March 19, 2024

కథలరాజు- పద్మరాజు

రచన: శారదా ప్రసాద్

ప్రపంచ కథానికల పోటీలో ఒక తెలుగు కథానికకు ద్వితీయ బహుమతిని తెచ్చిపెట్టి ప్రపంచ సాహిత్యంలో తెలుగు కథానికకు వన్నె తెచ్చిన ఈ ప్రతిభామూర్తి, 24-06 -1915 న, పశ్చిమ గోదావరి జిల్లాలోని, అత్తిలి మండలానికి చెందిన తిరుపతిపురం అనే గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే, వీరిపైన యమ్. యన్. రాయ్ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందువల్ల హేతువాదిగా మారాడు. సైన్సులో మాస్టర్స్ డిగ్రీ చేసిన వీరు 1939 నుండి 1952 వరకు, కాకినాడలోని పీ. ఆర్. కాలేజీలో, సైన్సు లెక్చరర్ గా పనిచేశారు. ఉపన్యాసక వృత్తిలో ఉన్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా రచయిత కావటం చేత, రచనలు కూడా చేసేవారు. దాదాపుగా 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు మరి కొన్ని నాటికలను రచించారు. వీరు వ్రాసిన కథలను –గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం, అనే పేర్లమీద మూడు సంపుటాలుగా ప్రచురించారు. ఇవన్నీ, ఇప్పుడు లభ్య పడుతున్నాయి.
తన 23 వ ఏట మొదటి కథగా ‘సుబ్బి’ అనే కథను వ్రాశారు. అయితే, వీరికి ఖ్యాతి తెచ్చి పెట్టింది మాత్రం, ‘గాలివాన’ అనే కథ. దీనికే ప్రపంచపు కథానికల పోటీలో బహుమతి వచ్చింది. ఈ కథ న్యూయార్కు నుండి వెలువడే హెరాల్డ్ ట్రిబ్యూన్ అనే పత్రిక 1952 లో నిర్వహించిన పోటీలో పై బహుమతిని పొందింది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎన్నికైన ఈ పోటీలో, మన దేశము నుండి మూడు కథలు ఎన్నికయినాయి. అందులో ‘గాలివాన’కు బహుమతి లభించటమే కాకుండా, పలువురి ప్రశంసలు లభించాయి. ‘గాలివాన’కథ చాలా ప్రపంచపు భాషలలోకి, మరియు మన దేశ భాషలలోకి అనువదించబడింది. ఆ విధంగా తెలుగు కథానికను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రతిభామూర్తి శ్రీ పద్మరాజుగారు. వీరు రచించిన నవలల్లో ప్రసిద్ధమైనది ‘బతికిన కాలేజి’. వీరు వ్రాసిన మిగిలిన నవలల్లో ముఖ్యమైనవి, నల్లరేగడి, రెండో అశోకుడి మూణ్ణాళ్ళ పాలన, రామరాజ్యానికి రహదారి మొదలైనవి.
వీరి ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత తెలుగు సినీ దర్శకుడు శ్రీ బీ. యన్. రెడ్డి గారు, వీరిని మద్రాసుకు ఆహ్వానించి, వారు 1952 లో నిర్మించిన ‘బంగారుపాప’కు సంహాషణలు వ్రాయమని కోరారు. పద్మరాజుగారి సినీజీవితం అలా ప్రారంభమైంది. ‘బంగారుపాప’ సినిమా ఒక కళాత్మక చిత్రంగా నేటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. ఈ సినిమాకు పెక్కు అవార్డులు, రివార్డులు లభించాయి. ఈ సినిమాలో శ్రీ S. V. రంగారావు గారు ప్రదర్శించిన నటన అద్వితీయం, అమోఘం. వారి చలన చిత్ర జీవితంలో ఈ సినిమాలో వారు నటించిన పాత్ర మరువలేనిది. అయితే ఈ సినిమా ఆర్ధికంగా విజయవంతం కాలేదు. దీని తర్వాత వీరు ‘బికారి రాముడు’ అనే సినిమాకు రచయితగా పనిచేశారు. అదికూడా ఆర్ధికంగా పరాజయం పాలైంది. అయితే ఆయనలోని ప్రతిభను గుర్తించిన వారు వారిని వదిలిపెట్టలేదు. అలానే మూడు దశాబ్దాలపాటు పెక్కు సినిమాలకు కథలను, సంభాషణలను సమకూర్చారు. భక్త శబరి, బంగారు పంజరం లాంటి పెక్కు కళాత్మక చిత్రాలు వీరి జాబితాలో ఉన్నాయి. శ్రీ బీ. యన్. రెడ్డి గారికి ఈయనంటే అమితమైన అభిమానం. వ్యాపారపరంగా వీరు రచించిన చాలా సినిమాలు నష్టాలనే చూశాయి. అయినా అలానే తన సినీ జీవితాన్ని కొనసాగించారు. నేటి శతచిత్ర దర్శకులలో ఒకరికి వీరు ghost writer గా పనిచేశారని సినీ ప్వర్గాల్లో వినికిడి వుంది. పా. ప. అనే పేరుతో కూడా రచనలను చేశారు.
వీరు 1955లో శ్రీ ఆరుద్రగారితో కలసి ‘జంట కథానికలు ‘ వ్రాశారు. వీరు వ్రాసిన ‘గాలివాన’కథ ఒక వాస్తవ సంఘటనకు పదచిత్రం, ఆ రోజుల్లో, కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లకుండా ఉండటానికి యాజమాన్యం వారు, లెక్చరర్లకు నివాస స్థలాలను ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కట్టించు కోవటానికి ప్రోత్సహించేవారు. అయితే పద్మరాజు గారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే అవటం చేత, ఆయన పక్కాగా ఇంటిని నిర్మించుకోలేక పోయారు. అటువంటి రోజుల్లో ఒకనాడు భయంకరమైన గాలివాన వచ్చింది. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇటుక గోడలు కూలి పోతున్నాయి. ఒక్కసారిగా ఇంటి కప్పు మొత్తం కూలిపడింది. ఆ శిధిలాల క్రింద ఆయన భార్య చిక్కుకొని పోయింది. చిమ్మచీకటి. బయట ఎవరూ కనబడటం లేదు. ఎన్ని కేకలు పెట్టినా, ఆ గాలివాన హోరులో ఆయన ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. అలా ఆవేదనతో ఆయనొక్కడే భార్య బతికుందా లేక మరణించిందా అనే ఆందోళనతో బిక్కచచ్చి నిర్జీవుడిలాగా ఎంతో ఆవేదనను అనుభవించారు. అదృష్టవశాత్తు కొంతమంది విద్యార్ధులకు వారి ఆర్తనాదాలు వినపడ్డాయి. వెంటనే వచ్చి శిధిలాల క్రింద ఉన్న పద్మరాజుగారి భార్య శరీరాన్ని బయటకు తీశారు. అయితే ఆవిడ బతికుందా లేక మరణించిందా తెలియాలంటే, తెల్లవారవలసిందే!ఈ సమయంలో అనుక్షణం ఆయన పడిన ఆవేదనే ‘గాలివాన’ కథకు ప్రేరణ!ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఆయన అనుభవించిన మనో వ్యధకు చక్కగా అక్షరరూపం ఇవ్వబట్టే, ఆ కథకు అంత విశిష్టత లభించింది. అదీ ‘గాలివాన’ కథ నేపధ్యం!
ఆ రోజుల్లో తమిళంలో శ్రీ యమ్. ఆర్. రాధా గారు ఒక కుష్టువాని పాత్రను ధరించి ఒక నాటకాన్ని ప్రదర్శించేవారు. దానికి తమిళ దేశంలో విశేష ఆదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన మన తెలుగు నటుడు శ్రీ నాగభూషణంగారు, ఆ తమిళ నాటకాన్ని తెలుగు వాతావరణానికి సరిపోయేటట్లుగా అనువదించమని శ్రీ పద్మరాజు గారిని కోరారు. పద్మరాజు గారు ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశారు. అదే’రక్తకన్నీరు’నాటకం. నాగభూషణంగారు ఆ నాటకాన్ని తన స్వంత బృందంతో దేశమంతా కొన్ని వేల ప్రదర్సనలు ఇవ్వటమేకాకుండా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా ప్రసిద్ధి చెందారు. పద్మరాజు గారిలో సృజనాత్మక శక్తి, ఆయన అభిమానులైన అతి తక్కువ మంది గుర్తించారు. ఎన్నో చక్కని కవితలల్లారు. సినిమాలలో, ఎవరూ ఊహించలేనటువంటి అతి మధుర, భావగర్భిత గీతాలను రచించారు. నాకు గుర్తున్న కొన్ని–‘శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’లోని’ రాకోయి అనుకోని అతిధి’, బికారి రాముడు సినిమాలో, ‘నిదురమ్మా, నిదురమ్మ’ (ఈ పాటను శ్రీ రంగం గోపాలరత్నం గారుపాడారు), ‘మేఘసందేశం’లో, జయదేవుని అష్టపదులలోని ఒక గీత మకుటం మాత్రమే తీసుకొని వ్రాసిన పాట ‘ప్రియే చారుశీలే’. . . మొదలైనవి. ఇటువంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో!ఆయన వ్రాసిన కవితల్లో నాకు నచ్చిన ఒక కవితను మీకోసం ఈ క్రిందనే పొందుపరుస్తున్నాను. కవిత శీర్షిక పేరు ‘చిత్రరచన’. దీనిని వీరు 1938 లో తన 23 వ ఏట రచించారు.
చిత్రరచన
ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిన్నపిల్లల బొమ్మరిళ్ళలో నాజూకూ
చిట్టిపాపల తప్పటడుగులవయ్యారం
చిరుతపలుకుల ముద్దులొలికే మైమరపూ.
ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిలిపికజ్జాలనీ, వలపుకన్నీటినీ,
ఎడబాటువగలనీ, కడకంటిఎరుపునీ,
మరలకలయికలనీ, కరగుహృదయాలనీ.
ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ముడతలుపడ్డదేహంలోపల
ముక్కిపోయినమనసులూ
తేనెలెతీపిని చే దనితోసే
తిక్కలెక్కినజిహ్వలూ
ఆయాసంతో అలసట చెందీ
అదే వాగే నాల్కలూ.
ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ఏడుపులూ నవ్వులూ ఏకంగా జేసేసి
ఈజీవితపు కష్టసౌఖ్యాలనీడల్ని
ఏడురంగుల్లోకి అనువదిస్తున్నాను.

వారు వ్రాసిన మరో కవితను కూడా మీ కోసం ఈ దిగువనే పొందు పరుస్తున్నాను.
అప్పుడు
పైరుగాలికి నాట్యమాడే
పైటరాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దాని మ్మొకటి
పగిలి విచ్చింది
పండు దొండకు సాటివచ్చే
పడతిపెదవులలోన దాగిన
పండ్లముత్తెపుతళుకు లన్నీ
పక్కుమన్నాయి
అప్పుడు నేననుకొన్నాను
అందాని కర్ధం ఇదే నని.
గట్లమీదా పుట్లమీదా
గంతులేస్తూ తిరిగివచ్చిన
కోడెదూడని బాడి అయినా
గోవు నాకింది
దుస్తులంతా దుమ్ముపడినా
దులపకుండా చేరవచ్చిన
కన్నతండ్రిని తల్లి ఎత్తుకు
కౌగిలించింది.
అప్పుడు నేననుకొన్నాను
ఆనంద మంటే ఇదే నని.
తేనెకోసం పూవుపూవుకి
తిరుగుతుండే గండుతుమ్మెద
కాలికంటినపుప్పొ డంతా
పూల కంటింది
పూటపూటకు సేకరించిన
పూరజంతో బరువు లెక్కిన
విరులగుత్తులు పురుడుపోసుకు
పిందె లయినాయి
అప్పుడు నేననుకొన్నాను
అచ్చపు సత్యం ఇదే నని.

ఇలా విభిన్న కోణాలలో తన ప్రతిభను చాటుకున్న ఈ రచయితకు కాలం కలసి రాక సినీ జీవితం కొద్ది ఒడిదుడుకులతోనే నడిచింది. . తప్పని పరిస్థితులలో ghost writer గా పనిచేశారు. భార్య పేరు శ్రీ మతి సత్యానందం. సీత, రత్నఅనే ఇద్దరు కుమార్తెలున్నారు వీరికి. ఆకాశవాణిలో పనిచేసిన లలిత సంగీత ప్రయోక్త, గేయ రచయిత, గొప్ప వీణావిద్వాంసుడు అయిన శ్రీ పాలగుమ్మి విశ్వనాధంగారు వీరి తమ్ముడే!శ్రీ పద్మరాజు గారు 17 -02 -1983 న, అకస్మాత్తుగా మరణించారు. 1985 లో వీరి మరణానంతరం, వీరి ‘గాలివాన’కు కేంద్ర సాహిత్య అకాడమీ వారు బహుమతిని ప్రకటించి, సాహిత్యం, కళల పట్ల వారికున్న’అభిమానాన్ని’ చురుకుతనాన్ని’యధాప్రకారం’ గా నిరూపించుకున్నారు!
కాలం కాటేసిన ఈ ప్రతిభామూర్తికి నా ఘనమైన నివాళి!
శారదాప్రసాద్

15 thoughts on “కథలరాజు- పద్మరాజు

  1. మిత్రమ శాస్త్రి,
    పాలగుమ్మి పద్మరాజు గారిని గురించి నీవు వ్రాసిన పరిచయ వ్యాస రచన చాలాబాగుంది. రక్తకన్నీరు నాగభూష ణం గారికి
    మంచి పేరు తెచ్చిన పేటెంటు నాటకం “రక్తకన్నీరు” తద్వారా నాగభూషణంగారు పేరు పొందడమేగాక ఎంతోమందికి ఉపాధి కల్పించారు. మంచి విశ్లేషణాత్మక రచనకు ధన్యవాదాలు.
    …. VSKHBABURAO.

  2. పాలగుమ్మి పద్మరాజు గారి ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  3. I read the story Galivana and aware of its importance. But I am not aware of many other things of this article. Thank you.

  4. Thanks for sharing about Sri Padmaraju garu and so many unknown facts.A vivid real story about him to know every literature lover

  5. పెద్దాయన గురించి మంచి వ్యాసం వ్రాసారు. మహా కథకులు శ్రీ పద్మరాజు గారు. మీరు పేర్కొన్న శతచిత్ర దర్శకులలో ఒకరు తొలిరోజుల్లో వీరి రచనలను ఫెయిర్ చేయడానికి వీరి వద్ద పనిచేసారు. ఆ కాలంలో వీరి కథలను కొన్నిటిని సంగ్రహించారని, ఆ కథలనే వారు తమ స్వంతరచనలుగా చలామణీ చేసుకుని సినిమాలు తీసారని చాలామందికి తెలిసిన విషయం. వారిని ఘోస్ట్ రైటర్ గా సినీప్రపంచం నమ్మేలా చేశారన్నది ప్రచారంలో ఉన్న విషయం.

  6. ఒక నిజ జీవిత కథని వర్ణించినట్లు శ్రీ పద్మ రాజు గారి గురించి వ్రాసిన శ్రీ శారదా శాస్త్రి గారు అభినందనీయులు. చదువరులు చదివి సానుభూతి పరులు గా మారడం సహజం. కథఅంశం ఏదైనా శ్రీ శాస్త్రి గారు ఉటంకించే శైలి అభినందనీయం. భాస్కర్ దత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *