April 16, 2024

కౌండిన్య హాస్యకథలు.. ఫారిన్ రిటర్న్డ్

రచన: రమేష్ కలవల

విమానాశ్రయం! ఎప్పటి లానే రద్దీగా ఉంది. ఆ విమానాశ్రయం లో ఇద్దరు పెద్దవాళ్ళు మొదటి సారి విదేశాలకు ప్రయాణం చేయబోతూ సహజంగా కొంచెం టెన్షన్ పడుతూ, వాళ్ళ సామాన్లు చెకిన్ చేసి, క్యాబిన్ లగేజీతో గేటు నెంబర్ కోసం వేచి ఉన్నారు.

ఆ దగ్గరలోనే అర్నాల్డ్ నించొని వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. ఎయిర్పోర్టులో బరువులు ఎత్తి ఎత్తి అర్నాల్డ్ స్వాజ్నేగర్ లా బాడీ పెంచడం మూలాన అందరూ ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు.

అర్నాల్డ్ ఉద్యోగరిత్యా ఎయిర్పోర్ట్ లో ఇలాంటి వయసు పడిన పెద్ద వాళ్ళని వీల్ చైర్లో విమానంలో సీటు వరకూ తీసుకెళ్ళి వదిలిపెట్టడం చేస్తుంటాడు.

ఒకటి రెండు సార్లు బోర్డింగ్ స్టాఫ్ కన్ను కప్పి ప్రయాణికులతో పాటు తను కూడా విమానం ఎక్కి , కనపడిన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోబోతే, అది గమనించిన స్టాఫ్ అలా చేయకూడదని మందలించి పంపించడంతో ఆ కోరిక ఇంకొంచెం బలపడింది. ముచ్చటగా మూడో సారి ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకైనా మంచిదని రోజూ ఓ బ్యాగు కూడా తెచ్చుకుంటాడు.

ఆ వయసు పడిన వాళ్ళని చూసి అర్నాల్డ్ గమనించింది ఏంటంటే పెద్దావిడకు సరిగా వినపడదని, కళ్ళద్దాలు తీస్తే సరిగా కనపడదని. అదీకాక ఆ పెద్దాయన మాత్రం ఆవిడ చెయ్యి విదిలించుకుంటున్నా సరే ఎక్కడ తప్పిపోతుందో అని ఆ చెయ్యిని గట్టిగా పట్టుకొని వదలడం లేదని తెలుసుకున్నాడు.

అర్నాల్డ్ మనసులో ఓ పధకం పన్ని వాళ్ళ ఇద్దరి దగ్గరికి ఉన్న వైపుకు నడిచాడు, కాలు తట్టుకున్న వాడిలా అమాంతం ఆ పెద్దావిడ మీద పడబోతూ ఆవిడ కళ్ళద్దాలు కిందపడి పగిలేలా చేసాడు.

“అయ్యో పగిలాయే” అన్నాడు పెద్దాయన.

“ఇంకో జత కూడా లేవు. ఆ చెకిన్ చేసిన సూట్ కేసులో ఉన్నాయండి, ఎలాగా?” అంది.

“చేసేదేముంది చెయ్యి వదలకు!” అన్నాడు. ఆవిడ చిరాకు పడుతూ ఆ చెయ్యి మళ్ళీ పట్టుకుంది.

“ఇంతకీ ఎవరండి అలా తగిలింది” అని అడిగింది.

అర్నాల్డ్ వైపుకు తిరిగి “ఆ మాత్రం చూసుకోకపోతే ఎలాగయ్యా? ఉన్న ఒక్క జోడు పగలగొట్టావ్ ” అని అడిగాడు.

“అదేంటండి.. మిమ్మల్ని విమానం వరకూ దిగబెట్టమన్నారు. నేను మీ దగ్గరకు వస్తుంటే మీరే కాలు అడ్డుపెట్టారు,” అన్నాడు

“కాలడ్డుపెట్టడం మా ఇంటా వంటా లేదు… కావాలంటే అటునుండి మళ్ళీ రా” అన్నాడు బుకాయిస్తూ పెద్దాయన

అర్నాల్డ్ మళ్ళీ నడిచి ఈ సారి ఆయన్ని కూడా తోసి, ఆ పెద్దావిడ మీద పడబోయినట్లు నటించి

“చూసారా?” అని అడిగాడు

“లేదు బాబు కళ్ళద్దాలు లేకపోతే నాకు కనపడదు” అంది ఆవిడ. ఆవిడకు నిజంగా కనబడదని నిర్ధారణ అయ్యింది.

“మిమ్మల్ని కాదు” అన్నాడు ఆవిడతో.

ఆ పెద్దాయన అర్నాల్డ్ ను కోప్పడుతుంటే సర్ది చెప్పాడు.

“ఏమి వినపడడం లేదు, దగ్గరకు రండి” అంది ఆవిడ.

“నిన్ను కాదే” అన్నాడు దగ్గరకు వచ్చి. ఎంత దూరం నుంచి ఆవిడకు వినపడదో అది కూడా అర్థమయ్యింది అర్నాల్డ్ కు.

ఇంతలో అర్నాల్డ్ “అదిగో గేటు నెంబరు ఇచ్చారు..ఇంతకీ మిమ్మల్ని తీసుకెళ్ళాలా వద్దా.” అని అడిగాడు మోకాలి దగ్గర రాసుకుంటూ దెబ్బ తగిలిన వాడిలా నటిస్తూ.

“సరే తీసుకెళ్ళు బాబు, నీకు తెలిసిన వాడిలా ఉన్నావ్” అంది కళ్ళద్దాలు లేని ఆవిడ తనకు నడిచే ఉద్దేశం లేక.

“నువ్వుండు. అయినా ఇద్దరికి ఒకటే వీల్ చెయిర్ ఎలా సరిపోతుంది” అన్నాడు

“మీరు ఆవిడ్ని కూర్చోపెట్టండి, దారిలో ఇంకెవరైనా కనపడితే నేను పిలుస్తాను, లేడీస్ ఫస్ట్” అన్నాడు ఆవిడ కూర్చోగానే తోయడం మొదలు పెట్టాడు, పెద్దాయన వెనుక నడుస్తున్నాడు.

“బోర్డింగ్ కార్డు, పాస్ పోర్టు రెడీ చేసుకోండి” అన్నాడు.

ఆ పెద్దాయన ఆగి “బ్యాగులో ఉన్నాయి, తీస్తాను ఒక్క నిమిషం ఆగు బాబు” అన్నాడు ఆవిడ చెయ్యి వదిలాడు. ఆవిడ ఊపిరి పీల్చుకుంది. ఆయన వాటిని తీసే హడావుడిలో ఆవిడను ఓ సారి లేవమన్నాడు, తను ఆ కుర్చీలో కూర్చున్నాడు.

ఇంతలో పెద్దాయన పాస్పోర్టులు తీసి అర్నాల్డ్ ఆ చెయిర్లో కూర్చోవటం చూసి “ఇదేం చోద్యం అయ్యా, మమ్మల్ని తీసుకెడతానని ఇంచక్కా నువ్వు చతికిలా పడ్డావు?” అన్నాడు.

“రెండు సార్లు కాలు అడ్డుపెట్టారు మోకాలు పనిచేయడం లేదండి. ఇంక ఎంతో దూరం లేదు” అన్నాడు

“అయితే మేము నడిచి వెడతాం లే” అన్నాడు

“మీరు అలా చేస్తే నా ఉద్యోగం పోతుంది” అంటూ

“ఫర్వాలేదు లేండి కుంటు కుంటూనైనా మిమ్మల్ని ఎక్కించే బాధ్యత నాదే” అంటూ లేవబోయాడు.

పెద్దావిడ హృదయం ద్రవించింది. “ఈ కాస్తా దూరమే కదా తోద్దురూ, అవసరమైన వారికి సహాయం చేస్తే పుణ్యం కూడానూ” అంది

“ఈ పాస్పోర్టులు, బ్యాగుతో నేనెలా తోస్తానే” అన్నాడు.

“సింపుల్, అవి నా ఒళ్ళో పెట్టండి. మీరు తోయండి. ఆవిడ మీ చెయ్యి పట్టుకొని నడుస్తారు రెండు నిమిషాలలో గేటు దగ్గరుంటాము” అన్నాడు

చేసేది లేక తోయడం మొదలు పెట్టాడు. ఆయనను పట్టుకు ఆవిడ నడుస్తోంది. తక్కువ బరువా తొయ్యలేక తోస్తుంటే

“స్పీడు పెంచాలి మరీ ఇంత స్లోగా అయితే విమానం వెడిపోతుంది” అన్నాడు అర్నాల్డ్.

“నా ఖర్మ” అంటూ స్పీడు పెంచాడు పెద్దాయన. చెకిన్ డెస్క్ చేరుకున్నాడు రొప్పుతూ మాట్లాడటానికి నోటి మాట రావడం లేదు ఆయనకు.

ఆ బోర్డింగ్ డెస్క్ దగ్గర చేరగానే కుర్చీలోంచి చెక్ చేస్తున్న స్టాఫ్ కు తను పాస్పోర్టులు అందచేసాడు.

“ఇంతకీ ఎవరు ప్రయాణిస్తోంది?” అని అడిగారు అర్థం కాక.

“ఆయన, ఈవిడ” అన్నాడు.

కుర్చీలోంచి లేచి ఆ చెక్ చేసే వాళ్ళతో చిన్నగా “ఆవిడకు కనపడదు, ఆయనకు మాటలు రావు” అన్నాడు

“ఓహో “ అంటూ పాస్పోర్టులు చూసి చెక్ చేసే వాళ్ళు లోపలకు తీసుకు వెళ్ళమని సైగలు చేసారు.

అర్నాల్డ్ ఆ పెద్దావిడను కూర్చోబెట్టి ఆయన్ని తోయమన్నాడు, తను పక్కన నడుస్తున్నాడు.

విమానం దగ్గరవుతుండగా తన మెడలోంచి బ్యాడ్జ్ తీసి ఆయన మెడలో వేసాడు అర్నల్డ్.

“ఇదేంటి?” అని అడగగానే “తోసే వాళ్ళు బ్యాడ్జ్ వేసుకోవాలండి రూల్స్..” అన్నాడు.

విమానంలోకి ముగ్గురూ నడిచారు. చూసే వాళ్ళకి బ్యాగ్ పాస్పోర్టులతో ప్రయాణికుడిలా ఫోస్ ఇచ్చాడు. లోపలకు వెళ్ళిన తరువాత ఆవిడను నేను కూర్చోబెడతాను కానీ “మీరు ఆ వీల్ చెయిర్ బయట వదిలి త్వరగా వచ్చేయండి” అన్నాడు. పాపం పెద్దాయన కంగారుగా దాంతో బయటకు బయలు దేరాడు. ఒక్క సారి బయటకు వెళ్ళిన తరువాత లోపలకు రాబోతుంటే ఆ మెడలో బ్యాడ్జ్ అవతారం చూసి ఆ స్టాఫ్ లోపలకు రాకూడదని మందలించి ఎంత చెబుతున్నా వినకుండా బయటకు పంపేసారు.

లోపల ఆవిడను కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు మళ్ళీ పెద్దాయన ఎక్కడ చెయ్యి పట్టుకుంటాడోనని దూరంగా జరిగింది. ఆవిడకేమి తెలుసు పక్కన ఉంది పెద్దాయన కాదు అర్నల్డ్ అని ? కళ్ళద్దాలు లేకుండా మాస్టర్ ప్లాన్ వేసాడుగా అర్నాల్డ్.

ఇక విమానం కదిలింది, అర్నాల్డ్ తన పథకం ప్రకారం అంతా సవ్యంగా జరిగినందుకు చంకలు గుద్దుకుంటుంటే అక్కడ ఆ పెద్దాయన రొప్పుతూ ఇంకో పాసింజర్ ను తోసుకుంటూ వేరే గేటు దగ్గరకు తీసుకెడుతున్నాడు. హత విథి.

విమానం బయలుదేరిన కొంత సేపటికి కెప్టెన్ ఎనౌస్మెంట్ చేయటం మొదలు పెట్టాడు. “ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం.. మనం ముప్పై ఐదు వేల మీటర్ల పైన ఆకాశంలో మూడు వందల యాభై మైళ్ళ వేగంతో ఇపుడు మాల్ధీవ్స్ దాటబోతున్నాం. కొంత సేపట్లో ఫలహారాలు సర్వ్ చేస్తారు కాబట్టి రిలీక్స్ అండ్ ఎంజాయ్ ది ఫ్లైట్ అంటూ” ఎనౌస్మైంట్ చేసారు.

ఆ ఎనౌస్మైంట్ విన్న తరువాత ఆ పెద్దావిడకు థ్రిల్ గా అనిపించింది. మొదటి ప్రయాణం పైగా తనవాళ్ళని చాలా రోజులు తరువాత కలుసుకోబోతున్నారు. మనసులో సంతోషం వేసి ఇందాకటి దాకా విదిలించి కుందామనుకున్న చెయ్యిని తనే పట్టుకుందామని ప్రేమగా పక్క సీటులో అర్నాల్డ్ చెయ్యి పట్టుకుంది. నొక్కి చూసింది, రాయి లాగా తగిలింది.ఆ కంగారులో ఒళ్ళు కూడా తడివింది, అర్థం అయ్యింది పక్కన ఉన్నది ఆయన కాదని, ఆజానుబాహుడైన అర్నాల్డ్ అని. కీచు గొంతుతో గట్టిగా అరిచి మూర్చపోయింది.

ఎయిర్ హోస్టెస్ పరిగెత్తుకు వచ్చారు. అదే సమయంలో ఆ పెద్దాయన వేరే పాసింజర్ అదే గేటు దగ్గర ఎక్కించడానికి వచ్చి ఆ స్టాఫ్ తో జరిగిందంతా చెప్పే సరికే ఆవిడ కీచు గొంతుతో అరిచి ఆవిడ కూడా మార్చబోయింది.

విమానంలో మళ్ళీ ఎనౌస్మైంట్ చేసారు. “అనివారీయ కారణాల వల్ల ఒక పెద్దావిడ పరిస్థితి ఏమి బాలేదు కావున ఈ విమానంలో డాక్టర్లు గనుక ఉంటే తెలియజేయగలరు” అన్నాడు.

ఒకాయన లేచాడు వచ్చాడు “మీరు డాక్టరా?” అని అడిగింది ఆ ఎయిర్ హోస్టెస్ ఆయన్ని చూసి.

“కాదు యాక్టర్ ని” అన్నాడు. “కానీ నా మొహంలో అందం చూస్తే అలా మూర్చపోయిన వాళ్ళు కూడా లేవడం ఖాయం” అన్నాడు.

ఆ ఎయిర్ హోస్టెస్ ఆయన్ని చూసి ”మూర్చ బోయిన వాళ్ళు కళ్ళు ఎలా తెరుస్తారు? మీ తెలివికి నాకు మూర్చ వచ్చేలా ఉంది వెళ్ళి కూర్చోండి” అంది. సిగ్గు పడుతూ ఇబ్బందిగా బయలు దేరాడు.

ఇంతలో ఒకావిడ నిజమైన డాక్టరే వచ్చింది. ఆ పెద్దావిడ పల్స్ అన్నీ చెక్ చేసింది. “షాక్ మూలంగా వచ్చిన మూర్చ లాగా ఉంది కాబట్టి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది” అంటూ ఆ ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చారు. అర్నాల్డ్ మాత్రం ఏవీ పట్టనట్లు వేరే సీటులో కూర్చొని అడిగిమరీ అన్నీ తీసుకొని తింటూ, తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

కొంత సేపటికి కాప్టెన్ మళ్ళీ ఎనౌస్మైంట్ చేసాడు “అనుకోకుండా ఎమర్జన్సీ కారణంగా విమానాన్ని వెనుకకు తీసుకువెడుతున్నామని చెప్పటానికి చింతిస్తున్నాము” అన్నారు.

అది విన్న అర్నాల్డ్ “ఓ మై గాడ్” అంటూ గట్టిగా అరిచి తను కూడా సీటులో కుప్ప కూలాడు.

తిరుగు ప్రయాణిస్తున్న విమానం చేరగానే రెండు వీల్ చెయిర్స్ రెడి చేసి ఉంచమని ఎయిర్ పోర్టుకు మెసేజ్ పంపారు. విమానం తిరిగి చేరుకుంది.

ఒక వీల్ చెయిర్ పట్టుకొని ఆ పెద్దాయన, ఇంకోతనూ వేచి ఉన్నారు. డోర్లు ఒపెన్ చేసారు లోపలకు ఇద్దరూ హడావుడి గా నడిచారు. కొంత సేపటికి ఆ పెద్ద వాళ్ళిద్దరిని ఒక్కో చెయిర్లో తోసుకుంటూ బయటకు నడిచాడు మాల్దీవ్స్ రిటర్న్డ్అర్నాల్డ్ మరియు ఇంకో అతను.

కౌండిన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *