April 25, 2024

కంచె చేనును మేసింది

రచన: డి.కృష్ణ

“రాజు.. రాజు.. ఎక్కడున్నావురా.. వర్షం వచ్చేలా ఉంది.. నేను బయలుదేరుతున్నాను.. పిల్లల్ని వర్షంలో తడవనివ్వకు.. నేను వెళ్తున్నా… ఏయ్… అందరూ లోపలికి వెళ్ళండిక..” అంటూ ఎవరి పనులు వారికి అప్పగించెసి వార్డెన్ వెంకటేశ్వరమ్మ తన నాలుగు చక్రాల బండిని తీసుకెళ్ళింది.
“అలాగే మేడమ్… ‘ఈమెకి ఫ్యామిలీ మీద ఉన్న దృష్టి హాస్టల్ మీదుండదు. అంతా నా మీద వదిలేసి వెళ్తాది. ఈమెకి హెల్పెర్ గా జాయిన్ చెసిన మా బావననాలి. చంపుకు తింటుంది’” అంటూ చిరాకు మొహం పెట్టి ఆవేశంగా వంట గది నుండి బయటకొచ్చాడు రాజు.
సాయంకాలం పూట సూర్యకిరణాలన్నింటినీ దూరంగా నెట్టివేసిన మేఘాలు, ఏవో అదృశ్య హస్తాలచెత, కొండలై ఒక్కో అడుగులా పరచుకున్నాయి., కనిపించని గాలి రాకపోకలు, ఆ శూన్యంలో సృష్టించె చిరు అల్లరులకు ప్రకృతంతా పురివిప్పి నాట్య మాడుతున్నట్లుగా స్పందిస్తుంది. హాస్టల్లోని బాలికలందరిలో ఎక్కడలేని సంతోషం తనువంతా ఆవహించెసింది. ఆ ఆహ్లాదానికి అనుగుణంగా వాళ్ళు అడుగులు కదుపుతూ కేరింతలు కొడుతున్నారు. కనురెప్పలు కదిలెళ్ళిపోతున్న ఆ క్షణాలలోనే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవడం వారికి అమితానందాన్నిస్తుంది. ఆవేశంతో బయటకొచ్చిన రాజు, ప్రకృతి పలకరింతతో వాళ్ళనే చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు.
వాతావరణంలో కదలికలు చెసిన చిరు అల్లరులకు, తనువంతా గాయాలు చెసుకున్న మేఘం ఆనందబాష్పాలను జాలువార్చింది. అవే వర్షపు చినుకులై పుడమిని తడిపాయి. వర్షంలో తడిసిపోయి తమని తామే మర్చిపోయి ఆడుకుంటున్న బాలికలను చూస్తూ తన విజ్ఞతనే వదిలేశాడు.. పెద్ద ఉరుము వినిపించడంతో తేరుకుని “అమ్మాయిలూ ఇక ఆడుకుంది చాలు.. లోపలికి వచ్చెయ్యండి… వర్షంలో తడిసిపోయారు. చీకటి పడిపోయింది. స్టడీ అవర్స్ కు టైమవుతుంది. త్వరగా.. త్వరగా రండి” అంటూ బిగ్గరగా వేసిన కేకలకు అదిరిపడి భయపడుతూ తడిసిన బట్టలతోనే ఎవరి గదుల్లోకి వారు చెరుకున్నారు.. అతని చూపులోని తీవ్రత మాత్రం పక్కకు జరగలేదు.
* * * * * *
లంచ్ అవర్లో ఇద్దరూ ఒకేచోట ఉంటారని తెలుసుకొని, హాస్టల్కి ఎడమవైపునున్న హై స్కూల్ కెళ్ళారు రామానందం దంపతులు. పిల్లలందరికీ మధ్యాహ్న తరగతులు ప్రారంభమయ్యాయి. పోలీసులు రావడం గమనించి పిల్లలందరూ ఆశ్చర్యపోవడంతో రూమ్ కిటికీలు మూసేశారు… ఎస్.ఐ.నవీన్ వెనుకనే రంజని, ఆమె తల్లీదండ్రులు, ఇంకో ఇద్దరు బాలికలను చూడగానే రాజుకు గుండెల్లో కలవరం మొదలైంది. సుందరరావుదీ అటుఇటుగా అదే పరిస్థితి. మర్యాదపూర్వకంగా పలకరించి కుర్చీలు వేశారు.
“ఏంటి సర్ ఇలా వచ్చారు? వీళ్ళు మా స్కూల్లో చదివేవాళ్ళే. వీళ్ళను మీరు తీసుకోచ్చారేంటి సర్? ఏమైంది?” వినయంగా అడిగాడు సుందరరావు.
“అతని మీద వీళ్ళు కంప్లయింట్ ఇచ్చారండి..! దగ్గరుండి తెలుసుకుందామని అలాగే వచ్చేశాం..” అన్నాడు నవీన్.
“సర్! నేను మళ్ళీ కలుస్తాను” అంటూ బయటకు వెళ్ళబోతున్న రాజును ఆపి “కంప్లయింట్ ఇచ్చింది నీ మీదే..! అసలు సూత్రధారి నువ్వే.! నువ్వెళ్ళిపోతే ఎలా? ఇలా రా… ఇప్పుడు చెప్పండి” అన్నాడు నవీన్.
“దేని గురించి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు సర్. దేని గురించి కంప్లయింట్..? నేనేం చెశానని.?” తప్పించుకునే ప్రయత్నం చెశాడు రాజు.
“దేని గురించో తెలియదా? మా పాపను చూస్తూ కూడా ఎలా అంటున్నావ్ రా? పసిపిల్లలతో ఏంటిరా నీ వెధవ వేషాలు? నాలుగు దెబ్బలు పడితే గాని వీడు ఒప్పుకోడు సర్” అంటూ అతని జుట్టును పట్టుకుని వంచింది పద్మావతి.
వెంటనే ఆమెను విడిపించి “మీరు నిగ్రహంగా ఉండండమ్మా! నేను మాట్లాడుతున్నాను కదా!” కోప్పడ్డాడు నవీన్.
“ఏం మాట్లాడుతున్నారండి! ఏంటండి మాట్లాడేది? అలా అడిగితే వాడేందుకు చెప్తాడు?” ఆవేశపడింది పద్మావతి.
“మాకంటూ ఓ పద్ధతుంటుంది. మీరు కొంచెం ఓపిక పట్టాలి. నిజానిజాలు అవే తెలుస్తాయి! ఏమయ్యా నిజం ఒప్పుకుంటావా లేక మా పద్దతిలో ఒప్పించమంటావా?” అంటూ రాజు వైపు వెళ్ళాడు నవీన్.
“నిజంగా మీరు దేని గురించి అడుగుతున్నారో తెలియడం లేదు సర్” మళ్ళీ అదే పాట పాడాడు రాజు.
“తెలియడం లేదా! ఆ అమ్మాయి మీ హాస్టల్లోనేగా ఉండేది. ఆ పాపను వశబరుచుకున్నావని సాక్ష్యాలతో చెప్తుంటే తెలియడం లేదంటావేంటి?” గద్దించాడు నవీన్.
“మా హాస్టల్లోనే ఉంటుందండి. నిజమే కాని ఆ పాప ఉదయం నుండి హాస్టల్లో లేదు. అటువంటప్పుడు నాకెలా తెలుస్తుంది సర్? స్కూల్ కెళ్ళిందేమో అనుకున్నాను” అంటూ స్కూల్ వైపు టాపిక్ మార్చాడు.
“రావు గారు! దీని గురించి మీరేమంటారు.?” సుందరరావును ప్రశ్నించాడు నవీన్.
“నాకేం తెలీదండీ.. నా దృష్టికేం రాలేదు. పాప ఒంటిమీద ఆ మరకేంటి సర్? రంజనీ ఇలా రామ్మా.. అయ్యోయ్యో.. ఏమైంది.?” అంటూ రంజనీ వైపు చూశాడు సుందరరావు. రామానందం దంపతులు అతనివైపు వెరైటీగా చూశారు.
“అతనేమో ఉదయం నుండి హాస్టల్లో లేదంటున్నాడు. మీరేమో తెలియదంటున్నారు. హాస్టల్ అటెండెన్స్ షీట్లో హాజరుంది. ఉమ్… ఒకరి మాటలకు ఒకరి మాటలకు పోలిక లేదు, ఎందుకని? నిజంగానే ఏమీ తెలీదా..? నాకెందుకో మీరు నాటకాలాడుతున్నారేమో అన్పిస్తుంది…?” అనుమానంగా ఇద్దరి మొహాల వంక చూశాడు నవీన్.
“హాస్టల్ నుండి ఉదయం స్కూల్ కెళ్ళింది సర్, కాని తర్వాత మాత్రం మళ్ళీ హాస్టల్కు రాలేదు. అందుకే రంజని ఉండే ఉంటుందని నేనే హాజరు వేశాను సర్” అని నాలుక కరుచుకున్నాడు రాజు.
“ఉదయం నుంచీ హాస్టల్లో కనిపించకపోతే పిల్లల్ని అడగడం కాని, రాకపోతే ఆమె పేరెంట్స్ కు గాని, ప్రిన్సిపాల్ గారికి గాని ఎందుకు కంప్లయింట్ చెయలేదు?” ప్రశ్నించాడు నవీన్.
“సాయంత్రం కూడా కనిపించకపోతే అప్పుడు కంప్లయింట్ చెద్దామని ఆగాను సర్” చెప్పాడు రాజు.
“అంతకుముందు కూడా ఇలాగే చెసిందా? అందరూ అలాగే చెస్తున్నారా? హాస్టల్లో లేకపోతే ఇంటికేళ్లిందో, ఇంకెక్కడికైనా వెళ్లిందోనని కనీసం ఆరా తీయలేదేందుకు.? ఇంటికి వెళ్ళకుండా ఎటైనా వెళ్తే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ.?” ఇంకొంచెం గట్టిగా ప్రశ్నించాడు నవీన్.
“అదీ … అదీ …”అంటూ ఏమీ మాట్లాడలేదు రాజు. రంజనితో బాటు చదువుకునే పిల్లలను పిలిపించి విచారించాడు నవీన్.
“రాత్రి మీ ఇద్దరూ హాస్టల్ నుండి వెళ్లి పోయారంట. రాలేదని రాజు చెప్తున్నాడు. చెప్పు… ఎక్కడికెళ్ళారు?” అంటూ ఒక పాపనుద్దేశించి అలా అడగడంతో భయపడిపోయిందా పాప.
“మేమేక్కడికీ వెళ్ళలేదు సర్. హాస్టల్ లోనే ఉండి చదువుకున్నాం. బాగా చీకటి పడ్డాక పడుకున్నాం. తెల్లారేముందు బాత్రూం కేళ్తానని చెప్పి రంజని వెళ్ళింది, వచ్చాక ఏడుస్తూ కనిపించింది. ఏం చెప్పలేదు. బట్టల మీద రక్తం ఉందని చెప్పాను. తర్వాత లేచాక చూస్తె ఆ అమ్మాయి లేదు సర్” భయం భయంగా బిక్కమొహం వేస్తూ చెప్పింది.
“మరి లేనట్లు వార్డెన్ గారికి చెప్పావా?” అడిగాడు.
“చెప్పాను సర్” అంది.
“వార్డెన్ నువ్వేమి చెప్పలేదు అంటుంది?” అన్నాడాయన, అంతకు ముందే అక్కడకు చెరుకున్న వార్డెన్ వెంకటేశ్వరమ్మను చూపిస్తూ.
“లేదు సర్, చెప్పాను. కసురుకుంది. నేను చెప్పింది వినలేదు. మేడమ్ సరిగ్గా హాస్టల్లో ఉండరు సార్. రాజునే ఎక్కువగా ఉంటాడు” అంది.
“సరే నువ్వెళ్ళు” అంటూ పాపను పంపించెసి రాజు వైపు తిరిగి సమాధానమేమిటన్నట్లు చూశాడు.
“పిల్లలంతా అబద్దాలు చెప్తున్నారు సర్! సరిగ్గా చదవనప్పుడు ఒక దెబ్బ వేస్తానని నా మీద కక్ష కట్టారు సర్ వాళ్ళు” అన్నాడు రాజు. సుందరరావు వంక చూశారందరూ.
“ఈ విషయం గురించి నాకేమి తెలియదు సర్” అడక్కుండానే అందుకున్నాడు సుందరరావు.
“అడక్కుండానే మాట్లాడుతున్నారు.. ఏం అడిగినా తెలియదనే చెప్తున్నారు. ఇంత జరిగినా మీ దృష్టికి రాలేదంటున్నారు. ఇతన్నిక్కడ జాయిన్ చెసింది మీరేనని తెలిసింది. మీ ఇద్దరికీ ఉన్న సంబంధమేంటి.?” అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు నవీన్.
“అతను మా దూరపు బంధువు సర్” ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్తున్న ఈ విషయాన్ని అంచనా వేయలేక బదులిచ్చాడు సుందరరావు.
“అయితే బంధువులిద్దరూ స్టేషన్ కు నడవండి. ఇక్కడైతే మీరు చెప్పడం లేదు. అక్కడైతే మా పద్దతిలో అడిగితే తన్నుకుంటూ నిజం వచ్చేస్తుంది” అన్నాడు నవీన్.
“ఏంటి సర్ బెదిరిస్తారు? తెలియదంటే వినిపించుకోరేం? ఆ పాపకు ఏమైందో, ఎవరు కారణమో తెలుసుకోకుండా మమ్మల్ని అడుగుతారెందుకు? అసలా పాప మాట్లాడదేంటి.? ఎవరి విషయాన్నో మా మీదకు లాక్కోస్తారెందుకు సర్? ముందే చెప్తే యాక్షన్ తీసుకునే వాడినే కదా.! మాకూ బ్యాగ్రౌండ్ ఉంది.. మీమూ ఫోన్లు చెయగలం” ఆవేశపడ్డాడు సుందరరావు. ఆవేశానికి ఆయువు అరక్షణమే..!
“ఏంటి – ఫోన్ లు చెస్తావా? చెయ్ ఎవరికీ చెస్తావో చెయ్! రంజనీ ఇలా రా.! అసలేం జరిగిందో నీ నోటితో మొత్తం చెప్పు” అంటూ రంజనీను పిలిచాడు నవీన్.
“ప్రిన్సిపాల్ సార్కి మొత్తం తెలుసు సర్. నేను, మాళవిక, నందిని కలిసి ఒకరోజు ప్రిన్సిపాల్ గారిని కలిసి ఈ విషయం గురించి చెప్పాం సర్” అంది ఏడ్చుకుంటూ.
“ఏడవకు.! ఏడవకు.! మరి ఈయన ఏమీ తెలియదు అంటున్నాడు. ఏం జరిగిందో చెప్పు?” అన్నాడు ఎస్.ఐ.నవీన్. మూడు నెలల క్రితం నుంచీ జరిగినదంతా చెప్పుకోచ్చింది. రాజు ఆలోచనల్లోనూ, చూపుల్లోనూ, ఆచరణలలోనూ పక్కదారి పట్టడం గురించి చెప్పింది. ప్రిన్సిపాల్కు చెప్పినా ఈ విషయంపై శ్రద్ధ తీసుకోలేదని, ఊరికే చాడీలు చెప్పవద్దంటూ తరిమేశారాని చెప్పింది. జరిగినది కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే ఇద్దరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్న శబ్దం వస్తుంది. కాని అది వాళ్ళిద్దరికే తెలుసు. ‘నీ బుద్ధి మార్చుకోవేరా.? ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా.? ఇప్పుడు నీకే కాదు నాకూ మూడేలా ఉంది’ అన్న కోణంలో రాజును గుర్రుగా చూస్తున్నాడు సుందరరావు.
“ఇప్పుడేమంటారు సర్? పదవ తరగతి చదివే పిల్లలపై ఏంటండీ ఈ అఘాయిత్యాలు. చదువుకోవడం తప్ప ఏమీ తెలియని పిల్లలపై మీ ప్రతాపమేంటండి?” అంటున్న ఎస్.ఐ.నవీన్ మాటలకు అడ్డుపడి “అతను మంచోడని జాబ్ ఇప్పించాను సర్. ఆ నమ్మకంతో పిల్లలేవో చెప్తున్నారులే అని పట్టించుకోలేదు సర్” కొంచం తగ్గి అన్నాడు సుందర రావు.
“నేను వాళ్ళనలా చెసాననడం అబద్దం సర్. సరిగ్గా చదవనప్పుడు చెయి చెసుకుంటాను. కర్రతో కొడితే దెబ్బెక్కువ తగులుతుందని చెతితోనే దండిస్తాను. దానికి వీళ్ళిలా ఎక్కడపడితే అక్కడ చెతులు వేశానని చెప్పడం కరెక్ట్ కాదు సర్. ఇదంతా ఏదో కోపం పెట్టుకుని చెస్తున్నదనిపిస్తుంది” అన్నాడు రాజు.
“పిల్లల్ని – అదీ ఆడపిల్లల్ని చెతితో కొడుతున్నానని నువ్వనుకుంటూ వాళ్ళనలా తాకడమెంటిరా వెధవా? ఇలాంటి అబద్దాలు చెప్తావనే సాక్ష్యాన్ని ఇలాగే తెచ్చాను. ఆ బట్టలకు రక్తం ఎలా అంటుకుందో చెప్పరా కామాంధుడా?” అంటూ వీరావేశంతో రాజు మీదకెళ్ళి పోయాడు రామానందం. అతన్ని ఆపడానికి కొంచెం ప్రయాసపడ్డారు.
“రంజనీ అసలేం జరిగిందో చెప్పమ్మా! ఇతను కాదు కదా! ఎవరు చెశారో చెప్పమ్మా – ఏం జరిగింది?” రంజనీతో చెప్పించె ప్రయత్నం చెయడానికి ఏమీ తెలియనట్లు రంజనిను అడిగాడు సుందరరావు.
“కాదు సర్, ఇతనే చెశాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటుంటే అలానే చూస్తూ ఉన్నాడు. వర్షంలో తడిస్తే కోప్పడేవారు కాని నిన్న ఏమీ అనడం లేదని చాలాసేపు వర్షంలో ఆడుకున్నాం. కాసేపయ్యాక లోపలికి వచ్చేశాం. ‘వెళ్లి స్నానం చెసి రండి’ అని పంపించారు. అలాగే చెశాం. అందరూ పడుకునే ముందు గది దగ్గరికు వచ్చి నన్ను పిలిస్తే వెళ్లాను. ‘జలుబు చెసిందా?’ అని అడిగారు. ‘లేదని’ చెప్పాను. ‘ఒళ్ళంతా వేడిగా ఉందా?’ అని అడిగితే ‘లేదని’ చెప్పాను. ‘ఎందుకు నన్ను అడుగుతున్నారని’ అడిగాను. ‘నాకు జలుబు చెసింది, ఒళ్ళంతా వేడిగా ఉంది, కొంచెం తలనొప్పిగా కూడా ఉంది, జండు బామ్ తో రుద్దమని’ చెప్పారు. నాకు నిద్ర వస్తుందని వస్తుంటే వెనక నుంచి గట్టిగా పట్టుకున్నారు. నేను అరిచాను. మా ఫ్రెండ్స్ అందరూ బయటకు రావడం చూడగానే నన్ను వదిలేశారు. ‘బల్లిని చూసి ఎందుకు భయపడతావ్? భయపడకు… వెళ్ళు.. వెళ్లి పడుకో, రాత్రిళ్ళు అటు ఇటు తిరిగి భయపడకు’ అని నన్ను పంపించెశారు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. భయంగా పడుకున్నాను. అయినా నిద్ర రాలేదు. కొంతసేపటి తర్వాత బాత్రూంలోకి వెళ్తుంటే అక్కడ ఉన్నాడు. నేను లోపలికెళ్ళడం చూసి వెనకనుంచి వచ్చి నోరు మూసేసి, కర్చీఫ్ కట్టేసి నన్ను గట్టిగా పట్టుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళారు. నేను వద్దంటున్నా వినకుండా ఏదేదో చెశారు. బట్టలన్నీ ఊడదీసేశారు. ఆయన ప్యాంటు కూడా తీసేశారు. నేను ఏడ్చినా ఎవ్వరికీ వినపడలేదు. ఇలా జరిగిందని ఎవ్వరికీ చెప్పొద్దని, ఎవరికన్నా చెప్తే చంపేస్తానని బెదిరించారు. భయంతో గదిలోకేళ్లిపోయాను. నందిని అడిగినా చెప్పలేదు. బట్టలు రక్తంతో తడిసి ఉండడం నందిని చూసి చెప్పడంతో భయం వేసి ఇంటికి పారిపోయాను సర్” అంటూ పూసగుచ్చినట్లు చెప్పింది రంజని.

అంతా నిశబ్దం. పాప మోహంలో ఏడుపు. ఆమె తల్లీదండ్రుల్లో కోపం ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి. రాజు కూడా కోపంగా చూస్తున్నాడు. నవీన్ అసహనంగా ఉన్నాడు. సుందరరావు ఉలిక్కిపడ్డాడు. ఈ గొడవ సమయంలో వారు రావడం చూసి సుందరరావు కంగారుపడిపోతున్నాడు. భయపడుతున్నాడు.
“వాళ్లకు కబురంపింది నేనే. నీ బాగోతం మొత్తం తెలియాలని నేనే ఇక్కడికి రమ్మని చెప్పాను” అన్నాడు ఎస్.ఐ.నవీన్. మ్రానుడైపోయాడు సుందరరావు. ఏది జరగకూడదని వణికిపోతున్నాడో అదే జరిగింది. ఏం చెయాలో అతనికి తోచడం లేదు. విచారణ జరగకుండా పై అధికారులకు చెప్పి తీసుకురావడంలో అతని అంతరార్ధం అర్ధం కాలేదు.
“పిల్లలు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళు స్వర్గంలో ఉంటారు.కాని వీళ్ళు మాత్రం ఇక్కడ నరకంలో ఉన్నారనిపిస్తుంది.. ఎంత నరకం అనుభవించిందో పాప మాటలు వింటుంటే తెలుస్తుంది. ఎదురు తిరిగే ధైర్యం, తెగించె సత్తా, పారిపోయే దారి లేక ఎంత నరకం అనుభవించారో పాపం. నోట మాట రావడం లేదు. ఆరోపణలు వచ్చాక విచారించక తప్పదు” అన్నాడు విల్సన్ రాజు.
“ఇదంతా నాకు తెలియదు సర్! నాకేమి సంబంధం లేదు” అన్నాడు సుందరరావు.
“మీ స్కూల్లో చదివే పాపకు ఇలా జరిగిందని సాక్ష్యాలతో నిరూపిస్తున్నప్పుడు, ఏమీ పట్టనట్లు సంబంధం లేదనడం కరెక్ట్ కాదు. విచారించాల్సిందే.!” అంటూ విసుక్కున్నాడు విల్సన్ రాజు.
* * * * * *
విషయమంతా దావానంలా ఊరంతా వ్యాపించింది. ఊరి జనం స్కూల్ కు చెరుకున్నారు. అక్కడ జనాన్ని చూసిన వాళ్లకు భయం పెరిగింది. ప్రజలు ఒకరి తర్వాత ఒకరు సాక్ష్యం చెప్తున్నారు. నిజాలు విని నిర్ఘాంతపోయారు. రాజుగాడి కామం ఒకరితోనే ఆగిపోలేదు. మూడు సంవత్సరాల్లో 14 మందిని హింసించాడని తేలింది. నిజం నిప్పు లాంటిది. పట్టుకున్నప్పుడే వేడి తెలిసేది. మనిషి మహా చెడ్డవాడు. ఒక్కడిగానే కాదు నాలుగైదు రకాలుగా కూడా మారిపోగలడు. ఊసరివెల్లి లాంటోడు. రాజులోనున్న రెండో మనిషి నిద్ర లేవడమే అతని కామానికి కారణం. ఊరి ప్రజలంతా అతని మీదకు ఉరికారు. అది చూసి పారిపోబోతుంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చెశారు. అతన్ని వదిలిపెట్టవద్దని గొంతెత్తి కోరారు. జనం ముందు వీళ్ళ నాటకమెంత.?

“దెబ్బ తగిలినప్పుడో, ఆక్సిడెంట్ జరిగినప్పుడో రక్తాన్ని చూసే ఈ చిన్నారులు వీడివల్లే చిందించాల్సి వచ్చింది. పల్లెటూరని, ఎవ్వరికీ చెప్పుకోలేరని వీడింత దుర్మార్గానికి ఒడి కట్టాడు. ధైర్యంగా రామానందం దంపతులు కంప్లయింట్ ఇవ్వబట్టి బయటపడింది లేకపోతే వాడెంత మందిని వశపరుచుకునే వాడో ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు పరువు ప్రతిష్టలంటూ కూర్చుంటే పిల్లల బ్రతుకులే నాశనం అవుతాయి. అవేమి పట్టించుకోకుండా ముందుకొచ్చి కంప్లయింట్ ఇచ్చినందుకు వీళ్ళను అభినందిస్తున్నాను. బంధువన్న చిన్న మమకారం చెత పిల్లలెం చెప్పినా మీరు పెడ చెవిన పెట్టడం మీ తప్పు. ప్రిన్సిపాల్ హోదాలో ఉన్న మీరు మీ హోదాకు తగ్గట్లుగా ప్రవర్తించలేదు. పిల్లల్ని ప్రేమించలేని వాడు వాళ్ళ మాటలనేలా నమ్ముతాడు! నీ మీద విచారణకు ఒక బృందాన్ని పంపిస్తాం. దానికి సమాధానం చెప్పుకొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. 15 మంది బాలికల జీవితాలతో ఆడుకున్న ఈ కామాంధుడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పై అధికారులకు నివేదించి ఉద్యోగాన్ని తొలగిస్తాం. అంతవరకు పోలీసు వాళ్ళు తమ కస్టడిలో ఉంచుతారు” అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పాడు విల్సన్ రాజు.
సుందరరావు, రాజుల మొహాలు పాలిపోయాయి. సంరక్షణ అధికారికి సాయంగా ఉండాల్సిన రాజే తప్పుడు మార్గం అనుసరించడం అతని జీవితానికే చెటు తీసుకొచ్చింది. పొలం బారిన పడకుండా కంచెలాగా ఒకడిని నియమిస్తే వాడే పొలం మీద పడి దోచెస్తే ఏం చెయగలం? కంచె చెనును మేసింది. అది వస్తువైనా కావొచ్చు, మరొకటైనా కావొచ్చు, రక్షణ నివ్వడానికి నిర్దేశించినది రక్షణ నివ్వక ప్రక్కదోవ పడితే సమాజం తన పని తానూ చెసుకుపోతుంది. పెనుముప్పై ముంచెస్తుంది.
“వయస్సు పెరిగే పిల్లలున్నప్పుడు తల్లెదండ్రులు తమ బిడ్డల ప్రవర్తనపై ఓ కన్నేయ్యాలి. అవసరం మేర వారికి విడమరిచి చెప్తూ చొరవ తీసుకోవాలి. భారం అనుకోని ఇలాగే హాస్టల్ లో వేస్తె పరిణామాలు ఇలాగే ఉండొచ్చు. ఇంతకన్నా తెగిస్తే మనిషిని మళ్ళీ తెచ్చుకోగలమా? అవసరమైన సమయాల్లోనే మీరు మీ పిల్లలను దూరంగా ఉంచుతున్నారు. హాస్టల్లో చదివించె బదులుగా మీరే పిల్లలకు పాఠంలు చెప్పండి. లేకపోతే ట్యూషన్ పెట్టించండి. వాళ్ళ భవిష్యత్ కోసమేకదా మీరు కష్టపడేది. పిల్లలతో స్నేహంగా మెలగండి” అంటూ నవీన్ చెప్తుంటే మధ్యలో జనం ఆపేశారు.
“సర్! మీరు చెప్పేది బాగానే ఉంది. కాని మేం తినడానికే కష్టమవుతుంటే పిల్లల్ని చదివించలేక పోతున్న సమయంలో ఈ హాస్టళ్ళు పక్క ఊళ్లోకి రావడంతో సంతోష పడి చెర్పించాం. కాని ఇలా జరుగుతుందని తెలియదు సర్. మా పిల్లలను సొంతంగా చదివించె స్థోమత లేదు సర్. మన్పించెయ్యడమే!” అన్నారొకరు.
“ఎందుకయ్యా మాన్పించడం? చదివించండి. మీరు కష్టపడకపోతే మీ పిల్లల జీవితాలు కూడా మీలానే అవుతాయి. వాళ్ళను కష్టపెట్టి మీరేం బ్రతుకుతారు. వాళ్ళు సుఖపడాలని మీకు లేదా? ఏదో జరిగిందని ఎందుకయ్యా తప్పుగా ఆలోచిస్తారు? జాగ్రత్తగా ఇలాంటి వెధవల జోలికి, గొడవల జోలికి వెళ్ళనివ్వకుండా పెంచండయ్యా” అన్నాడు నవీన్.
“ఇదంతా మా ఖర్మ సర్” అంటూ బాధపడింది పద్మావతి.
“అందుకే చెప్పేది. పిల్లల నైతిక బాధ్యతను తండ్రి చూసుకోగలడు. తల్లి దగ్గరిగా ఉండి నడవడికను నేర్పించాలి. ఈ వయస్సులోని కోరికలను, శరీరంలోని మార్పులను గురించి వారికి వివరించి చెప్పాలి. సెక్స్ సైన్సు గురించి టీవీల్లో ప్రోగ్రాం వస్తే కట్టెయ్యడం కాదు చెయాల్సింది, వివరించి చెప్పడం. అప్పుడే కదా వారికి తెలిసేది. లేకపోతే తప్పుదోవ పట్టే అవకాశాలే ఎక్కువ. అన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళేగా. మీ పిల్లలకు వాటి గురించి చెప్పడానికేందుకు మొహమాటం. అది విని చెడిపోతారనే భయ౦ వద్దు. చదువనేది విజ్ఞానం కొరకు. అవివేకానికి వివేకానికి మధ్య తేడాను తెలుసుకోవడానికి. మారుతున్న నాగరకతకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని తెలియజేయడానికి నిర్దేశించిన గొప్ప సంప్రదాయమది. దాన్ని వాళ్లకి దగ్గర చెయండి.
ఇటువంటి వాటిపై అవగాహన లేకపోవడం వలన ఏం జరుగుతుందో, ఏం చెయాలో తెలియని అయోమయో స్థితిలో మగ్గిపోయారు. ఎవ్వరికీ చెప్పుకోలేరని వాడు మరింకా విజ్రుంభించాడు. కామాంధుడికి వయస్సుతో సంబంధమేంటి చెప్పండి..! ఆ పిల్లలు ఎంత బాధను అనుభవించారో ఆలోచిస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. పిల్లలు నడిచెటప్పుడు కాళ్ళు రెండూ ఎడంగా పెట్టుకుని ఇబ్బంది పడుతున్నపుడే అనుమానించండి. సౌమ్యంగా అడిగి తెలుసుకోండి. ఇటువంటి సంఘటనలు వాళ్ళ జీవితాల్లో చెడును పెంచుతాయి. ఎన్ని జరుగుతున్నా తమ బిడ్డల గురించి పట్టించుకునే సమయాన్ని కేటాయించడం లేదు. బ్రతుకు పోరులో పడి కొట్లాడుకుంటున్నారు. యంత్రాల్లా మారిపోతున్నారు. అదంతా వీరి భవిష్యత్ కోసమే కదా! పై స్థాయికి ఎదగాలని కోరుకుంటేనే సరిపోదు. దానికి తగిన తర్ఫీదునివ్వాలి. ఆచార వ్యవహారాలూ, సభ్యత సంస్కారాలు నేర్పించాలి. లేడికి లేచిందే పరుగని ఉరుకుల పరుగుల జీవితంలో వీరి గురించి పట్టించుకోవడం మానుకోవద్దు” అంటూ క్లాస్ తీసుకున్నాడు విల్సన్ రాజు.
“ప్రతి తల్లీ తన కూతురికి వయస్సులో సంభవించే పరిణామాలపై అవగాహన కల్పించాలి. ప్రతి అవయవం గురించి వివరించాలి. దీని వల్ల వాళ్ళేదో చెడిపోతారని అనుకోవద్దు. చెప్పకపోతేనే వాటి పని తీరు తెలియక, అసలైన ప్రయోజమేంటో అర్ధం కాక తప్పు దోవ పట్టే అవకాశముంది. విల్సన్ రాజు గారు చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోండి. అలా చెయడం వలన మీ మధ్య బంధం మరింత పెరుగుతుంది. అప్పుడు పిల్లలు మీ దగ్గర ఏ విషయాలనూ దాచిపెట్టరు. ఈ విషయంలో విజ్ఞత పాటించాల్సిందే! దేశానికి సేవ చెయడమంటే మనకు మనమే సరిదిద్దుకోవడమే! అప్పుడు దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది” అంటూ నవీన్ కూడా క్లాస్ పీకాడు. ఎప్పుడూ పిల్లలే పాఠాలు వినేవాళ్ళు కాని ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుణపాఠాలను నేర్చుకుంటున్నారు.

……….. సమాప్తం ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *