March 29, 2024

చేతిలో చావు… ఆపేదెలా???

రచన: రాజారావు. టి

దేవుడిదయ వల్ల అనుకున్నటుగానే పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. రాత్రికి ఆ శుభకార్యం కూడా సవ్యంగా జరిగిపోవాలి, అని వధూ వరుల తల్లి తండ్రులు అనుకుంటున్నారు. రాత్రికి వధువు పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెటింది. పెళ్లికూతురు ముఖం తామరాకు పై వర్షపు బిందువులా, అప్పుడేపెట్టిన కొత్త ఆవకాయలా కళకళ లాడి పోతుంది. వరుడు లేని ధైర్యాన్ని మొఖములో తెచ్చిపెట్టుకుని, మనది పెద్దలు కుదిర్చిన వివాహం అవడమువలన ఒకరి గురుంచి ఒకరికి పూర్తిగా తెలియదు, కాబట్టి ముందు మన అభిరుచులు, అలవాట్లు, ఆశయాలు అన్ని అన్ని పంచుకోవాలి.
అమ్మాయి అవును అన్నట్లుగా తలూపింది. గదిలో మల్లెల వాసన ఇద్దరిని తెలియని మైకంలోకి తీసుకవెళుతుండగా, అగరబత్తుల పొగ గమ్మత్తుగా గది అంతా వ్యాపిస్తుంది. ఇక్కడ ఈ గదిలో ఎదో తెలియని కృత్రిమత్వం నా మదిని తొలిచివేస్తోంది.
అలా మనం ఒక లాంగ్ డ్రైవ్ కి వెళదామా ? సరే మీ ఇష్టం అండి, కానీ పెద్ద వాళ్లకు తెలిస్తే, , ఆ భయం లేదు, పిల్లల పెళ్లి బాధ్యత తీరిందనే బరువు తగ్గడం వలన, పెళ్లి పనుల శ్రమ తాకిడి వలన అందరు ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నారు.
సంద్రలో అలలు, అడవిలోకాచిన వెన్నెల, పిల్లల మనసులో అపరిపక్వత ఏ విధంగా తమ ఇచ్చానుసారంగా నడుచుకుంటాయో, ఎంత హాయిగా తమ పనిని చేసుకపోతాయో, అదే విధంగా మనము ప్రొదున్నవరకూ స్వేచ్ఛ సౌధాలలో విహరిస్తూ, ఒకరి మనసు ఇంకొకరు చదువుకుంటూ అర్థము చేసుకోవచ్చు.
ఏవండీ ఈ ప్రదేశం, చుట్టూ కొండలు, ఇవి చాలవా అన్నట్లు మన ఇద్దరి సంబాషణను వినడానికి తొంగి చూస్తున్న జాబిలి. చాల అద్భుతంగా ఉందండి ఈ వాతావారణం ఇంకా పరిసరాలు. ముందు నీ గురించి చెప్పు అన్నట్లు తన ముఖ కదలికలతో సైగ చేస్తున్నట్లు అతను ఆమె వైపు ఆదుర్ధాగా చూసాడు.
ఆమె తన ముఖం పై జారిపడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ గులాబీ రంగు ఆమె బుగ్గలపై నాట్యమాడుతుండగా, సిగ్గుతో చెప్పడం ప్రారంభించేలోపుగా,
వారి చూపు దూరంగా పడి ఉన్న రెండు జంతువుల మృతదేహాలపై పడింది, అతను వాటి వైపు అడుగులు వేస్తూ ఉండగా ఆమె అతని చేయి పట్టుకుని వద్దు అన్నట్లు, కంగారు, భయం కలగలసిన హావభావముతో అతనిని వారించింది. దానికతను మరేం పర్లేదు అని తన కళ్ళతో నొక్కి చెప్పాడు. ఏ క్రూర మృగమో వేటాడి చంపి ఉంటుందని ఇద్దరు అనుకుంటూ వాటిని సమీపించారు.
అటుతిరిగి ఉన్న వాటిని అతను తన చేయితో తమ వైపుకు తిప్పి చూడగానే ఇద్దరి మొహాలలో రక్తం ఇంకిపోయింది. తాము చూస్తున్నది కలా, నిజామా అని ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు.
అవి జంతువుల మృతదేహాలు కాదు ఇద్దరు మనుషులవి. పొద్దున్న తమ పెళ్ళిలో చలాకీగా తిరిగిన వారిద్దరూ ఇప్పుడు నిర్జీవంగా పడి ఉన్నారు. పెళ్ళి కూతురు దూరపు బంధువులు ఇద్దరూ. అమ్మాయి వయసు 23 అబ్బాయికి 17 ఉంటుంది. వరుసకు వదిన, మరిది అవుతారు ఒకరికొకరు. ఈ లోపు పోలీసులకు విషయం తెలుపగా వాళ్లు రావడం. దర్యాప్తు చేయడం. పోస్టుమార్టం, ఇద్దరూ చివరిగా మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ సేకరించడం, మృతుల తల్లితండ్రులకు జరిగిందంతా వివరించడం, ఒకదాని వెంట ఒకటి చక చకా జరిగిపోయాయి. ఎండిన పందిరిలో అందరూ వాడిన ముఖాలతో సమావేశముయ్యరు.
బాధితుల తల్లితండ్రులు గుండెలు అవిసేలా, ఆకాశం విరిగిపడేలా, దిక్కులు పిక్కటిల్లేలా కన్నీరు మునిరువుతున్నారు. అమ్మాయి తండ్రి ఈ విదంగా తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు.
సెల్ ఫోన్, సిమ్ కార్డు కంపెనీలు ఇంటర్నెట్ బ్రాండ్లు, సంబంధ డీలర్లు, డిస్టీబ్యూటర్లు, మార్కెటింగ్ సిబ్బంది, సెల్లర్లు , మొదలైన కార్పోరేట్ వ్యవస్థలు, అందరూ తమ పోటీ ప్రపంచములో తమ ప్రోడక్ట్ ను అమ్ముకోవడానికి, ప్రత్యర్థుల ఎత్తుగడాలను చిత్తు చేసి లాభాలు గణించడానికి, వినియోగదారులు తమ వస్తువులకు / స్మిము లకు / బానిసలు అయ్యేవిద్ధంగా ఆఫర్లు పెడుతున్నారు, ఏ విధంగా అంటే
1+1 ఆఫర్
సెల్ ఫోన్ కొనండి సీమ్ కార్డు ఉచితంగా పొందండి
20 % పొదుపు చేయండి అంటూ
ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ సౌకర్యం కలదు,
ఆన్ లైన్ పేమెంట్ ఉంది, కాష్ బ్యాక్ పొందండి 1000/-
అంటూ ప్రజల బలహీనతను తమ వ్యాపార లాభాలుగా మలుచుకుంటున్నారు, ఒక సారి వాళ్లు అనుకున్న టార్గెట్ కి, సేల్స్ రీచ్ అయ్యి, ప్రజలు తమ ప్రొడక్ట్స్కి అడిక్ట్ అయ్యిన తరువాత ఆఫర్లను పూర్తిగా విరమించుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలను, టీనేజర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి రకరకాల గేమ్స్ లను, అప్లికేషన్స్ కనిపెట్టి, మీ చావు మీరు చావండి అంటూ మార్కెట్లోకి వదులుతున్నారు.
వీరి దెబ్బకు పద్మవ్యూహములో ప్రాణాలు విడిచిన అభిమన్యులే అవుతున్నారు అందరూ. ఈ మధ్య బ్లూ వేల్ అనే గేమ్ ద్వారా తమను తాము గాయపరుచుకోవడం ప్రాణాలు తీసుకోవడం జరిగినందున, మన సుప్రీం న్యాయస్థానం వీటిని ఇండియా లో నే బహిష్కరించింది అదేవిదంగా పేస్ బుక్ వంటి సోషల్ అప్లికేషన్స్, ఇతర వెబ్సైట్ ల మూలంగా ఎందరో మోసపోతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువ సేపు చూడటం వలన అందరూ అరవై, డబ్బై ఏళ్లకు వచ్చే కంటి సమస్యలను ముందే కొనితెచ్చుకుంటున్నరు.
ఇలా జరగడానికి ముఖ్య కారణాలలో ఒకటి కార్పోరేట్ వ్యవస్థలు, కనీస విలువలు పాటించకుండా, డబ్బును మాత్రమే దృష్టిలో ఉంచుకొని, ప్రజల జీవితాలతో ఆడుకోవడమే.
ఇంతలో పోలీస్ వాహనం, అంబులెన్స్ తో సహా వచ్చి ఆగింది. రెండు బాడీలను, వారికి సంబంధించిన వస్తువులను ముఖ్యముగా ఇద్దరి సెల్ ఫోన్లు అప్పచెప్పి వారు వెళ్లిపోయారు. పోలీసులు ఇద్దరి చావుకు కారణాన్ని ఈ విధంగా వివరించారు, మీ అమ్మాయికి మూడు నెలల క్రిందట సోషల్ నెట్వర్క్ లో ఒక మోసగాడితో పరిచయం అయ్యింది. అతనికి డబ్బులు పంపించడం, ఇద్దరు ఒకరికొకరు నగ్న దృశ్యాలను, వీడియోలను పంపించుకోవడం జరుగుతుండేది.
ఈ విషయం చనిపోయిన అబ్బాయికి కూడా తెలుసు, ఎప్పుడు సెల్ ఫోన్లో గేమ్ లు ఆడుకుంటూ, యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ ఉండే ఆ కుర్రడు కూడా అంతగా మానసికంగా ఎదగకపోవడం వలన ఇదంతా మోసం అని కనిపెట్టలేకపోయాడు, ఆమె అయితే ఇంక సరేసరి.
మోసగాడి ప్రేమ వలయములో చిక్కుకొని అతన్ని కలవడానికే ఆ లొకేషన్ కి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళింది. కానీ ఆ మోసగాడు రావడానికి ముందే ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగే క్రమములో కొండ ప్రక్కనే ఉన్న లోయలో ప్రమాదవశాత్తు, జారి పడిపోయారు. ఆ మోసగాడిని మేం తప్పక ట్రేస్ చేస్తాం అని చెప్పి వెళ్లిపోయారు.
అందరు జరిగిన దారుణానికి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుండగా పెళ్ళికొడుకు స్నేహితురాలు, లేచి బాధితుల తల్లితండ్రులను ఒదారుస్తూ, భాధ పడకండి ఆంటీ, తినేవాడి పేరు ప్రతి గింజ ఫై వ్రాసి ఉన్నట్టే బ్రతికే వారి జీవిత కాలంలొ ఉదయించి గడిచే ప్రతిక్షణం వ్రాసి ఉంటుంది.
వాళ్ళకు అంతవరకే రాసిపెట్టి ఉంది, అంతే. అంకుల్ మీరున్నట్టుగా ఈ రకమైన చావులకి, నష్టాలకు కేవలము కార్పోరేట్ వ్యవస్థలే కాదు, మీడియా ఇంకా ప్రెస్ కూడా ఒక కారణం.
డబులిచ్చి ఏది ప్రసారం చేయమన్నా, ప్రింట్ చేయమన్నా వాటిలో ఉండే వాస్తవాలను లెక్కగట్టకుండా, వాటివల్ల వచ్చే పర్యవసానాలను చూపించకుండా కేవలం ప్రకటనలు మాత్రమే ఇస్తారు.
పిల్లలకైనా, పెద్దలకైనా సమాచారం అందడానికీ మీడియా ఇంకా ప్రెస్ లే చాలా వరకు దోహదపడతాయి, అందరూ వీటినే అనుసరిస్తారు. మీడియా పని తీరు మారాలి, ప్రెస్ లు విలువలకు లోబడే పని చేయాలి, తాము ఇచ్చే ప్రకటనల ప్రొడక్ట్స్ వాడితే లేదా కనుగోలు చేస్తే కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి ప్రజలకు తగిన రీతిలో, సూచనలు ఇస్తూ చూపించాలి, అప్పుడే వినియోగదారులు మేల్కొనే అవకాశం ఉంటుంది
రాత్రి నుండి తిండి లేకపోవడముతో, అందరి మొహాలు పీక్కుపోయి, ఎడారిలో ఎండమావుల్ల ఉన్నాయి, మీరు చెబుతున్నది అంతా నిజమే అన్నట్లు రెండు శవాలు సాక్ష్యలా పడి ఉన్నాయి. తరువాత జరగాల్సి కార్యక్రమానికి సంబదించిన పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి, ఈ సమయములో ఇలా మాట్లడొచ్చో లేదో నాకు తెలియదు అంటీ అంటూ పెళ్ళి కొడుకు లేచాడు, అంకుల్ అమ్మాయిలు అబ్బాయిలు సెల్ ఫోన్లు సోషల్ నెట్వర్క్స్ ల మోజులో పడి, తమంతటతాముగా ప్రమాదాలు కొనితెచ్చుకోవడానికి, మృత్యువు కోరల్లో చిక్కుకోవడానికి తల్లితండ్రులు, కుటుంబసభ్యలు, స్నేహితులు చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక కారణం పిల్లలకు యువతీయువకులకు అనేక సందర్భాలలో అంటే పుట్టిన రోజులకు, వారు ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు వారికీ స్మార్ట్ ఫోన్లను గిఫ్టులుగా ఇచ్చే సంసృతికి, అందులో సీమ్ కార్డుకు. డేటా, ఎస్. ఎం. స్. బాలన్స్ లకు అడిగినంత డబ్బులు ఇచ్చే సంప్రదాయానికి ముందుగా తీతువు రాగం పాడాలి.
స్మార్ట్ ఫోన్ కొనిచ్చే ముందు, దాని అవసరాలకు అయ్యే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి, వీటిని సరైన మార్గములో వినియోగించే మానసిక సామర్థ్యం తమ పిల్లలకు ఉందొ లేదో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. లేకపోతె వారు పోర్న్ /సెక్స్ వీడియోలు, ఎక్కువ స్నేహితులతో పిచ్చిపాటి మాట్లాడుతూఉండటం, అనవసరపు చాటింగ్ లు తో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు.
ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే ఎవరైతే ఆన్ లైన్ లో ఎక్కువసేపు గడుపుతారో, సోషల్ నెట్వర్క్ లో యాక్టీవ్ గా ఉంటారో, వీడియో గేమ్స్ లు ఆడుతూ, సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తూ ఉంటారో
వారి పెరిగిన వాతావరణం ఈ విధంగా ఉంది.
1. తల్లి తండ్రులు అతి గారాబం చేయడం మంచి చెడూ విడమర్చి చెప్పకపోవడం.
2. చదువుకోని తల్లీ తండ్రులు అమాయకత్వం, నిర్లక్ష్యంతో చదువుకున్న తల్లి తండ్రులు ఉద్యోగం, సంపాదనలో బిజీగా ఉండటంతో పిల్లల్ని సరైన విదంగా పెంచక పోవటం.
3. పిల్లలకు ఒంటరితనాన్ని, అభధ్రతా భావాన్ని కలుగజేయడం.
4. స్నేహితులు చుట్టూ ఉన్నవారు ఈ విధంగా ప్రేరేపించడం, పోస్ట్ చేసే ఫొటోస్ కు, విషయాలకు ఎక్కువగా లైకులు, కామెంట్ లు వస్తే అదేదో పెద్ద విజయం సాదించినట్టుగా పరిగణించడం.
6. కుటుంబం నుండి సక్రమైన ప్రేమాభిమానాలూ, ఆదరాభిమానాలు లోపించడం.
తల్లి తండ్రులు కొన్నిజాగ్రత్తలతో పిల్లల్ని పెంచడం, కుటుంబ సభ్యలు ప్రేమగా పలకరించడం, స్నేహితులు చుట్టూ ఉన్నవారు మంచి సలహాలు ఇవ్వడం ద్వారా యువతి -యువకులు ఈ సెల్ ఫోన్, సోషల్ నెట్వర్క్, సైబర్ నేరాలు వంటి వాటి భారిన పాడకుండా కాపాడుకోవచ్చు.
సరిగ్గా చెప్పావబ్బాయ్ అంటూ చనిపోయిన అమ్మాయి తండ్రి పెళ్ళి కొడుకుకు భుజం తట్టాడు. శవాలను తీసుకెళ్లి పోయారు. చేయవలసిన కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా జరిపించారు. చనిపోయిన ఇద్దరు అందరి కళ్ళలో నుండి అశువులై రాలరు.
వదూ వరులు ఇద్దరు మంచం పై కూర్చున్నారు. నిన్న ఆగిపోయిన శోభనం ఈ రోజు జరుగుతుండటం వలన వారికీ మనసులో మళ్ళి క్రొత్తదనం వికసించింది. పేరుకే అది శోభనంగది కానీ ఆ రెండు పడుచు మనుసులో విషాదఛాయలు అలుముకున్నాయి, పందిరి మంచం అలంకరించిన గది గోడలు, ధరించిన తెల్లని దుస్తులు, మమ్మల్ని ఎపుడు స్వీకరిస్తారు అని చూస్తున్న పళ్లు, స్వీట్స్ ఇవేమి కూడా వారి ఆలోచనలను, గత రాత్రి జరిగిన సంఘటన తాలుకు స్మ్రుతులను చెరపలేక పోతున్నాయి.
పెళ్ళికూతురు మొఖంలో సిగ్గుకు బదులు తెలియని ఆవేదన తాండవిస్తుండగా, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, అయినా మన విద్యావ్యవస్థలో కూడా మార్పు చోటు చేసుకోవాలండీ. ఎపుడో రాసి పడేసిన సిలబస్, అవే పాఠాలు, మానవుని విఙ్ఞానం ప్రపంచ వేగాన్ని పరుగులు పెటిస్తున్నా మన స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటరులు. ట్యూషన్లు చెప్పే పాఠాలు నత్తనడకన సాగుతుండటం నిజంగా నిజంగా సిగ్గుపడాల్సిన పరిణామం. విధ్యార్థులకు జీవితములో ఎదగడానికి. మోసాల బారిన పడకుండా జీవించటానికి, విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందించాలి. సెల్ ఫోన్లు, పేస్ బుక్, యు ట్యూబ్ వంటి వాటిపై సమగ్ర అధ్యయనాలను పొందుపరిచి, వాటిని మంచి దారిలో ఎలా ఉపయోగించాలి, వాటికీ బానిసలుగా మారకుండా ఏ విదంగా నడుచుకోవాలి, లాభాలు -నష్టాలను తెలియజేస్తూ, విద్యార్థులకు కావలిసిన మనో ధైర్యాన్ని అందించాలి.
నువ్వు చెప్పింది నిజమే వాటితో పాటు ప్రభుత్వం కూడా భాద్యతాయుతంగా నడుచుకోవాలి.
ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే ఉత్పతులను తయారు చేసే సంస్థల స్థాపనకు నిరాకరించాలి. బయటి దేశాలనుండి దిగుమతి చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనే కాక భవిష్యత్ సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి.
ఒక సెల్ ఫోన్ కానీ, అప్లికేషన్ గాని, సాఫ్ట్ వెర్ గాని మార్కెట్ లో కి అనుమతించే ముందు వాటిని కోనుగోలు చేసి, వాడటం వలన ప్రజలకు కలిగే లాభ, నష్టాలను గురించి, వాటికీ అడిక్ట్ అయితే కలిగే దుష్ప్రయోజనాల గురుంచి సమగ్రంగా చర్చించుకొని, ప్రజలకు అర్ధమయ్యే రీతిలో, సరియైన ప్రదర్శనలు, విలువైన ప్రసంగాలతో వారిని చైత్యనవంతం చేసి, మోసాలకు గురి కాకుండా, ఆరోగ్యం చెడిపోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మన భారత ప్రభుత్వం ఫై ఉంది.
ప్రజలంటే ఓట్లు వేసే యంత్రాలు, టాక్స్ లు కట్టి ప్రభుత్వ ఖజానాను నింపే గుప్త నిధులు అని భావించే ఈ రాజకీయనాయకులకు, మన లాంటి సామాన్యులు ఎంత మొత్తుకున్నా, దున్నపోతు మీద వాన కురిసినట్టే.
అవునంటూ పెళ్ళికూతురు పక పక నవ్వింది, తెల్లవారింది సూర్యుడు, చీకటి తెరలను ప్రక్కకు జరుపుతూ, తన. కర్తవ్య నిర్వహణకు నడుంబిగించి బయల్దేరాడు.
పెళ్లికూతురు లేచింది, అతను ఇంకా అలాగే గాఢ నిద్రలో ఉన్నాడు. బయటకు వచ్చి వంట గదిలో కాఫి పెడుతుండగా బయటనుండి తెలియని రెండు గొంతులు స్పష్టంగా వినపడుతున్నాయి. ఆమె వంటింటి కిటికీ నుండి చూడటానికి ప్రయత్నించింది, కానీ ఎవరు కనపడలేదు. వారి సంబాషణ కొనసాగుతూనేవుంది.
1వ వ్యక్తి : ఈ హైటెక్ మోసాలు, ప్రమాదాలు, నర బలులు జరగటానికి బలహీనమైన యువతీ యువకుల మానసికశక్తులే ప్రధాన కారణాలు.
2వ వ్యక్తి :
అవును ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
యవ్వన దశలో ఎవ్వరికైనా తాము అందంగా కనపడాలని, అందరూ తమగురించే చర్చించుకోవాలనే తాపత్రయం, ఆరాటం ఉంటాయి. ఇది సహజం కానీ ఈ విధమైన ఆరాటం ఎక్కువ అయితేనే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
ఈ ఆరాటానికిి పుట్టిన బిడ్డలే ఈ సెల్ఫీ లు, whatsup status లు, Facebook lo పోస్ట్లు పెట్టడం.
1వ వ్యక్తి : నువ్వు చెప్పేది కరెక్టే రా, కానీ
నేను ఈ క్షణం ఎంచేస్తున్నానో అందరికీ తెలియాలి, అందరూ నన్ను గుర్తించాలి, అన్న ఆలోచనలు ఐడెంటిటీ క్రైసిస్ అనే మానసిక జబ్బు నుండి వస్తాయి.
దీనికి సరి అయిన మానసిక వైద్యున్ని సంప్రదించి, చికిత్స పొందాలి.
తాము వేసుకున్న దుస్తులు, తిరిగిన ప్రదేశాలు, అనుభవించిన జీవితం తమ వాళ్ళందరికీ చెప్పి గొప్పగా ఫీలవడం ప్రస్తుత సమాజంలో అసుభకరమైన పరిణామం.
2 వ వ్యక్తి :
అలాగే అందరూ ఆత్మ పరిశోధన చేసుకోవాలి, యువతీ యువకులు, పిల్లలు, టీనేజర్లు ప్రతీ ఒక్కరూ selfie లు దిగే ముందు, status లు update చేసే ముందు, కామెంట్స్, పోస్ట్లు పెట్టేముందు, పోర్న్ చూసేటప్పుడు ప్రధానంగా మూడు ప్రశ్నలు వేసుకోవాలి.
అవి
ఎందుకు చేస్తున్నాను?
ఎవరికోసం/ దేనికోసం ప్రాకులాడుతున్నను?
వీటి మూలంగా సాధించేదేమటీ?
ఇంతలో కొత్త పెళ్ళికొడుకు లేచి, కాఫీ అని బిగ్గరగా అరిచాడు. ఆ పిలుపుతో తేరుకున్న పెళ్లి కూతురు వారి మాటలు నిజమేనని తనలో తాను అనుకుంటూ తలూపింది.
ఇంతలో కాఫీ పొంగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *