March 28, 2024

విశ్వపుత్రిక వీక్షణం – రెక్కలకొండ

రచన: డా.విజయలక్ష్మీ పండిట్

జయ డైనింగు హాల్లోకొచ్చి “విహన్‌ను పిలిచాను వస్తున్నాడు” అంటూ భర్త అనిల్‌ వైపు తిరిగి, ”విహన్‌ మన పెరటి తోటలో వేపచెట్టును చూస్తూ నిలబడి చేతులూపుతూ మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు నాన్నా అంటే, అదిగో ఆ వేప చెట్టుతో మాట్లాడుతున్నాను. అది కొమ్మల చేతులతో పిలిచి నవ్వుతూ మాట్లాడుతుందమ్మా. దానికి పెద్ద కండ్లు, నోరు కూడా వున్నాయి చూడు అంటాడు. నాకు కనిపించడంలేదండి”అంటూ ఆందోళన పడింది జయ.అనిల్‌కు అంతా అర్థమయింది. తనకు వున్నట్టే పెరిడోలియా (Pareidolia) మానసిక స్వభావం విహన్‌కు వున్నట్టుందని గ్రహించాడు.
తన బాల్యంలో పెరడోలియా ప్రభావం వల్ల తన ఊహా, కలల జగత్తులో తన ‘రెక్కల కొండ’ అనుభవం జయకు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని గ్రహించాడు.
”నాలాగే విహన్‌కు ‘పెరిడోలియా’ వున్నట్టుంది”అన్నాడు.
చిన్న తనంలో తనను అలరించి తన భవిష్యత్తుకు బాటలు వేసిన ఆ రెక్కల కొండ పేరు
“విహన్ “ అనిల్ కొడుకుకు పెట్టాడు.
”పెరిడోలియా’ అంటే ఏమి, ఏమి టా కథ”అని అడిగింది భార్య జయలక్ష్మి.
”పెరిడోలియా అనేది ఒక మానసిక లక్షణం, మనసు ఒక అవాస్తవ ఆకారం లేదా శబ్దం వల్ల ప్రేరణ పొందుతుంది. ఆ ప్రేరణ వల్ల ప్రాణం లేని వస్తువులతో మనిషి ఆకారాలను లక్షణాలను ఊహించుకుంటారు. ఆ పెరిడోలియా ప్రేరణ వల్ల నేను నా బాల్యంలో కొండకు కండ్లు, రెక్కలున్నట్టు, మాట్లాడినట్టు, నన్ను తనపై కూర్చోబెట్టి త్రిప్పినట్టు ఊహించుకుంటూ ఒక విధమైన కలల జగత్తులో ఉండిపోయేవాడిని” అంటూ భార్యకు తన అనుభవం చెప్పడం మొదలుపెట్టాడు అనిల్‌ .అనిల్‌ కండ్ల ముందు తన బాల్యంలో ఆ ఊహల,కలల సంఘటనలు సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లా రీలు తిరిగింది.

***

అనిల్‌ తన రూమ్‌లో కిటికీలోనుండి దూరంగా చూస్తూ నిలబడున్నాడు.
”అనీల్‌…నాన్నా.. అనీల్‌ ఎక్కడున్నావు” అంటూ వాళ్ళ అమ్మ సరళ పిలుస్తూ రూమ్‌లోకి తొంగి చూసింది. తొమ్మిదేండ్ల అనిల్‌ కిటికీ నుండి తన చూపులను వెకనక్కు తిప్పి చూస్తూ ” ఇక్కడ ఉన్నానమ్మా” అన్నాడ. టిఫిన్‌ తినకుండా ఏం చేస్తున్నావురా…బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దువుగాని రా”
అని” ఇంతకీ అంతగా ఏం చూస్తున్నావు కిటికీ నుండి”అని అనీల్‌ దగ్గరకొచ్చింది సరళ .ఎత్తయిన ప్రదేశంలో వుండే తమ ఇంటి కిటికీలో శీతాకాలపు మంచుతెరలలో నీలగిరి కొండల అందలాను చూడాలేకాని వర్ణించడం కష్టం అనుకునేది. ఆ పరిసర ప్రాంతం టీ తోటలతో పచ్చగా మెలికలు తిరుగుతూ కనిపించే ఘాట్ రోడ్లతో పచ్చగా, ఆహ్లాదంగా ఉంది. నీలంగా కోన్‌ ఆకారంలో పొగమంచుతో కప్పబడి అందంగా హుందాగా నీలాకాశం తెరముందు నిలబడి వున్న కొండను చూపించాడు. ”ఆ కొండ పిలుస్తూందమ్మా నన్ను రెక్కలు చాచి పిలుస్తూంది” అన్నాడు.
సరళ వింతగా చూస్తూ ”కొండ పిలవడమేమిటిరా.ఏదైనా కలగాని వచ్చిందా,ఇంకా నిద్ర, కలలోనుండి బయటపడలేదా!” అని కొడుకు మాటలను కొట్టిపారేసి రా టిఫిన్‌ చేద్దువుగాని నాన్న వెయిట్ చేస్తున్నారు నీ కోసం” అని కొడుకు చేయిపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళింది డైనింగు హాల్‌లోకి. అనిల్‌ కిటికీ నుండి ఆ కొండవైపు చూస్తూ వెళ్ళాడు.

అది ఆదివారం సాయంకాలం. కిటికి ప్రక్కన తన టేబుల్‌పై రంగులు, బ్రష్‌లు పెట్టుకుని స్టాండుకు తగిలించిన డ్రాయింగు పేపర్‌పై ఆ కొండను పదే పదే చూస్తు పెయింట్ చేస్తున్నాడు అనిల్‌.
అనిల్ కు పెయింటింగ్ అంటే ఇష్టం. వాళ్ళ నాన్న రవికుమార్ ఎంకరేజ్మెంట్ వల్ల పెయంటింగ్ క్లాసులకు వెళతాడు.
అనిల్‌ వాళ్ళ నాన్న రవికుమార్‌ కొడునుకు సాయంత్రం వాక్‌కు తీసుకెళదామని అనీల్‌ రూమ్‌లోకి వచ్చి కొడుకు గీసిన బొమ్మవైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
”ఏంటి నాన్నా.. అనిల్‌ ఆ కొండకు రెక్కలు కండ్లు గీశావు. చాలా వింతగా బాగుంది నీ ఇమాజినేషన్‌” అన్నాడు.
”కాదు నాన్నా.. ఆ కొండకు నిజంగానే రెక్కలు, కండ్లు వున్నాయి. నా వైపు చూస్తూ రెక్కలు చాచి పిలుస్తుంది అప్పుడప్పుడు నన్ను” అన్నాడు.
కుమార్‌ అయోమయంగా చూశాడు. తరువాత నవ్వేస్తూ ”ఒకే సరే అలా వాక్‌కు వెళదాంరా కాసేపు” అని కొడుకును పిలిచాడు.
అనీల్‌ తాను గీసిన ఆ కొండ బొమ్మవైపు వాళ్ళ నాన్నవైపు మార్చి మార్చి చూసి.. ”సరే నాన్నా..”అంటూ వాళ్ళ నాన్న వెనకాల నడిచాడు. నడిచి వెళుతూ వెనక్కు తిరిగి చూసి టాటా అని చేయి వూపుతూ నడిచి వస్తున్న కొడుకును వింతగా చూస్తూ ” ఎవరికి టాటా చెపుతున్నావు అనీల్‌” అని అడిగాడు.
”ఆ పటంలో నేను గీసిన కొండ తన రెక్కలు ఊపుతూ టాటా చెప్పింది నాన్నా అన్నాడు.
రవికుమార్‌కు ఏమీ పాలుపోలేదు.
అనీల్‌ ఎందుకిలా అవాస్తవంగా మాట్లాడుతున్నాడు అనుకుని ”రా వెళదాం” అంటూ కొడుకును షూష్‌ వేసుకోమని షూ స్టాండ్‌ దగ్గరకు తీసుకెళ్ళి ఇద్దరూ షూస్‌ వేసుకున్నాక ఇంటి బయటకు నడిచారు. రోడ్డు కిరువైపులా పూల మొక్కలతో, పచ్చని గుబురుగా అందంగా తీర్చినట్టుండే ఫెర్న్‌ మోక్కలతో, నీలగిరి తైలం చెట్లు తలలూపుతూ కదులుతుంటే చల్లని గాలిలో రోడ్డుపై నడవసాగారు. సరళ ఆ రోజు రాలేదు.
”అమ్మ రాలేదు కద నాన్నా”అన్నాడు అనీల్‌.
”అమ్మకు ఈ రోజు కాస్త నలతగా వుండి రావాలనిపించలేదంది. అందుకే ఇద్దరం వెళదాం” అంటూ ముందుకు సాగారు.
నడుస్తున్న అనిల్‌ చూపులు మరలా ఆ కొండపై సారించాడు. మరలా చేయూపాడు.
కుమార్‌ కొడుకుతో ఏదో మాట్లాడుతూ నడుస్తున్నాడు. అనిల్‌ కొండవైపే చూస్తూ నడుస్తున్నాడు. వాకింగు ముగించి ఇంటికి వచ్చి స్నానం చేసి డిన్నర్‌ తిన్న తరువాత అనిల్‌ పడుకుంటూ మరలా ఒకసారి తాను గీసిన నీలంకొండ రెక్కలను, కండ్లను బ్రష్‌తో సరిచేసి తదేకంగా ఆ నీలం రెక్కల కొండకేసి చూస్తూ నిలబడిపోయాడు .
అలా చూస్తూ తాను ఆ కొండ మీద ఎక్కి కూర్చున్న ట్టు ఊహించుకుంటూ క్రమంగా ఆ అనుభూతిని పొందసాగాడు.

*****

అనిల్‌ తన ఊహాజగత్తులో కొండపైన చదునుగా వున్న ప్రాంతంలో రాయిపై కూర్చుని వున్నాడు. రెక్కలు ఊపుతూ ఆ నీలం కొండ ఆకాశంలో వెళుతూంది. పైకి క్రిందకి రెక్కలు ఊపుతూ నీలం కొండ ఆకాశంలో ఓ వింత పక్షిలా ఎగురుతూంది. కొండతోపాటు అనిల్‌ ఆకాశంలో ప్రయాణిస్తున్నాడు. సూర్యుడు ఉదయించాడు. తూర్పున ఆకాశం రంగులు మార్చుకుంటూంది. సూర్యోదయంలో మబ్బుల్లో ప్రయాణం చాలా సంతోషంగా వుంది అనిల్‌కు. అనిల్‌కు అంతా వింతగా వుంది. ఆకాశంలో విమానం లో వెళుతూ కిటికీలోంచి చూసినపుడు క్రింద చెట్లు, నీటి కాలువలు చిన్న చిన్న కొండలు, టీ తోటలు ,అగ్గిపెట్టెల్లా పేర్చిన ఇండ్లు,దూరానికి బొమ్మరిండ్లలాగున్నట్టు తోచాయి.కొద్దిసేపు తిరిగాక అనిల్‌కు ఆకలేస్తూ, దాహంగాకూడా ఉంది.
అది గ్రహించినట్లు కొండ ”అనిల్‌ ఆకలేస్తుందా” అని అడిగింది. ”అవును” తలూపుతూ ఊ కొట్టాడు అవునని. మెల్లగా కొండ క్రిందికి దిగి ఒక రెస్టారెంట్ దగ్గర రోడ్డు పక్క ఆగింది. అనిల్‌ దిగడానికి అనువుగా తన శరీర ఆకృతిని చిన్నగా చేసింది.నీ జేబులో డబ్బులున్నాయి. ఏమి కావాలో తిని రమ్మనింది ఆ రెక్కల కొండ. జేబులో చేయిపెట్టి చూశాడు. వందరూపాయల నోట్లు. కొండవైపు చూసి నవ్వుముఖంతో ”నీపేరేమి” అడిగాడు అనిల్‌.
”నాకు పేరు లేదు” అంది కొండ.
”నేను నిన్ను ‘విహాన్‌’అని పిలుస్తాను. విహంగం అంటే పక్షి. నీవు రెక్కలతో పెద్ద నీలం పక్షిలా వున్నావు” అన్నాడు అనిల్‌.
”సరే అలాగే పిలు” అంది కొండ.
అనిల్‌ రెస్టారెంట్ లోకి వెళ్ళాడు. వంటల వాసన గుమగుమలాడుతూంది. వెళ్ళి ఒక బల్ల దగ్గర కుర్చీలో కూర్చున్నాడు. లోపల జనం తక్కువగా వున్నారు. ఒక చిన్నపిల్లవాడు వచ్చి చేతిలోని స్పాంజితో అనిల్‌ కూర్చున్నా టేబుల్‌ తుడుస్తూ ”ఏం కావాలి”అన్నాడు.
అనిల్‌ ”ఏమున్నాయి ఫుడ్‌ అయిటమ్స్‌” అడిగాడు.
”బ్రెడ్‌ జామ్‌ బట్టర్‌, సాండ్‌విచ్‌, ఎగ్సు, ఇడ్లీ, వడ, దోశ”అని చెప్పుకుంటూ పోతున్నాడు.
మాసిన బట్టలతో జిడ్డుకారుతున్న ఆ పిల్లవాడివైపే జాలిగా చూస్తూ అనిల్‌ ”ఇడ్లీ వడ” అన్నాడు. పావుగంట తరువాత ఇడ్లీలు రెండు వడలు రెండు పేర్చిన ప్లేటు, చ్నెట్నీ సాంబారు గిన్నెలు ట్రేలో పెట్టుకొని తెచ్చాడు ఆ పిల్లవాడు.
టేబుల్‌పై పెట్టి ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు.
మరలా మంచి నీళ్ళ జగ్గు పట్టుకొచ్చి గ్లాసులో నీళ్ళు పోశాడు. ఆ పిల్లాడితో అనిల్‌ ”నీవు తిన్నావా టిఫిన్ ‌”అన్నాడు. ”లేదు” అన్నాడు.
”రా నాతో కూడా తిను”అని పిలిచాడు. ”ఇంకా గంట వుంది నేను తినడానికి. రోజు ఆ టైముకే నాకు టిఫిన్ ‌ పెడతారు”అని వేడి వేడి ఇడ్లీలవైపు చూస్తూ నీళ్ళు గ్లాసులో పోసి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. వెళుతున్న ఆ అబ్బాయి కాళ్ళపై పడింది అనిల్‌ దృష్టి. కాళ్ళకి చెప్పులు లేవు మురికిగా నల్లగా మడమలు చీలి వున్నాయి.
అనిల్‌ తింటూ ఆలోచిస్తున్నాడు, ”ఆ అబ్బాయికి అమ్మ నాన్న లేరా! నాలాగా స్కూల్‌కు వెళ్ళడం
లేదా!”అని జాలితో నిండిపోయింది అనిల్‌ మనసు.టిఫిన్‌ తిని డబ్బులు చెల్లించి వెనుదిరిగాడు. వెళుతూ వెళుతూ ఆ పిల్లాడికోసం వెతికాయి అనిల్‌ కండ్లు. వెనుక కిచెన్‌ కిటికి దగ్గర తనను చూస్తూ నిలబడి వున్నాడు ఆ పిల్లాడు.
అనిల్‌ చేయి వూపాడు. ఆ పిల్లాడు కూడా చేయి వూపాడు. తన చేతిలో వున్న డబ్బులో వందరూపాయల నోటు తీసి ఆ పిల్లాడి దగ్గరకెళ్ళి ఇవ్వబోయాడు.
”వద్దు” అన్నాడు ఆ పిల్లవాడు.
”తీసుకో” అన్నాడు అనిల్‌. ”పని చేయకుండా దానం తీసుకోవడం నాకిష్టం లేదు” అన్నాడు.
ఆ పిల్లాడి ముఖానికేసి చూస్తూ వంద రూపాయల నోటును జేబులోకి నెట్టుతూ వెనుతిరిగాడు అనిల్‌ తలవంచుకుని. మరలా దగ్గరకొచ్చి నీపేరేమి అని అడిగాడు. ”అందరు ‘చింటూ’ అంటారు అన్నాడు ఆ అబ్బాయి.
”మీ అమ్మా నాన్నా ఎక్కడున్నారు”అడిగాడు అనిల్‌.
”లేరు. ఈ హోటల్‌ ఓనర్‌కి నేను దొరికానట దారిలో నాకు రెండు సంవత్సరాలప్పుడు”అన్నాడు చింటూ. అనిల్‌కు ఇంకేమి మాటలు రాలేదు.
అనిల్‌ అనిల్‌ అని పిలుస్తున్నట్టనిపించి చూశాడు. రోడ్డుకవతల కొండ పిలుస్తూంది రమ్మని.
త్వరగా నడిచి చిన్నదిగా గుండ్రని దిమ్మెలాగ కుచించుకుపోయిన కొండ చివరకు ఎక్కి రాయిమీద కూర్చున్నాడు. కొండ పెద్దగా పెరిగి రెక్కలు చాచి పైకెగిరింది. అనిల్‌కు అయోమయంగా వుంది. మనసులో చింటు గురించిన తపన.
*****
“అన్ని కొండలకు రెక్కలు లేవు నీకెందుకు రెక్కలున్నాయి, ఆకాశంలో ఎగురుతున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు. నీలో ఏవో మాయలున్నాయి. నన్నే ఎందుకు పిలిచావు” అని కొండను ప్రశ్నించాడు అనిల్‌.
”నేను ఎగిరే పర్వతాన్ని. ఒకప్పుడు నా పై గుహలో తపస్సు చేసుకొనే ఒక ఋషి నాకు ఈ వరాన్ని ప్రసాదించాడు. నాకు మంచి మనసున్ననీలాంటి పిల్లలంటే ఇష్టం. వాళ్ళకు మాత్రమే కనిపిస్తాను. పలకరిస్తాను, ప్రేమిస్తాను, విహారానికి తీసుకెళతాను”అన్నది ఆ రెక్కల కొండ.
”నాతో కూడా ఆ హోటల్‌లో వున్న ‘చింటూ’ ఆ పిల్లాడిని కూడా తీసుకెళదామా” అన్నాడు అనిల్‌.
”అందరికీ ఈ అదృష్టం దక్కదు. కొందరికే లభిస్తుంది” అని ”ఇంకా మనం తిరగాల్సిన ప్రదేశాలున్నాయి. ‘జూ’ చూస్తావా అన్నది విహాన్ కొండ మాట మారుస్తూ.
”సరేనని” తలూపాడు అనిల్‌.
”ఆకాశంలో విహరిస్తున్న మనం అందరికీ
కనిపిస్తామా”అడిగాడు అనిల్‌.
”లేదు ఎవరికి మనం కనపడము. కాని మనకందరు కనిపిస్తారు”అంది విహాన్‌ కొండ. నేలపైనుండి ”టక టక”మని శబ్దం వినిపించడంతో క్రిందికి చూశాడు అనిల్‌. ఎండలో విశాలంగా పరచుకుని వున్న రాళ్ళపై కూర్చొని సుత్తితో రాళ్ళను కొడుతున్నారు కొంతమంది మనుషులు. ఆడ మగ చిన్న పెద్ద. ఆ గుంపులో తన వయస్సున్న పిల్లలు కూడా నిక్కర్లు మాత్రం వేసుకుని చమటలు కారుస్తూ రాళ్ళను ముక్కలు చేస్తున్నారు.
”చిన్న పిల్లలు ఎంత కష్టపడుతున్నారో కదా ఎండలో వాళ్ళ అమ్మ నాన్నతో” అన్నాడు అనిల్‌.
”అవును, బీదరికం వాళ్ళ బాల్యాన్ని కొల్లగొట్టింది నీలా బాల్యం అమ్మ నాన్నతో గడుపుతూ, స్కూలు కెళుతూ పిల్లలతో ఆడుకుంటూ, కథలు వింటూ, చదువుకుంటూ కావాల్సిన తిండి తింటూ ఆనందంగా బాల్యం గడిపే అదృష్టం లేదు ఆ పిల్లలకు.ఇలాంటి బాల కార్మికులెందరో హోటల్లలో ,పరిశ్రమలలో, ఇండ్లలో పనిచేస్తూ బీదరికానికి బలి అవుతున్నారు”అంటూ ముగించింది విహాన్‌ కొండ.
అంతలో ‘జూ’ వచ్చింది. జూలో ఒక వైపు చిన్న నీలం దిబ్బలాగా నేలపైకి దిగి ”వెళ్ళి జంతువులను చూసి రా” అంది విహాన్ కొండ.
అనిల్‌ ఆలోచిస్తూ నిలబడ్డాడు.
”అంతా తిరిగి నడచి చూడలేవులే రా.. ఎక్కు నేను త్రిప్పి చూపిస్తా”నంది విహాన్‌ కొండ.
అనిల్‌ ఎక్కి కూర్చోగానే రెక్కలు మెల్లగా కదుపుతూ లేచింది రెక్కలకొండ.
కుచించుకు పోయిన కొండ ఆకారంలోనే నేలకు కొంచెం ఎత్తులో ఎగురుతూ ‘జూ’లోని జంతువులను చూపిస్తూ అనిల్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ ‘జూ’ అంతా చూపెట్టింది.
”జంతువులకు తిండి సరిగా పెట్టకుండా ఎందుకు బంధించి ‘జూ’లో పెడతారు.వాటికి అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా”అన్నాడు అనిల్‌.
”నిజమే పాపం చాలా జంతువులకు ‘జూ’ ఒక బందిఖానా. అడవుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ తిరిగే ఆ జంతువులకు ఎంత కష్టమొచ్చిందో” అంది విహాన్‌ కొండ.
విహాన్‌ కొండపై కూర్చొని నీరెండలోఆకాశంలో మేఘాల తెరల మాటున ప్రయాణిస్తున్న అనిల్‌కు ‘జూ’లో జంతువుల బదులు చింటు, కొండ మీద రాళ్ళు కొడుతున్న పిల్లలు, ఇంకా బాల్యం వీడని చిన్న పిల్లలు తప్పించుకోలేని బోనుల్లో, ఇనుప తీగల గదుల్లో, పంజరాల్లో, కంచె వేసి వదిలిన జంతువుల స్థానాల్లో సరిగా తిండిలేక, నిరాశగా, నిస్సహాయంగా, దీనంగా కనిపించారు.ఇష్టానుసారము ఆడుకుంటూ తిరిగే స్వేచ్ఛలేక బోనుల్లో మసలుతున్న జంతువుల్లా కండ్ల ముందు కదిలారు. ఆ దృశ్యం అట్లే నిలిచిపోయింది అనిల్‌ లేతమనుసులో…!

“ఇక సాయంత్రమయింది వేళదామా!” అంటూ విహాన్‌ కొండ అనిల్‌ను వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గర
దించి ఎగిరి వెళ్ళిపోయింది రెక్కలతో టాటా చెపుతూ. అప్పుడప్పుడు ఆ రెక్కల కొండపై ఊహల విహారం, కల అనిల్‌ చదువుకూ, జీవితానికి పునాది వేసింది.
అనిల్‌ పెద్దవాడయి… ఐ.ఏ.ఎస్‌. చదివి, కలెక్టరయి పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడాలని, బాల కార్మిక వ్యవస్థను చేతనయినంతవరకు రూపు మాపే ప్రయత్నం చేయాలనే పట్టుదలతో పెరిగాడు.కలెక్టరయ్యాడు.ఆ పట్టుదలకు కారణం, ప్రేరణ తన బాల్యంలో ఊహల ప్రపంచంలో ‘విహన్‌’ రెక్కల కొండపై తాను చేసిన విహారం.

***

తన బాల్యంలో ఊహల,కలల కథను ముగించి అనిల్‌ జయతో ”అప్పుడప్పుడు వచ్చే నా కల అనుభవాన్ని మా నాన్నాతో చెప్పాను. నాన్నకు తెలిసిన ఒక సైక్రియాట్రిస్ట కు నా ఊహలను,కలను గురించి చెప్పాడు.
అతను నాకు ‘పిరిడోలియా’ అనే మానసిక లక్షణం వల్ల అలాంటి ఊహాప్రపంచంలో ఉన్నానని, పిల్లల కలలపై దాని ప్రభావం గురించి చెప్పి వయస్సు పెరిగే కొద్దీ మెదడులో వచ్చే మార్పుల వల్ల ఆ మానసిక లక్షణం కనుమరుగవుతుంది అన్నాడు.నా వయసు పెరిగేకొద్ది నాకు ఆ పిరడోలియా లక్షణం తగ్గినా, నా బాల్యం లో ఆ ఊహల కల నా మనసులో నిలిచిపోయింది” అని అనిల్ మరలా…
”విహన్‌’ ‘పెరిడోలియా’ వల్ల ఎటువంటి ఊహల సంఘటనలు ఎదుర్కొంటాడో ? ఆ మాట్లాడే వేప చెట్టు విహాన్ కు ఏ కథలు చెపుతుందో, ఏ అనుభవాలు వాడికి పంచుతుందో మెల్లగా సున్నితంగా తెలుసుకోవాలి మనం అంటూ”, దీనంగా భయంగా చూస్తున్న భార్య భుజంపై చేయివేసి తట్టి ”నత్తింగ్ విల్‌ హాపెన్‌ జయా. బి బోల్డ్‌. మనం పేరెట్సు ఇలాంటి పిల్లలలో మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ, వాళ్లు ఎదుర్కొనే సమస్యలను సున్నితంగా అర్థం చేసుకుంటూ సలహాలిస్తూ పెంచుకోవాలి. ఒక విధంగా నేను నా బాల్యంలో పెరిడోలియ ‘మానసిక లక్షణం వల్ల ఆ కల కనడం వల్ల నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాను. చూద్దాం విహాన్‌కు ఎలాంటి ఊహలు అదే… కలల అనుభవం కలుగుతుందో”అని ధైర్యం చెప్పాడు భార్యకు.
అంతలో ‘విహాన్‌’ అనిల్‌ తొడపై ఎక్కి కూర్చుంటూ వాళ్ళ నాన్న మెడచుట్టూ చేతులు వేసి ”నాన్నా ఈ రోజు మన ఇంటి వేపచెట్టు నాతో మాట్లాడింది. రేపు మంచి కథలు చెపుతానంది” అని వాళ్ళ నాన్నతో అన్నాడు ఎనిమిదేండ్ల విహాన్.
”ఆ వేపచెట్టు చెప్పే కథలు నాకు, మీ అమ్మకు రోజు చెప్పాలి నువ్వు సరేనా” అని కొడుకును హత్తుకుని,”అమ్మా చెట్టుతల్లీ విహన్‌కు ఊహలలో స్పురింపచేసే అనుభవాలతో ,నీ కథలతో వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు” అని అప్రయత్నంగా కోరుకున్నాడు మనసులో ఆ వేప చెట్టును అనిల్‌.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *