May 26, 2024

“సరికొత్త వేకువ” – “మానవత్వాన్ని ప్రతిబింబించే కోసూరి కథలు”

సమీక్ష: డా. మంథా భానుమతి.

నర్తకీమణిగా, నాట్యగురువుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోసూరి ఉమా భారతిగారు, గత కొద్ది సంవత్సరములుగా రచయిత్రిగా కూడా పేరుతెచ్చుకుంటున్నారు. తన రచనలలో ఒక సందేశాన్ని, ఒక విశ్లేషణను జొప్పించటం ఉమాభారతిగారి ప్రత్యేకత.

నాట్యంలో.. నర్తకిగా, గురువుగా, వ్యాస కర్తగా అనేక పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అందుకున్న రచయిత్రి కొత్త కోణం ఇది. ఈ కథల పుస్తకంలో రచయిత్రి మనోభావాలు పూర్తిగా ఆవిష్కృత మౌతాయి.

కథల్లో పాత్రలు అన్నీ మంచివే. ఎక్కడా దుష్టులు, దుర్మార్గులు కనిపించరు. విధి ఆడిన వింత నాటకాలు తప్ప. రచయిత్రి కుటుంబంలోని సభ్యులందరూ వైద్యులే కావటంతో, ప్రతీ రోజూ వారి చర్చల్లో పాల్గొంటూ ఉండటంతో, బహు విధ జ్ఞానాన్ని సంపాదించుకుని, వైద్యవిజ్ఞానాన్ని పాఠకులకు పంచడానికి ప్రయత్నం చేశారు రచయిత్రి.

అంతే కాదు వైద్య వృత్తిలో కలుగుతున్న కాలానుగుణ మార్పులని కూడా వివరించి, ఆలోచించాలిసిందేనని చెప్తారు.

ఈ కథా సంకలనంలో పది కథలున్నాయి. ప్రముఖులు రచయిత్రి గురించి రాసిన ముందుమాటలు చదువుతుంటేనే కథల మీద ఆసక్తి కలుగుతుంది.

“పుత్తడి బొమ్మ”తో ఆరంభించిన ఈ సంపుటిలో మొదటి కథలోనే ఈ ప్రపంచంలోని మంచితనాన్ని, పరమత సహనాన్ని చూపిస్తారు. అనురాగం వెల్లి విరిసే కాపురం వసంతది. అన్యోన్య దాపత్యం, అవసరమైతే అఘమేఘాల మీద వాలిపోయే స్నేహితులు, ఏ సహాయానికైనా వెనుకాడని పిన్ని, పుత్తడిబొమ్మ లాంటి ఐదేళ్ల పాప.
మరి వారికొచ్చిన సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఉందా? కథ చివర్లో దూదిపింజలా తేలిపోతుంది సమస్య.

ఒక జాబిలమ్మ.. జాబిల్లి కథలు అమ్మమ్మ చెప్తుంటే విని అల్లారు ముద్దుగా తాత, అమ్మమ్మ, తల్లీ తండ్రుల కళల్లో జాబిలై పెరిగింది. ఉన్నత చదువులు చదివి, తనకి నచ్చిన వాడితో జీవితం పంచుకుని ఆనందంగా జీవిస్తున్న ఆ చందమామకి అనుకోని కష్టం అశనిపాతంలా వచ్చింది. అందరి బ్రతుకులూ అతలాకుతలం ఐపోయాయి. అప్పుడు ఆ జాబిలి తీసుకున్న నిర్ణయం ఏమిటి? “అనగనగా ఒక జాబిలమ్మ” చదివి కంట తడి పెట్టకుండా ఉండలేము.

తరువాతి కథలో కథానాయిక “తులసి”.. కథ చదివిన అందరూ ఇటువంటి అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుందొ అనుకుంటారు. అణకువ, బాధ్యత, తల్లి మీద అంతులేని ప్రేమ ఉన్న పాప. అందర్నీ సంతోష పెట్టాలనుకుని, తను చేసిన పని తల్లికి ఆగ్రహం తెప్పించింది. ఈ కథలో కూడా స్నేహితులు మానసికంగా ధైర్యం చెప్తుంటారు తులసి తల్లికి.

విదేశాలలో బంధువులు తక్కువగా ఉంటారు.. అదీ ఒక్కో సారి ఎన్ని నెలలకో కానీ కలవడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి సాధ్య పడదు. నిత్య జీవితంలో స్నేహితులే అన్నిటా ఆదుకుంటారు. అక్కడ స్థిరపడిన రచయిత్రి అందుకనే స్నేహితులని, వారి సహకారాన్ని చూపించడానికి ప్రయత్నించారు, తమ కథల్లో.

శిశు సంక్షేమం అనే స్వచ్ఛంద సంస్థలో చురుకుగా పాల్గొనే ఇద్దరు స్నేహితురాళ్ల సంభాషణతో నడుస్తుంది, “కంచే చేనుమేస్తే” అనే కథ. అమెరికాలో పేద వారికిచ్చే సంక్షేమ సహాయాలకి, ఏవిధంగా స్వంత కొడుకుని తల్లి బలిచేస్తోందో తెలుసుకుని ఆశ్చర్య పోతాం.

మానవత్వానికి పరాకాష్ఠ కనిపిస్తుంది “ఏం మాయ చేశావో” కథలో.

పిల్లలకోసం పరితపించే ఆప్తురాలికి, తన కన్నబిడ్డని దత్తతకిచ్చిన మాతృమూర్తి బంధం వదులుకోలేక, అనుక్షణం ఆ పాపనే గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుంటే అనుకోకుండా ఒక పాప, ‘మాయ’ ప్రవేశించి సాంత్వన కలిగిస్తుంది. ఆ తల్లి పడే మానసిక వేదనని మనసుకి హత్తుకునేలాగ చెప్పారు రచయిత్రి.

జీవితంలో అన్నీ ఉండి, ఒకరికొకరం అనుకున్న దంపతుల మధ్య అనుకోని విభేదం వస్తే.. “నిరంతరం నీ ధ్యానంలో” కథలో భర్త రాజ్ చేసిన పనికి కళ్యాణి ఏ విధంగా స్పందించిందో చూపించారు.

పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకి పంపేస్తారనీ, పట్టించుకోరనీ, సంవత్సరానికి ఒక్కసారే వారి దగ్గరకి వెళ్తారనే అభిప్రాయం ఉంది మనందరిలో.. “కథ కాని కథ” లో ఇందుకు భిన్నమైన కథ చూపిస్తారు మనకి రచయిత్రి. తప్పనిసరి పరిస్థితులలో ఓల్డేజ్ హోంలో ఉంచిన తండ్రిని ప్రతీవారం స్నేహితురాలితో వెళ్లి చూసి, పలకరించటమే కాకుండా ఆయనతో భోంచేసే సాన్యా ఆదర్శనీయంగా అనిపిస్తుంది. అంతే కాదు, వివాహమయ్యాక, తనదగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటుండగానే.. అనూహ్యమైన మార్పు సాన్యా జీవితంలో.. దానికి ఆమే తండ్రి చూపించిన పరిష్కారం, కథ చదివి తెలుసుకోవలసిందే. అంతే కాదు, ఆ స్నేహితురాలికి కూడా కనువిప్పు కలగటం పాఠకులని నిట్టుర్పు విడిచేలాగ చేస్తుంది.

“సరికొత్త వేకువ” ఒక సరికొత్త కథను చెప్తుంది. తప్పని సరి పరిస్థితులలో దమయంతి గారింట చేరిన బంగారం, వారందరి ప్రోత్సాహంతో డాక్టర్ అవుతుంది. దమయంతిగారి అబ్బాయి సాగర్ ని మూగగా అరాధించే బంగారం జీవితం అనేక మలుపులు తిరిగి, తనని ఆదరించిన కుటుంబానికి ఆసరా అవుతుంది.

మాతృత్వానికి మంచి నిర్వచనం ఇచ్చిన కథ “మాతృత్వానికి మరోకోణం”.

ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగు పెట్టింది కళ్యాణి. దేనికీ లోటులేని జీవితం. దేశరక్షణకై అహర్నిశలూ పోరాడే వాయుసేనలో పని చేసే సందీప్ బావతో వివాహం.. పెద్దల అంగీ కారంతోనే. మరి ఒంటరి జీవితం ఎందుకు గడపవలసి వచ్చింది? తన జీవితాన్ని ఏ విధంగా సార్ధకం చేసుకుంది? “జీవ సందీప్తి” చదివితే అర్ధమవుతుంది, విధి చేతిలో అందరం కీలుబొమ్మలమే అని.

ఉమాభారతి గారి కథల్లో, సంగీత నాట్య కళలు ఆసక్తికరంగా చోటు చేసుకుంటాయి. వైద్య శాస్త్రం పరిచయం అవుతుంది. సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, వాటితో కథల్లోని పాత్రల అనుబంధం.. ఇంత హాయిగా జీవితం గడ్పవచ్చా అనిపిస్తుంది చదువరికి.

తప్పకుండా కొని చదువవలసిన పుస్తకం, “సరికొత్త వేకువ.”

1 thought on ““సరికొత్త వేకువ” – “మానవత్వాన్ని ప్రతిబింబించే కోసూరి కథలు”

  1. మంథా భానుమతి గారికి, నమస్సులు… పుస్తక సమీక్షకి హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ వంటి ప్రముఖ రచయిత్రి కూడా నా రచన చదవడమే కాక లోతైన విశ్లేషణ అందించడం ఆనందంగా ఉంది.. నా మొదటి కథానిక ‘ముళ్ళగులాబి’ , ‘విదేశీ కోడలు’ కథాసంపుటి నుండి నేటి ‘సరికొత్త వేకువ’ వరకు … మీ స్పందన, విశ్లేషణ నాకు అమూల్యమైనవే.
    పుస్తక సమీక్ష ప్రచురించిన ‘మాలిక’ పత్రికకి, జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *