కోలుకుంటే మీరు రండి” అన్నాడతను.
లిఖిత అతనికి కృతజ్ఞతగా నమస్కరించింది.
ఇద్దరూ కలిసి కార్తికేయన్‌ని టాక్సీ ఎక్కించేసారు.
“ఇప్పుడెక్కడికి వెళ్దాం. ద్వారకకేనా?”
కాన్హా ప్రశ్నకి తల అడ్డంగా తిప్పింది లిఖిత.
“వద్దు. అక్కడ జోసెఫ్ జ్ఞాపకాలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి. మరెక్కడైనా ఫర్వాలేదు.” అంది లిఖిత.
టాక్సీ అదే రోడ్డులోని మరో హోటల్ ముందాగింది. లిఖిత డబుల్ రూం తీసుకుంది. కార్తికేయన్‌ని మంచమ్మీద పడుకోబెట్టాడు కాన్హా.
కార్తికేయన్ మాత్రం అసలీ లోకంలో లేదు. పిచ్చి చూపులు చూస్తూ ఏదో గొణుగుతూ మంచం మీద పడుకున్నాడు.
అతన్నలా చూస్తుంటే లిఖిత హృదయంలో అల్పపీడనంతో సముద్రంలో పొంగే తుఫానులా దుఃఖం తన్నుకొస్తుంది.
హోటల్ తలుపులు మూసి వుండటంతో ఆమె ఇక ఏడుపుని ఆపుకోలేక బిగ్గరగానే ఏడ్చేసింది.
ఆకస్మికంగా ఆమె అలా దుఃఖానికి గురవడంతో బాగా కంగారుపడిపోయేడు కాన్హా.
“ఏంటిది. ఏం జరిగింది?” అన్నాడు గాభరాగా ఆమె చేటులు పట్టుకొని.
అతని పలకరింపు ఆమెలోని దుఃఖాన్ని ద్విగుణీకృతం చేసింది.
అతని భుజం మీద తలాంచి వెక్కెక్కి ఏడ్చింది లిఖిత.
పది నిమిషాలు ఆతనేం మాట్లాడలేదు.
మెల్లిగా ఆమెలోని దుఃఖం బయటకొచ్చేసి హృదయం తేలికపడింది.
అతని భుజం మీద నుండి తల ఎత్తి ‘సారీ’ అంటూ దూరంగా జరిగి కూర్చుంది.
అతను జాలిగా నవ్వి “ఇప్పుడేం జరిగిందని?” అనడిగేడు.
లిఖిత నిస్పృహగా కాన్హా వైపు చూసి “మా డేడీకి బాగవుతుందని, ఆయనీ లోకంలో పడతాడని నాకు నమ్మకం కల్గడం లేదు కాన్హా. ఆయన చూడు ఒక పిచ్చివాడిలా వున్నాడు” అంది బాధగా.
“ఇంకా సముద్ర స్నానముంది. ఆయనకి నయం కావొచ్చు. ఎందుకలా గాభరా పడతావు” అన్నాడతను ఊరడింపుగా.
లిఖిత అతనివైపు చురుగ్గా చూసింది.
“నేను చిన్న పిల్లను కాను మరీ మభ్యపెట్టడానికి. ఇన్ని రోజులు వైద్యానికి నయం కాని ఆయన మానసిక స్థితి కేవలం ఈ రోజు ఆ ఉప్పు నీళ్లలో స్నానం చేస్తే బాగుపడి పోతుందంటావా?” అంది కోపంగా.
“అలా తీసిపారెయ్యకు. ఈ రోజున భూమ్యాకర్షణ శక్తి వలన సముద్రం బాగా పొంగుతుంది. పౌర్ణమి ప్రభావం సముద్రం మీద శక్తివంతంగా వుంటుంది. ఆ సమయంలో చేతబడి కాబడిన వారు ఆ నీళ్లలో మునగడం వలన వారిలోని చెడూ పరభావం నశింపబడొచ్చు. మనం మంచిని ఆశించడంలో తప్పు లేదు కదా” అన్నాడు కాన్హా.
అతని తర్కానికి లిఖిత కొద్దిగా ఆ శ్చర్యపోయింది. ‘ఒక అడవి మనిషిగా ఏనుగుతో అరణ్యంలో తిరిగే ఇతనికి సైన్సు కూడా తెలుసా?’ అని కొద్దిగా ఆశ్చర్యపోయింది.
కాన్హా ఆమె భుజం తట్టి “నువ్వు స్నానం చేయి. నేను బేరర్‌ని పిలిచి టిఫిన్ ఆర్డర్ చెప్పి అలా వరండాలో నిలబడతాను”అంటూ బయటికి నడిచేడు. లిఖిత అతన్ని చూస్తూ బాత్రూంలోకి నడిచింది.

*****

కుటుంబరావుతో కలిసొచ్చిన కేయూరవల్లిని చూసి ఏడుపు లంకించుకుంది ఈశ్వరి. పిల్లలిద్దరూ భయం భయంగా నిలబడి వున్నారు.
కేయూర ఆ ఇంటిని నిశితంగా గమనించింది. ఇల్లు పొందికగా, ఇంటికి కావలసిన వస్తువులతో కంటికి వదరుగా వుంది. పిల్లలు కడిగిన ముత్యాల్లా వున్నారు.
కుటుంబరావు చూపులకి సినిమా హీరోలా లేకపోయినా భార్యని ప్రేమిస్తున్నాడు. తనుండగానే మరొకణ్ణి భర్తగా భావించి తాళి కట్టించుకున్నా అసహ్యించుకోకుండా ఆమెని బాగు చేసుకోవాలని తాపత్రయపడుతున్నాదు. ఆ లక్షణమే అతన్నిప్పుడు కేయూరవల్లి దృష్టిలో హీరోని చేసింది.
“ఏ భార్యకైనా ఇంతకంటే అదృష్టమేం కావాలి?” అనుకుంది మనసులో.
కేయూర ఈశ్వరిని బంధించిన గది కిటికీ దగ్గర నిలబడి “ఎందుకమ్మా ఏడుస్తున్నావు. నీ భర్తకి గాని, పిల్లలకు గాని ఏమన్నా అయిందా?” అనడిగింది మెత్తగా.
” నా భర్త ఇతను కాదు. ఈ పిల్లలు నాకేం కారు. నన్ను వదలమని చెప్పండి. నేనెళ్ళిపోతాను” అంది ఏడుస్తూ.
“ఇతను నిన్ను పెళ్ళి చేసుకోలేదా? వీళ్లని నువ్వు కనలేదా?” అనడిగింది కేయూర.
ఆమె సూటి ప్రశ్నకి ఈశ్వరి మొదట కాస్త తెల్లబోయినా మళ్ళీ సర్దుకుని “పూర్వజన్మలో ఇతను కుక్కని తెలియక చేసుకున్నాను. అతనికి పిల్లల్ని కన్నాను. ఇప్పుడు నా భర్తెవరో తెలిసింది. నేనిక వీళ్లతో కలిసి వుండలేను. నన్ను నా భర్త దగ్గరీ వెళ్ళనివ్వండి. లేకపోతే నేను చచ్చిపోతాను.” అంది మొండిగా ఏడుస్తూ.
కేయూర కుటుంబరావు కేసి చూసింది.
నవనాడులూ సిగ్గుతో కుంచించుకుపోతుండగా అతను తల దించుకున్నాడు.
కేయూర తిరిగి ఈశ్వరి కేసి చూసి “ఇంతకీ నీ భర్తెవరంటావు?” అనడిగింది సహనాన్ని కొనితెచ్చుకుంటూ.
“వెంకట్” అందామె ఠక్కున.
కేయూర మౌనంగా హాల్లోకొచ్చింది. కుటుంబరావు ఆమెననుసరిస్తూ “ఇదండీ పరిస్థితి. దీనికి పట్టిన పిచ్చెలా వదులుతుందో నాకర్ధం కావడం లేదు.” అన్నాడు బాధగా.
“ఆమె ఉన్మాదస్థితిలో వుంది. మనం చూసి జాలిపడటం తప్ప ఏం చేయలేం. అలా బంధించినందువలన కూడా ఆమె స్థితి మెరుగుపడుతుందనుకోలేం. ఆమెని నందనంలోని సాయి భక్తులు శర్మగారి దగ్గరకి తీసుకెళ్ళండి. ఆయన స్వాంతన వచనాలతో ఆమె ఈ లోకంలోకి రాగలదన్న నమ్మకం నాకుంది. నేనీలోపున నాకు తెలిసిన ఐ.జి.గారికి హైద్రాబాదు ఫోను చేసి వెంకట్ మీద రహస్యంగా ఏక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాను” అని సలహా ఇచ్చింది కేయూర.
కుటుంబరావు ఆమెకు చేతులు జోడించాడు. “మీ మేలు మరచిపోలేను. కాని ఈవిణ్ని తీసుకెళ్లడం కష్టమేమో!” అన్నాడు.
“నా ఫ్రెండ్ డాక్టర్ ప్రభంజనని వెళ్లి కలిసి పరిస్థితి చెప్పండి. ఆమె మీకు సహాయపడుతుంది” అంది కేయూర.
కుటుంబరావు తల పంకించేడు.
ఇద్దరూ బయటకొచ్చేరు.
కేయూర కారెక్కబోతూ బాక్‌వీల్ వైపు చూసింది.
బాక్‌వీల్ పంక్చరయింది..
“అరె! టైర్ పంక్చరయింది. ఇప్పుడెలా? అంది కేయూర.
“నేను దీన్ని రిపెయిర్ చేయించి మీ ఇంటికి తెచ్చే ఏర్పాటు చేస్తాను. అందాక మీరా ఆటోలో వెళ్లండి” అన్నాడు ఎదురుగా వున్న ఆటోని పిలుస్తూ కుటుంబరావు.
కేయూర ఆటో ఎక్కి “ధైర్యంగా వుండండి. మీకేం జరగదు.” అంది మళ్లీ అతనికి ధైర్యం చెబుతూ.
ఆటో కదిలి వెళ్లిపోయింది.
కుటుంబరావు ఆలోచిస్తూ లోనికి నడిచేడు.
కారుకి పంక్చర్ చేయించి అక్కడ ఆటోని ఏర్పాటు చేసింది వెంకటేనని ఆ ఇద్దరికీ ఏ మాత్రం తెలియదు.

*****

అర్ధరాత్రి.
సరిగ్గా పన్నెండు గంటల సమయంలో లిఖిత, కాణ్హా సముద్రపుటొడ్డున కార్తికేయన్‌ని తీసుకుని టాక్సీ దిగేరు.
వెన్నెల విరగ గాస్తూ పత్తి రాలి పడుతున్నట్లుగా వుంది.
సముద్రం రెచ్చిపోతున్న విప్లవవాదిలో వెయ్యి నాలుకలుగా కెరటాన్ని మార్చుకొని ఉవ్వెత్తున ఆకాశాన్ని అందుకోవాలనే వెర్రి ఆరాటంతో ఎగసెగసి పడుతోంది.
సముద్రం కొన్ని అడూగుల మట్టం పెరుగు భూమి మీద ఏ క్షణమన్నా విరుచుకుపడగలదనే భ్రాంతిని కల్గిస్తోంది.
ముఖ్యంగా దాని ఘోష విని లిఖిత భయంతో కాణ్హా చేతిని పట్టుకుని బలంగా.
ఆమెలోని అధైర్యం గమనించేడు కాణ్హా.
“ఏం ఫర్వాలేదు. భయపడకు” అన్నాడు.
ఎటు చూసినా జనసంచారం లేని ఆ నిర్మానుష్య ప్రదేశాన్ని సముద్రమే ఆక్రమించి రాజ్యమేలుతున్నట్లుగా వుంది.
“ఇలాంటి భయంకరంగా వున్న సముద్రంలో డేడినెలా అస్నానం చేయిస్తాం. ఆయన కొట్టుకుపోతే?” అంది ఆందోళనగా.
“నేను లేనా గజ ఈతగాణ్ణి!” అన్నాడు కాణా.
వారి భయాలుగాని, ఆందోళనగాని ఏ మాత్రం తెలియని కార్తికేయన్ కాణ్హా చేతిని పట్టుకొని ముందుకు నడుస్తున్నాడు ఒక పసిపాపలా యాంత్రికంగా.
“నువ్విక్కడే నిలబడు. నేను మీ నాన్నగారికి స్నానం చేయించి తీసుకొస్తాను”అన్నాడు కాణ్హా కార్తికేయన్‌ని ముందుకు నడిపిస్తూ.
లిఖిత అలానే నిలబడి పోయింది అక్కడే.
కాణ్హా కార్తికేయన్‌ని మెల్లిగా సముద్రంలోకి దించేడు.
చల్లని నీటి స్పర్శతో కార్తికేయన్ శరీరం సన్నగా వణికింది.
కార్తికేయన్ని మూడుసార్లు బలవంతంగా నీటిలో ముంచేడు కాణా.
ఉప్పునీరు చెవి, ముక్కు, కళ్లలోకి వెళ్లడంతో మంట పుట్టి ఉక్కిరిబిక్కిరయ్యేడు కార్తికేయన్.
అయినా కాణ్హా లెక్కపెట్టకుండా అతని చేత సముద్ర స్నానం చేయించేడు.
“ఇక తీసుకొచ్చేయి. నాకు భయమేస్తోంది.” అంటూ అరిచింది లిఖిత.
కాణ్హాకి ఆ అరుపు వినపడిందో లేదోగాని అతను చేతులు జోడించి “దేవుడా నేను నా కోసం నిన్నెప్పుడూ ప్రార్ధించలేదు. నా దృష్టిలో నా తల్లే నాకు దైవం. కాని.. ఈ అమ్మాయెవరో తండ్రి కోసం ఊరుగాని ఊరొచ్చింది. పుట్టేక తండ్రెలా వుంటాడో తెలీని ఈ పిల్ల తండ్రి బాగుకోసం పడే ఆరాటం చూస్తే మనుషులం మాకే బాధ కల్గుతోంది. నువ్వు దేవుడివి. నీకెంత బాధ కల్గుతుందో నాకు తెలుసు. అందుకే వాళ్ల నాన్నని మనిషిని చేసి ఆవిడ కప్పజెప్పు. నీకింకా చెప్పలేని సంతోషం తృప్తి కల్గుతాయి. నీకు దేవుడనే పేరుకుండే సార్ధకత చేకూరుతుంది” అన్నాడు ఎలుగెత్తి.
కాని. అప్పుడే అనుకోని దురదృష్టం ఒక పెనుకెరటంగా మారి కార్తికేయన్‌ని సముద్రంలోకి లాగేయడం గమనించలేకపోయేడు.

ఇంకా వుంది.

ఇంకా వుంది.

1 thought on “బ్రహ్మలిఖితం 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *