April 18, 2024

నరుడు నరుడౌట…

రచన -దాసరాజు రామారావు.

కలలు దాటి కన్నీళ్లు దాటి

వలలు దాటి వాగువంకలు దాటి

గడప దాటి కడుపు దాటి

భ్రమలు దాటి పరిభ్రమలు దాటి

ఆశలు దాటి ఆశ్రయాలు దాటి

పొక్కిళ్లు దాటి వెక్కిళ్లు దాటి

చికిత్సలు దాటి విచికిత్సలు దాటి

హింసలు దాటి అహింసలు  దాటి

ప్రయాణాలు దాటి ప్రయాసలు దాటి

వాయిదాలు దాటి ఫాయిదాలు దాటి

అడ్డాలు దాటి గడ్డాలు దాటి

హత్యలు దాటి ఆత్మహత్యలు దాటి

ఆవృతాలు దాటి అనృతాలు  దాటి

ముసుర్లు దాటి ఉసుర్లు దాటి

రంగులు దాటి రంగాలు దాటి

వ్యధలు దాటి వృధాలు దాటి

క్రోధాలు  దాటి విరోధాలు  దాటి

పాపాలు దాటి ప్రతాపాలు దాటి

ప్రగల్బాలు దాటి మెహర్బాలు దాటి

ఉచ్చాలు దాటి నీచాలు దాటి

శూన్యాల్ని దాటి ప్రళయాల్ని దాటి

గుసగుసలు దాటి రవరవలు దాటి

వెన్నుపోట్లు దాటి భంగపాట్లు దాటి

వ్రతాలు దాటి మతాలు దాటి

కులాలు దాటి వ్యాకులాలు దాటి

సహనాలు దాటి దహనాలు దాటి

నిస్సహాయాలు దాటి అసహాయాలు దాటి

మలుపులు దాటి తలపులు దాటి

ఓటములు దాటి కూటములు దాటి

జీవాత్మలు దాటి పరమాత్మలు దాటి

నిశీదులు దాటి నిషాలు దాటి

తంతెలు దాటి తంతులు దాటి

వేడుకోళ్ళు దాటి వీడుకోళ్ళు దాటి

కరువులు దాటి క్రతువులు దాటి

వదంతులు దాటి గల్లంతులు దాటి

తప్పులు దాటి మెప్పులు దాటి

కారణాలు దాటి ఆవరణాలు దాటి

లోయలు దాటి కొండలు దాటి

విలోమాలు దాటి అనులోమాలు  దాటి

తారీఖులు దాటి దస్తావేజులు దాటి

తీసివేతలు దాటి నాసి రాతలు దాటి

ఛాందసాలు దాటి ఛందస్సులు దాటి

రామాయణాలు దాటి విష, కల్ప వృక్షాలు దాటి

అంగారాలు దాటి శృంగారాలు దాటి

అనుప్రాసలు దాటి విరోధాభాసలు దాటి

తుమ్మశెల్కలు దాటి పల్గిన పల్కలు దాటి

పథకాలు దాటి పతకాలు దాటి

శాసనాలు దాటి ఆసనాలు దాటి

పాలకులను దాటి పాలితులను దాటి

సెల్ హెల్ లు దాటి సెల్ఫ్ హెల్ప్ లు దాటి

లక్ష్మణ రేఖలు దాటి లక్ష్మణ స్వాముల దాటి

ఎదురు చూపులు దాటి నుదురు గీతలు దాటి

శుష్క ప్రియాలు దాటి శూన్య హస్తాలు దాటి

అభయముద్రలు దాటి నిర్భయ రౌద్ర లు  దాటి

సోహం దాటి అనేకం దాటి

ఉద్వేగాలు దాటి ఉద్యోగాలు దాటి

జననాలు దాటి మరణాలు దాటి

నేతి బీరలు దాటి నీతి బోధలు దాటి

శ్వేతపత్రాలు దాటి స్విస్ ఖాతాలు  దాటి

బందిఖానాలు దాటి దవాఖానాలు దాటి

వసంతాలు దాటి వనవాసాలు దాటి

ముసుగుతత్వాలుదాటి మూర్తిమత్వాలు దాటి

నిన్నటి రాత్రిళ్ళు దాటి రేపటి తూర్పిళ్ళు దాటి

పెనుభావాలు దాటి అనుభవాలు దాటి

షార్ట్ రూట్లు దాటి లాంగ్ షాట్లు దాటి

హిమ వెన్నెల దాటి సుమ ఉయ్యల దాటి

మెటీరియల్ దాటి మెటఫర్లు దాటి

భుజకీర్తుల దాటి భజనమూర్తుల దాటి

మూతి విరుపులు దాటి నూతి మూలుగులు దాటి

ఎగిరిన అలలు దాటి విరిగిన రెక్కలు దాటి

ప్రాచీనత దాటి నవీనత దాటి

వలసలు దాటి కులాసాలు దాటి

నీటి బుడగలు దాటి పాము పడగలు దాటి

ఏడడుగులు దాటి ఏడడుగుల దూరాలు దాటి

ఐక్యాలు  దాటి ఆధిక్యాలు దాటి

మూలాలు దాటి కాలాలు దాటి

శబ్ద స్పర్శలు దాటి నిశ్శబ్ద స్పృహలు దాటి

బాల్య చాపల్యాలు దాటి చిత్త విత్త లౌల్యాలు దాటి

సమ్మోహనాలు దాటి సంఘర్షణలు దాటి

గడీలు దాటి దోపిడీలు దాటి

వాల్ మార్ట్ లు దాటి వాల్ ఆర్ట్ లు దాటి

సెనెక్స్  దాటి సిక్త్ సెన్స్  దాటి

అర్జీలు దాటి ఫోర్జరీలు దాటి

పార్టీలు దాటి ఫిరాయింపులు దాట

చిరునామాలు దాటి వీలునామాలు దాటి

సన్మానాలు దాటి స్మశానాలు దాటి

విగ్రహాలు దాటి విధ్వంసాలు దాటి

ధర్మాసనాలు దాటి ధర్మాగ్రహాలు దాటి

పసి ప్రాయాలను దాటి కసి గాయాలను దాటి

భువనాలను దాటి గగనాలను దాటి

నిబిడాశ్చర్యాలను దాటి కఠిన ప్రశ్నార్థకాలను  దాటి

గుడులు దాటి గుడిసెలు దాటి

పాల పుంతలు దాటి నేల వింతలు దాటి

కళాసౌరభాలు దాటి సంసార సంక్షేమాలు దాటి

అడుగుజాడలు దాటి గాలి మేడలు దాటి

కామాలు,ఫుల్ స్టాఫ్ లు దాటి ఉద్గ్రంధాల పేజీలు దాటి

కారు మెయిళ్లు దాటి పచ్చిక బయళ్లు దాటి

విత్తులు పగిలిన చప్పుళ్ళు దాటి

పూలు పూసిన సమయాలు దాటి

అర్ధాంత నిష్క్రమణలు దాటి అంతరంగ ఆవిష్కరణలు దాటి

వొదిలిన జ్ఞాపకాలను దాటి వొదలని ముదిమి వ్యాపకాలను దాటి

రాజ్యాంగాలు దాటి రాజ్యభోగాలు  దాటి

వేల నిన్ను లు దాటి చాల నన్ను లు దాటి

మనిషిని చూడాలె

అవును,

నిజమైన మనిషిని దర్శించాలె.

1 thought on “నరుడు నరుడౌట…

Leave a Reply to Surya Rayarao Cancel reply

Your email address will not be published. Required fields are marked *