March 29, 2024

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

తెలుగు భాషలో పాటలు పద్యాల్లాగే సామెతలు, జాతీయాలు, నుడికారాలు కూడా జనుల అనుభవాల్లోనుండి పుట్టినవే. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. వాక్యం చిరస్థాయి కావడానికి వాక్యంలోని అనుభవ సారాంశం, లయాత్మకత అతి ముఖ్యమైనవి. పదాలలోని తూగు లయాత్మకతను అందిస్తే, వాక్య భాగం విరిగే చోట యతి, అంత్య ప్రాసలు వాక్యాన్ని శబ్దరమ్యంగా తీరుస్తాయి.
కొన్ని సామెతలు చూద్దాం.
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి
చెరపకురా చెడేవు
ఇల్లలుకగానే పండుగవుతుందా
అమ్మ అల్లం పెళ్లాం బెల్లం
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు
అపాయం తప్పించుకోవడానికి ఉపాయంగావాలె
దీపముండంగనె ఇల్లు చక్కబెట్టుకోవాలె
చెడి చెల్లెలింటికి అలిగి అత్తవారింటికి పోవద్దు
ఇట్లా చెప్పుకుంటు పోతే బోలెడన్ని సామెతలు గుర్తుకు వస్తయి. వేముల పెరుమాళ్లనేటాయన ఇట్ల మన తెలుగులో ఉన్న సామెతలన్ని సంపాదించి పుస్తకం వేసిండు. పల్లెటూళ్లలో ప్రజలు మాట్లాడుకునేటప్పుడు వాళ్ల మాటలల్లో అతి సహజంగా సందర్భాన్ని బట్టి సామెతలు దొర్లుతాయి
ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే ‘ఏం మనిషో -వానికి దోచదు, మనం జెప్తే వినడు, లేకుంటే తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్లంటడు అని ముచ్చట్లు జెప్తరు.
సామెతలతో కూడిన సంభాషణ ఎంతో అందంగా ఉంటుంది. అలాగే జాతీయాలు, నుడికారాలు కూడా
భాషకు అందాన్నిస్తాయి.
ఎవరైనా సోమరిగా ఉంటే మన్నుదిన్న పాము అంటాం. ఇరవైనాలుగ్గంటలు పుస్తకాలు చదివే వాళ్లను పుస్తకాల పురుగంటరు. తెలివైన వాళ్లను వాడిది పాదరసం బుర్ర అంటంఇక ఏదైనా పనిమీద అదే పనిగా తిరిగే వాళ్లను కాలికి బలపం గట్టుకోని తిరుగుతున్నడంటరు, లేక పోతే తిరిగి తిరిగి చెప్పులరిగిపోయినయ్ అంటం. అందంగా ఉంటే చిదిమి దీపం పెట్టుకోవచ్చు . కులాసాగా ఉంటే కాలుమీద కాలేసుకుని అనీ, దుఃఖంలో ఉంటే కడివెడు దుఃఖం అనీ, హుషారుగా ఉంటే రంగేళీ రాజీ అనీ వ్యవహరించటం మామూలే. అలాగే సామెతలకొస్తే ఏం పని చెయ్యని వాణ్ని ఇలాకూడా అంటారు తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు. సామెతలను పరిశీలించి చూసినట్లయితే ఎంతో అనుభవంతో కూడిన అర్థం కనిపించడమే కాకుండా కవిత్వ లక్షణమైన వ్యంగ్యం కనిపిస్తుంది.
కూట్లో రాయి దీయనోడు ఏట్లో రాయిదీస్తడా అని వాపోతరు ఎవరైనా ప్రగల్భాలు పలికితే. సాధారణంగా తెలంగాణాలో సామెతను సామెతగా గాకుండా అదేదో శాస్త్రంజెప్పినట్టు అని అంటారు.
అవ్వాగావాలి బువ్వాగావాలంటే ఎట్లా అంటాం కొన్నిసందర్భాల్లో. అవ్వా బువ్వా అనే పదాలు వినసొంపుగా ఉంటాయి. వీటిని అనుప్రాస పదాలంటారు. అనుప్రాస భాషకు ఎంతో అందాన్ని చేకూరస్తుంది. పోతన పద్యాల్లో అనుప్రాస కలిగిన పద్యాలనేకం. ఈ సందర్భంలోనే భాషలోని తిట్లు, దీవెనల పదాలు కూడా తెలుసుకోవాలి. కోపం, బాధ, వ్యక్తం చేయడానికి నేరుగా తిట్టకుండ ఇంట్ల మన్నువడ, ఇంట్ల గత్తర రాను, కంట్ల మన్నువడ, చ్తులకు జెట్టలు వుట్ట వంటివి తిట్లైతే, నీ కడుపు సల్లగుండ నీ ఇల్లు సల్లగుండ, నీ కడుపలొ కాయలు గాయ, సల్లంగ బతుకు ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి జీవద్భాషయైన తెలుగు సొగసు చెప్పాలంటే చాలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *