March 29, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

“కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। (సాంఖ్య యోగము-భగవద్గీత)
“కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు” అంటాడు భగవానుడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు జన్మలలో చేసిన కర్మ ఫలాలే. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. నేటి జన్మలో ఉన్న సహజాత లక్షణాలు, ఆలోచనాసరళి, వ్యక్తిత్వం, శరీర నిర్మాణం మొదలైనవన్నీ మన పూర్వ జన్మల నుండి మోసుకొని వస్తూనే ఉంటాం. అవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. సంచిత కర్మ అంటే ఒక ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది . ప్రారబ్ద కర్మ ప్రస్తుతజన్మలో అనుభవించ వలసిన కరెంట్ అకౌంటు లాంటిది. మన పూర్వపుణ్యం కొద్దీ కొంత ఖర్చు అవుతుంది. ఆగామి కర్మ అంటే ప్రస్తుత జన్మలో కొత్తగా కూడబెట్టు కొనే కర్మ అంటే మరలా కొత్తగా చేసే సేవింగ్స్ లాంటిది. జన్మ ముగియగానే మళ్ళీ ఈ నిల్వలన్నీ కలిసిపోయి మళ్ళీ ఒక కొత్త ఫిక్సెడ్ డిపాజిట్ అయిపోయి సంచిత కర్మగా మారుతుంది. ఈ జనన మరణ చక్రం యిలా తిరుగుతూనే ఉంటుంది. మరి దీనికి ముగింపు పలికి మోక్షప్రాప్తి పొందేదెన్నడు? ఆ విషయమే అన్నమయ్య తన కీర్తనలో వివరిస్తున్నాడు.

కీర్తన:
పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి

చ.1. పెట్టినది నుదుటను పెరుమాళ్ల లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకమీఁద నీలవర్ణునామమిదె
అట్టె హరిదాసులకంటునా పాపములు ॥ ఉమ్మడి ॥

చ.2. మనసునఁ దలఁచేది మాధుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపదాక్షమాలికలు
చెనకి హరిదాసులం జేరునా బంధములు ॥ ఉమ్మడి ॥

చ.3. సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగ మిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము ॥ ఉమ్మడి ॥
(రాగము: సాళంగనాట; ఆ.సం.రేకు: 323; సం.4, కీ.132)

పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి

అన్నమయ్య ఉభయ కర్మములను శాసిస్తున్నాడు. కర్మలాలా! మీకు ఇక్కడ ఉండ పని లేదు. మేమంతా శ్రీవేంకటేశ్వరుని పాదయుగళాన్ని నమ్మిన వారము. మాకు మోఖప్రాప్తి అవసరము. మీరు దయ ఉంచి ఇవి లేని చోటికి ఎక్కడికైనా వెళ్ళండి. అనగా భగవంతుని ఎక్కడైతే త్రికరణ శుద్ధిగా స్మరించరో అక్కడికి వెళ్ళండి నాకు అభ్యంతరం లేదు అంటున్నాడు.

చ.1. పెట్టినది నుదుటను పెరుమాళ్ల లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకమీఁద నీలవర్ణునామమిదె
అట్టె హరిదాసులకంటునా పాపములు

కర్మములాలా! జాగ్రత్తగా గమనించండి. మేము మా నుదిటిపై పెరుమాళ్ళు నామం ధరించాము. భుజములపై శంఖు చక్రల ముద్ర వేయించుకొన్నాము. మా నాలుకపై సదా హరినామమే పలుకుతూ ఉంటుంది. మేము హరిదాసులము. మాకు పాపం అంటుందా? చెప్పండి. అన్నమయ్య అన్యాపదేశంగా ఏమి చెప్తున్నాడంటే…ఎవరైతే జ్ఞానసంపదతో, వివేక వైరాగ్య విచక్షణలతో తన ఆలోచనా కర్మలను ద్వంద భావరహితంగా, సాక్షీ భావము తో అనుభవిస్తారో వారిపై కర్మభారము, విధి పనిచేయవు. మనిషికి ఆ స్వాతంత్రం సాధించే శక్తి ఉంది. శరణాగతి, ధ్యానం, కర్మఫల సన్యాసం, మొదలైన వీటన్నింటి ద్వారా ఆత్మజ్ఞానం తద్వారా కర్మ-జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. అట్టిచోట మీకేమి పని వెళ్ళిపోండి అని ఉభయ కర్మలను ఆదేశిస్తున్నాడు అన్నమయ్య.

చ.2. మనసునఁ దలఁచేది మాధుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపదాక్షమాలికలు
చెనకి హరిదాసులం జేరునా బంధములు
కర్మములారా వినండి. మేము మా మనస్సులలో ఎప్పుడూ నారాయణ మంత్రాన్నే జపిస్తూ ఉంటాము. మాకు పొట్ట నింపేది పంచభక్ష్య పరమాన్నాలు కాదు. భక్తితో మేము తినే ఆ శ్రీనివాసుని ప్రసాదం. మా శరీరాలపై సదా విష్ణుతులసి మాలలు ధరిస్తాము. ఇలాంటి హరిదాసులను కర్మ బంధాలు బంధించగలవా? కనుక మీ దారి మీరు చూసుకోండి. ఇక్కడ మీకు పని లేదు అంటున్నాడు. అన్యాపదేశంగా భక్తులకు సెలవిచ్చేది ఏమిటంటే ఆధ్యాత్మికత ఇహానికి, పరానికి రెంటికీ కూడా పనికొచ్చే సూత్రం. పరమాత్మను నమ్మటం,నిజమైన స్వధర్మాన్ని తెలుసుకొని త్రికరణ శుద్దిగా పాటించడం, వయస్సుకి, స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత. అది అందరూ అలవరచుకోవాలి. జీవించడంకోసం పట్టెడంత ప్రసాదం చాలు గదా!
చ.3. సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగ మిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము

కర్మములాలా! మేము ప్రతిదినమూ సదాచార్య సేవలో తరిస్తాము. మేము అంతరంగ బహిరంగాలలో శ్రీహరి సాంగత్యమే చేస్తూ ఉంటాము. వీటన్నిటికీ అధిపతి శ్రీవేంకటేశ్వరుడు మా నాయకుడు, మా ఆత్మ, మా బంధువు, మా సర్వస్వం సుమా! అలాంటి హరిదాసులను అజ్ఞానం సమీపించగలదా? అందువల్ల మీరు శ్రీహరి భజనలు లేని చోటికి తరలి వెళ్ళండి అని కర్మములను హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య. వేద ఋషులు రరకాల మానవ మనస్తత్వాలను పరిశీలించి, వాటి వల్ల వచ్చే పరిణామాలను అంచనా వేసి, వివాహ వ్యవస్థను, గుణ కర్మల కనుగుణమైన వ్యవస్థను ప్రోత్సహించారు. ఏ సంఘమైనా ప్రజలజీవనోపాధి, జీవిత పరమావధి ఈ రెంటినీ సమానంగా ఆదరించినప్పుడే, సంఘంలో శాంతిసంతోషాలు పరిఢవిల్లుతాయని గుర్తెరిగి సత్వగుణం ఉన్న ప్రజలకు, జీవిత పరమావధికి అవసరమైన మానవ ఆత్మవికాసానికి దారి చూపించే భాధ్యతనిచ్చారు. వారు ధర్మ, న్యాయ,రాజనీతి,అర్ధ, ముహూర్త, జ్యోతిష, వ్యాకరణ, వైద్య, మంత్ర, యోగ, ఆగమ శాస్త్రాలను రచించి ప్రజలకు మార్గదర్శనం చేసేవారు. ఇది కులముని బట్టి కాక గుణమును బట్టి ఏ కులంవారైనా సత్త్వగుణం కలిగిఉంటే ప్రజలకు మార్గదర్శనం చేశే బాధ్యతనిచ్చారు.
ముఖ్యమైన అర్ధాలు: ఉమ్మడి కర్మములు = సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు; ఇమ్ముల = ఇంకో ప్రదేశానికి; పెరుమాళ్ల లాంఛనము = తిరునామములు, పంగ నామములు, విష్ణుభక్తులన్న గుర్తు; దైవశిఖామణి ముద్ర = శంఖు చక్ర ముద్రలు; నెట్టన = అనివార్యముగ, మరచిపోకుండా; నీలవర్ణు నామము = శ్రీహరి నామములు; అట్టె = అటువంటి; పదాక్ష మాలికలు = విష్ణు తులసి మాలలు; చెనకు = ఎదిరించి నిలుచు; సంతతము = ఎల్లవేళలయందు; సదాచార్య సేవ = భక్తిప్రపత్తులతో కూడిన సత్కార్యములు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *